“వందే మాతరం” -చెరబండరాజు కవిత


vandemaataram

(యు.పి లో ఒకే రోజు జరిగిన నాలుగు అత్యాచారాల విషయమై రాసిన పోస్టు కి రాజశేఖర రాజు గారు అద్భుతమైన స్పందన పోస్ట్ చేసారు. ప్రముఖ విప్లవ కవి ‘చెరబండ రాజు’ రాసిన కవితను సందర్భ శుద్దిగా ప్రస్తావించిన రాజు గారికి కృతజ్ఞతలు తెలియజేస్తూ ఆయన వ్యాఖ్యని యధా విధిగా ఇస్తున్నాను. చెరబండరాజు కవితకి ఇప్పటికీ ఎంత ప్రాధాన్యం ఉన్నదో కవిత చదివితే ఇట్టే అర్ధం అవుతుంది. దేశ భక్తి పరులు నిజంగా ఆలోచించవలసిన అంశాలు ఈ కవితలో మనకు వెక్కిరిస్తూ కనపడతాయి. -విశేఖర్)

చెరబండరాజు మండే కలంతో రాసిన ‘వందేమాతరం’ కవిత గుర్తొస్తోంది.


ఓ నా ప్రియమైన మాతృదేశమా
తల్లివి తండ్రివి దైవానివి నీవేనమ్మా
దుండగులతో పక్కమీద కులుకుతున్న శీలం నీది
అంతర్జాతీయ విపణిలో అంగాంగం తాకట్టు పెట్టిన అందం నీది
సంపన్నుల చేతుల్లో మైమరచి నిద్రిస్తున్న యవ్వనం నీది
ఊసినా దుమ్మెత్తి పోసినా చలనం లేని మైకం నీది
కోతకొచ్చిన చేనులో కలుగులు తవ్వుతున్న
ఎలకల్నీ పందికొక్కుల్నీ భరిస్తూ నించున్న “భారతి” వమ్మా
నోటికందని సస్యశ్యామల సీమవమ్మా
వందేమాతరం వందేమాతరం

ఒంటి మీద గుడ్డలతో జండాలు కుట్టించి
వివస్త్రవై ఊరేగుతున్న ధైర్యం నీది
అప్పుతెచ్చి వేసిన మిద్దెల్లో
కాలు గాలిన పిల్లిలా తిరుగుతున్న దీనత్వం నీది
ఎండిన స్తనాలమీదికి ఎగబడ్డ బిడ్డల్ని
ఓదార్చలేని శోకం నీది
ఆకలికి ఎండి మాడి ఎరువు సొమ్ములతో
వీధిన బడ్డసింగారం నీది
అమ్మా భారతీ నీ గమ్యం ఏమిటి తల్లీ
వందేమాతరం వందేమాతరం.

“మాతృదేశం పై విపరీతమైన ప్రేమ అనురాగం ఉన్న వ్యక్తే ఇటువంటి పోలికలు ధైర్యంగా చెప్పగలడు. భారతమాతకి “దైవత్వం” ఆపాదించి, ఆ దైవత్వం ఒక ప్రతీకగా వాడాడు చెరబండరాజు. ఆ దేవత అందం, యవ్వనం, ముఖ్యంగా శీలం గురించి జుగుప్స కలిగించే మాటలు వాడుతాడు.”

ఈ కథనం ప్రధానాంశానికి ఈ కవిత సందర్భం సరిపోదేమో కాని, వేల సంవత్సరాల మనుగడ కలిగిన మన ఘనతర సంస్కృతి పోకూడని మార్గాలలోకి వెళ్లిపోతోందేమో అనిపిస్తోంది. పసిపిల్లలతో కుతి తీర్చుకోవడం.. తల్చుకోవడానికే పరమ జుగుప్సాకరంగా ఉన్న ఈ కథనం సారాంశాన్ని చూస్తుంటే ఒళ్లు జలదరిస్తోంది. వేల సంవత్సరాల నాటి రక్తపూజలూ, చంద్రగ్రహయాత్రలూ పక్కపక్కనే ఉనికిలో ఉంటున్న దేశం ఇలా తప్ప మరోలా ఉండదేమో…

