$800 కి ఒప్పుకుని $30 ఇచ్చి దొరికిపోయిన ఒబామా భద్రతాధికారులు


Obama securityఒక రాత్రికి 800 డాలర్లు ఇస్తామని ఒప్పుకున్న అమెరికా భద్రతాధికారులు సేవ ముగిశాక 30 డాలర్లు మాత్రమే ఇచ్చి మోసం చేయడంతో పోలీసులకి పట్టుబడ్డారని బి.బి.సి తెలిపింది. కొలంబియా లో జరిగిన ‘ఆర్గనైజేషన్ ఆఫ్ అమెరికా స్టేట్స్’ (ఒ.ఎ.ఎస్) కాన్ఫరెన్స్ కి హాజరయిన బారక్ ఒబామా భద్రత కోసం కొలంబియా వెళ్ళిన అమెరికా సీక్రెట్ సర్వీస్ అధికారులు వ్యభిచారం చేసి దొరికిపోయిన సంగతి తెలిసిందే. ఒప్పుకున్న మొత్తాన్ని చెల్లించకుండా ఒబామా భద్రతాధికారి మోసం చేయబోవడంతో మహిళ ఆగ్రహం చెంది పోలీసులకి ఫిర్యాదు చేయడంతో అమెరికా అధ్యక్షుడి భద్రతాధికారుల నైతిక నీచత్వం ప్రపంచానికి తెలిసి వచ్చింది.

పొట్ట కూటి కోసం నిస్సహాయ కొలంబియా మహిళ పడుపు వృత్తిని  చేపడితే, ఆమె శరీరాన్ని వాడుకున్న అమెరికా భద్రతాధికారి సిగ్గూ లజ్జా లేకుండా ఆమె పొట్టపై తన్నడానికి కూడా సిద్ధపడ్డాడు. డబ్బిచ్చి వస్తువు కొనుక్కోవడం కస్టమర్లు చేసే పని. ఇక్కడ పరస్పరం నమ్మకం ముఖ్య పాత్ర పోషిస్తుంది. స్త్రీ పురుష సంబంధం వ్యాపారీకరించబడిన పడుపు వృత్తిలోనైనా అదే సూత్రం పని చేస్తుందని మహిళ నమ్మక తప్పదు. ఆ మహిళ తనకిస్తానని అంగీకరించిన మొత్తాన్ని ఇవ్వకుండా మోసం చేస్తే తానిచ్చిన సుఖాన్ని తిరిగి తీసుకోలేని సహజ నిస్సహాయతలో ఉంటుంది.  ఆమె నిస్సహాయత ని శారీరకంగా కూడా సొమ్ము చేసుకోవడానికి సిద్ధపడిన ఒబామా భద్రతాధికారిది మామూలు భాషకి అందని నీచత్వం. దేశాధ్యక్షుడి భద్రత కోసం పరాయి దేశానికి వెళ్ళి, భాధ్యతని విస్మరించి మరీ వ్యభిచరించడం నైతిక పతనం కాగా, కనీసం పతనంలో కూడా నిజాయితీ చూపని వీడి పతన వ్యక్తిత్వం కుళ్లి దుర్గంధం వెదజల్లుతోంది. వీడి దుర్గంధాన్ని మోస్తున్నందుకు ఈ అక్షరాలెంతగా దుఃఖిస్తున్నాయో కదా! 

24 యేళ్ళ కొలంబియా మహిళ తో న్యూయార్క్ టైమ్స్ విలేఖరులు ఇంటర్వ్యూ తీసుకున్నారు. కొలంబియాలో కొన్ని చోట్ల పడుపు వృత్తి నేరం కాదు. అందుకే సదరు మహిళ పోలీసులకి ఫిర్యాదు చేయగలిగింది. ఆమె తనను తాను ప్రాస్టిట్యూట్ గా చెప్పడానికి అంగీకరించలేదు. తనను ‘ఎస్కార్ట్’ గా ఆమె పేర్కొంది. ఒబామా భద్రతాధికారులు తనను డిస్కో ధెక్ వద్ద కలిశారనీ, ‘చాలా బుద్ధిమంతులుగా’ కనిపించారనీ తెలిపింది. ఉదయం పూట డబ్బు విషయంలో తగాదా పడ్డామని చెప్పింది. తాము ఒబామాతో ఉన్నట్లు వాళ్ళు చెప్పలేదనీ తెలిపింది. $30 డాలర్లు మాత్రమే ఇస్తానని చెప్పిన అధికారి పోలీసుల జోక్యంతో $225 చెల్లించుకున్నాడని తెలిపింది. ఒక ఏజెంటయితే అసలు డబ్బులే ఇవ్వనన్నాడని డెయిలీ మెయిల్ తెలిపింది. 

