హైద్రాబాద్ మత కల్లోలానికి హిందువులే కారణం


Charminar communal riotsమూడువారాల క్రితం హైద్రాబాద్ లో చెలరేగిన మత ఘర్షణలకు హిందువులే కారణమని పోలీసుల పరిశోధనలో తేలింది. ఇద్దరు స్ధానిక నాయకుల ప్రోత్సాహంతో హిందూ యువకులు మత కల్లోలం రెచ్చగొట్టడానికి పూనుకున్నారని పోలీసులు శనివారం తెలిపారు. మాదన్నపేట దేవాలయంలో ఆవు కాళ్ళు పడేసి, పచ్చ రంగు జల్లితే అది ముస్లింలు చేసిన పనేనని హిందువులు భావించి ముస్లింలపై దాడులకు పూనుకుంటారని పధకం వేశారని పోలీసులు తెలిపారు. ఆవు కాళ్ళను గుడిలో ఉంచి పచ్చరంగు జల్లిన హిందూ యువకులను పోలీసులు అరెస్టు చేశారు.

వైన్ వ్యాపారి నిరంజన్, వడ్డీ వ్యాపారి శ్రీనివాస్ లు హైద్రాబాద్ మత ఘర్షణలకు పధకం వేశారు. వీరికోసం పోలీసులు వెతుకుతున్నారు. పధకాన్ని అమలు చేసిన యువకుడు నాగరాజ్, కిరణ్ కుమార్, రమేష్, దయానంద్ సింగ్ లను పోలీసులు అరెస్టు చేశారు. నాగరాజ్ గ్రేటర్ హైద్రాబాద్ మునిసిపల్ కార్పొరేషన్ లో కాంట్రాక్ట్ సూపర్ వైజర్ గా పని చేస్తున్నాడు. కిరణ్ కుమార్ ఫ్లోరిస్టు (బడలు పరిచే పని) కాగా, రమేష్ హోటల్ కార్మికుడు. దయానంద్ సింగ్ కారు డ్రైవర్ గా పని చేస్తున్నాడు. వీరంతా మాదన్నపేట లోని కుర్మగూడకు చెందినవారే.

వీరెవరికీ గతంలో నేరాలకు పాల్పడిన చరిత్ర లేదు. అమాయక యువకులను రెచ్చగొట్టి మత కల్లోలాలకు పురమాయించారు. వీరు తమ ఏరియాలో మతపరమైన కార్యక్రమాలు నిర్వహిస్తుంటారు. వీరిలో కుట్రకు బీజాలు వేసింది నాయకులే. మత కల్లోలం రెచ్చగొట్టి తర్వాత పరిస్ధితిని తమకు అనుకూలంగా మలుచుకుని హిందూ మతానికి ప్రమాదం ఏర్పడిందంటూ దుష్ప్రచారం చేసి లేని సమస్యకు వ్యతిరేకంగా హిందువులను ఐక్యం చేయడం వీరి లక్ష్యమని పోలీసులు తెలిపారు.

పోలీసుల ప్రకారం పరారీలో ఉన్నవారు ఏ మత సంస్ధకూ చెందినవారు కాదు. గణేష్ చతుర్ధి, నవరాత్రి లాంటి పండగలకు స్ధానిక యువకులను వీరు ఆర్గనైజ్ చేస్తుంటారు. అవతలి మతంవారి నుండి ప్రమాదం ఉందని చూపినట్లయితే హిందువులను ఐక్యం చేయవఛ్చని వారు భావించారు. ఐక్యం చేసి ఏం సాధించాలనుకున్నారన్నదీ పోలీసులు చెప్పలేదు. ఏ రాజకీయ పార్టీతోనూ, మత సంస్ధతోనూ సంబంధం లేని యువకులకు మత కల్లోలాలను రెచ్చగొట్టే ఆలోచన రావడం అసంబద్ధంగా ఉంది.

ఏప్రిల్ మొదటివారంలో వచ్చిన పండగలు శ్రీ రామ నవమి, హనుమాన్ జయంతి ల రోజుల్లో ఘర్షణలు జరగవచ్చని వీరు భావించారని పోలీసులు తెలిపారు. “పండగలు శాంతియుతంగా ముగియడంతో మత ఘర్షణలు రెచ్చగొట్టడానికి వారు కుట్ర పన్నారు” అని పోలీసులు తెలిపారు. హిందువులను ఐక్యం చేసే పని కోసం వీరు వైన్ షాప్ లో కలుసుకుని సమాలోచనలు జరిపారు. నిరంజన్, శ్రీనివాస్ ల ఆదేశాల మేరకు ఏప్రిల్ 7 న పధకం రూపొందించుకున్నారు. సానిటేషన్ వర్కర్ అయినందున చంచల్ గూడ లో కాల్చిపారేసిన జంతువుల కాళ్ళు ఎక్కడ పడేస్తారో నాగరాజ్ కి తెలుసు. అతను రెండు ఆవు కాళ్ళు సంపాదించగా మరొకరు పెయింట్ బాటిల్ సంపాదించాడు.

