జాతీయం
సోనియా సభలో నల్లజెండా
కర్ణాటక పర్యటిస్తున్న సోనియా గాంధీకి ఒక మహిళ నల్ల జెండా చూపి కలకలం రేపింది. పోలీసులు ఆమె పైకి లంఘించి నోరు నొక్కి బైటికి వెళ్లగొట్టారు. తమ కమ్యూనిటీకి ఎస్.సి రిజర్వేషన్లు కల్పించాలని మహిళ డిమాండ్ చేసినట్లు ‘ది హిందూ’ తెలిపింది. కేవలం నల్ల జెండా చూపిస్తేనే మహిళ నోరు నోక్కే పోలీసు చట్టాలు ఏ ప్రజాస్వామ్యానికి ప్రతీకలో సోనియా గాంధీ చెప్పవలసి ఉంది. సిద్దగంగ మఠం వ్యవస్ధాపకుడి 105 వ జన్మ దినం సందర్భంగా సోనియా సమావేశం జరిపినట్లు తెలుస్తోంది. మహిళ మాదిగ దండోరా కు చెందిన వ్యక్తిగా పత్రికలు రాశాయి. మాదిగలకు ఇప్పటికే ఎస్.సి రిజర్వేషన్ కొనసాగుతుండగా కొత్తగా వారు కోరే రిజర్వేషన్ ఏమిటి? బహుశా ఎస్.సి రిజర్వేషన్ వర్గీకరణ డిమాండ్ మహిళ చేస్తుండవచ్చు.
అంతర్జాతీయం
పాక్ కి క్షమాపణ నిరాకరించిన అమెరికా, చర్చలు విఫలం
పాకిస్ధాన్, అమెరికాల మధ్య ప్రతిష్టంబన తొలగించడానికి జరుగుతున్న చర్చలు విఫలం అయ్యాయని ఇరు పక్షాలు తెలిపాయి. ఆఫ్ఘన్-పాక్ సరిహద్దు రక్షణలో ఉన్న 24 పాక్ సైనికులను గత నవంబరులో అమెరికా సైనికులు చంపేసినందుకు ‘క్షమాపణ’ చెప్పాలని పాక్ డిమాండ్ చేస్తోంది. కానీ అమెరికా అందుకు నిరాకరించింది. ఏప్రిల్ 15 వరకూ క్షమాపణలు చెప్పడానికి మార్గం కోసం అమెరికా అధికారులు ప్రయత్నించారనీ కానీ ఏప్రిల్ 15 తేదీన పాక్ మద్దతు ఉన్న హక్కానీ గ్రూపు మిలిటెంట్లు ఆఫ్ఘన్ రాజధాని కాబూల్ నడిబొడ్డున అత్యంత భారీ భద్రత ఉన్న డిప్లొమేటిక్ డిస్ట్రిక్ట్ లో బహుముఖ దాడికి పాల్పడ్డారు. పాక్ ప్రభుత్వమే ఈ దాడికి బాధ్యత వహించాలని అమెరికా భావిస్తోంది. హక్కానీ గ్రూపుపై తమకేమీ ఆధిపత్యం లేదని పాకిస్ధాన్ మొత్తుకుంటోంది. పాక్ సైనికులను చంపేశాక పాక్ నుండి ఆఫ్ఘన్ లోని నాటో బలగాలకు వెళ్ళే సరఫరాలన్నీ పాక్ సరిహద్దు గుండా వెళ్లవలసి ఉంది. ఈ మార్గాలను పాక్ ప్రభుత్వం మూసేసింది. మూసేసిన సరఫరా మార్గాలను తెరిపించడానికి అమెరికా చర్చలు మొదలు పెట్టగా, ముందు తమకు క్షమాపణలు చెప్పాలని పాక్ డిమాండ్ చేస్తోంది.
ఈజిప్టులో ఎంబసీ మూసేసిన సౌదీ అరేబియా
ఈజిప్టు ప్రధాన నగరాలు కైరో, అలెగ్జాండ్రియా ల్లోని తన ఎంబసీలను సౌదీ అరేబియా మూసేసి సిబ్బందిని వెనక్కి పిలిచింది. ఏప్రిల్ 24 తేదీన ఎంబసీల ముందు ఈజిప్టు ప్రజలు ప్రదర్శనలు నిర్వహించడమే సౌదీ చర్యకు కారణం. ఈజిప్టు కి చెందిన మానవ హక్కుల లాయర్ ‘మహమ్మద్ ఆల్-గిజావి జెడ్డా సందర్శించినపుడు ఏప్రిల్ 17 న సౌదీ అధికారులు అరెస్టు చేశారు. డ్రగ్స్ తో పట్టుబడ్డాడని సౌదీ అరేబియా చెప్పినప్పటికీ దానినేవరూ నమ్మలేదు. సౌదీ జైళ్ళలో ఉన్న ఈజిప్టు పౌరుల తరపున మాట్లాడడం, సౌదీ పాలకుల పైన విమర్శలు చేయడం సాకుగా చూపి గిజావి కి ఆయన పరోక్షంలో సౌదీ కోర్టు సంవత్సరం జైలు శిక్ష విధించింది. ఈ నేపధ్యంలోనే గిజావీని అరెస్టు చేసారు. గిజావి విడుదలను డిమాండు చేస్తూ ఏప్రిల్ 24 న వందలమంది ఈజిప్టు ప్రజలు నిరసన ప్రదర్శనలు నిర్వహించారు.
సరిహద్దు వివాదంలో సమితి జోక్యాన్ని తిరస్కరించిన సూడాన్
దక్షిణ సూడాన్ తో ఉన్న సరిహద్దు వివాదంలో ఐక్యరాజ్య సమితి జోక్యాన్ని సూడాన్ తిరస్కరించింది. తమ మధ్య తగవు ‘ఆఫ్రికన్ యూనియన్’ (ఎ.యు)వద్ద పరిష్కరించుకోగలమని సూడాన్ ప్రకటించింది. జులై 9, 2011 తేదీన దక్షిణ సూడాన్ సూడాన్ నుండి విడిపోయి వేరే స్వతంత్ర దేశంగా ఏర్పడింది. క్రైస్తవులు ఎక్కువగా ఉన్న సౌత్ సూడాన్ కు పశ్చిమ దేశాల మద్దతు ఉంది. గ్యాస్, ఆయిల్ నిల్వలు సమృద్ధిగా ఉన్న సౌత్ సూడాన్ ప్రత్యేక దేశంగా ఏర్పడడం వెనుక పశ్చిమ దేశాల ప్రయోజనాలు దాగి ఉన్నాయి. సూడాన్ పాలకులు పశ్చిమ దేశాల ప్రయోజనాలకు లొంగి ఉండడానికి తిరస్కరించడంతో ఐక్య సూడాన్ లో ప్రజల మధ్య తగువులు రెచ్చగొట్టబడి సంవత్సరాల తరబడి అంతర్యుద్ధం కొనసాగింది. చివరికి సమితి ఒప్పందం మేరకు ఫ్లెబిసైట్ నిర్వహించడం దేశాన్ని విడగొట్టడం జరిగిపోయింది. కొద్ది రోజుల క్రితం సౌత్ సూడాన్ సైన్యం సూడాన్ లోకి జొరబడి ఆయిల్ నిల్వలున్న పట్నం ‘హెగ్లిగ్’ స్వాధీనం చేసుకోవడంతో పాత సోదరుల మధ్య ఘర్షణలు తలెత్తాయి.