కొద్ది రోజుల తర్వాత తమ తగాదా వార్త అయిందని ఫ్రెండ్ చెప్పడంతో హతాశురాలినయ్యానని న్యూయార్క్స్ టైమ్స్ తో మాట్లాడిన యువతి తెలిపింది. అమెరికా సీక్రెట్ సర్వీస్ అధికారితో తాను గొడవపడ్డానని తెలుసుకుని తీవ్రంగా భయపడ్డానని తెలిపింది. “నాకు భయం వేసింది. అతనిని శిక్షిస్తే ప్రతీకారం తీర్చుకుంటాడేమోనని భయపడ్డాను. ఇది నిజంగా చాలా పెద్ద వ్యవహారం. అమెరికా ప్రభుత్వంతో సంభందించినది. ఈ భయంతో వరుసగా నెర్వస్ ఎటాక్స్ వస్తున్నాయి. రోజంతా ఏడుస్తూనే ఉన్నాను” అని విలేఖరితో అన్నది.

ఈ స్కాండల్ లో జీవించిన అమెరికా సీక్రెట్ సర్వీసు అధికారులు 12 మందిని అప్పటికప్పుడు వెనక్కి పంపేశారు. 20 మంది కొలంబియాHotel Caribe మహిళలు అమెరికా భద్రతాధికారులకు ఆ రాత్రి సుఖాన్ని అమ్మడానికి సిద్ధమాయారని ‘న్యూయార్క్ టైమ్స్’ ని ఉటంకిస్తూ బి.బి.సి తెలిపింది. సంఘటనలో దొరికిపోయిన ముగ్గురు సీక్రెట్ సర్వీస్ అధికారులు సంస్ధ నుండి వెళ్ళిపోయారు. ఒక సూపర్ వైజర్ ని డిస్మిస్ చేయగా, మరొకరు రిటైర్ మెంట్ తీసుకున్నాడు. ఇంకొక జూనియర్ స్ధాయి అధికారి రాజీనామా చేశాడు. ఎనిమిది మంది సెలవులో వెళ్ళిపోయారు. మొత్తం 12 మంది ఏజెంట్లపై విచారణ జరుగుతోంది. వారందరూ వేశ్యలతో దొరికిపోయారు. నైట్ క్లబ్ లో తాగి తందనాలాడారు.  వారందరి సెక్యూరిటీ క్లియరెన్స్ ప్రభుత్వం రద్దు చేసింది.

అమెరికా అధ్యక్షుడి కోసం భద్రతా సేవలను నిర్వర్తించే అధికారులు సామాన్యులు కారు. ఆ స్ధాయికి చేరుకోవడానికి అనేక మంది కలలు కంటూ ఉంటారు. అనేక స్ధాయిల్లో వివిధ పరీక్షలు నిర్వహించి, అనేక సంవత్సరాల సర్వీసు రికార్డులను పరిశీలించి ఒబామా భద్రతాధికారులను నియమిస్తారు. అధ్యక్షుడి భద్రతాధికారులు ఈ విధమైన కార్యకలాపాలలో ఉన్నట్లయితే అది చివరికి అధ్యక్షుడి భద్రతకే ప్రమాదాన్ని తెచ్చిపెడుతుంది. వారిని ఆకర్షించే మహిళ స్వయంగా మరొక దేశానికి పని చేసే రహస్య గూఢచారి కావచ్చు. ఒబామా భద్రతా వ్యవస్ధలోకి చొచ్చుకు వెళ్లడానికి ప్రయత్నిస్తున్న హంతక ముఠా సభ్యురాలు కావచ్చు. లేదా తనకి తెలియకుండానే భద్రతాధికారుల వద్ద నుండి సమాచారాన్ని బయటకు పంపే ‘బగ్’ ని మోస్తున్న అమాయక ఎర కావచ్చు. ఇవేమీ పట్టించుకోకుండా తమది కానీ చోట ఒక రాత్రి సుఖాన్ని ‘కొనుక్కోవడానికి’ ప్రయత్నించడం  అధో స్ధాయి భ్రష్టత్వం.

