‘కట్నపిశాచి’ వద్దకి రానందని మహిళను చితక బాదిన పోలీసులు


Woman beaten up 02పోలీసు గూండాయిజానికి ప్రత్యక్ష ఉదాహరణ ఇది. భర్త కట్న దాహాన్ని తీర్చలేక ప్రొఫెసర్ ని శరణు వేడిన మహిళను పోలీసులు కొట్టుకుంటూ తీసుకెళ్లి కట్న పిశాచికి అప్పగించడానికి ప్రయత్నించారు. మహిళను తీసుకెళ్లడానికి మహిళా పోలీసులను వినియోగించాలన్న చట్టాన్ని ఘోరంగా ఉల్లంఘించారు. రాష్ట్ర సరిహద్దుని దాటి మరీ పైశాచికత్వం ప్రదర్షించారు. తమ ఆధీనంలో ఉన్న మహిళను కొడుతున్నప్పటికీ మౌన ప్రేక్షకులుగా మిగిలినందుకు, స్ధానిక జిల్లా ఎస్.పి, ఒక ఎస్.ఐ తో సహా నలుగురు పోలీసులను సస్పెండ్ చేశాడు.

మహిళ రాజస్ధాన్ లోని నింబాడా జిల్లా నివాసి. భర్త కట్నం కోసం వేధిస్తుండడంతో మధ్య ప్రదేశ్ చింద్వారా కు చెందిన ఒక ప్రొఫెసర్ ను శరణు వేడింది.  ఆమె భర్త రాజస్ధాన్ పోలీసులకు తప్పుడు ఫిర్యాదు ఇచ్చాడు. తన భార్యను బలవంతంగా, ఆమె యిష్టానికి వ్యతిరేకంగా ప్రొఫెసర్ తన ఇంటిలో బంధించాడని పోలీసులకి ఫిర్యాదు చేశాడు. ఇక పోలీసులు పులులై పోయారు. చింద్వారా వెళ్ళి మహిళను తీసుకెళ్లడానికి ప్రయత్నించారు. ఆమె నిరాకరించింది. తన భర్త తనను కట్నం కోసం హింసిస్తున్నాడనీ, రక్షణ కోరుతూ ప్రొఫెసర్ ఇంటికి వచ్చాననీ తాను రాననీ తెలిపింది.

దానితో పోలీసులు గూండాలుగా మారారు. చింద్వారా పోలీసు స్టేషన్ లో ఉన్న మహిళను జుట్టు పట్టి ఈడ్చారు. అటూ ఇటూ నెట్టి పారేశారు. కొట్టుకుంటూ తీసుకెళ్ళి జీపులో కుదేశారు. ఈ వ్యవహారం అంతా కెమెరా కంటికి చిక్కింది. వార్తా చానెల్ రికార్డు చేసిందా లేక ఇంకెవరైనా రికార్డు చేశారా అన్నది తెలియలేదు. వీడియో దృశ్యాన్ని మాత్రం ఎన్.డి.టి.వి ప్రసారం చేసింది. ఈ వీడియో ను ఎన్.డి.టి.వి వెబ్ సైట్ తీసేసింది. కానీ యాహూ న్యూస్ లో ఈ వీడియో లభ్యం అయింది. వీడియోను ఇక్కడ చూడవచ్చు.

భర్త ఫిర్యాదు నిజమే అయితే ఆమెని తీసుకెళ్లడానికి మహిళా పోలీసులు రావాలి. అలాగని చట్టాలు చెబుతున్నాయి. కానీ చట్టాలున్నది ఉల్లంఘించడానికే అన్నట్లుగా పోలీసులు ఆ నిబంధనను పట్టించుకోలేదు. ముగ్గురు మగ పోలీసులు ఆమెను తీసుకెళ్లడానికి వచ్చారు. పోనీ వస్తే వచ్చారు. అక్కడికి వచ్చాక మహిళ వాస్తవానికి తాను బాధితురాలినని స్వయంగా చెప్పినపుడయినా పోలీసులు విని ఉండాల్సింది. వినకపోగా, తమకు ఏ విధంగానూ ప్రత్యర్ధి కానీ మహిళపైన బల ప్రయోగం చేశారు. అత్యంత అమానుషంగా ప్రవర్తించారు. కనీస మానవతను సైతం మరిచిపోయారు.

ఎక్కడిదీ పైశాచికత్వం? అబల కనుక, భర్త అండ కూడా లేదు కనక చేయి చేసుకోవచ్చన్న మగ అహంభావం తోనే పోలీసులు ఇంతటి క్రూరత్వానికి పాల్పడ్డారు. నిస్సహాయ స్ధితిలో ఉన్న అబలలకు రక్షణ కల్పించవలసిన బాధ్యతలో ఉన్నామన్న స్పృహ కూడా లేకుండా ప్రవర్తించారు. ఆ అమ్మాయి తనని స్టేషన్ నుండి బైటికి గిరాటేసినా తేరుకుని జీపు వద్దకి వెళుతోంది. అయినా పోలీసుకి సంతృప్తి కలగలేదు. తన క్రూరత్వాన్ని పూర్తిగా వెల్లడించుకుంటే తప్ప సంతృప్తి లేదన్నట్లుగా ప్రవర్తించాడు. ఒకడు కొట్టుకుంటే తీసుకెళ్తుంటే ఇతర పోలీసులు అదేదో మామూలు వ్యవహారంలాగానే చూస్తూ ఉన్నారు.  మై గుడ్ నెస్.

స్ధానిక ఎస్.పి చింద్వారా పోలీసు స్టేషన్ లో ని నలుగురు పోలీసులను సస్పెండ్ చేశాడు. రాజస్ధాన్ పోలీసులు మహిళను కొట్టుకుంటూ తీసుకెళ్తున్నా చూస్తూ ఉన్నందుకు స్టేషన్ ఎస్.ఐనీ ముగ్గురు పోలీసులనూ సస్పెండ్ చేశాడు. ముగ్గురు రాజస్ధాన్ పోలీసులపైనా మహిళ ఎఫ్.ఐ.ఆర్ నమోదు చేసినట్లు తెలుస్తోంది.

పురుషాధిక్య సమాజం అని చెప్పడానికి ఇలాంటి దృష్టాంతాలు ఇంకెన్ని కావాలో కదా!

41 thoughts on “‘కట్నపిశాచి’ వద్దకి రానందని మహిళను చితక బాదిన పోలీసులు

 1. పురుషాధిక్య సమాజం అని చెప్పడానికి ఇలాంటి దృష్టాంతాలు ఇంకెన్ని కావాలో కదా!

  పైన మీరు రాసిన వార్తలోనే .. ఆపోలీసులని సస్పెండు చేయడం జరిగిందని చెప్పడం జరిగింది. పురుషాదిఖ్య సమాజములో అలాంటి పనులు ఎలా చేస్తారని మీ ఉద్దేశ్యం? సస్పెండు చేశారు కాబట్టి ఇది స్త్రీ ఆధిక్య సమాజం అని భావజాలమే అని ఖచ్చితంగా చెప్పొచ్చు. అంతేనా మీ మాటల్లో కూడా మాతృస్వామ్య భావజాలం బలంగా వినిపిస్తోంది. ఒక పురుషున్ని ఒక మహిళా పోలీసు అరెస్టు చేయడం, తన్నడం సమ్మతమే కానీ, అదే పని పురుషుడు స్త్రీపై చేయకూడదు అనడం కేవలం మాతృస్వామిక భావజాలం మాత్రమే. (చట్టాలు ప్రస్తుతం దీన్ని సమర్ధించేలా ఉండడం సహజమే. నోరున్న వారిదే రాజ్యం కదా.) ఆ భావజాలం నుండి మీరు ఎంత త్వరగా బయటికి వస్తే అంత మంచిది.

  సమానత్వం అంటే పితృస్వామ్యాన్నో, మాతృస్వామ్యాన్నో సమర్ధించడం కాదు అన్నది మీరు గుర్తించాలి.

  ఇంకో విషయం, ప్రజలు మహిళను కొట్టుకుంటూ తీసుకెల్లినప్పుడే కాదు, ఒక మహిళా పోలీసు పురుషున్ని నడిరోడ్డు మీద నగ్నంగా కొట్టుకుంటూ వెల్లినా అలానే చూస్తుంది, ఎందుకంటే.. పోలీసు వ్యవహారములో జోఖ్యం చేసుకోవడం అన్నది జనాలు సహజంగా దూరంగా ఉండే పని. కాబట్టి దానిలో పురుషాధిక్యాన్ని చూడడమంటే ప్రతీదాన్నీ ఒక మూస పద్దతిలో చూడడానికో లేదా ఊహించుకోవడానికో అలవాటు పడ్డ లక్షణమే అవుతుంది.

 2. ప్రవీణ్, శ్రీకాంత్ గార్లకు

  మీ వ్యాఖ్యలు పరస్పరం నిందా పూర్వకంగా ఉన్నందున తొలగిస్తున్నాను.

  ప్రవీణ్ వ్యాఖ్యకి శ్రీకాంత్ స్పందనని చూశాక ప్రవీణ్ వ్యాఖ్యపై పొరబడగల అవకాశం ఉందని అర్ధం అయింది. అందువలన రెండూ తొలగిస్తున్నాను. మిత్రులు అన్యధా భావించవలదు.

 3. *లింగ వివక్ష అనేది లేకపోతే స్త్రీ పురుషునికి కట్నం ఇచ్చే పరిస్థితి ఉండదు కదా*

  స్రీ లెమి ఇష్ట్టపడి కట్నాలు ఇవ్వటంలేదు ప్రవీణ్, స్రీ ల తండ్రి, సోదరులు కష్ట్టపడి సంపాదించి వారి కి కట్నం ఇచ్చి పెళ్లి చేస్తున్నారు. *

  *స్త్రీ యొక్క కుటుంబ సభ్యులని మానసికంగా బలహీనం చేసి ఉపయోగించుకుంటున్నట్టే కదా*
  సమాజంలో ప్రతి వారి దగ్గర మగవారు నీచులు, దుష్ట్టులు,దుర్మార్గులు అని నిందలు పడినప్పుడల్లా నాకు చాలా బాధ వేస్తున్నాది. ఈ నిందలు పడే కన్నా మగవారికి పెళ్లి చేసుకోవటం మానేయాలి. పెళ్లి లేకపొతే మగవారు ఎంతో స్వేచ్చగా, సుఖంగా జీవిస్తారు.

 4. శ్రీ గారూ, ఆడపిల్లల తల్లిదండ్రులు కట్నాల భారాన్ని భరిస్తున్నారు. ఆ బారం వల్లనే ఆడ శిశువులు వద్దనుకుంటున్న పరిస్ధితి ఏర్పడుతోంది. అధిక కట్నాలు చెల్లించుకోలేక తమ కూతురికి నచ్చిన సంబంధాలు తేలేక తాము భరించగల సంబంధాలనే కూతుళ్లపై మోపుతున్నారు. ఆ క్రమంలో ఆడపిల్లల అభిప్రాయాలకి విలువ లేకుండా పోతోంది. కట్నం వల్ల అంతిమంగా నష్టపోతున్నది స్త్రీలే.

