యాపిల్ బిలియన్ల కొద్దీ పన్నులు ఎగ్గొట్టింది -న్యూయార్క్స్ టైమ్స్


appleఎలక్ట్రానిక్ గాడ్గెట్ల దిగ్గజం ‘యాపిల్’ ప్రపంచ వ్యాపితంగా చిన్న చిన్న ఆఫీసులు నెలకొల్పి బిలియన్ల కొద్దీ డాలర్ల పన్నులను ఎగవేసిందని ది న్యూయార్క్స్ టైమ్స్ శనివారం వెల్లడించింది. కాలిఫోర్నియా కంపెనీ అయిన ‘యాపిల్’ నెవాడా రాష్ట్రంలోని రెనో నగరంలో ఆఫీసు పెట్టడం పన్ను ఎగవేతకు వేసిన ఎత్తుగడల్లో ఒకటని ఆ పత్రిక తెలిపింది. నెవాడాలో కార్పొరేట్ పన్ను సున్నా శాతం కాగా కాలిఫోర్నియాలో 8.84 శాతం కార్పొరేట్ పన్ను వసూలు చేస్తారని తెలిపింది. రెనో ఆఫీసు లాంటివి అనేకం ప్రపంచ వ్యాపితంగా నెలకొల్పి పన్నులు ఎగవేయడం ద్వారా సొమ్ములు కూడబెట్టిందని ఎన్.వై.టైమ్స్ తెలిపింది.

2012 మొదటి క్వార్టర్ లో యాపిల్ 39.2 బిలియన్ డాలర్ల లాభాలు ఆర్జించిందని గూగుల్ గత వారం ఒక నివేదికలో తెలిపింది చైనాతో పాటు ఆసియాలోని ఇతర చోట్ల ఐ ఫోన్, ఐ ప్యాడ్ లు రికార్డ్ స్ధాయిలో అమ్ముడుపోవడంతో ఈ లాభాలు సాధ్యమయ్యాయని నివేదిక తెలిపింది. అయితే వివిధ మార్గాలలో పన్నులు ఎగవేయడం ద్వారా లాభాలు పెంచుకుంటున్నాదని పత్రిక తెలిపింది.

రెనో ఆఫీసు, ఐర్లాండు, నెదర్లాండ్స్, లక్సెంబర్గ్, బ్రిటిష్ వర్జిన్ ఐలాండ్స్ లతో సహా అనేక ఇతర తక్కువ పన్నులున్న ప్రాంతాల్లో ఆఫీసులు నెలకొల్పి యాపిల్ తన గ్లోబల్ పన్నుల బిల్లులు తగ్గించుకున్నట్లు యాపిల్ ఎక్జిక్యూటివ్ ని ఉటంకిస్తూ టైమ్స్ తెలిపింది. పన్నుల కోడ్ లో ఉన్న ఖాళీలను వినియోగించుకునేలా యాపిల్ తన కార్పొరేట్ వ్యూహాలను రూపోందించుకుందని టైమ్స్ పత్రిక తెలిపింది. అటువంటి పన్నుల విధానాలను డిజైన్ చేయడంలో పాత్ర ఉన్న మాజీ కంపెనీ అధికారులను సదరు పత్రిక తన కధనానికి ఆధారంగా పేర్కొంది.

రెనో లో ‘బ్రూబర్న్ కేపిటల్’ అనే అనుబంధ సంస్ధను ముందు పెట్టి దాని ద్వారా యాపిల్ కంపెనీ డబ్బుని వివిధ చోట్ల పెట్టుబడులు పెట్టడం, నిర్వహించడం చేస్తోందని పత్రిక తెలిపింది. అలాంటి పెట్టుబడులు విజయవంతం అయినపుడు సదరు లాభాలను నెవాడా ఆఫీసు పన్నులనుండి కాపాడుతుందని పత్రిక తెలిపింది. యాపిల్ కంపెనీ ట్రాన్సాక్షన్లను లక్సెంబర్గ్ ద్వారా నిర్వహించడం ద్వారా తక్కువ పన్నులు చెల్లించగలిగిందని యాపిల్ ఐ ట్యూన్స్ మాజీ ఎక్జిక్యూటివ్ రాబర్ట్ హట్టా ని ఉటంకిస్తూ పత్రిక తెలిపింది. “అనుకూల పన్నులు ఉండడం వల్ల లక్సెంబర్గ్ లో ఆఫీసు నెలకొల్పాము” అని రాబర్ట్ హట్టా పేర్కొన్నాడు.

