ఈనాడు లో ‘జాతీయ అంతర్జాతీయ వార్తలు, విశ్లేషణ’ బ్లాగ్


సోమవారం (23.04.2012) నాటి ఈనాడు దిన పత్రిక తన పాఠకులకు ‘జాతీయ అంతర్జాతీయ వార్తలు, విశ్లేషణ’ బ్లాగ్ ను పరిచయం చేసింది. ప్రతి సోమవారం విద్యార్ధులు, ఉద్యోగార్ధుల కోసం అందిస్తున్న ‘చదువు’ పేజీలో ఈ బ్లాగ్ ను పరిచయం చేసింది. సివిల్స్ లాంటి పోటీ పరీక్షల కోసం తయారవుతున్న విద్యార్దులు, ఉద్యోగార్ధులకు ‘జాతీయ అంతర్జాతీయ వార్తలు, విశ్లేషణ’ ఉపయోగకరంగా ఉందని తెలియజేసింది.

teluguvartalu

గత సంవత్సరం ఫిబ్రవరి 4 తేదీన ఈ బ్లాగ్ ప్రారంభం అయింది. ముఖ్యమైన జాతీయ అంతర్జాతీయ వార్తలు పత్రికల్లో వచ్చినపుడు కత్తిరించి భద్రపరుచుకోవడం నాకు మొదటి నుండీ అలవాటుగా ఉండేది. జాతీయ అంతర్జాతీయ అంశాలను రెగ్యులర్ గా చదివితే తప్ప వాటిపై ఒక అభిప్రాయానికి రావడం కుదరదు. పత్రికల్లో వచ్చేవార్తల ద్వారానే జాతీయంగా, అంతర్జాతీయంగా జరుగుతున్న సంఘటనల గురించి మనకు తెలుస్తుంది. కాని చదివినవన్నీ గుర్తుంచుకోవడం కష్టం గనుక గత సంఘటనలకు కొనసాగింపుగా జరిగే సంఘటనలు వెంటనే అర్ధం చేసుకోవడం కష్ట తరంగా ఉంటుంది. అందువలన ముఖ్యమయిన వార్తలను, ఆర్టికల్స్ ని కత్తిరించి భద్రపరుచుకోవడం అలవాటయింది. ఇది ఇంటర్నెట్ వ్యాప్తిలోకి రావడానికి ముందు సంగతి.

ఇంటర్నెట్ కనెక్షన్ తీసుకున్నాక నాకు కత్తిరింపుల భారం బాగా తగ్గిపోయింది. ముఖ్యం అనుకున్న వార్తలని బుక్ మార్క్ చేసుకునేవాడ్ని. కాని ఆ పద్ధతి సౌకర్యంగా తోచలేదు. మరో మార్గం కోసం చూస్తుండగా బ్లాగింగ్ గురించి తెలిసింది. మొదట ఇంగ్లీషులో బ్లాగ్ మొదలు పెట్టాను. ముఖ్యం అనిపించిన వార్తలని పూర్తిగా కాపీ చేసి నా బ్లాగ్ లో పో(పే)స్ట్ చేసుకునేవాడిని. కొద్ది మంది మిత్రులు తెలుగులో బ్లాగ్ మొదలు పెట్టాలని ప్రోత్సహించారు. తెలుగులో అయితే తమకూ ఉపయోగం ఉంటుందని చెప్పడంతో ఆ విధంగా ‘తెలుగులో జాతీయ అంతర్జాతీయ వార్తలు’ బ్లాగ్ ప్రారంభించాను. ఆ పేరుని ఇటీవలే ‘జాతీయ అంతర్జాతీయ వార్తలు, విశ్లేషణ’ గా మార్చాను.

విద్యార్ధులకూ, ఉద్యోగార్ధులకూ ఈ సందర్భంగా నేనూ ఓ అంశాన్ని చెప్పదలిచాను. సివిల్స్ లో విజయవంతం కావాలంటె ఈనాడు వారు చెప్పినట్లు ‘జాతీయ అంతర్జాతీయ పరిణామాలపై’ ఒక స్పష్టమయిన దృక్పధం అవసరం. అయితే అలాంటి స్పష్టమయిన దృక్పధం సివిల్స్ పరీక్షల నేపధ్యంలో ప్రయత్నిస్తే వస్తుందా? రాకపోవచ్చన్నది నా సమాధానం. ఒకవేళ వచ్చినా అది అసమగ్రంగా ఉండడానికి ఎక్కువ అవకాశం ఉంటుంది. పరీక్షలతో సంబంధం లేకుండానే ‘అసలు మనకూ ఒక స్పష్టమయిన దృక్పధం ఉండాలి’ అన్న లక్ష్యంతో ప్రయత్నం ప్రారంభి కృషి చేస్తే మనకటూ ఒక దృక్పధం ఏర్పడడానికి అవకాశం ఉంటుంది. అటువంటి దృక్పధం ద్వారా ఆర్ధిక, సామాజిక, రాజకీయ పరిణామాలన్నీ విశ్లేషించగల శక్తిని సంతరించుకోవాలి అన్న స్పృహ ఉండాలి.

