బుద్ధిలేనితనం, అత్యాశ, నిర్లక్ష్యం… ఇవే ఆర్ధిక సంక్షోభాలకు కారణం -గీధనర్


Geithnerబుద్ధిలేనితనం (stupidity), అత్యాశ (greed), నిర్లక్ష్యం (recklesness) వల్లనే ఆర్ధిక సంక్షోభాలు సంభవిస్తున్నాయని అమెరికా ట్రెజరీ సెక్రటరీ తిమోతి గీధనర్ స్పష్టం చేశాడు. ఆర్ధిక ప్రమాదాలను అవలీలగా తీసుకోవడం తగదని హెచ్చరించాడు. మోసాలనూ, చట్టాల దుర్వినియోగాన్నీ అడ్డుకోవడానికి కఠినమైన చట్టాలు తప్పనిసరని గీధనర్ నొక్కి చెప్పాడు. పోర్ట్ లాండ్ సిటీ క్లబ్ లో జరిగిన సమావేశంలో మాట్లాడుతూ గీధనర్ బుధవారం ఈ మాటలన్నాడు.

వాల్ స్ట్రీట్ లోని బడా బడా ద్రవ్య కంపెనీలు లాభాల పేరాశతో ప్రమాదకరమైన ఫైనాన్షియల్ ఉపకరణాలు తయారు చేసి వాటిపై ట్రిలియన్ల కొద్దీ వ్యాపారాలు చేశాయి. అనేకమంది కస్టమర్లకు తిరిగి చెల్లించగలరా లేదా అన్నది చూడకుండా హోసింగ్ లోన్లు, క్రెడిట్ కార్డు లోన్లు, పర్సనల్ లోన్లు కుప్పలు తెప్పలుగా మంజూరు చేసి వాటి ఆధారంగా సి.డి.ఒ (కోలేటరల్ డెబ్ట్ ఆప్షన్స్), సి.డి.ఎస్ (క్రెడిట్ డీఫాల్ట్ స్వాప్) లాంటి సంక్లిష్టమయిన ద్రవ్య సాధనాలు తయారు చేశారు. అటువంటి సాధనాలకు క్రెడిట్ రేటింగ్ సంస్ధల చేత టాప్ రేటింగ్స్ ఇప్పించుకుని అమ్మేశారు. టాప్ రేటింగ్స్ ని నమ్మి ప్రపంచ వ్యాపితంగా అనేక కంపెనీలు, బ్యాంకులు, ఇన్సూరెన్స్ కంపెనీలు, మూచూవల్ ఫండ్లు, హెడ్జ్ ఫండ్లు పెద్ద మొత్తాల్లో వాటిలో పెట్టుబడులు పెట్టారు.

వీరందరికీ హౌసింగ్ లోన్లు, క్రెడిట్ కార్డు లోన్లు తదితర లోన్లు తీసుకున్న కష్టమర్లు తిరిగి చెల్లిస్తేనే లాభాలు. అనేకమంది కష్టమర్లు చెల్లించలేక పోవడంతో ఈ కంపెనీలన్నీ నష్టపోయి ప్రపంచ ద్రవ్య సంక్షోభానికి దారి తీసింది. మరి కొద్ది రోజుల్లోనే అది ప్రపంచ ఆర్ధిక సంక్షోభంగా మారిపోయింది. 2008 ప్రపంచ ఆర్ధిక సంక్షోభం అనంతరం బడా పెట్టుబడిదారీ కంపెనీలు పాల్పడుతున్న మోసాలు అరికట్టడానికి చట్టాలు తెస్తామని అమెరికా, యూరప్ దేశాలు అనేక అంతర్జాతీయ వేదికలపై హామీలు గుప్పించారు. అవేవీ ఆచరణకు నోచుకోలేదు. గీధనర్, బెన్ బెర్నాంక్, చివరికి ఒబామా సైతం బడా కంపెనీలకు ముకుతాడు వేయలేక చేతులు ముడుచుకున్నారు.

యూరో జోన్ లో ఉన్న ద్రవ్య (ఋణ) సంక్షోభం, ఇరాన్ అణు కార్యక్రమంపై పశ్చిమ దేశాలకు ఉన్న విబేధాలు… ఈ రెండు అంశాలు అమెరికా ఆర్ధిక వ్యవస్ధను క్రుంగదీస్తున్నాయని కూడా గీధనర్ చెప్పాడు. జులై నుండి ఇరాన్ దేశంపై అదనపు ఆంక్షలు విధిస్తున్నట్లు అమెరికా, యూరోపియన్ యూనియన్ లు ప్రకటించడంతో ఆ దేశాలకు చేస్తున్న క్రూడాయిల్ ఎగుమతులను ఇరాన్ ముందుగానే రద్దు చేసింది. అమెరికా, యూరప్ ల ఆంక్షలు వాడేసిన రుమాలుతో సమానమని తీసి పారేసిన ఇరాన్ అధ్యక్షుడు ఆంక్షలు అమలులోకి రాకమునుపే క్రూడాయిల్ ఎగుమతులు రద్దు చేసి పశ్చిమ దేశాలకు సవాలు విసిరాడు. ఫలితంగా యూరప్ తో పాటు ప్రపంచవ్యాపితంగా ఆయిల్ రేట్లు పెరిగి యూరప్ ఋణ సంక్షోభాన్ని మరింత తీవ్రం చేసింది. ఈ ప్రభావం అమెరికా ఆర్ధిక వ్యవస్ధపై కూడా పడిందని గీధనర్ తేల్చి చెప్పాడు.