“ట్రాక్టర్లు లేదా స్టీల్ లతో పోలిస్తే డౌన్ లోడ్స్ భిన్నమైనవి. మీరు ఇక్కడ తాకేదేమీ ఉండదు. కనుక మీ కంప్యూటర్ ఫ్రాన్సు లో ఉందా లేక ఇంగ్లాండులో ఉందా అన్నదానితో సంబంధం లేదు. లక్సెంబర్గ్ నుండి కొన్నట్లయితే అది లక్సెంబర్గ్ తో ఉన్న సంబంధమే” అని హట్టా పేర్కొన్నాడు.

పెట్టుబడిదారీ కంపెనీలు నిజాయితీగా పన్నులు చెల్లిస్తాయనీ, ఉద్యోగావకాశాలు కల్పిస్తాయనీ, దేశాభివృద్ధికి పాటుబడతాయనీ చేసే బోధలకు యాపిల్ కంపెనీ విధానాలు విరుద్ధం. దేశ నిర్వహణకు పన్నులనేవి ప్రభుత్వాలకు అత్యవసరం. అలాంటి పన్నులను ఎగవేయడం అంటే దేశ నిర్మాణంలో తమకు గల బాధ్యతను తిరస్కరించడమే. ఆ పనిని పెట్టుబడిదారీ కంపెనీలు దశాబ్దాలుగా సమర్ధవంతంగా నిర్వహిస్తున్నాయి. తద్వారా ట్రిలియన్ల కొద్దీ ఆస్తులు కూడబెడుతున్నాయి. వారికి ప్రభుత్వాలలోని పెద్దలు కూడా లోపాయకారిగా సహాయ పడుతూ ప్రజలకు ద్రోహం చేస్తున్నారు.

17 thoughts on “యాపిల్ బిలియన్ల కొద్దీ పన్నులు ఎగ్గొట్టింది -న్యూయార్క్స్ టైమ్స్

  1. యాపిల్ కంపెనీ దిగ్గజం ఒకరు ఇటీవల మరణించినపుడు ఊరూ వాడా ఎత్తుకపోయేలా స్మృతి వ్యాసాలు రాసిన వాళ్ళు, ఇపుడూ ఎలా ప్రతిస్పందిస్తారో చూడాలి. పాపం ఆయనకు చారడేసి కళ్ళని, బౌద్ధం చేత ప్రభావితుడయ్యాడనీ కూడా రాసి మన వాళ్ళు మేధావితనాన్ని చాటుకున్నారు.

  2. నాగరాజు గారు, వాళ్లిపుడు స్పందించరు. కొన్ని వార్తలని చంపేయడానికి మౌనం ఉత్తమమైన ఆయుధంగా వాళ్లెప్పుడో కనిపెట్టారు. అది చాతకాకపోతే బుకాయింపులకి దిగుతారు.

  3. “పెట్టుబడిదారీ కంపెనీలు నిజాయితీగా పన్నులు చెల్లిస్తాయనీ, ఉద్యోగావకాశాలు కల్పిస్తాయనీ, దేశాభివృద్ధికి పాటుబడతాయనీ చేసే బోధలకు యాపిల్ కంపెనీ విధానాలు విరుద్ధం.”