ఏప్రిల్ 7 అర్ధరాత్రి దాటాక దేవాలయం గోడలపైన ఆవు కాళ్ళు ఉంచారు. ఐరన్ గ్రిల్ లో వాటిని చొప్పించారు. పచ్చరంగు పెయింట్ ని జల్లారు. తర్వాత రోజు ఉదయం గుడిలో ఆవుకాళ్లు పెట్టారన్న వార్త దావానలంలా వ్యాపించింది. స్ధానికంగా ఉన్న హిందువులు అక్కడ పెద్ద సంఖ్యలో గుమి కూడారు. వాసన పసి గట్టే కుక్కలు మెయిన్ రోడ్ పైకి వచ్చాక హిందువుల గుంపు దాన్ని అనుసరించి ముస్లింల ఆస్తులపైన రాళ్ళు రువ్వడం ప్రారంభించారు. అయితే ఆస్తి సొంతదారులు ఊరుకోలేదు. వారు తిరగబడ్డారు. మాదన్న పేట, సైదాబాద్ లలో ఘర్షణలు పెచ్చరిల్లాయి. దానితో రెండు పోలీసు స్టేషన్ల పరిధిలో పోలీసులు కర్ఫ్యూ విధించారు.

పోలీసులు తమ పరిశోధన ప్రారంభించి ఆస్తులపై రాళ్ళు రువ్విన యువకులను పట్టుకున్నారు. వారిలో రమేష్ ఉన్నాడు. నాలుగు రోజుల క్రితం అతను బెయిల్ పై బైటికి వచ్చాడు. ఒక్కో అంశాన్ని కూర్చిన పోలీసులు అనుమానం వచ్చి రమేశ్ ని మళ్ళీ అరెస్టు చేశారు. విచారణలో అతను నేరాన్ని అంగీకరించాడు. అతనిచ్చిన సమాచారంతో మరో ముగ్గురిని కూడా పోలీసులు అరెస్టు చేశారు.

కొద్ది నెలల క్రితం కర్నాటకలో కూడా హిందూ మతోన్మాద సంస్ధలు ఇలాంటి కుట్రకు పాల్పడ్డాయి. బి.జె.పి ఎం.ఎల్.ఏ పధకం వేసి శ్రీరామ్ సేన కార్యకర్తలను మత కల్లోలానికి పురి కొల్పారు. అర్ధ రాత్రి పాకిస్ధాన్ జెండా ఎగరేసి ముస్లింలు ఎగరేశారని ప్రచారం చేసారు. ముస్లింలపై దాడులకు పూనుకున్నారు. విషయం బైటికి వచ్చాక తమకు సంబంధం లేదని ఎం.ఎల్.ఏ బొంకాడు. అయితే శ్రీరామ్ సేన కార్యకర్తలు మాత్రం పధకం ఆయనదేనని తేల్చి చెప్పారు.

మత కల్లోలాలు గానీ, జాతి ఘర్షణలు గానీ ప్రజల నుండి తలెత్తడం చాలా అరుదు. రాజకీయ స్వప్రయోజనాల కోసమే మత, జాతి ఘర్షణలు తలెత్తాయని చరిత్ర రుజువు చేస్తోంది. రాముడికి గుడి కడతామని చెప్పి మత కల్లోలాలు రెచ్చగొట్టి అధికారం చేజిక్కించుకున్న చరిత్ర భారత దేశంలోనే మన కళ్ల ముందు ఉంది. వీరి ఆర్ధిక, సామాజిక విధానాలన్నీ ప్రజా వ్యతిరేకమైనవి. అందువల్ల ప్రజలను ఆకర్షించగల శక్తి వీరికి ఉండదు. దానితో అడ్డదారులు ఎన్నుకుని అధికారం కోసం మత ఘర్షణలు రెచ్చగొట్టడానికి కూడా వీరు సిద్ధపడుతున్నారు.

19 thoughts on “హైద్రాబాద్ మత కల్లోలానికి హిందువులే కారణం

 1. మీ వార్తలు regular గా చదివి మనసు స్పందించినప్పుడు comment కూడా చేస్తుంటాను,
  ఈ particular post లో
  అలా జరిగిన మత ఘర్షణలకు కారణం

  “వైన్ వ్యాపారి నిరంజన్, వడ్డీ వ్యాపారి శ్రీనివాస్ లు హైద్రాబాద్ మత ఘర్షణలకు పధకం వేశారు. వీరికోసం పోలీసులు వెతుకుతున్నారు. పధకాన్ని అమలు చేసిన యువకుడు నాగరాజ్, కిరణ్ కుమార్, రమేష్, దయానంద్ సింగ్ లను పోలీసులు అరెస్టు చేశారు.” ఈ paragraph లో వివరంగా ఉన్నది, మరి title ఎందుకు దీనికి విభేదం గా ఉన్నది?
  హిందువులు అంటే హైందవ సాంప్రదాయాన్ని అనుసరించే వారు, ఒక ప్రత్యేక వర్గం గా సమజం లో గుర్తింప బడిన వారు అని వాచాకార్థం.

  ఉదాహరణకు ఒక ప్రభుత్వ అధికారి ఏదేని విషయం లో అవినీతికి పాల్పడిన యడల అధికారం దుర్వినియోగం చేసిన సదరు వ్యక్తిగా చెప్తే సమంజసం గా ఉంటుంది,
  అంతే కాని ప్రభుత్వ అధికారే ఆవిధం గా చేసాదనటం సరి కాదు.
  designation ప్రకారం వర్తించ లేదని ఎప్పుడైతే తెలిందో అతను ఆ పేరుతో పిలవ బడటానికి అనర్హుడు.

