సిరియాలో కాల్పుల విరమణ ప్రారంభం అయిందని బీబీసి తెలిపింది. సిరియా ప్రభుత్వం తన సైన్యాన్ని ఉద్రిక్త నగరాలనుండి ఉపసంహరించుకున్నదని తెలుస్తోంది. ఐక్యరాజ్య సమితి మాజీ సెక్రటరీ జనరల్ కోఫీ అన్నన్ మధ్యవర్తిత్వంతో కుదిరిన ఒప్పందం మేరకు సిరియా సైనికులు కాల్పుల విరమణను పాటిస్తున్నాయి. టెర్రరిస్టులు ప్రజలపైనా, ప్రజల ప్రభుత్వ ఆస్తులపైనా దాడులు దాడులు ప్రారంభించినట్లయితే తగిన విధంగా బదులు చెప్పకుండా ఉండబోమని సిరియా ప్రభుత్వం హెచ్చరించింది. మరోవైపు సిరియాలో ఇక ప్రజలు ఉవ్వెత్తున ఆందోళనలు చేపట్టాలని ప్రవాస సిరియా కమేండర్లు పిలుపునిచ్చారని బీబీసి తెలిపింది. సిరియా ప్రజల్లో ఏ మాత్రం పలుకుబడి లేని వారి పిలుపుకి ప్రజలు స్పందించడం అనుమానమే.
విదేశీ కిరాయి సైనికుల సాయంతో ప్రవాస సిరియన్లు ప్రారంభించిన అమానుష హత్యాకాండను ‘ప్రజాస్వామిక తిరుగుబాటు’ గా పశ్చిమ దేశాలు ప్రచారం చేస్తూ వచ్చాయి. దేశ ద్రోహులు సాయంతో టెర్రరిస్టులు ప్రారంభించిన యుద్ధానికి తాము ప్రతిస్పందించామని సిరియా ప్రభుత్వం చెబుతూ వచ్చింది. ఫ్రాన్సు కి చెందిన రహస్య బలగాలు వంద మందికి పైగా పట్టుబడడం, సిరియా ప్రజలనుండి మద్దతు లేకపోవడంతో ‘కిరాయి తిరుగుబాటు’ ను కొనసాగించడం పశ్చిమ దేశాలకు సాధ్యం కాలేదు. ఈ సంవత్సరం ఫ్రాన్సు, అమెరికాలలో అధ్యక్ష ఎన్నికలు జరగనున్నాయి. సిరియా కిరాయి తిరుగుబాటు తమకు అప్రతిష్టాకరంగా మారడంతో అమెరికా అధ్యక్షుడు ఒబామా, ఫ్రాన్సు అధ్యక్షుడు నికోలస్ సర్కోజీ లు తాత్కాలికంగా వెనక్కి తగ్గడానీకే నిర్ణయించుకున్నారు.
సిరియా విదేశీ మంత్రిత్వ శాఖ నుండి అన్నీ రకాల మిలట్రీ ఆపరేషన్లు ఆపి వేస్తున్నట్లుగా తనకు లిఖిత హామీ అందిందని బుధవారం కోఫీ అన్నన్ ప్రకటించాడు. అయితే తిరుగుబాటుదారులుగా చెప్పుకుంటున్న సాయుధ ముఠాల నుండి కాల్పుల విరమణ పాటిస్తున్నట్లు లిఖిత హామీ అందినట్లు కోఫీ అన్నన్ చెప్పలేదు. కిరాయి తిరుగుబాటుకి ప్రాతినిధ్యం వహిస్తున్న ‘ఫ్రీ సిరియన్ ఆర్మీ’ అధిపతి ‘రియాధ్ ఆల్-అస్సాద్’ తమ హామీని అంతర్జాతీయ కమ్యూనిటీకి ఇస్తాము తప్ప సిరియా పాలకులకు కాదని ప్రకటించినట్లుగా ప్రెస్ టి.వి తెలిపింది. ఆయన చెప్పిన ‘అంతర్జాతీయ కమ్యూనిటీ’ ఎవరన్నదీ తెలియలేదు.
కిరాయి తిరుగుబాటు వల్ల సిరియా ప్రభుత్వం చెక్కుచెదరకపోవడం, తిరుగుబాటు నాయకులుగా చెప్పుకుంటున్నవారికి ప్రజల్లో మద్దతు లేకపోవడం, తమ తమ దేశాల్లో ఎన్నికలు ఎదుర్కొంటుండడం కారణాల వల్ల పశ్చిమదేశాలు కోఫీ అన్నన్ మధ్యవర్తిత్వానికి అంగీకరించాయి. కాల్పుల విరమణ ప్రారంభం అయినంత మాత్రాన సిరియాలో వారి కుట్రలు ఆగిపోతాయన్న గ్యారంటీ లేదు. పశ్చిమాసియాలో తమకు ఎదురు తిరుగుతున్న సిరియా, ఇరాన్ ప్రభుత్వాలను కూల్చివేయాలన్న వారి లక్ష్యం నెరవేర లేదు గనక వారి కుట్రలు కొనసాగుతాయి. అమెరికా, ఫ్రాన్సు ఎన్నికలు ముగిసేవరకూ చురుకైన చర్యలు వారి నుండి లేకపోవచ్చు. వారి ప్రపంచాధిపత్య కుట్రలకు ఇది తాత్కాలిక విరామం మాత్రమే.