జాతీయం
మరోసారి రంగం మీదికి బోఫోర్స్
బోఫోర్స్ మరోసారి పతాక శీర్షికలకు ఎక్కింది. బోఫోర్స్ కుంభ కోణం బయటపడ్డ రోజుల్లో స్వీడన్ లో విచారణ నిర్వచించిన పోలీసు అధికారి తాజాగా సరికొత్త ఆరోపణలతో నోరు విప్పడంతో మంత్రులు, ప్రతిపక్షాలు వాదోపవాదాలు ప్రారంభించారు. బోఫోర్స్ కుంభకోణంపై జరిగిన విచారణను అడ్డుకోవడంలో అప్పటి ప్రధాని రాజీవ్ గాంధీ సఫలమైనాడని స్వీడన్ పోలీసు అధికారి స్టెన్ లిండ్ స్ట్రామ్ ప్రకటించి సంచలనం సృష్టించాడు. గాంధీల పాత్ర గురించి సాక్ష్యాలు లేవుగానీ రాజీవ్, సోనియా గాంధీలు బోఫోర్స్ అధిపతి ఖత్రోచీ కి సన్నిహతులని మాజీ సి.బి.ఐ అధిపతి జోగీందర్ ఫస్ట్ పోస్ట్ పత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో వెల్లడించడం తాజా సంచలనానికి కొసమెరుపు. ఖత్రోచీ ఇంటిలో సోనియా అనేకసార్లు బస చేసిందని సింగ్ వెల్లడించాడు. బోఫోర్స్ కేసు ముగిసిందనీ, దాన్ని తిరిగి తెరిచేది లేదనీ మంత్రి సల్మాన్ ఖుర్షీద్ ప్రకటించాడు. కుంభకోణంలో అమితాబ్ పాత్ర లేదని స్టెన్ ముక్తాయించాడు. బోఫోర్స్ కుంభకోణాన్ని మొట్టమొదట బద్దలు కొట్టిన ‘ది హిందూ’ విలేఖరి చిత్రా సుబ్రమణ్యం కు సమాచారం అందించింది తానేనని స్టెన్ అంగీకరించడం విశేషం.
అంతర్జాతీయం
ఇజ్రాయెల్ సెటిల్ మెంట్లు చట్ట వ్యతిరేకం –సమితి
ఇజ్రాయెల్ ప్రభుత్వం మరో మూడు అక్రమ సెటిల్ మెంట్లను ఆమోదించడాన్ని ఐక్యరాజ్యసమితి సెక్రటరీ జనరల్ ‘బాన్ కి మూన్’ తీవ్రంగా విమర్శించాడు. ‘ఇజ్రాయెల్ సెటిల్ సెటిల్ మెంట్లన్నీ అంతర్జాతీయ చట్టాలకు వ్యతిరేకమే” అని ఆయన అన్నాడు. ఇజ్రాయెల్ చర్య తనను తీవ్రంగా బాధించిందన్నాడు (ప్రెస్ టి.వి). ఇజ్రాయెల్, తాను దురాక్రమించిన పాలస్తీనా భూభాగాలపై వందకు పైగా అక్రమ సెటిల్ మెంట్లను నిర్మించింది. అందులో 5 లక్షల యూదులు అక్రమంగా నివసిస్తున్నారు. అవన్నీ పాలస్తీనీయును బలవంతంగా తరిమి కొట్టి, వారి ఇళ్లను కూలగొట్టి నిర్మించినవే. ఆక్రమిత వెస్ట్ బ్యాంక్ లోనూ, తూర్పు జెరూసలేం లోనూ ఇజ్రాయెలీయుల కోసం సెటిల్ మెంట్లు నిర్మించడాన్ని ఐక్యరాజ్య సమితి చట్టాలు నిషేదించాయి. తాను చేసే అడ్డమైన పనులన్నింటికీ సమితి చట్టాలను అడ్డు పెట్టుకునే అమెరికా, సమితి చట్టాలను ఇజ్రాయెల్ అడ్డంగా ఉల్లంఘిస్తున్నప్పటికీ నోరు మెదపదు.
అమెరికాలో మళ్ళీ ‘మేడ్ కౌ’ జబ్బు
అమెరికాలోని కాలిఫోర్నియా రాష్ట్రంలో ‘మేడ్ కౌ’ జబ్బుని గుర్తించారు. ‘బొవైన్ స్పాంజిఫామ్ ఎన్సెఫలోపతి’ (బి.ఎస్.ఇ) గా పిలిచే ఈ జబ్బు పశువుల మాంసం ద్వారా మనుషులకు వ్యాపించే ప్రాణాంతక వ్యాధి. ఈ వార్త వెలువడ్డాక దక్షిణ కొరియాలో రెండు రిటైల్ కంపెనీలు అమెరికా నుండి దిగుమతి చేసుకున్న ‘బీఫ్’ మాంసాన్ని తమ స్టోర్ల నుండి తొలగిస్తున్నట్లు ప్రకటించాయి. అమెరికా బీఫ్ మాంసంపై తనిఖీలు పెంచుతున్నామని ద.కొరియా ప్రభుత్వం ప్రకటించింది. వ్యాధి సోకిన పశువును మాంసం కబేళాలకు తరలించలేదని కనుక భయపడనవసరం లేదని అమెరికా ప్రభుత్వం చెబుతున్నప్పటికీ వ్యాధి క్రిములు ఇంకెన్ని పశువులకు సోకాయో తెలియదని వ్యవసాయ అధికారులు ప్రవేటు సంభాషణాల్లో చెబుతున్నారు (సి.ఎన్.ఎన్). మేడ్ కౌ జబ్బు బారిన పడినవారు మానసిక సమస్యలకు లోనవుతారు. ప్రవర్తనా లోపంతో బాధపడతారు. కదలికలో సమస్యలు ఎదుర్కొంటారు. జ్ఞాపక శక్తిలో సమస్యలు ఎదుర్కొంటారు. అంతిమంగా మరణిస్తారు. వ్యాధి సోకిన పశువుల మాంసంతో పాటు, మాంసపు ఉత్పత్తులు ఏవి తిన్నా బి.ఎస్.ఇ వ్యాధికి గురవుతారు.
ఆఫ్ఘనిస్ధాన్ లో మరో నలుగురు నాటో సైనికుల మృతి
ఆఫ్ఘనిస్ధాన్ దురాక్రమణ యుద్ధంలో మరో నలుగురు నాటో సైనికులు మృతి చెందారు. గత 24 గంటలలో మరణించిన నలుగురు నాటో సైనికులు ఏ దేశానికి చెందినవారో వెల్లడికాలేదు. ఇద్దరు విదేశీ నాటో సైనికులు చనిపోయారని నాటో ప్రకటన తెలుపగా, తూర్పు, దక్షిణ ఆఫ్ఘనిస్ధాన్ లలో మరో ఇదరు చనిపోయారని ప్రెస్ టి.వి తెలిపింది. అయితే హెల్మాండ్ రాష్ట్రంలో తమ సైనికుడొకరు చనిపోయాడని జార్జియా ప్రకటించింది. తూర్పు ప్రాంతంలో ఉన్న సైనికులు అధికంగా అమెరికన్లే నని తెలుస్తోంది. ఆఫ్ఘన్ దురాక్రమణ మరణాలను లెక్కించే icasualities.org వెబ్ సైట్ ప్రకారం 2012 లో ఇప్పటివరకు 123 మంది నాటో బలగాలు మృతి చెందారు.