  మనం tV లలో కూడా చూస్తున్నాం
  భర్తను చంపిన భార్య,
  తండ్రిని నరికిన కూతురు వగైరా…

  ఇటువంటివి వినటానికి అనటానికి ఆలోచించటానికి భయానకం గా ఉన్న అంశాలే !!

  అయితే ఎప్పుడైతే ఆ భర్త అనో భార్య అనో పాత్ర లో ఉన్న వ్యక్తి తన పాత్రకు కలంకం తెచ్చే విధం గా
  ప్రవర్తిన్చాక వారిని ఆపేరుతో పిలవటం
  (భార్యను చంపిన భర్త) అనటం correct కాదు.
  వారి మధ్య ఆ బంధం పూర్తిగా హీనించాకనే
  పశు ప్రవృత్తి నిండిన Mind Set
  అలాంటి తలంపు వాళ్ళ మనసులో కలుగుతుంది
  అప్పుడు తదనుగుణ పని వారు చయటం అనేది.

  కాని ఈ media లో మటుకు భర్త భార్య కొడుకు కూతురు అంటూ high light చేస్తూ ఉంటారు.
  మీరు నా comment post చేయక పోయినా పర్వాలేదు.

  కాని ఉన్నతమైన అంశాలను తెలియని సంఘటన లను అనునిత్యం అపురూపంగా అందించే తెలుగు వార్తలలో ఇలా
  ఆదర్శ విరుద్ధం గా ఉన్న titiles ని చూడటం మనసు ఉండబట్ట లేక వ్రాస్తున్న comment తప్ప మరోల భావింప వలదు.

  దీని గురించి కూడా ఏవో చట్టాల్లో ఎక్కడో మూల
  clauses ఉంటాయి. news standards తెలిసిన వాళ్లకు ఈ rules & regulations తెలుస్తవి.
  కాని వాటిని అమలు పరిచే వ్యవస్థ లోపం వల్లే
  tv లలో కూడా ఇటువంటి titles తో head lines రావటం గమనిస్తూ ఉంటాం !

  నేను మిమ్మల్నో మీ post నో మాత్రమే కేవలం గా చేసి ఈ comment రాయటం లేదు,
  నిజం గా బాధతోనే వ్రాస్తున్న ఎందుకంటే హిందువుని కనుక.

  “ఒక నిజమైన హిందువు ఎన్నటికి విధ్వంసానికి కారణం అవ్వడు.
  అలా కాక ఏదేనీ సదరు వ్యక్తి ద్వారా అలాంటి చర్య జరిగిన యడల అతడు హిందువు గా పిలవ బడుటకు అనర్హుడు.”

  మరోలా చెప్పాలంటే
  blog run చేస్తూ post లు వేస్తూ comment చేసే వాడు ఇతరుల comments కు తగు విధంగా స్పందించే వారిని bloggers అంటారు.
  అంతే కాని
  ఏదో internet కి వచ్చి mail check చేసుకునే వారిని bloggers అనరు నెటిజన్లు అంటారు.

  దయ ఉంచి post title ని మార్చ గలరని మనవి.
  హైద్రాబాద్ మత కల్లోలానికి “అమాయక యువకులను రెచ్చగొట్టి మత కల్లోలాలకు పురమాయించిన వైన్ వ్యాపారి & వడ్డీ వ్యాపారి” లు కారణం

 2. ‘ఎందుకో’ గారూ, మీరు ఈ పోస్టు శీర్షికను వ్యతిరేకిస్తున్నారు. కాని గుడ్డిగా వ్యతిరేకించడం లేదు. మీ వ్యతిరేకత లో ద్వేషం లేదు. వ్యంగ్యం కానీ, బూతులు కానీ అసలే లేవు. మీ అభ్యంతరాన్ని చక్కగా, పద్ధతిగా, గౌరవంగా, సంస్కారయుతంగా తెలియజేశారు.

  అలాంటి మీ వ్యాఖ్యను ప్రచురించకపోతే అది నా తప్పవుతుంది.

  విషయానికి వస్తాను.

  మీరిలా అంటున్నారు. “హిందువులు అంటే హైందవ సాంప్రదాయాన్ని అనుసరించే వారు, ఒక ప్రత్యేక వర్గం గా సమజం లో గుర్తింప బడిన వారు అని వాచాకార్థం.”

  అయితే, హిందూ మతం అనుసరించేవారంతా హిందువులే అనడంలో మీకు అభ్యంతరం ఉందా? హిందూ దేవుళ్లను పూజిస్తూ, హిందూ పండగలను జరుపుకుంటూ, హిందూ మత ఆచారాలను, ఆచరణను అనుసరించేవారంతా హిందువులు కారని మీరు చెప్పదలిచారా?

  ఈ పోస్టులో చెప్పినట్లు వ్యాపారులిద్దరూ కేవలం వ్యాపారులు కాదు. వారు హిందూ మత కార్యకర్తలు. హిందూ మత ఆచరణను ప్రచారం చేస్తున్నవారు. హిందూ మత పండగలయిన గణేష్ చతుర్ధి, నవరాత్రి లాంటి పండగలను చురుకుగా నిర్వహిస్తున్నవారు. ఆ పండగలప్పుడు యువకులను సమీకరించి ఆర్గనైజ్ చేస్తున్నవారు. ఈ సంగతి కూడా ఆర్టికల్ లోనే ఉంది. దాన్నెందుకు వదిలిపెట్టారు?

