ఆఫ్ఘనిస్ధాన్ నుండి అమెరికా సైనికులు త్వరగా వెళ్లిపోవడం మంచిదని అధ్యక్షుడు హమీద్ కర్జాయ్ కోరాడు. అమెరికా సైన్యం ఎంత త్వరగా దేశం నుండి వెళ్ళిపోయి రక్షణ బాధ్యతలు ఆఫ్ఘన్లకు అప్పగిస్తే అంత మంచిదనీ, అమెరికా సైనికుల వల్ల ఆఫ్ఘన్లకు కలుగుతున్న అవమానాలు అంతం కావాలంటే అదే ఉత్తమ మార్గమనీ గురువారం ప్రకటించాడు. తాలిబాన్ మిలిటెంట్ల మృత శరీరాలతో అమెరికా సైనికులు దిగిన ఫోటోలు పరమ చీదరగా, అసహ్యంగా ఉన్నాయనీ వ్యాఖ్యానించాడు.
“ఇటువంటి బాధాకరమైన అనుభవాలు అంతం కావాలంటే ఆఫ్ఘన్ బలగాలకు రక్షణ బాధ్యతలను అప్పగించేపనిని వేగవంతం చేయడం చాలా అవసరం. రక్షణ బాధ్యతలను పూర్తిగా ఆఫ్ఘన్లకు అప్పగించాలి” అని కర్జాయ్ తన ప్రకటనలో పేర్కొన్నాడు. అమెరికా దురాక్రమణకి వ్యతిరేకంగా పోరాడుతున్న తాలిబాన్ మిలిటెంట్ల మృత శరీరాలను ట్రోఫీలుగా చూపుతూ అమెరికా సైనికులు దిగిన ఫోటోలను బుధవారం ‘లాస్ ఏంజిలిస్ పత్రిక’ ప్రచురించిన సంగతి తెలిసిందే.
ఆత్మాహుతి దాడిలో పాల్గొన్న మిలిటెంట్ రెండు కాళ్ళను ఎత్తి చూపుతూ ఫోటోలకి ఫోజులిచ్చిన అమెరికా సైనికుల ఫోటోను ఆ పత్రిక ప్రచురించింది. మొత్తం 18 ఫోటోలు తమకు అందాయని ఎల్.ఏ.టైమ్స్ పత్రిక తెలిపింది. సైనికుల ప్రవర్తన ‘అనైతిక కంపు కొడుతోందని’ అంగీకరిస్తూనే ఫోటోలను ప్రచురించవద్దని కోరినా వినకుండా ప్రచురించడాన్ని అమెరికా రక్షణ కార్యదర్శి లియోన్ పెనెట్టా ఖండించాడు. యుద్ధంలో సైనికులు అప్పుడప్పుడూ ఇలా ప్రవర్తించడం మామూలేనని పెనెట్టా వ్యాఖ్యానించాడు.
మృత శరీరాలు ఆఫ్ఘన్ మిలిటెంట్లవేనని పశ్చిమ పత్రికలు చెబుతున్నప్పటికీ వాస్తవానికి అవి మిలిటెంట్లవా లేక ఘర్షణల్లో చిక్కుకున్న పౌరులవా అన్నది తెలియరాలేదు. మృత దేశాల విడిభాగాలు ఖచ్చితంగా మిలిటెంట్లవేనా కావా అన్న సంగతి తాము స్వతంత్రంగా నిర్ధారించుకోలేదని రాయిటర్స్ వార్త సంస్ధ చెప్పడాన్ని బట్టి అమెరికా సైనికుల దుర్మార్గంలో చిక్కుకున్నది అమాయక ఆఫ్ఘన్ పౌరులు అయిఉండవచ్చని స్పష్టమవుతోంది.
