ఆడపిల్లగా పుట్టినందుకు తండ్రి చేతిలో చనిపోయింది


Baby-Afreen-diesతండ్రి చేతిలో చిత్ర హింసలు అనుభవించిన మూడు నెలల పాప అఫ్రీన్ మృత్యువుతో పోరాడి ఓడిపోయింది. సిగరెట్ వాతలతో, గాయాలతో, రక్తం స్రవిస్తున్న మెదడుతో, విరిగిపోయిన మెడతో బెంగుళూరు ఆసుపత్రిలో చేరిన అఫ్రీన్ బుధవారం గుండే ఆగి చనిపోయింది. అబ్బాయి కోసం చూస్తే అమ్మాయి పుట్టిందనీ, అందుకే హత్యా ప్రయత్నం చేశాననీ తండ్రి ఉమర్ ఫరూక్ పోలీసుల వద్ద అంగీకరించాడని ‘ది హిందూ’ తెలిపింది. తన పాప ప్రాణాలు నిలుస్తాయని ఆశగా ఎదురు చూస్తున్న 19 సంవత్సరాల రేష్మ కూతురిని కోల్పోయి కన్నీరు మున్నీరుగా విలపిస్తోంది.

వళ్ళంతా కొరికిన గాయాలతో, తలపై సిగరెట్ వాతలతో ఉన్న అఫ్రీన్ ను శనివారం సాయంత్రం ఆమె తల్లి వాణీ విలాస్ ఆసుపత్రికి తీసుకొచ్చింది. అంతకు ముందు ఆమె దెబ్బలు తిన్న పాపను రెండు ఆసుపత్రులకు తీసుకెళ్లిందట. రేష్మ గత వారం ఓ రోజు రాత్రి లేచి చూస్తే పాప నోటిలో గుడ్డలు కుక్కి ఉండడం చూసింది. తలపైన దిండు కప్పి ఉండడం చూసింది. భర్తను అడిగితే తనకేమీ తెలియదని చెప్పాడట. పాపే గుడ్డల్ని నోటిలో పెట్టుకుని ఉంటుందనీ, చేతులు కాళ్ళూ కదిలిస్తూ దిండుని మీదకి లాక్కుని ఉంటుందని చెప్పాడని రేష్మ తెలిపింది.

రేష్మ, ఫరూక్ కి రెండవ భార్య. తీవ్రంగా కొడుతుండడంతో మొదటి భార్య వెళ్ళిపోయినట్లు తెలుస్తోంది. రేష్మ ను కూడా చాలా సార్లు కొట్టేవాడని రేష్మ తండ్రి కరీం చెప్పాడు. పోలీసులకు ఫిర్యాదు చేయగా ‘మరో అవకాశం ఇచ్చి చూడమంటూ’ పోలీసులు ఫిర్యాదు తీసుకోలేదని చెప్పాడని ఎన్.డి.టి.వి తెలిపింది. పాప పుట్టినప్పటి నుండీ ‘అమ్మాయి పుట్టినందుకు’ తనమీద భర్త కోపంగా ఉన్నాడని రేష్మ భాను తెలిపింది. మనవరాలు బతికి బట్టకడితే తన కూతురు, మానవరాలినీ అత్తారింటికి పంపకుండా తానే పోషించాలనుకున్నాని చెప్పి కరీం విలపించాడు.

తన ఏకైక బిడ్డ అఫ్రీన్ ను కొట్టి హింసించినందుకు ఫరూక్ ని పోలీసులు ఆదివారం అరెస్టు చేశారు. తానే పాపను చంపడానికి ప్రయత్నించినట్లు పోలీసుల వద్ద అంగీకరించాడు. భార్యను కొడుతున్నప్పటికీ, పాపను హింసిస్తున్నప్పటికీ ఎందుకు నివారించలేదంటూ కర్ణాటక రాష్ట్ర సంక్షేమ కమిటీ ఫరూక్ తల్లిని వివరణ కోరింది. మొదటి భార్యను కొడుతున్నపుడు కూడా ఎందుకు అడ్డుకోలేదని వివరణ కోరి, ఆమె పై కూడా కేసు నమోదు చేస్తామని కమిటీ తెలియజేసింది.

ఆరోగ్యం క్షీణించడంతో పాప సెమీ కోమా లోకి వెళ్లిపోయిందని డాక్టర్లు తెలిపారు. కోమాలో ఉండగానే ‘కార్డియాక్ అరెస్టుకి’ గురయిందనీ, మరో అరగంటకు ప్రాణాలు విడిచిందనీ వారు తెలిపారు. మెదడులో, శరీరంలో రక్త స్రావం కావడం వల్ల ‘కార్డియాక్ అరెస్ట్’ సంభవించిందని వారు తెలిపారు. పాప వైద్యానికి బెంగుళూరు లోని ప్రఖ్యాత మానసిక ఆసుపత్రి నిమ్ హేన్స్ సహకారం కూడా కోరామనీ, ఈ లోగా చనిపోయిందనీ వారు తెలిపారు. పాప కనీసం ఆరు వారాలైనా ఇంటెన్సివ్ కేర్ లో ఉండాలని రెండు రోజుల క్రితం డాక్టర్లు పత్రికలకు తెలిపారు. అయితే పాపే డాక్టర్లకు శ్రమ తప్పించింది.

పురుషాధిక్య సమాజం అని కాకుండా ఇంకేమి చెప్పి అఫ్రీన్ మరణాన్ని వివరించగలం? పురుషాధిక్య సమాజం కానట్లయితే కట్నం కోసం రెండు పెళ్లిళ్లు చేసుకోగలిగిన ఉమర్ ఫరూక్ లు ఏ సమాజానికి ప్రతీకలు? పొట్ట కూటి కోసమో, విలాసాల కోసమో ఢిల్లీ పబ్బుల్లో చిందులేసే అమ్మాయి, డెబ్భై శాతం గ్రామాల్లోని భారత స్త్రీల ప్రతినిధిగా చూడగలమా? బెంగుళూరు గ్రామం కాదు. భారత దేశ సమాచార సాంకేతిక విజ్ఞాన పురోగమనాన్ని అంతర్జాతీయ స్ధాయిలో విరాజింప జేసిన గొప్ప నగరం. వాల్ స్ట్రీట్ బ్యాంకుల లాభాల్ని ఇబ్బడి ముబ్బడిగా పెంచిన ఫైనాన్సియల్ ఇన్ స్ట్రుమెంట్స్ కోసం ఫార్ములాలు రాసిచ్చిన ఇన్ఫోసిస్ కి జన్మ స్ధలం. ప్రపంచ ప్రఖ్యాత గూగుల్, యాహూ, మైక్రో సాఫ్ట్ లాంటి కంపెనీలు ఏరి కోరి ఎంచుకున్న కార్పొరేషన్. ఇకెంతమంది బెంగుళూరు అఫ్రీన్ లు, నెలల పాటు చావుతో పోరాడి ఓడిన ఢిల్లీ ఫాలక్ లు పత్రికల కెక్కితే మెట్రో నగరాలు సైతం పురుషాధిక్యతతో అహంకరిస్తున్నాయని రుజువు చేయవచ్చు?

33 thoughts on “ఆడపిల్లగా పుట్టినందుకు తండ్రి చేతిలో చనిపోయింది

 1. ఈ కేసు ఒక ఐసోలేటెడ్ పేరెంట్ యొక్క birth choices కి సంబంధించినది. దీని వెనక ఒక పెద్ద సిద్ధాంతాన్ని చూడడం దండాన్వయంలా ఉంటుంది. ఒక ఐసోలేటెడ్ సంఘటన్ని బట్టి కాక సమగ్ర వాస్తవచిత్రాన్ని బట్టి విషయాల్ని జడ్జి చేయాలి.

  ఈ మధ్య ఈ విషయం మీద ఒక బ్లాగులో తాడేపల్లిగారు ఒక కామెంటు పెట్టారు. ఆయనంటారు : “…ఆంధ్రప్రదేశ్ లో 25 ఏళ్ళకంటే తక్కువ వయసున్న ఆడపిల్లల జనాభా ఈ మధ్యకాలంలో బాగా (మగపిల్లల కంటే ఎక్కువగా) పెఱిగిపోయి ఉండాలి. ఎందుకంటే ఈ రోజుల్లో ఏ కుటుంబాన్నైనా తీసుకోండి. ఉంటే ఒక అమ్మాయి, ఇంకా ఒక అబ్బాయి కనిపిస్తున్నారు. పక్షాంతరంలో ఇద్దఱూ అమ్మాయిలే కనిపిస్తున్నారు. అంతే తప్ప ఇద్దఱూ అబ్బాయిలే ఉన్న కుటుంబాలు చాలా చాలా అరుదైపోయాయి. అంటే దీనర్థం – ఉన్నపిల్లల్లో 25 నుంచి 40 శాతం వఱకు మాత్రమే మగపిల్లలై ఉండాలి. మిగతావాళ్ళంతా ఆడపిల్లలే. దీన్నిబట్టి చూస్తే – కొద్ది దశాబ్దాల తరువాత మన రాష్ట్రంలో ఉత్తరాది రాష్ట్రాలకి రివర్స్ పోకడ మొదలయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి.”

  ఆయన అభిప్రాయంతో నేనూ ఏకీభవిస్తున్నాను.

  దీనికి తోడు ఈమధ్య అన్నికుటుంబాలలోనూ ఒక విధమైన మాతృస్వామ్యం అమల్లోకొచ్చింది. తల్లికి తండ్రివైపువాళ్ళు సరిపడకపోవడం వల్ల వాళ్ళందరితోనూ పిల్లలకి తెగతెంపులవుతున్నాయి. మగవాళ్ళు ఎవరితో స్నేహం చేయాలి, ఏ బంధువులతో సంబంధాలు కలిగి ఉండాలి, పిల్లల్ని ఏ బళ్లో చేర్చాలి, ఏ చదువు చదివించాలి అన్ని విషయాల్లోనూ ఆడవాళ్లే శాసిస్తున్నారు. ఇది కూడా పురుషాధిక్యమేనంటారా ? బయటికి పోయి చూస్తే ఈనాడు ఒక్క చట్టం కూడా మగవాళ్ళకి అనుకూలంగా లేదు. ఒక్క చట్టం కూడా మగవాళ్ళ మీద దయ చూపదు. ఇది కూడా పురుషాధిక్యతేనంటారా ?

  పురుషాధిక్య సమాజం కాదండీ, పురుషులు ఎక్కువగా శ్రమించే సమాజం మనది. పురుషుణ్ణి చాలా చాలా ఎక్కువ శ్రమపెట్టి దోచుకునే సమాజం మనది. పురుషుణ్ణి దోచుకోవడాన్ని ఒక దైవదత్త హక్కుగా భావించే సమాజం మనది. ప్రతిదాన్నీ పురుషుడి నెత్తిమీద వేసేసే సమాజం మనది. అతను ఎంత కష్టపడినా, ఎన్ని చేసినా ఏమీ చేయలేదని అడ్డగోలుగా వాదించే సమాజం మనది. ఆడవాళ్ళ జీవితాలకి మగవాళ్ళే బాధ్యులనీ, వాళ్ళ నేరాలకి సమాజానిదే బాధ్యతనీ, వాళ్ళ రక్షణ ప్రభుత్వబాధ్యతనీ, ఫెమినిస్టులు వాదిస్తారు. ఏం, మరి మగవాడికి అది వర్తించదా ? మగవాణ్ణి ఈ సమాజం పెట్టే బాధలు ఎలాంటివంటే ఆ బాధల తాకిడికి తట్టుకోలేకనే వాళ్ళు మనసుచెడి, దిక్కుతోచక ఇలాంటి నేరాలకి పాల్పడుతున్నారు. నేరాల్ని నేను సమర్థించడం లేదు. కానీ ఒక తండ్రి తన ప్రేమపూరిత హృదయాన్ని పక్కన బెట్టి కూతురిని చంపేయడానికి పూనుకున్నాడంటే అతని మీద ఎలాంటి ప్రాణాంతకమైన బాధ్యతల్ని సమాజం వేసిందో ఆలోచించమంటున్నాను. అందరూ మగవాణ్ణి నానా చట్టాల పేరు చెప్పి, నానా బాధ్యతల పేరూ చెప్పి దోచుకునేవాళ్ళే తప్ప అతనికి సహాయంగా వచ్చేవాళ్ళెవరూ లేరు. అతను గొప్ప ఒంటరితనాన్ని అనుభవిస్తున్నాడీ సమాజంలో !