  అదే కాక హిందువులను ఐక్యం చేసే కర్తవ్యంలో కూడా వారు నిమగ్నమై ఉన్నారు. నిజానికి ఐక్యం చేసే కర్తవ్యానికి గొప్ప కార్యక్రమాలు చాలా ఉన్నాయి. హిందువుల మధ్య ఐక్యతకు భంగం కలిగించే అంశాలను సమాజం నుండి తీసేసే కృషికి వారు పూనుకోవచ్చు. కులం లాంటి అమానుషమైన సామాజిక లక్షణాలకు వ్యతిరేకంగా కృషి చేయవచ్చు. హిందువుల మధ్య ఆదాయాలలో ఉన్న తీవ్ర అంతరాయాలకి కారణాలు వెతికి వాటి పరిష్కారానికి పూనుకోవచ్చు. తమ లొకాలిటీలో ఉన్న హిందూ ప్రజలను వివిధ సాంస్కృతిక కార్యక్రమాల ద్వారా సమావేశపరిచి వారి మధ్య వివిధ సామాజిక విభేదాలు ఉండరాదని చెప్పవచ్చు. తాగుడు, వ్యభిచారం, జూదం లాంటి దుర్వ్యసనాలు మనుషుల మధ్య విబేధాలను సృష్టిస్తున్నాయని గుర్తించి వాటికి వ్యతిరేకంగా ప్రచారం చేయవచ్చు.

  ఇవేవీ చేయకుండా వారు ఇతర మతాలపైన చెడు ముద్ర వేయడానికే వారు పూనుకున్నారు. ఇతర మతస్ధులను హిందూ ద్వేషులుగా చిత్రీకరించి తద్వారా లబ్ది పొందుదామని ప్రయత్నించారు. ఇది హిందువుల మధ్య ఐక్యతను పెంచకపోగా మొత్తం సమాజమే చీలిపోవడానికీ, నిరంతర ఘర్షణలలో నలిగిపోవడానికి దారితీస్తుంది. అలాంటి పనిని వారు హిందువుగా చేశారు తప్ప వ్యాపారిగా చేయలేదు కదా.

  అధికార దుర్వినియోగానికి పాల్పడే వ్యక్తి అదెలా చేయగలడు? అధికారిగా కాకుండా ఆ పని చేయగలడా? పల్లెల్లో కూలి చేసుకునే వ్యక్తి అధికార దుర్వినియోగానికి పాల్పడగలడా? కుటుంబ శ్రమలో నిమగ్నమై ఉన్న స్త్రీ అధికార దుర్వినియోగానికి పాల్పడగలదా? ప్రభుత్వాధికారం ఉన్న వ్యక్తి మాత్రమే అధికార దుర్వినియోగానికి పాల్పడగలడు. అందువల్ల ఫలానా అధికారి అధికార దుర్వనియోగానికి పాల్పడ్డాడని చెబుతాము. దాదాపు అధికారులంతా తమ బాధ్యతను గుర్తించకుండా సొంతవారికి, స్నేహితులకూ, తెలిసినవారికీ ఫేఫర్ చేస్తున్న వ్యవస్ధలో ప్రభుత్వాధికారులు స్వలాభం చూసుకుంటున్నారని అనివార్యంగా చెప్పవలసి వస్తుంది. ప్రభుత్వం నిండా స్వార్ధపరులు నిండి ఉండి, తమకు సొమ్ములు ముట్టజెప్పేవారికే పనులు చేసిపెట్టడానికి సిద్ధంగా ఉంటూ ప్రజల కోసం పని చేయడానికి నిరాకరిస్తున్న పరిస్ధితిల్లో ప్రభుత్వాధికారులు భ్రష్టుపట్టిపోయారు అని చెప్పవలసి ఉంటుంది. దానర్ధం ఎక్కువమంది అలా ఉన్నారనే తప్ప నిజాయితీపరులు కూడా స్వలాభం కోసం చూస్తున్నారని చెప్పడం కాదు.

  నిజమే. భార్యాభర్తల సంబంధం వాస్తవంలో లేనందువల్లనే భర్తనో, భార్యనో చంపుతున్నారు. తండ్రినో, కూతురినో చంపుతున్నారు. కాని వారి బంధాలు సమాజంలో కొనసాగుతున్నాయన్న వాస్తవాన్ని కూడా విస్మరించలేము కదా. భార్యగా ఉండవలసిన స్త్రీ, భర్తగా ఉండవలసిన పురుషుడు తమ జీవిత భాగస్వాములను హింసించడానికి పూనుకున్నారు అన్నదే వార్త. అలా శీర్షికను ఉంచడం ద్వారా కుటుంబ సంబంధాలు క్షీణిస్తున్నాయి అన్న సందేశం పత్రికలు ఇస్తాయి. దాన్ని అలాగే స్వీకరించాలి.

