బి.జె.పి మాజీ అధ్యక్షుడు బంగారు లక్ష్మణ్ ను అవినీతి కేసులో దోషిగా సి.బి.ఐ కోర్టు నిర్ధారించింది. తెహెల్కా పత్రిక నిర్వహించిన స్టింగ్ ఆపరేషన్ లో కంపెనీ ప్రతినిధులుగా నాటకమాడిన తెహెల్కా విలేఖరుల వద్ద నుండి లక్ష రూపాయల నోట్ల కట్లను తీసుకుంటూ బంగారు లక్ష్మణ్ వీడియో కెమెరాకు అడ్డంగా దొరికిపోయాడు. 2001 లో జరిగిన ఈ సంఘటనలోని వీడియో దేశ వ్యాపితంగా అన్నీ చానెళ్లలోనూ ప్రసారం అయింది. పార్టీ కోసం చందా తీసుకున్నానని లక్ష్మణ్ అప్పట్లో వివరణ ఇచ్చాడు.
సి.బి.ఐ కి చెందిన అడిషనల్ సెషన్స్ జడ్జి కన్వల్ జీత్ అరోరా బంగారు లక్ష్మణ్ పై నేరం రుజువయిందని తీర్పు చెప్పాడు. శిక్ష రేపు ఖరారు కానుంది. మాజీ కేంద్ర మంత్రి కూడా అయిన బంగారు లక్ష్మణ్ సంఘటన జరిగినపుడు భారతీయ జనతా పార్టీ అధ్యక్షుడుగా కొనసాగుతున్నాడు. తెహెల్కా లో వార్తా కధనం ప్రచురితమయిన రెండవ రోజే లక్ష్మణ్ బి.జె.పి పదవికి రాజీనామా చేశాడు.
తీర్పు అనంతరం 72 సంవత్సరాల లక్ష్మణ్ ను తీహారు జైలుకి తరలించారు. బెయిలిమ్మని కోరినప్పటికీ జడ్జి ఇవ్వలేదు. శిక్ష ప్రకటించాకే బెయిల్ విషయం చూస్తానని తెలిపాడు. శనివారం ఉదయం 10.30 కల్లా కోర్టుకి హాజరుపరిస్తే శిక్ష ప్రకటిస్తానని ఆయన తెలిపాడు. దోషి బోనులో నిలబడి ఉన్న లక్ష్మణ్ తీర్పు విని షాక్ కి గురయ్యాడని ‘ది హిందూ’ తెలిపింది. చాలా సేపు బోను లోనే నిలబడ్డాడని ఎవ్వరితో మాట్లాడడానికి ఇష్టపడలేదని ఆ పత్రిక తెలిపింది.
“బంగారు లక్ష్మణ్ కి వ్యతిరేకంగా లక్ష రూపాయల లంచం తీసుకున్న కేసు నిరూపించడంలో సి.బి.ఐ సఫలమయింది. సెక్షన్ 9 (పబ్లిక్ సర్వెంట్ తో గల వ్యక్తిగత సంబంధాన్ని వినియోగించి అవినీతికి పాల్పడడం) కింద అవినీతి నేరంలో నిందితుడు దోషిగా తేలాడు” అని జడ్జి తీర్పు ప్రకటించాడు.
తెహెల్కా స్టింగ్ ఆపరేషన్ 2001 లో జరిగింది. విలేఖరులు అసలు ఉనికిలోలేని ఇంగ్లాండు కంపెనీ ‘వెస్ట్ ఎండ్ ఇంటర్నేషనల్’ ఉద్యోగులుగా చెప్పుకుంటూ లక్ష్మణ్ ని దాదాపు ఎనిమిది సార్లు కలిశారని సి.బి.ఐ కోర్టుకి తెలిపింది. చేతితో పట్టుకునే ధర్మల్ ఇమేజర్స్ ను తమ కంపెనీ తయారు చేస్తుందనీ, భారత ఆర్మీ కోసం ఈ కెమెరాలను కొనవలసిందిగా తన పలుకుబడిని వినియోగించాలని విలేఖరులకు కోరగా లక్ష్మణ్ అంగీకరించాడు. ఆ మేరకు లక్ష రూపాయలను తీసుకుని టేబుల్ సొరుగులో వేసుకున్న దృశ్యం దేశ వ్యాపితంగా ప్రజలంతా చూశారు. అప్పట్లో అధికారంలో ఉన్న బి.జె.పి లక్ష్మణ్ ను అధ్యక్ష పదవి నుండి తప్పుకోవాలని కోరింది.
తెహెల్కా విలేఖరులు చెప్పిన కంపెనీ అసలు లేనే లేదు. వారు చెప్పిన ధర్మల్ ఇమేజర్లు కూడా ఊహాజనితమే. కంపెనీ ప్రతినిధులూ నిజం కాదు. అయినప్పటికీ అవినీతి ధనం కోసం అర్రులు చాస్తూ లక్ష్మణ్ డిసెంబర్ 2000, జనవరి 2001 మధ్య ఎనిమిది సార్లు వారిని కలిసిశాడని సి.బి.ఐ తెలిపింది. లక్ష్మణ్ వ్యక్తిగత కార్యదర్శి టి.సత్యమూర్తి ఈ కేసులో సహ నిందితుడు. అయితే ఆయన అప్రూవర్ గా మారడంతో ట్రయల్ కోర్ట్ ఆయనకి క్షమాభిక్ష ప్రసాదించింది.
