మధ్య ప్రాచ్యం లో కొద్ది రోజుల క్రితం కీలక పరిణామం సంభవించింది. ఇజ్రాయెల్ కి గ్యాస్ సరఫరాను ఈజిప్టు సైనిక ప్రభుత్వం రద్దు చేసింది. ఇది ప్రభుత్వాల మధ్య వ్యవహారం కాదు, కేవలం కంపెనీల మధ్య వ్యాపార లావాదేవీల వ్యవహారమేనని ఇరు ప్రహుత్వాలలోని కొన్ని వర్గాలు అంటున్నప్పటికీ, విశ్లేషకుల అభిప్రాయం భిన్నంగా ఉంది. ఈజిప్టు నియంత హోస్నీ ముబారక్ కి వ్యతిరేకంగా ‘ప్రజాస్వామిక సంస్కరణల’ కోసం జరిగిన తిరుగుబాటులో ఇజ్రాయెల్ కి సంవత్సరాల తరబడి అత్యంత చౌకగా గ్యాస్ సరఫరా చేయడం ఒక ముఖ్య అంశమని గుర్తించినట్లయితే తాజా పరిణామానికి ఉన్న ప్రాముఖ్యత అర్ధం అవుతుంది.
అరబ్ దేశాలు ‘ఇజ్రాయెల్’ ను తమ ఆగర్భ శత్రువుగా భావించే సంగతి విదితమే. పాలస్తీనా భూభాగంపై ఇజ్రాయెల్ దేశాన్ని అక్రమంగా నెలకొల్పినప్పటినుండీ అరబ్ ప్రజలు ఇజ్రాయెల్ ను ‘బద్ధ విరోధిగా’ పరిగణిస్తున్నారు. బ్రిటన్, అమెరికాల నాయకత్వంలో జరిగిన కుట్ర ఫలితంగా పాలస్తీనా ప్రజలను వారి ఇళ్లనుండి, పొలాలనుండీ, ఊళ్ళ నుండీ తరిమి కొట్టి ఇజ్రాయెల్ స్ధాపించబడింది. అప్పటి నుండీ పాలస్తీనా అరబ్బులు చుట్టుపక్కల ఉన్న అరబ్ దేశాలలో శరణార్ధులుగా ఏడున్నర దశాబ్దాలుగా బతుకులు వెళ్లదీస్తున్నారు.
1967 లో జరిగిన ‘అరబ్ యుద్ధంలో’ ఇజ్రాయెల్ విజయం సాధించి మరిన్ని పాలస్తీనా భూభాగాలను ఆక్రమించుకోవడమే కాక సిరియా, ఈజిప్టు, జోర్డాన్, లెబనాన్ దేశాల భూభాగాలను కూడా ఆక్రమించింది. ఈజిప్టు భూభాగం అయిన ‘సినాయ్’ ద్వీపకల్పాన్ని, సిరియా కి చెందిన ‘గోలన్ హైట్స్’ భూభాగాన్నీ, పాలస్తీనాలోని విస్తారమైన ‘వెస్ట్ బ్యాంక్’ నూ ఇజ్రాయెల్ ఆక్రమించుకుని పాలస్తీనా ప్రజలపై జాత్యహంకార పాలనను అమలు చేస్తున్నది. పాలస్తీనా ప్రజలకు తాగునీరు కూడా అందకుండా చేస్తూ, మరిన్ని పాలస్తీనీయుల ఇళ్లను కూలగొడుతూ, మరిన్ని అక్రమ సెటిల్ మెంట్లను నిర్మిస్తూ రాక్ష పాలనను ఇజ్రాయెల్ పాలక వర్గాలు సాగిస్తున్నాయి.
ఈజిప్టులో అమెరికా అండతో ప్రజాస్వామిక ప్రభుత్వాన్ని కూలగొట్టి నియంతగా ‘హోస్నీ ముబారక్’ అవతరించాక ఈజిప్టు ప్రభుత్వం ఇజ్రాయెల్ తో అక్రమ పద్ధతిలో ప్రజావ్యతిరేక ఒప్పందం చేసుకుంది. అమెరికా ఒత్తిడితో 1979లో జరిగిన ఈ ‘శాంతి ఒప్పందం’ మేరకు ఇజ్రాయెల్ సినాయ్ ద్వీపకల్పాన్ని ఈజిప్టు నియంత ఏలుబడికి అప్పగించగా అత్యంత తక్కువ రేట్లకు ఇజ్రాయెల్ కి గ్యాస్ సరఫరా చేయడం మొదలయింది. ఇజ్రాయెల్ కి తక్కువ రేట్లకు గ్యాస్ అప్పగిస్తూ ఈజిప్టు ప్రజలనుండి రెట్టింపు రేట్లను హోస్నీ ముబారక్ ప్రభుత్వం వసూలు చేస్తూ వచ్చింది. ఈజిప్టు ప్రజలకు ఇజ్రాయెల్ తో కుదుర్చుకున్న శాంతి ఒప్పందం భావోద్వేగాలకు సంబంధించిన సమస్య. తమ వద్ద అధిక రేట్లను వసూలు చేస్తూ ఆగర్భ శత్రువు ఇజ్రాయెల్ కు చౌకగా గ్యాస్ సరఫరా చేయడం ఈజిప్టు ప్రజలు కలలో కూడా ఆమోదించలేని వ్యవహారం.