ఆర్ధిక, సామాజిక, రాజకీయ అంశాలన్నీ కలిసి ఉండే దృక్పధాన్ని క్లుప్తంగా ‘తాత్విక దృక్పధం’ (philosophical outlook) అంటారు. స్పష్టమయిన తాత్విక దృక్పధాన్ని కలిగి ఉన్నట్లయితే, అటువంటి దృక్పధం నుండి చూస్తున్నపుడు చరిత్ర నిండా విసిరేసినట్లుగా, కలగాపులగంగా కలిసిపోయీ, విడివిడిగా, ఒకదానికొకటి సంబంధం లేనివిగా కనపడే సంఘటనలన్నీ ఒకానొక చారిత్రక పరిణామ క్రమంలో జరుగుతున్నవేనని అర్ధం అవుతుంది. ఒకరు ఏర్పరుచుకున్న దృక్పధం సరైనదేనా కాదా అని తేలాలంటే ఒక్కటే మార్గం. జాతీయంగా గానీ, అంతర్జాతీయంగా గానీ జరుగుతున్న ప్రతి ముఖ్య సంఘటనా మనం ఏర్పరుచుకున్న దృక్పధంలో చక్కగా ఇమిడి పోయినట్లయితే అది ఖచ్చితంగా సరైన దృక్పధమేననీ, వాస్తవిక దృక్పధమేననీ చెప్పవచ్చు. మనం ఏర్పరుచుకున్న దృక్పధం సరయినదయితే సమాజంలో జరుగుతున్న ప్రతి చిన్నా, పెద్ధా ఘటనకు ఆ దృక్పధం సమాధానం ఇవ్వగలుగుతుంది. సమాధానం మామూలుగా కాకుండా సంతృప్తికరంగా ఉండాలని మరవకూడదు.

సమాజ గమనం గురించి తెలుసుకోవడానికి జరుగుతున్న కృషి ఈనాటిది కాదు. మనిషి తన జీవితకాలంలో పొట్టనింపుకోవడానికి శ్రమ చేయడానికి పోగా ఖాళీ సమయం దొరికిన పరిస్ధుతులు ఏర్పడిన దగ్గర్నుండీ సమాజ గమనం గురించిన ఆలోచనలు మొదలయ్యాయి. అలాంటి ఆలోచనలే తత్వ శాస్త్ర అభివృద్ధికి దారి తీసాయి. తాత్విక దృక్పధాన్ని వివరించేదే తత్వ శాస్త్రం. మానవ సమాజం సృష్టించిన తత్వవేత్తలందరూ ప్రధానంగా ఒకే ఒక అంశం దగ్గర విడిపోయారు. సమస్త భౌతిక విశ్వంలో భావం ముందా? పదార్ధం ముందా? అన్న ప్రశ్నకి సమాధానం ఇచ్చుకునే దగ్గర వారు విడిపోయారు. భావమే ముందు అన్నవారు దేవుడిని సృష్టించారు. పదార్ధమే ముందు అన్నవారు మనిషిని సమాజ చోదకుడిగా తీర్మానించారు. ఈ అంశాన్ని వివరించడం ఈ ఆర్టికల్ పరిధిలోనిది కాదు గనక ఇంతటితో వదిలేస్తున్నాను.