  పెళ్లి లేకపోతే మగవారు స్వేచ్ఛగా జీవిస్తారనుకుంటె అదే బెటర్. కాని ఆ తర్వాత మగ పుట్టుకలు కూడా ఉండవు.

  మగవారంతా దుర్మార్గులన్నది ఇక్కడ అర్ధం కాదు. దురాచారాలను నిరసించి వాటిపై పోరాడడంలో మగవారు చాలామంది ముందున్నారు. స్త్రీలకు అవకాశాలు లేని పరిస్ధితులవల్ల దురాచారాలను ఎదుర్కోవడంలో పురుషులే ఉద్యమాలని ప్రారంభించారని గుర్తించాలి. స్త్రీలపై వివక్షను పాటించవద్దన్నదే నా పోస్టుల ఉద్దేశ్యం తప్ప మొత్తం మగవారిని నిందించడం కాదు. అలా నిందిస్తే సమస్యను అర్ధం చేసుకోకపోవడమే అవుతుంది.

 5. శేకర్,
  సమాజంలో పేద, అతి పేదవారి కుటుంబంలో జరిగే ఇటువంటి సంఘటనలను జరగకుండా చేయాలంటే ప్రభుత్వానికి మాత్రమే సాధ్యం. ఉద్యోగం చేస్తూ జీవించే వారు ఇటువంటి విషయాలపై ఎమీ చేయగలరో మీరు చెప్పండి. మగవారు వారి మానాన వారు పని చేసుకొంట్టుంటే, మీడీయ వారు ఇలా ఎవరొ ఒకరిద్దరు చేసిన పనులకి జాతీయస్థాయి ప్రాముఖ్యత నిచ్చి మగవారిని కించపరుస్తూనారు. అంత ప్రేమే ఉంటె ప్రభుత్వం సకల అనర్ధాలకు కారణమైన పెళ్లి ని వ్యక్తుల ఆర్ధిక స్థాయిని బట్టి పునర్ నిర్వచించాలి. లేకపోతే ఎదైనా ప్రత్యామ్యాం కొరకు ప్రయత్నించాలి. ఎప్పుడొ ఎవరో ఋషులు ప్రవేశ పెట్టిన ఈ వివాహ వ్యాస్థని నేటికి కొనసాగించాలనుకోవటం అన్యాయం.
  ఇక మధ్యతరగతి వ్యక్తూలైతే పిల్లల పెంపకంలో మార్పులు తీసుకొని వచ్చి, జరగకుండా చూస్తారు. అలా చర్యలు ఇoతకు మునుపే తీసుకొన్నారు కనుకనే ఇప్పుడు ఎంతో మంది అమ్మాయిలు చదువుకొని, ఉద్యోగాలు చేస్తున్నారు. అది నేడు మనం పట్టణ ప్రాంతాలలో స్పష్ట్టంగా చూడవచ్చు.మీడీయా వారు వీరి పై ఇలా పైపైన మొసలి కన్నీరు కార్చే బదులు ఎమైనా స్పష్ట్టమైన సూచనలతో ముందుకు రావాలి. ప్రతి రోజు ఇలా మగవారిని తక్కువ చేసి చూపుతూ, దేశ పరువు ప్రతిష్టలను కించపరచే విధంగా ఇటువంటి అంశాలను పెద్ద ఎత్తున చూపటం, ప్రాముఖ్యత ఇవ్వటం మానాలి.

 6. నేను రాసినది కూడా మీమ్మల్ని తప్పుగా అర్థం చేసుకొని నిందించటానికి కాదని గమనించాలి. అమ్మాయిలైనా, అబ్బాయిలైనా పెళ్లి చేసుకోవాలనే అభిప్రాయం చిన్నపటినుంచే తల్లిదండృలు బుర్రలోకి ఇంకిస్తున్నారు. అమ్మాయిలకి తప్పకుండా పెళ్ల్లి చేయాలనుకోవటం ఒక అలవాటైపోయింది. అది లేకపోతే వారు బతకలేరను కోవటం మానుకోవాలి. ఈ రోజులలో ఎన్నొ అవకాశాలు ఉన్నాయి గనుక వారికాళ్ల పై వారు నిలబడగలరు. మునపటిలాగా మగవారి అవసరం వారికి లేదు అని తెలియజెప్పాలి.

 7. శ్రీ గారూ, ప్రభుత్వాలు ఇలాంటివి జరగకుండా నివారించగలవు. ఒక్కరోజులోనో, ఒక్క సంవత్సరంలో కాకపోయినా నిరంతర ప్రయత్నాలు చేస్తే సామాజిక రుగ్మతలను ప్రభుత్వాలు తొలగించగలవు. కాని ఆ ప్రయత్నాలు ప్రభుత్వాలు ఎందుకు చేయడం లేదన్నది ఆలోచించవలసిన ప్రశ్న.

  మీరన్నట్లు పేద, అతి పేద వారిలో మాత్రమే ఈ సంఘటనలు జరుగున్నాయనడం కరెక్టు కాదనుకుంటా. ఎందుకంటె ఉద్యోగ రీత్యానో లేదా స్ధిరపడడానికో అమెరికా, యూరప్ లకు వెళ్లినవారిలో కూడా కట్నాల హత్యలు జరుగుతున్న విషయం పత్రికలు చాలా సార్లు రాసాయి. ఆడ పిల్లలను పిండ దశలో చంపుకుంటున్న పరిస్ధితి గ్రామాలతో పోలిస్తే నగరాల్లో ఒకోసారి ఎక్కువగానే ఉందని కొన్ని అధ్యయనాలు సూచించాయి. ఢిల్లీ గానీ, ఇతర మెట్రో పాలిటన్ నగరాలు, కార్పొరేట్ నగరాల్లో గానీ చూస్తే అక్కడ ఉన్నవారంతా నగర సంస్కృతికి అలవాటు పడినవారేమీ కాదు. లేదా నగరాల ప్రగతి భావాలను నగరవాసులంతా అలవర్చుకుని ఆచరిస్తున్నారన్న గ్యారంటీ లేదు. వారిలో సగానికి పైగా గ్రామాల నుండి వలస వచ్చినవారే. వారి సంస్కృతీ, ఆచార వ్యవహారాలు నగరాలకి రావడంతోనే మారిపోవు. మారిపోక పోగా వెనుక బాటు ఆచారాలను నగరాలకి కూడా పట్టుకొస్తారు. అంతే కాక సంస్కరణల వల్లనైతేనేమీ మరొక కారణం వల్లనైతేనేమి నగరాల్లో ఎగువ మధ్య తరగతి పెరిగిపోయింది. వీరి ఆర్ధిక పరిస్ధితి మెరుగుపడినంత వేగంగా సంస్కృతీ సంబంధిత ఆచార వ్యవహారాలు మెరుగుపడడం లేదు. అంటె ఉన్నపళంగా వచ్చిపడిన డబ్బుతో సమానంగా స్త్రీల ఎదుగుదలను, వారి స్వతంత్రత భావాలనూ స్వీకరించలేని పరిస్ధితి నెలకొని ఉంది. ఈ నేపధ్యంలో కూడా కొన్ని వర్గాల స్త్రీలలో వ్యక్తమవుతున్న స్వతంత్రతను విచ్చలవిడితనంగా భావిస్తున్న పరిస్ధితి ఏర్పడింది.

  మీరన్నట్లు మధ్య తరగతిలో కొంత భాగం స్త్రీలకు సంబంధించి స్వతంత్ర వ్యక్తీకరణలను ఆహ్వానించి, ప్రోత్సహిస్తున్నారు. ఆ క్రమంగా ఇంకా ఊపందుకోలేదు. ఇంకా జరగాల్సి ఉంది. ఈలోపే నగరాల్లో వేగంగా వృద్ధి చెందుతున్న స్త్రీ స్వేచ్చను ఆటంక పరచడానికి పాత భావాలు ప్రయత్నిస్తున్నాయి. ఫలితంగానే స్త్రీల స్వతంత్ర వ్యక్తీకరణలను హర్షించి ఆహ్వానీంచడానికి బదులు డ్రస్సుల పేరుతో, భద్రత పేరుతో అణచి ఉంచడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయి. అణచివేతను వివిధ రూపాల్లో ఎదుర్కొంటున్న స్త్రీలను బరితెగించనవారిగా ముద్ర వేస్తున్నారు. ఇదంతా పాత, కొత్త పరిస్ధితులకు ఉండే ఘర్షణ. ఘర్షణలు శత్రుపూరితంగా మారకుండా పాజిటివ్ ముగింపు వచ్చేలా చేయడంలో ప్రభుత్వాలు పాత్ర తీసుకోవలసి ఉండగా అది జరగడం లేదు. ప్రభుత్వాల్లోని వ్యక్తుల్లో కూడా పాత భావాలే ఇంకా ఆధిపత్యం వహించడం దానికి ఒక కారణం. ప్రజలను వివిధ సామాజిక చెడుగుల పట్ల చైతన్యవంతం చేయడంలో ప్రభుత్వానికి అనేక మార్గాలు అందుబాటులో ఉంటాయి. విద్యారంగం అందులో ప్రముఖమైనది. పాఠ్యపుస్తకాలలో ఎప్పటికప్పుడు ప్రజాస్వామిక సంస్కృతులను పెంపొందించేలా పాఠాలను ప్రవేశపెట్టవచ్చు. సినిమాలు, మీడియా లాంటి సాధనాలను శక్తివంతంగా ఉపయోగించుకోవచ్చు. కాని అవన్నీ ఇప్పుడు ప్రభుత్వాల చేతిలో కంటె ప్రవేటు వ్యక్తుల చేతిలో కేంద్రీకృతమయ్యాయి. దానితో ప్రభుత్వాల వనరులు కూడా తగ్గిపోతున్న పరిస్ధితి ఏర్పడుతోంది.

  వివాహ వ్యవస్ధ సామాజిక పరిణామక్రమంలో ఏర్పడిందే తప్ప ఏ ఒక్కరో పూనుకుని నిర్ణయించినవి కావు. అయితే వ్యవస్ధలకు అనుబంధంగా ఉన్న వివిధ నైతిక, ఆచార నియమాలు మాత్రం సమాజంలో పలుకుబడి కలిగిన వర్గాలు వివిధ దశలలో రుద్దినవే. ప్రజా జీవనానికి అనుగుణంగాలేని ఆచార వ్యవహారాలను సమాజం ఎప్పటికప్పుడు వదిలించుకుంటుంది. కాని అటువంటి నియమాలకు దైవత్వాన్ని ఆపాదించడం వలన చాలా చోట్ల అభివృద్ధి నిరోధకత్వాన్ని వదిలించుకోవడానికి ఆటంకం కలుగుతోంది. అదొక సమస్య.

