‘దళిత హత్యాకాండ’ కేసులో శిక్షలన్నీ రద్దు చేసిన బీహార్ హై కోర్టు


Ranaveer Senaభారత దేశంలో దళితులకి న్యాయం సుదూర స్వప్నమేనని మరోసారి రుజువయింది. 21 మంది దళితులను, ముస్లింలను బలితీసుకున్న ‘బఠానీ టోలా’ హత్యాకాండ కేసులో బీహార్ హై కోర్టు శిక్షలన్నింటినీ రద్దు చేసేసింది. మంగళవారం నిందితులందరినీ నిర్దోషులుగా విడుదల చేసింది. సాక్ష్యాలు బలంగా లేవని చెప్పింది. ‘అనుమాన రహితం’గా నేరం రుజువు చేయడంలో పోలీసులు విఫలమయ్యారని చెప్పింది. కింది కోర్టు ముగ్గురిపై విధించిన ఉరి శిక్షను, మరో 20 మందికి విధించిన యావజ్జీవ కారాగార శిక్షనూ ఒక్క తీర్పుతో కొట్టి పారేసింది. బీహార్ లో మావోయిస్టు పార్టీ ఇచ్చిన ధైర్యంతో ఆత్మగౌరవం చాటిన దళితులకి వ్యతిరేకంగా అగ్ర కులాలు నిర్మించిన ‘రణవీర్ సేన’ హంతక ముఠాకి ఈ తీర్పుతో కొత్త రక్తం ఎక్కించినట్లయింది.

జులై 11, 1996 తేదీన భోజ్జాపూర్ లోని బఠానీ తోలా గ్రామంలో దళితులపై అగ్ర కులాలు దాడి చేశాయి. కనిపించినవారిని కనిపించినట్లు ఊచకోత కోశాయి. పిక్క బలం చూపి పురుషులు పారిపోగా, చేతికి దొరికిన స్త్రీలను, పిల్లలనూ 21 మందిని చంపేశాయి. చనిపోయినవారిలో పది నెలల పసివారు కూడా ఉన్నారు. బాధితులు 33 మందిపై ఫిర్యాదు చేయగా, పోలీసులు 63 మందిపై చార్జి షీటు నమోదు చేసారు. క్రింది కోర్టు 23 మందిపై నేరం రుజువయిందని తీర్పు నిచ్చింది. మిగిలినవారిపై సాక్ష్యాధారాలు లేవని వదిలి పెట్టింది. మే 12, 2010 తేదీన శిక్షలు ప్రకటించింది. ముగ్గురికి మరణ శిక్ష, 20 మందికి యావజ్జీవ శిక్ష విధించింది. ఆ శిక్షలన్నింటినీ ఇప్పుడు హై కోర్టు రద్దు చేసింది.

ఒకే కేసులో కింది కోర్టుకీ హై కోర్టుకీ న్యాయ నిర్ణయంలో ఇంత తేడా ఉండడం ఎలా సంభవం? ఒక కోర్టు నేరం రుజువయిందని మరణ శిక్షలు కూడా విధిస్తే అదే విచారణలో సాక్ష్యాలే లేవని పై కోర్టు శిక్షలు మొత్తం రద్దు చేయడం ఎలా సాధ్యం?  అగ్ర కులాల ఆధిపత్యంతో, అగ్రకులాలే నాయకులుగా ఉన్న మురికి రాజకీయ పార్టీలు కుమ్మక్కు అయితేనే ఇది సాధ్యం అవుతుంది. అగ్రకులాధిపత్యంతో అంట కాగుతున్న రాజకీయ పార్టీలు, పోలీసులు, ప్రభుత్వాధికారులూ జమిలిగా కలిసిపోయిన అనైతిక కూటమిలో సాక్ష్యాధారాలు సమూలంగా నాశనం అయితేనే ఇది సాధ్యం అవుతుంది. భారత దేశ సామాజిక వాస్తవాలకి అనుగుణంగా స్పదించడం మానేసిన చర్మ మందం న్యాయ వ్యవస్ధ వల్లనే ఈ స్ధాయి దుర్మార్గాలు సాధ్యం అవుతాయి.