  ఆధిక్యం ఉంటే గింటే అది శ్రమ ద్వారానే సిద్ధిస్తుంది. ఆ విధంగా సమాజనిర్మాణంలో పురుషుల శ్రమపాత్ర అధికంగా ఉన్నప్పుడు, ఇతరుల సుఖసంతోషాలూ, మనశ్శాంతీ, భవిష్యత్తూ వారిమీదనే ఆధారపడి ఉన్నప్పుడు, వారి స్థానాన్ని ఇంకెవరూ భర్తీ చేయలేనప్పుడు వారి అభిప్రాయాలూ, ఇష్టానిష్టాలూ ప్రాముఖ్యాన్ని సంతరించుకుంటాయి. వ్యక్తుల ఇష్టానిష్టాల వల్ల ఎక్కడో అరుదుగా – కోట్లాది జనాభా మధ్య కేవలం పదుల్లోనో, వందల్లోనో జరిగే సంఘటనల్ని యావత్తు జాతికీ అపాదించి అందరూ ఆధిక్యభావనని ప్రదర్శిస్తున్నారనీ, వారంతా అహంకారులనీ, వారంతా కూడబలుక్కుని స్త్రీలని అణచివేస్తున్నారనీ ఆరోపించడం తార్కికం కాదు.

  ఒకరు ఇంకొకరిని అణచివేయడానికి ఇది రాజుల కాలం కాదు. వలసయుగమూ కాదు, ప్రజాస్వామ్యవ్యవస్థల్లో అణచివేతలు ఉండవు. మనుషులు తమ పొఱపాటు నిర్ణయాల మూలానా, తమ జీవనవిధానం మూలాన తమంతట తాము అణిగిపోవడమే ఉంటుంది. .

 2. సర్ఫిజెన్ గారూ అయితే మూడు నెలల పాప తీసుకున్న పొరబాటు నిర్ణయం ఏమై ఉంటుంది? బహుశా ఫరూక్, రేష్మలకి పుట్టడమే ఆ పాప పొరబాటు ఐ ఉంటుంది. కాని పుట్టక ముందు ఎవరికి పుట్టబోతున్నానో అఫ్రీన్ కి తెలిసే ఉంటుందంటారా? తెలిసే ఉంటుంది లెండి. ఎంత పుట్టకపోతే మాత్రం ఆడపిల్లై పుడుతున్నపుడు, పురుషులను దోచుకోవడానికీ, అణచివేయడానికీ కంకణం కట్టుకున్న జన్మ ఎత్తబోయే ముందు ఆ మాత్రం తెలిసే ఉంటుంది. ఆది శక్తి కదా.

  అయితే మీరు చెప్పినదాన్ని బట్టి చూసినా ఒక అయోమయం కలుగుతోంది.

  ఓ వైపు “పురుషాధిక్య సమాజం కాదండీ, పురుషులు ఎక్కువగా శ్రమించే సమాజం మనది. పురుషుణ్ణి చాలా చాలా ఎక్కువ శ్రమపెట్టి దోచుకునే సమాజం మనది. పురుషుణ్ణి దోచుకోవడాన్ని ఒక దైవదత్త హక్కుగా భావించే సమాజం మనది. ప్రతిదాన్నీ పురుషుడి నెత్తిమీద వేసేసే సమాజం మనది” అని చెబుతుంటిరి. మరో వైపు “ఒకరు ఇంకొకరిని అణచివేయడానికి ఇది రాజుల కాలం కాదు. వలసయుగమూ కాదు, ప్రజాస్వామ్యవ్యవస్థల్లో అణచివేతలు ఉండవు.” అని కూడా చెబుతుంటిరి. ఇందులో ఏది కరెక్టు? మీ గురువు గారు చెప్పారు గనక రెండూ కరెక్టే అయి ఉంటుంది లెండి. పరస్పరం విరుద్ధంగా ఉంటే మాత్రమేం? మీరు చెప్పారు గనక కరెక్టే ఐ ఉంటుంది.

  అయితే కట్నం సమస్యకి కారణం అబ్బాయిలు తక్కువైపోవడం అన్నమాట. అమ్మాయిలు ఎక్కువై పోయి వారి అణచివేత భరించలేక, మరో దారి కానరాక, కిరసనాయిల్ పోసి తగలబెట్టేస్తున్నారు పాపం. ఎలాగూ అమ్మాయిలు ఎక్కువే ఉన్నారు కనక మరోసారి దోపిడీ అణచివేతలకి గురికావడానికి సిద్ధమై పోతున్నారు. ఒకోసారి ఇద్దరు ముగ్గుర్ని చేసుకుని రెండు మూడు రెట్లు దోపిడిని అనుభవిస్తున్నాడు. నిజంగా పురుషులు దీన స్ధితిలోనే ఉన్నారు సుమా.

 3. నా మాటల్లో వైరుద్ధ్యమేమీ లేదు. మీరు సరిగా అర్థం చేసుకోలేదంతే ! మగవాళ్ళకి తమ లింగజాతిహక్కులకి సంబంధించి ఏ విధమైన స్పృహా లేదు. మగవాడు తానొక విశాల పురుషప్రపంచంలో భాగాన్ననీ, తన వ్యక్తిగత హక్కులు మగజాతి యొక్క హక్కులతో ముడిపడి ఉన్నాయనీ అర్థం చేసుకోలేక తన జాతిహక్కులకి వ్యతిరేకంగా తానే పనిచేస్తున్నాడు, మాట్లాడుతున్నాడు. అందువల్ల తనకు తెలియకుండానే దోపిడీకి గురవుతున్నాడు. ఇది నేను పైన చెప్పిన వాస్తవంతో ఖచ్చితంగా సరిపోలుతున్నదే. అయితే అదే సమయంలో అతని శ్రమ మీదనే ప్రధానంగా ఆధారపడి నడిచే వ్యవస్థలో అతనికి సహజంగా ప్రాధాన్యం కూడా ఉన్నది. అందుకనే అతన్ని ఆశ్రయించి బ్రతుకుతున్నాయి అన్ని వ్యవస్థలూ ! దాన్ని కొంతమంది మగవాళ్ళు సద్వినియోగం, లేదా దుర్వినియోగం చేసుకుంటున్నారు. అయితే పురుషులకి లింగజాతిస్పృహ లేకపోవడం వల్ల ఇది ఆర్గనైజ్డుగా జరుగుతున్నది కాదు. ఈ ఐసోలేటెడ్ ఘటనలకి మీరు పురుషాధిక్యం అని పేరుబెడుతున్నారు.

  రాష్ట్రంలో గత కొద్దిసంవత్సరాలుగా పురుషశిశు/ బాలక జనాభా తగ్గుతున్నదని తాడేపల్లి అభిప్రాయపడ్డారు. దీని పరిణామాలు భవిష్యత్తులో బహుభర్తృత్వానికి దారితీయవచ్చునని ఆయన ఉద్దేశం కావచ్చు. అంటే పురుషుల జనాభా ఇప్పటికిప్పుడే అమాంతం తగ్గుతున్నదనీ, స్త్రీలు ఓవరాల్ గా మెజారిటీలోకి వస్తున్నారనీ దీనర్థం కాదు. ఎందుకంటే ఇది ఇంకా పూర్తికాని ప్రక్రియ, నడుస్తూ ఉన్న చరిత్ర. కారణం – గత దశాబ్దాల్లో పుట్టిపెరిగిన మగవాళ్ళు ఇంకా బ్రతికే ఉన్నారు. వారిని కలుపుకోవడం వల్ల పురుష జనాభా ఎక్కువగా ఉన్నట్లు కనిపిస్తోంది. కానీ జనాభాలో ఈ విధమైన లింగ అసమతూకం చోటుచేసుకున్నట్లు స్పష్టంగా కనిపించడానికి, దాన్ని మనం గుర్తించడానికి ఇంకో 20 లేదా 30 ఏళ్ళు పడుతుంది. దానికీ, ఇప్పటి సంఘటనలకీ ముడిపెట్టడాన్నీ మీ విజ్ఞతకే వదిలేస్తున్నాను. ఈ జనాభా గొడవలు మన మేధాక్రీడ మాత్రమే. ఇవేవీ పురుషజనసామాన్యానికి తెలీవు. వాళ్ళ ఘోషల్లా తమ మీద ఆడపిల్లల భారం వద్దనేదే !

  BTW, నేను ప్రస్తావించిన అంశాల్లో ఒక్కదానికీ మీరు సమాధానమివ్వలేకఫోయారు. మీరు వివరణకు బదులు వ్యంగ్యాన్ని ఆశ్రయించారు.

 4. సర్ఫిజెన్ గారూ, అదేం లేదు. మిమ్మల్ని వ్యంగ్యం చేసేంత స్ధాయి నాకు లేదని గ్రహించండి. మీరు ప్రస్తావించిన లాజిక్ గతంలో ఎప్పుడూ చదివి ఉండలేదు. దాన్నింకా అర్ధం చేసుకునే పనిలో తలమునకలై ఉన్నాను. బహుశా మీరు ఊహించిన పరిస్ధితులు నాకెన్నడూ అనుభవం కానందున సరిగా అర్ధం చేసుకోలేకపోతున్నానని అనిపిస్తొంది. మీలాంటి వారికి ఉన్న నిశిత పరిశీలన అందరికీ ఉండకపోవచ్చు గదా. మీ పరిశీలనలను గ్రంధస్తం చేసి ఉంచండి. ముక్కలు ముక్కలుగా కాకుండా ఒకే చోట మీ ఐడియాల్ని ఉంచండి. ఆ చోటు నాకు తెలియజేయండి. చదువుకుని అర్ధం చేసుకోవడానికి ప్రయత్నిస్తాను. ఓ.కె.

 5. నేను వ్రాసిన అంశంలో కొత్తవిషయమేమీ లేదండీ ! కాలుష్యం పెరిగితే మగపిల్లల పుట్టుక తగ్గిపోయే అవకాశం ఉందని ఇదివరకే శాస్త్రవేత్తలు కనుగొన్నారు. కారణం – జీవిత ప్రారంభదశలో పురుషకణాలు సున్నితంగా ఉంటాయి. స్త్రీకణాలు బలంగా ఉంటాయి. జీవం పుట్టిపెరిగాక పరిస్థితి తారుమారవుతుంది. కానీ అసలు జీవమంటూ పుట్టాలి కదా ? అందుచేత కాలుష్యం మూలాన పురుష క్రోమోజోములు భారీసంఖ్యలో నశిస్తే తక్కిన క్రోమోజోములు పిండాన్ని మగశిశువుగా పెంపొందించగల probability తగ్గిపోతుంది. ఫలితంగా ఆడపిల్లే జన్మిస్తుంది. అయితే మనకిక్కడ కలిగే సందేహం – ఆంధ్రప్రదేశ్ లో కాలుష్యం ఇంత భారీస్థాయిలకు చేరుకుందా ? అని ! దీని మీద సరైన సర్వే ఏదీ లేదు.

 6. చిరుసవరణ :

  నా రెండో వ్యాఖ్యలో, “…దీని పరిణామాలు భవిష్యత్తులో బహుభర్తృత్వానికి దారితీయవచ్చునని ఆయన ఉద్దేశం కావచ్చు.” అని ఉన్న వాక్యంలో ’బహుభర్తృత్వానికి” (polyandry) అని ఉన్న పదాన్ని ’బహుభార్యాత్వానికి’ (polygamy) అని సవరించుకొని చదవాల్సినదిగా మనవి. అయోమయానికి కారణమైనందుకు చింతిస్తున్నాను.

