ఫుకుషిమా రేడియేషన్ అమెరికా, యూరప్ ల వరకూ వ్యాపించింది


Fukushima jet streamమార్చి 11, 2011 తేదీన జపాన్ లోని ఫుకుషిమా దైచి అణు కర్మాగారం సునామీ తాకిడికి ప్రమాదానికి గురయిన సంగతి తెలిసిందే. ఈ ప్రమాదం వల్ల రేడియేషన్ సోకి ఉంటుందన్న అనుమానంతో జపాన్ ఎగుమతులను చాలా దేశాలు నిషేదించాయి. కూరగాయలు, చేపలు లాంటి ఉత్పత్తులని దిగుమతి చేసుకోవడాన్ని నిలిపివేశాయి. దానితో జపాన్ ఆర్ధిక వ్యవస్ధ ప్రభావితం అయింది. అప్పటికే ‘ప్రతి ద్రవ్యోల్బణం’ తో సతమతమవుతున్న జపాన్ ఫుకుషిమా వల్ల మరోసారి మాంద్యం ప్రమాదాన్ని ఎదుర్కొంటోంది.

ఫుకుషిమా ప్రమాదం జరిగాక తమిళనాడు లో రష్యా సహాయంతో నిర్మిస్తున్న ‘కుదంకుళం’ అణు కర్మాగారం ప్రారంభం కావడానికి అక్కడి ప్రజలు వ్యతిరేకిస్తున్నారు. ఎన్.జి.ఓ సంస్ధ ఆధ్వర్యంలో వారు ఆందోళనలు నిర్వహిస్తున్నారు. కుదంకుళం తో పాటు తమిళనాడులో ఉన్న మరో రెండు అణు కర్మాగారాల వల్ల తమకు కూడా ప్రమాదమేనంటూ శ్రీలంక మంత్రి నిన్న ప్రకటించాడు. ఈ కర్మాగారాలపైనా ఐ.ఏ.ఇ.ఏ (ఇంటర్నేషనల్ ఆటామిక్ ఎనర్జీ ఏజన్సీ) కి ఫిర్యాదు చేస్తామని ఆయన ప్రకటించాడు. తమ భయాలకు కారణం ఫుకుషిమా, చేర్నోబిల్ ప్రమాదాలేనని ఆయన తెలిపాడు.

ఫుకుషిమా ప్రమాదం వల్ల విడుదలయిన రేడియేషన్ అమెరికా, యూరప్ ల వరకూ విస్తరించిందని నిపుణులు ప్రకటించారు. అయితే అమెరికా వరకూ ఫుకుషిమా రేసియేషన్ వ్యాపించవచ్చని హెచ్చరిక మాత్రమే చేశారనీ, యూరప్ వరకూ రేడియేషన్ విస్తరించిందనడం సత్య దూరమని మిత్రుడొకరు వ్యాఖ్యానించారు. అందువలన ఆ అంశానికి సంబంధించి మరిన్ని వివరాలు ప్రస్తావించడం సముచితంగా ఉంటుంది.

ఫుకుషిమా లో రేడియేషన్ విడుదల కొనసాగుతున్న సంగతిని కార్పొరేట్ పత్రికలు చెప్పడం లేదు. జనవరి 1 న మరో చిన్నపాటి భూకంపం సంభవించాక ఫుకుషిమాలో రేడియేషన్ విడుదల ఎక్కువైందని చెబుతున్న ఈ వార్త చూడండి. దీని ప్రకారం గత సంవత్సరం నవంబరు నెలలో మొత్తం ముప్ఫై రోజుల్లో 347.7 Bq/m2 (బెక్యూరల్స్/చదరపు మీటర్) రేడియేషన్ నమోదు కాగా ఒక్క జనవరి 2, 3 తేదీల్లోనే 558.1 Bq/m2 నమోదయింది. ఇక్కడ అర్ధం చేసుకోవలసిన విషయం ఏమిటంటే, ఫుకుషిమా అణు రియాక్టర్ల నుండి రేడియేషన్ విడుదల అరికట్టామని జపాన్ ప్రకటించినా, వాస్తవంలో అది ఆగలేదు. ఇంకా లీక్ అవుతూనే ఉంది. అలా విడుదలవుతున్న రేడియేషన్ నలుమూలలకీ విస్తరిస్తూనే ఉంది. అది వాతావరణంలో పేరుకు పోయి ప్రభావం కలగ జేస్తూనే ఉంది. మరీ ముఖ్యంగా అది దేశ దేశాలకి ప్రయాణిస్తూనే ఉంది.

అదే వెబ్ సైట్ లో ఒక జపనీయుడు ట్విటర్ లో పోస్ట్ చేసిన గ్రాఫ్ ల ని ప్రచురించారు. ఆ లింక్ ఇదే. రేడియేషన్ విడుదల, మంచు స్ధాయి, గాలి వేగం లను సూచించే గ్రాఫ్ లు అవి. బహుశా ఎకాలజిస్టులు ఈ గ్రాఫ్ లను వివరించగలరేమో.

జనవరి 17 తారీఖున ఫిన్లాండ్ పబ్లిక్ టేలివిజన్ ఓ ప్రకటన చేసింది. ఫిన్నిష్ అడవుల్లో స్వల్ప మొత్తంలో రేడియేషన్ గుర్తించినట్లు ఆ ప్రకటన తెలియజేసింది. సదరు రేడియేషన్ ఫుకుషిమా ప్రమాదం వల్ల విడుదలయిన రేడియేషనే అని టి.వి తెలిపింది. ఫంగై జాతి మొక్కల్లో (lichens, fungi,  లేడి, దుప్పి జాతుల జంతువుల మాంసంలోనూ (elk, reindeer meat) సీసియం-134, సీసియం-137 ల రేడియేషన్ కనుగొన్నట్లు ప్రకటనలో పేర్కొంది. ఫిన్నిష్ భాషలో ఉన్న ప్రకటనని గూగుల్ ట్రాన్స్ లేటర్ ద్వారా అనువదించి ఆంగ్ల వెబ్ సైట్ లు ప్రచురించాయి. మెషీన్ అనువాదం కావడం వల్ల కాబోలు, కొన్ని వాక్యాలు అర్ధ వంతంగా లేవు. ఆ ప్రకటనను ఇక్కడ చూడవచ్చు.  వ్యాఖ్యలను కూడా చదివితే ఉపయోగం.

ఉత్తర కాలిఫోర్నియాలో మట్టి నమూనాల్లో  రేడియేషన్ స్ధాయి గురించి రాసిన ఈ వార్త చూడండి. ఈ రేడియేషన్ కి కారణాల్లో ఫుకుషిమా కూడా కారణంగా వారు ప్రస్తావించారు. అణ్వాయుధ పరీక్షలు కూడా కారణమేనని వారు తెలిపారు. ఏప్రిల్ లో నమోదయిన రేడియేషన్ కంటే ఆగస్టులో నమోదయిన రేడియేషన్ అధికంగా ఉందని ఈ సమాచారం సూచిస్తోంది. సదరు సమాచారం ఇక్కడ చూడండి. ఈ వార్తల కింద ఉన్న వ్యాఖ్యలను కూడా చడవడం మరిచిపోవద్దు.

ఆస్ట్రేలియా కి చెందిన మిత్రులు విలువైన సమాచారం ఇచ్చారు. ఫుకుషిమా రేడియేషన్ విస్తరణను సూచించే భౌగోళిక పటాన్ని వారు ప్రచురించారు.దానితో పాటు కొన్ని జాగ్రత్తలను సూచించారు. జపాన్, అలాస్కా, పశ్చిమ కెనడా, అమెరికాలోని పశ్చిమ, మధ్య ప్రాంతాలు, తూర్పు రష్యా లోని కొన్ని ప్రాంతాలు ఫుకుషిమా వల్ల కలుషితం అయ్యాయని తెలిపారు. పిడిఎఫ్ డాక్యుమెంట్ రూపంలో ఉన్న ఆ సమాచారాన్ని ఇక్కడ చూడవచ్చు.