  పెళ్లిని పునర్నిర్వచించాలన్న సూచన ఆచరణీయం. ఆ నిర్వచనం పాత భావాలను వదిలించుకునేదిగా, అభివృద్ధికర భావాలను మిళితం చేసుకునేలా ఉండాలి. ఇదంతా ప్రభుత్వాలు, ప్రజలు ఉమ్మడిగా పరస్పర అవగాహనతో చేయవలసిన కృషి. దానికి ముందస్తు షరతు ప్రభుత్వాలు అందుకు కట్టుబడి ఉండడం. కాని పరిస్ధితి దానికి భిన్నం.

  మగవారి వైపు నుండి జరుగుతున్న దురాగతాలను ఎత్తి చూపడం పరువు పోవడంగా ఎందుకు భావించాలి. సరిదిద్దు కోవడానికి వచ్చిన అవకాశంగా దాన్ని స్వీకరిస్తే ఉపయోగం. మీడియావారు స్పష్టమైన సూచనలతో ముందుకు రావాలన్న మీ సూచన అభినందనీయం. కాని మీడియా కంపెనీనలకు లాభార్జనే కదా ప్రధానం. తమ వ్యాపార ప్రయోజనాలకి లోబడే మీడియా కంపెనీల ప్రగతి శీల ఫోజులు కూడా లోబడి ఉంటాయి. అంత మాత్రాన ఫోజుల రూపంలో ఉన్న ప్రగతి శీలతను ఒట్టి ఫోజులుగా కొట్టి వేసే బదులు ప్రగతిశీల వ్యక్తీకరణనైనా ఆహ్వానీంచవచ్చు కదా.

 8. >> పెళ్లి లేకపోతే మగవారు స్వేచ్ఛగా జీవిస్తారనుకుంటె అదే బెటర్. కాని ఆ తర్వాత మగ పుట్టుకలు కూడా ఉండవు. >> వెల్ సెడ్ !

  ఆడవారిపై దౌర్జన్యాల వార్తల గురించి మీ బ్లాగులో రాసినప్పుడల్లా ‘వీటిని సమర్థించం కానీ..’ అంటూనే అవి విడివిడి సంఘటనలుగా చెపుతూ … ఆడవాళ్ళే మగవాళ్ళను అణచివేస్తున్నారనీ, సమాజంలో పురుషాధిక్యత ఏమీ లేదనీ కొందరు వ్యాఖ్యాతలు రాస్తున్నారు.

  స్త్రీలే నిర్ణయాధికారం చేసే కుటుంబాలు కొన్ని ఉన్నంత మాత్రాన, ఆడవాళ్ళ పెత్తనం కొన్ని ఇళ్ళలో సాగుతున్నంత మాత్రాన సమాజం మొత్తం స్థితిని అవి ప్రతిబింబిస్తాయా?

  అసలు ఇప్పుడున్నది పురుషాధిక్య సమాజం అని ఇవాళ కొత్తగా రుజువు అవ్వాల్సిన అవసరం లేదు. ఇంటి ‘యజమాని’ తండ్రే. తల్లి పేరుకు పిల్లల రికార్డుల్లో, దరఖాస్తుల్లో కూడా ఎక్కడా చోటు ఉండేది కాదు- నిన్న మొన్నటిదాకా! స్త్రీలు ఏం చేయాలన్నా అయితే భర్త, వయసు పెరిగాక కొడుకులు ‘పర్మిషన్లు’ ఇవ్వాల్సిన పరిస్థితులు ఏమీ మారలేదు.

  మహిళలపై జరిగే దురంతాలను ప్రస్తావించటం అంటే వాటికి తేలిగ్గా వీలునిచ్చే సమాజ వ్యవస్థ గురించి చెప్పటమే. అంతే కానీ అది మగవారికి వ్యతిరేకం కాదు. స్త్రీ పురుషులు శత్రు వర్గాలు కాదు. వారి వైరుద్ధ్యాలు మిత్ర వైరుద్ధ్యాలే!

 9. వేణు గారు, ఇది పురుషాధిక్య సమాజమే అని కొత్తగా చెప్పవలసి రావడమే ఆశ్చర్యంగా ఉంది. వివిధ ప్రభుత్వ, ప్రవేటు సర్వేలు చూసినా, ఐక్యరాజ్య సమితి అధ్యయనాలు చూసినా ప్రపంచ వ్యాపితంగా స్త్రీల పరిస్ధితి దుర్భరంగానే ఉందని అర్ధం అవుతుంది. అభివృద్ధి చెందిన పెట్టుబడిదారీ దేశాల్లో సైతం స్త్రీల పరిస్ధితిలో మౌలికంగా మారలేదని సమితి నివేదికలు తేటతెల్లం చేస్తున్నాయి. ఇప్పటికీ మాతృస్వామిక వ్యవస్ధలు చాలా అరుదుగా అయినా కొనసాగుతున్నాయని ఈ మధ్య ఒక పరిశోధనా వ్యాసం చదివాను. మన పక్కనే ఉన్న కేరళలో ఒక కమ్యూనిటీలో మాతృస్వామిక వ్యవస్ధ ఉందని ఆ పరిశోధన తెలిపింది. ఇండోనేషియాలోనూ, ఆఫ్రికాలో మరి కొన్ని చోట్ల కూడా మాతృస్వామ్యం ఉందట. వారు చెప్పిన ముఖ్య విషయం ఏమిటంటె పురుషాధిక్య సమాజంలో సంపదలు, వాటి వారసత్వం కేంద్ర అంశంగా ఉంటే, మాతృస్వామిక సమాజాల్లో ‘సమానత్వం’ ప్రధానంగా ఉందని పరిశోధన తెలిపింది. పితృస్వామ్యంలో ఆడవారి మీద పెత్తనం ఉన్నట్లుగా మాతృస్వామ్యంలో పురుషుల మీద పెత్తనం ఉన్నట్లు కొందరు పొరబాటుగా భావిస్తున్నారు. అది నిజం కాదని సదరు పరిశోధన తెలిపింది. కమ్యూనిటీలో ప్రతి ఒక్కరూ సౌకర్యవంతంగా జీవించే ‘మదర్లీ ట్రీట్ మెంట్’ మాతృస్వామ్యం ప్రధాన లక్షణమని పరిశోధన తెలిపింది. వీలయితే ఆ వ్యాసం మళ్లీ సంపాదించి మీకు పంపుతాను.

 10. @వేణు,

  మనది పూర్వం పురుషాధిఖ్య ప్రపంచమే. కానీ, ప్రస్తుతం పరిస్థితులు చాలా మారాయి. అది అర్థం చేసుకోకుండా ఇంకా ఇది పురాతన పురుషాధిఖ్య ప్రపంచమే అనే ముద్ర వేస్తుంటే దాన్ని వ్యతిరేకిస్తున్న వారే కానీ, స్త్రీలపై ప్రస్తుతం కూడా జరుగుతున్న అత్యాచారాలను సమర్ధించడం ఎవ్వరూ చేయరు. ప్రస్తుతం మగవారిలో వచ్చిన మార్పు, సమాజములో వచ్చిన మార్పును గమనించమని చెప్పే ప్రయత్నములో బాగమే ఇదంతా.

  ప్రస్తుతం, విధ్యా వంతులైన స్త్రీలు చైతన్య వంతులైన స్త్రీలు చాలా మందే ఉన్నారు. ఇది ఒక మోస్తరు అభివృద్ది జరిగిన ఊర్లనుండీ, పట్టణాల వరకూ కనిపిస్తున్న మార్పు. ఈ మార్పును గుర్తించాలి. పురుషుల దృక్పధములోనూ, వారి సమాజిక హోదాలోనూ వచ్చిన మార్పునూ గుర్తించాలి, ప్రస్తుతం ఉన్న చట్టాల కారణంగా మగవారికి జరుగుతున్న అన్యాయాలను గుర్తిచాలి అంతే కాదు, వారికి అన్యాయం జరగకుండా అడ్డుకోవాలి కూడా. అలా కుదరక పోతే, కనీసం వాటిని గురించి ప్రస్తావించాలి. ఇవేమీ చేయకపోవడం అంటే పురుషులనూ, వారిలో ప్రస్తుతం వస్తున్న మార్పులను అవమానించడమే, అంతే కాదు వారికి జరిగిన అన్యాయాలను కొండొకచో లోపాయకారిగా సమర్ధించినట్లవుతుందని గ్రహించడం మంచిది.

  ఒకప్పుడు తల్లి పేరు ఎక్కడా ఉండేది కాదు అనేది ఎంత నిజమో ప్రస్తుతం తండ్రులు అంటే.. పిల్లల తల్లికి భర్తలు అని చెప్పుకోవాల్సి రావడం కూడా నిజమే. తండ్రి అనే పదానికి విలువ లేదు. విడాకుల తరువాత మగవారు విజిటర్లుగా మారతారు. జాయింట్ కస్టడీకి ఎలాంటి ఆస్కారం ఉండదు. తమ పిల్లల ఎడబాటును భరించలేక ఆత్మహత్యలు చేసుకున్న మగవారు కూడా ఉన్నారు. మరి వారందరి మాటా ఏమిటి? పితృదేవోభవ అన్న పదానికి ప్రస్తుత సమాజములో విలువ లేదన్న విషయం తెలుసా మీకు?

  మగవారి లైంగిక హక్కులు, పితృత్వపు హక్కులు, పునరుత్పత్తి హక్కులు, ఆస్తి హక్కు, నివాసపు హక్కు, ఇవేకాదు.. మగవారి డిగ్నిటీకి అసలు విలువే లేదు, కానీ స్త్రీల డిగ్నిటీకి మాత్రం ప్రత్యేక చట్టాలే ఉన్నాయి. అత్యంత లోపబూయిష్టమీన 498A లాంటి చట్టం, DV Act, ప్రస్తుతం ప్రతిపాదించిన హిందూ వివాహ చట్టం సవరణ.. ఇవన్నీ మగవారి హక్కులను కాల రాస్తున్నాయి.

  ఒక పురుషుడు స్త్రీని మోసం చేస్తే చట్టపరంగా చర్య తీసుకోవచ్చు, అదే పురుషుడిని స్త్రి మోసం చేస్తే.. భార్య వివాహేతర సంబంధం కలిగి ఉంటే ఆమెను శిక్షించడానికి ఎలాంటి చట్టాలూ లేవు. పైపెచ్చు.. స్త్రీలను ఇటువంటి వాటిలో శిక్షించకూడదు అని ప్రకఠనలు ఒకటి.

  ప్రస్తుతం సమాజములో మగవారు చేసే సేవలను గ్రాంటెడ్ గా భావించడం జరుగుతోంది. అది గుర్తించ కుండా.. కేవలం పురాతన భావజాలాన్ని ఇంకా పట్టుకుని, దాని ఆధారంగా ప్రస్తుత సమాజాన్ని అంచనా వేయడం తగదు.

  ప్రస్తుతం సమాజములో మగవారు ఎదుర్కొంటున్న సమస్యలను .. ఇది పురుషాధిఖ్య ప్రపంచమే అంటూ కొట్టిపారేస్తూ మట్లాడే వారిని వ్యతిరేకించడం అనివార్యం. అది జరిగి తీరుతుంది.

