సాపేక్షికంగా చూస్తే చైనా ఇప్పుడు ప్రపంచంలో ప్రధానమైన ఆర్ధిక శక్తి. జిడిపి లో అమెరికా తర్వాత స్ధానం చైనాదే. చాలా తక్కువ కాలంలో అది ఈ స్ధానం చేరుకుంది. చైనాకు విదేశాలతో ఉన్న సంబంధాలు ప్రధానంగా వ్యాపారానికి సంబంధించినవే. చైనా విదేశాంగ విధానం ప్రో యాక్టివ్ కాదు. మిలట్రీ చర్యలు తీసుకునైనా వాణిజ్య సంబంధాలు కాపాడుకునే విదేశాంగ విధానం చైనా రూపొందించుకోలేదు. కాని అమెరికా అలా కాదు. దాని విదేశాంగ విధానం పూర్తిగా జోక్యం దారీ విధానమే. ప్రపంచం నిండా దానికి వందల కొద్దీ సైనిక స్ధావరాలు ఉన్నాయి. ప్రతి దేశంలోనూ అది వేలు పెడుతుంది. నచ్చని ప్రభుత్వాలు కూల్చడానికి కుట్రలు చేస్తుంది. ప్రజాస్వామ్యం పేరు చెప్పి నియంతలను నిలబెడుతుంది. నియంతృత్వం అని చెప్పి ప్రజాస్వామిక ప్రభుత్వాలను కూల్చి వేస్తుంది. ఆర్ధికంగా తనకు దీటుగా ఎదిగిన చైనాను నిలవరించడానికి అది అన్ని ప్రయత్నాలూ చేస్తోంది. చైనా చుట్టూ యుద్ధ నౌకల్ని మొహరించింది. సిరియా, ఇరాన్ లలో జోక్యం వెనుక చైనా ఆర్ధిక ప్రయోజనాలని దెబ్బతీసే కుట్ర కూడా అమెరికాకి ఉంది. ఆఫ్రికా సహజ వనరుల్లో బిలియన్ల కొద్దీ పెట్టుబడులు పెడుతున్న చైనా ఆర్దిక ఆధిపత్యాన్ని నిలవరించడానికి అమెరికా అనేక కుట్రలు చేస్తోంది. సైనికంగా చూస్తే అమెరికా నేరుగా చైనా పెరటి దొడ్డిలోనే తిష్ట వేసింది.
–
–