లిధుయేనియా (యూరప్) లో ఫుఖుషిమా రేడియేషన్ కనుగొన్న సర్వే ఫలితాన్ని ఇక్కడ చూడవచ్చు. మానవ నిర్మితమైన అత్యంత ప్రమాదకరమైన రేడియో యాక్టివ్ మూలకం ప్లూటోనియమ్ కూడా ఇందులో కలిసి ఉందని సర్వే తెలిపింది. ఫుకుషిమా గుండా ప్రవహించే సముద్ర పవనం (నార్త్ పసిఫిక్ జెట్ స్ట్రీమ్) అమెరికా, యూరప్ లను చుట్టి వస్తుందనీ దాని ప్రభావం వల్ల భూమద్య రేఖకి ఉత్తరంగా ఉన్న భూగోళం అంతా ఏదో ఒక స్ధాయిలో ఈ ప్లూటోనియమ్ బారిన పడిందని తెలిపే అధ్యయనం ఇక్కడ చూడవచ్చు. గాలి ద్వారా ఫుకుషిమా నుండి రేడియేషన్ పదార్ధం పసిఫిక్ సముద్రం పై ప్రయాణించి ఉత్తర అమెరికా, అట్లాంటిక్ సముద్రం, మధ్య యూరప్ లకి చేరుకుందని ఈ అధ్యయనం చెబుతోంది. రేడియేషన్ కి సంబందించి ‘సేఫ్ లెవెల్’ అంటూ ఏమీ లేదని ఈ అధ్యయనం చెబుతోంది. ఎందుకంటే ప్లూటోనియమ్-239 పదార్ధం హాఫ్-లైఫ్ (half life)24,200 సంవత్సరాలు కాగా, యురేనియం-238 హాఫ్-లైఫ్  4.46 మిలియన్ సంవత్సరాలు. ఫుకుషిమా ప్రమాదం సంభవించిన రోజుల్లోనే వేల మైళ్ళు రేడియేషన్ పదార్ధం పయనించిందని జర్మనీ కి చెందిన ఇ.యు.ఆర్.ఎ.డి సంస్ధ అధ్యయనం వెల్లడించిన సంగతి ఈ అధ్యయనం ప్రస్తావించింది. దానిని ఇక్కడ చూడవచ్చు.

బెర్కిలీ లోని కాలిఫోర్నియా యూనివర్సిటీ, శాన్ ఫ్రాన్స్ సిస్కో ప్రాంతం లోని పాలలో అయోడిన్ – 131, సీసియం-134, సీసియం-137 రేడియేషన్ కనుగొన్నామని తెలుపుతూ జనవరి 14 న ఒక రిపోర్టు ప్రచురించింది. అంతకు ఆరు నెలల క్రితం రికార్డయిన రేడియేషన్ స్ధాయితో పోలిస్తే ఇది ఎక్కువగా ఉందని రిపోర్టు తెలిపింది. ఆ రిపోర్టు ఇక్కడ చూడండి.

ఫుకుషిమా ప్రమాదం వల్ల విస్తరించిన రేడియేషన్ ని కనుగొన్నప్పటికీ ప్రభుత్వాలు తమ ప్రజలకు చెప్పడం లేదు. అమెరికా, కెనడాలు కూడా ఆ జాబితాలో ఉన్నాయి. కెనడాలో గత సంవత్సరం మార్చి లో వర్షపు నీటిలో రేడియో యాక్టివ్ అయోడిన్ ని కనుగొన్నప్పటికీ ప్రభుత్వం ప్రజలకు చెప్పలేదు. పైగా ఫుకుషిమా వల్ల కెనడాకు వీసమెత్తు రేడియేషన్ సోకలేదని అబద్ధం చెప్పింది. జనవరిలో వెల్లడయిన రికార్డుల ప్రకారం కెనడా ప్రభుత్వ పరిమితి 6 బెక్యూరల్స్ / లీటర్ కాగా 8.18 బె/లీ రికార్డు అయినట్లు వెల్లడి కావడం కెనడా ప్రభుత్వ తీరు బయట పడింది. ఏ సమయంలో తీసుకున్నా 6 కి మించరాదని హెల్త్ కెనడా అధిపతి ఎరిక్ పెల్లెరిన్ ఈ సందర్భంగా అంగీకరించాడు. అయితే వర్జీనియా రాష్ట్ర ప్రభుత్వం మాత్రం మార్చి నెలలో 3.4 రికార్డు అయినా వర్షపు నీరు తాగొద్దని హెచ్చరిక జారీ చేసింది. వాంకూవర్ (0.69) విన్నెపెగ్ (0.64) ఒట్టావా (1.67) లు కూడా రేడియేషన్ రికార్డు చేశాయి. కెనడాలో ఇతర సంస్ధలు రికార్డు చేసిన రేడియేషన్ స్ధాయి కంటే ప్రభుత్వం రికార్డు చేసినది చాలా తక్కువగా ఉండడం మరొక సంగతి.

ఫుకుషిమా ప్రమాదం వల్ల అమెరికాలో ఇప్పటికే 20,000 మంది చనిపోయారని జనవరిలో ప్రచురితమైన ఈ ఆర్టికల్ చూడండి.

ఫుకుషిమా ప్రమాదం ఇంకా ముగిసిపోలేదు. జనవరిలో అక్కడ ఉన్న రెండవ నంబర్ రియాక్టర్ లో టెంపరేచర్ అకస్మాత్తుగా విపరీతంగా పెరిగిపోయింది. ఆ రిపోర్టు ఇక్కడ చూడవచ్చు. కర్మాగారం యజమాని టెప్కో ఫుకుషిమాను ‘కోల్డ్ షట్ డౌన్’ చేశామని చెప్పినప్పటికీ అది నిజం కాదని ఈ పరిణామంతో అనుమానాలు తలెత్తాయి.

18 thoughts on “ఫుకుషిమా రేడియేషన్ అమెరికా, యూరప్ ల వరకూ వ్యాపించింది

 1. అచంగ గారూ, మీ ఆర్టికల్ ఒకసారి చదివాను. మీరు కొన్ని రిఫరెన్సు లు ఇచ్చారు గనుక చదివి సమాధానం ఇస్తాను. ఈ లోపు చెప్పాల్సింది ఒకటుంది.

  విమర్శ రాయడానికి మీరు ఎంచుకున్న పద్ధతి చర్చ ఆరోగ్యకరంగా జరిగేవిధంగా లేదు. అవతలి వ్యక్తిని ఎగతాళి చేస్తూ మీరు రాసిన పద్ధతి మీ గౌరవాన్ని పెంచేదిగా లేకపోగా తగ్గించేదిగా ఉంది. మీ విమర్శనా పద్ధతిని పట్టుకుని నేనూ వ్యంగ్యంగా నాలుగు వాక్యాలు రాయవచ్చు. కాని అది ఎవరికీ సాయపడదు. ముఖ్యంగా పాఠకులకు అస్సలు సాయపడదు. నన్ను తక్కువ చేశానన్న మీ అహం సంతృప్తి మాత్రమే మిగులుతుంది.

  ఫుకుషిమా రేడియేషన్ అమెరికా, యూరప్ ల వరకూ విస్తరించిందని నేనొక ఆర్టికల్ లో రాసాను. దానికి మీరు అభ్యంతరం రాశారు. అక్కడే మీరు ఎగతాళి మొదలు పెట్టారు. అయినా మీరు ఎకాలజిస్టునని చెప్పుకున్నారు గనక దాన్ని పట్టించుకోలేదు. మీ నుండి కొన్ని విషయాలు తెలుసుకోవచ్చని భావించాను. మీ అభ్యంతరానికి ఉన్న ప్రాముఖ్యత రీత్యా ఆర్టికల్ రూపంలో సమాధానం ఇస్తానని రాశాను.

  దానికి మీరేమీ రాశారు? ఒక అబద్ధం రాశారు. మీరు అభ్యంతరం చెప్పిన వాక్యాన్ని నేను ఎడిట్ చేశాననీ కనుక అంతటితో వాదనలకు స్వస్తి అనీ రాశారు. నేనేమీ ఎడిట్ చేయకుండానే ఎడిట్ చేసినట్లు ఒక అబద్ధాన్ని నాకు అంటగట్టి చర్చ నుండి తప్పుకున్నట్లు ప్రకటించారు.

  కానీ మీరు అబద్ధం రాశారని నేననలేదు. ‘నేను ఎడిట్ చేయలేదు, మీరు అభ్యంతరం చెప్పిన వాక్యం అలానే ఉంది’ అని మాత్రమే రాశాను. తద్వారా మీ మీద నాకున్న గౌరవాన్ని కొనసాగించాను. అబద్ధం చెప్పారంటూ మీపైన కోపం తెచ్చుకుంటే చర్చ పక్కకు పోతుందేమోనని మర్యాద పాటించాను. మీరన్నట్లు నేను వాదనకు దిగబోననీ, మరింత సమాచారం ఇవ్వడానికి మాత్రమే ప్రయత్నిస్తానని మాత్రమే రాశాను.

