ఇరాన్ అణు బాంబు నిర్మిస్తుందని తాను భావించడం లేదని ఇజ్రాయెల్ ‘చీఫ్ ఆఫ్ స్టాఫ్’ లెఫ్టినెంట్ జనరల్ బెన్నీ గాంట్జ్ కుండ బద్దలు కొట్టాడు. ఇరాన్ రహస్యంగా అణు బాంబులు నిర్మిస్తోందనీ, ఇరాన్ అణు బాంబులు ప్రపంచ శాంతికి ప్రమాదకరమనీ అమెరికా, యూరప్, ఇజ్రాయెల్ లు ఓ పక్కన చెవి కోసిన మేకల్లా అరుస్తూ, ఇరాన్ పై అక్రమ యుద్ధానికి సైతం తెగబడుతున్న నేపధ్యంలో ఇజ్రాయెల్ సైన్యాధిపతి వ్యాఖ్యలు ప్రాధాన్యతను సంతరించుకున్నాయి.
మధ్య ప్రాచ్యం (Middle East) లో 300 పైగా అణు బాంబులతో (బి.బి.సి) ఏకైక అణ్వస్త్ర దేశంగా ఉన్న ఇజ్రాయెల్, అసలే లేని ఇరాన్ అణు బాంబులు ప్రపంచశాంతికి ప్రమాదమని చెప్పడం, ఆ మాటలు పట్టుకుని ఇరాన్ అణు ప్రమాదాన్ని నివారించడానికి అమెరికా, ఫ్రాన్సు, బ్రిటన్ దేశాలు యుద్ధ భేరీలు మోగిస్తుండడం వర్తమాన ప్రపంచ రాజకీయాల్లో అతి పెద్ద ఫార్సు. గోబెల్ ను తలదన్నే ఇజ్రాయెల్ అబద్ధాలను పశ్చిమ దేశాల పత్రికలు నెత్తికెత్తుకుని అదే పనిగా ప్రచారం చేయడం ప్రజాస్వామ్య వ్యవస్ధలకు ‘ఫోర్త్ ఎస్టేట్’ గా పరిగణించే పత్రికా విలువలకు అతి పెద్ద అభాస. అయినా ఈ ఘోరాలు నిర్విఘ్నంగా సాగిపోతూనే ఉన్నాయి.
ఇజ్రాయెలీ దిన పత్రిక ‘హారెట్జ్’ కు ఇంటార్వ్యూ ఇస్తూ ఇజ్రాయెల్ చీఫ్ ఆఫ్ స్టాఫ్ బెన్నీ గాంట్జ్ ఇరాన్ అణు బాంబు నిర్మిస్తోదనడాన్ని కొట్టి పారేశాడు. ఇరాన్ నాయకత్వం ‘అత్యంత వివేకవంతమైనదని’ ఆయన సర్టిఫికేట్ కూడా ఇచ్చాడు. ఇరాన్ అణుబాంబులు నిర్మించడం లేదనీ, అమెరికా, ఫ్రాన్సు, బ్రిటన్, ఇజ్రాయెల్ లాంటి ధూర్త రాజ్యాలు చెబుతున్నవన్నీ అబద్ధాలేననీ వెల్లడి కావడం ఇదే మొదటి సారి కాదు. ఇరాన్ దేశం అణుబాంబులు నిర్మించే ఉద్దేశ్యంలో లేదని అమెరికాకి చెందిన 16 గూఢచార సంస్ధలు గత ఫిబ్రవరి లో ‘అత్యంత రహస్యం’ గా భావిస్తున్న నివేదికలో వెల్లడించాయని పత్రికలు తెలిపాయి. ‘లాస్ ఏంజిలిస్ టైమ్స్’ పత్రిక ఫిబ్రవరి 23 తేదీన ప్రచురించిన ఈ నివేదికను గత సంవత్సరం ప్రారంభంలో అమెరికా చట్ట సభల సభ్యులకు పంపిణీ చేశారని ఎల్.ఏ.టైమ్స్ తెలిపింది.
‘అంతర్జాతీయ అణు శక్తి సంస్ధ’ (ఇంటర్నేషనల్ ఆటామిక్ ఎనర్జీ ఏజన్సీ -ఐ.ఎ.ఇ.ఎ) అవడానికి అంతర్జాతీయ సంస్ధే అయినప్పటికీ పశ్చిమ దేశాలకు పక్కా ఏజంటుగా వ్యవహరిస్తుంది. ఇజ్రాయెల్ సృష్టించే పచ్చి అబద్ధాలే దీనికి సాక్ష్యాలు. పశ్చిమ కార్పొరేట్ పత్రికలు ప్రచురించే ఏ ఆధారమూ లేని తప్పుడు నివేదికలు దీనికి ఆధారాలు. అవన్నీ తప్పుడువేనని ఎన్నిసార్లు రుజువయినా ఐ.ఏ.ఇ.ఏ మాత్రం వాటిని గొప్ప రుజువులుగా పరిగణిస్తుంది. ఐ.ఎ.ఇ.ఎ నియమించిన పరిశీలకులు గానీ, పరీక్షకులుగానీ ఇరాన్ తన యురేనియంను అణు బాంబుల కోసం తరలిస్తున్నదనడానికి వీసమెత్తు సాక్ష్యం కూడా కనిపెట్టలేకపోయారు. పైగా ఐ.ఎ.ఇ.ఎ ఇన్ స్పెక్టర్లు అమెరికా తరపున గూఢచర్యం నిర్వహించడంతో ఇరాన్ ప్రభుత్వం వారిని అనేకసార్లు తన్ని తరిమేసింది.
లేని ఇరాన్ అణు బాంబుల పట్ల ఇన్ని శోకాలు పెట్టే అమెరికా, యూరప్ లు అత్యాధునిక అణు బాంబులు కలిగి ఉన్న ఇజ్రాయెల్ ని మాట మాత్రం ప్రశ్నించవు. దాని అణు కర్మాగారాలను పరీక్షించాలని ఐ.ఎ.ఇ.ఎ ఎన్నడూ కోరలేదు. ఐ.ఎ.ఇ.ఎ పరిశీలకులను అనుమతించనని ఇజ్రాయెల్ బహిరంగంగానే ప్రకటించినా అదేమని ప్రశ్నించేవారెవరూ లేరు. అమెరికా మద్దతే ధూర్త ఇజ్రాయెల్ కి ‘శ్రీరామ రక్ష’ గా పనిచేస్తోంది.