అధ్యక్షుడి భద్రతని చూసే వ్యక్తులు కేవలం శారీరక దృఢత్వాన్ని ప్రదర్శించే మల్లయోధులు మాత్రమే కాదు. దేశాధ్యక్షుడి ప్రాణాలకు కాపలా ఉండడం దేశభక్తి ప్రదర్శనలో ఒకానొక సమున్నత స్ధాయి. ప్రమాదం ముంచుకు వచ్చిన చోట తన ప్రాణాన్ని అవలీలగా అడ్డు పెట్టగల ‘వ్యక్తిగత ఔన్నత్యాన్ని’ వారు ప్రదర్శించాల్సి ఉంటుంది. ఆ ప్రదర్శనలో దేశ ప్రజల ప్రయోజనాలు దాగి ఉంటాయి. దేశ పరువు ప్రతిష్టలు ఇమిడి ఉంటాయి. వారి సమున్నత వ్యక్తిత్వం దేశాధ్యక్షుడి వ్యక్తిత్వానికి మరింత శోభని తేవాలి. కొంగొత్త సొబగులు అద్దాలి. వారిని చూసి దేశం గర్వ పడాలి. వారి దేశ భక్తి ప్రదర్శన చూసి ప్రతి పౌరుడూ గర్వంతో పులకరించాలి.

కేవలం కండలు తిరిగిన బలశాలురు మాత్రమే నిర్వర్తించగల బాధ్యత కాదది. రోజువారీ జీవనంలోని ప్రతి అంశలోనూ అత్యంత ధీశాలురు మాత్రమే నిర్వర్తించే బాధ్యత అది. సున్నితత్వంతో పాటు ధీరత్వం, తెగింపుతో పాటు దయార్ద్రశీలత, సంయమనంతో పాటు దూకుడు, నెమ్మదితనంతో పాటు వేగం… ఈ లక్షణాలన్నీ జమిలిగా కలిసి ఉన్నవారే దేశాధిపతుల భద్రతాధికారులు. వారు వాసన కుక్కను నడిపే ‘డాగ్ హాండ్లర్’ కావచ్చు. కేవలం సమాచారం సేకరించే ఎనలిస్టు కావచ్చు. జవాను కావచ్చు, కమాండర్ కావచ్చు. అధ్యక్షుడి పక్కనే నిలిచే అంగరక్షకుడు కావచ్చు. వీరందరి పని ఒకటే. అధ్యక్షుడి భద్రత. అలాంటి బృందంలోని సభ్యులు ఏకంగా డజను మంది భాధ్యతను విస్మరించి రాత్రి సుఖానికి కక్కుర్తి పడ్డారంటే ఏ స్ధాయి పతనం అది?