  అక్కడితో మీ అబద్ధాల పర్వం ఆగిందా అంటే, లేదు. “గూగుల్ ఐ.ఎం.ఇ లో ‘చేస్తే’ అని రావడానికి టైప్ చేస్తే ‘చేసినట్టున్నారు’ అని తీసుకుంది” అని రాసేశారు. ఓ నాలుగక్షరాలు టైప్ చేస్తే మరో నాలుగక్షరాలు దానికదే తీసుకుందన్నట్లుగా మీరు రాయవలసిన అవసరం ఎందుకొచ్చింది?

  అంతటితో మీరు ఆగారా? లేదు. మరో చోట, అదీ నేను లేని చోట ‘ఫేక్ సమాచారం ఇవ్వడానికి ప్రయత్నిస్తున్నారేమో’ అంటూ ఆరోపణలకి దిగారు. నేనసలు ఆర్టికల్ రాయకముందే నా నిజాయితీ గురించి అవమానకరంగా వ్యాఖ్యానించే హక్కు మీకు స్వతస్సిద్ధంగానే ఉన్నదని మీరు భావిస్తున్నారా? ‘ఎకాలజిస్టు’ వృత్తిలో ఉన్నంతనే అవతలి వ్యక్తులకి ఏమీ తెలియదనీ, ఏమన్నా తెలిస్తే అదంతా బూటకమేననీ నిర్ధారించి తీర్పులిచ్చే ఆధారిటీ మీకు వచ్చేస్తుందా? మీరు ఎకాలజిస్టు గనక ఎకాలజిస్టు కాని వారు చదివి ఏమన్నా రాస్తే దానిని వ్యంగ్యం చేస్తూ వారిని కించపరిచే హక్కు మీకు వచ్చేస్తుందా?

  సబ్జెక్టుని చర్చించడం పైన కంటే అవతలి వ్యక్తులని ఏదో విధంగా ఎగతాళి చేసి సంతృప్తిపడే స్వభావాన్ని మీరు ప్రదర్శిస్తున్నారు. ఇవన్నీ మీ వ్యక్తిత్వాన్ని పట్టిచ్చే విషయాలు మాత్రమే తప్ప నా గౌరవాన్ని తగ్గించేవి కావు.

  ‘ఎకాలజిస్టు’ అని చెప్పుకుంటున్నపుడు అలాంటి వారిపైన కొన్ని బాధ్యతలు ఉంటాయి. ఆ వృత్తిలో ఉన్నవారికి సహజంగానే ఇతరుల కంటే మరిన్ని సంగతులు తెలిసి ఉంటాయి. జీవానికి, పర్యావరణానికీ ఉన్న సంబంధాన్ని ఎకాలజిస్టులు శాస్త్రబద్ధంగా అధ్యయనం చేస్తారు. పెట్టుబడిదారీ కంపెనీలు మానవ జాతి భవిష్యత్తును పట్టించుకోకుండా ప్రకృతి వనరులను విచక్షణా రహితంగా ఎక్స్ ప్లాయిట్ చేస్తున్న నేపధ్యంలో దానివల్ల కలుగుతున్న విపరిణామాలను ప్రజలకు, తెలియనివారికి అర్ధమయ్యే పద్ధతుల్లో తెలియజెప్పే బాధ్యత ఇప్పుడు ఎకాలజిస్టులకు అదనంగా వచ్చి చేరిందన్నది పెద్దలు చెబుతున్న మాట.

  ‘ఫుకుషిమా రేడియేషన్ అమెరికా, యూరప్ ల వరకూ విస్తరించింది’ అన్న సంగతి నాకు ఎలా తెలుస్తుంది? నేను ఆ రంగంలో లేను గనక దాని గురించి అధ్యయనం చేసినవారి ద్వారానే నాకు తెలియాలి. నాకు తెలుగు ఎకాలజిస్టులు ఎవరూ తెలియదు. అందునా ఫుకుషిమా రేడియేషన్ గురించి వివరంగా చెబుతున్నవారు ఎవరూ తెలియదు. కనుక నేను చదివిన కొన్ని అంశాలను మీ దృష్టికి తెచ్చి మరిన్ని విషయాలు తెలుసుకోవచ్చని నేను ఆశించాను. కానీ మీ పద్ధతి నన్ను నిరాశకు గురి చేసింది.

  మీరు అవతలి వ్యక్తులను కించపరచాలని చేసిన ప్రయత్నాలను నేను తిరస్కరిస్తున్నాను. ఆ పద్ధతికి నా అభ్యంతరాన్ని తెలియజేస్తున్నాను. మీ పద్ధతిని సమీక్షించుకుంటే నిలిచేది మీ గౌరవమే.

  మీరు లేవనెత్తిన అంశాలను నేను మరో ఆర్టికల్ ద్వారా చర్చిస్తాను. వాదించను.

 2. ఆ పోస్టు రాసిన అచంగ గారు చర్చ కోసమో లేక సత్య శోదన కోసమో కాదు. మీ పైనా, మార్క్సిజం పైనా, ఉన్న ద్వేషంతో రాశారు. ఆ విషయం కూడా మొదట్లోనే చెప్పారు.

  అచంగ గారూ, మీ అహంకారాన్ని, ద్వేషాన్ని, ఏదొక విధంగా సంతృప్తి పరచండి. లేక పొతె అనారొగ్యం పాలౌతారు.

 3. రామ్మోహన్ గారూ, మీ వ్యాఖ్యలో ఉన్న అచ్చు పొరబాట్లని సవరించాను. గమనించగలరు.

  సత్య శోధన చేసేవారు వ్యంగ్యానికీ, అబద్ధాలకీ ఎందుకు దిగుతారు? ఎకాలజిస్టు నంటూ అహంకారం ఎందుకు కక్కుతారు? సత్య శోధనే ఆయన ఉద్దేశ్యం అయితే నాకు తెలియని విషయాలని తెలియజెప్పడానికి పద్ధతిగా ప్రయత్నించి ఉండేవారు.

 4. మీకు గత చరిత్ర తెలియదు కాబట్టి ఈ విషయం చెపుతున్నాను. నేను 2008 నుంచి తెలుగు బ్లాగులు చదువుతున్నాను. తెలుగు బ్లాగులలో ఎవరు కమ్యూనిజం గురించి వ్రాసినా కొంత మంది భయపడిపోయి వ్రాసినవాళ్ళ మీద బురద జల్లడానికి బాల్టీలతో సిద్ధంగా ఉంటారు. తెలుగు బ్లాగులలో ఈ ట్రెండ్ పాతదే.

  బిజెపి కమ్యూనిజంని తీవ్రంగా వ్యతిరేకించే పార్టీ. 2009 డిసెంబర్ వరకు తెలుగు బ్లాగర్లలో ఎక్కువ మంది బిజెపినే సమర్థించేవారు. వీళ్ళని కమ్యూనిజం తరువాత ఎక్కువగా భయపెట్టేవి ఇంకో రెండు ఉన్నాయి. అవి తెలంగాణావాదం & స్త్రీవాదం. తెలంగాణా రాష్ట్రం ఏర్పడితే మేడిపండు లాంటి హైదరాబాద్ కోస్తా ఆంధ్రకి చెందకుండా పోతుంది. రాష్ట్రంలో ఏ ప్రాంతాన్నీ అభివృద్ధి చెయ్యకుండా ఒక్క హైదరాబాద్‌నే అభివృద్ధి చేసినది బహుళ జాతి కంపెనీల చేత పెట్టుబడులు పెట్టించడానికే. “బహుళజాతి కంపెనీల కోసం మనం హైదరాబాద్‌కి ఇంత ఆకర్షణీయమైన రంగులు పూసాము. మనం తెలంగాణావాళ్ళ కోసం హైదరాబాద్‌ని ఎందుకు వదులుకుంటాము” అని కోస్తా ఆంధ్ర వైట్ కాలర్ వర్గంవాళ్ళు అనుకుంటున్నారు. బిజెపి తెలంగాణావాదాన్ని సమర్థించడం వల్ల వాళ్ళు బిజెపికి సపోర్ట్‌గా వ్రాసే పోస్ట్‌లు తగ్గించి డైరెక్ట్‌గా కమ్యూనిస్ట్‌లనీ, తెలంగాణావాదులనీ తిడుతూ వ్రాయడం మొదలుపెట్టారు. కొంత మంది మజ్లిస్-ఇ-ఇత్తెహాదుల్ ముస్లిమీన్ అనే ఇంకో సమైక్యవాద పార్టీ మీద కూడా ఆశలు పెట్టుకున్నారు. మజ్లిస్ నాయకులు నిజాం ఒస్మాన్ అలీ ఖాన్ బంధువులు కావడం వల్లే తెలంగాణా రాష్ట్ర ఏర్పాటుని వ్యతిరేకిస్తున్నారనే నిజం నేను బయటపెట్టాను. అదే సమయంలో స్కైబాబా అనే ముస్లిం రచయిత తెలంగాణాకి సపోర్ట్‌గా వ్యాసాలు వ్రాయడం వల్ల వీళ్ళకి ముస్లింల మీద ఉన్న భ్రమలు కూడా పోయాయి.