    వ్యాపారం ద్రోహ చింతన అనేది యుగయుగాల నానుడి. ఇవ్వాళ పుట్టిందీ కాదు. కానీ యాపిల్ మాత్రమే కాదు. ప్రపంచోలో పన్నులు కట్టకుండా అపమార్గాలు పట్టని సంస్థ ఏదో ఒకటి చూపించండి చాలు.

    ప్రపంచ వ్యాప్తంగా ఆడిటర్లు, చార్టర్డ్ ఎక్కౌంటెట్ల వృత్తి ధర్మంలో, కంపెనీల లెక్కలను తారుమారు చేసి చూపటమే ప్రధానం కదా. దొరకనంతవరకూ అందరూ దొరలే. దొరికినప్పుడే దొంగలవుతున్నారు.

    స్టీవ్ జాబ్స్ మరణించినప్పుడు చాలామంది రాసిన స్మృతి రచనలు తను ఆవిష్కరించిన ఉత్పత్తుల నాణ్యతను, వ్యాపారాన్ని అమోఘంగా కొనసాగించడంలో తనదార్శనికతను చెప్పడం మీదే కేంద్రీకరించాయనుకుంటాను. అప్పుడు మీరు రాసిన స్టీవ్ జాబ్స్‌పై స్మృతిరచన కూడా ఈ విషయంపైనే పాజిటివ్‌గా సాగింది.

    స్ట్టీవ్ జాబ్స్‌కి చారెడేసి కళ్లు, బౌద్ధం చేత ప్రభావితమయ్యాడని రాసినంతమాత్రాన ఆయన వ్యాపార నీతిలో పెట్టుబడి దారీ పద్ధతులను అవలంబించలేదని అర్థం రాదు కదా. శ్రీలంక నరహంతకుడు రాజపాక్షే బౌద్ధ మతావలంబి అయినంత మాత్రాన శాంతి పక్షి కాదు కదా.

    శ్రమ శక్తి నుంచి లాభ పుట్టుకురావడం అనేది చరిత్రలో ఆవిర్భవించినప్పటి నుంచి లాభాన్ని దాచుకోవడం, వెనకేసుకోవడం, పన్నులను ఎగేయడం అనేది కొనసాగుతూనే ఉంది. దానికి స్టీవ్ జాబ్స్, యాపిల్, బిల్ గేట్స్ కూడా అతీతులు కారు.

  4. నిజంగా ఆపిల్ వాడు పన్నులు ఎగవేశాడా అని ఆత్రపడుతూ వచ్చి చదివాను ఇది. తీరా ఇదన్న మాట. ఎందుకంటే అదే నిజమయితే.. అమెరికా చట్టాల ప్రకారం ఆ కంపెనీ ఫైన్లు కట్టడానికి .. తమ ఆస్తుల్ని అమ్ముకోవాల్సి ఉంటుంది. అంత కఠినంగా ఉంటాయి మరి ఆ చట్టాలు. ఇంకో విషయమేమిటంటే.. అమెరికా వారిలో వ్యక్తి పూజ తక్కువ. కాబట్టి, మన దేశములో లా ఇంత పబ్లిగ్గా విషయం బైట పడిన ఆ కంపెనీని వదిలేయడం లాంటివి జరగవు. సాక్షాత్తూ అమెరికా ప్రెసిడెంటునే కోర్టుబోనెక్కించిన చరిత్ర ఉంది ఆ దేశానికి. అందుకే, ప్రజాస్వామ్య విధానాలు అమలు పరచడములో, వ్యక్తి స్వేచ్ఛను గౌరవించడములో, అమెరికాను ఆదర్శంగా తీసుకోవాలి అనే వారు చాలా మందున్నారు.