 7. సర్పిజెన్ గారు. మాత్రుస్వామ్యం లొకి రావాలంటె పిల్లలను తండ్రి వైపునుంచి కాక, తల్లి వైపునుంచి గుర్తించాలి . స్త్రీలు, గాని, పురుషులు గాని , ఎక్కువ అవ్వటం వలన బహు భార్యలుగా,వుండం గాని లేదా బహు బర్తలుగా వుండం గాని జరగదు. దాని వెనుక సామాజిక సాంప్రదాయాలు, ఆర్దిక స్తితిగతులు నిర్నయిస్తాయి. పురుషులు సామాజిక శ్రమలొ ఎక్కువగా వున్నారు దీనికి కారణం చారిత్రక ఘటనల పరంపర సాగిన పరిస్తిస్తులు కారణం వాళ్ళను సామాజిక శ్రమలొకి రాకుండా అనిచివేచింది పురుషులే . ఇక్కడ పురుషుడు కుటుంభపొషకుడిగా వున్నాడు కాబట్టి అతడు అధికారం చెలాయించెస్తితిలొ వుంటాడు
  ఆడపిల్లను చిన్న చుపు చుసే సమాజం మనది .ఆడపిల్ల పుట్టిందని సంపడం ఒక్క పురుషులేకాదు, స్త్రీలు కుడా చెస్తున్నారు.సమాజానికి భయపడి దీని వెనుక అనేక కారణాలు వున్నాయి వరకట్నం ,మగపిల్లలైతె తమవంశం పేరు నిలబెడతాడని, వ్రుద్దాప్యంలొ ఆదుకుంటాడని ఇలా అనేక కారనాలు వున్నాయి.

 8. బహుభార్యాత్వం, హుభర్తృత్వం లాంటివి లింగనిష్పత్తిలో తీవ్రమైన అసమతూకం వల్ల కుదా సంభవిస్తుంది.

  “మగవాడు అణచివేశాడు” అంటున్నారు. యంత్రాలు లేని పాతకాలంలో, అంతా అడవులే ఎక్కుగా గ్రామాలు తక్కువగా ఉన్న పాతనాగరికతలో ఆడది మగవాడంట శ్రతీసుకునే పరిస్థితిలో ఉండేదా ? ఆలోచించండి. వాళ్ళ క్షేమం కోసం తీసుకున్న జాగ్రత్తల్ని మీరు అణచివేత అంటున్నారు. ఇప్పుడు ఆడదాన్ని ఉద్యోగానికి పంపితే దాన్ని కూడా దోపిడీ అనేవాళ్ళునారు. ఏం చేసినా, అసలేమీ చేయకపోయినా “అణిచేస్తున్నాడు, దోపిడీ” అని అడ్డగోలుగా వాదించడంపేర్లు పెట్టడం నేర్చుకున్నారు. అణచివేయడానికీ, దోచుకోవడానికీ ఒక లింగజాతిలో పుడితే సరిపోదండి ! ఒక ప్రత్యేక ఆర్థికవర్గంలో జన్మించాలి. ఆ వర్గంలో జన్మించిన తరువాతే ఇతరుల్ని అణచివేయగలరు. దోచుకోగలరు. వివిధ ఆర్థిక వర్గాలుగా ఉంటూ, ఎక్కువ సందర్భాలలో పైవాళ్ళ చేతుల్లోనూ, కుటుంబసభ్యుల చేతుల్లోనూ దోపిడీకి గురవుతున్న కోట్లాదిమంది మగవాళ్ళందరినీ అణచివేతదారులూ, దోపిడీదారులూ అనడం సమంజసం కాదు. ఈనాడు అస్సలు కాదు. ఈనాడు మగవాడి ఆదాయం మీద అనేకమంది హక్కుదార్లని సృష్టించింది ప్రభుత్వం. అతనంటే గిట్టని కుటుంబసభ్యులు (కుటుంబసభ్యులు కానివాళ్ళు కూడా) అనేక చట్టాల సహాయంతో, కేవలం ఒకప్పటి బాంధవ్యాన్ని పురస్కరించుకొని, అతనికి ఇష్టం ఉన్నా లేకపోయినా, అతను బ్రతికుండగానే అతని కష్టార్జితంలోంచి, ఆస్తిలోంచి వాటాలు లాక్కునే సదుపాయాన్ని కల్పించాయి ప్రభుత్వాలు. ఇది దోపిడీ కాదా ? కానీ మరి అతనికి మాత్రం అలా ఆదాయాలూ, ఆస్తులూ ఇచ్చేవాళ్ళెవరూ లేరు. అతనికి తండ్రి తప్ప ఎవరి ఆదాయంలోనూ, ఆస్తిలోనూ ఎటువంటి హక్కూ లేదు. అతనికి ఎక్కణ్ణుంచీ ఒక్కపైసా ఊరికే రాదు. ఆఖరికి అతను కష్టాల్లో ఉన్నప్పుడు ప్రభుత్వం నుంచి కూడా !

  ఐక్యరాజ్యసమితి ప్రకటించిన మానవహక్కుల చార్టర్ ప్రకారం – ఒకరి మీద నిందారోపణ చేసినప్పుడు దాన్ని నిరూపించాల్సిన బాధ్యత ఆ ఆరోపకులదే (burden of proof). కానీ ఇండియాలో మాత్రం ఆడవాళ్ళ కోసం చేసిన అన్ని చట్టాలలోనూ “తనమీద వచ్చిన ఆరోపణ నిజం కాదని నిరూపించుకోవాల్సిన బాధ్యత మగవాడిదే” అని యథేచ్ఛగా చట్టాలు రాసేశారు. అంటే ఆరోపణలు చేసి కేసులు పెట్టే ఆడవాళ్ళు కేవలం ఆ ఒక్కపనీ చేసేసి ఇంట్లో కూర్చోవచ్చు, వాటిని నిరూపించాల్సిన పనే లేదు. అవి వాస్తవమా ? అవాస్తవమా ? అని విచారణ చేసే బాధ్యత ప్రభుత్వానిక్కూడా లేదు. ఆ మగవాణ్ణి మాత్రం ఆరోపణ వచ్చిన వెంటనే తీసుకెళ్ళి చితకబొడుస్తారు. అతను తాను తప్పు చేయలేదని సాక్ష్యాల్ని సమర్పించేంత వరకూ చిప్పకూడు తినిపిస్తారు. ఇదేం ప్రజాస్వామ్యం బాబూ ? ఇదేం ఫ్రీ సొసైటీ ? ఇవేం చట్టాలు ? ఇవేం మానవహక్కులు ?

  ఎవరిది దోపిడీ ? ఎవరు అణచివేయబడుతున్నారు ? నిజాయితీగా నిక్కచ్చిగా నిష్పక్షపాతంగా ఆలోచించండి. అంతేగానీ, మనకీరోజు ఆడపిల్లలున్నంతమాత్రాన వాళ్ళ పేరుచెప్పి ప్రభుత్వం చేసే మానవహక్కుల ఉల్లంఘనలకీ, ఆస్తిహక్కుల నాశనానికీ ఈరోజున మనం ఆనందంగా తలూపకూడదు. తలూపితే రేపు వాటి దెబ్బకి ఆ ఆడపిల్లలకి పుట్టబోయే మగపిల్లలు కూడా బలిపోయే రోజొస్తుందని గుర్తించండి.
  \

 9. సర్ఫిజెన్ గారూ, మీ ఒక్కరి అభిప్రాయాలే సరైనవిగానూ, ఇతరులవన్నీ అడ్డగోలువిగాను చెప్పడం ఆపండి. ఎదుటివారికి నిజాయితీ లేదని చెప్పి అవమానిస్తున్నారు.

 10. ఇండియాలో భార్య ఉండగా రెండో పెళ్ళి చేసుకునేవాళ్ళందరూ డబ్బున్నవాళ్ళే. డబ్బున్నవాడు పేద కుటుంబానికి చెందిన స్త్రీని ఆమె ఆర్థిక బలహీనతని ఉపయోగించుకుని రెండో భార్యగానో, ఉంపుడుగత్తెగానో తెచ్చుకుంటాడు. బహుభార్యత్వానికి జనాభా నిష్పత్తితో సంబంధం లేదు.

 11. ఆర్యా ! ఒక విషయం గమనించండి. నేను లేవనెత్తిన అంశాల్లో ఒక్కదానిక్కూడా సమాధానం ఎవరూ ఇవ్వలేదు ఈ బ్లాగులో ! ఊరికే మగజాతిని నిందిస్తూ మగవాడు తన పరిధిలోని స్త్రీల కోసం నిరంతరం కష్టపడుతూ వాళ్ళని సుఖపెడుతూ అడుగడుగునా కాపాడుకుంటూ వస్తున్న వైనాన్నీ, అతని మీద ఆర్గనైజ్డుగా, చట్టబద్ధంగా అమలవుతున్న దోపిడీని విస్మరించి అన్యాయమైన అభాండాలు వేయడంలో మీకు ఏ విధమైన తప్పూ కనిపించడం లేదు. మగవాళ్ళని ఇలా బాధించడం ఆల్రెడీ బాధితుడైనవాణ్ణి ఇంకా బాధించడమే అవుతుందని నా అబిప్రాయం. కేవలం ఒక పదం పట్టుకొని నన్ను తప్పుపట్టాలని చూస్తున్నారు. నేను అడ్డగోలు అన్నది ఇక్కడి వ్యాఖ్యాతల గురించి కాదు. ఈ కాలపు మేధావుల గురించి.

  మీకు తెలిసిన విషయాలతో తృప్తి చెందాలని మీకు ఉంటే, నాకభ్యంతరం లేదు. మీరిక్కడ వ్యాఖ్యాసౌకర్యం పెట్టారు గనుక చర్చలో పాల్గొనవచ్చునని భావించి నేను పాల్గొంటున్నాను. నాకు తెలిసిన విషయాలు నేను మీతో పంచుకుంటున్నాను. “అది నా బ్లాగులో కుదరదు” అని మీరంటే సంతోషం. నేను దూరంగా ఉంటాను.

 12. సర్ఫిజెన్ గారూ,
  ఇంతవరకు జరుగుతున్న చర్చలో ఆలస్యంగా పాలు పంచుకుంటున్నాను.
  నిజంగానే మీరు గుర్తించినట్లుగా మీ వాక్యాలలో కొన్ని చోట్ల అక్షరాలు తెగిపోతూ అర్థభేదం వచ్చే అవకాశం ఉంటోంది. బహుశా మీరు మరో పనిలో ఉంటూ త్వరత్వరగా వ్యాఖ్య పెట్టవలసిరావడం కూడా దీనికి కారణం కావచ్చు. వ్యాఖ్యమొత్తంలో కీలకమైన వాక్యంలో ఇలాంటి పొరపాటు జరిగితే నిజంగానే అయోమయం ఏర్పడుతుంది.

  ఉదాహరణకు “యంత్రాలు లేని పాతకాలంలో, అంతా అడవులే ఎక్కుగా గ్రామాలు తక్కువగా ఉన్న పాతనాగరికతలో ఆడది మగవాడంట శ్రతీసుకునే పరిస్థితిలో ఉండేదా ?” అనే మీ వ్యాఖ్య వాక్యం చివరలో జరిగిన పొరపాటు వల్ల మీరేం చెప్పదలిచారో సరిగా అర్థం కావడం లేదు.

  “ఒకరు ఇంకొకరిని అణచివేయడానికి ఇది రాజుల కాలం కాదు. వలసయుగమూ కాదు, ప్రజాస్వామ్యవ్యవస్థల్లో అణచివేతలు ఉండవు. మనుషులు తమ పొరపాటు నిర్ణయాల మూలానా, తమ జీవనవిధానం మూలాన తమంతట తాము అణిగిపోవడమే ఉంటుంది.”

  ఇంత సాహసోపేతమైన ప్రకటనకు దిగిన మీరు, చివరికి వచ్చేసరికి ‘ప్రజాస్వామ్య వ్యవస్థల్లో అణిచివేతలు ఉండవు’ అనే మీ సారాంశానికి పూర్తి భిన్నంగా కింది ప్రకటన చేసేశారు.

  “….ఒక ప్రత్యేక ఆర్థికవర్గంలో జన్మించాలి. ఆ వర్గంలో జన్మించిన తరువాతే ఇతరుల్ని అణచివేయగలరు. దోచుకోగలరు. వివిధ ఆర్థిక వర్గాలుగా ఉంటూ, ఎక్కువ సందర్భాలలో పైవాళ్ళ చేతుల్లోనూ, కుటుంబసభ్యుల చేతుల్లోనూ దోపిడీకి గురవుతున్న కోట్లాదిమంది మగవాళ్ళందరినీ అణచివేతదారులూ, దోపిడీదారులూ అనడం సమంజసం కాదు.”