ఆఫ్ఘనిస్ధాన్ లో అమెరికా సైనికుల దుర్మార్గాలు 2012 లో ఒకదాని తర్వాత ఒకటి వరుసగా వెలుగు చూశాయి. అమెరికా మెరైన్లు ఆఫ్ఘన్ల మృత శరీరాలపై ఒంటికి వెళ్తున్న వీడియో జనవరి 13 న వెల్లడయింది. బాగ్రామ్ వైమానిక స్ధావరంలో అమెరికా సైనికులు ఇస్లాం మత గ్రంధం ఖురాన్ కి చెందిన అనేక కాపీలను దగ్ధం చేసిన ఫోటోలు ఫిబ్రవరి 20 న పత్రికలు ప్రచురించాయి. వైమానిక స్ధావరంలో ఉన్న జైలులో ఆఫ్ఘన్ మిలిటెంట్లు ఖురాన్ మత గ్రంధాల ద్వారా సమాచారం ఇచ్చిపుచ్చుకుంటున్నట్లు అనుమానం రావడంతో అక్కడ ఉన్న ఖురాన్ ప్రతులన్నింటినీ దగ్ధం చేసి చెత్త బుట్టలో పడవేశారు.
తగలబెడుతున్నపుడే ఆఫ్ఘన్ యువకులు వద్దని కోరినప్పటికీ వారు వినలేదు. ఈ ఘటనతో ఆఫ్ఘనిస్ధాన్ వ్యాపితంగా అమెరికాపై ఆగ్రవేశాలు వ్యక్తం అయ్యాయి. ఖురాన్ దగ్ధంతో కోపోద్రిక్తులైన ఆఫ్ఘన్ పోలీసులు, సైనికులే కొంతమంది అమెరికా సైనికులపై దాడులు చేసి చంపేశారు. నెల రోజుల పాటు ఆఫ్ఘనిస్ధాన్ ప్రదర్శనలు, ఆందోళనలతో అట్టుడికి పోయింది. బారక్ ఒబామా స్వయంగా ఆపాలజీ చేపినప్పటికీ దాడులు కొనసాగాయి. ఆందోళనలపైన ఆఫ్ఘన్ పోలీసులు ఉక్కుపాదం మోపడంతో అనేకమంది పౌరులు చనిపోయారు. ఖురాన్ సంబంధిత ఆందోళనల్లో ఆరుగురు అమెరికా సైనికులు చనిపోగా, 36 మంది ఆఫ్ఘన్ పౌరులు చనిపోయారు.
ఖురాన్ దగ్ధం ఆందోళనలు తగ్గుముఖం పడుతున్నంతలోనే మార్చి 11 న అమెరికా సైనికులు రెండు గ్రూపులుగా ఆఫ్ఘన్ గ్రామాల్లో పౌరుల ఇళ్ళలో చొరబడి 16 మంది మహిళలను, పిల్లలను చంపేశారు. మహిళలను చంపేముందు మానభంగం చేశారని ఆఫ్ఘన్ పోలీసుల పరిశోధనలో తేలింది. ఆఫ్ఘనిస్ధాన్ నుండి అమెరికా సైనికుల ఉపసంహరణ అమెరికా పాలకవర్గంలోని ఒక సెక్షన్ కి ఇష్టం లేదని వారే ఈ పని చేయించారనీ కొన్ని పత్రికలు రాశాయి. అంతకుముందు తాలిబాన్ మిలిటెంట్లు ఒక అమెరికా ట్యాంకర్ ను దగ్ధం చేయడం వల్లనే వారు ప్రతీకారంతో ఆఫ్ఘన్ పౌరులను బలిగొన్నారని మరి కొన్ని పత్రికలు తెలిపాయి.