    ఇక పన్ను ఎగవేత అనే విషయానికి వద్దాం. దీన్ని పన్ను ఎగవేత అనడం అంటే ఎక్జాగరేట్ చేయడమే అవుతుంది. పన్నులు తక్కువ కట్టడానికి ప్రతీ ఒక్కరు తమకు అందుబాటులో ఉన్న అన్ని సదుపాయాలనూ వాడుకుంటూ ఉంటారు. మన దేశములోనే ప్రభుత్వ ఉద్యోగిని తీసుకోండి. . పన్నులు తక్కువ కట్టడానికి లోన్లు తీసుకోవడం, ఆపాలసీలు, ఈ పాలసీలు కట్టడం చాలా కామన్. అంత మాత్రాన వారు మోసం చేసినట్టా కాదు. ఉన్న సిస్టములోని కొన్ని సౌలభ్యాలను ఉపయోగించుకొని లాభ పడడం. దాన్నే అవేర్‌నెస్ అంటారు తప్ప మోసం అనరు.

    అలానే పన్నులు తక్కువగా ఉన్న రాష్ట్రాలలోనో ప్రదేశాలలోనే వ్యాపారాలు చేసి డబ్బు సంపాదించడం ఉన్న సౌకర్యాలను వినియోగించుకోవడమే అవుతుంది. లీగల్ గా వారు పన్ను ఎగవేసినట్టు కాదు. వారు ఆయా చట్టాలను పాటిస్తూనే ఉన్నారు కదా.. మరి ఎగవేత దారులూ అనే మాటకు ఆస్కారమెక్కడిది? ఏదో, విమర్శించడానికి చేసిన ప్రయత్నం తప్ప?

    ఇక, సెలెక్టివుగా మౌనం పాటించే వారు చాలా మందే ఉన్నారు. హిందూ మతస్తులు ఒక తప్పు చేయగానే పతాక శీర్శికలఓ పెట్టేసి, అదే తస్లిమా నస్రీనో లేక సల్మాన్ రష్దీనో ఇండియాలోనికి కూడా రానివ్వకుండా అడ్డుపడినప్పుడు తేలుకుట్టిన దొంగల్లా సైలంటయ్యే వారు .. బ్లగుల్లోనే చాలా మంది ఉన్నారు లెండి. వారితో పోలిస్తే .. ఇలాంటి విషయాలకి (తప్పు కానీ) మౌనం పాటించే వారు ఏపాటి?

  5. నిజంగానే యాపిల్ కంపేనీని స్తాపించినవారు యువతకు ఆదర్శం. తినడానికి తిండి కూడా సరిగా లేని వ్యక్తి.. (ఎడిట్) ఎన్నో వేల మందికి ఉపాది కల్పించాడు, నూతన శకానికి నాంది పలికాడు. అలాంటి వ్యక్తులను ఆరాధించడం తప్పుకాదు.

    పేదరికాన్ని దూరం చేయాలి అంటే .. (ఎడిట్) కాస్త పని చేసి, మరో నలుగురికి పని కల్పించి తద్వారా పేదరికాన్ని పోగొట్టే ఇలాంటి వారే ఆదర్శనీయులు.

    ఆయన బౌద్దాన్ని పాటించాడా? నాకు నిజంగానే తెలీదు కానీ, ఆ రేంజులో విజయాలు సాధించడానికి ప్రశాంతమైన మనస్సు కావాలి. బహుషా ఆయనకు అది ఇలాంటి మతాలలోని కొన్ని బోధనల వల్ల వచ్చిందేమో. దేవుడు ఉన్నా లేకపోయినా నమ్మకం అనేది చాలా శక్తివంతమైనది అని అన్ని రకాల శాస్త్రవేత్తలూ ఆంగీకరించే విషయమే కదండీ.. 🙂

  6. యాపిల్ కంపెనీ ఏదో ‘ఉన్న సౌకర్యాలు’ వినియోగించుకుంటుంటే ‘ఏదో, విమర్శించడానికి ప్రయత్నం చేయడానికి’ న్యూయార్క్ టైమ్స్ కి ఎందుకంత ఆసక్తో మరి? పోనీ అది కమ్యూనిస్టు పత్రిక కూడా కాదాయె. గుడ్డిగా అర్ధం పర్ధం లేకుండా ద్వేషం వెళ్లగక్కడానికి!

