ఇండోనేషియా Aceh ప్రాంతానికి సమీపంలో భారీ భూకంపం సంభవించింది. రిక్టర్ స్కేల్ పై 8.7 గా నమోదయిన ఈ భాకంపం ప్రపంచంలో ఇప్పటివరకూ సంభవించిన భారీ భూకంపాల్లో ఒకటిగా చానెళ్లు పేర్కొంటున్నాయి. హిందూ మహా సముద్ర వ్యాపితంగా సునామీ హెచ్చరిక జారీ చేసినట్లు రాయిటర్స్ వార్తా సంస్ద తెలిపింది. పూర్తి వివరాలు ఇంకా ఏ వార్తా సంస్ధ ప్రకటించలేదు. ‘ఎర్త్ క్వేక్ రిపోర్ట్’ వెబ్ సైట్ అందించిన శాటిలైట్ పటాన్ని కింది చిత్రంలో చూడవచ్చు. మొదట భూకంప తీవ్రత 8.9 గా ప్రకటించినప్పటికీ, ఆ తర్వాత 8.7 కి తగ్గించారు.
ఆంధ్ర ప్రదేశ్ లో వైజాగ్, తమిళనాడు లోని చెన్నై నగరాల మధ్య అనేక పట్టణాలను ఈ భూకంపం తీవ్రత తాకిందని తెలుగు వార్తా ఛానెళ్ళు చెబుతున్నాయి. ప్రజలు ఇళ్లల్లోకి బయటికి పరుగులు తీసినట్లు తెలుస్తోంది. వైజాగ్, కాకినాడ, అనకాపల్లి, చెన్నై నగరాల్లో భూమి కంపించినట్లు తెలుస్తోంది.
అప్ డేట్
ఇండొనేషియా కోస్తా నగరం ‘బాండా ఏక్’ కి 431 కి.మీ దూరంలో సముద్ర గర్భంలో భూకంపం కేంద్రీకృతమై ఉందని ది హిందూ తెలిపింది. 2004 లో 9.1 తీవ్రతతో వచ్చిన భూకంపానికి కూడా దాదాపు ఇదే చోటు కేంద్రమని తెలుస్తొంది. అప్పటి భూకంపం వల్ల పెద్ద ఎత్తున సునామీ అలలు విరుచుకు పడి అనేక దేశాల్లొ 220,000 మందికి పైగా చనిపోయారు. ఒక్క ఇండొనేషియా ఏక్ లోనే 170,000 మంది చనిపోయారు. భారత దేశంలో సైతం వేలాదిమంది చనిపోయారు. శ్రీలంకలో 30,000 మంది చనిపోయారు.
తాజా భూకంపం కూడా దాదాపు అదే తీవ్రతతో సంభవించడంతో సునామీ హెచ్చరికలు జారీ చేశారు. 2004 నాటి స్ధాయిలో అతి పెద్ద అల ఈసారి కూడా జనించినట్లుగా ఇంకా ఎవరూ నిర్ధారించలేదు. భారత దేశంలో తూర్పు తీరం అంతటా భూకంపం ప్రకంపనలను ప్రజలు ఎదుర్కొన్నారు. తమిళనాడు, కేరళ, ఆంధ్ర ప్రదేశ్, అండమాన్ నికోబార్ దీవులు, అస్సాం, పశ్చిమ బెంగాల్ రాష్ట్రాలలో భూమి కంపించింది. సముద్ర తీరానికి కి.మీ దూరం లోపల ఎవరూ ఉండరాదని శ్రీలంక ప్రభుత్వం హెచ్చరించింది. ఈ స్ధాయి భూకంపం హిందూ మహా సముద్రంలో భారీ సునామీ అలను సృష్టించగల సామర్ధ్యం గలదేనని అమెరికా పసిఫిక్ సునామీ కేంద్రం తెలియజేసింది. కానీ భారీ అల సృష్టించబడినట్లుగా ఆ కేంద్రం నిర్ధారించలేదు.