చెప్పొచ్చేదేమంటే పోటీ పరీక్షలకు చదువుతున్నవారు స్పష్టమయిన దృక్పధం ఏర్పరుచుకోదలిస్తే అందుకు పరీక్షల కోసం చేసే కృషి సరిపోకపోవచ్చు. సమాజంలో మనమూ భాగమే కనుక, ఆర్ధిక, సామాజిక, రాజకీయ ఘటనలన్నీ మన జీవితం పైన ప్రభావం పడవేసేవే గనుక మనకూ ఈ అంశాలపై స్పష్టమయిన దృక్పధం ఉండాలి అన్న అవసరాన్ని ముందు గుర్తించాలి. అది గుర్తించగలిగితే మిగిలినవన్నీ వాటంతట అవే సమకూరుతాయి. ఒక దృక్పధం ఏర్పరుచుకునే కృషిలో ప్రతి ఘటననీ ఆసక్తిగా గమనించడం మొదలు పెడతాము. పత్రికల్లో, ఇంటర్నెట్ లో వస్తున్న విశ్లేషణలని ఆసక్తిగా చదవడం మొదలు పెడతాము. ఒక ఘటన జరిగినపుడు దానిని అర్ధం చేసుకోవడానికి దానితో సంబంధం ఉన్న ఘటనలు గతంలో ఏవైనా ఉన్నాయా అని వెతుకుతాము. భవిష్యత్తులో ఏమన్నా జరుగుగుతాయా అని ఎదురు చూస్తాము. అలాంటివి ఏమన్నా ఉంటె వాటిపైన మనకి నచ్చిన విశ్లేషకులు ఏమన్నారో తెలుసుకోవడానికి ప్రయత్నిస్తాము. ఘటనల పరంపరలను పరస్పర సంబంధాలను అధ్యయనం చేస్తున్న క్రమంలోనే ఘటనలన్నింటికీ దండలో దారంలాగా అంతర్లీనంగా ఏదో మామూలు దృష్టికి కనపడని సంబంధం ఉన్నట్లుగా తోచడం మొదలవుతుంది. అలాంటి దారం లాంటి సంబంధాన్ని స్పష్టంగా చూడగలిగితే మీకిక స్పష్టమయిన దృక్పధం దాదాపు ఏర్పడినట్లే.

స్పష్టమయిన దృక్పధం వెంటనే స్పష్టంగా అనిపించకపోవచ్చు. అస్పష్టంగా అయినప్పటికీ కొత్తగా దృక్పధం ఏర్పడినప్పుడు పాత అనుభవాలని సరికొత్త దృష్టితో చూడగలుగుతాము. సరికొత్త దృష్టితో పాత అనుభవాలనీ ఘటనలనీ చూసినపుడు మన దృక్పధం మరింత మెరుగవుతుంది. మెరుగయిన దృక్పధంతో కొత్త ఘటనలనీ, అనుభవాలనీ పరికించినపుడు మరోసారి సరికొత్త లోకం మనముందు సాక్షాత్కరిస్తుంది. ఇది ఒక నిరంతర ప్రక్రియ. ఈ ప్రక్రియ క్రమంలో మనకు తెలియకుండానే స్పష్టమయిన దృక్పధానికి మరింతగా దగ్గరవుతాము. ఈ క్రమం జరుగుతుండగానే మన మెదడులో అనేకానేక ఘటనలు, దుర్ఘటనలు, భావాలు, అభావాలు, వ్యక్తులు, దేశాలు, జాతీయం, అంతర్జాతీయం అన్నీ పేరుకుపోతాయి. అవే మీ సివిల్స్ కృషిలో విజయతీరాలకి చేర్చుతాయి.

సివిల్స్ లోనో మరో పోటీ పరీక్షలోనో నెగ్గాక సాటి మనిషి గురించి మాత్రం మర్చిపోకండి.

20 thoughts on “ఈనాడు లో ‘జాతీయ అంతర్జాతీయ వార్తలు, విశ్లేషణ’ బ్లాగ్

 1. మీరు చెప్పింది చాలా కరెక్టు శేఖర్ గారు. ఇది చదివాక నాకో ఆలోచన వచ్చింది. బహుశా మీలాంటి వారి ద్వారా అది సాధ్యపడుతుందనే అనుకుంటున్నాను.

