‘డబుల్ డిప్ రిసెషన్’ లో ఇంగ్లండ్


UK sinks into double-dip recessionఇంగ్లండ్ ‘డబుల్ డీప్ రిసెషన్’ లోకి జారుకుంది. 2012 లో మొదటి క్వార్టర్ (జనవరి, ఫిబ్రవరి, మార్చి) లో బ్రిటన్ జి.డి.పి (గ్రాస్ డోమెస్టిక్ ప్రోడక్ట్) 0.2 శాతం మేరకు కుదించుకుపోయింది. అంటే జి.డి.పి వృద్ధి చెందడానికి బదులు తగ్గిపోయింది. 2011 చివరి క్వార్టర్ లో (అక్టోబరు, నవంబరు, డిసెంబరు) ఇంగ్లండ్ జి.డి.పి 0.3 శాతం క్షీణించింది. వరుసగా రెండు క్వార్టర్ల పాటు నెగిటివ్ జి.డి.పి వృద్ధి నమోదయితే ఆ దేశం మాంద్యం (రిసెషన్) లో ఉన్నట్లు పరిగణిస్తారు. 2009 లో సంభవించిన తీవ్ర మాంద్యం నుండి కోలుకోకుండానే మరొకసారి మాంద్యంలోకి జారుకోవడంతో బ్రిటన్ అధికారికంగా ‘డబుల్ డీప్ రిసెషన్’ కి గురయినట్లయింది. మాంద్యం నుండి కోలుకోకుండానే దేశ ఆర్ధిక వ్య్వస్ధ మళ్ళీ మరొక మాంద్యం ఎదుర్కొన్నట్లయితే దానిని ‘డబుల్ డిప్ రిసెషన్’ గా పిలుస్తారు.

నిర్మాణ రంగంలో ఉత్పత్తి అత్యధిక స్ధాయిలో 3 శాతం క్షీణించడంతో ఆర్ధిక వ్యవస్ధ వృద్ధిపై ప్రతికూల ప్రభావం పడిందని ఇంగ్లండ్ తెలిపింది. పారిశ్రామిక ఉత్పత్తి 0.4 శాతం మేరకు క్షీణించగా సర్వీసుల రంగం 0.1 శాతం పడిపోయిందని ‘ఆఫీస్ ఆఫ్ నేషనల్ స్టాటిస్టిక్స్’ (ఒ.ఎన్.ఎస్) ని ఉటంకిస్తూ బి.బి.సి తెలిపింది. మొదటి క్వార్టర్ లో బ్రిటన్ ఆర్ధిక వ్యవస్ధ 0.1 శాతం వృద్ధి చెందుతుందని అంచనా వేయగా వాస్తవం పూర్తిగా తల్లకిందులయిందని రాయిటర్స్ తెలిపింది. 1970 తర్వాత బ్రిటన్ ‘డబుల్ డీప్ రిసెషన్’ లోకి జారుకోవడం ఇదే మొదటిదారని బ్లూమ్ బర్గ్ పత్రిక తెలిపింది.

యూరప్ వ్యాపితంగా ప్రభుత్వాలు అనుసరిస్తున్న ప్రజా వ్యతిరేక ‘పొదుపు విధానాలు’, ప్రభుత్వ రంగం కుదింపు అక్కడి ఆర్ధిక వ్యవస్ధలు క్షీణించడానికి ప్రధాన కారణంగా ఉన్నాయి. పొదుపు విధానాల (austerity measures) పేరుతో కార్మికులు, ఉద్యోగుల వేతనాలు, పెన్షన్లు, సంక్షేమ సదుపాయాలను కోత కోయడమో, రద్దు చేయడమో చేస్తుండడంతో వారి కొనుగోలు శక్తి క్షీణించి మిగులు ఉత్పత్తి సంక్షోభం తలెత్తుతోంది. పర్యవసానంగా కంపెనీలు ఉత్పత్తిని తగ్గించుకుంటున్నాయి.

ప్రభుత్వ రంగంలో పెట్టుబడులు పడిపోవడంతోనే ఆర్ధిక వృద్ధి తీవ్రంగా పడిపోయిందని ఒ.ఎన్.ఎస్ చెప్పిన విషయాన్ని గమనిస్తే పొదుపు విధానాల ప్రభావాన్ని అర్ధం చేసుకోవచ్చు. నిర్మాణ రంగంలో ప్రభుత్వ పెట్టుబడులు తీవ్రంగా పడిపోయాయని అందువల్లనే నిర్మాణ రంగం లో వృద్ధి క్షీణత కూడా తీవ్రంగా ఉండని ఒ.ఎన్.ఎస్ తెలిపింది. నిర్మాణ రంగంలోనే కాక పారిశ్రామిక రంగంలోనూ, ద్రవ్య సర్వీసుల (బ్యాంకింగ్, ఇన్సూరెన్స్ మొ.వి) రంగంలోనూ కంపెనీలు లక్షల ఉద్యోగాలను రద్దు చేశాయి. కొన్ని ఉద్యోగాలను విదేశాలకు తరలించాయి. వేతనాలలో కోత పెట్టాయి. రిటైర్ మెంట్ వయసు పెంచి రిక్రూట్ మెంట్ ని మరింత తగ్గించాయి. మార్చి నాటికి బ్రిటన్ నిరుద్యోగం 8.3 శాతంగా నమోదయింది. ప్రతికూల పరిస్ధుతుల్లో ప్రజలకు ఆర్ధిక వ్యవస్ధపై నమ్మకం లేక భవిష్యత్తు అవసరాల కోసం ఖర్చులు మాని దాచుకోవడం పెరిగింది. ఫలితంగా సరుకుల్ని కొనేవారే లేకుండా పోయారు.