    మధ్యతరగతి జనం తమ కొద్ది ఆదాయాన్ని కాపాడుకోవడానికి ఆ పాలసీలూ, ఈ పాలసీలు తీసుకోవడమూ, బిలియన్ల కొద్దీ డాలర్ల పన్నుల్ని ఎగవేయడానికి లాబీయింగ్ చేసి ఏర్పాటు చేసుకున్న కంతల్లో దర్జాగా దూరిపోవవడం ఒకటే అన్నమాట! చట్టబద్ధంగా కంతల్ని ఏర్పాటు చేసుకుని దూరిపోవడం గొప్ప ‘అవేర్‌‌నెస్’.

    అమెరికా చట్టాల పట్ల ఓ భారతీయుడికి ఉన్న ఆరాధన అమెరికన్లకి లేకపోవడమే విచిత్రం.

  7. విషేఖర్ గారూ,

    నాది అమెరికా చట్టాల పట్ల ఆరాధన కాదు, వాటి మీద ఉన్న నమ్మకం. ఆ పత్రిక కమ్యూనిస్టు పత్రిక కాకపోవచ్చు, కాని రాసిన వ్యక్తి లిబెరల్ బాపతు వాడయ్యుండొచ్చు అన్నది నా పాయింటు. అమెరికా పెట్టుబడి దారీ దేశమన్న మాటే గానీ ఈలిబరల్ జనాభా అక్కడ బాగానే ఉందిట.

    మధ్యతరగతి వాడైనా, ఉన్నత తరగతి వాడైనా చట్టములో ఉన్న సౌకర్యాలను ఉపయోగించుకోవడం తప్పు కాదు. వారు లాబీయింగ్ చేశారు అంటున్నారు. ఆపిల్ వాడూ అలా చేశి ఆచట్టాలలో కంతలు ఏర్పాటు చేయించుకున్నాడు అని తెలియజేసే స్టడీ ఏదైనా ఉంటే ఇవ్వగలరు. పెట్టుబడులను ఆకట్టుకోవడానికి ఒక్కో రాష్ట్రం ఒక్కో విధానాన్ని పాటిస్తుంది. బాగా అభివృద్ధి చెందిన రాష్ట్రం ఏవిధమైన వెలుసుబాటు అందివ్వక పోయినా.. ఇప్పుడిప్పుడే అభివృద్ది చెందుతున్న రాష్ట్రాలు పెట్టుబడులను ఆకర్షించడానికి కొన్ని ప్రోత్సాహకాలనూ, పన్నులలో వెలుసు బాటును ఇవ్వడం అనేది ఎక్కడైనా జరిగేదే. అది అవసరం కూడా. అది ఆయా ప్రబుత్వాలు ఆయా ప్రాంతాలను అభివృద్దిచేసుకోవడానికి చేసుకుంటున్నవే తప్ప స్వార్ధానికో, ఎవరికో దోచిపెట్టడానికో చేస్తున్నవి కావు. అమెరికాలో, ప్రతీ రాష్ట్రం వాటి పరిస్థితులను భట్టి చట్టాలు చేసుకునే హక్కు గలిగినవి అని మనం మర్చిపోకూడదు.

    అయినా, అమెరికాలోని చట్టాలలోని కంతల గురించి అమెరికన్లకు లేని భయం, వ్యాకులత భారతీయులకు ఉండడం కూడా విచిత్రమేనండీ.. !!

  8. శ్రీకాంత్, మీ గుడ్డి ద్వేషాన్ని అనుమతించనని చెప్పాను మీకు. మళ్ళీ అదే ధోరణిలో రాస్తున్నారు. మీ ద్వేషాన్ని ఎడిట్ చేస్తూ కూర్చోవడం అన్ని సార్లూ నాకు సాధ్యం కాదని గుర్తించండి.