  ఇక్కడ మీరు చెబుతున్నది ప్రజాస్వామిక వ్యవస్థలలోని ప్రత్యేక ఆర్థిక వర్గాలు, వారి దోపిడీ, అణిచివేతలు, పైవాళ్లు, కుటుంబ సభ్యుల దోపిడీ గురించేనా?

  “ప్రజాస్వామ్య వ్యవస్థలలో అణచివేతలు ఉండవు” అనేదే నిజమైతే, మీ పై ప్రకటన దానికదే వీగిపోతుంది. ఈ వాక్య సారాంశం ప్రకారం చూస్తే మగవాళ్లు అణిచివేతదారులు, దోపిడీదారులు అనడం ఎలా సమంజసం కాదో -మీరన్నట్లు-, ఒక ఆర్థిక వర్గంలో జన్మించిన తర్వాతే ఇతరుల్ని అణిచివేయగలగడం, దోచుకోగలగడం కూడా సమంజసం కాదు. సాధ్యం కూడా కాదు.

  ప్రజాస్వామ్య వ్యవస్థలలో అణిచివేతలు ఉండవు అనే మీ మౌలిక భావనను మన దేశానికే అన్వయించాలన్నా, లేదా మొత్తం ప్రపంచానికే అన్వయించాలన్నా ముందు గా మీ అభిప్రాయాల్లోని పరస్పర విరుద్ధ అంశాలపై స్పష్టతకు రావలసి ఉంది.

  అణిచివేత అనేది ఎప్పుడూ కంటికి కనిపించే రూపంలోనే మన దేశంలో కొనసాగలేదనుకుంటాను. బ్రిటిష్ వారి కాలంలో ఆదివాసులను కొరడాలతో కొట్టి పనిచేయించినట్లుగా, భూస్వాములు తమ కింది పాలేర్లను తన్ని పనుల్లో దింపినట్లుగా, గల్ఫ్ దేశాల్లో ఆధునిక పెట్రో భూస్వాములు తమ ఇళ్లలో పనిచేయడానికి వచ్చిన పరాయి దేశాల పౌరులను ఈ రోజుల్లో కూడా రాక్షస హింసలకు గురి చేస్తున్నట్లుగా అణిచివేత అనేది మన దేశంలో సార్వత్రిక రూపంలో కనిపించకపోవచ్చు. కాని కనిపించని రూపంలో సాగుతున్న అణిచివేత మాటేమిటి?

  పాతికేళ్ల క్రితమే తిరుపాల్ అనే తిరుపతి యువ కవి ఒక కవితలో…
  “గాంధీపుట్టిన దేశం కదా..
  ఇక్కడ కుట్రలన్నీ మౌనంగానే సాగుతాయి..”
  అనే అర్థంలో రాశాడు. మన దేశంలో, ప్రపంచంలో కూడా మౌనంగా సాగే కుట్రల గురించి మనం ఏకీభవించవచ్చు ఏకీభవించకపోవచ్చు. అది వేరే విషయం.

  “పురుషులు ఎక్కువగా శ్రమించే సమాజం మనది. పురుషుణ్ణి చాలా చాలా ఎక్కువ శ్రమపెట్టి దోచుకునే సమాజం మనది. పురుషుణ్ణి దోచుకోవడాన్ని ఒక దైవదత్త హక్కుగా భావించే సమాజం మనది.”

  వ్యవసాయ సమాజంలో పుట్టి పెరిగిన వాడిగా, గ్రామీణ ప్రాంతాల్లో స్ర్రీపురుషుల మధ్య శ్రమ విభజన ఎలా ఉంటుందో పరిచయమున్నవాడిగా చెబుతున్నాను. వ్యవసాయ పనుల్లో పురుషులు కష్టపడిపోతుంటే స్త్రీలు సుఖపడిపోవడం నాకు తెలిసి మన గ్రామీణ సమాజంలో ఎక్కడా లేదు. స్త్రీలను నాగలితో దున్నడం, బండి తోలటం, పనిముట్లతో పని చేయడం వంటి వ్యవసాయంలోని ప్రధాన పనులకు దూరం చేశాక, ఇలాంటి పనులు చేస్తున్న పురుషుడు కష్టపడిపోతున్నట్లు పైకి కనబడవచ్చు కాని వ్యవసాయంలోని తక్కిన అన్ని అనుబంధ పనులూ మహిళల చేతులమీదుగానే జరుగుతుంటాయి. నాగలితో దున్నలేనంత, బండి తోలలేనంత, పనిముట్లతో పనిచేయలేనంత శారీరక దుర్భలురాలు కాదు గ్రామీణ మహిళ. ఆమె నాగలిని తాకితే, పార పట్టి పొలంలోకి దిగితే ఏడు తరాల దారిద్ర్యం ఆ కుటుంబాన్ని పట్టి పీడిస్తుందంటూ సంప్రదాయాలను లిఖితంగానూ, ఆచారాల రూపంలోనూ రుద్దడం జరిగిన తర్వాత పురుషులు చేసే ఈ ప్రధాన పనులు మహిళలకు దూరమైపోయాయంతే.

  దీంట్లో పురుషుడి గొప్పతనం ఏమాత్రం లేదు. పైగా తెల్లవారు జామున నాలుగు లేదా అయిదు గంటలకు నిద్ర లేచింది మొదలు రాత్రి నిద్రపోయేంతవరకు గ్రామీణ మహిళ కుటుంబానికి సంబంధించిన అన్ని పనులనూ ఇంటా, బయటా చేస్తూనే ఉంటుంది. రోజు మొత్తంలో గ్రామీణ పురుషుడు చేసే ప్రధాన పనులకు చాలా తక్కువ సమయమే పడుతుంది. పని కాకుండా ఇతర రాచకార్యాలు ఎన్ని చేపట్టినా పురుషుడి పనికి అధిక గుర్తింపు ఎందుకు వస్తోందంటే వ్యవసాయంలో ప్రధాన పనిగా కనబడేది పురుషుడి గుత్తగా మారిపోయింది. ఈ ప్రధాన పనులను స్త్రీలు చేయలేరని కాదు. వాటికి మహిళలను దూరం చేశారంతే. కొండ ప్రాంతాల్లో కాని, మైదాన ప్రాంతాల్లో కాని పురుషులకంటే అధికంగా పనులు చేస్తున్నది మహిళలే అనేది జగమెరిగిన సత్యం. సమస్య ఏదంటే వారి పనులు గుర్తించబడకపోవడమే..

  అపార్థానికి తావీయదంటే ఒక మాట. పాతికేళ్ల క్రితం డిల్లీ నుంచి ప్రచురించబడిన మానుషి అనే మహిళా పత్రిక -ఇంగ్లీషు మాసపత్రిక-లో ఒక భారతీయ ముస్లిం రచయిత ప్రకటనను చదివాను. ఈయన 19వ శతాబ్దం చివరలో మన దేశంలో జన్మించిన రచయిత.

  “గాడిద తన బరువుకు మూడు రెట్ల బరువును మోస్తుంది. గాడిద చాకిరీ చేస్తుంది. అంతమాత్రాన గాడిద ప్రపంచంలో అందరికంటే గొప్పదనవచ్చునా”

  పురుషులందరినీ గాడిదలుగా ఈ వాక్యం ముద్రవేస్తోందని అర్థం తీసుకోవద్దండి.
  ఎక్కువ పని చేస్తున్నందుకు మనిషికి గుర్తింపు రావడం కాకుండా ఆ పని తర్వాత అతడికి, ఆమెకు మిగులుతున్న జీవితం, గడుపుతున్న జీవితం గురించే మనం పరిశీలించాలనుకుంటాను.

  మహిళల క్షేమం కోసం తీసుకున్న జాగ్రత్తలు అంటూ మీరు చెప్పిన వాక్యం విషయం.. మీరు చెప్పింది నూటికి నూరుపాళ్లు సత్యమే అనుకుందాం. శ్రమవిభజనలో భాగంగా పిల్లల పెంపకం వంటి విధులకోసం మహిళ ఇంటికే పరిమితమైపోయిందనుకున్నా ఇలా పరిమితమైపోయిన మహిళలను పనిపాటలు లేని జాతిగా, గొడ్డు చాకిరీకి దూరమైన జాతిగా, మగాళ్లు నానాచాకిరీ చేసి సంపాదిస్తుంటే తిని పెరిగే జాతిగా ముద్రించడం కంటే అపచారం మరొకటి లేదు.

  మీరు కూడా ఇలా అంటున్నారని నేను చెప్పడం లేదు. కాని పురుషులు హక్కులకు దూరమైపోతూ బానిస చాకిరీకి దగ్గరవుతున్నారంటూ మన బ్లాగులలో ప్రకటితమవుతున్న అనేక రచనలు, పోస్ట్ లలో ఆడవారిని పురుషులపై పడి తిని పెరిగే జాతిగా, ఇంట్లో కూర్చుని పెత్తనాన్ని చలాయిస్తున్న జాతిగా ప్రకటిస్తున్న ధోరణి తీవ్రస్థాయిలోనే ఉంది. గడచిన వంద సంవత్సరాల చరిత్రను చూస్తే మహిళ ఇక ఇంటికి పరిమితమైన జాతిగా ఉండబోదని ఘంటాపధంగానే చెప్పవచ్చు. ఆమె ఇంటిబయటకు వస్తున్న క్రమంలో జరుగుతున్న కౌటుంబిక, సామాజిక మార్పులను అర్థం చేసుకోవడంలో ఎక్కడో తేడా ఉంటోందనుకుంటాను.

  అన్నిటికన్నా ప్రధాన విషయం…. దోపిడి, అణిచివేత అనేవి పురుషులు స్త్రీలను లేదా స్త్రీలు పురుషులను పీడిస్తున్న, అణిచివేస్తున్న రూపంలో సమాజంలో ఏర్పడలేదనుకుంటున్నాను. వీటిని చరిత్ర క్రమంలో ఏర్పడిన వర్గ ప్రాతిపదిక రూపాలుగా అధ్యయనం చేస్తే బాగుంటుంది.

  భావాలను పరస్పరం పంచుకోవడం, తెలియచెప్పడం రూపంలోనే ఈ చర్చ సాగాలని, సాగుతుందని ఆశిస్తున్నాను.
  అభినందనలతో..

 13. విశేఖర్ గారూ,
  “ప్రజాస్వామ్యవ్యవస్థల్లో అణచివేతలు ఉండవు.”
  చిన్న పొరపాటు. ఈ అంశంపై మీ వ్యాఖ్యను సరిగా గమనించకుండా నేను మళ్లీ ఇదే అంశంపై సుదీర్ఘంగా వ్యాఖ్యానించినట్లున్నాను. అవసరం లేదు ఆ భాగం తీసివేసి మిగతా భాగం మాత్రమే ప్రచురించగలరు.

 14. రాజు గారు,
  ఇంత చరిత్ర చదివారు కదా, ప్రపంచం లోని సంపద సృష్ట్టిలో స్రీల కాంట్రిబ్యుషన్ ఎమీటీ?
  ఇంకొక మాట మీరు అన్ని వర్గాల మహిళలను ఒకే గాటన కట్టేసి మాట్లాడితే దానికి అర్థం లేదు. నీత అంబాని కూడా మహిళనే ఆమే తో పొలం పనులు చేసి కొనే మహిళల తో పోల్చి, ఇద్దరు స్రీ లే కదా అని వాదన చేస్తే అది ఒట్టి వాదనగా మిగిలిపోతుంది. వాస్తవానికి వారి ద్దరి మధ్య నక్కకు నాగలోకనికి ఉన్న తేడా ఉంట్టుది.

 15. మల్లిగారూ, అవును. నీతా అంబానీతో పొలం పనులు చేసుకునే మహిళతో పోల్చలేము. అలా పోల్చే వాదన రాజు గారు చేయలేదు కదా.

  నీతా అంబానీకీ, శ్రామిక మహిళకూ ఎంత తేడా ఉందో ముఖేష్ అంబానీకీ శ్రామిక పురుషుడికీ అంతే తేడా ఉంది.

  సంపద సృష్టిలో స్త్రీల కాంట్రిబ్యూషన్ ఏమిటన్న ప్రశ్న సరైన ప్రశ్నేనా? ఒకసారి ఆలోచించండి. ప్రపంచ సంపద అంతా శ్రామికుల శ్రమ ఫలితం. అది కూడా ఉమ్మడి శ్రమ ఫలితం. శ్రామికులను స్త్రీలు పురుషులుగా విడదీసి ఎవరి కంట్రిబ్యూషన్ ఎంత అని విడదీసి చూడలేం.