  ఈ వార్త హైద్రాబాద్ లో మత చెలరేగిన మత ఘర్షణలకి సంబంధించినది. హిందువుల దేవాలయంలో ఆవు కాళ్ళు, పచ్చరంగు దర్శనం ఇచ్చాయి. హిందువులను అవమానించడానికి, వారి మత విశ్వాసాలని హీనపరచడానికీ ముస్లింలే ఈ పని చేశారని వెంటనే అంతా భావించారు. భావించడంతో ఊరుకోకుండా ముస్లింల ఆస్తులను నాశనం చేయడానికి పూనుకున్నారు. నిన్నటివరకూ మత ఘర్షణలకు ముస్లింలనే కారణంగా అంతా భావిస్తూ వచ్చారు. కాని పోలీసు విచారణలో దానికి విరుద్ధమైన వాస్తవం తేలింది. “హిందూ మత విశ్వాసాలని అవమానించడానికి పూనుకుంది ముస్లింలు కాదు, హిందువులే ఆ పని చేసారు” అని పోలీసులు చెప్పారు. ఆ విషయమే ఈ పోస్టుకి శీర్షికగా పెట్టాను. హిందూ దేవాలయాలలొ హిందూ ఆచారాలను అవమానపరిచేలా హిందువులే ప్రవర్తిస్తూ ఆ నెపాన్ని ముస్లింలపై నెట్టడానికి ప్రయత్నిస్తున్నారన్న వాస్తవం చెప్పడమే ఈ శీర్షిక ఉద్దేశ్యం.

  ఈ ధోరణి హైద్రాబాద్ లో ఈ ఒక్క సంఘటనకే పరిమితం కాదు. స్వామీ అసీమానంద ఆధ్వర్యంలో టెర్రరిస్టు చర్యలకు పాల్పడితే దానికి ముస్లింలను అరెస్టు చేసి సంవత్సరాల తరబడి జైల్లో ఉంచారు. దానివల్ల ముస్లింలను టెర్రరిస్టులుగా ముద్రవేసే అమానుష ధోరణి భారత దేశంలో ఏర్పడి ఉంది. అమెరికా, యూరప్ లలో కూడా ముస్లింల మత ఆచారాలను నిషేధిస్తూ, వారిని సమాజంలో ఉండకూడనివారుగా చిత్రించడానికి రాజకీయ పార్టీలు ప్రయత్నిస్తున్నాయి. భారత దేశంలో కూడా ఈ పని దశాబ్దాలుగా జరుగుతోంది. ఆ పనిలో హిందూ మతోన్మాద సంస్ధలు నిమగ్నమై ఉన్నాయి. వారి వల్ల అమాయక యువకులు కూడా ముస్లింలపై విద్వేషం రెచ్చగొట్టి హిందువులను ఐక్యం చేయవచ్చన్న తప్పుడు భావనలకు గురవుతున్నారు. ఈ పరిస్ధితి అంతం కావాల్సిన అవసరం లేదా?

  ఐక్యత అన్నది ఒక్క హిందువుల మద్యనే ఉండాలా? హిందువులూ, ముస్లింల మధ్య ఉండాల్సిన అవసరం లేదా? అన్ని మతాలవారి మధ్య ఐక్యత ఉండాల్సిన అవసరం లేదా? అలాంటి ఐక్యతని మీరు వ్యతిరేకిస్తున్నారని నేను చెప్పడం లేదు. అలాంటి ఐక్యతకు ఇలాంటి ప్రభుద్ధుల చర్యలే ఆటంకంగా ఉన్నాయని మాత్రమే చెప్పదలిచాను. వీళ్లలో వైన్స్ వ్యాపారి కూడా ఉన్నాడు. వైన్స్ వ్యాపరులంతా తాగుబొతుల్ని సృష్టించకుండా ఉంటే అనేక సమస్యలు పరిష్కారమై అనేక కుటుంబాలు శాంతితో జీవిస్తాయని వైన్ వ్యాపారి గుర్తిస్తే సగం ఐక్యత సిద్ధించినట్లే.

 3. “హిందూ మత విశ్వాసాలని అవమానించడానికి పూనుకుంది ముస్లింలు కాదు, హిందువులే ఆ పని చేసారు” అని పోలీసులు చెప్పారు. ఆ విషయమే ఈ పోస్టుకి శీర్షికగా పెట్టాను. హిందూ దేవాలయాలలొ హిందూ ఆచారాలను అవమానపరిచేలా హిందువులే ప్రవర్తిస్తూ ఆ నెపాన్ని ముస్లింలపై నెట్టడానికి ప్రయత్నిస్తున్నారన్న వాస్తవం చెప్పడమే ఈ శీర్షిక ఉద్దేశ్యం.

  Thanks for your Reply

 4. అయితే, హిందూ మతం అనుసరించేవారంతా హిందువులే అనడంలో మీకు అభ్యంతరం ఉందా? హిందూ దేవుళ్లను పూజిస్తూ, హిందూ పండగలను జరుపుకుంటూ, హిందూ మత ఆచారాలను, ఆచరణను అనుసరించేవారంతా హిందువులు కారని మీరు చెప్పదలిచారా?

  ఇస్లామిక్ తీవ్రవాదం, ముస్లిం టెర్రరిస్టు .. ఈ పదాలు తప్పు కాదని ఒప్పుకున్న పక్షములో దీన్ని హిందువులు చేసిన పనులుగా గుర్తించడములో ఎలాంటి అభ్యంతరమూ ఉండదు.