  మన రాష్ట్రంలో ప్రతి యేటా చాలా మంది సివిల్స్ రాస్తున్నారు. వారిలో చాలా మందికి ఇంగ్లీషులో మంచి ప్రవేశం ఉన్నా, తెలుగు లాగా ప్రావీణ్యం రాదు. అందుకే ఎంతగా ఇంగ్లీషు వచ్చినా మన రాష్ట్రంలో తెలుగులో మెటీరియల్ దొరికితే అదో ఆనందం. బహుశా తెలుగులో మెటీరియల్ కూడా చాలా తక్కువ. అంతెందుకు సార్, ఈవెన్ ఇంటర్నేషనల్ న్యూస్ గురించే మన తెలుగు న్యూస్ పేపర్స్ లో పెద్దగా ఇన్ఫర్మేషన్ ఉండదు. ఇక ఎనాలిసిస్ దొరికే అవకాశం లేదు. వివేక్ లాంటి మేగజైన్ ఉన్నా అది కేవలం మక్కీకి మక్కీ లాగా ఇంగ్లీష్ అనువాదం ఉంటుంది. అనాలసిస్ ఉండదు. ఇక డెయిలీస్ ఈ మధ్యనే స్టార్ట్ చేసినా ఎడ్యుకేషన్ పోర్టల్ లు కలగూర గంప లాగా ఉంటాయి. అప్ డేషన్ చాలా తక్కువ. మీ బ్లాగ్ చూశాక నాలాంటి చాలా మందికి ఇది ఒక వరం (ఇంతకన్నా మరోపదం దొరకలేదు) లాగా అనిపించడానికి కారణం అదే. ఇంత పెద్ద రాష్ట్రం, లేదా భాషా సమాజం లో మాలాంటి స్టూడెంట్స్ కి ఇటువంటి పరిస్ధితి నిజంగా బాధాకరం. అందుకే మీ లాంటి వారు ఎవరైనా తెలుగులో సివిల్స్ విద్యార్ధుల కోసం ఒక బ్లాగ్ ఓపెన్ చేయగలరు. బ్లాగ్ చదివి సివిల్స్ రాస్తామని నా ఉద్దేశ్యం కాదు. ఇంటర్నేషనల్ or నేషనల్ ఎలాంటి ఇష్యూ మీదనయినా కొంత విశ్లేషణాత్మకంగా సమాచారం ఒకే చోట దొరికితే అది చాలా హెల్ప్ అవుతుంది.

  పెద్దలు అవకాశం ఉన్నవారు ఎవరైనా నా (మా) బాధ అర్ధం చేసుకోగలరు..

  meeru cheppindhi chala correct sekhar garu. idhi chadhivaka nako alochana vachindhi, bahusha adhi meelanti vari dhvara sadhyapaduthundhane anukuntunnanu.
  mana rashtram lo prathi eta chala mandhi civils rasthunnaru. varilo chala mandhiki english lo manchi pravesham unna, telugu laga pravinyam radhu. andhuke enthaga english vachina telugulo meterial dhorikithe adho anadham. bhahusa telugu lo meterial kuda chala thakkuva. anthendhuku sir, even international news gurinche mana telugu news papers lo peddhaga information undadhu. ika analysis dhorike avakasham ledhu. VIVEK lanti magazine unna adhi kevalam makkiki makki laga english anuvadham untundhi. anolysis undadhu. ika daileis ee madhye start chesina education portal lu kalagura gampa laga untai. updation chala thakkuva. mee blog chusaka nalanti chala mandhiki idhi voka varam ( inthakanna maro padham dhorakaledhu ) laga anipinchadaniki karanam andhe. intha peddha rashtram, ledha bhasha samajam lo malanti students ki ituvanti paristhithi nijamga bhadhakarm. andhuke mee lanti varu evaraina telugulo civils vidyarthula koasam voka blog open cheyagalru. blog chadhivi civils rasthamani na uddheshyam kadhu. international or national elanti issue meedhanaina kontha visleshanathmaka samacharam oke chote dhorikithe adhi chala help avuthundhi.
  peddhalu, avakasham unnavaru evaraina na ( ma ) bhadha ardham chesukogalaru..

  sorry sekhar garu, konchem ekkuvaga rayaka thappaledhu. meeru ledha mana blog follow ayye varu evaraina idhi chadhivithe atuvanti prayathnam jaruguthundhani asha.

  thanq..

  p.c.sekhar, suryapet, nalgonda

 2. పి.సి.శేఖర్ గారూ, చాలా చక్కగా మీ అభిప్రాయాన్ని వివరించారు. సివిల్స్ కోసం ప్రయత్నించే తెలుగు విద్యార్ధులు ఎదుర్కొంటున్న ప్రతికూల పరిస్ధితిని మీరు చక్కగా వివరించారు. మీ అభిప్రాయం చదివి ఎవరైనా తెలుగులో సివిల్స్ విద్యార్ధుల కోసం బ్లాగ్ ప్రారంభిస్తారని ఆశిద్దాం.

  (ఈ సమాధానం ముగిసాక మీ అభిప్రాయాన్ని నేను తెలుగులోకి టైప్ చేస్తాను.)