బంగారు లక్ష్మణ్ దళితుడు కావడం, ఒక దళితుడు పైనే తప్ప మిగతా అవినీతి కేసులేవీ రుజువు కాకపోవడం, ఆగ్ర కులాల వారు పాల్పడిన భారీ అవినీతి కేసులన్నీ సంవత్సరాల తరబడి కోర్టుల్లో నాని నీరు గారి పోవడం ఒక చర్చగా ఉంది. భారత దేశంలో బలహీన వర్గాలకు చెందిన రాజకీయ నాయకులపై వివిధ కేసులు రుజువయినంత తేలికగా అగ్ర కులాల నాయకులపై రుజువు కాలేదన్నది కఠిన వాస్తవం. మధు కోడా, శిబూ షోరేన్ లాంటి వారంతా గిరిజన తెగలకు చెందిన రాజకీయ నాయకులు. భారత దేశ చట్టాలు పని చేస్తున్నాయనడానికి గుర్తుగా పాలకవర్గాలు చూపించేది వీరినే. రాజీవ్ గాంధీ అవినీతికి పాల్పడ్డట్టు ఆరోపణలు ఎదుర్కొన్న బోఫోర్స్ కేసు ఏమీ తేలకుండానే ముగిసిపోయింది. స్వీడన్ కి చెందిన మాజీ పోలీసు అధికారి బోఫోర్స్ కేసులో విచారణ సరిగ్గా జరగకుండా రాజీవ్ అడ్డుపడ్డాడని ఇటీవల వెల్లడించాడు. దాన్ని బట్టే చట్టాలు అగ్రవర్ణాల నాయకుల అవినీతికి వచ్చేసరికి చేష్టలుడుగుతాయని అర్ధం అవుతోంది.
లక్ష కోట్లు అక్రమంగా సంపాదించాడని ఆరోపణలు ఎదుర్కొంటున్న ‘జగన్ అవినీతి’ కేసులో ప్రధాన ముద్దాయి అరెస్టు కాకుండానే రెండో ముద్దాయి జైలులో కొనసాగుతున్నాడు. ప్రధాన ముద్దాయి ఓదార్పు అంటూ జనాన్ని మోసగించడం కొనసాగుతోంది. భారత దేశ ప్రజాస్వామ్యానికి పట్టుగొమ్మగా చెప్పుకునే ఎన్నికలు ధన బలం ముందు దిగదుడుపేనని ఉప ఎన్నికల్లో వై.ఎస్.ఆర్ కాంగ్రెస్ అభ్యర్ధుల విజయం, జగన్ సంపాదించిన ఐదు లక్షల పై చిలుకు మెజారిటీ చెప్పకనే చెపుతున్నాయి. భారత దేశంలో ఉందని చెబుతున్న అతి పెద్ద ప్రజాస్వామ్యం నిజానికి ఎక్కడ ఉన్నట్లు?
సంపన్నుల చేతుల్లో మైమరచి నిద్రిస్తున్న యవ్వనం నీది
ఊసినా దుమ్మెత్తి పోసినా చలనం లేని మైకం నీది
కోతకొచ్చిన చేనులో కలుగులు తవ్వుతున్న
ఎలకల్నీ పందికొక్కుల్నీ భరిస్తూ నించున్న “భారతి” వమ్మా
నోటికందని సస్యశ్యామల సీమవమ్మా
అన్న ప్రఖ్యాత కవి చెరబండారాజు వాక్కులే ఆ ప్రశ్నకు సమాధానం కాదా?
అయితే బంగారు లక్ష్మణ్ ను దళితుడిగా కంటే భారత దేశ పాలకవర్గాలకు ప్రతినిధిగా చూడడమే సరైనది. అన్నా హజారే అవినీతి వ్యతిరేక ఉద్యమానికి క్రియా శీలక మద్దతు ప్రకటించిన హిందూ మతోన్మాద శక్తుల రాజకీయ ప్రతినిధులు ‘పులుకడిగిన ముత్యాలు’ కాదని ఈ సందర్భంగా గుర్తించవలసి ఉంది. కాంగ్రెస్ పరువు ప్రతిష్టలు భంగం కావించి తద్వారా తలెత్తే కాంగ్రెస్ వ్యతిరేకత నుండి లబ్ది పొందుదామన్న స్వార్ధ ప్రయోజనమే తప్ప భారతీయ జనతా పార్టీ కానీ, దాని అనుబంధ సంస్ధలు కానీ భారత ప్రజల ప్రయోజనాలకు కట్టుబడి ఉన్నవి కావని అర్ధం చేసుకోవలసి ఉంది.