ఫ్రాన్సు మొదటి రౌండ్ ఎన్నికల్లో అధ్యక్షుడు సర్కోజీకి రెండవ స్ధానం


Francois-Hollande-Nicolas-Sarkozyఫ్రాన్సు అధ్యక్షుడు నికోలస్ సర్కోజీ మొదటి రౌండ్ ఎన్నికల్లో రెండవ స్ధానంతో సరిపెట్టుకున్నాడు. సోషలిస్టు పార్టీ అభ్యర్ధి ఫ్రాంకోయిస్ హాలండే మొదటి స్ధానం చేజిక్కించుకున్నాడు. హాలండే కి 28 శాతం ఓట్లు రాగా, సర్కోజీకి 26 శాతం ఓట్లు వచ్చాయని బి.బి.సి తెలిపింది. అయితే హాలండే కి 28.63 శాతం ఓట్లు, సర్కోజీకి 27.18 ఓట్లు వచ్చాయని ‘ది హిందూ’ తెలిపింది. తీవ్ర మితవాది (far right) గా పత్రికలు అభివర్ణిస్తున్న మేరీన్ లీ పెన్ (నేషనల్ ఫ్రంట్) 17.9 ఓట్లతో (ది హిందూ) మూడవ స్ధానంలో ఉండగా, లెఫ్ట్ ఫ్రంట్ అభ్యర్ధి జీన్-లుక్ మెలెంఖాన్ 11.11 శాతం (ది హిందూ) ఓట్లతో నాల్గవ స్ధానంలో ఉన్నాడు.

సెంట్రిస్టు గా చెబుతున్న ఫ్రాంకోయిస్ బేరౌ 9.13 ఓట్లతో ఐదవ స్ధానంలో ఉన్నాడు. మిగిలిన ఓట్లను నలుగురు లెఫ్టిస్టు అభ్యర్ధులు, ఒక సెంటర్-రైట్ అభ్యర్ధి పంచుకున్నారని తెలుస్తోంది. ఆదివారం జరిగిన మొదటి రౌండ్ అధ్యక్ష ఎన్నికల్లో 79.47 శాతం ఓటర్లు పాల్గొన్నారు. ఓటర్లు హాజరు ‘అధికం’ అని బి.బి.సి తెలుపగా, ‘ది హిందూ’ పత్రిక ‘యావరేజ్’ గా పేర్కొంది. అందరికంటే ఎక్కువ ఓట్లు గెలుచుకున్న ఇద్దరు అభ్యర్ధులు రెండవ రౌండ్ లో పోటీ పడతారు. మే 6 న రెండవ రౌండ్ ఎన్నికలు జరుగుతాయి. రెండవ రౌండ్ లో కూడా హాలాండే గెలుస్తాడని ‘ఒపీనియన్ పోల్స్’ చెబుతున్నాయి.

మొదటి రెండవ స్ధానాల్లో ఉన్న అభ్యర్ధులకి వచ్చిన ఓట్లు ‘ఒపీనియన్ పోల్స్’ ప్రకారమే ఉండగా మూడవ స్ధానంలో ఉన్న మితవాది లీ పెన్ కి ‘ఒపీనియన్ పోల్స్’ కంటే ఎక్కువ ఓట్లు వచ్చాయని ‘ఫ్రాన్స్ 24’ పత్రిక తెలిపింది. లీ పెన్ తండ్రి కి 2002 ఎన్నికల్లో 16.86 శాతం ఓట్లు వచ్చాయి. మరే ఎన్నికల్లోనూ నేషనల్ ఫ్రంట్ అభ్యర్ధులకు మేరీన్ లీ పెన్ కి వచ్చినన్ని ఓట్లు రాలేదు. ఫ్రాన్సు లో విదేశాల నుండి వచ్చిన వలస పౌరులకు స్ధానం లేదని నేషనల్ ఫ్రంట్ వాదిస్తుంది. సర్కోజీ మద్దతుదారుల సంఖ్య ప్రచారం చివరి వారాల్లో బాగా పడిపోయింది. వీరు సర్కోజీకి మద్దతు ఉపసంహరించుకుని నేషనల్ ఫ్రంట్ కి ఓటేశారని విశ్లేషకులు భావిస్తున్నారు.