  మూడేళ్ళ క్రితం ఒక దళితవాదికి చెందిన బ్లాగ్‌లో పబ్ కల్చర్ గురించి చర్చ జరుగుతున్నప్పుడు నేను ఇలా వ్రాసాను “ఏ మగవాడికైనా పబ్‌కి వెళ్ళి అమ్మాయితో కలిసి డాన్స్ చెయ్యాలని ఉంటుంది. కానీ పబ్‌లో పరిచయమైన అమ్మాయిని ఎవరూ పెళ్ళి చేసుకోవడానికి ఒప్పుకోరు. చెడు తిరుగుళ్ళ వల్ల స్త్రీ-పురుష సమానత్వం అనేది రాదు అనడానికి ఇది ఒక నిదర్శనం” అని. నేను ఒక స్త్రీవాదినని అర్థమైపోయి అప్పట్లోనే నా బ్లాగ్ ముయ్యించాలనుకున్నారు. చాలా కాలం తరువాత రంగనాయకమ్మ గారు నళిని జమీలా అనే వేశ్య జీవిత చరిత్రని విమర్శిస్తూ ఒక వ్యాసం వ్రాసారు. ఆ వ్యాసంపై బ్లాగులలో చర్చ వచ్చింది. ఆ సమయంలో నేను రంగనాయకమ్మ గారికే సపోర్ట్‌గా వ్రాసాను. అదే సమయంలో ఇంకో అమ్మాయి కూడా రంగనాయకమ్మ గారికి సపోర్ట్‌గా వ్రాసింది. “మగవాడు తాను వేశ్య దగ్గరకి వెళ్తాడు కానీ తన భార్య గిగోలో (మగవేశ్య) దగ్గరకి వెళ్తానంటే ఒప్పుకోడు. కనుక వ్యభిచారం వల్ల స్త్రీ-పురుష సమానత్వం రాదు” అని ఆమె వ్రాసింది. అప్పుడు “నీది మార్తాండవాదంలాగ ఉంది” అని ఆమెని తిడుతూ ఆమె బ్లాగ్‌లోనే కామెంట్లు వ్రాసారు. “నువ్వు ప్రవీణ్ గాడి వ్రాతలు చదివి ఇలా తయారవుతున్నావు. కామెడీ కోసమైనా వాడి వ్రాతలు చదివితే ఇట్లానే ఉంటది. మగవాడికి ఆడది అది ఇవ్వకపోయినా తీసుకోగలడు కానీ ఆడదానికి మగవాడు అది ఇవ్వకపోతే తీసుకోలేదు” అని అంటూ ఆమెని తిట్టారు. ఆమె భయపడి పోస్ట్ డిలీట్ చేసేసింది.

  కానీ దళితవాదానికి ఈ వర్గంవాళ్ళు అంతగా భయపడరు. తెలుగు బ్లాగులలో కమ్యూనిజంకి వ్యతిరేకంగా అరిచేవాళ్ళలో ఒకరిద్దరు దళిత బ్లాగర్లు కూడా ఉన్నారు. ఈ దళిత బ్లాగర్లు అప్పుడప్పుడూ రిజర్వేషన్‌లని సమర్థిస్తూ వ్యాసాలు వ్రాస్తుంటారు. కానీ వీళ్ళు సంపూర్ణ ఆర్థిక సమానత్వాన్ని అడ్వొకేట్ చేసే మార్క్సిజంని అంగీకరించరు. కమ్యూనిజంని వ్యతిరేకించే వర్గానికి చెందినవాళ్ళు వీళ్ళని అంతగా విమర్శించరు. కానీ ఎవరైనా అమెరికా సామ్రాజ్యవాదం గురించో, తెలంగాణావాదం గురించో, స్త్రీవాదం గురించో వ్రాస్తే మాత్రం వ్రాసినవాళ్ళని తీవ్రంగా తిడతారు.

 5. ఒక విషయం మాత్రం ఖచ్చితంగా తెలుసు. అణు విద్యుత్ చాలా ఖరీదైనది. ఒక అణు విద్యుత్ కేంద్రం కాలం చెల్లిపోయి మూసివెయ్యాల్సి వస్తే దాన్ని సిమెంట్‌తో మూసివేసి, 25 – 30 ఏళ్ళ వరకు ఆ సిమెంటెడ్ కవచాలకి పగుళ్ళు రాకుండా చూడాలి. 1997లో కొవ్వాడ-మత్స్యలేశం అణు విద్యుత్ కేంద్రం వ్యతిరేక పోరాటానికి మద్దతు ఇస్తూ ఒక CPI(ML) న్యూ డెమోక్రసీ నాయకుడు ఇదే విషయం చెప్పాడు. ఆ అణు విద్యుత్ కేంద్రం లీకైతే ఆ కేంద్రానికి వంద కిలో మీటర్ల దూరం వరకు ఒక్క మనిషి కూడా మిగలడు.

 6. ప్రవీణ్ ఇలా కాదు. ఫుకుషిమా ప్రమాదం గురించిన వాస్తవాల గురించి మీరు కూడా కొన్ని ఆర్టికల్స్ రాయడానికి ప్రయత్నించండి.

 7. వ్రాయడానికి ప్రయత్నిస్తాను కానీ ఒక్క మాట. భూకంపాలు వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్న జపాన్ లాంటి దేశాలలో అణు విద్యుత్ కేంద్రాలు నిర్మిస్తే లీక్ అయ్యే అవకాశాలు ఎక్కువ అని వాళ్ళకి తెలియదా?

 8. ప్రవీణ్, భూకంపాలవల్ల వచ్చే ప్రమాదాలని కూడా అధిగమించేంతగా జాగ్రత్తలు తీసుకున్నామని కంపెనీలు చెబుతూ వచ్చాయి. అదేమీ లేదని ఫుకుషిమా ద్వారా అర్ధమయింది.

 9. గూగుల్ ప్లస్‌లో ఒక self-proclaimed పండితుడు ఇలా అన్నాడు “కమ్యూనిజం అనేది చిన్న పిల్లల కథలలోని నీతిలాంటిదట, అది ఆచరణ సాధ్యం కాదట, పైగా అది అభివృద్ధి నిరోధకమట”. అతని వాదనలో నాకేమీ కొత్తదనం కనిపించలేదు. నీతిగా బతికేవాళ్ళని సత్తెకాలపు సత్తెయ్యలు అని వెక్కిరించే టిపికల్ నీతిలేనివాళ్ళ స్టైల్ అది. సమాజం ఏ పునాదుల మీద నడుస్తుందో ప్రజలకి తెలియాలి కదా. లేకపోతే ప్రజలు సమాజం విషయంలో ఇలాంటి మూఢ నమ్మకాలకే పోతారు.

 10. విశేఖర్ గారూ… నా శైలి నచ్చలేదన్నారు, దానికి పేచీ లేదు. ఇక గూగుల్ తెలుగు లిప్యంతరీకరణ ఎక్కువసార్లు ఏ పదాన్ని టైపు చేస్తే మొదట ఆ పదాన్ని చూపిస్తుందన్నది జగమెరిగిన సత్యం. ఇక మీ పోస్టు రెండవసారి చూసినప్పుడు నేను వ్యతిరేకించిన వాక్యం ఓవర్‌లుక్ అయ్యింది. సరే మీరు ఆ వ్యాఖ్యను ఉపసంహరించుకోలేదు అలానే ఉంది, మరో టపాలో దాని గుఱించి రాస్తాను అన్నారు నేను ఎదురు చూశాను. నా అబద్ధాల విషయములో (మీరు చెప్పినట్టు) జరిగింది ఇది!

  ఇక విషయానికొస్తే నేను మీకు విషయ బోధనకో మరోదానికో ఈ ఆర్టికిల్ రాయలేదు. ఇక్కడ విమర్శనాత్మక విశ్లేషణ (critical analysis) ముఖ్యం. నేను చేసిందీ అదే. నేను మిమ్మల్ని వ్యక్తిగతంగా దూషించిదిగానీ, వ్యక్తిగత విమర్శలకు దిగింది కానీ శూన్యం.

  “ఫేక్ సమాచారం ఇవ్వడానికి ప్రయత్నిస్తున్నారేమో’ అంటూ ఆరోపణలకి దిగారు…….”
  ఈ ముక్క నేను అన్నట్టు నాకైతే గుర్తు లేదు. ఒకవేళ అన్నా జరిగింది ఎలాగూ అదే. మీరిచ్చిన ఆధారాల్లో కనీసం ఒక్కటంటే ఒక్క ఆధారం ఇప్పటివరకూ శాస్త్రీయంగా నిరూపించబడలేదని ఢంకా బజాయించి చెప్పగలను.