2012 లో బ్రిటన్ ఆర్ధిక వ్యవస్ధ 0.2 శాతం వృద్ధి నమోదు చేయవచ్చని ప్రభుత్వం చెబుతుండగా ఆర్ధిక నిపుణులు, విశ్లేషకులు ఆ అంచనాను అంగీకరించడం లేదు. 2012లో కనీసం 0.5 శాతం మేర బ్రిటన్ జి.డి.పి క్షీణిస్తుందని వారు అంచనా వేస్తున్నారు. బ్రిటన్ ఆర్ధిక పరిస్ధితికి పాలక కూటములు రెండూ బాధ్యులే కాగా ఇరు కూటములూ ఒకరిపై ఒకరు దొమ్మెత్తి పోసుకుంటున్నాయి. ఆర్ధిక విపరిణామాలకు మీరంటే మీరే కారణమని ఆరోపించుకుంటున్నాయి.

304లేబర్ పార్టీ నేతృత్వంలోని గత ప్రభుత్వంలో బ్రిటన్ ఆర్ధిక వ్యవస్ధ వరుసగా 18 నెలల పాటు (2009 డిసెంబరు వరకు) మాంధ్యంలో కూరుకుపోయింది. మితవాద కూటమి ప్రభుత్వం చేజిక్కుంచుకున్నాక 2010 నాలుగవ క్వార్టర్ లో బ్రిటన్ జి.డి.పి 0.5 శాతం క్షీణించగా, రెండవ క్వార్టర్ లో 0.1 శాతం క్షీణించింది. ఇప్పుడు ఏకంగా రిసెషన్ నే బ్రిటన్ ఎదుర్కొంటోంది. రెండు కూటములూ అవే ఆర్ధిక విధానాలను అమలు చేసినప్పటికీ ఆర్ధిక క్షీణతకు ఒకరిని మరొకరు కారణంగా ఎంచుతున్నారు. ఈ పరస్పర ఆరోపణలు అసలు కారణాల నుండి ప్రజల దృష్టి మళ్లించడానికే.

ఆర్ధిక వ్యవస్ధ కుచించుకుపోయినప్పటికీ దానిని కూడా కంపెనీల ప్రయోజనాలకే వినియోగిస్తున్నాయి. ఆర్ధిక పరిస్ధుతులు బాగాలేవని చెప్పి ప్రజల ఆర్ధిక మూలాలపై మరిన్ని దాడులు చేయడానికి దానిని ఆయుధంగా వినియోగిస్తున్నాయి. జి.డి.పి వృద్ధి సున్నాకి ఎగువన ఉన్నా, దిగువన ఉన్నా ప్రజల ఆర్ధిక పరిస్ధుతులు మాత్రం ఎప్పుడూ దిగువనే కొనసాగుతున్నాయి.

“వినియోగదారులు తమ బడ్జెట్లను సమతూకపరుచుకోవడానికి నానా తంటాలు పడుతున్నారు. నిజవేతనాలు మళ్ళీ పెరిగితే తప్ప జి.డి.పి వృద్ధి వాస్తవ అర్ధంలో పెరగడం ప్రారంభం కాదు. గత నెలలో ద్రవ్యోల్బణం పెరగడాన్ని బట్టి వేతనాలలో ఖర్చు చేయగల భాగం మరింత పడిపోతుందని అర్ధమవుతోంది” అని ‘బ్రిటిష్ రిటైల్ కన్సార్టీయమ్’ సంస్ధ బ్రిటన్ మాంద్యంపై వ్యాఖ్యానించింది.

“కుటుంబాల వినియోగం తీవ్రంగా పడిపోవడం, వ్యాపార పెట్టుబడులు క్షీణించడమే (ఈ అంకెల) అంతరార్ధం. కరెన్సీ బలంగా ఉండడం వల్ల ఎగుమతులు పడిపోతున్నాయి. యూరోజోన్ సంక్షోభం అనివార్యంగా విస్తృతం అవుతున్న పరిస్ధితి ఎలానూ ఉంది. ఇక (పడిపోయిన) ప్రభుత్వ ఖర్చు ఆర్ధిక కార్యకలాపాలను భారంగా ఈడుస్తున్నాయి” అని’ ఎకనమిస్ట్ ఇంటలిజెన్స్ యూనిట్ సంస్ధను ఉటంకిస్తూ బి.బి.సి తెలిపింది.