సంవత్సరాల సర్వీసులని పరిశీలించి, అనేకానేక కోణాల్లోని వ్యక్తిత్వాలను పరిశీలించి వడపోసి ఎన్నిక చేసిన భద్రతాధికారుల్లో పన్నెండు మంది శారీరక సుఖానికి కక్కుర్తి పడ్డారంటే వడపోతలో తొలగించబడిన వందలాది మంది భద్రతాధికారుల నైతిక స్ధాయి ఏపాటిదో ఊహించవలసిందే. ఇది ఒక ఐసోలేటేడ్ కేసు కాదు. డజను మంది ఒకేసారి అనర్హులుగా వెనక్కి వెళ్లిపోవడం ‘ఐసోలేటేడ్’ కాదు. వారి వెనుక వారి అనుభవం ఉంది. వివిధ స్ధాయిల్లో వారు కనబరిచిన ‘పనితనం’ ఉంది.  వారి అనుభవాన్ని పరిశీలించిన ఉన్నతాధికారుల నిర్ధారణలు ఉన్నాయి. వీటన్నింటిలోనూ వారి నైతిక స్ధాయి ఒక్కసారైనా వ్యక్తం కాలేదంటే నమ్మలేము. కాకుంటే అదేమంత పెద్ద విషయం కాదని భావించే, ఉన్నత స్ధాయికి ప్రమోట్ చేయబడ్డ వాస్తవాన్ని ఇక్కడ గుర్తించాలి. “ఇంతకు ముందు ఒక్కసారయినా జరగకుండా ఇలాంటివి ఇప్పుడు జరగవు” అన్న కాలిఫోర్నియా రిప్రెజెంటేటివ్ డారెల్ ఇస్సా మాటల అంతరార్ధాన్ని గుర్తించాలి.

అవును, అదేమంత పెద్ద విషయం కాదు. ప్రభావశీలుడయిన రాజకీయ నాయకుడి ఇంటర్వ్యూకి వెళ్ళిన అందమైన యువతిని మోహించి కన్నుగీటినా అదేమంత విషయం కాదు. అది సౌందర్య ప్రియత్వం. ప్రపంచ దేశాలకి అప్పులిచ్చి ఆడుకునే అత్యున్నత ఐ.ఎం.ఎఫ్ మేనేజింగ్ డైరెక్టర్ పదవిలో ఉండి తన సబార్డినేట్ ఉద్యోగితో అక్రమ సంబంధానికి సిద్ధపడినా అదేమంత విషయం కాదు. అది పాలనా సామర్ధ్యం. తానున్న హోటల్ గదిని శుభ్రం చేయడానికి వచ్చిన మహిళతో బలవంతపు శృంగారానికి సిద్ధపడినా అదేమంత పెద్ద విషయం కాదు. అది పురుషత్వం. కడుపు కక్కుర్తి కోసం ఒళ్ళు అమ్ముకోవడానికి సిద్ధపడిన స్త్రీలతో అసహ్యకరంగా సామూహిక శృంగారానికి దిగినా అదేమంత పెద్ద విషయం కాదు. అది శారీరక దృఢత్వం. మహా అయితే,  జస్ట్, ఓ ఐదు నిమిషాల్లో కోరిక తీర్చుకోవడానికి ప్రయత్నించాడు, అంతే కదా! అంతమాత్రానికే, ఐదు నిమిషాల కక్కుర్తిని వ్యవస్ధ నడవడితో ముడి పెట్టాలా?

ఐదు నిమిషాల కక్కుర్తిలోనే ఆ వ్యక్తి విలువలు లేవా? ఐదు నిమిషాల కక్కుర్తిలోనే దశాబ్దాలు నడిచి వచ్చిన జీవన గమనం లేదా? దశాబ్దాలు నడిచి వచ్చిన జీవన గమనం చుట్టూ వేలాది అభిమానుల ప్రోత్సాహం లేదా? వేలాది అభిమానులతో నిండి ఉన్న రాజకీయ వ్యవస్ధ లేదా? రాజకీయ వ్యవస్ధ శాసిస్తున్న సామాజికార్ధిక వ్యవస్ధ లేదా? సామాజికార్ధిక వ్యవస్ధలో సమిధలుగా నలుగుతున్న కోట్లాది సామాన్యుల జీవన వ్యధలు లేవా? ఆ విలువలకీ, జీవన గమనానికీ, అభిమానుల నైతిక నిశ్చయానికీ, సామాన్యుల వ్యధలని లిఖిస్తున్న వ్యవస్ధకీ స్ట్రాస్ కాన్ ప్రతినిధి. స్ట్రాస్ కాన్ ప్రాతినిధ్యం వహిస్తున్న వ్యవస్ధలో ఒబామా భద్రతాధికారి ఒక జూనియర్ పార్టనర్. వారిద్దరూ వ్యవస్ధ పతనాన్ని తరతమస్ధాయిల్లో ప్రతిబింబిస్తున్నవారే.

