కాబూల్ లో పశ్చిమ దేశాల ఎంబసీలపై తాలిబాన్ బహుముఖ దాడులు


Kabul attack 15.04.2012పశ్చిమ దేశాల దురాక్రమణ లో ఉన్న ఆఫ్ఘనిస్ధాన్ లో తాలిబాన్ ఆదివారం మరోసారి విరుచుకుపడింది. రాజధాని కాబూల్ లో దుర్భేద్యంగా భావించే సెంట్రల్ డిస్ట్రిక్ట్ ప్రాంతంపై బహుముఖ దాడులకి దిగింది. పశ్చిమ కాబూల్ లోని పార్లమెంటు భవనం వద్ద పెద్ద ఎత్తున పేలుళ్ళు వినబడుతున్నాయనీ, జర్మనీ, బ్రిటన్, నాటో లకు చెందిన ఎంబసీలపై అనేక వైపుల నుండి మిలిటెంట్లు కాల్పులు సాగిస్తున్నారనీ, రాకెట్లు ప్రయోగిస్తున్నారనీ బి.బి.సి తెలిపింది. దాడులకు తామే బాధ్యులమని తాలిబాన్ ప్రతినిధి తెలిపాడని ఆ సంస్ధ తెలిపింది. జర్మనీ, బ్రిటన్, నాటో ఎంబసీ కార్యాలయాలే తమ టార్గెట్ లని తాలిబాన్ చెప్పినట్లు రాయిటర్స్ తెలిపింది. దాడులు కొనసాగుతున్నాయనీ పూర్తి వివరాలు తెలియవలసి ఉందనీ వివిధ వార్తా సంస్ధలు తెలిపాయి.

అనేక అంతర్జాతీయ ఎంబసీలు ఉన్న సెంట్రల్ డిస్ట్రిక్ట్ లో పేలుళ్ళు, కాల్పులు కొనసాగుతున్నాయని బి.బి.సి తెలిపింది. పార్లమెంటు భవనం వద్ద కనీసం ఆరుగురు మిలిటెంట్లతో భద్రతా బలగాలు పోరాడుతున్నాయని తెలుస్తోంది. డిప్లొమేటిక్ జోన్ గా భావించే సెంట్రల్ కాబూల్ లో అతి పెద్ద పేలుళ్ళు కనీసం ఏడు సంభవించాయనీ, ఎంబసీల నుండి సైరన్ లు మోగుతున్నాయనీ సిబ్బందిని సురక్షిత ప్రాంతాలకు ఎంబసీలు తరలిస్తున్నాయనీ బి.బి.సి తెలిపింది. పార్లమెంటు ముట్టడిలో ఉందని ఆఫ్ఘన్ పోలీసులు తెలిపారు.

పార్లమెంటు పైనా, రష్యా ఎంబసీ పైనా రాకెట్లు వచ్చిపడుతున్నాయని పార్లమెంటు ప్రతినిధి ఒకరు రాయిటర్స్ కి తెలిపాడు. జర్మనీ ఎంబసీ నుండి దట్టంగా పొగ వెలువడుతోంది. బ్రిటిష్ ఎంబసీ పై కూడా తీవ్ర స్ధాయిలో దాడి జరుగుతోంది. కాబూల్ లో కొత్తగా నిర్మించిన స్టార్ హోటల్ మంటల్లో చిక్కుకుని ఉందని ఏ.ఎఫ్.పి వార్తా సంస్ధ తెలిపింది. అమెరికా ఎంబసీ నుండి హెచ్చరిక సైరన్లు మోగుతున్నాయని ఆ సంస్ధ తెలిపింది. కాబూల్ లోని అనేక ఇతర ప్రాంతాలలో సైతం కాల్పులు జరుగుతున్న వార్తలు వెలువడుతున్నాయి. తూర్పు ఆఫ్ఘనిస్ధాన్ లోని జలాలాబాద్ లో ఆత్మాహుతి దాడి జరిగిందనీ, దాడి వల్ల నగర కేంద్రాన్ని మూసివేశారనీ బి.బి.సి విలేఖరి తెలిపాడు.

ఆత్మాహుతి బాంబర్లు నాటో కేంద్ర కార్యాలయాన్నీ, పార్లమెంటునూ, రాయబార గృహ సముదాయాలనూ టార్గెట్ చేసుకున్నారని తాలిబాన్ చెప్పిందని డెయిలీ మెయిల్ తెలిపింది. తాలిబాన్ ప్రతినిధి జబీయుల్లా ముజాహిద్ ను డెయిలీ మెయిల్ ఉటంకించింది. అనేక ఎంబసీలకు, నాటో స్ధావరానికీ నివాసమైన ‘వజీర్ అక్బర్ ఖాన్ నైబర్ హుడ్’ వద్ద మొదటి పేలుడు సంభవించిందని ఆ పత్రిక తెలిపింది. మొత్తంగా పదికి పైగా పేలుళ్లు జరిగాయని ఆ పత్రిక తెలిపింది. పేలుళ్ళ తర్వాత భారీ స్ధాయిలో కాల్పులు జరుగుతున్నాయని తెలిపింది. ఒక ఎత్తైన భవనంలో ఉన్న మిలిటెంట్లు అన్ని వైపులకూ రాకెట్లు పేలుస్తున్నారని తెలిపింది. కాబూల్ శివార్లలోని టర్కీ మిలట్రీ స్ధావరంపైన మోర్టార్ దాడి జరుగుతున్నదని తెలిపింది.

తాలిబాన్ సాధారణంగా వేసవిలో దాడులను తీవ్రం చేస్తుంది. అయితే ఆఫ్ఘనిస్ధాన్ లో పరిస్ధితి అదుపులోకి వచ్చిందని చెబుతున్న అమెరికా , నాటో ల ప్రకటనలను తాలిబాన్ దాడులు ఎప్పటికప్పుడు పూర్వ పక్షం చేస్తున్నాయి. 2014 లోపు పూర్తిగా సైనికులను ఉపసంహరించుకుంటానని అమెరికా, నాటోలు చెబుతున్నప్పటికీ ఆ తర్వాత కూడా సైనికులను సూదీర్ఘ కాలం కొనసాగించడానికి ఆఫ్ఘన్ ప్రభుత్వంతో అవి చర్చలు జరుపుతున్నాయి. ‘వ్యూహాత్మక రక్షణ ఒప్పందం’ పేరుతో ఆ చర్చలు జరుగుతున్నాయి. గత నెలలోనే ఒప్పందం కుదరవలసి ఉన్నప్పటికీ అమెరికా సైనికులు రెండు గ్రామాల్లో జొరబడి ఆఫ్ఘన్ పౌరులను ఊచకోత కోయడంతో ఒప్పందం ఆలస్యం అవుతోంది. ఆఫ్ఘన్ పౌరులపై సాగిన ఊచకోతను అడ్డు పెట్టుకుని మరింత లబ్ది పొందడానికి కర్జాయ్ ప్రభుత్వం బేరసారాలు సాగిస్తున్నదని ఆరోపణలు వస్తున్నాయి.

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

Connecting to %s