హై కోర్టు తీర్పు దేశంలో సంచలనం సృష్టిస్తోంది. ముఖ్యంగా దేశ దళితులు హై కోర్టు తీర్పుతో హతాశులయ్యారు. హత్యాకాండ జరిగిన నాలుగేళ్ల తర్వాత మార్చి 2000 లో చార్జి షీటు నమోదు కాగా, పదిహేనేళ్ళ తర్వాత మే, 2010 లో క్రింది కోర్టు శిక్షలు విధించింది. పదిహేనేళ్ళ క్రితం జరిగిన సంఘటనలని ఎవరైనా గుర్తు పెట్టుకోగలరా? నిమిష నిమిషానికీ, గంట గంటకీ ఎవరు నరుకుతున్నారో చూసి గుర్తు పెట్టుకుని కోర్టులో చెప్పగలరా? మూకుమ్మడిగా దాడి చేసి చంపుతుంటే నరికే వాడేవడో, కాల్చేవాడేవాడో నిలబడి తేరిపార చూసి మెదడు గదుల్లో సరిగ్గా రికార్డు అయ్యాయో లేదా అని జాగ్రత్తలు తీసుకోగలడా?

అలా జాగ్రత్తలు తీసుకోగలరో లేదో న్యాయ మూర్తులు, పోలీసులు, పరిశోధానా సంస్ధల అధికారులు బీహార్ లో అతి పేద కుంటుంబాలో ‘నిస్సహాయ దళితుడి’ గా పుట్టి, అగ్రకుల అహంకారం వ్యవస్ధాగతంగా దట్టించి తెగబడుతున్న రణవీర్ సేన ఊచకోతకు బలై అనుభవం సంపాదించి చెబితే బాగుంటుంది. వలస వాసనలతో నిండిన న్యాయ శాస్త్ర గ్రంధాల్లో రాసిన సవాలక్ష లాజిక్కులని అక్షరం ముక్కరాని దళితుడేవ్వడూ అర్ధం చేసుకోలేడని అప్పటికైనా అర్ధం అవుతుందో లేదో చూడాలి.  దళితుడి సహస్రాబ్దాల గాయాల గేయాలు వీనుల విందుగా ఉండవనీ, మట్టసంగా ఏ స్వరానికి ఆ స్వరం విడిగా జమిలిగా వినబడుతూ న్యాయ మాధుర్యం అందించేవిగా ఉండవనీ, అత్యంత కఠినంగా, బాధగా, హృదయ విదారకంగా ఉంటాయనీ అప్పటికైనా అర్ధం అవుతుందో లేదో చూడాల్సి ఉంది.

అగ్రకుల దురహంకార తుపాకీకి నేలరాలిన తండ్రి తలను కన్న దళిత కొడుకుకీ, తన ఒడిలో పొత్తిళ్లలో భద్రంగా నిద్రిస్తున్న పసి బిడ్డను కత్తికొక కండగా చీలుస్తున్న దృశ్యాన్ని కళ్ళారా చూసిన దళిత తల్లికీ, కత్తి వేటు నుండి బిడ్డలనైనా కాపాడుకుందామని కూడా మరిచి భయవిహ్వలులై  పారిపోతున్న దళిత తండ్రికీ, ఆ ఘోరకలి దృశ్యాల జ్ఞాపకాలను భద్రంగా దశాబ్దం పాటు మెదడు పొరల్లో కాపాడుకోగలగడం దుస్సాధ్యమని ఈ హిపోక్రాట్ న్యాయ పండితులకి మేధావులకీ అప్పటికైనా తలెక్కుతుందో లేదో అనుమానమే.