  ఒక్క సివిల్స్ కోసమే కాకపోయినా సమాజానికీ, దేశానికీ సంబంధించిన పరిజ్ఞానం కావాలన్నా తెలుగు అవసరం చాలా ఉంది. జాతీయ, అంతర్జాతీయ అంశాల్ని మాతృ భాషలో చదివి తెలుసుకోవడంలో ఉన్న తృప్తి వేరు. ఆ అవసరాన్ని గుర్తించే మన తెలుగు సాఫ్ట్ వేర్ ఇంజనీర్లు తెలుగు కోసం టైపింగ్ ఉపకరణాలని తయారు చేశారు. తద్వారా ఇంటర్నెట్ లో తెలుగు వాడకం పెరగాలని వారు కోరుతున్నారు. కాని ఆ విషయం ఇంటర్నెట్ లోకి వస్తే తప్ప తెలియడం లేదు.

  మీరొక సంగతి గమనించాలి. ఎప్పటికప్పుడు జాతీయ, అంతర్జాతీయ అంశాల్ని విశ్లేషణలతో వివరించడం అన్నది శ్రమతో కూడుకున్నపని. రోజులో చాలా సమయాన్ని వెచ్చించాల్సి ఉంటుంది. జీవనం కోసం పోగా అలా వెచ్చించడానికి సమయం సరిపోయే అవకాశం చాలా తక్కువ గా ఉంటుంది. అదీ గాక పోటీ పరీక్షలకి విద్యార్ధులని, ఉద్యోగార్ధులని తయారు చేయడం అన్నది ఒక పూర్తి స్ధాయి వ్యాపారంగా మారిపోయింది. అలాంటివారు ఒక పక్క లక్షలు సంపాదిస్తుంటే, అవే మెటీరియల్ తో ఉచితంగా బ్లాగ్ నిర్వహించడానికి ఆసక్తి ఎవరికయినా ఎందుకు ఉంటుంది? ఒకవేళ అలాంటి బ్లాగ్ పెట్టినా డబ్బు సంపాదనతో ముడిపెట్టకుండా ఉండడం దాదాపు అసాధ్యంగానే నాకు తోస్తోంది.

  నేనే ఆ పని చేయాలన్నది మీ ఉద్దేశ్యం లా ఉంది. నేను జాబ్ చేసుకుంటూ ఈ బ్లాగ్ నిర్వహిస్తున్నాను. సివిల్స్ పరీక్షల గురించిన విషయాలు చాలా పత్రికలు, మేగజైన్లు (తెలుగులోనివే) అందిస్తున్నాయి. అంతకంటె అదనంగా ఉన్నాయంటారా? సివిల్స్ కి కావలసింది జాతీయ, అంతర్జాతీయ పరిణామాలపై స్పష్టమయిన దృక్పధం గనక, దానికి నా బ్లాగ్ ఉపయోగం అని మీరు అంటున్నారు గనక నేనిక కొత్తగా మరొక బ్లాగ్ పెట్టాల్సిన అవసరం లేదేమో కదా.

 3. శ్రీకాంత్ మీ విద్వేషాన్ని నా బ్లాగ్ లో అనుమతించను. మీరిలాగే కొనసాగిస్తే నా బ్లాగ్ నుండి నిషేదించడానికి కూడా వెనకాడను. గమనించండి.

 4. “సివిల్స్ లోనో మరో పోటీ పరీక్షలోనో నెగ్గాక సాటి మనిషి గురించి మాత్రం మర్చిపోకండి.”

  విశేఖర్ గారూ,

  ఈ కథనం మొత్తానికి హైలెట్ అనదగ్గ వాక్యమిది.

  ఈ బ్లాగ్ సేవలు సివిల్ పరీక్షలకు అవసరమా? లేదేమో..

  జాగ్రత్తండీ.. కాస్త ఏమారితే, ఎక్కడికో పోతాం.. మీరు ఇలాగే ఉండండి చాలు.

  మార్క్సిస్ట్ దృక్పథం అంటూనే మీ బ్లాగ్ గురించి పరిచయం చేసిన ఈనాడుకు కృతజ్ఞతలు చెప్పాలి.

  మరోసారి చెబుతున్నా.. జాగ్రత్త. మీ ఆరోగ్యాన్ని ఫణంగా పెట్టి దీంట్లో దిగారు. మీ ఈ కృషికే అంకితం కండి. దీన్నే కొనసాగించండి.

