యు.పి: ఒకే రోజు నాలుగు రేప్ లు, మూడేళ్ళ పాపతో సహా


rapeఉత్తర ప్రదేశ్ లో ఒకే రోజు నాలుగు రేప్ కేసులు పోలీసులని చేరాయి. ఒక దళిత బాలిక, మూడేళ్ళ పాప వారిలో ఉన్నారు. రేపిస్టులు తాము చెయ్యదలుచుకున్నది చేసి బాధితులను నిర్మానుష్య ప్రాంతాల్లో వదిలి పెట్టారు. పదేళ్ళ బాలికను అతని మేనమామతో సహా నలుగురు వ్యక్తులు రేప్ చేశారు. సామూహిక మానభంగానికి గురయిన దళిత బాలిక ఫిర్యాదుని స్వీకరించడానికి పోలీసులు నిరాకరించారు. రెండు రోజులు తిప్పుకున్న తర్వాత మాత్రమే ఫిర్యాదు నమోదు చేశారు.

ఝాన్సీ లో ఓ దళిత బాలిక రేప్ కి గురయింది. ఆగ్ర కులస్ధులు తనను సామూహిక మాన భంగానికి గురి చేశారని ఆ బాలిక ఆరోపిస్తున్నది. మైనర్ అయిన బాలికను నేరం జరిపాక సమీపంలోని అడవిలో వదిలి వెళ్లారు. ఎలాగో కష్టపడి ఇంటికి చేరిన బాలిక ఫిర్యాదు చేయడానికి వెళ్తే పోలీసులనుండి తిరస్కరణ ఎదుర్కొంది. రెండు రోజులు వారి చుట్టూ తిరిగింది. చివరకు వైద్య పరీక్షలలో మాన భంగం జరిగినట్లు నిర్ధారణ అయ్యాక గాని రేప్ కేసు నమోదు చేయలేదు. నిందితులు పరారీలో ఉన్నారని ఎన్.డి.టి.వి తెలిపింది.

బారా బంకి జిల్లాల్లో అమానుషంగా మూడేళ్ళ పాప రేప్ కి గురయింది. ఒక ఫంక్షన్ కి వెళ్ళగా పాప తప్పి పోయింది. చివరికి ఒక పొలంలో చనిపోయి కనపడింది. పోలీసులు కుక్కలను వినియోగించి నిందితుడిని పట్టుకున్నారు. నేర స్ధలం నుండి బయలుదేరిన కుక్కలు రంజిత్ అనే వ్యక్తి ఇంటికి చేరాయి. ఇంటిలో దాక్కుని ఉన్న రంజిత్ ని అరెస్టు చేశామని పోలీసులు తెలిపారు.

ఆదివారం రాత్రి నోయిడాలో ఒక మహిళ రేప్ కి గురయింది. మహిళా పై జరిపిన వైద్య పరీక్షలు మానభంగం జరిగినట్లు నిర్ధారించాయి. నిందితుల్లో ఒకరిని పోలీసులు అరెస్టు చేశారు. 32 యేళ్ళ ఆ మహిళ పని స్ధలం నుండి రాత్రి 8.30 గం. లకి సెక్టార్ 93 లోని ఇంటికి తిరిగి వస్తోంది. ఇద్దరు వ్యక్తులు ఆమెను బలవంతంగా కారులోకి ఎక్కించుకుని సమీపంలోని అడవికి పట్టుకుపోయారట. ఉదయం 4 గంటలకి కాళింది కుంజ్ లో ఆమెను గిరాటేసి పోయారు. ఉదయం 7 గంటల ప్రాంతంలో ఆమె పోలీసు స్టేషన్ కి వచ్చి రిపోర్టు చేసింది. ఆమె అద్దెకి  ఉంటున్న ఇంట్లోనే నివశిస్తున్న 39 యేళ్ళ కన్వర్ పాల్ ని ఈ కేసులో అరెస్టు చేశారు. సమీప గ్రామంలో ఇతనికి సిమెంటు షాపు ఉందట. మహిళ భర్త చనిపోయినట్లు తెలుస్తోంది. తన రెండున్నరేళ్ల పాపను డార్జిలింగ్ లోని తన తల్లి వద్ద ఉంచి ఒంటరిగా పని చేసుకుని బతుకుతోంది.