  “ఎకాలజిస్టు’ వృత్తిలో ఉన్నంతనే అవతలి వ్యక్తులకి ఏమీ తెలియదనీ, ఏమన్నా తెలిస్తే అదంతా బూటకమేననీ నిర్ధారించి తీర్పులిచ్చే ఆధారిటీ మీకు వచ్చేస్తుందా?”
  మీరు కొన్ని వందల టపాలు రాసుంటారు ఇప్పటివరకూ. ఇందులో నేను ఎన్ని వ్యతిరేకించాను? మిమ్మల్ని వ్యతిరేకించటమే పనిగా పెట్టుకుంటేనో లేదా మీమీద తీర్పు తీర్చటమే పనిగా పెట్టుకుంటేనో మీరు రాసిన ప్రతీ టపాని వ్యతిరేకిస్తూ, విమర్శిస్తూ నేనూ కొన్ని వందల టపాలు రాసుండేవాడిని. కానీ గమ్మున ఊరుకుందెంకంటే ఆయా విషయాలపై నాకు అవగాన/అర్హత లేకపోవటమో లేదా నాకున్న అవగాహన/అర్హత చాలకపోవటమో. మరి ఈ విషయమ్మీదే ఎందుకు విమర్శించాను? ఆ అర్హత, విషయ పరిజ్ఞానమూ ఉన్నాయి కనుక.

  ఎకాలజిస్టుగా నా బాధ్యత తెలుసనే అనుకుంటున్నను. అందులో భాగంగానే మీర్రాసిన అహేతుక వ్యాఖ్యలను ఖండించాను. అలాగే ఏదైనా వస్తువుకు డిమాండు ఉన్నంతకాలం దాన్ని సప్లైచేసేవాళ్ళూ ఉంటారు. X కంపెనీ కాకపోతే Y కంపెనీ. అదీ కాకపోతే కమ్యూనిజం సోషలిజం అని చెప్పుకునే ప్రభుత్వ కంపెనీ. వనరుల వాడకం మాత్రం ఆగదు. వనరుల వాడకం ఆగాలంటే డిమాండు తగ్గాలి. డిమాండు తగ్గాలంటే ప్రజలు చైతన్యవంతులు కావాలి. అంతేకానీ నిర్భందాలు, కంపెనీ వ్యతిరేక దాడులు మార్గం కానేరవు.

  “ఫుకుషిమా రేడియేషన్ అమెరికా, యూరప్ ల వరకూ విస్తరించింది’ అన్న సంగతి నాకు ఎలా తెలుస్తుంది? నేను ఆ రంగంలో లేను గనక దాని గురించి అధ్యయనం చేసినవారి ద్వారానే నాకు తెలియాలి”
  నేను మీకు ముందటి టపాలోనే చెప్పానుకదా ఫుకుషిమా అణుధార్మికత యూరోపు వరకూ వచ్చిందనటం అశాస్త్రీయ వాదన అని. మీరు విన్నారా? అమెరికా, కెనడా ప్రభుత్వాలు అణుధార్మికత గుఱించి చెప్పట్లేదని తీవ్ర ఆరోపణలు ఎలా గుప్పించారు? మీరు ఎక్కడో ఏవో చదివేస్తే సరిపోతుందా? వాటి విశ్వసనీయత, శాస్త్రీయత ఎంత అనేది కనీసం ఒకసారి సమీక్షించుకునే పనే లేదా? మీకు తెలియని విషయాలపై ఆరోపణలు గుప్పించేటప్పుడు మీవద్ద ఉన్న ఆధారాల క్రెడిబిలిటీ ఎంత అనేది కనీసం పరిశీలించాల్సిన నైతిక బాధ్యత మీది కాదా?

  మీరు చదివిన కొన్ని అంశాలను నా దృష్టికి తెచ్చి నానుండి ఏదైనా తెలుసుకోగోరినప్పుడు ఆరోపణలకు దిగాల్సిన అవసరం ఏముంది? నేను ఇది విన్నాను ఇలా కూడా అయ్యుండొచ్చు అంటే సరిపోయేదిగా! కాదు ఇలాగే జరిగింది అనటంవల్ల మీ రాతలపై విమర్శలు ఎక్కుపెట్టాల్సి వచ్చింది. మీరెక్కడా ఓ సందేహాన్ని వెలిబుచ్చుతున్నట్టు చెప్పలేదే, పూర్తి ఆధారాలతో వాదించినట్టు వాదించారు కానీ!

  ఒక సంఘటన ‘జరిగింది’ అని చెప్పటానికి ‘జరిగి ఉండొచ్చు’ అని చెప్పటానికీ చాలా వ్యత్యాసం ఉంది. అది మీరు గమనిస్తే మీపై విమర్శలు ఎక్కుపెట్టాల్సిన అవసరమే ఉండదు.

 11. రమ్మోహన్ గారూ… మీ సలహాకి ధన్యవాదాలు.

  ప్రవీణ్ శర్మ గారూ… కాస్త ఈ టపాకి పనికొచ్చేదేమన్నా ఉంటే చెప్పండి.

 12. అచంగ గారూ,

  >>నేను మిమ్మల్ని వ్యక్తిగతంగా దూషించిదిగానీ, వ్యక్తిగత విమర్శలకు దిగింది కానీ శూన్యం.>>

  అని మీరంటున్నారు. కానీ మీ ఆర్టికల్ లో ఉన్నవి ఇవి.

  >>ఓ పది పనికిమాలిన ఆధారాలతో ఓ మాంచి కట్టుకథ అల్లటములో సదరు రచయితది అందెవేసిన చెయ్యి.>>
  >>ఆయన గొప్ప నిపుణుడిగా భావించే ఓ తాడూబొంగరం లేని వ్యక్తి/వ్యక్తులు రాసిన అడ్డదిడ్డమైన రాతలు గొప్ప ప్రామాణిక రాతలు>>
  >>పెట్టుబడిదారీ దేశాలను విమర్శించటమే పనిగా పెట్టుకున్న విశేఖర్ గారి అత్యుత్సాహం. అలాగే పనిలో పనిగా గాలివార్తలకు, పుకార్లకు ఉచిత ప్రచారం.>>

  ఇదా మీ క్రిటికల్ ఎనాలసిస్? ఈ స్ధాయికి ఎదగడం నా వల్ల కాదు లెండి.

  పోతే, మీతో చర్చలోకి దిగే ముందు, మీ సలహా ప్రకారం, మీ తాడూ బొంగరం గురించి కూడా తెలుసుకొని ఉండాల్సింది. తాడూ బొంగరాల గురించి మీకు బానే తెలుసు గనక కనీసం మీరయినా చెప్పి ఉండాల్సింది. ఫర్లేదు. ఇప్పుడైనా ఏమన్నా చెప్పగలరా? వ్యక్తిగత సమాచారం అడుగుతున్నాననుకుంటె మీరు చెప్పనవసరం లేదు. కానీ మీ క్రిటికల్ ఎనాలిసిస్ వేలిడిటీ నాకు తెలియాలంటే, ఆ సమాచారం నాకేమన్నా తెలియాలేమో ఓ సారి ఆలోచించి వీలయితే చెప్పండి.

  నేను లేని చోట ఫేక్ అని అనుచితంగా ఎందుకు వ్యాఖ్యానించారని నేను అడిగితే దాటవేస్తారేమిటి? గుర్తులేకుంటే నేను చెప్పాకయినా గుర్తు తెచ్చుకోవచ్చుగదా? ఇదీ క్రిటికల్ ఎనాలసిస్ లో భాగమేనా? అయితే వదిలేయండి. ఎలాగూ ఆ స్ధాయికి నేను ఎదగలేను గనక.

  మీరు చేసిన ‘ఫేక్’ ఆరోపణ గురించి నేనడిగాను. దానికి నేను రాసిన వందల పోస్టులను వ్యతిరేకించలేదని చెప్పడం నాకు అర్ధం కాలేదు. వందల పోస్టులను వ్యతిరేకించలేదు గనక నా ఒక్క పోస్టు పై చేసిన క్రిటికల్ ఎనాలసిస్ కి సంతోషపడమంటారు!?