  9. రీకాంత్, మీ గుడ్డి ద్వేషాన్ని అనుమతించనని చెప్పాను మీకు. మళ్ళీ అదే ధోరణిలో రాస్తున్నారు. మీ ద్వేషాన్ని ఎడిట్ చేస్తూ కూర్చోవడం అన్ని సార్లూ నాకు సాధ్యం కాదని గుర్తించండి

    I will give my reply to this..

  10. యాపిల్ లాబీయింగ్ కి స్టడీయా?

    పెట్టుబడిదారీ కంపెనీల లాబీయింగ్ గురించి వీలును బట్టి పొస్టు రాయడానికి ప్రయత్నిస్తాను.

    అమెరికన్లు భయపడడమే కాదు ఆందోళనలు కూడా చేస్తున్నారు. ‘ఆకుపై వాల్ స్ట్రీట్’ ఉద్యమం గురించి మీరు విన్లేదనుకుంటా.

  11. అమెరికన్లు భయపడడమే కాదు ఆందోళనలు కూడా చేస్తున్నారు. ‘ఆకుపై వాల్ స్ట్రీట్’ ఉద్యమం గురించి మీరు విన్లేదనుకుంటా.

    చెప్పాను కదండీ, లిబెరల్స్ అన్ని చోట్లా ఉన్నారు. అమెరికాలో కూడా ఉన్నారు అని. దానికి నాకు పెద్దగా ఆస్చర్యం లేదు. అలానే అమెరికా చట్టాల పట్ల ఆరాధన ఉన్న అమెరికన్లు కూడా చాలా మందే ఉన్నారు.

  12. పెద్ద ఎత్తున ఉద్యమాలు జరిగితే ‘లిబరల్’ అని కొట్టిపారేయడం ఏంటి? లిబరల్స్ అంటే ఏమిటో ఎందుకలా చేస్తున్నారో, మీరెందుకు కొట్టిపారేస్తున్నారో వివరం ఇవ్వండి.

  13. ఈ వ్యాసం శిర్షిక కొద్దిగా తప్పుదోవ పట్టిస్తోంది. పన్నులు ఎగ్గొట్టడం వేరూ, పన్నులు తప్పంచుకోవటం వేరు. ఇక్కడ ఆపిల్ పన్నులను తప్పించుకుంటొంది.

    ఇక్కడ ఒక్క ముఖ్య విషయం ఏమిటంటే కంపెనీల మోదటి ప్రాధాన్యాత డబ్బులు సంపాదించడం. అందుకని వారు లాభాలు పెంచుకోవటో కొరకు ఇలాంటి వన్నీ చేస్తారు. ఇది కేవలం Apple మాత్రమే కాదు, Google, Microsoft, IBM వంటి కంపెనీలు కుడా చేస్తున్నదే. ఈ సమస్యను అంత శులభం గా పరిష్కరించలేము. ఎందుకంటే పేరుకి ఒక కంపెనీ అమెరికన్ కంపెనీ అయినప్పటికీ, ఆ కంపెనీ కార్యకలాపాలు వివిధ దేశాలలో వుంటున్నాయి. విదేశి వ్వవహారాలు కు కూడా పన్ను విధించడం సరి కాదు. అందుకని కంపెనీలు ఎక్కడ పన్ను తక్కువ వుంటుందో అక్కడ బ్రాంచీలు ప్రారంభిస్తున్నాయి. దానికి బదులుగా ఆయా దేశాలలో ఉద్యోగ శాతం పెరుగు తుంది, అసలు ప్రాంతంలో ఉద్యోగ శాతం తగ్గుతుంది. ఇలా ఉద్యోగాల పేరుతో దేశాలను, రాష్ర్టాలనూ, కంపెనీలు బెదిరించడం లేక ఎర వేయడం కొత్త కాదు.