మీకు ఒక చిన్న అభ్యర్థన. రేప్ అనే ఆంగ్ల పదాన్ని చాలా తరచుగా వాడుతున్నట్లున్నారు.మీరు. దశాబ్దాలుగా స్త్రీవాదులలో ప్రపంచవ్యాప్తంగా దీనిపై చర్చ జరుగుతున్నట్లుంది. పితృస్వామ్య ఆధిపత్య సంస్కృతిలో బాగా వల్గరైజ్ చేయబడి పురుషుడి అహానికి ప్రతీకగా వాడుకలో ఉన్న రేప్ పదాన్ని ఉపయోగించవద్దని 90లలోనే తెలుగులో స్త్రీవాద సాహిత్యంలో తీవ్రంగా చర్చ జరిగింది. అత్యాచారం అనే పదాన్నే అప్పటినుంచి ఎక్కువగా ఉపయోగిస్తున్నట్లుంది. రెండు పదాలు ఒకే అర్థం ఇస్తున్నా సరే రేప్ అనే పదాన్ని వాడకుంటేనే బాగుంటుందని నా సలహా..

అత్యాచారాలను కూడా వర్గ దృష్టితోనే ప్రాధాన్యత ఇవ్వవలసి ఉంటుంది. పబ్ సంస్కృతిలో భాగంగా జరుగుతున్న అత్యాచారాలను, ఈ కథనంలో మీరు ప్రస్తావించిన రకం అత్యాచారాలను వేరు చూసి చూడాల్సి ఉంటుంది. అత్యాచారాల రిపోర్టింగులో కూడా మనం ఎన్డీటీవీలనుంచి వేరుపడాలి.

9 thoughts on ““వందే మాతరం” -చెరబండరాజు కవిత

  1. కొన్నిటిని ” నగ్న సత్యాలు” అంటారని, గతం లో విన్నాను

    just ఇప్పుడే ఇక్కడే చదివాను…

    సత్యం పెను భారంగా ఉంది,

    కాని

    తప్పించ లేనిదో

    తప్పించికో లేనిదో

    తెలియనిది

    మొత్తానికి తప్పనిది

    అని మాత్రం తెలిసినది

    ?!

  2. విశేఖర్ గారూ,
    నా చిన్ని వ్యాఖ్యను ఒక పోస్ట్‌గా గౌరవించి ప్రచురించినందుకు కృతజ్ఞతలు. ఈ సందర్భంగా చెరబండరాజు వందేమాతరం గీతంతో పాటు మూడు ఆధునిక ప్రార్థనా గీతాలు గురించి ఈమాట.కామ్ 2005 సెప్టెంబర్ సంచికలో శ్రీ వేలూరి వేంకటేశ్వరరావు గారు ఒక ప్రామాణిక రచన చేశారు.

    మూడు “ప్రార్థన” పద్యాలు
    http://www.eemaata.com/issue39/praarthana_padyaalu.html

    వేటికవిగా పోటీ పడుతున్న ఈ అద్భుత గీతాలను లేదా కవితలను నిజమైన దేశభక్తిపరులందరూ తప్పక చదవాలి. మీ పరిశీలన కోసం ఈ లింకును ఇక్కడ వ్యాఖ్యగా ఇస్తున్నాను.

    “ఆగస్టు 15 విద్రోహాన్ని గురించి చెప్పక పోతే అన్నం సయించదు నాకు” అంటూ జీవిత పర్యంతమూ ప్రజలకోసం రాసి పాడిన చెరబండరాజు మహత్వ గీతం అయిన వందేమాతరంని 80ల మొదట్లోనే 16 భారతీయ భాషల్లోకి అనువదించారు.

    వేలూరి గారి వ్యాసాన్ని చూడకపోతే మీరూ తప్పకుండా పై లింకులో చదవండి.