అధ్యక్షుడు నికోలస్ సర్కోజీని ఫ్రాన్సు ఓటర్లు వ్యతిరేకిస్తున్నట్లు అనేక ‘ఒపీనియన్ పోల్స్’ లో వెల్లడయింది. డబ్బు పట్ల ఉన్న మోజుని సర్కోజీ ఎన్నడూ దాచుకోకపోవడం, ధనికవర్గాల ఉన్న మొగ్గుని బహిరంగంగానే సమర్ధించుకోవడం, ‘అధ్యక్షుడు’గా హుందాతనాన్ని చూపకపోవడం, అనేకమంది సన్నిహితులని దూరం చేసుకోవడం… ఇవన్నీ సర్కోజీ ఓటమిలో పని చేశాయని పత్రికలు అనేకసార్లు కధనాలు ప్రచురించాయి. అయితే ఇవన్నీ అధ్యక్ష ఎన్నికల్లో నిర్ణాయక పాత్ర పోషించాయనడానికి వీలు లేదు.

ప్రపంచ ఆర్ధిక సంక్షోభం సంభవించాక బడా పెట్టుబడిదారీ కంపెనీల మోసాలు, అత్యాశ ప్రజలకు మరింత స్పష్టంగా అర్ధమయ్యాయి. అత్యాశతో అనేక మోసాలకు పాల్పడిన కంపెనీలపై చర్యలు తీసుకుంటామని అమెరికా, యూరప్ ప్రభుత్వాలు హామీలు ఇచ్చినప్పటికీ అలాంటీ హామీలను ప్రభుత్వాలు అమలు చేయలేదు. ప్రపంచ ఆర్ధిక సంక్షోభం నెమ్మదించాక యూరప్ దేశాలను ‘ఋణ సంక్షోభం’ చుట్టు ముట్టింది. రెండూ వేరు వేరు సంక్షోభాలుగా పత్రికలు, పాలకవర్గాలు, కొందరు పెట్టుబడిదారీ ఆర్ధికవేత్తలు చెప్పినప్పటికీ నిజానికి ‘ఋణ సంక్షోభం’ అన్నది ‘ప్రపంచ ఆర్ధిక సంక్షోభానికి’ కొనసాగింపు మాత్రమే. 2010 లో గ్రీసు లో ప్రారంభమయిన ‘యూరప్ ఋణ సంక్షోభం’ అయిర్లండు, పోర్చుగల్ దేశాలను కూడా బలి తీసుకుంది. ఆ తర్వాత స్పెయిన్, ఇటలీ లో ‘ఋణ సంక్షోభం’లోకి జారిపోవడానికి సిద్ధంగా ఉన్నాయి. ఈ సంక్షోభం ప్రభావం యూరప్ లోని ప్రధాన దేశాలయిన జర్మనీ, ఫ్రాన్సు, బ్రిటన్ దేశాలపై కూడా కొనసాగుతోంది.

ప్రపంచ ఆర్ధిక సంక్షోభం కాలంలో యూరప్, అమెరికా ప్రభుత్వాలు ట్రిలియన్ల కొద్దీ సొమ్ముని ప్రవేటు కంపెనీలకు బెయిలౌట్లుగా సమర్పించుకున్నాయి. ఆఫ్ఘన్ దురాక్రమణ యుద్ధం, ఇరాక్ యుద్ధం, లిబియా, సిరియాలలో కిరాయి తిరుగుబాట్లు… వీటన్నింటికీ అమెరికా, యూరప్ లు బిలియన్ల కొద్దీ సొమ్ముని కుమ్మరించాయి. ఈ సొమ్మంతా అప్పులు తెచ్చి కుమ్మరించినదే. యుద్ధాల్లో కుమ్మరించిన డబ్బూ, ప్రపంచ మీదికి ఆర్ధిక సంక్షోభం తెచ్చిపెట్టిన కంపెనీలకి ఇచ్చిన బెయిలౌట్లూ అన్నీ కలిసి అమెరికా, యూరప్ దేశాల ప్రభుత్వాల నెత్తిన అప్పులుగా పేరుకుపోయింది. కంపెనీలకి బెయిలౌట్లుగా ఇచ్చిన సొమ్ముని కంపెనీల నుండి వసూలు చేయవలసి ఉండగా ప్రభుత్వాలు అది చేయ లేదు. సంక్షోభం అనంతరం కూడా బడా కంపెనీల సి.ఇ.ఓ లకు మిలియన్ల కొద్దీ జీతాలు, బోనస్ లూ ఇవ్వడం కొనసాగుతున్నప్పటికీ ప్రభుత్వాలు ఏమీ అభ్యంతరం చెప్పకపోగా సమర్ధించాయి.