8 thoughts on “$800 కి ఒప్పుకుని $30 ఇచ్చి దొరికిపోయిన ఒబామా భద్రతాధికారులు

 1. “కనీసం పతనంలో కూడా నిజాయితీ చూపని వీడి పతన వ్యక్తిత్వం”

  “దేశాధ్యక్షుడి ప్రాణాలకు కాపలా ఉండడం దేశభక్తి ప్రదర్శనలో ఒకానొక సమున్నత స్ధాయి. ప్రమాదం ముంచుకు వచ్చిన చోట తన ప్రాణాన్ని అవలీలగా అడ్డు పెట్టగల ‘వ్యక్తిగత ఔన్నత్యాన్ని’ వారు ప్రదర్శించాల్సి ఉంటుంది.”

  “ఐదు నిమిషాల కక్కుర్తిలోనే ఆ వ్యక్తి విలువలు లేవా? ఐదు నిమిషాల కక్కుర్తిలోనే దశాబ్దాలు నడిచి వచ్చిన జీవన గమనం లేదా? దశాబ్దాలు నడిచి వచ్చిన జీవన గమనం చుట్టూ వేలాది అభిమానుల ప్రోత్సాహం లేదా?”

  విశేఖర్ గారూ

  భావోద్వేగం శిఖరస్థాయికి చేరినప్పుడు మాత్రమే పుట్టుకొచ్చే మెరుపు వాక్యాలివి. మరెవరి నుండో ఆశించవలసిన ఉదాత్తవిలువలను వీళ్లనుండి ఆశిస్తున్నారేమో అనిపిస్తుంది.

  మనదేశంలో, రాష్ట్రంలో మంత్రుల, ప్రభుత్వాధినేతల భద్రతకు కేటాయించబడిన పోలీసు అధికారుల విడిది హోటళ్లను చూస్తే వీళ్ల విలువల ప్రాతిపదిక ఏంటో అర్థమవుతుంది. నూటికి 99 మంది తాగుబోతులున్న పాలనాంగం ఎలాంటి విలువలను కలిగి ఉంటుందో ఎవరికి వారు ఊహించవలసిందే.

  అత్యున్నత శిక్షణకు దేశంలోనే మారుపేరుగా చెప్పబడుతున్న గ్రేహౌండ్స్ దళాలు వాకపల్లిలో జరిపిన అత్యాచార పరంపరతో తామెంత నీచాధములో నిరూపించుకున్నారు కదా. నిజమైన ప్రత్యర్థిని పట్టుకోవడం చేతకాని దద్దమ్మలు నిస్సహాయ మహిళల వద్ద మాత్రం అచ్చు ఆంబోతుల్లానే వ్యవహరించారు.

  ఆత్మాహుతితో నేలకొరిగిన శవాలపై ఉచ్చ కార్చేంత నీచాతినీచ సంస్కృతి వీళ్లది….

  ప్రపంచవ్యాప్తంగా వీళ్లకు ఒక సమున్నత వ్యక్తిత్వమూ, దానికొక శోభ కూడానా?

 2. రాజ శేఖర రాజు గారూ, అమెరికా పెట్టుబడిదారీ వ్యవస్ధ ఆమూలాగ్రం కుళ్లిన నేపధ్యంలో ఉన్నత స్ధాయిలోని వ్యక్తులు పాటించవలసిన విలువలకీ, వాస్తవంలో ఉన్న విలువలకీ మధ్య ఎంత అగాధం ఉన్నదో చెప్పడానికి ఈ ఆర్టికల్ రాసాను.

  నేను వర్ణించిన ఔన్నత్యం నిజానికి సాపేక్షికం కాదు. అది ఆబ్సల్యూట్ నెస్ కి సంబంధించినది. వ్యక్తులనూ వ్యవస్ధలనూ వేరు చేసి చూస్తున్న నేపధ్యంలో అలాంటి ఆబ్సల్యూట్ నెస్ ని ఎత్తి చూపి, రెలిటివ్ లక్షణంలో కూడా అధమ స్ధాయిలో ఉన్న విలువల అగాధాన్ని ఇక్కడ చూపదలిచాను. నేను చెప్పదలిచిన అంశాన్ని కొలంబియా ఘటన సందర్భంగా చెబితే ఎఫెక్టివ్ గా ఉంటుందేమో అని భావించాను. నా ప్రయత్నం సఫలం అయినట్లు లేదు.