యూరప్ దేశాలు అమలు చేస్తున్న ‘పొదుపు విధానాల’ లో ముఖ్యమయినది ప్రభుత్వ ఖర్చులలో తీవ్రంగా కోత పెట్టడం. “ఇదేమీ ఆశ్చర్యం కాదు. నిర్మాణ రంగంలో ఇంకా 45,000 ఉద్యోగాలు ప్రమాదంలో ఉన్నాయి. ప్రభుత్వ ఖర్చు దారుణంగా పడిపోయింది. గృహ నిర్మాణ రంగంలో ప్రభుత్వ ఖర్చు 25 శాతం పడిపోయింది. గృహేతర నిర్మాణ రంగంలో 24 శాతం కోత పెట్టారు. 2013 లో మరో పది శాతం కోత పెట్టనున్నారు. ఈ కోతలు నిర్మాణ రంగంలో ఈ కోతలు పెద్ద రంధ్రాన్ని మిగిలిచాయి. వీటిని పూడ్చడం ఇప్పటిలో వీలు కాదు. యు.కె ఆర్ధిక వ్యవస్ధ ఆరోగ్యానికి నిర్మాణ రంగం మౌలికమైనది” అని ‘కన్స్ ట్రక్షన్ స్కిల్స్’ సంస్ధ ని ఉటంకిస్తూ బి.బి.సి తెలిపింది.

పెట్టుబడిదారుల సంఘాలు మాత్రం ఈ సందర్భంగా వ్యాపారుల, కంపెనీల నమ్మకం పడిపోకుండా జాగ్రత్త వహించాలని చెబుతున్నాయి తప్ప ప్రజల నమ్మకం పెంచాలనీ, వేతనాల పెంపుడలే వారి నమ్మకాన్ని పెంచుతుందన్న వాస్తవాన్ని గుర్తించ నిరాకరిస్తున్నాయి.

2 thoughts on “‘డబుల్ డిప్ రిసెషన్’ లో ఇంగ్లండ్

  1. మీరు రాసిన చివరి వాక్యం తో నేను విభేదిస్తాను. వేతనాల పెంపుదలతో నమ్మకాన్ని పెంచెయ్యలేరు. నిజానికి ఇపుడు కావలసింది ఉత్పత్తి పెంచడం ఖర్చులు అదుపులో ఉంచుకోవటం. అది వ్యక్తులు, సంస్థలు ప్రభుత్వాలు అన్నీ చేయాల్సిన పని. ఎందుకంటే ఈ సంక్షోభానికి కారణం కేవలం ఏ ఒక్కరో కారు, అందరూనూ. మీరు బ్రిటన్ వెల్లి చూస్తే తెలుస్తుంది అక్కడి ప్రజల పని తనం లో improvement కి ఎంత scope ఉందో

  2. మీకింతకుముందు చెప్పినట్లు గుర్తు. వాక్యాలని విడదీసి చూస్తే డిస్టార్టెడ్ అర్ధాలు తీయడానికి ఆస్కారం ఉంటుంది. మళ్ళీ ఒకసారి ఆర్టికల్ చదవండి. అందులో అంశాలకీ చివరి వాక్యానికి ఉన్న సంబంధాన్ని గుర్తించండి.

    ఉత్పత్తి అవసరమైన దాని కంటే ఎక్కువవే ఉంది. ఒక్క ఇంగ్లండ్ కే కాకుండా ఇతర దేశాలకి ఎగుమతులు చేసి సంపాదించుకోగలిగినంత ఉంది. వాటిని కొనవలసిన వినియోగదారుల వద్ద సరిపోయినంత లేదు. దానికి కారణాలు వివరించాను. ఆర్ధిక వ్యవస్ధ పెట్టుబడిదారీ కంపెనీలు, వారి సేవకుల చేతుల్లో ఉంది. దాని నిర్వహణలో ప్రజల పాత్ర లేదు. అందువలన బాధ్యతని ప్రజల నెత్తిన వేయడానికి వీల్లేదు. కార్మికుల వేతనాల్లో కోత పెట్టేవారు సి.ఇ.ఒ ల బోనస్ లు ఎందుకు తగ్గించుకోరు? విలాసాలు ఎందుకు తగ్గించుకోరు? పన్నుల రాయితీలు ఎందుకు కొనసాగుతున్నాయి. పెట్టుబడిదారులకి సబ్సిడీలు ఎందుకు కొనసాగుతున్నాయి? ఇవన్నీ ఆలోచించండి. అప్పుడు ఎవరి బాధ్యత ఎంతో తెలుస్తుంది. నా ఆర్టికల్స్ లో అనేకసార్లు ఈ అంశాలు ప్రస్తావించాను. వాటిని పరిగణనలోకి తీసుకుంటూ ఆలోచించండి. నా చివరి వాక్యం ఇంకా బాగా అర్ధం అవుతుంది.

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

గూగుల్ చిత్రం

You are commenting using your Google account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

Connecting to %s