బెయిలౌట్ సౌమ్ముని నేరుగా సి.ఈ.ఓ ల విలాసాలకూ, బోనస్ చెల్లింపులకీ కంపెనీలు ఖర్చు చేసినా ప్రభుత్వాలు మిన్నకున్నాయి. చర్యలు తప్పవు అన్న ఆర్భాటపు ప్రకటనలు తప్ప, జి20, జి7 లాంటి అంతర్జాతీయ కూటముల వేదికలపై ఉత్తుత్తి తీర్మానాలు తప్ప, కంపెనీల రూపంలోనూ, వాటి సి.ఇ.ఓ ల రూపంలోనూ ఉన్న బందిపోట్లపైన కేసులు నమోదు చేసి కనీస విచారణ సైతం చేసిన పాపాన ప్రభుత్వాలు పోలేదు. కంపెనీల మోసాలు అరికడతామనీ, బడా కంపెనీలను చిన్న చిన్న కంపెనీలుగా విడగొట్టి తద్వారా పెద్ద పెద్ద కంపెనీలు చేసే అన్యాయాల ప్రభావం దేశ ఆర్ధిక వ్యవస్ధలపై పడకుండా చూస్తామనీ, బడా బ్యాంకులు దోపిడీ దొంగల రహస్యాలు కాపాడే స్వర్గ ధామాలుగా మారకుండా అడ్డుకుంటామనీ, ‘స్విస్ బ్యాంకులు’ బ్లాక్ మార్కెటీర్లకు, మనీ లాండర్లకూ, మాఫియా రాజకీయ నాయకులకూ అడ్డాగా మారకుండా చర్యలు తీసుకుంటామనీ, స్టాక్ మార్కెట్లు ధనిక వర్గాల జూదాలకు కేంద్రాలుగా మారకుండా చూస్తామనీ ప్రభుత్వాలు అనేక వాగ్దానాలు చేశాయి. వాగ్దానాలన్నింటినీ అవి పూర్తిగా విస్మరించాయి. హామీలు అమలు చేయలేకపోవడానికి ప్రజలకు వివరణ ఇవ్వాలన్న మర్యాదను కూడా అవి పాటించలేదు.

కంపెనీల నేరాలను విచారించి శిక్షించడానికి బదులు సంక్షోభ భారాన్ని ‘పొదుపు విధానాల’ పేరుతో తిరిగి ప్రజలపై రుద్ధడానికి ప్రభుత్వాలు తెగించాయి. బడా బడా పెట్టుబడిదారీ కంపెనీలు రుద్దిన యుద్ధాల ఖర్చునీ, సంక్షోభాల బెయిలౌట్లనీ ప్రజలనుండి వసూలు చేయడానికి పూనుకున్నాయి. అప్పుల భారం తగ్గించుకోవడానికి ప్రజల సౌకర్యాలను రద్దు చేయడానికి పూనుకున్నాయి. లక్షల కొద్దీ ఉద్యోగాలను రద్దు చేశాయి. మరిన్ని లక్షల ఉద్యోగుల వేతనాలలో కోతలు విధించాయి. రిటర్ అయిన ఉద్యోగుల పెన్షన్లు కూడా రద్దు చేయడమో కోత పెట్టడమో చేశాయి. ప్రజలకు ఇస్తున్న సబ్సిడీలు రద్దు చేశాయి. సి.ఇ.ఓ ల బోనస్ లు కొనసాగించి కార్మికుల బోనస్ లు రద్దు చేయడమో, కోత కోయడమో చేశాయి. ప్రజలకు కార్మిక వర్గానికి వేతనాల రూపంలోనూ, సంక్షేమ సౌకర్యాల రూపంలోనూ ఇస్తున్న సొమ్ములో పెద్ద మొత్తాన్ని పెట్టుబడిదారీ కంపెనీలకు లాభాల రూపంలో తరలించాయి.