  వ్యవస్ధకీ అందలి వ్యక్తులకీ ఉన్న అవినాభావ సంబంధాన్ని ఎఫెక్టివ్ గా వివరించడానికి చేసిన ఈ ప్రయత్నం అతకలేదంటారా?

 3. విశెఖర్ గారు. అద్యక్షుల భద్రత గురించి భయపడుతున్నారా? మీరేమీ భయపడకండి ఆవర్గానికి వచ్చిన ముప్పేమీలేదు. బద్రతకు సంభంధించి అనుత్పాదక శ్రమ ఊహకు అందనివిధంగా వ్యెర్దమౌతుంది. వేల కొట్లు వెచ్చిస్తున్నారు. గుడా చర్యం గురించి కుడా ఆందొళన చెందవలసిన అవసరం లేదు. అది సమ్రజ్యవాద దేశం అది ఇంకొకరికి హాని చెస్తుందేగాని దానికి వచ్చిన ఇబ్బంది ఏమీలేదు. ఈ విషయాలు మీకు తెలియనివి కాదు ఎందుకొ ఆందొళన చెందారు.
  ఆ అద్యక్షులకొసం ప్రాణాలు వదిలితె దానిలొ దేశ బక్తి చుసి పులకించాలా? ఇలాంటి వాటిలొ దేశ బక్తి చుస్తున్నారా? ఆ వర్గాన్ని కాపాడంలొనే దేశ బక్తి వుందా? మరి కార్మికుల బద్రతవిషయమేమిటి?

 4. విశేఖర్ గారూ,
  క్షమించాలి. వ్యక్తులకూ, వ్యవస్థకూ మధ్య అవినాభావ సంబంధం విషయంలో మీ ప్రయత్నం సఫలం కాలేదని నా అభిప్రాయం కాదు. రెలిటివ్ లక్షణంలో కూడా అధమ స్థాయిలో ఉన్న విలువల అగాధాన్ని చూపడంలో మీ వ్యాసం నూటికి నూరుపాళ్లూ న్యాయం చేసింది. అందుకే మీ ఫీలింగ్‌ని భావోద్వేగపు శిఖరస్థాయిగా పేర్కొన్నాను. ఏ వ్యవస్థ కయినా అది ప్రదర్శించే విలువలకు, పాటించే విలువలకు మధ్య తేడా ఉంటే ఏం జరుగుతుందో మీ వ్యాసం చాలా చక్కగా వివరించింది.

  ‘దశాబ్దాలు నడిచి వచ్చిన జీవన గమనం’ కూడా ఒకానొక క్షుద్ర సమయంలో, బలహీన క్షణంలో ఎంత పతనావస్థకు చేరుతుందో అమెరికా అధ్యక్షుడి భద్రతాధికారుల ఉదంతం తేటతెల్లం చేస్తుంది. వందేళ్ల క్రితం గురజాడ రచించిన సంస్కర్త హృదయం కథలో అంత పెద్ద ప్రొఫెసర్ కూడా విటురాలి ముందు ఎంతగా తేలిపోయారో మనకు కనబడుతుంది. ఇక భూమండలాన్నే శాసిస్తున్న అపరిమితాధికారం చేతిలో పెట్టుకున్న వారి వ్యక్తిగత ప్రవర్తన పాలకవర్గపు నేతిబీరకాయి నీతిని దాటి ఉన్నతంగా ఉండదనే నా ఉద్దేశం.

  “వారిద్దరూ వ్యవస్ధ పతనాన్ని తరతమస్ధాయిల్లో ప్రతిబింబిస్తున్నవారే” అనే మీ ముగింపు వాక్యం మీ వ్యాసం మొత్తానికి హైలెట్.