  సంవత్సర కాలంలో 1500 పైగా పోస్టులు.. లక్షా యాభై వేలకు పైగా హిట్లు. హిట్‌ల విషయం పక్కన బెట్టండి. కానీ ఇది సామాన్యమైన విషయం కాదు. అనితరసాధ్యమైన సాధనే..

  ఎదురు చూడని కోణంలో లభించిన ఈ గుర్తింపు మీలో మరింత సంయమనాన్ని, మరింత నిబద్ధతను, మరింత సత్యశోధనను పెంపొందించాలని కోరుకుంటూ..

  మనఃపూర్వక అభినందనలు.

 5. రాజుగారూ, మీ హెచ్చరిక సదా గమనంలో ఉంచుకుంటాను.

  బాగా గుర్తు చేసారు. ఈనాడు వారికి కూడా ఈ సందర్భంగా ‘బ్లాగ్ ముఖంగా’ కృతజ్ఞతలు చెబుతున్నాను.

 6. ఇప్పుడున్న చదువులు ఒక వర్గ ప్రయొజనాన్ని కాపాడేటివే. ఈ చదువులవల్ల ఏ విషయంపైనైనా స్పస్టమైన ద్రుక్పదం ఏర్పర్చకొవడం అసాద్యమైన పని . కొన్ని విషయాలలొ సమాజ భావజాలాన్ని దాటి అభుదయంగా ఆలొచించినా లేక కొంతవరకు విప్లవకరంగా వ్యెవహరించినా స్పస్టమైన గ్రహింపు వుండదు. అస్పస్టంగా ఏది ఏందుకుజరుగుతుందొ తెలియదు .
  ఒక్క మాటలొ చెప్పాలంటె మార్కిజం తెలియకపొతె దేనిపైనా స్పస్టమైన ద్రుక్పదం వుండదు.

 7. రాం మోహన్ గారికి, మార్క్సిజం నిస్సందేహంగా ఉన్నతమైన ప్రాపంచిక దృక్పధమే. అశేష శ్రామిక జనమే సమాజానికి చోదక శక్తులుగా మొట్టమొదట గుర్తించింది మార్క్సిజమే. మార్సిజమే లేనట్లయితే తమ శ్రమతో ప్రపంచాన్ని నడిపిస్తున్న శ్రామిక వర్గం పరిస్ధితి కనాకష్టంగా ఉండేది. రష్యా, చైనాలలో శ్రామికవర్గ విప్లవాలు సంభవించాక సోషలిస్టు వ్యవస్ధల నిర్మాణం మొదలయ్యాకే అమెరికా, యూరప్ లలో పెట్టుబడిదారీ వ్యవస్ధలు తమను తాము సంక్షేమ రాజ్యాలుగా ప్రకటించుకున్నాయి. రష్యా, చైనాల్లో పెట్టుబడిదారీ వర్గం తిరిగి పై చేయి సాధించాక సోషలిస్టు వ్యవస్ధలు కూలిపోయాయి. అవి కూలాక పెట్టుబడిదారీ వ్యవస్ధలకు అడ్డూ అదుపూ లేకుండా పోతోంది. ప్రపంచ వ్యాపితంగా పెట్టుబడిదారీ, భూస్వామ్య వర్గాలు కార్మికులపైనా, రైతాంగంపైనా దోపిడీ తీవ్రం చేశాయి.

  మార్క్సిస్టు దృక్పధం నుండి తమను తాము రక్షించుకోవడానికి పెట్టుబడిదారీ వ్యవస్ధ ప్రత్యామ్నాయ భావాజాలాన్ని సృష్టించింది. రాజీలేని విధంగా వ్యవస్ధ మార్పును ప్రభోధించే మార్క్సిజానికి ప్రత్యామ్నాయంగా రాజీధోరణిలో పెట్టుబడిదారులతో సంధి చేసుకునే సరికొత్త మార్క్సిస్టులను అది సృష్టించుకుంది. వారే సోషల్ డెమొక్రాట్లుగా, సోషలిస్టులుగా, లెఫ్టిస్టులుగా, గ్రీన్ పార్టీలుగా మోడరేట్ లెఫ్టిస్టులుగా, లెఫ్ట్ ఆఫ్ ది సెంటర్ గా అనేక రూపాల్లో చలామణీ అవుతున్నారు. ఇవన్నీ మార్క్సిజం యొక్క ప్రభావాన్ని తట్టుకుని తగ్గించడానికి ఉద్దేశించినవే. ఆయా కాలమాన పరిస్ధితులకు అనుగుణంగా ఆయా రూపాలతో అవి చలామణీ అవుతున్నాయి. ఇవి పెట్టుబడిదారీ వర్గంతో రాజీ పడినప్పటికీ మితవాదులతోనూ, మతవాదులతోనూ, ఇంకా అనేక అభివృద్ధి నిరోధక శక్తులతోనూ పోలిస్తే ‘ప్రగతిశీలం’ గా కనిపించే భావాజాలాన్ని వ్యక్తం చేస్తున్నాయి. వీటన్నింటినీ మార్క్సిస్టులు పరిగణలలోకి తీసుకోవాలి. ఇలాంటి ప్రగతిశీల భావాలను మెరుగుపరిచి సమాజం మార్పుకోసం జరిగే కృషిలో మమేకం చేసుకోవడానికి కృషి చేయాలి.