ఫలితంగా ప్రజల కొనుగోలు శక్తి బాగా పడిపోయింది. దరిద్రం ఎక్కువయింది. నిరుద్యోగం పెరిగిపోయింది. విద్యార్ధుల ఫీజులు పెరిగిపోయాయి. యువత బికారులుగా మారారు. కుటుంబాలు విచ్ఛిన్నం అయ్యాయి. ఆర్ధిక సమస్యల వెంటే ఉండే సామాజిక సమస్యలు ప్రజా జీవనాన్ని అల్లకల్లోలం చేస్తున్నాయి. ఆర్ధిక సంక్షోభం వల్లా, యుద్ధాల వల్ల తలెత్తిన ఆర్ధిక సామాజిక సమస్యలను పరిష్కరించడానికి బదులు ప్రభుత్వాలు ప్రజల మధ్య తగవులు పెట్టడానికి పూనుకుంటున్నారు. ప్రజల మధ్య తగవులు పెట్టి తమ వాస్తవ సమస్యలనుండి పక్కకు మళ్ళేలా దుర్మార్గ పూరితమైన ఎత్తుగడలు వేస్తున్నారు. యుద్ధాలతో, సంక్షోభాలతో తాము రుద్దిన సమస్యలకు వలస వచ్చిన విదేశీయులు కారణంగా చూపుతున్నారు. మతపరమైన ఉద్రిక్తతలు రెచ్చగొట్టి పబ్బం గడుపుతున్నారు. జాతి విద్వేషాలు రెచ్చగొడుతున్నారు. దాని ఫలితమే నేషనల్ ఫ్రంట్ లాంటి పచ్చి మితవాద పార్టీలకు పెరిగిన ఓట్లు.

ఇటువంటి ఆర్ధిక, సామాజిక, రాజకీయ పాపాలన్నింటినీ సమర్ధవంతంగా నిర్వహించినవారిలో ఫ్రాన్సు అధ్యక్షుడు నికోలస్ సర్కోజీ ఒకరు. ఋణ సంక్షోభాన్ని ప్రజలపై రుద్దే ప్రక్రియలో యూరప్ పాలకవర్గాలకు నాయకత్వం వహించినవారిలో ఫ్రాన్సు అధ్యక్షుడు నికోలస్ సర్కోజీ, జర్మనీ ఛాన్సలర్ ఏంజెలా మెర్కెల్ లు ప్రముఖులు. వీరు తమ తమ దేశాలలో పొదుపు విధానాలను బలవంతంగా ప్రజలపై రుద్దడమే కాక ఇతర యూరోపియన్ దేశాల పాలకులు కూడా వారి ప్రజలపై రుద్దేలా చేసేలా తీవ్ర ఒత్తిడి తెచ్చారు. యూరోపియన్ యూనియన్, యూరో జోన్ సమావేశాలను అందుకు వేదికగా చేసుకున్నారు. వివిధ దేశాల ఆర్ధిక కూటములు గానీ, ప్రాంతీయ కూటములు గానీ ఆయా దేశాల ధనికవర్గాలకు ఉపయోగమే తప్ప ప్రజానీకానికి వీసమెత్తు ఉపయోగం లేదని యూరోజోన్ ఋణ సంక్షోభాన్ని బట్టి అర్ధం చేసుకోవచ్చు. ఉపయోగం లేకపోగా అలాంటి కూటముల వేదికల ద్వారా ఒక దేశంలోని ప్రజా వ్యతిరేక విధానాలు కూటమిలోని ఇతర దేశాల ప్రజలపై కూడా అమలు చేసేలా జర్మనీ, ఫ్రాన్సు, బ్రిటన్, అమెరికా లాంటి దేశాల పాలకులు ఒత్తిడి చేస్తున్నారు.