  మామూలు రాజకీయ వ్యాసాల కంటే విలువలకు సంబంధించిన కథనాల్లో మీ శైలి కవితాత్మకంగా, మరింత శక్తివంతంగా, మరింత ప్రేరణతో సాగుతోంది. నాకు బాగా నచ్చిన కథనాల్లో ఇదీ ఒకటి.

  అబినందనలతో..

 5. రాం మోహన్ గారూ, మీరు చెప్పింది నిజం. వారి భద్రతకి కొత్తగా వచ్చిన ముప్పేమీ లేదు. ఒక అధ్యక్షుడు పోతే అవే లక్షణాలతో వేరొకడు. సమాజంలో మెజారిటీ భాగాన్ని ఆకలి దప్పులతో, అణచివేతలతో పాలించే ఆధిపత్య వర్గాలు నిరంతరం భద్రతా సమస్యలతో సతమతమవుతూ తమ చుట్టూ కోట గోడలు కట్టుకుని, ఆ గోడల్ని కూడా నాగరికతగా అభివృద్ధిగా చెబుతుంటారు. మీరన్నట్లు అదంతా అనుత్పాదక శ్రమే.

  రాజుగారికి ఇచ్చిన సమాధానంలో చెప్పినట్లు ఒక ఆబ్సల్యూట్ కండిషన్ గురించి ఇక్కడ రాసాను. అమెరికాలో ఉన్నది బ్రహ్మాండమైన ప్రజాస్వామ్యమే అయితే, అధ్యక్షుడు ప్రజలు ఎలాంటి ప్రలోభాలకు గురికాకుండా ఇష్టంతో ఎన్నుకున్నవాడే అయితే, అలాంటి అధ్యక్షుడిని కంటికి రెప్పలా కాపాడుకోవాల్సిన ఒక పరిస్ధితిని ఇక్కడ ప్రజెంట్ చేసాను. గొప్ప ప్రజాస్వామ్య వ్యవస్ధలోని అలాంటి అధ్యక్షుడి అంగరక్షకులను కూడా కనీస బాధ్యతతో విధులు నిర్వర్తించేలా చేయలేని పాలనా వ్యవస్ధ పౌరుల పట్ల ఏ బాధ్యతతో ఉండగలదు? ఈ అంశాన్ని ఆర్టికల్ లో ప్రస్తావించాను.

  కొంతమంది అమెరికన్లు తమ పాలకుల అబద్ధాలని నమ్మి ఇరాక్, ఆఫ్ఘన్ యుద్ధాలకు స్వఛ్చందగా సిద్ధపడి సైన్యంలో చేరారు. అలాంటివారిలో కొందరు ప్రముఖులు (ఫుట్ బాల్, బాస్కెట్ బాల్ ఆటగాళ్ళు, యాక్టర్లు మొ.) కూడా ఉన్నారు. వారు తీరా యుద్ధాలలో అమయాక ఇరాకీలనూ, ఆఫ్ఘన్లనూ ఊచకోత కోయవలసిన పరిస్ధితికి నెట్టబడినపుడు తీవ్ర నిరాశా, నిస్పృహలకు గురయ్యారు. వారిలో కొందరు జార్జి బుష్ దేశాన్ని అనవసరంగా యుద్ధాల్లోకి దింపాడని ప్రకటనలు కూడా ఇచ్చారు. దోపిడీ వ్యవస్ధలైన భూస్వామ్య, పెట్టుబడిదారీ వ్యవస్ధల్లో రక్షణ బలగాల పేరుతో ఉండే సైనికులు, అంగరక్షకులు, భద్రతాధికారులు, సరిహద్దు కాపలాదారులు లాంటి వారిని గొప్ప వీరులుగా కీర్తించడం కద్దు. వాటిని నిజమేనని ప్రజానీకం, ముఖ్యంగా మధ్యతరగతి భద్ర జీవులు నమ్మి ఆరాధిస్తుంటారు. అది వాస్తవం కాదని చెప్పదలిచాను. వాస్తవం కాదు అని చెప్పడానికి ఆబ్సల్యూట్ కండిషన్ ను రిఫరెన్సు గా చెప్పదలిచాను.