లండన్ లో బ్రెంట్ క్రూడాయిల్ జూన్ ఫ్యూచర్ ధరలు అధికంగా బ్యారేల్ కు 119.12 డాలర్లకు పెరిగి వణుకు పుట్టిస్తోంది. యూరప్ లో సంక్షోభం తీవ్ర స్దాయిలో దీర్ఘ కాలం పాటు కొనసాగక తప్పదని గీధనర్ తెలిపాడు. ఇరాన్ తో పశ్చిమ దేశాలు పెట్టుకున్న తగువు ఆయిల్ ధరలను పైపైకి నేడుతున్నదని ఆందోళన వ్యక్తం చేశాడు. 2009 నుండీ యూరప్ దేశాలను పీడిస్తున్న ఋణ సంక్షోభం ఇంగ్లాండు, స్పెయిన్ దేశాలను మరొకసారి మాంద్యం (రిసెషన్) లోకి నెట్టిన నేపధ్యంలో గీధనర్ వ్యాఖ్యలు ప్రాముఖ్యతను సంతరించుకున్నాయి.

ప్రమాదాన్ని గుర్తించిన యూరోప్ దేశాలు ఇరాన్ పై విధిస్తామని ప్రకటించిన ఆంక్షల విషయంలో పునరాలోచనలో పడినట్లు కనిపిస్తున్నది. ఇరాన్ ఆయిల్ దిగుమతులపై ఇప్పటికే నాలుగుసార్లు విధించిన ఆంక్షల వల్ల కలిగిన ప్రభావాలను ఏప్రిల్ నెలాఖరులోగా సమీక్షించాలని గడువు విధించుకున్నప్పటికీ దానినీ మరో నెలపాటు ఇ.యు వాయిదా వేసుకుందని ప్రెస్ టి.వి తెలిపింది. భవిష్యత్తులో యూరోపియన్ యూనియన్ సభ్య దేశాలు తీవ్ర ఆయిల్ సంక్షోభం ఎదుర్కోనున్నాయని పసిగట్టడంవల్లనే ఇ.యు తన సమీక్షను వాయిదా వేసుకుందని ఆ సంస్ధ తెలిపింది.

కొన్ని ఇ.యు దేశాలకు ఆయిల్ ఎగుమతులను నిషేధిస్తూ ఇరాన్ ప్రభుత్వం ఇటీవల కాలంలో నిర్ణయాలు తీసుకుంది. జనవరిలో ఇ.యు విధించిన మరో విడత ఆంక్షలకు ప్రతీకారంగా ఇరాన్ ఈ చర్యలు తీసుకుంది. ఇరాన్ అణు బాంబు తయారు చేయడానికి ప్రయత్నిస్తున్నదని ఆరోపిస్తూ అమెరికా, యూరప్ లు అనేక ఏళ్లుగా కాకి గోల చేస్తున్నాయి. పలుమార్లు ఐ.ఏ.ఇ.ఏ ఇన్ స్పెక్టర్లు ఇరాన్ అణు కర్మాగారాల్లో పరీక్షలు నిర్వహించినప్పటికీ యురేనియంను అణు బాంబు కోసం తరలించినట్లు సాక్ష్యాలేవీ దొరకలేదు. అయినా వారు కాకి గోల మానలేదు.

నిజానికి దేశ రక్షణ కోసం అణు బాంబుతో సహా ఏ ఆయుధాన్నయినా తయారు చేసుకునే హక్కు ఏ దేశానికయినా ఉంటుంది. కానీ అమెరికా, యూరప్ ల దృష్టిలో మధ్య ప్రాచ్యంలో తమ మిత్ర దేశం ఇజ్రాయెల్ కి తప్ప ఇంకేవ్వరికీ అణ్వాయుధాలు ఉండరాదు. ఇంధీరా గాంధీ నేతృత్వంలో భారత దేశం అణు బాంబు పరీక్ష జరిపినప్పుడు కూడా అమెరికా, యూరప్ లు ఇండియాపై ఆంక్షలు విధించాయి. అవి విధించిన ఆంక్షలు 2008 వరకూ కొనసాగాయి. అమెరికా తో అణు ఒప్పందం చేసుకున్నాక ఇండియా పై ఆంక్షలు ఎత్తివేసినట్లు ప్రకటించినప్పటికీ అదింకా ఆచరణ లోకి రాకపోవడం అసలు సంగతి.

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

గూగుల్ చిత్రం

You are commenting using your Google account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

Connecting to %s