  >>నేను మీకు ముందటి టపాలోనే చెప్పానుకదా ఫుకుషిమా అణుధార్మికత యూరోపు వరకూ వచ్చిందనటం అశాస్త్రీయ వాదన అని>>

  అంత కష్టపడి సొంత ఖర్చులతో, శ్రమని వెచ్చించి వెబ్ సైట్ నిర్వహిస్తుంటేనేమో తాడూ బొంగరం లేదని హీనం చెయ్యాలీ? మీరు అకస్మాత్తుగా ఎకాలజిస్టునంటూ ఊడిపడి ఒక వాక్యాన్ని పట్టుకుని, తాడూ బొంగరం ఏమీ చెప్పకుండానే, ‘అశాస్త్రీయ వాదన’ అని తీర్పిచ్చెయ్యగానే చేతులు కట్టుకుని గొర్రెలా నమ్మేసి తలూపాలీ? మీ క్రిటికల్ ఎనాలసిస్ కి ఇది సరితూగుందేమో చూసుకున్నారా?

  >> మీరు విన్నారా? అమెరికా, కెనడా ప్రభుత్వాలు అణుధార్మికత గుఱించి చెప్పట్లేదని తీవ్ర ఆరోపణలు ఎలా గుప్పించారు? మీరు ఎక్కడో ఏవో చదివేస్తే సరిపోతుందా? వాటి విశ్వసనీయత, శాస్త్రీయత ఎంత అనేది కనీసం ఒకసారి సమీక్షించుకునే పనే లేదా? మీకు తెలియని విషయాలపై ఆరోపణలు గుప్పించేటప్పుడు మీవద్ద ఉన్న ఆధారాల క్రెడిబిలిటీ ఎంత అనేది కనీసం పరిశీలించాల్సిన నైతిక బాధ్యత మీది కాదా?>>

  ఏమిటీ ప్రశ్నలు, అర్ధం లేకుండా? నేను వినడం ఏమిటి? ఏం వినాలి? నేను చదివిన ఆధారాలు నేనిచ్చాను. నేను రాసినదానికి అవే ఆధారాలని చెప్పాను. ఆ ఆధారాలు ఫేక్ అయితే ఆ సంగతే మీరు చెప్పవచ్చు. నేను ఇచ్చిన, తాడూబొంగరం లేదని మీరన్న, వెబ్ సైట్ అనేక వార్తలను ప్రచురించింది. ఆ వార్తలకి ఆధారాలను కూడా ఇచ్చింది. వాటిలో కొన్ని ఆధారాలు వివిధ వ్యక్తులు, స్వచ్చంద పౌరులు సేకరించినవి ఉన్నాయి. కొన్ని అధ్యయనాలకి కూడా లింక్ లు ఇచ్చింది. అదొక అభినందనీయమైన కృషి. ఆ కృషిలో లోపాలుంటే, శాస్త్రబద్ధత లోపిస్తే అప్పటికి అది విమర్శ. కానీ అది తాడూ, బొంగరం లేదని హీనంగా వ్యాఖ్యానించే పనికి నేను దిగను. ఇప్పటి పరిస్ధితిలొ ఎకాలజిస్టు గా ఆ సైట్ పై మీరు చేసిన విమర్శని నేను నోట్ చేసుకున్నాను. మరింతగా ఆ సైట్ ని పరిశీలిస్తాను. ఒక ఉపకారం జరుగుతుందన్న ఆలోచనతో ఆయన చేస్తున్న కృషిని ఎకా ఎకిన తాడూ బొంగరం లేదంటూ హీనపరచడానికి నేను పూనుకోను. అలా చేస్తే ఆయా వ్యక్తులు స్వచ్ఛందంగా చేస్తున్న కృషిని నిరుత్సాహపరిచినట్లు. శాస్త్రబద్ధత పేరుతొ, ఆధారాల పేరుతో వ్యక్తుల చొరవను నిరాకరించడం అది.

  ఇక్కడ మనవరకూ రాలేదు గనక మనకా సెగ తగల్లేదు. జపాన్ లో ప్రమాదం జరిగాక ప్రజలు ఎలాంటి భావోద్వేగాలకు, భయాందోళనలకు గురయ్యారో అనేక పత్రికలు వెల్లడించాయి. సోషల్ నెట్ వర్క్ సైట్స్ లో, వీడియో సైట్స్ లో వారి భయాందోళనలని నేను చూసాను. ఆ పరిస్ధితులనుండి వ్యక్తులు, సమూహాలు స్వచ్ఛందంగా కొన్ని చర్యలకు పూనుకుంటారు. తమ పరిస్ధితులని బాగు చేసుకోవడానికి తమకు తెలిసిన పద్ధతుల్లో ప్రయత్నిస్తారు. ఆ ప్రయత్నాలను అభినందించి ప్రోత్సహించాలే తప్ప కించపరచడం తగని పని.

  ఫుకుషిమా రేడియేషన్ కి సంబంధించిన వార్తలు, విశ్లేషణ, ప్రమాద వివరాలు ఇంకా పూర్తిగా వెల్లడి కాలేదు. అది కొనసాగుతోంది. ప్రారంభంలో ప్రమాదం గురించి జపాన్ ప్రభుత్వం, టెప్కో కంపెనీ అబద్ధాలు చెప్పాయని పత్రికలే అనేకసార్లు చెప్పాయి. కార్పోరేట్ పత్రికలు కూడా ఆ వార్తలు రాసాయి. ఈ పరిస్ధితుల్లో కంపెనీలు, ప్రభుత్వాలు అధికారికంగా చెబుతున్నవాటిపైన అనేక అనుమానాలు ఏర్పడ్డాయి. అధికారిక విశ్లేషణల్లో చాలా సమాచారం దాచి పెట్టారనీ, అబద్ధం చెప్పారనీ నేను చాలా వార్తలు చదివాను. ఈ పరిస్ధితిల్లో జపాన్ ప్రజలు ఎవరిని నమ్మాలి? ఇతర దేశాల ప్రజలు ఎవర్ని నమ్మాలి? జపాన్ ప్రభుత్వం ఏమి చెబుతుందా? అమెరికా, కెనడా ప్రభుత్వాలు ఏమి చెబుతాయా? ఫలానా శాస్త్ర బద్ధ విశ్లేషణ ఏమి చేబుతుందా? అని ఎదురు చూడాలా? ఎదురు చూసి వారు చెప్పే ప్రతీదాన్నీ నమ్ముతూ, ఏది అబద్ధమో, ఏది నిజమో, ఏది శాస్త్రబద్ధమో తెలియని గందరగోళంలో ఉంటూ, వారి దయా దాక్షిణ్యాలకోసం ఎదురు చూడాలా?

  ప్రభుత్వాలు, కంపెనీలు ఏమి చెబుతాయో ఒక సంగతి. అవి పరిగణనలో ఉంటాయి. ఆ లోపు ప్రజలు స్వచ్ఛంద చర్యలకు పూనుకుంటారు. ప్రజాస్వామ్యం పైన గౌరవం ఉన్నట్లయితే ప్రభుత్వాలుగానీ, సంస్ధలుగానీ, వ్యక్తులుగానీ ఈ ప్రయత్నాలకి విలువ ఇవ్వాలి. తామేదో పెద్ద శాస్త్రాలు చదివామనీ, పరిశోధనలు చేసామనీ, ఆ యిస్టులమనీ, ఈ యిస్టులమనీ కనుక మేం చెప్పేవన్నీ నమ్మాలనీ చెప్పి నోరు మూపించదలిస్తే అది ప్రజాస్వామ్యం కాదు. ప్రజాస్వామిక భావజాలం అంతకంటే కాదు. మీరు చెప్పిన క్రిటికల్ ఎనాలసిస్ అవుతుందేమో నాకు తెలియదు. అది ఆయా వ్యక్తులనీ, వారి అనుభవాలనీ, వారి భయాందోళనలనీ కించపరిచి, అవమానపరిచి ఆధిక్యత సాధించడం అవుతుంది.

  నాకయినా, మరొకరికయినా అధ్యయనం, పరిశీలన, చర్చ ఒక నిరంతర ప్రక్రియ. ఆ ప్రక్రియలో అనేక అంశాలు వస్తూ పోతుంటాయి. విలువ లేనివి మరుగుపడతాయి. ఉన్నవి నిలుస్తాయి. నా ఆర్టికల్స్ అలాంటివే. నా పరిశీలనలో ఉన్నవి, నేను చదివినవి, నా అనుభవంలో చూసినవి నేను వెల్లడిస్తాను. వెల్లడించడానికి నేను ఎంచుకున్న మార్గాల్లో బ్లాగింగ్ ఒకటి. దానిలో భాగంగా నేను చూసినవి, చదివినవి, తెలుసుకున్నవి రాస్తున్నా. ఒక్క ఫుకుషిమా యేనా? చాలా రాసాను. నా మిత్రులు చదువుతున్నారు. తమకి అభ్యంతరం ఉన్నవి చెబుతున్నారు. వారి అభ్యంతరం నిజమైతే సవరించుకుంటున్నా. తప్పయితే చర్చిస్తున్నా. అనుమానం ఉంటే చెబుతున్నా. తద్వారా నేను చాలా తెలుసుకుంటున్నా. సవరించుకుంటున్నా.