‘బఠానీ టోలా’ కేసులో నిందితులపై జరిగిన విచారణ ఒక ప్రహసనం అయితే నర హంతక అగ్రకుల దురహంకార రణవీర్ సేన వ్యవస్ధాపకుడు, ‘Butcher of Bathani Tola’ గా ప్రఖ్యాతి గాంచిన ‘బ్రహ్మేశ్వర్ సింగ్ ముఖియా’ పై సాగిన విచారణ మరో పెద్ద ప్రహసనం. 1970లు, 80లు, 90 లలో బీహార్ వ్యాప్తంగా జరిగిన అనేక దళిత హత్యాకాండల్లో ఇతను నిందితుడు. రెండు డజన్లకుపైగా దళిత హింస, హత్యలు, ఊచకోతల కేసుల్లో నిందితుడు. అత్యంత అమానుషంగా సాగిన లక్ష్మణ్ పూర్ – బాత్ హత్యాకాండ, మియాన్ పూర్ ఊచకోత ల్లో కూడా ఇతను నిందితుడు. ఎనిమిది మంది పిల్లలనూ, 12 మంది మహిళలనూ ఊచకోత కోయడాన్ని ఈ పిశాచి బహిరంగంగా పత్రికా ముఖంగానే సమర్ధించుకున్నాడు. దళిత మహిళలు నక్సలైట్లకు జన్మనిస్తారనీ, దళిత పిల్లలే పెరిగి నక్సలైట్లుగా మారతారనీ కనుక మహిళలనూ పిల్లలనూ చంపడం న్యాయమైనదేననీ ఇతను పత్రికా ముఖంగా సమర్ధించుకున్నాడు. అయినా ఏ కేసులోనూ ఇతనిపై నేరాన్ని రుజువు చేయడం పోలీసుల వల్ల కాలేదు. Ranaveer sena victims 01

1996 నుండి ‘తప్పించుకు తిరుగుతున్న హంతకుడు’గా చట్టం పేర్కొన్నప్పటికీ ఇరవై సంవత్సరాల పాటు ఇతనిపై ఎఫ్.ఐ.ఆర్ నమోదు కాలేదు. ఆగష్టు 29, 2002 లో ఇతనిని పోలీసులు అరెస్టు చేసినప్పటికీ అతనిపై ఎఫ్.ఐ.ఆర్ రిజిస్టర్ చేయడం ప్రభుత్వాల వల్ల కాలేదు. అగ్ర కులాల ఓట్లు పోతాయన్న భయంతో రాజకీయ పార్టీలన్నీ హంతక రణవీర్ సేన తో కుమ్మక్కయిన ఫలితంగా బ్రహ్మేశ్వర్ పై ఎఫ్.ఐ.ఆర్ నమోదు చేయడానికి పోలీసులు, అధికారులు, ఎమ్మేల్యేలు, మంత్రులు ఒంటికి పోశారు. బ్రహ్మేశ్వర్ అరెస్టు విషయంలో, ఎఫ్.ఐ.ఆర్ నమోదు కానీ విషయంలో అధికారులు, పోలీసులు, మంత్రులు అంతా అనేకమార్లు అబద్ధాలు చెప్పారు. పరమ అసహ్యంగా బహిరంగంగానే ‘కప్పి పుచ్చే’ దుర్మార్గాలకు పూనుకున్నారని ‘ది హిందూ’ లాంటి పత్రికలు కోడై కూశాయి.