  3. రాజు గారూ, మీకు ఎలా కృతజ్ఞతలు చెప్పాలో తెలియడం లేదు. అద్భుతమైన వ్యాసాన్ని నాకు పరిచయం చేశారు. ఇప్పటికి మూడు సార్లు చదివినా తృప్తిగా అనిపించడం లేదు. చదివిన ప్రతిసారీ కొత్తగా కళ్లు తెరిచినట్లు అనిపిస్తోంది. మునుముందు ఇంకా చాలా సార్లు ఈ వ్యాసాన్ని చదవాలని
    నిర్ణయించుకున్నాను.

    చివరి ‘ప్రార్ధనా గీతం’ గురించి రచయిత వేలూరి వెంకటేశ్వరరావు గారు రాసిన పరిచయం ఎంత సత్యమో కదా? చాలా సాధారణ పదజాలంలో సమున్నతమైన అర్ధాన్ని పొదిగారాయన. మూడు గీతాలు ఒకదానిని మించి మరొకటి సందేశాత్మకంగా ఉన్నాయి. గీతాలు ఒక ఎత్తయితే, కవులకి ఇచ్చిన పరిచయం, సమర్ధన, వివరణ మరొక ఎత్తు.

    ఓ కోరిక. ఈ వ్యాసాన్ని నా బ్లాగ్ లో మళ్ళీ ప్రచురించుకోవచ్చా? దానికి ఎవరిని అనుమతి కోరాలి? చెప్పగలరా?

  4. విశేఖర్ గారూ, కవిత్వం మాట నాకొద్దు బాబోయ్ అని గిరిగీసుకు కూర్చున్న వాళ్లను కూడా లాగి పట్టి కదిలించగల, రగిలించగల గొప్ప కవితలు ఇవి. చదివిన ప్రతిసారీ కొత్తగా కళ్లు తెరిచినట్లు అనిపిస్తోంది కదూ.. ఈ ఆరేళ్ల కాలంలో కనీసం వందసార్లు పైగానే చదివి ఉంటాను ఈ వ్యాసాన్ని. ఇప్పుడు చదువుతున్నప్పటికీ అదే ఉద్వేగం, అదే ఉత్తేజం నాకు. కొన్ని వ్యక్తీకరణలను మాటల్లో చెప్పడం కంటే చదువుతూ అలా అనుభూతి చెందవలసిందే మరి. మీ ఆస్వాదనకు అభినందనలు. మీ మిత్రులందరికీ దీన్ని పరిచయం చేయండి.

    ఈమాట.కామ్ ప్రముఖ ఆన్‌లైన్ వెబ్‌సైట్ కాబట్టి బహుశా వారు పునఃప్రచురణకు అంగీకరించకపోవచ్చు. అంగీకరించకపోయినా ఫర్వాలేదు ఒక అమూల్య రచన మనకు అందుబాటులో ఉంది కదా. ఈ లింకును మీరు భద్రపర్చుకుంటే చాలు. శాశ్వతంగా మన వద్దే ఉంటుందిది.

    సంతోషంతో..

  5. నేను రూపొందించిన కొత్త బ్లాగులో కూడా నాకు బాగా నచ్చిన అద్భుతమైన కథనాల లింకులను, వీలయితే వ్యాసాలను కూడా వివిధ కేటగిరిలలో ప్రచురిస్తూ రావడానికి ఇదే కారణం. అరుదైన, కాంతివంతమైన రచనలన్ని మన కళ్లముందే, మన బ్లాగులో లింకుల రూపంలో, ప్రచురణ రూపంలో అందుబాటులో ఉంటే ఎంత బాగుంటుంది. మర్చిపోతే మళ్లీ దొరకని అద్భుత రచనలను ఇలాగే మనం భద్రపర్చుకోవచ్చు.

  6. అవునవును. మీ కృషి అభినందనీయం. మీరు దాచి పెట్టిన లింకుల్ని అర్జెంటుగా చూడాలనిపిస్తోంది. వీలు చూసుకుని ఆ పని మొదలెడతాను.

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

Connecting to %s