  స్త్రీ, పురుషుల మధ్య వివక్షతో కూడిన విభజన చేయడం సహజ సిద్ధంగా జరిగినది కాదు. అది చారిత్రక క్రమంలో ఏర్పడిన పరిణామం. వర్గాధిపత్య సమాజాల్లో వర్గ దోపిడికి ఉపయోగపడిన అనేక విభజనల్లో స్త్రీ, పురుషుల మధ్య జరిగిన విభజన కూడా ఒకటి. కుల, మత, జాతి లాంటి అనేక వివక్షల్లో స్త్రీ వివక్ష ఒకటి. ఈ వివక్షలన్నీ ఆధిపత్య వర్గాల దోపిడికి సహాయకారిగా పని చేశాయి. అందుకే ఆధిపత్య వర్గాల ప్రయోజనాల కోసం పని చేసిన ప్రభుత్వాలు ఈ వివక్షలను కాపాడుతూ వచ్చాయి.

  స్త్రీ పురుషుల మధ్య పోటీ లేదు. వారు జీవన సహచరులు. అదే సమయంలో ఆ సహచరత్వంలో సమానత్వం లేదు. స్త్రీలపై సాగుతున్న వివక్ష డబ్బును పెంచిన పెట్టుబడుల్లో ఒకటి.

 16. మల్లిగారూ,
  విశేఖర్ గారు ఇచ్చిన వివరణతో ఏకీభవిస్తున్నాను. ఏ పనీ చేయకుండానే, ఒకే ఒక రాత్రిలో 1500 కోట్ల రూపాయల విలువైన అత్యాధునిక విహారనౌకను ముఖేష్ అంబానీ నుంచి గిఫ్ట్‌గా పొందిన నీతూ అంబానీకీ, పూటగడవటం కోసం భూమిపై పచ్చనాకును పరుస్తున్న మన దేశ సగటు మహిళకు, శ్రామిక మహిళకు పోలికే లేదు. మీరన్నట్లే ఇది నక్కకూ నాగలోకానికి మధ్య ఉన్నంత తేడా. ఆ సోకుల నౌక, దాని వెనుక పోగుబడిన కోట్ల సంపద ఎలా వచ్చిందనేదే అసలు సమస్య.

  మరొక విషయం… స్త్రీపురుషుల మధ్య వైరుధ్యం సామాజికంగా, సాంస్కృతికంగా కొత్త పోకడలు పోతున్న దశలో ఉంటున్నాము. ఆన్‌లైన్‌లో సవ్యంగా, అపసవ్యంగా కూడా సాగుతున్న చర్చలు, విభేదాలు దాని ప్రతిఫలనమే కావచ్చు.

  “ఇంత చరిత్ర చదివారు కదా” అన్నారు. ఇది పొగడ్తో తెగడ్తో తెలీదు కాని, నాకు తెలిసింది చాలా తక్కువే అనుకుంటున్నాను. థాంక్యూ

 17. *అందుకే ఆధిపత్య వర్గాల ప్రయోజనాల కోసం పని చేసిన ప్రభుత్వాలు ఈ వివక్షలను కాపాడుతూ వచ్చాయి.స్త్రీ పురుషుల మధ్య పోటీ లేదు. వారు జీవన సహచరులు.*

  శేఖర్/రాజుగారు,
  మీరు రాసిన వాటికి కొనసాగింపుగా చర్చిస్తున్నాను. మీరు గతం కాలం లో ఆదర్శాలను పునరుద్ఘటిస్తున్నారు. సమాజం లోని,ప్రజల ఆర్ధిక పరిస్థితి,జీవన శైలి,ప్రభుత్వాలు,రాజకీయాలు ఒక దానితో ఒకటి ముడిపడి ఉంటాయనే విషయం మీకు వేరే చెప్పకరలేదు. మనం ఆధిపత్యా వర్గాల గురించి మాట్లాడుకొనే టప్పుడు, ఆ వ్యవస్థ మూలాలు, అది దేనిపైన నిలబడి ఉంది, దాని మేకానిజం, వారు పాలించే విధానం పరిగణలోకి తీసుకోవాలి. ఇక మన దేశ స్వాతంత్రం వచ్చిన తరువాత మనం పశ్చిమదేశాల వారి ప్రభావం వలన రాజ్యంగం, సోషలిజం మొద|| వైపు ఆకర్షితులవటం జర్గింది. ఆదేశాలను చూస్తే వ్యక్తిగత స్వేచ్చ అనేది చాలా ముఖ్యమైనట్లు గా ప్రజలు భావిస్తారు. అక్కడ నాలుగేళ్లు ఉంటే అర్థమౌతుంది. వారు రూపొందిచుకొన్న చట్టాలు వాటిని పరిరక్షిస్తూంటాయి. చట్టాలు ఉపయోగించుకోవాలంటే ఏదేశమైనా ప్రజల దగ్గర డబ్బులు ఉండాలి. అవి ఉన్న వారికి బాగా ఉపయోగపడతాయి. కాని అవే చట్టాలు మనదేశం లో కి తీసుకొని వచ్చినపుడు సోషలిజం సాధించే దానికి ఉపయోగపడతాయని ప్రజలకి చెప్పారే, కాని అది వాస్తవం కాదు. 60సం|| తరువాత వ్యక్తిగత వాదన ముందుకు వచ్చింది. కారణం ప్రస్తుత కాలంలో కుటుంబం లో ఒకరు లేక ఇద్దరు పిల్లలు కావటం వలన,ప్రజలదగ్గర డబ్బులు ఉండటం ఎక్కువైంది.

  పశ్చిమ దేశాల ప్రధాన గుణం, వారు అర్థం చేశుకొనే విధానం మన ఆసియా దేశాలతో పోలిస్తే చాలా విభిన్నంగా ఉంట్టుంది. వారికి నిద్దర లేచిన మొదలుకొని పాత వాటిని కొత్త కొత్త పేర్లతో పిలవటానికి, కొత్త ఐడేంటిని సృష్ట్టించి, కొన్నిసమూహాలకు వాటిని మాప్ చేసి, మానేజ్ చేయాలనే ది వారి మానేజ్ మెంట్ పాలసి. అది ప్రభుత్వమైనా, పెద్ద కపెనీలైనా ఇదే పంధాను అనుసరిస్తూంటరు. కావాలంటే ఎవరైన అమేరికన్ కంపేనిలొ పని చేసేవారిని అడిగి చూడండి, ప్రతి సం|| టిం కి కొత్త పేరు పెట్టటమ్మ్, ఆర్గనైజేడ్ స్ట్రక్చర్ ను మార్పులు చేయటం సర్వ సాధారణం.

  విషయానికి వస్తే స్రీవాదం అని మీరేదో ప్రోగ్రెసివ్ గా అనుకొనేది, ఎప్పుడో ఆధిపత్య వర్గాల అధికారం కాపాటటానికి సహకరించే వాదంగా అయిపోయింది. మీరే గమనించండి ఈ స్రీవాదులు కతహ్లు ,సాహిత్యం రాసి అంతతీతో ఊరుకోరు, దానిని చట్టంగా మార్చి అమలుజరపాలనుకొంటారు. ఎప్పుడైతే ప్రభుత్వం నుంచి వారు ఇది డిమాండ్ చేస్తారో,ప్రభుత్వం వారిని ఓటు బాంక్ గా చూడటం మొదలు పెడుతుంది. మొదట్లొ వారడిగితే ప్రతిస్పందించే ప్రభుత్వం, తరువాత ఓట్ల కొరకు అదే ముందుకువచ్చి కొన్ని వరాలు ప్రకటించటం, వారిని యంపవర్ చేయటం చేస్తుంది.

  సమాజం లో ఉండే ఇటువంటి పరిస్థితులలో స్త్రీ పురుషుల మధ్య పోటిలేదనటం అమాయకత్వమే. అలా మీరను కొన్నా వారనుకోరు. ఎదైనా మాట్రిమొని వెబ్ సైట్ కి వెళి జాబ్ చేసే అమ్మాయి కోరికలు చదవండి. ఆమే తనకు కాబోయే భర్త చదువు, జీతం తనకన్నా ఎక్కువ ఉండాలని ఎంత మంది రాసి ఉంటారో. ఉద్యోగంచేసే భార్యా భర్తల మధ్య ఉండే ఇగొ క్లాష్ లు తెలియక మాట్లాడుతున్నరేమో అనిపిస్తున్నాది. భర్త జీతం, హోదా తనకన్నా తక్కువగా ఉందని, భవిషత్ లో పెద్దగా మెరుగు పడేసూచనలు లేవని తెలుసుకొన్న కొంతమంది పెళ్లి అయిన 5సం|| కాపురం చేసిన తరువాత కూడా విడిచిపెట్టిన వారి సంగతి తెలుసు.నువ్వు ఎక్కువ డబ్బులు సంపాదించటం చేతకాని మగవాడివి అని భార్యే స్వయంగా అన్నదే అనుకొండి, ఆ మాట పడినవాడికే ఆ బాధ తెలుసుతుంది. ప్రతి ఒక్కరు పరిస్థితిని విడాకులు తీసుకొనె వరకు తీసుకురాక పోయినా,ఒక విధమైన నరకాన్ని భర్త కు చూపిస్తారు. చాలామంది మగవారు మింగలేక కక్క లేక నోరు ముసుకొంటారు. మొగుడు పేళ్లాలు అసంతృప్తి తో గడిపేవారిని ఈ రోజుల్లో చూశాను. అధికారం, డబ్బులు ఎక్కడ ఉంటాయో అక్కడ పోటి ఉంట్టుంది. అందులొ వ్యక్తుల వాట ఉంట్టుంది. అంతా మనదే అనే అనుకొనే భావమే ఉండదు. వాటాల కోసం, ఎవరి ఎత్తులు వారు వేసుకొంట్టూంటారు. అది కాక ఆడవారికి పుట్టింటిముంచి వచ్చే ఆస్థి కూడ తోడైనపుడు, ఆమే ఖచ్చితం గా తన డబ్బులను మొగుడి దగ్గర ఉన్న డబ్బులతో,ఆస్తులతో పోల్చుకొంట్టుంది. ఎప్పుడైతే పోల్చుకోవటం మొదలౌవ్తుందో దాని నుంచి చాలా సైడ్ ఎఫేక్ట్స్ మొదలౌతాయి.

 18. రాజు గారు,
  మీ ఊరిలో మీరు పెరిగే సమయం లో నలుగురు మగరైతులు భార్య చేత పనులు చేయించుకొని పేరు ప్రఖ్యాతులు వారి ఖాతా లో వేసుకొన్నారని అంట్టున్నారు. కాని ఆ రైతుల తాతల, తండ్రుల సమయం లో వారికి ఆ పోలాలు రావటానికి, ఉన్న భూమి మరింత పెరగటానికి కారణాలు ఎమై ఉంటాయో ఆలోచించండి. అందరు నిద్దర లేచిన మొదలుకొని వ్యాపారం, వ్యసాయం చేస్తే సంపద పెరగదు. ప్రాణాలకు తెగించి యుద్దాలు చేయాలి. బతికి బట్టకట్టి, తమ రాజు గెలిస్తే వారికి యుద్దం లో పాల్గొమ్నందులు ప్రతిఫలం గా komta పొలం కూడా దక్కేది. ఎంతమంది మహిళలు యుద్దాలలో పాల్గొన్నారు? ఆరోజుల్లో మహిళను తీవ్రంగా అణచివేశారని హోరెత్తించే మన తెలుగు రచయితలు, మగవారిని కొజ్జాలుగా చేసి, రాజస్థానలలో పని చేయటానికి వేరే దేశలవారికి అమ్మేవారని ఎన్ని పుస్తకాలలో రాశారు? ఇంతగా మహిళలను వేదించే, మగవారు ఎన్ని రోజులు బ్రతికి బట్టకట్టారో, వారి ఆయుర్దాయమెంతో ఎక్కడైనా రాశారా? మనం ఈ రోజులో సుమారు 60సం|| పై బ్రతుకు తున్నందుకు పాతకాలంలో వారు కూడా 60సం|| బతికి ఆడవారిని వేధింపులకు గురిచేశారనుకొంట్టునట్లు , స్రీ వాద రచనలు/ కథలు చదివితే అనుకొంటాం. తరతరాలు గా అంట్టు మొదలుపెడతారు. తరతరాలుగా మగవారు సుఖపడింది కూడా ఎమీలేదు. 1940 సం||లో మగవారి యావరేజ్ జీవితకాలం 38సం|| లని గుర్తుంచుకోవాలి. మనమనుకొనే కొనే బాల్య వివహాలు వారి ఆయుర్దాయం ప్రకారం చుస్తే బాల్యవివాహాలను కోలేము. కారణం పెళ్లి చేసుకొన్న 15-20 సం|| పిల్లలను కని చనిపోయేవారు.