అరెస్టయి జైలులో ఉన్న పచ్చి క్రిమినల్ పైన ఎఫ్.ఐ.ఆర్ నమోదు కాకపోవడం నమ్మశక్యంగా లేదని పబ్లిక్ ప్రాసిక్యూటరే హాశ్చర్యం వ్యక్తం చేశాడంటే అగ్రకుల అహంకారులతో ప్రభుత్వాలు ఎంత పచ్చిగా కుమ్మక్కయ్యాయో అర్దం చేసుకోవచ్చు. బ్రహ్మేశ్వర్ ని శిక్షించడానికి పోలీసులు, ప్రభుత్వమూ సుముఖంగా లేవని స్పష్టంగా అర్ధం అవుతోందని బఠానీ టోలా కేసులో క్రింది కోర్టు తీర్పు చెప్పిన సందర్భంగా పబ్లిక్ ప్రాసిక్యూటర్ రాంబాబూ ప్రసాద్ వ్యాఖ్యానించాడు. జైలులో ఉన్న ‘బచర్ ఆఫ్ బఠానీ టోలా’ ను పాట్నా సెషన్స్ కోర్టులో ఎందుకు హాజరు పెట్టలేకపోతున్నారని పత్రికలు అడిగితే జిల్లా ఎస్.పి “అతనికి వ్యతిరేకంగా ఉన్న కేసుల్లో కొన్ని కోర్టు ప్రొసీడింగ్స్ పూర్తి కాలేదు” అని తేల్చేశాడు. ఘనత వహించిన మన న్యాయ వయవస్ధలో జైలులో ఉన్న ఒక నరహంతకుడిని కోర్టులో హాజరుపరిచే ఒక మామూలు ప్రొసీడింగ్ పూర్తి కావాలంటే ఏళ్లూ పూళ్లూ పట్టవచ్చునన్నమాట. ఇలాంటి న్యాయ వ్యవస్ధ దళితులకి చేకూర్చే న్యాయం ఏపాటిది?    Ranaveer sena victims 03

బ్రహ్మేశ్వర్ సింగ్ ని కోర్టులో హాజరుపరాచకపోవడంపై కోర్టులూ, పోలీసులూ ఒకరిపై ఒకరు బాధ్యత నెట్టివేస్తూ సంవత్సరాలు గడిపారు. బ్రహ్మేశ్వర్ సింగ్ ఖచ్చితంగా ఎక్కడ ఉన్నాడో ప్రాసిక్యూషన్ అధికారులు తమకు ఇచ్చిన ఆదేశాల్లో చెప్పలేదని పోలీసులు నిర్లజ్జగా చెప్పారు. బ్రహ్మేశ్వర్ సింగ్ ఎక్కడ ఉన్నాడో బీహార్ రాష్ట్ర ప్రజలందరికీ తెలిసిన విషయమే. కోర్టులూ, పోలీసుల సంరక్షణలో ఎనిమిదేళ్ళ పాటు జైలులో ఉన్న బ్రహ్మేశ్వర్ ఖచ్చితంగా ఎక్కడ ఉన్నాడో తమకు తెలియదని పోలీసులు చెప్పారు. జైల్లో ఉన్న బ్రహ్మేశ్వర్ ఎక్కడ ఉన్నాడో తమకు తెలియకపోవడంతో కోర్టులో హాజరుపరచలేకపోయామని కోర్టుల్లో చెప్పినా న్యాయాధీశులు నమ్మి మిన్నకున్నారు. న్యాయం అందించాల్సిన సర్వ వ్యవస్ధలూ అగ్ర కులాహంకారంతో కుమ్మక్కయితే తప్ప ఇంతటి పరిహాస భాజన నాటకాలు కోర్టుల్లో చెల్లుబాటు కాజాలవు.

మావోయిస్టు నాయకుల కోసం ‘ఆపరేషన్ గ్రీన్ హంట్’ ప్రకటించి, బోర్డర్ సెక్యూరిటీ ఫోర్స్, సి.ఆర్.పి.ఎఫ్ లాంటి పారా మిలట్రీ బలగాలతోBrahmeswar Singh mukhiya దట్టమైన అరణ్యాలను జల్లెడ పట్టే ప్రభుత్వాలు, అడవుల్లో మారు మూల గిరిజన పల్లెల్లో ఇల్లిల్లూ, గుడిసె గుడిసే గాలిస్తూ మావోయిస్టుల ఆచూకీ చెప్పాలని గిరిజన స్త్రీలను, పిల్లలనూ సంవత్సరాల తరబడి చిత్ర హింసలకు గురి చేసే ప్రభుత్వాలకు రాష్ట్ర రాజధాని నగరంలో జైలులోనే ఉన్న క్రిమినల్ ఆచూకీ దొరకడం అంత దుర్లభమా?