    దీనంతటకి మూలకారణం కంపెనీలు బాగా పెద్దవి అయిపోవడం. ఇలాంటి కంపెనీలు చాలా శులభంగా చట్టాలను తమకు అనువుగా మార్చివేసుకుంటాయి, అవసరమైతే ప్రభుత్వాలను కూడా బెదిరిస్తాయి.
    ఇది capitalism లో ఎప్పుడూ ఉండే side effect (అనుసంగ ప్రభావము).

  14. గౌతం గారూ, ప్రజలవైపు నుండి చూసినపుడు పన్నులు ఎగవేయడం, తప్పించుకోవడం రెండూ ఒకటే. టాక్స్ ఎవేషన్, టాక్స్ మేనేజ్ మెంట్, టాక్స్ ప్లానింగ్ ఇవన్నీ ఒకే పనిని వేరు వేరు కోణాల్లో చూపిస్తాయి తప్ప వేరు వేరు పనుల్ని చూపించవు.

    టాక్స్ ఎవేషన్ పరిధిలోకి ప్రధానంగా ప్రభుత్వ జీతగాళ్లే వస్తుంటారు. ఎందుకంటే వారికి ఉపయోగపడే చట్టాలు తెచ్చుకోవడం వారి వల్ల కాదు. కొన్ని చట్టాలు ఉన్నా వాటిని అమలు చేయించుకోవడానికి మళ్లీ తిప్పలు తప్పవు. రాజకీయ నాయకులు, బ్యూరోక్రాట్ అధికారులు అందరూ ధనికవర్గాల నుండి వచ్చేవారే. పేద వర్గాల నుండి వచ్చినా వారిని కూడా ధనికవర్గాలు తమలో కలిపేసుకుంటాయి. చివరికి జనం అధికారానికి దూరంగా ఉండిపోతున్నారు.

    కాకుల్ని కొట్టి గద్దలువేసే పనికి ఎన్ని పేర్లున్నా తేడా ఏముంటుంది గనక? ఫలితం ఒకటే అయినపుడు.

  15. విశేఖర్ గారూ,

    మీరు చెప్పింది సబబే.

    నా ఉద్దేశ్యం లో సామాన్య జనానికి అధికారం ఎప్పుడూ లేదు, ఇక ముందు ఉంటుందని నేను నమ్మను కుడా. మీరు ఏ పాలనా సిద్దాంతం చూసినా, వాటి ఆశయాలు గోప్పవి అయినా, అది అమలు చేశేది మనుష్యులు కాబట్టి, ఎదో రకంగా ఉన్నత వర్గం, సామాన్య వర్గం ఏర్పడతాయి. చివరికి ఉన్నత వర్గం, సామాన్య వర్గాన్ని ఎప్పుడూ దోపిడి చేస్తూనే ఉంటుంది.

    మనుష్యులు స్వార్దపరులు, బాగా డబ్బులు సంపాదించేసరికి, సామాజిక భాద్యత నుండి తప్పించుకునే మార్గాలు కోసం వెతుకుతుంటారు. ఆ కంపెనీలు నడిపేది కూడా మనుష్యులే కాబట్టి, అవి కూడా అంతే.

  16. The title of this post is so misguiding! I used to freelance for one of the Apple Blogs in NY for side income in 2010s. I never heard of this news later and all! The title is so misguiding and with so much surprise I read the post. Nothing! Nothing is in it!

    I take home loan so that I can pay less tax! I buy car in Goa or Pond’ry to avoid taxes etc. Govt. knows that! In fact, it had provided the way. It is not defaulting the taxes! Come on!

  17. Chandu, This is not my news. Just google for NYTimes’ news item, you may here what you never heard. You may also know how the title is so apt.

    You are just an individual, not a company like Apple. There is a lot of difference between a Global Multi-National Company and an individual.

    And if you have patience, read my answer to Goutam Meka and his response to it.

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

Connecting to %s