 5. అందులో అనుమానం అనవసరం. హిందూ టెర్రరిజం ఉన్నట్లే ఇస్లామిక్ టెర్రరిజం కూడా ఉంది. గత సంవత్సరం నార్వేలో బ్రీవిక్ పాల్పడిన హత్యాకాండ క్రిస్టియన్ టెర్రరిజం కిందకు వస్తుంది. అమెరికా అనుసరిస్తున్న ఆధిపత్య విధానాలు, దురాక్రమణ విధానాలు, మధ్య ప్రాచ్యంలో అది అనుసరిస్తున్న ఇజ్రాయెల్ అనుకూల విధానాలు ఇస్లామిక్ టెర్రరిజానికి ముఖ్య కారణం. భారత దేశంలో కాశ్మీరు ప్రజలపై సాగిస్తున్న అణచివేత కు స్పందనగా ఇక్కడ ఇస్లామిక్ టెర్రరిజం జన్మించింది. అమెరికా విధానాలకి భారత ప్రభుత్వాలు ఇస్తున్న లోపాయకారీ మద్దతు కూడా ఇండియాలో ముస్లిం టెర్రరిజానికి ఒక కారణంగా ఉంది. ప్రభుత్వాలలో ఉన్న రాజకీయ పార్టీలు తాము మద్దతుగా నిలిచే ఆర్ధిక వర్గాల కోసం వివిధ జాతులు, మతాల అణచివేతకు పూనుకుంటున్నాయి. దానికి స్పందనగా టెర్రరిజం జనించింది. టెర్రరిస్టు చర్యలకి ఎవరు పాల్పడినా సమర్ధనీయం కాదు. అది ఎవరినీ ఉద్ధరించదు. విధ్వంసాన్ని తప్ప.

 6. I have a question on hinduism. Hindutva proponents argue that hinduism is not religion but a way of life. If hinduism is just way of life, then why do hindus also won’t visit places of worship of other religions? I raised this question to request to hindus to think about practicality while talking about hinduism.

 7. మీ బోల్డ్ టైటిల్ కి అభినందనలు.

  నిజానికి ఇలాంటి వార్తలకు విశేష ప్రాధాన్యం కలిగించవలసిన అవసరం చాలా ఉంది. ఎందుకంటే, ప్రస్తుత సమాజంలో మతాలమధ్య వైషమ్యాలను పెంచి దాని ద్వారా లభ్దిపొందాలని దేశంలోని కొన్ని రాజకీయ పార్టీలు(BJP,RSSలు దీనిలో ఆరితేయాయి). ISIలాంటి విదేశీ సంస్థలు కాచుక్కూర్చున్నాయి. ఇప్పుడు హైదరాబాద్లో జరిగినట్లుగా, చిన్న చిన్న సంఘటనలకే ప్రజలు,ఒకరిపై ఒకరు దాడులకు పూనుకుంటే వీటి లక్ష్యం నెరవేరినట్లే. కావున ఇలాంటి సంఘటనలు జరిగినప్పుడు ప్రజలు ఎదుటివారిని నిందిస్తూ రెచ్చిపోకుండా.. సమ్యమనం పాటించాల్సిన అవసరం ఉంది. ప్రజలు దీని వెనకున్న రాజకీయాన్ని అర్థం చేసుకున్నప్పుడే ఇది సాధ్యమవుతుంది. కానీ తెలుగు మీడియా(ఈనాడు,సాక్షి) ఈ విషయంలో కుట్రపూరితంగా వ్యవహరిస్తున్నట్లుగా అనిపిస్తుంది. మొన్న కర్నాటకలో జరిగిన పాకిస్తాన్ జెండా విషయం కానీ, ఇప్పుడు హైదరాబాద్లో పోలీసు దర్యాప్తులో తేలిన అంశాలకుగానీ ప్రచురణలో ఇవి అంత ప్రాముఖ్యతను ఇవ్వలేదు. Thanks.

 8. చీకటి,
  ఇప్పటికే దేశ వ్యాప్తంగా కాంగ్రేస్, గ్రేస్ కోల్పోయిందని గ్రహించు. మొన్న డిల్లి ఎన్నికలలో చావు దెబ్బతిని కూలబడింది. రేపు ఆంధ్రాలో జరిగే ఎన్నికలలో అధికారం కోల్పోయి, కుప్ప కూలి, చతికిలబడటం ఖాయం. ఆతరువాతా కాంగ్రేస్ పార్టి కాయానికి కాయకల్ప చికిత్స కొరకు కేరళకి వేళ్లవలసిందే. మహారాష్ట్రాలో కూడా ఆశాజనక పరిస్థితి సుదూర దూరంలో కనిపించటం లేదు. హిందూవాదులకు భాజపా గెలుపు కన్నా, కాంగ్రేస్ ఓటమి అమితానందాన్ని ఇస్తుంది.