  బ్లగుల్లో ఎవ్వరు అపసవ్యంగా మాట్లడం లేదు. ఇప్పటివరకు వాస్తవాల కన్న రచనా శైలి మీద పేరుప్రఖ్యాతులు తెచ్చుకొని, రచయితలమంటూ డంకా బజాయించే వారి పుస్తకాల్ను చదివి. మీరు బ్లాగులలో మొదటిసారిగా మాలంటివారివి అభిప్రాయాలను చదివినపుడు మీకు కొత్తగా అలా అనిపించటం లో పెద్ద తప్పేమిలేదు.

 19. >>>>>
  ఆదేశాలను చూస్తే వ్యక్తిగత స్వేచ్చ అనేది చాలా ముఖ్యమైనట్లు గా ప్రజలు భావిస్తారు. అక్కడ నాలుగేళ్లు ఉంటే అర్థమౌతుంది. వారు రూపొందిచుకొన్న చట్టాలు వాటిని పరిరక్షిస్తూంటాయి.
  >>>>>
  ఇండియాలో కూడా వ్యక్తిగత స్వేచ్ఛ పేరు చెప్పే మార్క్సిజంని వ్యతిరేకిస్తారు. వ్యక్తిగత స్వేచ్ఛ గురించి మాట్లాడేవాళ్ళు శ్రమ దోపిడీ గురించి లేదా వర్గాల గురించి మాట్లాడరు, అంతే.

  ఇండియాలో స్త్రీవాదం పేరు చెప్పుకుంటే వోట్లు పడే పరిస్థితి లేదు. ఒక పత్రికవాళ్ళు ఒక గ్రామానికి చెందిన మహిళని ఇంటర్వ్యూ చేశారు. ఆ గ్రామంలో స్థానిక సంస్థల ఎన్నికల సమయంలో గ్రామంలో ఏయే కులాలవాళ్ళు ఎక్కువగా ఉన్నారో ఆయా కులాలవాళ్ళ దగ్గరకి వెళ్ళి మీ కులంవాళ్ళకి ఇది చేస్తాం, అది చేస్తాం అని చెప్పి వోట్లు వెయ్యించుకున్నారనీ, మహిళలకి మాత్రం ఏమీ చేస్తామని చెప్పలేదనీ ఆ మహిళ చెప్పింది. కులం, కట్నం లాంటి సాంఘిక దురాచారాలు పోకుండా ఉండేందుకు పాలక వర్గంవాళ్ళు ఎప్పుడూ తమ జాగ్రత్తలలో తాము ఉంటారు.

 20. వాసు గారూ,

  మీరు ప్రస్తావించిన అంశాలు ఒకదాని కొకటి కలిసి పోయి కలగా పులగంగా ఉన్నాయి. స్పష్టత కొరవడింది. నాకు అర్దం అయిన అంశాలకు సమాధానం ఇస్తాను.
  ప్రస్తుత సమాజం పురుషాధిక్య సమాజం అని చెబితే అది స్త్రీవాదం అనీ, దాన్ని ప్రోగ్రెసివ్ గా భావించి నేనూ రాజుగారూ తలకెత్తుకున్నామనీ మీరు భావిస్తున్నట్లుగా ఉంది. అది కరెక్టు కాదు.

  సమాజంలో ఉన్న పరిస్ధితులను బట్టే పురుషాధిక్య సమాజం అని భావించడం. స్త్రీ వాదం అనీ, ఫెమినిజం అనీ వ్యాప్తిలో ఉన్న భావాల్లో వాస్తవాలు ఉన్నపుడు అంగీకరించడంలో ఎవరికైనా అభ్యంతరాలు ఉండాల్సిన అవసరం లేదు.

  సమాజ పురోగమనానికి వ్యతిరేకంగా ఉండేవన్నీ ప్రగతి వ్యతిరేకంగా భావిస్తాం. అనుకూలంగా ఉండేవన్నీ ప్రగతీ శీలంగా భావిస్తాం. స్త్రీ వాదం లో కొన్ని ప్రగతిశీల భావాలు ఉన్నాయి. స్త్రీ పురుష సమానత్వాన్ని ఆ వాదం కాంక్షిస్తుంది. ఆ భాగం వరకూ అది ప్రగతిశీలం. ఆ వాదంలో కొన్ని పొరబాటు భావనలు ఏమన్నా ఉన్నట్లయితే వాటిని తిరస్కరించవచ్చు. పురుషాధిక్యత ను ఎదుర్కొనే క్రమంలో స్త్రీ వాద భావాలు జనించాయి. స్త్రీ వాదానికి వ్యవస్ధ మూలాలపైన, మూలాల పర్యవసానంగా ఏర్పడిన ఉపరితల భావాలపైనా సమగ్ర దృక్పధం లేనట్లయితే కొన్ని పొరబాటు భావనలు సహజంగానే జనిస్తాయి.

  పురుషాధిక్య సమాజం అన్న అవగాహన స్త్రీ వాదం నుండి వచ్చిన అవగాహన కాదు. అది వ్యవస్ధలో ఉన్న వాస్తవ పరిస్ధితుల నుండి వచ్చినది.

  సోషియాలజీ ప్రస్తుత సమాజాన్ని పితృస్వామ్య సమాజంగా భావిస్తుంది. పితృస్వామ్య సమాజం సహజంగానే పురుషాధిక్యతకు దారులు వేసింది. ఈ పరిస్ధితి ఈ నాటిది కాదు. గత నలభై, యాభై సంవత్సరాల నాటిది కాదు. రెండు మూడు శతాబ్దాల నాటిది కాదు. రెండు మూడు సహస్రాబ్దాల నాటిది కూడా కాదు. మానవ నాగరికత అభివృద్ధి చెందుతున్న దశలో, సంపదలు పోగుపడడం ప్రారంభించాక, ఆ సంపదలు ఒక వర్గం చేతిలో కేంద్రీకృతం అయ్యాక, పోగుపడ్డ సంపదలకు వారసులు అవసరమయిన దశలో పురుషాధిక్య సమాజం చారిత్రకంగా ఆవిష్కృతమయింది.

  ఈ ఆవిష్కరణ బానిస సమాజాల కంటె ముందు నాటిది. ఆర్ధిక వర్గాలు ఏర్పడుతున్న దశలో తలెత్తిన పరిణామం.

  ఈ అంశం గురించి మరి కొంచెం వివరణ పూర్తి స్ధాయి పోస్టు ద్వారా అందించడానికి ప్రయత్నిస్తాను.

  మీరు స్త్రీవాదం గురించీ, కధలు సాహిత్యం రాసి ఊరుకోకపోవడం గురించీ, చట్టంగా మార్చి అమలు చేయాలనుకోవడం గురించీ రాసింది పాక్షిక దృక్పధంతో కూడుకుని ఉంది. వివిధ అంశాలను మీరు చూస్తున్న పద్ధతిలో సమగ్రత లేదు. సమాజంలోని పరిస్ధితుల నుండి పుడుతున్న సాహిత్యాన్ని కేవలం స్త్రీ వాదుల వల్ల పుడుతున్న సాహిత్యంగా చూడడం, స్త్రీ పురుష సమానత్వం కోరుతూ ఉద్యమకారులు చేస్తున్న డిమాండ్లను, ఆ డిమాండ్లకి ప్రభుత్వాలు ఇస్తున్న స్పందనను ఓటు బ్యాంకు పాలిటిక్స్ గానూ చూడడం పాక్షిక పరిశీలన. చాలా చాలా ఇరుకు పరిశీలన అది. సామాజిక అంశాలను పరిశీలించేటప్పుడు, జడ్జి చేసేటప్పుడు సమాజంలో నెలకొని ఉన్న ఆర్ధిక, సామాజిక, రాజకీయ పరిస్ధితులన్నింటినీ పరిశీలనలోకి తీసుకోవలసి ఉండగా మీరలా చేయడం లేదు.

  స్త్రీలు పురుషులు సమాన స్ధాయిలో జీవించడానికి ఉపయోగపడే చట్టాలు వస్తే అవి మొత్తం సమాజానికి ఉపయోగంగా స్వీకరించాలి తప్ప స్త్రీల విజయంగా చూడడం సరికాదు. కుల రహిత సమాజం కోసం చట్టాలు వస్తే సమాజానికి ఉపయోగం. అలాగే లింగ వివక్ష లేని సమాజం కోసం చట్టాలు వస్తే అదీ సమాజానికీ ఉపయోగం. ఆ అంశాన్ని అలానే చూడాలి తప్ప స్త్రీ, పురుషుల మధ్య పోటీగా చూడడం సరికాదు.

  మీరు ప్రస్తావించిన ఉదాహరణలకి వస్తే:

  తన కంటె అధిక జీతం గలవాడే తనకి భర్తగా కావాలని ఒక అమ్మాయి భావిస్తే ఆ అమ్మాయి సామాజికంగా వెనకబాటు భావాలతో ఉన్నదని అర్ధం. ఆ భావన స్త్రీలకి మాత్రమే ఉందా? పురుషులకి లేదా? స్త్రీలు తన కంటె తక్కువ సంపాదించాలనీ, తక్కువ చదువుకోవాలనీ, తక్కువ ఎత్తు ఉండాలనీ పురుషులు భావించడం లేదా?

  ఇక్కడ మరో సంగతి. వయసులోనూ, సంపాదనలోను, ఎత్తులోనూ పురుషులే అధికంగా ఉండాలని భావించడం పురుషాధిక్య భావాజాలం కాదా? ఆ భావన స్త్రీలకి ఉన్నా పురుషులకి ఉన్నా ఇరువురూ సమాజంలోనే ఉంటున్నారు గనక, సమాజం పురుషాధిక్యతతో కూడుకుని ఉన్నది కనుక అందులో ఉండే వారంతా అవే భావాలు ఉండడానికి అవకాశం ఉంది గనుక వారలాగే ఉన్నారు. స్త్రీలలో సైతం పురుషుడే అధికంగా ఉండాలన్న భావనలు ఉన్నాయని మీరిక్కడ గుర్తించారు. అది పురుషాధిక్య భావాజాలమే.

  ఈగో ఘర్షణ అన్నది స్త్రీ, పురుషుల మధ్యనే ఉందా? స్త్రీకీ స్త్రీకీ మధ్యా, పురుషుడికీ పురుషుడికీ మధ్యా లేవా? ఒక చోట, అది ఆఫీసు కావచ్చు, మరో పని స్ధలం కావచ్చు, లేదా ఇల్లు కావచ్చు, ఉన్నపుడు అక్కడ ఉన్న పరిస్ధితులకి అనుగుణంగా ఈగో ఘర్షణ, పోటీ లు తలెత్తుతాయి. దానిని తెచ్చి ఒక్క స్త్రీ పురుషుల మధ్యనే ఉన్నట్లూ, లేదా భార్యా భర్తల మద్యనే ఉన్నట్లూ ఎలా చెబుతున్నారు?

  భార్యా భర్తలు ఇరువురూ సమానమేననీ, పరస్పరం ఒకరినొకరు గౌరవించకుంటూ ఉన్నపుడే సమస్యలు లేకుండా జీవించగలమనీ ఇరువురూ గుర్తించాలి. అలా గుర్తించకపోవడమే సమస్య. ఆ సమస్య ప్రధానంగా పురుషాధిక్య భావాజాలం వల్ల సంభవిస్తోంది. స్త్రీలు సమానత్వం కోరుకున్న సందర్భాల్లో ప్రధానంగా ఘర్షణలు తలెత్తుతున్నాయి. ఘర్షణ నివారించాలంటే స్త్రీ పురుష సమానత్వం నెలకోనే పరిస్ధితులు ఏర్పడాలి. అలా సమాన పరిస్ధితులు ఏర్పడడం ఒకనాటితో జరిగేది కాదు. మొత్తంగా సమాజంలో కొన్ని వర్గాల ఆర్ధిక ఆధిపత్యం అంతం కావాలి. అలా అంతమయినపుడు సమాజంలో కూడా ప్రజాస్వామిక భావనలు వెల్లివిరుస్తాయి. స్త్రీ పురుష సమానత్వం అన్నది ప్రజాస్వామిక భావనలలో ముఖ్య మైన భాగం.