 11. కేరళలో మాతృస్వామ్యం అనేది లేదు. నేతి బీర కాయలో నెయ్యి సామెత మీరు వినే ఉంటారు. అమ్మాయిని బాగా చదివిస్తే తమ దగ్గర డబ్బు ఎక్కువ ఉందనుకుని అవతలివాళ్ళు కట్నం ఎక్కువ అడుగుతారని అమ్మాయికి పద్నాలుగో ఏటే పెళ్ళి చేసేవాళ్ళు కేరళలో కూడా ఉన్నారని విన్నాను. ఏ బేసిస్ మీద కేరళలో మాతృ స్వామిక వ్యవస్థ ఉందనుకుంటున్నారో అలా ఉందని చెప్పేవాళ్ళే సమాధానం చెప్పాలి. బ్రిటిష్‌వాళ్ళ కాలంలో ట్రావన్‌కోర్ రాజులు దళిత స్త్రీల రొమ్ముల పై పన్ను వేసేవారు. అక్కడ దళిత స్త్రీ పన్ను కట్టకుండా తన బిడ్డకి పాలు ఇస్తే ఆమె రొమ్ములు కోసేవాళ్ళు. కేరళలో స్త్రీలపై అత్యాచారాలు ఆ స్థాయిలో ఉండేవి. ఆస్తి స్త్రీ పేరు మీద వ్రాసి ఆ ఆస్తి మీద అధికారం వాస్తవికంగా ఆమె భర్తకో, అన్నకో ఇచ్చేవాళ్ళు మన రాష్ట్రంలో కూడా ఉన్నారు. కేవలం ఆస్తి స్త్రీ పేరు మీద వ్రాయడమే మాతృస్వామ్యం అనుకుంటే మన రాష్ట్రంలో కూడా మాతృస్వామ్యం ఉన్నట్టే.

 12. ప్రవీణ్, కేరళ అంతటా మాతృస్వామ్యం ఉందని నేను అన్లేదు కదా. ‘ఒక కమ్యూనిటీ’ లో ఉందని నేను చదివాను. మళ్లీ వెతికి చదివి ఆ వివరం రాస్తాను.

 13. అది ఏ రకంగా మాతృస్వామ్యమో వ్రాయండి. ఎందుకంటే కేవలం ఆస్తి స్త్రీ పేరు మీద వ్రాయడం మాతృస్వామ్యం కాదు. కేరళలో మాతృస్వామ్యం ఉందనుకునేవాళ్ళు దాన్నే మాతృస్వామ్యం అనుకుంటున్నారా? అలాగైతే మా ఇల్లు మా అమ్మగారి పేరున రిజిస్టర్ అయ్యి ఉంది. కానీ మా ఇంటిని దగ్గర ఉండి కట్టించినది మా నాన్నగారే. మా అమ్మానాన్నల ఇద్దరి జీతాలూ సమానమే కానీ మా నాన్నగారు ‘ఆడవాళ్ళు సిమెంట్, ఇనుము లాంటివి కొనడానికి బయటకి ఏమి వెళ్తారులే’ అని అనుకున్నారు. నాన్నగారే అవి కొనే పనులు చూసేవారు. ఆస్తి స్త్రీ పేరు మీద ఉన్నా స్త్రీ-పురుష సంబంధాలు ఇలాగే ఉంటాయి.

 14. శ్రీకాంత్ గారూ, మీరన్నట్లు పరిస్ధుతులు మారాయనడంలో సందేహం లేదు. అయితే ఆ మార్పు ‘పురుషాధిక్య వ్యవస్ధ’ కాదు అని భావించగలిగేంతగా జరగలేదు.

  వ్యవస్ధల నడవడిని సిద్ధాంతీకరించడానికి ఒక వ్యక్తికీ లేదా కొందరు వ్యక్తులకీ ఉన్న అనుభవాలు మాత్రమే సరిపోవు. దానికి విస్తృత పరిశీలన కావాలి. వ్యవస్ధలో ఉన్న అనేకానేక ధోరణులను నిస్పాక్షికంగా పరిశీలించాలి. సామాజిక ధోరణులు వాటికవే ప్రారంభం అయి అంతం కావు. వాటికి పునాదిగా ఆర్ధిక సంబంధాలు ఉంటాయని సామాజికవేత్తలు అంగీకరిస్తారు. సామాజిక పరిస్ధితులను అంచనా వేయడానికి వివిధ పరిశోధకులు, సంస్ధలు పూనుకుని నివేదికలు వెలువరించడం మనకు తెలిసిన విషయమే. ఇది పురుషాధిక్య సమాజం కాదనీ స్త్రీ, పురుషులు అన్ని రంగాల్లో సమానత్వంతో జీవిస్తున్నారనీ తెలిపే పరిశోధనలు గానీ, నివేదికలు గానీ, అధ్యయనాలు గానీ మీకు తెలిసి ఏమన్నా ఉన్నాయా? ఉంటే ఆ వివరాలు అందించండి. అలాంటి నివేదికలు ఉన్నట్లయితే ‘ఇది పురుషాధిక్య సమాజం’ అని నిర్ధారించడానికి వెనుకంజ వేయవలసిందే.

  స్త్రీలలో చాలా మంది విద్యావంతులయ్యారు. చైతన్యవంతులయ్యారు. అందుకే వారు పురుసాధిక్యతకు నిలవరించడానికి ప్రయత్నాలు చేస్తున్నారు. ఆ ప్రయత్నాల వల్లనే స్త్రీ పురుషుల మధ్య వైరుధ్యాలు తీవ్రం అవుతున్నాయి. అప్పటివరకూ తమ ఆధిక్యతను సహజంగానో, పాటించవలసిన సూత్రంగానో సహిస్తూ వచ్చినవారు ప్రశ్నించడం ప్రారంభం కావడంతో సహజంగానే ఘర్షణలు తలెత్తుతున్నాయి. ఈ ఘర్షణల అర్ధం సమస్యలను ఇరువురికీ అంగీకార యోగ్యంగా సమానత్వ ప్రాతిపదికన పరిష్కరించుకోవాలనే తప్ప ఎవరో ఒకరి ఆధిక్యత నిరూపణ అవ్వాలని కాదు.

  నిజమే. ‘పితృ దేవోభవ’ అన్న సూక్తికి నేడు విలువ లేదు. దానితో పాటు ‘మాతృ దేవోభవ’ అన్న సూక్తికీ, ‘గురు దేవోభవ’ అన్న సూక్తికీ కూడా విలువ లేదు. మొత్తం సామాజిక విలువలు క్షీణించడంలో భాగంగానే ఈ విలువల పతనాన్ని చూడవలసి ఉంది. ఈ విలువలు పూర్తిగా లేవని చెప్పడం కూడా సత్య దూరమే. విలువలు క్షీణిస్తున్న పరిస్ధితి మాత్రం ఉంది.

  సమాజంలో బలహీన వర్గాలకు మద్దతు ఇచ్చి ఇతరులతో సమాన స్ధాయికి తేవడానికి ప్రభుత్వాలు ప్రత్యేక చట్టాలు తెస్తాయి. దళితులు, స్త్రీలు, మైనారిటీలు… ఇలా. స్త్రీల కొసం చేసిన చట్టాలు అమలవుతున్నదే తక్కువ. అలాగని ప్రభుత్వాలు అంగీకరిస్తున్నాయి. వివిధ పరిశోధనలు, సర్వేలు, నివేదికలు ఆ సంగతి వెల్లడిస్తున్నాయి. సరిగ్గా అమలు కాని చట్టాల వల్ల పురుషుల హక్కులు హరించబడుతున్నాయని భావించలేము.

  ఇపుడున్న పరిస్ధితుల ఆధారంగానే పురుషాధిక్య సమాజం కొనసాగుతున్నదని అధ్యయనాలు చెబుతున్నాయి.

  పురుషులు అనేక సమస్యలు ఎదుర్కొంటున్నారు. కాని అవి జెండర్ స్పెసిఫిక్ సమస్యలు కావు. పురుషులు ఎదుర్కొంటున్న జెండర్ స్పెసిఫిక్ సమస్యలు అక్కడక్కడా ఉన్నా వాటిని సాధారణీకరించలేము. సమాజంలో మార్పులు చోటు చేసుకుంటున్నాయి అనడానికి అలాంటివి ఉపయోగపడవచ్చుగానీ మొత్తం సామాజిక ధోరణిని అవి నిర్ధారించలేవు. నిర్ధారణలకు వ్యక్తిగత అనుభవాలు ఒకానొక వనరు మాత్రమే. వ్యక్తిగత అనుభవాలను సాధారణీకరించాలంటె అధ్యయనాలు, సర్వేలు, పరిశోధనలు మున్నగు వాటి సహాయం తప్పని సరి.

 15. శేకర్,
  ఎక్కడికో వేళ్లారు రెండు రోజుల క్రితం డిల్లి లో 21సం||ల వయసుగల చదువుకొన్న పెద్దింటి అమ్మాయి, బెంజ్ కారును తోలుతు ఒకరిని గుద్ది చంపింది. మిగతా సిటిలతో పోల్చుకొంటే దేశ రాజధాని అవటం చేత డిల్లీ లో ఎంతో కొంత ట్రాఫిక్ రూల్స్ పాటిస్తారు.ఈ అమ్మాయి ఎలా తోలితే అలా యాక్సిడెంట్ చేసి ఉండాలి? ఇన్ని వార్తలను ట్రాక్ చేసే మీరు దానిని మీబ్లాగులో ఎందుకు ప్రస్తావించలేదో ఆత్మ విమర్శ చేసుకోండి. నేనను కోవటం మీరు ఇలాంటి వార్తలు రాసేటప్పుడు, ఆ తప్పు చేసినవారిని తిట్టవలసి వస్తుంది. ఈ యాక్సిడెంట్ లో తప్పుచేసిన్వ వ్యక్తి మహిళ కావటం చేత మీరు ఆమేను తప్పుపడుతూ టపారాయలేక పోయారో లేక చాలా మంది మగవారికి మహిళలంటే ఎదో తెలియని సానుభూతి, పాపం చిన్న తప్పువలన ఇటువంటి కేసులో ఇరుక్కుంది అని జాలి తలచి, కారు ఆ అమ్మాయికి ఇచ్చినందుకు వాళ్ల అమ్మానాన్నలను తప్పుపట్టి ఆ వార్తను చూసి చూడనట్లుగా వదలివేసిఉంటారు.
  నేను రాసిన పైకారణాలు పక్కన పెట్టినా మీలాంటివారు దానిని ఎందుకు ఖండించలేదు? పైన శ్రీకాంత్ చెప్పినట్లుగా మగవారి తప్పులను భూతద్దాలతో చూస్తూ, వారి సేవలను, కష్ట్టాలను టేకిట్ ఫర్ గ్రాంటేడ్ గాభావిస్తున్నారు. అదే ఆడవారి విషయానికి వచ్చేటప్పటి, కళ్ళ్లు నెత్తికెక్కి మనుషులను చంపుతున్నా అంతా చూసి చుడనట్లుగా వదిలి వేస్తున్నారు. ఇది ఎంత వరకు న్యాయం?