  ఈ ప్రక్రియలోకి మీరు వచ్చారు. మంచిది. ఎకాలజిస్టునన్నారు. సంతోషించాను. అశాస్త్రీయం అన్నారు. ఇదిగో నేనిక్కడ చదివాను అన్నా. ఎక్కడో ఏమిటో చూడకముందే ఫేక్ అన్నారు. పోనీ అనుకున్నా. ఎక్కడో ఏదో చదివేస్తే అంటూ మళ్లీ కించపరచడానికి ఎందుకు దిగుతున్నారు? ఆధారాల క్రెడిబిలిటీ నిర్ధారించే పరిజ్ఞానం మీ వద్ద ఉంటే అది చెప్పే పద్ధతి ఇదా? ఎగతాళి చెయ్యడమా? మీరు చదివింది నేను చదవలేదు గనక కించపరచడమా? అది క్రిటికల్ ఎలాలసిస్ మీకవుతుందేమో గానీ నాకు కాదు. మీకు తెలిసినవీ, నాకు తెలియనవీ అనేక ఉంటాయి. అలాగే వైస్ వెర్సా. వాటిని తెలియచెప్పుకునే పద్ధతి ఇది కాదు.

  విశ్వసనీయత, శాస్త్రీయత లని ఎప్పుడు కొలుస్తారు? ఎక్కడ వాటిని అప్లై చెయ్యాలో అక్కడే చెయ్యాలి. ప్రతి సందర్భంలోనూ దూరి విశ్వసనీయత ఉందా, శాస్త్రీయత ఉందా అంటూ ఎవరూ కొలవరు. అలా కొలిచే అర్హతా, గౌరవం మీకెవరైనా ఇస్తే అక్కడ ఆపని నిరభ్యంతరంగా చెయ్యండి. కానీ చర్చ కోసం, తెలుసుకోవడం కోసం కొన్ని వార్తలను, అధ్యయనాలనూ, వాదనలనూ నేను రాస్తుంటే, నా బ్లాగ్ ని చదివి ఎవరో విధాన నిర్ణయాలు చేసేస్తున్నట్లు విశ్వసనీయత, శాస్త్రబద్ధత అంటూ ఈ కొలబద్దలేమిటి? చర్చలో చేరి మీకు తెలిసిన సంగతులు చెప్పదలిస్తే చెప్పండి. లేదంటే ఇంతకాలం ఉన్నట్లు “గమ్మున” ఉండండి. కానీ దూరిపోయి ఎకాలజిస్టునంటూ, ఎదుటివారిని కించపరుస్తూ, ఎగతాళి చేసే హక్కుగానీ, అవసరం గానీ ఇక్కడ లేదు.

  అంతే కాక, శాస్త్రబద్ధత అనుభవాల వల్లా, అధ్యయనం వల్లా సాధ్యం అవుతుంది. వివిధ అనుభవాలను నిర్ధిష్ట పద్ధతిలో పేర్చితే అదే శాస్త్రం అని చదివాను. దానికంటె ముందు అనేక ప్రయోగాలు జరుగుతాయి. చర్చలు జరుగుతాయి. సంఘర్షణ జరుగుతుంది. అవి వివిధ రూపాల్లో ఉంటాయి. ఆ సంఘర్షణలో భాగంగానే మీతో చర్చని నేను చూసాను. దానికి భిన్నంగా మీరు వస్తున్నారు. తప్పులు వెతకాలనీ, కించపరచాలనీ, ఎకాలజిస్టు గనక ఎగతాళి చెయ్యొచ్చనీ. దానివల్ల చర్చా జరగదు, సంఘర్షణా జరగదు. అత్యంత అవసరమైన ప్రక్రియల మధ్యలోనే శాస్త్రబద్ధత తేలాలని మీరు నమ్మితే నమ్మండి. నాకా నమ్మకం లేదు.

  జరిగింది, జరిగి ఉండొచ్చు అని తేడా ఉంటుంది. నిజమే. కాని ఆ తేడాలు నేను కూడా ఎకాలజిస్టుని అయినప్పుడు లెక్కలోకి వస్తాయి. నేను చదివింది మాత్రమే నేను రాస్తాను. అలా చదివిందే రాసానని లింక్ లు ఇచ్చాను. లింక్ లు ఇవ్వడం అంటెనే అర్ధం అదే. దాన్ని వదిలి వచ్చు అని మాత్రమే రాయాలంటూ సర్టెనిటీ, అన్ సర్టెనిటీ ల కొలతలకు దిగడం ఎందుకు? ఇలాంటి బాషా సూత్రాలు ఆయా సందర్భాలని బట్టి పాటించాల్సిన అవసరం వస్తుంది. ఇప్పటి సందర్భానికి, ‘నేను చదివింది రాయడం-మీరు ఎకాలజిస్టు గా వివరించడం’ కి ఆ సూత్రాలని వర్తింపజేసి ఎగతాళికి దిగే గొప్పపనిక్ దిగాల్సిన అవసరం ఉందా? ఉందని నేననుకోవడం లేదు.

  ఇక మీ డిమాండ్, సప్లై సూత్రాలు ఇక్కడెందుకు? ఆ సూత్రాలా ఇక్కడ మాట్లాడుకుంటున్నది? ఇక్కడ చర్చిస్తున్నది వాటికి అతీతమైనది. ఫుకుషిమా ప్రమాదం వల్ల జనం వణికిపోతుంటే, దాన్ని వదిలి వ్యాపార సూత్రాలు వల్లించడం ఏమిటో, ఎకాలజిస్టులకీ వ్యాపార సూత్రాలతో పనేమిటో నాకు బోధపడలేదు. ఎకాలజీ లో వ్యాపార సూత్రాలూ చెబుతారా? చెబితే అది వ్యాపార సంస్ధల కోసం నేర్పే ఏకాలజీ అవుతుంది తప్ప జనానికి ఉపయోగపడేది కాదు. బహుశా అందుకనే కాబోలు. జనం విపరీతంగా డిమాండ్ చేయడం వల్ల కంపెనీలు అణు విద్యుత్ తయారు చెయ్యక తప్పడం లేదనీ, డిమాండ్ తగ్గిస్తే అణు విద్యుత్ ని కంపెనీలు తయారు చెయ్యవనీ చెప్పబోయారు.

  అసలు విద్యుత్ ఎక్కువగా ఎవరు వాడుతున్నారు? జనమా, కంపెనీలా? వ్యవసాయం చెయ్యడానికి విద్యుత్ లేదని రైతులు గోలపెడుతున్నారు. పంటలు ఎండిపోతున్నాయని ఆత్మహత్యలూ చేసుకుంటున్నారు. పేదల సంగతి చెప్పపని లేదు. కోతలు ఎక్కువయ్యాయని మధ్యతరగతి జనం తిట్టుకుంటున్నారు. నాణ్యమైన విద్యుత్ లేదని చిన్న పరిశ్రమల వాళ్ళు సమ్మెకి కూడా సిద్ధపడ్డారు. అలాంటి జనానికా మీరు విద్యుత్ పొదుపు చేయాలని చెబుతారు? ఏం చేసయినా విద్యుత్ ఉత్పత్తి చేసి సప్లై చేయాలని ఎవరైనా చెబుతారా? అందునా ఎకాలజిస్టులు అలా చెబుతారా? పెట్టుబడిదారీ కంపెనీల లంచం డబ్బు మేసి, తృప్తితో బ్రేవ్ మని తేరిస్తే వారు చెప్పగలరు. అలాంటి దరిద్రులు బోలెడు ఉండడం వల్లనే జనానికి నిజాలు తెలియడం లేదు. ప్రభుత్వాల, కంపెనీల అబద్ధాలూ, అభూత కల్పనలు కూడా శాస్త్రబద్ధతలోకి వెళ్లిపోతున్నాయి. (మీరు ఇందులో లేరు.)