నికోలస్ సర్కోజీ తన ధనిక పక్షపాతాన్ని అనేకసార్లు నగ్నంగా చాటుకున్నాడు. ఆయన నిస్సిగ్గుని కంపెనీల కొమ్ము కాసే కార్పొరేట్ పత్రికలు ‘సాహసం’గా కొనియాడడంలో ఆశ్చర్యమేమీ లేదు. ఆ పత్రికలు ఉన్నదే అందుకు. అయినప్పటికీ అలాంటి పత్రికలు కూడా నిరసనతో అసహ్యించుకుంటూ కధనాలు ప్రచురించేలా పరమ నగ్నంగా ధనికవర్గ పక్షపాతాన్ని నికోలస్ సర్కోజీ ప్రదర్శించాడు. 2007 లో ఎన్నికల్లో గెలిచాక ఆయన పార్టీ మద్దతుదారులంతా విజయోత్సాహంతో అభినందనలు తెలియజేయడానికి బైట వేచి చూస్తుంటే, సర్కోజీ మాత్రం కంపెనీల ఓనర్లతో పార్టీలు చేసుకుంటూ గడిపాడు. పగలంతా బైట జనం సర్కోజీ కోసం పడిగాపులు కాస్తూ ఎదురు చూస్తే అర్ధ రాత్రి ఎప్పుడో పార్టీ ముగిశాక మాత్రమే సర్కోజీ తన పార్టీ అభిమానులను పలకరించాడు. సర్కోజీ విధానాలు నచ్చని ఒక జాలరి ఆయనతో ద్వంద్వ యుద్ధానికి సవాలు చేస్తే సర్కోజీ ఏ మాత్రం తగ్గకుండా చేతులు మడిచి బరిలోకి దూకడానికి సిద్ధపడ్డాడు. అధికారులు నివారించకపోతే అన్నంతపనీ చేసేవాడని పత్రికలు వ్యాఖ్యానించాయి. ఇలాంటి ఘటనలు సకోజీ కనీసం ‘స్టేట్స్ మెన్’ కాడని భావించడానికి దారి తీసాయి. డబ్బు కూడబెట్టడంపై తనకున్న మోజుని కూడా సర్కోజీ అనేకసార్లు ప్రదర్శించాడని పత్రికలు అనేక కధనాలు రాశాయి.

అయితే, డబ్బు మోజు, పార్టీలు, ద్వంద్వ యుద్ధాలు ఇవన్నీ ఎన్నికల్లో ఓటమికి నిర్ణయాత్మక కారణాలు కాజాలవు. కానీ అవే నిర్ణయాత్మకంగా కార్పొరేట్ పత్రికలు చెబుతున్నాయి. వాస్తవానికి ప్రపంచ ఆర్ధిక సంక్షోభం అనంతరం, ఋణ సంక్షోభం దరిమిలా సర్కోజీ అనుసరించిన ఆర్ధిక, సామాజిక విధానాలే ఆయన మొదటి రౌండ్ లో వెనకబడడానికి ప్రధాన కారణం. పొదుపు ఆర్ధిక విధానాలలో భాగంగా సర్కోజీ అమలు చేసిన వేతనాల కోత, ప్రవేటీకరణ, పెన్షన్ల కోత, రిటర్ మెంట్ వయసు పెంపు, సబ్సిడీల రద్దు లాంటి చర్యలతో పాటు నిరుద్యోగం పెరిగిపోవడం, ప్రజల సమస్యలు పరిష్కరించడానికి బదులు మరింత కఠినమైన ఆర్ధిక విధానాలు అమలు చేయడం వల్లనే ఫ్రాన్సు ప్రజలు సర్కోజీని తిరస్కరించారు. ఈ కారణాలని చెప్పినట్లయితే ప్రజలు మొత్తం వ్యవస్ధనే మార్చుకునేంతగా చైతన్యం పొందే ప్రమాదం పొంచి ఉంటుంది. పెట్టుబడిదారీ వ్యవస్ధని మార్చుకోవడం అంటే శ్రామిక వర్గాలు నాయకత్వం వహించే సోషలిస్టు వ్యవస్ధను కోరుకోవడమే. ఆ ప్రమాదం రాకుండా ఉండడానికి పత్రికలు, కంపెనీలు, ప్రభుత్వాలు శాయశక్తులా ప్రయత్నిస్తాయి. దానిలో భాగంగానే వ్యవస్ధ పునాదితో ముడిపడి ఉన్న సమస్యలకి సర్కోజీ లాంటి వ్యక్తుల ప్రవర్తనలు కారణంగా చూపడానికి పత్రికలు ప్రయత్నిస్తున్నాయి. వ్యవస్ధాగత సమస్యలని వ్యక్తుల ప్రవర్తనల స్ధాయికి కుదిస్తున్నాయి. ఇది కార్పొరేట్ పత్రికలు నిత్యం చేసే మోసం. ప్రజలు ఈ మోసాలని గుర్తెరిగి తమ భవిష్యత్తుని తామే రూపోందించుకునేందుకు నడుం బిగించాలి.

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

Connecting to %s