 16. అంబానీ భార్యనీ, వ్యవసాయ కార్మికురాలినీ ఒకేలా చూడలేము అని ఇంతక ముందే విశేఖర్ గారు అన్నారు. ఆ వ్యాఖ్యలు చదవలేదా?

 17. @ Srikanth M:

  పురుషాధిక్య ప్రపంచం ఇప్పుడు లేదని అంటున్నారు కదా? తండ్రులు అంటే.. పిల్లల తల్లికి భర్తలని చెప్పుకోవాల్సి వస్తూ బతుకుతున్నారని కూడా మీరు చెపుతున్నారు. వీటిని నిరూపించే అధ్యయనాలు ఎప్పుడు ఎక్కడ జరిగాయో, ఫలితాలు ఏం తేలాయో కూడా నిర్దిష్టంగా చెప్పండి. అవి సమాజం మొత్తానికీ అన్వయించేలా ఉంటే పురుషాధిక్య వ్యవస్థ మాయమైపోయిందని ఎలాంటి పేచీ లేకుండా నిర్థారణకు వచ్చేయొచ్చు!

  శాస్త్రీయపరమైన ఆధారాలుంటే ఒప్పుకోడానికి ఎవరికి మాత్రం అభ్యంతరం ఉంటుంది?

 18. ప్రస్తుతం మాత్రుస్వామ్యం అనేది యక్కడా కనిపించదు యక్కడైనా అటవికులున్నా వాళ్ళలొ కుడా ఆదునిక సంక్రమన జరిగి రొండింటీ కలపొతగా వుంటుంది ఆస్తి అనేది ఎక్కువగ ఎర్పడటం దాన్ని కొడుకులకు ఇవ్వాలనే కొరికతొ గణం లొని స్త్రీ పారంపర్యమ్నుంచి పురుష పారంపర్యానికి మార్పు వచ్చింది. మాత్రుస్వామ్యంలొ కుటుంభ శ్రమ అనేది సామజిక హొదా కలిగి వుంది . క్రమక్రమంగా కుటుంభ శ్రమ అనేది వ్యెక్తి గత శ్రమగా మారిపొఇంది .అప్పుడే పురుష అధికారానికి బీజం పడింది.. పెళ్ళిళ్ళు ప్రెమ, మొహం, ఆకర్షణ ,వ్యెక్తిగత ఆత్మాభిరుచి తొ జరగటం లేదు. కేవల అవసరార్దం జరుగుతున్నాయి అధికంగా ఆర్దిక స్తితిగతులనుబట్టి. ప్రెమ పెళ్ళికి కారణం కాలేదు. తల్లితండ్రులు కుదిర్చిన వివాహాలలొ ఆప్రెమ సాంప్రదాయంగా వచ్చింది మాత్రమే .ఒక వేల ప్రెమతొ పెళ్ళి చేసుకున్నా వాలిద్దరు అసమాన స్తితిలొ వున్నారు. కాబట్టి ఆ ప్రెమ చనిపొయెదానికి చాలా దగ్గరిలొనే వుంటుంది . అందుకే నిత్యం అసంత్రుప్తి వ్యెభిచారానికి వ్యెగబడటం. ప్రస్తుత కుటుంబాలలొ ప్రెమ, మొహం, ఆకర్షణ ఇలాంటివి భుతద్దం పెట్టి చుసినా కనిపించవు.
  భౌతిక పరిస్తుతులు మారకుండా కేవలం చట్టాలు చేసినంత మాత్రన ఉపయొగం లేదు . వరకట్నం మీద చటం చెసినారు ఎమైంది? చట్టాలు చాలా వున్నాయి కాని దాన్ని అమలుపరచగల పరిస్తితులు ఇంకా లేవు. ప్రజల్లొ ఆచైతన్యం రావాలి . భార్యా, బర్త, ఒకరి మీద ఒకరు ఆదారపడే స్తితి పొవాలి ఆర్దిక పరిస్తుతులు వాళ్ళను ప్రభావితం చేసినత వరకూ, నిత్యం గర్షణ తప్పదు.

 19. విషేఖర్ గారూ,

  నేను కూడా కేవలం ఎవరో కొద్ది మందిని, వారి అనుభవాలను దృష్టిలో ఉంచుకుని చెప్పడం లేదు. స్థూలంగా సమాజములో వస్తున్న మార్పులనూ, తద్వారా పురుషుల స్టేటస్ లోనూ, వారి జీవితములోనూ వస్తున్న మార్పులను దృష్టిలో ఉంచుకుని మాత్రమే చెబుతున్నాను.

  పితృస్వామ్య సమాజములో కూడా స్త్రీలకు కొన్ని సదుపాయాలు ఆయా సమజములోని స్త్రీల స్థితి గతులను దృష్టిలో ఉంచుకుని ఇవ్వడం జరిగింది. అవన్నీ పితృస్వామ్య వ్యవస్థలో స్త్రీలకు ఏర్పడిన కొన్ని ఇబ్బందులనూ, డిస్ అడ్వాంటేజీలనూ దృష్టిలో ఉంచుకుని మాత్రమే ఇవ్వడం జరిగింది.

  ప్రస్తుతం జరుగుతున్న మార్పులన్నీ కేవలం పితృస్వామ్య వ్యవస్థలో మగవారికి ఉన్న సదుపాయాలనూ, సౌలభ్యాలనూ వ్యతిరేకించడము మీదనే జరుగుతున్నాయే కానీ, అదే వ్యవస్థలో స్త్రీకి ఇవ్వ బడిన ప్రత్యేక సదుపాయాలను కూడా నిర్మూలించడములో మాత్రం జరగడం లేదు. వీటివలన పురుషులు తీవ్రమైన వివక్షకు గురవుతున్నారు. దురదృష్టకరమైన విషయమేమిటంటే, చాలా మంది ఇటువంటి వాటిని అవసరం అన్న విషయాన్ని కూడా అంగీకరించకుండా.. ఇది పురుషాధిఖ్య ప్రపంచం అన్న సాకును చూపి .. వాటిని కొట్టి పారేస్తున్నారు. దాని వలన చాలా దుష్ప్రభావాలు తలెత్తుతున్నాయి.

  మీరు పైన రాసిన ఆర్టికలులో కూడా కేవలం స్త్రీకి ఇవ్వబడిన సౌకర్యాలు అమలవ్వడ లేదని మాత్రమే రాస్తున్నారు. అసలు స్త్రీకి అటువంటి సౌకర్యాలు ఎందుకు ఇవ్వాలి, ఒక సమానత్వ ప్రపంచములో (కనీసం దాన్ని అమలు చేయడానికి ప్రయత్నిస్తున్న ప్రపంచములో) ఇటువంటి వాటికి తావులేదు కదా? ఈరోజు నేను చదివిన ఒక వార్త ఏమిటంటె.. ఒక వ్యక్తి రెండవ వివాహం చేసుకోవడముతో.. మొదటి భార్య అతన్ని స్తంభానికి కట్టేసి చెప్పులతో విపరీతంగా కొట్టింది. ఆమే కాదు ఆమె బంధువులు కూడా అతన్ని విపరీతంగా కొట్టారు. ఘనత వహించిన మీడియా వారు దాన్ని ఎంతో గొప్పగా.. బ్యాక్ గ్రౌండు మ్యూసిక్ తో చూపిస్తున్నారు. అదే పని ఒక మగాడు చేస్తే, చూపించగలరా? సమర్ధించ గలర? ఈ వ్యత్యాసానికి కారణం ఏమిటి?

  చట్టాల ప్రకారం వెల్లవలసింది కేవలం స్త్రీలు, మైనారిటీలు, దళితులు రిసీవింగ్ ఎండ్ లో ఉన్నప్పుడేనా. అదే పని మగవారూ, మెజారిటీలు రిసీవింగ్ ఎండ్ లో ఉన్నప్పుడు కనీసం ప్రస్తావన కూడా చేయకుండా వదిలేస్తారా? ఇది ఏతరహా న్యాయానికి నిదర్షనం? కేవలం ఒక భావజాలం ఈ పార్శ్వాన్ని గుర్తించకపోవడముతో ఆభావజాలాన్ని నమ్మేవారు కూడా దాన్ని గుర్తించడానికి సమేమిరా అంటుండడం కాదా?

  స్త్రీపురుషుల మధ్య వైరుధ్యానికి కారణం స్త్రీలు పురుషాధిక్యతను నిలువరించడానికి చేశ్తున్న ప్రయత్నాలకు ప్రతిఘఠనో, స్త్రీల ఉన్నతిని అంగీకరించక పోవడమో కారణం కాదు. ఇప్పుడు తీసుకుంటున్న నిర్ణయాలలో చాలా నిర్ణయాలు ప్రో- ఉమన్ నిర్ణయాలు, ప్రొ- ఈక్వాలిటీ నిర్ణయాలు కాదు. ఈ ప్రో – ఉమన్ నిర్ణయాల వలన మరియూ పితృస్వామిక భావజాలముతో కూడిన షివల్రీ (Chivalry), మరియూ ఆ భావజాలముతో స్త్రీలకివ్వబడిన కొన్ని రకాల సౌలభ్యాలూ కలయికతో పురుషుని హక్కులకూ విలువ లేకుండా పోవడమో లేకపోతే వారి భావాలకు విలువ లేకుండా పోవడమో జరుగుతోంది. దానివలన మగవారు, స్త్రీల హక్కులేనా మరి మా హక్కుల మాటేమిటి అంటూ నిలదీయడం జరుగుతోంది. అదే ఈ వైరుధ్యాలకు కారణం.

 20. విషేఖర్ గారూ,

  వ్యవస్థలో పురుషాధిక్యత ఉందా లేదా అనడానికి సరైన సర్వేలు కానీ అధ్యనాలు కానీ లేవన్నారు. అవి ఎలా ఉంటాయి. ప్రస్తుత సమాజములో వస్తున్న మార్పులను గుర్తించకుండా, అవి పురుషుల జీవితాలపై కలిగిస్తున్న ప్రభావాన్ని పట్టించుకోకుండా ఇంకా ఇది పురుషాధిఖ్య ప్రపంచమే అన్న భావణలతో చాలా మంది కాలం గడుపుతున్నారే కానీ.. మరో పార్శ్వాన్ని గురించి అధ్యయనం చేయాలన్న స్పృహ మన వారిలో కొరవడింది. అందుకే అటువంటి అధ్యయణాలు మనకు పెద్దగా లేవు. ఇప్పుడైనా ఉన్న కొద్దో గొప్ప వివరాలు, అధ్యయణాలు చేసి సంపాదించినవి కాదు. పురుషుల హక్కుల కోసం పోరాడుతున్న హక్కుల కార్యకర్తలు ఎంతో శ్రమకోర్చి సేకరించినవే.