అమెరికా ప్రభుత్వం మాత్రం యుద్ధ గాయాలతో పిచ్చోడైపోయిన ఒకే అమెరికా సైనికుడు రెండు గ్రామాలకు కాలి నడకన వెళ్ళి ఇళ్ళల్లో దూరి పౌరులను కాల్చి చంపి దగ్ధం చేశాడని ప్రకటించింది. ఈ కధలను ఎవరూ నమ్మలేదు. ఆఫ్ఘన్ అధ్యక్షుడు హమీద్ కర్జాయ్, పార్లమెంటు సభ్యులు పలువురు సైతం అమెరికా కధనాన్ని నమ్మలేదు. హత్యాకాండ జరిపాడని చెప్పిన ఒకే ఒక సైనికుడిని ఆఫ్ఘన్ చట్టాల ప్రకారం విచారించాలని హమీద్ కర్జాయ్ కోరినప్పటికీ అమెరికా అంగీకరించకుండా గుట్టు చప్పుడు కాకుండా సైనికుడిని ముందు కువైట్ కీ అనంతరం అమెరికాకీ తరలించుకుపోయింది.
“శరీర భాగాలతో ఫోటోలు దిగి వాటిని మిత్రులతో పంచుకోవడం పరమ అసహ్యంగా ఉంది. ఆఫ్ఘన్ బలగాలకు భద్రతా బాధ్యతలు అప్పజెప్పి త్వరగా వెళ్లిపోవడమే దీనికి పరిష్కారం” అని కర్జాయ్ అన్నట్లుగా ప్రెస్ టి.వి తెలిపింది. 2013 నుండి ఆఫ్ఘనిస్ధన్ లో భద్రతా బాధ్యతలను ప్రధానంగా ఆఫ్ఘన్ సైన్యం తీసుకోవాలనీ 2014 నుండి పూర్తిగా భాధ్యతలను తీసుకోవాలనీ ఒప్పందం కుదిరినట్లు పత్రికలు చెబుతున్నాయి. త్వరగా వెళ్లిపోవడం అంటే కర్జాయ్ ఉద్దేశ్యం ఏమిటో వివరాలు తెలియలేదు. గతంలో కూడా కర్జాయ్ ఇలాగే ప్రకటనలు చేసినప్పటికీ అనంతరం తన ఉద్దేశ్యం అంగీకరించిన టైమ్ టేబుల్ కి కట్టుబడి ఉండాలన్నదే అని వివరణ ఇచ్చుకున్నాడు. పట్టుబట్టి అమెరికా సైనికులను త్వరగా ఇంటికి పంపే సీన్ వాస్తవానికి కర్జాయ్ కి లేదు. అమెరికా మోచేతి నీళ్ళు తాగుతూ ఆఫ్ఘన్ ప్రజల ప్రయోజనాలను తాకట్టు పెడుతున్న హమీద్ కర్జాయ్ తన మాస్టర్ లకి ఎదురు నిలవడం కలలోని మాట.
ఈ ఘటనలు అమెరికా, ఆఫ్ఘనిస్ధాన్ ప్రభుత్వాల మధ్య సంబంధాలు దెబ్బతీసాయని పత్రికలు రాసినప్పటికీ ఆ ప్రభావం ఆచరణలో ఏమీ కనిపించలేదు. ఆఫ్ఘనిస్ధాన్ లో అమెరికా సైనికులు సుదీర్ఘ కాలం కొనసాగడానికి ఇరువురి మధ్య చర్చలు కొనసాగుతూనే ఉన్నాయి. పాకిస్ధాన్ భూభాగాల్లో మిలిటెంట్ల కోసం అని చెబుతూ అమెరికా హంతక డ్రోన్ దాడులు కొనసాగుతూనే ఉన్నాయి. ఆ దాడుల్లో వందలమంది అమాయక పౌరులు ప్రాణాలు విడుస్తూనే ఉన్నారు. ఆఫ్ఘన్ ప్రయోజనాలకు వ్యతిరేకంగా అమెరికాతో హమీద్ కర్జాయ్ కుమ్మక్కు కొనసాగుతోంది.
jai bajranbal
hindu ga puttinduku garvinchu hindu ga marinchu
jai sri ram