 6. రాజశేఖర్ రాజు గారికి, చర్చలో భాగంగానే పై వ్యాఖ్యలో ఒక ప్రశ్న వేసాను. నా ప్రయత్నం వ్యాసంలో ప్రతిఫలించిందా లేదా అన్న సమాచారాన్ని కోరానంతే. ‘క్షమించాలి’ అనడం మీ చర్చా పద్దతిలో ఒక భాగంగా ఉంటోంది. మీరెలా అన్నప్పటికీ ఆ పదం నాకు గాభరా కలిగిస్తోంది.

 7. అయ్యో, మీ కెందుకు గాభరా..? తెలుగు బ్లాగుల్లో చెడు వాతావరణం కారణంగా పర్సనల్ హర్ట్‌కు దారితీసేలా వ్యాఖ్యలు, బ్లాగ్ పోస్టులు కూడా ఉండరాదనే ఉద్దేశ్యంతో నాకు నేనుగా ఎంచుకున్న పద్ధతి ఇది. భావజాల పరమైన చర్చ ఎంత నిశితంగా, తీవ్రంగా అయినా సాగవచ్చు కాని చర్చాక్రమంలో ఎక్కడయినా వ్యక్తి హర్ట్ అవుతున్నారేమో అనిపించిన క్షణంలో నేను విసురుతున్న నమస్కార బాణం ఈ రకమైన పద్ధతిని అనుసరిస్తోందనుకుంటాను.

  మంచి కథనం రాసినప్పుడు కూడా దానిలోని పాజిటివ్ అంశాన్ని ప్రస్తావించకుండా, అభినందించకుండా, లోపం అనుకుంటున్నదాన్ని మాత్రమే ఎత్తి చూపినప్పుడు ఏ వ్యక్తి అయినా కాసింతైనా మనస్తాపానికి గురి కావటం సహజమనుకుంటాను

  “నా ప్రయత్నం సఫలం అయినట్లు లేదు. వ్యవస్ధకీ అందలి వ్యక్తులకీ ఉన్న అవినాభావ సంబంధాన్ని ఎఫెక్టివ్ గా వివరించడానికి చేసిన ఈ ప్రయత్నం అతకలేదంటారా?”

  అని మీరు వ్యాఖ్యానించినప్పుడు ఎక్కడో నేను పొరపడ్డానేమో అనిపించి క్షమాపణ కోరాను. అంతకు మించి దీనికి ఎలాంటి ప్రాధాన్యత లేదండీ..!

  పల్లె జీవితంనుంచి బయటపడ్డాక యూనివర్శిటీ విద్య, ప్రతి దానికీ సారీ చెప్పడాన్ని -మంచిగానే అనుకోండి- నేర్పించడం కూడా నన్నిలా ప్రభావితం చేస్తోందేమో.

  పైగా మన్నింపు కోరటం వెనుక వయో తారతమ్యం చూడనవసరం లేదు కదా..!

 8. రాజు గారు, వయో తారతమ్యం చూడకపోవడం పెద్దవారికి అనుభవం నేర్పిన సంస్కారం. కాని చిన్నవారు వయసుకి, దానివల్ల వచ్చే అనుభవానికి గౌరవం ఇవ్వాలన్న నియమాన్ని పాటిస్తే అది వారికే భూషణంగా ఉంటుంది.

  మీరన్నట్లు ఇంగ్లీషులో ‘సారీ’ చెప్పినంత కాజువల్ గా ‘క్షమించాలి’ అన్నది ఉపయోగం లో లేకపోవడం కూడా నా గాభరా కు కారణం. ‘సారీ’ యే కాక ఇంకా చాలా ఇంగ్లీషు పదాలు తెలుగు పదాలుగా మారిపోయాయి. కొన్నయితే చదువురాని వారు కూడా అలవోకగా వాడేంతగా వ్యవహారంలోకి వచ్చేసాయి. బహుశా ‘అంతర్జాతీయత’ లో ఇదీ ఒక భాగమేనేమో. ఎంత ప్రాధమిక రూపంలో ఉన్నా.

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

గూగుల్ చిత్రం

You are commenting using your Google account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

Connecting to %s