  అలాంటి స్పృహ కొద్దో గొప్పో కలిగిన పాశ్చాత్య దేశాలలో సర్వేలు అధ్యయనాలు తూ తూ మంత్రంగానైనా కొద్దిగా జరిగాయి. దానికారణంగానే గృహహింస అన్నది జెండర్ స్పెసిఫిక్ కాదనీ, దాన్ని స్త్రీలూ, పురుషులూ ఇరువురూ చేస్తున్నారనీ తేల్చి చెప్పడం జరిగింది. తండ్రులకు జరుగుతున్న అన్యాయాన్ని కూడా వివరించడం జరిగింది. అంతే కాదు, కొన్ని సార్లు స్త్రీలే ఎక్కువగా చేయడం జరుగుతోందని కూడా తేల్చడం జరిగింది. స్త్రీ శారీరకంగా బలహీణురాలైనప్పటికీ ఆమె దాన్ని ఏదైనా వస్తువు విసరడం ద్వారా గానీ, ఆయుదం ద్వారా గానీ అధిగమిస్తోందనీ తేల్చారు. పురుషులు ఇటువంటి ప్రస్తుతం ఉన్న సామాజిక పరిస్థితుల కారణంగా.. చెప్పినా తమ పరువే పోతుందనో లేక నమ్మరనో భావించి బయటికి చెప్పుకోలేక పోతున్నారనీ తేల్చాయి.

  ఇవేకాదు, స్త్రీలు ప్రస్తుతం ఉన్న చట్టాలను ఉపయోగించుకుని ఏవిధంగా పురుషుల హక్కులను కాలరాస్తున్నారో దానికి వ్యవస్థ ఎలా సహకరిస్తోందో కూడా చెప్పడం జరిగింది. ప్రస్తుతం స్కూల్లలో మగపిల్లల సంఖ్య దిగజారడానికి కారణాలనూ వివరించడం జరిగింది. కానీ మనకు అటువంటి కన్స్ట్రక్టివ్ మెంటాలిటీతో అధ్యయనాలు చేసే వారు కరువయ్యారు.

  పితృదేవోభవ అన్నదానికి విలువ లేకుండా పోయింది అని నేనన్న మాటా నైతిక విలువలకు సంబందించినది కాదు. అది సమాజానికి కోడ్ లాంటిది అయిన చట్టం గురించి చెప్పిన మాట. చట్ట ప్రకారం తండ్రికి అంత విలువ ఉండదు. విడాకులు తీసుకున్న తరువాత మగవారు కేవలం విజిటర్లు గా మారతారు. తమ పిల్లల ఎడబాటును భరించలేని అనేక మంది తండ్రులు అనేక మానసిక సమస్యలతో బాధ పడుతున్నారు. అదంతా వారిపట్ల చేసే హింసే. కానీ ప్రస్తుత ప్రో – ఉమన్ భావజాలం దీనికి ఎటువంటి విలువా ఇవ్వదు. అద్నుకే తండ్రి అనికాదు పిల్లలతల్లికి భర్త అని చదువుకోవాలి అన్నాను. ఒక్కసారి ఆ పిల్లలతల్లికి అతను భర్త కాకుండా పోతే.. అతనికి ఉండే విలువ నామ మాత్రమే.

 21. ఇక చట్టాలు ఉపయోగించుకుంటున్న వారు కొద్దిమందే అన్నారు. దాని వలన పురుషుల హక్కులకు విఘాతము ఏర్పడలేదు అన్నారు. మీరు ఇక్కడ గమనించాల్సిన విషయమేమిటంటే.. చట్టాలు అమలయ్యింది కొద్ది శాతమే అయినా, అలా ఉపయోగించుకున్న వారిలో చాలా మంది దుర్వినియోగం మాత్రమే చేశారన్న నిజం. అనేక మంది భార్యా బాధితులు ఎంతో శ్రమకోర్చి బయట పెట్టిన వాస్తవాలే అందుకు సాక్ష్యం.

  అంతే కాదు, ప్రస్తుతం ఉన్న చట్టాలు అన్నీ స్త్రీ పక్షపాతముతో కూడుకున్నవే. దాని వలన పురుషులకు తీవ్ర అన్యాయం జరుగే అవకాశం ఉంది. అంటే, ఇప్పటి వరకూ ఉపయోగించుకున్న వారు తక్కువే అని అనుకున్నా.. ఇక మీదటా పరిస్థితి అలానే ఉంటుంది అనుకోవడానికి ఎంత మాత్రం వీలు లేదు. ప్రతీ సంవత్సరం.. కోర్టులలో పెరుగుతున్న కేసులే అందుకు నిదర్శణం. గత ఐదు సంవత్సరాలకీ, ఇప్పటికీ పెరిగిన అటువంటి కేసులే అందుకు ఉదాహరణ. అత్యున్నత న్యాయస్థానం 498A దుర్వినియోగాన్ని.. లీగల్ టెర్రరిజం గా మారుతోంది అని అభివర్ణించింది అంటే అర్థం చేసుకోవచ్చు. అవి ఏస్తాయిలో జరుగుతున్నాయో. దీన్ని గ్రహించకుండా.. ఈ చట్టాలు పురుషుల హక్కులకు ఎటువంటి విఘాతం కలిగించవు అనడం సరికాదు.

  పురుషులు ఎదుర్కొంటున్న సమస్యలన్నీ జెండర్ స్పెసిఫిక్ కాకపోవచ్చు కానీ వారు ఆతరహా సమస్యలు ఎదుర్కోవడం కొత్తేమీ కాదు. ప్రస్తుతం అవి విపరీతంగా పెరుగుతున్నాయని చెప్పడానికి కూడా అనేక నిదర్శనాలున్నాయి.

  ఇవన్నీ చెప్పిన తరువాత కూడా నేను పురుషాధిఖ్యత పూర్తిగా లేదు అని చెప్పడములేదు. సమాజములో పురుషాధిఖ్యత ఇంకా ఉంది కానీ సమాజం పురుషాధిఖ్యం కాదు అని చెప్పడానికి కావలసినన్ని కారణాలున్నాయి అని చెబుతున్నాను. సమాజములో స్త్రీల చైతన్యం లేని చోట పురుషాధిఖ్యత ఇంకా ఉంది. అది పోవడానికి కావలసింది చైతన్యం మాత్రమే. అది వచ్చిన నాడు.. ఇప్పుడున్న్ చట్టాలూ, భావజాలాలూ యధాతధంగా ఉంటే పురుషుడు తీవ్ర అన్యాయానికి గురవుతాడు. అందుకే ప్రస్తుతం అలా చైతన్యం తెచ్చుకున్న స్త్రీలున్న చోట మగవారికి చాలా అన్యాయాలు జరుగుతున్నాయి. అది పల్లే కావచ్చు, ఒక మోస్తరు ఊరు కవచ్చు, లేదా సిటీ కావచ్చు. కాబట్టి ఇది పూర్తిగా పురుషాధిఖ్య ప్రపంచమే అని చెప్పడం కూడా కుదరదు.

  పురుషులకు అన్యాయం జరిగింది అని చెప్పినప్పుడు.. ఇది ఇంకా పురుషాధిఖ్య ప్రపంచమే అంటూ వాటిని కొట్టి పారేయకుండా వాటికి తగిన ప్రాధాన్యతను ఇచ్చి .. వాటిని అడ్డుకోవాలి. లేకపోతే.. ఈ సమాజం అసమానతలనుండి సమానతలోకి కాకుండా మరో అసమానతకు పయనిస్తుందే కానీ ఎటువంటి లాభము ఉండదు అని గ్రహించాలి.

 22. పైన ఎవరో ఇంకొక Sri వచరు. అతను వెరు, నెను Sree ని వేరు. ప్లీజ్ ముందే చెప్తున్నా.

  వరకట్నానికి పురుషాధిక్యతకీ ముడిపెట్టలేం. పురుషాధిక్యత అంటే పురుషుడికి ఎక్కువ అధికారాలున్నమాట నిజం అయితే, పురుషునికి అందుకు తగ్గ బాధ్యతలూ ఎక్కువే ఉన్నమాట కూడా అంతే నిజం. మీకు కావాలంటే కొన్ని కుటుంబాలను గమనించండి, ఆయా కుటుంబాల్లో బాధ్యతలు కూడా మగవారికే ఎక్కువ ఉండటం మీరు సులువుగా గమనించవచ్చు.

  అంతే కాదు, నా అనుభవాల్లో కట్నం గురించి మగవారికంటే ఆడవారికే పట్టింపు ఎక్కువ. ఇది నేను స్వయంగా గమనించిన విషయం. కాబట్టి ఎక్కడో ఒక మగాడు కట్నం గురించి పెళ్ళాన్ని హింసించాడని (నిజానికి అందులోనూ అతని కుటుంబం లో ఆడవారి పాత్ర ఏమైనా ఉందో లేదో తెలీదు), వరకట్న దాహాన్ని మగాల్లకే అంటగట్టెయ్యడం దారుణం.

  పురుషాధిక్యత అంటే కేవలం మగాల్లు ఆడాల్లని తన్నటం, చంపెయ్యటం మాత్రమే అనుకుంటే అది మీ మూర్ఖత్వం. నిజానికి పురుషాధిక్యత అంటే పురుషునికి ఎక్కువ కుటుంబ బాధ్యతలు (ముఖ్యంగా ఆర్థిక విషయాల్లో), అలాగే కాస్త ఎక్కువ హక్కులు (ఉదాహరణకి కొన్ని కీలక విషయాల్లో భర్త నిర్ణయానికి ప్రాధాన్యత ఉండటం) పొందటం. ఆ సమతుల్యతను కాపాడుకుంటే కుటుంబం బావుంటుంది,లేకుంటే ఇలా మీడియాకు చిక్కుతుంది.

 23. ఒకవేళ స్త్రీ ఇష్టపడి కట్నం ఇచ్చినా అది పురుషాధిక్యతే అవుతుంది. లింగ వివక్ష అనేది లేకపోతే స్త్రీ తాను పురుషుని కోసం డబ్బుని అపాత్రదానం చెయ్యాలనుకోదు కదా.

 24. శ్రీ గారూ.
  పురుషులకున్న భావలే స్త్రీ లకూ వుంటాయి అదే పురుషాదిక్యత సమాజమంటె. పెట్టుబడి వర్గానికున్న భావాలే కార్మిక వర్గానికి వున్నాయికద. ఆనాటి పాలక వర్గ భావాలే పాలితుల భావాలన్నారు. కాబట్టి స్త్రీలు కట్నాలు అడిగారు కాబట్టి తప్పు ఒప్పు ఐపొదు స్త్రీ,రొండవ పెళ్ళి చెసుకుందంటె పురుషులే కాదు స్త్రీలు కుడా హర్షించరు. స్త్రీలు అంగీకరించారా, పురుషులంగీకరించారా అనేదానితొ సంభందం లేకుండా ఇద్దరికీ,వైరుద్యం లేకుండా ఎదిసరైనది అయితె దాన్నితీసుకొవలి. కుటుంభంలొ పురుషుడొక్కడే భాద్యత తీసుకొకుండా స్త్రీ కుడా ఆ భాద్యతల్లొ భాగస్తురాలైయ్యెటట్టు ప్రొహ్సహమివ్వాలి .అన్నిటిల్లొనూ ఇద్దరి భాగస్వామ్యం వుండేటట్టు చుడాలి.