277  మంది దళితుల ఊచకోతలకు నాయకత్వం వహించి, ‘దళిత రక్తం రుచిమరిగిన క్రిమినల్’ గా బీహార్ రాష్ట్రంలో, ఆ మాట కొస్తే దేశ వ్యాపితంగా పేరు మోసిన ‘బ్రహ్మేశ్వర్ సింగ్’ మూడు రాష్ట్ర ప్రభుత్వాల, అనేక స్ధాయిల కోర్టులు జైళ్ల దయార్ద్ర హృదయాల సంరక్షణలో ఎనిమిదేళ్ళ పాటు సేద దీరి, ఇక తనకు ప్రమాదం లేదని నమ్మకం కుదిరాక గత జులై, 2011 లో కోర్టునుండి బెయిల్ పొంది విజయోత్సాహంతో విడుదలయ్యాడు. ఆయనపై కొనసాగిన 22 కేసుల్లో 16 కేసుల్లో నిర్దోషిగా విడుదల కాగా, మరో 6 కేసుల్లో బెయిలు పొంది స్వేచ్చా ప్రపంచంలోకి అడుగు పెట్టాడు. ఈ క్రిమినల్ జైలులో ఉన్నంత కాలం సాపేక్షికంగా గుండెలపై చేతులేసుకుని నిద్రించిన బీహార్ దళితులు ఇప్పుడిక తాము పుట్టి పెరిగిన గ్రామాలే జైళ్ళుగా గడపనున్నారు. గ్రామాలు విడిచి చెట్టుకోకరు, పుట్టకోకరు గా పారిపోయినా ఆశ్చర్యం లేదు.

జైలు నుండి విడుదలయిన బ్రహ్మేశ్వర్ సింగ్ వేలాది దురహకారులు ఆనందోత్సాహాలతో మంగళహారతులు పలికి స్వాగతం పలుకుతుండగా ‘కోర్టులపై సంపూర్ణ విశ్వాసం’ ప్రకటించాడు. తన నిర్దోషిత్వాన్ని ఏనాటికైనా కోర్టులు గ్రహిస్తాయని పూర్తి నమ్మకం ఉందని ప్రకటించాడు. ఎనిమిదేళ్లపాటు జైలులో ఉన్నా ‘తప్పించుకు తిరుగుతున్న క్రిమినల్’ గా పోలీసులు ప్రకటించి ఊరుకున్నప్పటికీ నమ్మిన కోర్టులపై కాక నరహంతక ‘బ్రహ్మేశ్వర్’ కి ఇంకెవరిపై నమ్మకం ఉంటుంది?

Ranaveer sena victims 02

One thought on “‘దళిత హత్యాకాండ’ కేసులో శిక్షలన్నీ రద్దు చేసిన బీహార్ హై కోర్టు

 1. విశేఖర్ గారూ,

  ఈ దేశ న్యాయం ఇలాగే ఉన్నంతవరకు నక్సలిజం సిద్దాంతానికి వారి పోరాటానికి చావు లేదు. భద్రలోగ్ సమాజం ఎంత వ్యతిరేకించినప్పటికీ, ద్వేషించినప్పటికీ మన వ్యవస్థ పునాదే సాయుధ పోరాటాలకు ఊపిరి పీలుస్తోంది.

  మీ కథనానికి వ్యాఖ్య అవసరమే లేదు. ఈ అక్షర సత్యాలను ప్రతిబింబించే ఒక వ్యాసం లింక్‌ను ఇస్తున్నాను చూడండి.

  న్యాయవ్యవస్థ కలవారి క్రీడా ప్రాంగణమా
  -చందు సుబ్బారావు
  http://www.andhrabhoomi.net/content/nya

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

గూగుల్ చిత్రం

You are commenting using your Google account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

Connecting to %s