 9. ఇంకొక చిన్న విషయమేమిటంటే, హైదరాబాద్ లో ఉన్న పార్టి యం.ఐ.యం. వారిని ఇన్ని సం|| లు గా ప్రాతినిధ్యం వహిస్తున్నా, ఆ పాత బస్తిలో ఉండే సామాన్య,మధ్యతరగతి వారికి ఒనగూడిన లాభలు ఎమైనా ఉన్నాయా? కనీసం వారిలో విద్యా వ్యాప్తిని ఆ పార్టి ఎంత ప్రోత్సహించింది? ముస్లిం వర్గాలలో ఉన్న భూస్వామ్య వ్యవస్థ ఇంకేక్కడా చూడలేదు. అతి పేదరికం, విపరీతమైన డబ్బులు కలవారు ఇద్దరిని చూడవచ్చు. డబ్బులున్న వారు విదేశీ ప్రయాణాలు, గల్ఫ్ దేశాలు చేస్తూ తిరుగుతూంటారు. వాళ్లకది ఒక గొప్ప విషయం, విజయం. మనదేశంలో డబ్బులు ఉన్న వారు మొదలుకొని ( సుధామూర్తి, నందన్ నీలెకన్ని భార్యetc., ) సాధారణ గృహిణుల వరకు ఎంతో మంది, తమకు చదువు వస్తే ఇతరులకు ఆరి వారి స్థాయిని బట్టి , చదువు చెప్పటానికి ఉత్సాహం చూపుతారు. వారిలో అటువంటి వారిని ఎక్కడైనా చూసారా? ప్రభుత్వం ఓట్ల కోసం ఈ ముస్లిం నాయకులకి అధిక ప్రాధాన్యత ఇచ్చి, వారి ప్రాంతం లో పాలన పట్టించుకోదు. ములాయం,లాలు లాంటి వారు కూడా ఇదే పంథాను అవలంబించారు. వారి నాయకుల వలన ముస్లిం లు చాలా నష్ట్టపోయారు. ఇప్పుడు ముస్లిం లు, హిందువులతో పోటిపడే స్థితిలోను,పరిస్థితిలోను,స్థాయిలోను లేరు. వారిని చూసి అభద్రాతా భావం హిందువులు ఎప్పుడు లోనవలేదు. ఇకవారే అభద్రతా భావం ఎక్కువ గా లోనౌవుతూ, అందరు ఏకమై ఓట్లను గంపగుత్తగా ఒక పార్టికి వేసుకొంటె, అది వారికే హాని చేస్తున్నాదని, ఇప్పటివరకు జరిగిన చరిత్ర చెపుతున్నాది. గత 60సం|| వారి పరిస్థితి పెద్దగా మెరుగు పడలేదు. వారు ఎక్కువ సంఖ్య ఉన్న ప్రదేశాలలో అయినా, హిందువులతో తగవులు వేసుకొంటే నష్ట్ట పోయేది, ఈ ఇంటర్ నెట్ యుగంలో హిందువులు మాత్రం కాదు. కనుక హిందువులు ఇటువంటి మత కలహాల విషయాలను, వాటి పైన జరిగే చర్చలను, పెద్దగా పట్టిoచుకోనవసరంలేదు.

 10. దిగ్భ్రాంతి కలిగిస్తున్నాయి ఈ విషయాలు. ఏ కులమైనా మతమైనా మత ఘర్షణలు ప్రోత్సహించడం అనేది అభిలషణీయంకాదు అన్న విషయం ఈనాటి యువతరం గ్రహించాలి

 11. మీకున్న హిందూ ద్వేషాన్ని బయటపెట్టారు మరోసారి.
  ఈ గొడవ జరగడానికి గల కారణం మీరు చదివారా ? పక్కన ఉన్న ఒక వర్గం వాళ్ళ పట్ల ఉండే భయమే వీళ్ళతో ఆ పని చేయించింది. పక్కన ఉన్న ఒక వర్గం వాళ్ళ ఆగడాలు తట్టుకోలేక , పోలీసు రక్షణ గురించి ఎన్ని సార్లు అడిగిన ఎవరు పట్టించుకోవడం లేదని , ఇలాంటి పని చేస్తే, పోలీసు రక్షణ ఉంటుందని చేసాం అని వాళ్ళు ఒప్పుకున్నారు. అంతే కాదు, ఆ పని చేసిన వారికి ఇంతకూ ముందు ఎటువంటి నేర చరిత్ర లేదు. రెండు వేల సంవత్సారాలు నుండి హిందూ మతాన్ని అణిచే ప్రయత్నాలు జరిగాయి, ఇప్పటకి జరుగుతున్నాయి. కానీ అదంతా వృదా ప్రయాస అని అర్ధం అవుతుంది అందరికి.

 12. వెంకట్ గారూ, ఏమండీ అంతమాటనేశారు? హిందూ మతోన్మాదాన్ని ద్వేషిస్తూ పోస్టులు రాసాను గానీ, హిందువుల్ని ద్వేషిస్తూ రాయలేదు కదా. ఆ మాటకొస్తే ఏ మతోన్మాదానికైనా నేను వ్యతిరేకినే.

  మీరు చెప్పింది నిజమే అనుకున్నా మత విద్వేషం రెచ్చగొట్టడం వల్ల రక్షణ దొరకదు కదా.

  అవును. మీరన్నది నిజం. ఒక మతాన్ని అణచివేసే ప్రయత్నాలు ఎన్నటికీ సఫలం కావు. అలాంటివి వృధా ప్రయాస అని ఎప్పుడో ఎందుకు ఇప్పటికే అర్ధం కాలేదా? ప్రజల ఆదరణ ఉన్నంతవరకూ మతమైనా మరోటయినా నిలిచి ఉంటాయి. భారత దేశంలో ప్రజల ఆదరణ లేకనే బౌద్ధం క్షీణించింది తప్ప ఎవరో అణచివేయడం వల్ల కాదు. హిందూ మతం గానీ, ముస్లిం మతం గానీ భవిష్యత్తులో క్షీణించినా అదే కారణంగా ఉంటుంది.