 25. శ్రీకాంత్ గారు

  పితృస్వామ్య వ్యవస్ధలో స్త్రీలకు ఇవ్వబడిన ప్రత్యేక సదుపాయాలు అంటే మీ ఉద్దేశ్యంలో ఏమిటి? అలాంటి సదుపాయాలు పురుషులపై పెత్తనానికి, పురుషులపై వివక్షకూ దారితీస్తున్నాయా? అలాంటివి మీ పరిశీలనలో ఏమి ఉన్నాయో చెప్పండి. అలాంటివి ఉన్నట్లయితే ఖచ్చితంగా పరిగణించాల్సిందే.

  పురుషాధిక్య ప్రపంచం అన్న సాకు చూపి పురుషులపై స్త్రీలవైపు నుండి జరుగుతున్న అన్యాయాలని సమర్ధించడానికి వీల్లేదు. ఒక్కోసారి పురుషాధిక్యత అన్న అంశం లేకపోయినా కక్ష సాధించడానికో, పగ తీర్చుకోవడానికో మహిళా చట్టాలను దుర్వినియోగం చేస్తున్న సంఘటనలు లేకపోలేదు. వాటిని అరికట్టాల్సిన బాధ్యత కూడా చట్టాలను అమలు చేసేవారిపైన ఉంది. కొన్ని కేసుల్లో స్త్రీలకు అనుకూలంగా చట్టాలున్నాయి కనుక, స్త్రీలను ముందుంచడం ద్వారా కుటుంబ తగాదాలలో, ఆఫీసు తగాదాలలో పై చేయి సాధించడానికి కుట్రలు జరుగుతున్నాయి. వాటిని కూడా అరికట్టాల్సి ఉంది. పోలీసులు సమర్ధవంతంగా విచారణ చేసినట్లయితే అలాంటి కేసులని నిర్వీర్యం చేయవచ్చు.

  ఇక్కడ ఆర్టికల్ లో ప్రధానాంశం పురుషాధిక్యత వల్ల సంభవించిన ఒక సమస్య గురించి. కనుక ఆ కోణంలో విశ్లేషణ సాగింది. మహిళా చట్టాన్ని దుర్వినియోగం చేసి అమాయకుడైన పురుషుడిని బలి చేయడానికి ప్రయత్నించిన సంఘటన జరిగినపుడు దానికి గల కారణాలను ప్రస్తావించుకోవచ్చు. అలాంటి పరిస్ధితి ఎందుకు వచ్చిందన్నదానిపై విశ్లేషణ చేయవచ్చు. అలాంటి సందర్భంలో కూడా పురుషాధిక్య సమాజం అని చెబుతూ చట్టాల దుర్వినియోగాన్ని సమర్ధించడానికి పూనుకుంటె అది సరికాదు. మీరన్నట్లు పురుషులు రిసీవింగ్ ఎండ్ లో ఉన్న సంఘటనల్లో అన్యాయం జరుగుతున్నవైపే నిలబడవలసి ఉంటుంది.

  సమానత్వ ప్రపంచం ఇంకా రాలేదన్నదే అవగాహన. సమానత్వాన్ని అమలు చేయడనికి ప్రయత్నాలు జరగడం అంటే అప్పటికి అసమానత్వం ఉన్నట్లే కదా. అయితే అసమానత్వం ఏ స్ధాయిలో ఉందన్నదే సమస్య. అది ఉన్న స్ధాయిని బట్టి చట్టాల తీవ్రతను కూడా నిర్ణయించాల్సి ఉంటుంది. మీరన్నట్లు సమానత్వం గణనీయ స్ధాయిలో సిద్ధించినట్లయితే చట్టాల తీవ్రతను తగ్గించవలసి ఉంటుంది. అసమానత్వం ఏ స్దాయిలో ఉన్నదీ నిర్ణయించడానికి లేదా సమానత్వం ఎంతవరకు సిద్ధించిందీ తెలుసుకోవడానికి మళ్లీ అధ్యయనాలూ, పరిశోధనలే శరణ్యం.

  మీరు చివరి పేరాలో ప్రస్తావించిన అంశాలు చర్చించదగ్గవి. ప్రో-వుమెన్ నిర్ణయాలకూ, ప్రో-ఈక్వాలిటీ నిర్ణయాలకు మధ్య సమతూకం సాధించాలని మీ వ్యాఖ్యలో వ్యక్తం అవుతోంది. దాన్ని అధ్యయనం చేయవలసి ఉంది. అయితే ఒక చట్టం ప్రో-వుమెనా కాదా అన్నది నిర్ణయించడం కూడా ఒక సమస్య. ఆ నిర్ణయంలో మళ్లీ సమాజంలోని భౌతిక పరిస్ధితులను సరిగ్గా, కనీసం దగ్గరగా అంచనా వేయాల్సి ఉంటుంది. అధ్యయనకర్తలు లేదా పరిశోధకులు స్త్రీ పక్షపాతులుగా ఉండడం వల్ల అంతిమ నిర్ణయం స్త్రీలకి అనుకూలంగా ఉంటున్నదనీ, అది మారుతున్న సామాజిక పరిస్ధితులకి అద్దం పట్టడం లేదనీ మీరు సూచిస్తున్నారు. స్త్రీ పక్షపాతుల వల్ల పురుషులకు అన్యాయం జరుగుతుందన్న కోణాన్ని పరిశోధకులు పరిగణనలోకి తీసుకుంటె బహుశా మీరంటున్న లోపం నివారించబడవచ్చు. అయితే సాధారణంగా పరిశోధకులు, అధ్యయన కర్తలు ఆ అంశాలను తేలిగ్గా తీసేయడం జరగదు. అయినా మీ సూచన ఒక చర్చాంశం. కాని వైరుధ్యాలకు అదే కారణం అనడం సరికాదేమో.

 26. *అంబానీ భార్యనీ, వ్యవసాయ కార్మికురాలినీ *

  ప్రవీణ్ ఆమాట అన్నవాళ్లు ఇద్దరి ఆడవారిni పోల్చి చెప్పినప్పుడు తెచ్చిన పోలిక. ఇక అధికారం ఉందికదా అని మగపోలిస్ ఆడ మనిషిపై దురుసుగా ప్రవర్తిస్తున్నాడని రాసిన ఈ టపా, అదే కళ్లతో కారు యాక్సిడెంట్ ను ఎందుకు చూడలేకపోయింది. అధికారం, డబ్బులు ఎక్కువగా ఉన్న అమ్మాయి చంపితే ఎందుకు ప్రతిస్పందించలేదని అతనేవరో అడిగిఉన్నారు. నందా కుటుంబం లో అబ్బాయి కూడా రోడూ పైన నిదురించే పిల్లల పైకారుని పోనిస్తే మీడీయా ఎంత రచ్చ చేసిందో అందరికి తెలిసిన సంగతే కదా!
  _____________

  ఇక పురుషాదిక్యత నేనెక్కడా పెద్దగా చూడలేదు. మగవారు సంపాదించిన డబ్బులంతా భార్య చేతిలో పెట్టి( ఆడవారికిచ్చి )వారు చీర నగలు, వేలలో లక్షలలో పెట్టికొనుకుంటే వీడు నోరు తెరచి చూస్తుండటమే. వీడు తాగే వంద రుపాయల మందు బాటిల్ పైన ఎక్కడలేని దుష్ప్రచారం. మగవారికి ఒక్క విషయంలో భారత దేశంలో స్వేచ్చ ఉంది , అది ఎక్కడపడితే అక్కడ రోడ్డు పక్కన ఒకటికి పోవచ్చు 🙂

  శ్రీకాంత్ గారు ప్రతిసారి పి వి నరసిహ్మారావు గారిలా “లా” కోణంలో మగవారి హక్కుల గురించి ,వారి వాదన చెపుతున్నారు గాని అసలు విషయం చెప్పటంలేదు. అది ఎమీటంటే ఇంతవరకు జరిగింది వేరు, ఇక రానున్న రోజులలో జరగబోయేది వేరు. ఆమధ్య రంగనాయకమ్మ గారు కళ్లు తెరచిన సీత అని నవల రాసింది. బహుశా ఆమేకి తెలిసి ఉండకపోవచ్చు, రాముళ్లు కూడా కళ్లు తెరవటం మొదలు పెట్టారు. ఆడమగ మధ్య మిత్ర వైరుద్యం అని, దానిని వారు పరిష్కరించు కోంటారని, ఇక్కడ వాదనలో పాల్గొన్నవారు చెప్పినా. అది జరిగేపని కాదు. పెద్దలు మాటలు చెపితే వినేవారు ఈ తరంలోనే ఎవరు లేరు, వచ్చే తరం లో అసలికి ఉండరు. కలసి ఉండేవారి సంఖ్య అనేది అతి త్వరలో చదువులు, టెక్నాలజి పెరిగే కొద్ది పడిపోతుంది. కోర్టుల పై ముఖ్యంగా ప్రజలలో (మగవారి తల్లిదండృలకి ) ఇప్పటికే మంచి అవగాహన వచ్చింది. రానున్న తరం తమ వ్యక్తిగత జీవితాల లో కోర్టు కలిపించుకొనే వరకు తీసుకొని వేళ్లరు. ఆ అవకాశం కోర్ట్టుకి ఇవ్వరు.

 27. శ్రీకాంత్, మీరు చెబుతున్న అంశాలకు కొన్ని అధ్యయనాలు ఆధారాలుగా చెబుతున్నారు. అవి ఎవరు, ఏ దేశంలో చేసారు? మీరవి ఎక్కడ చదివారు. వివరాలు ఇచ్చినట్లయితే నాకు ఉపయోగపడతాయి.

  ఇంటర్నెట్ సౌలభ్యం సమకూరాక అద్యయన నివేదికలు చాలా వరకూ నెట్ లో లభ్యం అవుతున్నాయి. పాత నివేదికలని కూడా నెట్ లో పెడుతున్నారు. నేను చదివిన నివేదికలు ప్రధానంగా యు.ఎన్ కి అనుబంధంగా ఉన్న సంస్ధలు తయారు చేసినవి. వివిధ ఎన్.జి.ఓ లతో పాటు భారత ప్రభుత్వం తయారు చేసిన నివేదికలని కూడా కొన్ని సార్లు చదివాను. కొన్ని అచ్చు రూపంలో నా దగ్గర ఉన్నాయి. నెట్ లో ఉన్నట్లయితే వెతికి సందర్భానుసారంగా ఇవ్వడానికి ప్రయత్నిస్తాను.

  గృహ హింస జెండర్ స్పెసిఫిక్ కాదని ఏ అధ్యయనం చెప్పింది? వివరాలు ఇవ్వగలరా?