గత సంవత్సరం జనవరిలో హోస్నీ ప్రభుత్వం కూలిపోయాక ఇజ్రాయెల్ కి గ్యాస్ సరఫరా చేసే పైప్ లైన్ ను ఈజిప్టు ప్రజలు అనేక సార్లు పేల్చివేశారు. మరమ్మతులు చేసిన ప్రతిసారీ పైప్ లైన్లను ప్రజలు పేల్చివేస్తూ వచ్చారు. ఇప్పటివరకూ మొత్తం 14 సార్లు పైప్ లైన్లను పేల్చారు. గత సెప్టెంబరు నెలలో ఈజిప్టులోని ఇజ్రాయెల్ ఎంబసీ పై ప్రజలు మూకుమ్మడిగా దాడి చేసి ఎంబసీ పై ఉన్నఇజ్రాయెల్ జెండాను కూల్చి ఈజిప్టు జెండా ఎగురవేశారు. ఎంబసీలోకి జొరబడి ఆరుగురు సిబ్బందిని గాయపరిచారు. ఈజిప్టు పార్లమెంటు ఎన్నికల్లో ముస్లిం బ్రదర్ హుడ్ అత్యధిక సీట్లు గెలుచుకోవడానికి ఇజ్రాయెల్ వ్యతిరేకత పని చేసిందని విశ్లేషకులు భావిస్తున్నారు. సినాయ్ ద్వీపకల్పం నుండి ఇజ్రాయెల్ మీదికి రాకెట్లు పేల్చిన ఘటనలు కూడా రెండు సార్లు జరిగాయి. ఈజిప్టు గ్రాండ్ ముఫ్తి డాక్టర్ ఆలీ గోమా ఇజ్రాయెల్ రాజధాని జెరూసలేం ను సందర్శించినందుకు ఈజిప్టు ఇస్లామిక్ కౌన్సిల్ కి సమాధానం చెప్పుకోవలసి వచ్చింది. జెరూసలేం లోని పాలస్తీనీయులకు ఆ నగరం పై గల హక్కుకు మద్దతుగానే అక్కడికి వెళ్లానని ఆయన వివరణ ఇచ్చుకున్నాడు. ఇవన్నీ ఇజ్రాయెల్ పట్ల ఈజిప్టు ప్రజలకి ఉన్న భావోద్వేగపూరితమైన శతృత్వానికి తార్కాణాలు.
ముప్ఫయ్యేళ్ళ ముబారక్ నియంతృత్వ పాలన ముగిశాక ఈజిప్టు ప్రజలు తమ గ్యాస్ పై తమకి ఉన్న హక్కుని పునరుద్ధరించుకోడానికి ప్రయత్నిస్తున్నారు. గ్యాస్ ఒప్పందం హోస్నీ ముబారక్ అవినీతికి కేంద్ర స్ధానంగా కూడా ఉంటూ వచ్చింది. ఇజ్రాయెల్ తో కుదుర్చుకున్న గ్యాస్ ఒప్పందం ముబారక్ నియంతృత్వ అవినీతి పాలనకు ఒక సింబల్ గా అక్కడి ప్రజలు పరిగణిస్తున్నారు. అమెరికా సామ్రాజ్యవాద రక్షణ ఛత్రం కింద జియోనిస్టు రాజ్యం ఇజ్రాయెల్ తో ఈజిప్టు పాలకవర్గాల కుమ్మక్కుకి కూడా ఈ గ్యాస్ ఒప్పందం ప్రధాన చిహ్నంగా ఉన్నది. గ్యాస్ పైప్ లైన్ పై నిరంతరం కొనసాగుతూ వచ్చిన దాడుల వల్ల మార్చి 5 తేదీ నుండి ఇప్పటివరకూ కొద్ది గ్యాస్ కూడా సరఫరా కాలేదు. ఇజ్రాయెల్ కి గ్యాస్ సరఫరా చేయడానికి ఈజిప్టు ప్రభుత్వంలో బాధ్యుడుగా ఉన్న అధికారి అవినీతి ఆరోపణలతో స్పెయిన్ లో అరెస్టు కావడం ఈజిప్టు ప్రజలను మరింత ఆగ్రవేశాలకు గురి చేసింది.