  అయితే “మార్క్సిజం తెలియకపోతే దేనిపైనా స్పష్టమయిన దృక్పధం ఉండదు” లాంటి స్వీపింగ్ స్టేట్ మెంట్లు అలాంటి కృషికి ఆటంకంగా ఉంటాయని గుర్తించాల్సి ఉంది. మార్క్సిజంతో సంబంధం లేకుండానే అదేమిటో తెలియకుండానే ‘మానవతా దృక్పధం’ పేరుతోనో మరొక పేరుతోనో ప్రగతిశీల భావాలు వ్యక్తం అవుతున్నపుడు అవి ‘మార్క్సిజం’ కాదని తిరస్కరించడం తగదు. ప్రగతిశీలతను గుర్తిస్తూ అది మరింత మెరుగుకావడానికి సహాయం అందించడం మాని మార్క్సిజం కాకపోతే దాన్ని పట్టించుకోవాల్సిన అవసరం లేదు అన్న సందేశాల్ని ఇవ్వడం ప్రతికూలతను రెచ్చగొట్టడమే. సమాజంలో అనేక ధోరణులు వ్యాప్తిలో ఉన్నపుడు వివిధ సెక్షన్లు ఆ ధోరణలకు ప్రభావితమై ఉంటాయి. ఆ ప్రభావాలను అధిగమిస్తూ కూడా అనేకమంది రకరకాల పేర్లతో ప్రగతిశీల దృక్పధాలను కలిగి ఉన్నారు. వాటిని గుర్తించి ఆహ్వానించేలా మార్క్సిస్టులు ఉండాలి. లేదంటే ఒంటరిగా మిగలక తప్పదు. ఒంటరిగా మిగిలాక సమాజం మార్పు కోసం కృషి చేయమని ప్రభోధించే మార్క్సిస్టు దృక్పధం ఒట్టిపోయినట్లే. అచ్చంగా నలుపు తెలుపు గా సమాజాన్ని చూడడం ప్రారంభిస్తే మార్క్సిస్టులు సాధించేదేమీ ఉండదు.

 8. విశెఖర్ గారికి “మార్కిజం తెలియకపొతె దేనిపైనా సరైన ద్రుక్పదం వుండదు” అన్న వాక్యంలొ కొంతమందికి దానిపైన (మార్కిజం పైన) వ్యెతిరేక భావం ఎర్పడే ప్రామాదం వుంది మనం వాళ్ళను డిమాండు చెసినట్టు గానొ లేక వాళ్ళ అభిప్రాయాలను కించపరిచినట్టు గానొ భావించే ప్రమాదం వుంది. .,మీరు చెప్పింది నిజం. కాని నేను చెప్పిన దానిలొ మానవతా ద్రుక్పదం తొనొ లేక మరేదానితొనొ మంచి చేసిన వాళ్ళను మార్కిజం తెలియనంత మాత్రాన వళ్ళను వ్యెతిరేకించే దొరని పై కామెంట్లొ వుందా? పొరాటంలొకి ప్రజానీకాన్ని సమీకరించెటప్పుడు ఉపరితల అంశాలను పరిగణలొకి తీసుకొరు .

 9. రామ్ మోహన్ గారూ, పోరాటం లోనికి జనాన్ని సమీకరించేటప్పుడు ఉపరితలం అంశాలకి పరిగణనలోకి తీసుకోరని భావించడం సరికాదేమో. ఎందుకంటే పునాది అంశాలని మాత్రమే పరిగణనలోకి తీసుకుంటె జనాన్ని సమీకరించడం అన్ని సమయాల్లో సాధ్యం కాదు. ప్రజలు చెందిన అన్ని సమస్యలనీ పరిగణిస్తేనే పోరాటాల్లోకి వారు రావడానికి అవకాశం ఉంటుంది.