  స్త్రీ, పురుషుల మధ్య ఉన్నది వైరుధ్యం. పోటీ కాదు. అది కూడా మిత్ర వైరుధ్యం. శత్రువైరుధ్యం కూడా కాదు, శత్రువైరుధ్యం అంటే వైరుధ్యాంశాలలో ఒకటి నశిస్తేనే పరిష్కారం అయ్యేది. భార్యా భర్తల్లో లేదా స్త్రీ, పురుషుల్లో ఎవరు నశించినా సమాజం మనుగడ ఉండదు. మిత్ర వైరుధ్యం అంటే పరస్పరం చర్చల ద్వారా, స్నేహ పూరిత అవగాహన ద్వారా పరిష్కారం అయ్యేది. స్త్రీ పురుషుల మధ్య ఉన్నది మిత్ర వైరుధ్యం కనుక ఆ వైరుధ్యం పరస్పర అవగాహన ద్వారా పరిష్కారం అవుతుంది. స్నేహ పూర్వకం అవగాహనకు బదులు సంబంధాలను శత్రుపూరితంగా తయారు చేసుకోవడం ఆ నిర్ధిస్ట వ్యక్తుల అవగాహనారాహిత్యం వల్లా, వ్యక్తిగత బలహీనతల వల్లా సంభవిస్తుంది. అటువంటి వారిని జనరలైజ్ చేసి మొత్తం సమాజం అలానే ఉందని చెప్పడం పాక్షిక దృక్పధం.

  మీరు చివరి పేరాలో పేర్కొన్నవన్నీ వైరుధ్యాలు. పరిష్కరించుకోదగ్గవి. వైరుధ్యాలను శత్రుపూరితంగా, పోటీగా ఎంచితే ఇలాగే పొరబాటు భావనలు ఏర్పడడానికి అవకాశం ఉంటుంది.

 21. ఈ కామెంట్ చర్చ మొదలెట్టినప్పటి నుండి చూస్తున్నాను.

  చాలా స్పష్టమైన అభిప్రాయం విశేఖర్ గారి నుండి పై అభిప్రాయంలో వ్యక్తమైంది. 100 % నా అభిప్రాయం కూడా ఇదేనండి. పురుష ద్వేషం ఎలా కూడదో.. అలాగే పురుషులు కూడా స్త్రీ ద్వేషం పెంచుకోవడం సమాజానికి చాలా నష్టం. ఇంతవరకు పరిణామక్రమంలో..జరిగినవి వేరు.ఇప్పుడు స్త్రీలు-పురుషులు చాలా వాటిలో సమానస్థాయి. అవగాహనతో నడుచుకుంటే బాగుంటుంది తప్ప. విద్వేషాలు విరజిమ్ముకుని మాత్రం కాదు. పట్టణ నాగరికత,పట్టణ ప్రజల అవగాహన వేరు. గ్రామీణ ప్రాంత మహిళల సమస్యలు వేరు. రెంటికి లంకె పెట్టడం సమంజసం కాదు. చట్టాలు అనుకూలం గా ఉన్నంత మాత్రాన పూర్తిగా స్త్రీల పై హింస,వగైరా లేవనుకోవడం గ్రుడ్డితనం. రచయిత్రుల శైలి వల్ల చదువరులు ఎక్కువ పుస్తకాలు చదువవచ్చు. ఆలోచనా విధానం పెరిగి స్త్రీ తన గురించి తను తెలుసుకునే స్థాయికి ఎదిగారు. అది అర్ధం అయితే చాలును.

 22. “మీ ఊరిలో మీరు పెరిగే సమయం లో నలుగురు మగరైతులు భార్య చేత పనులు చేయించుకొని పేరు ప్రఖ్యాతులు వారి ఖాతా లో వేసుకొన్నారని అంట్టున్నారు.”

  ఇలా అని రాజు గారు అనలేదే. ఆ మాటలు కాకపోయినా అలా ధ్వనించే విధంగా కూడా ఆయన అనలేదు. ‘వ్యవసాయ సమాజంలో పుట్టి పెరిగినవాడిగా’ అని ఆయన అన్నమాట వ్యవసాయ సమాజాన్నీ లేదా గ్రామీణ సమాజాన్ని తాను దగ్గర్నుండి చూశానని చెప్పడానికి వాడిన పదబంధం. దానర్ధం మీరు గ్రహించినది కాదు. ఆడవారి చేత పని చేయించుకుని పేరు ప్రఖ్యాతులు తన ఖాతాలో వేసుకున్నారని కాదు ఆయన అనడం. పురుషులతో సమానంగా, ఇంకా చెప్పాలంటే అంత కంటే ఎక్కువగా పని చేసినా ఆ శ్రమ గుర్తించుకు నోచుకోక పురుషుల శ్రమ మాత్రమే గుర్తింపుకు నోచుకుందని ఆయన చెప్పారు. గుర్తింపుకు నోచుకోనంత మాత్రాన స్త్రీలు అసలే శ్రమ చేయలేదని కాదని ఆయన చెప్పారు. స్త్రీలు చేసే గృహ శ్రమ కేవలం సొంత కుటుంబం కోసం చేసిన శ్రమగా మాత్రమే గుర్తింపు పొందితే, పురుషులు చేసే శ్రమ మాత్రం సమాజం/భార్యా బిడ్దల ఉద్ధరణ కోసం చేసిన శ్రమగా గుర్తింపు పొందినందువల్ల స్త్రీల శ్రమ లెక్కకు రాలేదని చెప్పారు.

  మీరు గుర్తించవలసిన మరొక అంశం యుద్ధాల వల్ల వీసమెత్తు సంపద కూడా సృష్టించబడలేదు సరికదా కొండల కొద్దీ సంపద కరిగిపోయింది. కాకపోతే ఒక చోటి నుండి మరొక చోటికి సంపద తరలిపోయి ఉండవచ్చు. కాని సృష్టించబడలేదు. సంపదల సృష్టి కేవలం శ్రమ వల్ల జరిగిందే. రాజుల విజయాలూ, యుద్ధాలు దానికి కారణం కాదు.

  ఉదాహరణకి ఆఫ్ఘన్, ఇరాక్ యుద్ధాలు తీసుకోండి. వాటి వల్ల అత్యధిక జిడిపి కలిగిన అమెరికా ఆర్ధిక వ్యవస్ధే కుంగిపోయింది. వాటివల్ల అమెరికా ఆర్ధిక సంక్షోభంలో కూరుకుపోవడమే కాక మొత్తం ప్రపంచ ఆర్ధిక వ్యవస్ధ కూడా సంక్షోభంలోకి జారిపోయింది. ఆ సంక్షోభాన్ని కార్మికవర్గంపైన రుద్ది పెట్టుబడిదారీ కంపెనీలు బయడపడ్డాయే తప్ప మొత్తంగా ఆర్ధిక వ్యవస్ధ ఇంకా సంక్షోభంలోనే ఉంది. యూరప్ రుణ సంక్షోభం, అమెరికా జిడిపి వృద్ధి నెమ్మదించడం, జపాన్ ప్రతి ద్రవ్యోల్బణం, చైనా, ఇండియాల్లో కూడా పడిపోయిన జిడిపి వృద్ధి…. ఇవన్నీ అందుకు తార్కాణాలు. కనుక యుద్ధాలు సంపదల సృష్టి కర్తలు కానే కాదు. వేల కొద్దీ సైనికులతో పాటు లక్షల కొద్దీ ప్రజల్ని అవి బలి తీసుకున్నాయి.

  ఈ కొజ్జాల వ్యవహారం, ఆయుర్ధాయం వ్యవహారం అంతు బట్టకుండా ఉంది.

  స్త్రీ వాద కధలు, రచనలు సమాజంలో ఉన్న పరిస్ధితులకి ప్రతిబింబాలు తప్ప అవే పరిస్ధితులు కాదు. తరతరాలుగా మగవారు సుఖ పడ్డారని ఎవరన్నారు? స్త్రీలు అణచివేతలకి గురవుతున్నారంటె దానర్ధం పురుషులు సుఖపడుతున్నారనా? సమాజంలో ఆర్ధిక దోపిడీ వల్ల మెజారిటీ ప్రజలు సుఖ సంతోషలు లేకుండా ఉన్నారు. శ్రమ చేసేవారు తాము సృష్టిస్తున్న సంపదలను అనుభవించలేని పరిస్ధితిలో ఉన్నారు. శ్రమ సాధనాలయిన భూమి, పరిశ్రమలు కొద్ది వర్గాలు గుప్పిట్లో పెట్టుకుని సంపదలని తమ వరకే పరిమితం చేసుకున్నారు. దాని వల్ల శ్రమ చేసే పురుషులు, స్త్రీలు ఇద్దరూ నష్టపోతున్నారు. పురుషాధిక్యత వల్ల స్త్రీలు ఆర్ధికంగానే కాక అదనంగా సామాజిక అణచివేతకి కూడా గురవుతున్నారు. ఈ అవగాహనని అర్ధం చేసుకున్నాక మీరు దానిపైన విమర్శలు చేస్తే అర్ధవంతంగా ఉంటుందనుకుంటాను.

 23. వాసుగారూ,
  విశేఖర్ గారు ఇంత సుదీర్ఘ వివరణ ఇచ్చాక నేను మళ్లీ చర్చలో పాల్గొనవలసిన అవసరం లేదనుకుంటూనే మీరు ప్రస్తావించిన కొన్ని అంశాలపై స్పందిస్తున్నాను.

  “మీ ఊరిలో మీరు పెరిగే సమయంలో నలుగురు మగరైతులు భార్య చేత పనులు చేయించుకొని పేరు ప్రఖ్యాతులు వారి ఖాతా లో వేసుకొన్నారని అంటున్నారు”

  నేను పై విధంగా స్పందించలేదనుకుంటున్నాను. గ్రామీణ సమాజంలో స్త్రీ పురుషుల మధ్య శ్రమ విభజన నేను పుట్టి పెరిగిన కాలంలోనే కాదు.. శతాబ్దాలుగా రూపంలో మార్పులతో ఇలాగే కొనసాగుతోంది. పురుషాధిక్యత లేదా పితృస్వామిక సమాజం అంటూ పదాలు వాడటం అభ్యంతరం అనుకుంటే కొనసాగుతున్న సమాజమే స్రీపురుష సంబంధాలను అలా నిర్దేశించింది. మన ఇష్టాఇష్టాలకు అతీతంగా సమాజ చట్రం ఇలాగే కొనసాగినంతకాలం మనుషుల సంబంధాలు ఇలాగే కొనసాగుతాయి కూడా.

  “ఆరోజుల్లో మహిళను తీవ్రంగా అణచివేశారని హోరెత్తించే మన తెలుగు రచయితలు, మగవారిని కొజ్జాలుగా చేసి, రాజస్థానాలలో పని చేయటానికి వేరే దేశాలవారికి అమ్మేవారని ఎన్ని పుస్తకాలలో రాశారు?”

  మీరే చెప్పండి.. ఇందుకు మనం ఎవరిని తప్పుపట్టాలి? మహిళలను తీవ్రంగా అణిచివేశారని హోరెత్తిస్తున్న వారు ఇందుకు కారణం కాదు కదా..

  “1940 సం||లో మగవారి యావరేజ్ జీవితకాలం 38సం|| లని గుర్తుంచుకోవాలి. మనమనుకొనే బాల్య వివాహాలు వారి ఆయుర్దాయం ప్రకారం చూస్తే బాల్యవివాహాలను కోలేము.”