  ఉత్పత్తులు తయారయ్యాక అమ్మకానికి వచ్చాక వ్యాపార సూత్రాలు. వాటి కంటే ముందు చూడాల్సింది ప్రజా సంక్షేమం. అందరికీ ఉపయోగపడే పద్ధతుల్లో ఉత్పత్తి, ఆ తర్వాత వ్యాపారమూ జరగాలి. వ్యాపారమైనా దాని అంతిమ ప్రయోజనం ప్రజలే. ఆ పరిస్ధితే లేకపోయింది. వ్యాపార కంపెనీలే వ్యవస్ధల్ని, దేశాల్నీ నడిపిస్తున్నందున (వ్యాపారం కోసం వచ్చి దేశాల్ని వలసలుగా చేసుకున్న సంగతి అందరికీ తెలిసిందే) వ్యాపారమే ముఖ్యమై పోయి ప్రజా సంక్షేమం పక్కకి వెళ్లిపోయింది. ఆకలీ, దరిద్రం, నిరుద్యోగం అన్నీ అటువంటి పరిస్ధితిలో పుట్టినవే. మళ్ళీ ఇంత ప్రమాదం జరిగినా అణు విద్యుత్ వద్దని జనం మొత్తుకుంటున్నా, ప్రభుత్వాలకీ కంపెనీలకి అణు విద్యుత్ వద్దని చెప్పడం మాని తప్పదని జనానికి చెప్పడం అంటున్నారంటే మీరు ఎవరి పక్షం? ప్రజల పక్షమా, కంపెనీల పక్షమా?

 13. విశేఖర్ గారూ,

  “ఇదా మీ క్రిటికల్ ఎనాలసిస్? ఈ స్ధాయికి ఎదగడం నా వల్ల కాదు లెండి”
  వ్యంగ్యానికీ వ్యక్తిగత విమర్శలకు మీకేమాత్రం తేడా తెలుసునో ఇది ఋజువు చేస్తోంది! మీ స్థాయి తెలుగు బ్లాగులు చదివే అందరికీ సుపరిచితమే!

  “……………మీ తాడూ బొంగరం గురించి కూడా తెలుసుకొని ఉండాల్సింది…….”
  దానిదేమి భాగ్యం బ్రహ్మాండంగా తెలుసుకోవచ్చు. బి.టెక్ ఇన్ కెమికల్ ఇంజినీరింగ్ (ఆచార్య నాగార్జున విశ్యవిద్యాలయం), మాస్టర్ ఆఫ్ సైన్స్ ఇన్ సస్టైనబుల్ వేస్ట్ మేనేజిమెంట్ (యూనివర్శిటీ ఆఫ్ సెంట్రల్ లాంకషైర్, యు.కె). మీకింకా అనుమానాలుంటే మీ మెయిల్ ఐడి ఇవ్వండి నా సర్టిఫికెట్ల నకళ్ళు కూడా భేషుగ్గా పంపగలను. ఇవండి నా అర్హతలు ఈ విషయమ్మీద మాట్లాడటానికి.

  “నేను లేని చోట ఫేక్ అని అనుచితంగా ఎందుకు వ్యాఖ్యానించారని నేను అడిగితే దాటవేస్తారేమిటి”
  ఇదెక్కడ మహాశాయా?! మీరు లేనిచోట మిమ్మల్ని ఫేక్ అన్నానా? ఎక్కడో కాస్త చూపిస్తారా? మీరు సంతోషించినా సంతోషించకపోయినా అవాకులూ చవాకులూ రాసినప్పుడు అదీ ముక్కో ముక్కన్నరో దాని గుఱించి తెలిసినప్పుడు నిరభ్యంతరంగా ఖండిస్తాం.

  “మీరు అకస్మాత్తుగా ఎకాలజిస్టునంటూ ఊడిపడి ఒక వాక్యాన్ని పట్టుకుని, తాడూ బొంగరం ఏమీ చెప్పకుండానే”
  నా అర్హతలేమిటనేది పైన చెప్పాను కాస్త చూడండి.

  “శాస్త్రబద్ధత పేరుతొ, ఆధారాల పేరుతో వ్యక్తుల చొరవను నిరాకరించడం అది”
  ఇక్కడ ఎండగడుతున్నది వ్యక్తుల చొరవనూ కాదు, వారి కృషినీ కాదు. ఎండగట్టబడుతున్నది శాస్త్రీయత ముసుగు వేసుకుని చేస్తున్న అసత్య ప్రచారాలను.

  “ఇక్కడ మనవరకూ రాలేదు గనక మనకా సెగ తగల్లేదు……….”
  యూరోపుదాకా వెళ్ళిన అణుధార్మికత భారతదేశాన్నెందుకు వదిలేసిందో, అసలు పక్కనే ఉన్న చైనాని, కొరియానీ ఎందుకని వదిలేసిందో! మీలాంటి వాళ్ళ రాతలు చదివితే భాయాందోళనలు కాక ధైర్యం ఎక్కణ్ణుంచి వస్తుందిలెండి!

  “…………….. ప్రతీదాన్నీ నమ్ముతూ, ఏది అబద్ధమో, ఏది నిజమో, ఏది శాస్త్రబద్ధమో తెలియని గందరగోళంలో ఉంటూ, వారి దయా దాక్షిణ్యాలకోసం ఎదురు చూడాలా”
  పుకార్లు, పుక్కిటి పురాణాలమీద నిర్ణయాలు తీసుకోవాలంటారా ఏమిటి ఖర్మ?!

  “………………ఆ యిస్టులమనీ, ఈ యిస్టులమనీ కనుక మేం చెప్పేవన్నీ నమ్మాలనీ చెప్పి నోరు మూపించదలిస్తే అది ప్రజాస్వామ్యం కాదు. ప్రజాస్వామిక భావజాలం అంతకంటే కాదు………………..”
  మార్క్సిస్టులు ప్రజాస్వామ్యం గుఱించి మాట్లాడం వింతల్లోకెల్లా వింత! ఈ పాఠమేదో ఎఱ్ఱ చైనాకి చెప్పితే బావుంటుంది. జపానులో ప్రజాస్వామ్యం ఉండబట్టే ఇలాంటి రాతలు ఎంచక్కా రాసుకోగలుగుతున్నారని మర్చిపోవద్దు!

  “………. అలా కొలిచే అర్హతా, గౌరవం మీకెవరైనా ఇస్తే అక్కడ ఆపని నిరభ్యంతరంగా చెయ్యండి. కానీ చర్చ కోసం, తెలుసుకోవడం కోసం కొన్ని వార్తలను, అధ్యయనాలనూ, వాదనలనూ నేను రాస్తుంటే……”
  బ్లాగు ఒక మాస్ మీడియా. అందులో మీర్రాసే రాతలు కచ్చితంగా ప్రశ్నించటానికి అర్హమైనవే. ఇక మీకు తెలుగు నేర్పటం నా పని కాదు. మాస్ మీడియాలో రాసేటప్పుడు మీరు ఏ భాషలో రాస్తున్నారో ఆ భాషలో సరైన భావ వ్యక్తీరరణా సామర్థం కలిగి ఉండటం తప్పనిసరి. పుకార్లూ గాలివార్తలూ రాసుకుంటానంటే బ్రహ్మాండంగా రాసుకోవచ్చు. ప్రశ్నించకూడదంటేనే వచ్చేది తంటా!

  “జనం విపరీతంగా డిమాండ్ చేయడం వల్ల కంపెనీలు అణు విద్యుత్ తయారు చెయ్యక తప్పడం లేదనీ, డిమాండ్ తగ్గిస్తే అణు విద్యుత్ ని కంపెనీలు తయారు చెయ్యవనీ చెప్పబోయారు”
  మార్కెట్ మీద మీ అవగాహన ఎంత అనేది ఈ ఒక్కముక్క చూస్తే చాలు అర్థం అవుతుంది! ఎవ్వరూ అడక్క మరెందుకు అణువిద్యుత్ తయారుచేస్తున్నరో మీరు చెబితే తెలుసుకుంటాం. మీ వల్ల నాకో గొప్ప సూత్రం తెలిసింది మరి! వస్తువు తయారయ్యాక వ్యాపార సూత్రాలా! ఒక వస్తువు ఏమేరకు అమ్ముడు పోతుందో తెలీకుండా తయారు చేసి పెట్టుకుంటే మిగిలేది బూడిదే!

  “అణు విద్యుత్ వద్దని జనం మొత్తుకుంటున్నా, ప్రభుత్వాలకీ కంపెనీలకి అణు విద్యుత్ వద్దని చెప్పడం మాని తప్పదని జనానికి చెప్పడం అంటున్నారంటే మీరు ఎవరి పక్షం? ప్రజల పక్షమా, కంపెనీల పక్షమా?”
  నేనెవరి పక్షమో ఎందుకులే కానీ మరి ఇదే ముక్క రష్యాకూ, చైనాకూ, ఉత్తరకొరియాకూ కూడా చెప్పి అణువిద్యుత్ ప్లాంట్లను మూయిద్దామా మరి?

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

Connecting to %s