  మార్క్సిజం తెలియకపోతే మంచి చేసినా వ్యతిరేకించాలని మీ వ్యాఖ్యలో లేదు. అలా ఉందన్నది నా ఉద్దేశ్యం కాదు. అయితే మనం ఉన్న చోటుని బట్టి కొన్ని స్టేట్ మెంట్లను ప్రస్తావించకపోవడం మంచిదని నా ఉద్దేశ్యం. నిజానికి మీ వ్యాఖ్యలో అసలు తప్పు లేదు. ప్రతి అంశాన్నీ సాపేక్షికంగా చూడాలన్న వెలుగులో నా సమాధానం రాసాను. నా వ్యాఖ్య మీ వ్యాఖ్యకి అదన్పు చేర్పు మాత్రమే.

  రాం మోహన్ గారూ మీరు బ్లాగ్ ఎందుకు ప్రారంభించకూడదు. ఆ అవసరం ఉంది గనుక మీరూ బ్లాగ్ మొదలు పెట్టాలని నా కోరిక.

 10. ఖతిజగారు, కొత్త పోస్టులన్నీ హోం పేజి లో కనపడుతుంటాయి. పైన ఉన్న రెండు పోస్టులు తాజా పోస్టులుగా గుర్తించవచ్చు. హోం పేజిలో తాజాగా రాసిన డజను పోస్టులు ఉంటాయి. అంతకుముందువి కావాలంటే ఎడమవైపు కింది భాగంలో ‘నియంత్రణ విధానం’ అనే హెడ్డింగ్ కింద ‘ఓల్డర్ పొస్ట్స్’ అన్న లింక్ పైన క్లిక్ చేయవచ్చు. తేదీలవారీగా కావాలంటే బాగా కిందికి వెళ్తే క్యాలండర్ ఉంటుంది. అక్కడ తేదీలపై క్లిక్ చేస్తే ఆ తేదీలో రాసిన పొస్టులని చూడవచ్చు. క్యాలండర్ కింద అంతకుముందు నెలకి లింక్ ఉంటుంది.

  మీరు కోరిన వివరాలు ఇవేనా? ఇంకేమన్నానా?

 11. విశెఖర్ గారు. ఉపరితల అంశాలను పరిగణలొకి తీసుకొరంటె నా ఉద్దెశం ఒక పొరటంలొకి సమీకరిచాలంటె కులాలు, మతాలు, జాతులు, వీటికి ప్రాధాన్యం ఇవ్వకుడదని . ఒక సమస్య పరిస్కారం ముఖ్యం గాని అందులొకి వచ్చెవాళ్ళు భక్తులా, లేక నాస్తికులా అతని కులమేది ,మతమేది అతను ఎలాంటి భావాలతొ వున్నాడు.మార్కిస్టా, కాదా అనే ఉపరితల అంశాలను పరిగణలొకి తీసుకొము.
  మీరు బ్లాగు గురించి అడిగారు కాని దాన్ని అంత సమర్దవంతంగా నిర్వహించగలనా అనే అనుమానం వుంది.

 12. రాం మోహన్ గారు, ఉపరితల అంశాల గురించిన మీ అభిప్రాయం ఇప్పుడు నాకు అర్ధం అయింది. మీరు చెప్పింది కరెక్టే. ఉపరితలం లో ప్రజల మధ్య ఉండే మిత్ర వైరుద్యాలకు ప్రాధాన్యం ఇవ్వరని మీ అభిప్రాయం.

  బ్లాగ్ విషయం. మొదలు పెడితే సమర్ధత అదే వస్తుంది. నిజం చెప్పాలంటే బ్లాగ్ మొదలు పెట్టినపుడు నేనూ కొత్తే. అనుభవమే మెరుగులు దిద్దుతుంది. నా అభిప్రాయం అయితే అనుమానం పెట్టుకోకుండా బ్లాగ్ ప్రారంభించండి. రోజూ కాకపోయినా వారానికి ఒక పొస్టు రాయండి. అలా కాకపోతే నెలకి ఒకటయినా రాయండి.

 13. విఘ్నేష్ గారు…పై పోస్టులు కూడా చదవండి. మీకు ఉపయోగపడగలవు.

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

Connecting to %s