  పసి పిల్లలని ఎవరి కస్టడీలో ఉంచాలన్న విషయంలో పాశ్చాత్య దేశాల్లో కొన్ని చట్టాలున్నాయి. వాటివల్ల తండ్రులకి అసౌకర్యం కలగితే కలగవచ్చు. కాని ఆ చట్టాల ప్రధాన ఉద్దేశ్యం పిల్లలకి అసౌకర్యం కలగకూడదన్నదే. తల్లితనాన్ని అనుభవించాలని తల్లులకీ, తండ్రితనాన్ని అనుభవించాలని తండ్రులకీ ఉంటుంది. కాని సంతృప్తిపడవలసింది తల్లితనమో తండ్రితనమో కాదు. పసిపిల్లలకి ఒక వయసు వచ్చెవరకూ తల్లి అవసరం ఎక్కువగా ఉంటుంది. అది ప్రకృతిసిద్ధమైనది. ఆ విషయంలో స్త్రీ, పురుషులన్న తేడా చూడలేము. పిల్లలకి ఏది అవసరం అన్న విషయంపైనే సంరక్షణ చట్టాలు ఉంటాయి.

  స్త్రీలే కొన్ని విషయాల్లో ఎక్కువగా అన్యాయం చేస్తున్నారనీ, మీరు చెప్పిన ఆయుధాలు విసరడం ద్వారా అన్యాయం చేస్తున్నారనీ, పురుషులు చెప్పుకోలేకపోతున్నారనీ ఏ అధ్యయనం చెప్పింది? మీ దగ్గర ఆ అధ్యయనం వివరాలు ఉన్నాయా? వెంటనే లేకపోయినా అందుబాటులో ఉన్నపుడు ఇవ్వడానికి ప్రయత్నించగలరా? మరో విషయం. ఈ అంశాలలో స్త్రీ పక్షపాత చట్టాలు కారణంగ ఉన్నాయని అధ్యయనాలు తేల్చాయా? చట్టాల ద్వారా పురుషుల హక్కులు కాలరాస్తున్నారని తెలిపిన అధ్యనం ఏమిటో చెప్పండి. ఇవన్నీ ఒకే అధ్యయనంలో ఉన్నాయా లేక వివిధ అధ్యయనాలా? ఎన్నయినా ఆ వివరాలు ఇవ్వగలరు.

 28. డబ్బున్న స్త్రీ తన ఇంటిలో దొంగతనం జరిగినప్పుడు పని మనిషిని అనుమానించి అది కేవలం డబ్బుంది అనే అహంకారంతో ఆ పని చేసినట్టు. ఒక మగ పోలీస్ ఆడదాని చీర లాగితే తాను మగవాణ్ణి అనే అహంకారంతో ఆ పని చేసినట్టు. ఇక్కడ ఆ వైరుధ్యం కనిపించదా? ఇద్దరు ఆడవాళ్ళ మధ్య గొడవ జరిగితే ఒంటి మీద చేతులు వేసి అసహ్యంగా స్పర్శించడం లేదా చీర లాగడం లాంటివి జరగవు. మగవాళ్ళు మాత్రమే ఆ పనులు చేస్తున్నారంటే అది పురుషాహంకారమే కదా.

 29. *అది పురుషాహంకారమే కదా.

  ఆడవారికి అందానికి ఉన్న సంబందం ఎటువంటిదో, మగవారికి అహంకారానికి ఉన్న సంబంధం అంత సహజమైనది. దాని గురించి తెలియని వారు, మీలా మాట్లాడుతుంటారు. నీకు పెళ్లి కాలేదు కనుక పురుష అహంకారం గురించి అవగాహనలేదని తెలుస్తున్నాది. మగవారేవ్వరు తమకు పురుషహంకారముందని అనుకోరు. మహిళా రచయిత్రులకే అది కనిపిస్తుంది 🙂 నువ్వు కావాలంటే ఏ మగవాడి దగ్గర కైనా వేళ్లి నీకు ఇంత పురుష అహంకారం ఉందేమిటి? అను, వాడికి అర్థం కూడ కాదు. ఎవరైనా స్రీ వాద సాహిత్యం చదివిన వారికి తప్ప మిగతావారికి వెంటనే వెలగదు.

 30. అలా అని చెప్పి పైన పోలిస్ చేసిన దానిని సమర్ధించటం కాదని గుర్తుంచుకో! ఆ పోటొ ను చూసి ఎవరికి వారు ఎన్నైనా ఊహించు కోవచ్చు. వాస్తవం వేరే విధంగా ఉండవచ్చు.

 31. అందం మగవాళ్ళకి కూడా ఉంటుంది. మగవాడు అందంగా ఉన్నాడు కదా అని ఆడది మగవాణ్ణి రేప్ చెయ్యడమో, అతని ఒంటి మీద అసహ్యంగా చేతులు వెయ్యడమో జరగదు. ఎందుకంటే శీలం, పరువుమర్యాదలు ఆడవాళ్ళకే ఎక్కువ అవసరం అనే పురుషాధిక్య భావజాలం ఉంది కాబట్టి. అంతే కానీ అందం ఆడదానికి మాత్రమే ఉండడం, మగవానికి ఉండకపోవడం జరగదు. శీలం విషయంలో అలాంటి సంకుచిత భావజాలం ఉన్నంత వరకు స్త్రీలని భయపెట్టడానికి స్త్రీ ఒంటి మీద అసహ్యంగా చేతులు వేసే మగవాళ్ళు ఉంటారు.

 32. విషేఖర్ గారూ,

  మీరు అడిగిన వాటన్నింటికీ నా దగ్గర సమాధానాలున్నాయి. కాకపోతే ప్రస్తుతం నేను కాస్త బిజీగా ఉన్నాను. వీలు చూసుకుని అన్నింటికీ సమాధాణాలిస్తాను. ప్రస్తుతానికి గృహహింస జెండర్ స్పెసిఫిక్ కాదు అనేదానికి సంబందించి రెండు లింకులు ఇస్తున్నాను. నేను ఇది వరకూ గృహహింస పైన ఆర్టికలు రాసినప్పుడు రిఫర్ చేసిన ఆర్టికల్సు, లింకులు ప్రస్తుతం నా దగ్గర లేవు. అవి దొరకగానే ఇస్తాను.

  REFERENCES EXAMINING ASSAULTS BY WOMEN ON THEIR SPOUSES OR MALE PARTNERS:
  AN ANNOTATED BIBLIOGRAPHY

  BIASED VAWA DISCRIMINATES AGAINST MEN

 33. శ్రీకాంత్, ఆడవాళ్ళు మగ సెక్స్ పార్ట్‌నర్‌లని వేధించిన సందర్భాలు ఉన్నాయి. దాన్నెవరూ కాదనలేదు. https://plus.google.com/111113261980146074416/posts/NhCHGipBfSb కానీ పురుషాధిక్య సమాజంలో అటువంటి ఘటనలు తక్కువగానే జరుగుతాయి.

 34. *ఆడది మగవాణ్ణి రేప్ చెయ్యడమో, అతని ఒంటి మీద అసహ్యంగా చేతులు వెయ్యడమో జరగదు*
  చిన్నపుడు నా మితృడు వాళ్ల నాన్నగారు పోలిస్ శాఖలో పనిచేసేవారు. నా మిత్రుడు కొన్ని కాలేజి హాస్టల్స్ పక్కన మగవారి శవం దొరికిందని, దానికి కారణం చెపితే నోరేళ్ల బెట్టాను. నువ్వు అన్ని నేకే …. అటువంటి సంఘటన లాంటిదానిని గురించి క్రింద లింక్ లో చదివితే ఆశ్చర్య పోలేదు. నువ్వు ఊరికినే తగుదునమ్మా అని తలదూరిస్తే సమాధానాలు ఇవ్వటం జరిగేపని కాదు.
  ఎంతో సాంప్రదాయ బద్దంగా కనిపించే చేన్నై బస్ లోనే చేయివేసింది.
  http://articles.timesofindia.indiatimes.com/2009-02-03/pakistan/28034945_1_police-constable-khalil-car

 35. ఆడవాళ్ళు మగవాళ్ళని రేప్ చేసిన ఘటనలు ఎక్కడో ఒకటో రెండో మాత్రమే జరుగుతాయి. అందుకే ఆడది మగవాణ్ణి రేప్ చెయ్యగలదు అని చెపితే చాలా మంది నమ్మరు, శరీరం మీద అసహ్యంగా చేతులు వేసి స్పర్శించగలదు అని చెప్పినా కొంత మంది నమ్మరు. పురుషాధిక్య సమాజంలో మగ పోలీసులు మహిళల పట్ల అసభ్యంగా ప్రవర్తించడం అసహజం కాదు. అదేదో పురుషాధిక్యతకి సంబంధం లేని విషయం అని వ్రాస్తే నేను సమాధానం చెప్పాను. మగ పోలీసులు మహిళల పట్ల అసభ్యంగా ప్రవర్తించడానికి పురుషాధిక్యతతో సంబంధం లేదని వాదిస్తే ఆ మాట పురుషాధిక్యవాదులు కూడా నమ్మరు.

 36. ఆడవాళ్ళు మగవాళ్ళని వేధించడం లాంటి అరుదుగా జరిగే విషయాలకి అనవసర ప్రాధాన్యత ఇస్తే ఈ బ్లాగ్‌కీ, మసాలా వార్తల పత్రికలకీ తేడా ఏమీ ఉండదు. అందుకే విశేఖర్ గారు వాటి గురించి వ్రాయలేదు. ఈ విషయంలో విశేఖర్ గారిపై విమర్శలు అనవసరం.

 37. ఇంతక్రితం మీరు విదేశాల కి వేళ్లిన మగవారు భార్యల ను వేధిస్తున్నారని రాశారు. విదేశాలలో ఉన్న మగవారిని భార్యలు కూడా అక్కడి చట్టాలను తెలుసుకొని భర్తలను చాలా వేధింపులకు గురిచేస్తారు. మనదేశం నుంచి వెళ్లిన వారు భార్యా భర్తలు గా కాపురం చేస్తున్నా పేరుకి మాత్రం కలసిఉంట్టు, మగవారు ఆనందంలేని నిస్సార మైన జీవితాలు గడిపేవారున్నారని తెలుసు. ఇక ఈ క్రింది సంఘటన చదవండి, ఆవలి పక్షం వారేమి తక్కువ తినలేదు అని చెప్పటానికి ఈ ఉదాహరణ చాలనుకొంటాను.
  Indian-origin woman burns hubby in US

  WASHINGTON, An Indian-origin woman in the US set her husband on fire and locked him in a bathroom, after promising him a hot oil massage, police said.

  Shriya Biman Patel,25, has been arrested on charges of first-degree felony aggravated assault and arson and booked into the Travis County Jail in Austin, Texas.

  http://articles.timesofindia.indiatimes.com/2012-04-21/us-canada-news/31378801_1_indian-origin-woman-burns-assault-and-arson

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

గూగుల్ చిత్రం

You are commenting using your Google account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

Connecting to %s