తీస్తా సెతల్వాద్ పై తప్పుడు కేసు ఆపండి, మోడీ ప్రభుత్వంతో సుప్రీం


Tista Setalvadగుజరాత్ ముఖ్యమంత్రి నరేంద్ర మోడి ఆధ్వర్యంలో ముస్లిం లపై జరిపిన అమానుష ‘హత్యాకాండ’ లో దోషులకి శిక్ష పడడానికి అలుపెరుగని పోరాటం నిర్వహిస్తున్న తీస్తా సేతల్వాద్ పై మోడీ ప్రభుత్వం పెట్టిన కేసు ‘తప్పుడు కేసు’ అనీ, ‘మానవ హక్కులను’ తీవ్రంగా ఉల్లంఘిస్తున్నదనీ సుప్రీం కోర్టు మరో సారి తేల్చి చెప్పింది. ఆమె పై పెట్టిన ‘తప్పుడు కేసు’ లో జరుపుతున్న పరిశోధనను ఆపేయాలని గుజరాత్ రాష్ట్ర ప్రభుత్వ అటార్నీని కోరింది. అయితే ఇప్పటికే కేసులో చార్జి షీటు నమోదు చేశామనీ, నేరం గుర్తించామనీ గుజరాత్ అటార్నీ సుప్రీం కోర్టు బెంచికి తెలియజేశాడు.

“ఈ కేసులో ఎఫ్.ఐ.ఆర్ ని మీరు చదివే ఉంటారు. అసలా ఎఫ్.ఐ.ఆరే ‘మానవ హక్కులని’ ఉల్లంఘించేదిగా ఉంది” అని జస్టిస్ ఆఫ్తాబ్ ఆలం, జస్టిస్ రంజన ప్రకాష్ లతో కూడిన బెంచి గుజరాత్ ప్రభుత్వ లాయర్ రవి శంకర్ ప్రసాద్ ని కోరింది. కానీ “నేరాన్ని గుర్తించాం” అని సీనియర్ అడ్వకేట్ రవి శంకర్ ప్రసాద్ బెంచికి తెలియజేయడంతో కేసు హియరింగ్ కొనసాగించడానికి బెంచి అంగీకరించింది.

“ఎఫ్.ఐ.ఆర్ నమోదు అయిన పద్ధతి పట్లా, అందులో ఉన్న ఆరోపణల పట్లా మేము తీవ్రంగా అసంతృప్తి చెందాము. ఎఫ్.ఐ.ఆర్ మానవ హక్కులను ఉల్లంఘించేదిగా ఉంది.” అని సుప్రీం కోర్టు బెంచి వ్యాఖ్యానించింది. గత సంవత్సరం మే 17 తేదీన గుజరాత్ హై కోర్టు జారీ చేసిన ఆదేశానికి వ్యతిరేకంగా తీస్తా సేతల్వాద్ సుప్రీం కోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. తీస్తా సేతల్వాద్ పై నమోదయిన ఎఫ్.ఐ.ఆర్ ను రద్దు చేయడానికి గుజరాత్ హై కోర్టు తిరస్కరిస్తూ ఆదేశాలు జారీ చేసింది.

నది ఒడ్డున పూడ్చి పెట్టిన శవాలను తవ్వి తీసిందంటూ తీస్తా పైన మోడీ ప్రభుత్వం పంచ మహల్ పోలీసు స్టేషన్ లో ఎఫ్.ఐ.ఆర్ నమోదు చేయించింది. 2002 లో గుజరాత్ హత్యాకాండలో బలయిన వారిలో గుర్తు తెలియని 28 మంది శవాలను ఖాన్ పూర్ తాలూకాలోని పందర్వాడా గ్రామంతో పాటు వివిధ గ్రామాల్లో గుట్టు చప్పుడు కాకుండా పూడ్చిపెట్టారని ఆరోపణలు వచ్చాయి. అలాంటి సమాధులను తవ్వి తీసారంటూ తీస్తాతో పాటు మరి కొందరిపైన గుజరాత్ రాష్ట్ర ప్రభుత్వం కేసులు నమోదు చేసింది. ఇతర నిందితులు తాము అమాయకులమనీ తీస్తా యే ఒత్తిడి చేసి తమ చేత ఆ పని చేయించిందనీ చెప్పారని ప్రభుత్వం కధలు అల్లింది.