  మతం అయినా, ఇజం అయినా సర్వ మానవ హితాన్ని కోరుకోవాలన్నది ఆధునిక సూత్రం. దానికి భిన్నమైన సూత్రాలని బోధిస్తే ఎప్పటికైనా అవి క్షీణిస్తాయి.

 13. హిందువులలో హిందూ సంప్రదాయాలని ఆచరించేవాళ్ళు ఎంత మంది? రెగ్యులర్‌గా గుడికి వెళ్ళేవాళ్ళు ఎంత మంది? కొబ్బరికాయలు కొట్టేవాళ్ళు ఎంత మంది? నిజ జీవితంలోని చాలా వ్యవహారాలతో సంబంధం లేని మతం పేరుతో కొట్టుకుంటే ఏమీ రాదు. ఈ లింక్ చదవండి: https://plus.google.com/111113261980146074416/posts/9V3Xw5VHZGA

 14. ప్రపంచం అనేది భౌతిక ప్రయోజనాలకి అనుగుణంగా నడుస్తుంది కానీ దేవుళ్ళూ, మతాలూ, విశ్వాసాలకి అనుగుణంగా నడవదు. ఇండియాలో మార్క్సిజంని వ్యతిరేకించే వర్గంవాళ్ళు తాము హిందూ మతం కోసం మార్క్సిజంని వ్యతిరేకిస్తున్నాము అని చేస్తున్న వాదన నమ్మశక్యంగా లేదు. ఎందుకంటే మతం లాంటి ఊహాజనిత నమ్మకాల కోసం ఎవరూ తమ రాజకీయ అభిప్రాయాలని నిర్ణయించుకోరు. అడాల్ఫ్ హిట్లర్ ఒక క్రైస్తవుడు, మార్టిన్ హీడెగ్గర్ ఒక నాస్తికుడు. కమ్యూనిజంని వ్యతిరేకించే విషయంలో వాళ్ళిద్దరి అభిప్రాయాలూ దాదాపుగా ఒకటే. జెర్మన్ నాజీ పార్టీలో ఎక్కువ మంది క్రైస్తవులేనైనా ఆ పార్టీలో నాస్తికులకీ, విగ్రహారాధకులకీ కూడా చేరడానికి అనుమతి ఉండేది. అల్ప జాతివాళ్ళుగా (ఆర్థికంగా వెనుకబడిన జాతులవాళ్ళుగా) భావించబడిన రైన్‌లాండ్ బాస్టర్డ్స్ లాంటి జాతులవాళ్ళకి మాత్రం ఆ పార్టీలో చేరడానికి అనుమతి లేదు.

 15. ప్రవీణ్ ప్లస్ లో మీ ఆర్టికల్ చదివాను. చక్కగా ఉంది. అభినందనలు. సోషలిస్టు వ్యవస్ధల్లో ఆచరణ ఎలా ఉందన్న విషయమై ఒక పుస్తకం అనువాదం చేస్తున్నట్లు మీరు గతంలో చెప్పగా గుర్తు. అది ఎంతవరకు వచ్చింది?

 16. నాకు ఇంగ్లిష్ బాగా వచ్చినా, తెలుగులో పాండిత్యం అంతగా లేదు. అందుకే పుస్తకాన్ని పూర్తిగా అనువదించలేదు. గతంలో నేను ఇంగ్లిష్ డిస్కషన్స్ బోర్డ్‌లలో మార్క్సిజంని వ్యతిరేకించేవాళ్ళతో చర్చించడం జరిగింది. వాళ్ళందరూ వైయుక్తికవాదం (individualism) వల్ల మార్క్సిజంని వ్యతిరేకించినవాళ్ళే. మతం వల్ల మార్క్సిజంని వ్యతిరేకిస్తున్నట్టు చెప్పుకున్నవాడు మాత్రం ఒకడే తగిలాడు. అతను ఒక ముస్లిం. అతను తాను ఇస్లామిక్ సృష్టివాదాన్ని బలంగా సమర్థిస్తున్నట్టు చెప్పుకున్నాడు. మనిషిని దేవుడు సృష్టించలేదనీ, జీవితం భౌతిక నియమాల ఆధారంగా నడుస్తుంది కానీ దైవ నిర్ణయం ఆధారంగా నడవదు అనీ ఒప్పుకుంటే పేదరికానికీ, ఆర్థిక అసమానతలకీ దేవుడు కారణం కాదని ఒప్పుకోవాల్సి వస్తుంది. సాధారణ ప్రజలు దైవ నిర్ణయం (god’s will)తో సంబంధం లేకుండా స్వేచ్ఛగా ఆలోచించే స్థాయికి ఎదగడం కొంత మంది ఉన్నత వర్గంవాళ్ళకి ఇష్టముండదు. అందుకే వాళ్ళు ప్రజలలో మతం లాంటి అభివృద్ధి నిరోధక నమ్మకాలని ఇంజెక్ట్ చేస్తుంటారు.

 17. ప్రవీణ్, అనువాదానికి తెలుగు పాండిత్యం పెద్దగా అవసరం లేకపోవచ్చు. డిక్షనరీ సాయంతో నైనా చెయ్యవచ్చు. అనువాదం కొనసాగించాలన్నది నా కోరిక. పోనీ మీరు అనువదించినంతవరకైనా నెట్ లో ఉంచండి. చూస్తాను.

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

గూగుల్ చిత్రం

You are commenting using your Google account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

Connecting to %s