  దయచేసి మీరొకసారి గురజాడ అప్పారావు గారి ‘కన్యాశుల్కం’ నాటకం తప్పకుండా చదవండి. పదేళ్ల వయసు దాటని ఆడపిల్లలను పండుముదుసలి తాతలకు ఇచ్చి పెళ్లి చేయించిన అమానుష వ్యవస్థను తూర్పారబట్టిన గురజాడ వారి “కన్యక’ గేయాన్ని ఒకసారి చదవండి. వందేళ్ల క్రితం తెలుగు సమాజంలో ప్రత్యేకించి కొన్ని కులాల్లో కొనసాగిన కన్యాశుల్కాన్ని, బాల వితంతు జీవితాలను మనం ఏ కోణంలోంచి చూసినా సమర్థించలేము కదా. సమాజం ఇక భరించలేని స్థాయికి చేరుకున్నాయి కాబట్టే ఇవి సాంఘిక దురాచారాలుగా ముద్రించబడి వాటిని తొలగించే సంస్కరణలు సమాజం ఉనికిలోకి వచ్చాయి. స్త్రీ పురుషుల ఆమోద, వ్యతిరేకతలతో పనిలేకుండా సమాజ పరిమాణంలో అనివార్యంగా చోటుచేసుకున్న మార్పులివి. వీటిని ఇలాగే అర్థం చేసుకుంటే బాగుంటుంది.

  “బ్లాగుల్లో ఎవ్వరు అపసవ్యంగా మాట్లాడటం లేదు…… బ్లాగులలో మొదటిసారిగా మాలాంటివారివి అభిప్రాయాలను చదివినపుడు మీకు కొత్తగా అలా అనిపించటంలో పెద్ద తప్పేమిలేదు…”

  దీన్ని వ్యక్తిగతంగా తీసుకోవద్దండీ. మనం అభిప్రాయాలను పంచుకుంటున్నాము. ఆ క్రమంలో విభేదిస్తున్నాము. ఇది దీర్ఘకాలం కొనసాగే చర్చే.. బ్లాగుల్లో మొదటిసారిగా ఇలాంటి అభిప్రాయాలు చూడటం లేదు. గత మూడు నాలుగేళ్లుగా ప్రత్యేకించి సాఫ్ట్‌వేర్ రంగంలో పనిచేస్తున్న వారు వ్యక్తీకరిస్తున్న ఇలాంటి అభిప్రాయాలను చూస్తూనే ఉన్నాను. ఇవి కొత్తవేం కాదు. కొన్ని ఆధునిక రంగాల్లో పనిచేస్తున్న వ్యక్తుల వైవాహిక, వ్యక్తిగత జీవితాలలో ఏర్పడుతున్న తీవ్రమైన ఒత్తిడులు, శతృవైరుధ్య పూరితంగా మారుతున్న సంబంధాల గురించిన వార్తలను క్రమం తప్పకుండా చూస్తూనే ఉన్నాను. ఆధునిక మహిళల్లో కూడా పెరుగుతున్న పితృస్వామిక భావజాలం ఫలితంగా కుటుంబజీవితంలో ఏర్పడుతున్న కొత్త కొత్త ఘర్షణలు, తీవ్ర పర్యవసానాలను సానుభూతితోనే అర్థం చేసుకోవాలి. కానీ.. సమస్యను చూసే కోణంలోనే మనం విభేదిస్తున్నాము.

  చివరగా, స్త్రీపురుష సంబంధాలు నేటికీ ఆస్తి, అంతస్తు, కులం, వర్గం వంటి ప్రాతిపదికలమీదే ఏర్పడుతున్నప్పుడు వాటి ప్రభావాలు ప్రతి కుటుంబాన్ని వెంటాడతాయి. ఈ రకం ప్రాతిపదికలు జీవితాన్ని నిర్దేశించడం కొనసాగినంతవరకు స్త్రీపురుష సమానత్వం మాట అటుంచి ఇలాంటి ఘర్షణలనుంచి తప్పించుకోవడం మన సమాజంలో ఎవరికీ సాధ్యం కాదు.

  దీనిపై చర్చించేందుకు ఇది వేదిక కాదు.

 24. రాజు గారు, బహుశా మీరూ నేను ఒకే సమయంలో స్పందించినట్లున్నాము. ఫర్వాలేదు. వివిధ కోణాల్లో స్పందించాం కనుక రెండు స్పందనలూ ఉంటాయి.

 25. శేఖర్,
  మీరు చెప్పిన దానితో పెద్దగా విభేదించే పనిలేదు. మీరు చెప్పింది ఒక సమూహన్ని దృష్ట్టిలొ పెట్టుకొని అన్వయిస్తే ఉపయోగపడుతుందేకాని, వ్యక్తులకు ఉపయోగపడదు. ఒకప్పుడు వ్యవస్థ వలన అతి తక్కువశాతం నష్ట్ట పోయేవారు ఉండేవారు. ఇప్పుడు వారి సంఖ్య పెరుగుతున్నాది. నేను రాసే వ్యఖ్యలు మధ్య తరగతి ని, పట్టణ వర్గాలను దృష్ట్టిలో ఉంచుకొని రాస్తున్నాని గమనించాలి. ఈ రోజులలో కుటుంబానికి ఒకరు లేక ఇద్దరు పిల్లలు. అందులో ఒక్క మగవారి జీవితం దెబ్బతిన్నా, ఆ వంశం అంతటితో సమాప్తం అయిపోతుందని గమనించాలి. ఈ ఇంటర్నేట్ యుగంలో,ఆ విషయం ఇతరుల మీద చూపించే ప్రభావం ఎంతో ఉంట్టుంది.

  * పురుష ద్వేషం ఎలా కూడదో..*

  మీరైతే మాత్రం ఆడవాళ్ళు అందరు “మానవి” లా ఎదగాలని.. “మొగుడి మొహం పై” ..తన్ని దైర్యంగా,విశ్వాసంగా బ్రతకాలని నా అభిప్రాయం 🙂
  మగవారు మాత్రం “పురుషులు కూడా స్త్రీ ద్వేషం పెంచుకోవడం సమాజానికి చాలా నష్టం.” అని రాస్తున్నారు. :)))

  వనజా గారు,

  మీరు జిలేబి బ్లాగులో శ్రీనివాస్ చాలా చక్కగా వ్యఖ్యలు రాసానన్నారు. ఇక్కడ మాత్రం శేఖర్ గారి తో 100% ఏకీభవిస్తున్నారు.
  మీరు ఈ మధ్య nEను రాసిన వ్యఖ్యలు చదువుతున్నారే గాని ఖండించటంలేదు 🙂

  ____________________________

  శేఖర్ గారు, ఇక్కడ కొన్ని విషయాలు చర్చించినా, నేను రాసినవి మిమ్మల్ని దృష్ట్టిలొ ఉంచుకొని, నా వ్యఖ్యలు మీరు ప్రచూరించే విధంగా రాయటం జరిగింది. వాస్తవానికి మీరు
  నన్నడిగిన సంపద సృష్టిలో స్త్రీల కాంట్రిబ్యూషన్ ఏమిటన్న ప్రశ్న సరైన ప్రశ్నేనా? ఒకసారి ఆలోచించండి అన్నరు, నేనైతే అది సరి అయిన ప్రశ్నగానే అనుకొంట్టున్నాను. నేను కొన్ని స్రీ సాహిత్య పుస్తకాలు చదివాను, వారు ఎప్పుడు మగవారి పై ఎన్నో నిందలు వేస్తూ పాత్రలు సృష్ట్టిట్టిస్తారు, రోజు వారి జీవితంలో జరిగే సంఘటనలు సహజత్వానికి చాలా దగ్గరగా చర్చిస్తారు. కాని వారు ఎక్కడ కూడా సంపద సృష్ట్టిలో ఆడవారి కంట్రిబ్యుషన్ అనేది మాత్రం ఇప్పటివరకు చర్చించినట్లు లేను ఎక్కడా చదవలేదు. మీకేమైనా తెలిస్తే చెప్పేది. ఇంతటి తో నేను నావైపు నుంచి చర్చను ముగిస్తున్నాను.
  Thanks for publishing my comments.

  Srinivas

 26. విశేఖర్ గారూ,
  ఇప్పుడే చూస్తున్నాను. హిందూ వివాహ చట్టంపై జాహ్నవి రచన. కింది లింకులో చూడగలరు.

  హిందూ వివాహ చట్రం
  – జాహ్నవి
  http://andhrajyothy.com/EditorialShow.asp?qry=2012/apr/15/edit/15edit4&more=2012/apr/15/edit/editpagemain1&date=4/15/2012

 27. శ్రీనివాస్ గారు..మీరే వాసు పేరు తో..వ్యాఖ్యలు వ్రాసారా? :))

  “మానవి” చదివితే.. మానవి లాగానే స్పందించాలి.ఎందుకంటే..పురుషులు అందరు సురేష్ వసంత ని వదిలేసి వెళ్ళినట్లు ,అన్యాయం చేసినట్లు చేస్తే.. అలాగే స్పందించాలి. మానవి నవల లోనే కాదు..నిజ జీవితం లో ఎవరైనా ప్రవర్తించితే..నేను అలాగే చెపుతాను. చేయని తప్పుకు జీవితాలని ముగించుకునే పిరికితనం కన్నా మనిషిగా నిలద్రోక్కు కుని బతకడం అవసరం కాదంటారా? మానవి లాటి స్త్రీలని మీరు వ్యతిరేకిస్తారా? సమస్యని

  పాజిటివ్ గా చూసినప్పుడు,నెగిటివ్ గా థాట్స్ ఎలా వస్తాయి ..చెప్పండి. ? తార లాటి వారిని, అక్రమ సంబందాన్ని ప్రశ్నించినదని ఒక భర్త క్రూరంగా,పకడ్బందీగా బయటికి తీసుకునివెళ్ళి చాకుతో చంపేసిన స్త్రీ సమస్యని ఒక గాటన కట్టగలమా ? చెప్పండి. స్త్రీల సమస్యలను వేరు వేరు సమస్యలయా..:) 😦

  ఇంతటితో..నేను నేను చర్చ ముగిస్తున్నాను.

  ప్రచురించిన మీకు ధన్యవాదములు

 28. రాజు గారూ, వ్యాసం చదివాను. స్త్రీ, పురుషుల సంబంధాలు, ప్రేమ సంబంధాలు, భార్త్యా భర్తల హక్కులు ఇలా కొన్ని సామాజిక విషయాలకి సంబంధించి ఆయన అభిప్రాయాలు ఆచరణ యోగ్యంగా కనిపిస్తున్నాయి. కాని గ్రామీణుల్లో స్త్రీల హక్కులకు సంబంధించి కొనసాగుతున్న పాత భావాలు పరిగణనలోకి తీసుకున్నట్లు కనపడలేదు. కేపిటలిజం కి ఉన్న క్షీణ స్వభావాన్ని అసలే పరిగణించ లేదు. భూస్వామ్య వ్యవస్ధ తో పోలిస్తే పెట్టుబడిదారీ వ్యవస్ధల్లో ఉండే ప్రగతి శీలతా, సోషలిస్టు వ్యవస్ధలతో పోలిస్తే పెట్టుబడిదారీ వ్యవస్ధ లో ఉండే ప్రగతి నిరోధకత్వం ఆయన విశ్లేషణలో స్పష్టంగా కనిపిస్తోంది. తన ముందరి వ్యవస్ధతో పోల్చినపుడు పెట్టుబడిదారీ వ్యవస్ధ సాధించిన ప్రగతి శీలతను ఆయన అందిపుచ్చుకున్నప్పటికీ, పెట్టుబడిదారీ వ్యవస్ధ ను దాటి ఆలోచించలేని ప్రగతి వ్యతిరేకత జాహ్నవి విశ్లేషణలో కనిపిస్తోంది.

 29. విశేఖర్ గారు చెప్పినది నిజమే. పెట్టుబడిదారీ వ్యవస్థ వస్తే భర్త చనిపోయిన స్త్రీల విషయంలో మూఢ నమ్మకాలు పోయి విధవా వివాహాలకి సామాజిక ఆమోదం వస్తుందన్నారు. కానీ ఇప్పుడు కూడా, పట్టణ ప్రాంతాలలో కూడా విధవా వివాహాలు చేసుకునేవాళ్ళ సంఖ్య తక్కువగానే ఉంది. డబ్బు సంపాదించడం విషయంలో మాత్రమే ఆధునికతని అంగీకరిస్తారు కానీ వ్యక్తిగత భావజాలం విషయంలో ఆధునికతకి వ్యతిరేకమైన పాత భూస్వామ్య సంప్రదాయాలనే నమ్ముతారు.

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

Connecting to %s