గుజరాత్ ప్రభుత్వం సుప్రీం కోర్టుకి ఒక అఫిడవిట్ సమర్పించింది. ప్రారంభంలో తీస్తా నిందితురాలు కాదని అందులో పేర్కొన్నది. తమ జరిపిన పరిశోధనలో తీస్తా సేతల్వాద్ స్వయంగా సమాధులు తవ్విన కేసులో కుట్రదారుగా తేలిందని గుజరాత్ ప్రభుత్వం అఫిడవిట్ లో పేర్కొంది. తీస్తా ప్రధాన నిందితురాలనీ, స్వయంగా పధక రచన చేసి 2006లో అనుమతి లేకుండా సమాధులు తవ్విందనీ పేర్కొంది. గుజరాత్ హై కోర్టు తీస్తా పై నమోదయిన ఎఫ్.ఐ.ఆర్ ను రద్దు చేయడానికి నిరాకరిస్తూనే, తీస్తాకి వ్యతిరేకంగా పోలీసులు జారీ చేసిన సమన్లు రద్దు చేసింది. కింది కోర్టులో ‘ముందస్తు బెయిల్’ తీసుకున్న తీస్తా ను ‘తప్పించుకు తిరుగుతున్న నేరస్ధురాలు’ గా పేర్కొనడం ద్వారా పరిశోధనాధికారి ‘తీవ్ర తప్పిదానికి’ పాల్పడ్డాడని మే 27, 2011 ఆదేశాల్లో వ్యాఖ్యానించింది.

తీస్తా సేతల్వాద్ పై నమోదు చేసిన ఎఫ్.ఐ.ఆర్ లో ఇతర నిందితులంతా ముస్లింలే. వారి పేర్లు: రాయిస్ ఖాన్ పఠాన్, గులాం ఖరాది, సికందర్ అబ్బాస్, కుతుబ్ షా దివాన్, జబీర్ మహమ్మద్.

హత్యాకాండ జరపడమే కాకుండా దానికి సాక్ష్యాలు లేకుండా చేయడానికి గుజరాత్ ప్రభుత్వం అనేక అక్రమాలకు పాల్పడింది. కేసులు నమోదు చేయడానికి వచ్చిన వారిని భయపెట్టి బెదిరించింది. అనేక కేసులను నమోదు దశలోనే తిరస్కరించింది. ధైర్యం చేసి నమోదు చేయడానికి వచ్చినవారిపైన ఎదురు కేసులు పెట్టి వేధించింది. బాధితులకు అండగా నిలిచినవారి పైన కూడా తప్పుడు కేసులు పెట్టించింది. చివరికి జస్టిస్ కృష్ణయ్యర్ నిర్వహించిన పీపుల్స్ ట్రిబ్యూనల్ లో సాక్ష్యం చెప్పిన గుజరాత్ మంత్రి హరేన్ పాండ్యాను కూడా దారుణంగా హత్య చేయించింది.  ఆ విధంగా బాధితులకు అండగా నిలిచి నర హంతక మోడీ ప్రభుత్వం పైన అలుపెరుగని పోరాటం చేస్తున్న వారిలో తీస్తా సేతల్వాద్ ప్రముఖురాలు. ఆమె పైన తాము జరిపిన హత్యాకాండ కేసులు కూడా గుజరాత్ ప్రభుత్వం నమోదు చేసి వేధిస్తోంది.

“ఈ రోజు మిమ్మల్ని (గుజరాత్ రాష్ట్రాన్ని) ఈ కేసులో పరిశోధనని ఆపేయాలని కోరుతున్నాం” అని గుజరాత్ ప్రభుత్వ లాయర్ తో చెప్పింది. “ఇది తప్పుడు కేసు” అని పేర్కొంది. దురుద్దేశంతో పెట్టిన కేసు అని వ్యాఖ్యానించింది.  నేరాన్ని గుర్తించామని చెప్పడంతో కేసు తదుపరి విచారణకు అంగీకరించింది. కేసులో ఇప్పటికి ఉన్న స్ధితి కొనసాగుతుంది అని తెలిపింది. జులై 18 కి వాయిదా వేసింది.

గత వాయిదాలో కూడా సుప్రీం కోర్టు దాదాపు ఇదే విధంగా వ్యాఖ్యానించింది. తీస్తా సేతల్వాద్ పై నమోదు చేసిన కేసు కపటం తో కూడుకున్నదని వ్యాఖ్యానించింది. సేతల్వాద్ ను బాధితురాలుగా చేయాడానికి ఉద్దేశించినదనీ, ఇలాంటి కేసు గుజరాత్ రాష్ట్రానికి ఏ విధంగానూ ‘క్రెడిట్’ కాదనీ వ్యాఖ్యానించింది.

ముస్లింలపై సాగించిన దారుణ నరమేధాన్ని కప్పి పుచ్చుకోవడానికి నరేంద్ర మోడి అనేక అక్రమాలకు పాల్పడుతున్నదని చెప్పడానికి తీస్తా సేతల్వాద్ పై నమోదు చేసిన అక్రమ కేసు ప్రబల ఉదాహరణ. పేద ముస్లింలను భయపెట్టి, బెదిరించి, దొంగ కేసులతో వేధించి నోరు మూయించడంలో సఫలమైన నరేంద్ర మోడీ తీస్తా సేతల్వాద్ నోరు మూయించడంలో విఫలం అయ్యాడు. దాని ఫలితమే ఆమెపై నమోదయిన తప్పుడు కేసులు.

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

Connecting to %s