ఈజిప్టు గ్యాస్ కంపెనీ ఇ.ఎం.జి తాను ఏ రేటుకి ఇజ్రాయెల్ కి గ్యాస్ సరఫరా చేసున్నదీ ఎన్నడూ బహిరంగపరచలేదు. ఆ నోటా, ఈ నోటా చౌకగా ఇస్తున్నదని తెలియడమే తప్ప ఈజిప్టు ప్రజలకు ఖచ్చితమైన ధర తెలిపినవారు లేరు. ఇటీవల వాల్ స్ట్రీట్ జర్నల్ పత్రిక లో ప్రచురించబడిన కధనం ద్వారా ఇజ్రాయెల్ కి ఒక బి.టి.యు (బ్రిటిష్ ధర్మల్ యూనిట్) కి రెండు డాలర్లకు సరఫరా చేయగా ఈజిప్టు ప్రజలవద్ద నాలుగు డాలర్లు వసూలు చేసినట్లు తెలిసి వచ్చింది. “మేము ఇజ్రాయెల్ కి సబ్సిడీ ఇస్తాము తప్ప ఈజిప్టు ప్రజలకి కాదు” అన్నది ఈజిప్టులో ఓ పెద్ద సామెత అని వాల్ స్ట్రీట్ జర్నల్ ఈ సందర్భంగా తెలిపింది. 2005 లో రెన్యూ చేయపడిన గ్యాస్ ఒప్పందం ద్వారా ఈజిప్టు కంపెనీలకు అపరిమిత లాభాలూ, ఇజ్రాయెల్ కి భారీ లబ్దీ చేకూరిందని ఆ పత్రిక తెలిపింది.
ఈ కారణాల వల్ల ఇజ్రాయెల్ తో గ్యాస్ ఒప్పందం అంటే మధ్య ప్రాచ్యంలో పెత్తనం చెలాయిస్తున్న అమెరికా-ఇజ్రాయెల్ కూటమికి ఈజిప్టు పాకలవర్గాల లొంగుబాటుకి ప్రధాన వ్యక్తీకరణ. అమెరికా సామ్రాజ్యవాదం మధ్య ప్రాచ్యంలో కొనసాగిస్తున్న జోక్యందారీ మిలట్రీ పెత్తనానికి కూడా అది చిహ్నం. అలాంటి ఒప్పందాన్ని రద్దు చేయించుకోవడం ఈజిప్టు ప్రజల ఉద్యమం సాధించిన విజయాలలో ముఖ్యమైనదిగా పేర్కొనవచ్చు. అయితే ఈ పరిస్ధితి మరింతకాలం కొనసాగుతుందా లేదా అన్నది ఖచ్చితంగా చెప్పలేము. అమెరికా పెత్తనంపైనా, ఈజిప్టు పాలకుల లొంగుబాటుపైనా ప్రజలు నిరంతర పోరాటాలు చేయకుండా వారి ప్రజాస్వామిక ఆకాంక్షలు తేలికగా నెరవేరవు. ధనికవర్గాలకు కొమ్ము కాసే పాలకులు ఎన్నడూ ప్రజలు అడిగినవెంటనే వారి ఆకాంక్షలు నెరవేర్చిన ఉదాహరణలు చరిత్రలో ఎక్కడా లేవు.
మధ్యప్రాచ్యంలో జరుగుతున్న పరిణామాలకు భారత ప్రభుత్వం ఇంతవరకూ పెద్దగా స్పందించిన దాఖలాలు లేవు. నెహ్రూ, ఇందిరాలు ప్రధానులుగా కొనసాగినన్నాళ్ళూ ప్రపంచంలో అణచివేతకు గురవుతున్న దేశాలకు భారత దేశం సానుభూతితో కూడిన మద్దతు ఇస్తూ వచ్చింది. అలీన విధానం అనుసరించినప్పటికీ పాలస్తీనా లాంటి దేశాలకు అంతర్జాతీయ వేదికలపై మద్దతు ఇస్తూ వచ్చింది. వారి ఆధ్వర్యంలో ఇజ్రాయెల్ జాత్యహంకార ప్రభుత్వ చర్యలకు భారత ప్రభుత్వం ఎన్నడూ మద్దతు ఇవ్వకపోగా ఆ దేశంతో స్నేహ సంబంధాలకు కూడా నికారిస్తూ వచ్చింది. అయితే కేంద్రంలో బి.జె.పి ఆధ్వర్యంలో ప్రభుత్వం ఏర్పడినాక ఈ పరిస్ధితి తిరగబడింది. బి.జె.పి ప్రభుత్వంలో మొదటిసారి ఇజాయెల్ పాలకులు భారత దేశం సందర్శించారు. ఆ నాటితో భారత దేశానికి అంతర్జాతీయంగా గల పేరు ప్రతిష్టలకు మచ్చ వచ్చి చేరింది. అలీన విధానంతో తెచ్చుకున్న ప్రతిష్ట మంట గలిసిపోయింది. ఆ తర్వాత బి.జె.పి విధానాలను కాంగ్రెస్ ప్రభుత్వం కూడా కొనసాగిస్తోంది.