కన్నాజ్ జిల్లాలో పదేళ్ళ పాప సామూహిక మానభంగానికి గురయింది. “వాళ్ళు నన్ను పట్టుకుని గదిలోకి ఎత్తుకెళ్లారు. మాభా భంగం చేశారు. ఆయన నా మేనమామ” అని బాలిక తెలిపింది. మేనమామ తో సహా నలుగురు వ్యక్తులు బాలికను రేప్ చేశారు.

ఈ నాలుగు కేసుల్లో ఎవరికీ రెచ్చ గొట్టే విధంగా దుస్తులు వేసుకునే అవకాశం లేదు. దళిత బాలిక పేదరాలు. పేదరికం వల్ల చిరిగిపోయిన దుస్తులు వేసుకున్నదేమో తెలియదు. ‘చిరిగిపోయిన బట్టలు వేసుకుంటే చూసిన అమాయక పురుష పుంగవులు రెచ్చిపోరా?’ అని పోలీసులు అడుగుతారేమో. పేదరాలు, అదీ మైనర్ బాలిక కూలి చేసి ఎంత సొమ్ము సంపాదిస్తే రెచ్చగొట్టే స్కర్టులు, బ్లౌజులు వేసుకోగలదు?

మూడేళ్ళ పాప కి అసలు రెచ్చగొట్టే విషయమే తెలియదు. అమ్మా నాన్న వేసిన డ్రస్ తప్ప ఫ్యాషన్ దుస్తులు వేసుకోవచ్చనీ, అందరినీ తనవైపు ఆకర్షించాలనీ తెలియని వయసు. ‘పప్పీ షేమ్’ అని తోటి పిల్లలో, తాతా నాయనమ్మలో ఏడిపిస్తే తప్ప తన వంటి మీద బట్టలు లేవని గ్రహించలేదు. ఏం రెచ్చగొట్టిందని ఆ పాపని రేప్ చేయాలి?

మరో పాపకి పదేళ్ళు. ఆ పిల్లదీ అదే పరిస్ధితి. సొంత మేనమామ, తన పిల్లలతో సమానంగా చూడవలసినవాడు రేప్ చేశాడు. చిన్న వయసు గనక, మేనమామతో సరసం ఆడిందనడానికి కూడా లేదాయే. కనీసం సరసం ఆడొచ్చని కూడా తెలియని వయసు. పదేళ్ళ వయసులో ఏ డ్రస్సు వేసుకుంటే పురుష వీరులను రెచ్చగొట్టగలదు? రేపిస్టుల మనసు చెదరడానికి పదేళ్ళ పాప ఎన్ని ప్రయత్నాలు చేస్తే సాధ్యం అవుతుంది?

ఇక 32 సంవత్సరాల విధవ. భర్త చనిపోయిన పాపానికి విధవ గా పేరిడిన సమాజం రేప్ చేసే పురుషులను కనీసం వెధవ అనయినా పిలుస్తుందా? రాత్రి ఎనిమిది దాటితే స్త్రీలని బైట తిరగకుండా చేయాలని ఢిల్లీ పోలీసులు ప్రతిపాదించారు. ఎనిమిది ముందు జరిగే రేప్ ల నివారణకి ఏం చేయాలో వారు చెప్పలేదు. భర్త లేని స్త్రీ, పొట్ట నింపుకోవడానికి ఏ పని చేస్తే రాత్రి ఎనిమిది దాటకుండా ఉంటుంది? కూలీ నాలీ చేసుకుని బతికేవారు, ఇళ్ళల్లో పాచిపని చేసి బతికేవారూ, రోడ్లు ఊడ్చే కార్మిక స్త్రీలు తాము పగలే పని చేస్తామనీ, చచ్చినట్లు పని ఇవ్వాల్సిందేననీ షరతులు పెట్టి పని సంపాదించగలరా? ప్రవేటు వ్యక్తులనీ, సంస్ధలని వదిలేద్దాం. ప్రభుత్వానికైనా ఆ షరతులని కార్మిక స్త్రీలు విధించి పని సంపాదించగలరా?

చేతగాక పోతే సరి!

(మొన్నటి పోస్టు చదవని వారికి పై ప్రశ్నలు అయోమయంగా తోచవచ్చు. రేప్ లకి ఆడవారి వస్త్ర ధారణనీ, రాత్రి పనినీ కారణంగా చూపిన ఢిల్లీ పోలీసుల విషయమై రాసిన పోస్టు ను చూశాక ఈ ఆర్టికల్ చూసినట్లయితే ఈ ప్రశ్నలపైన అయోమయం కలగదు)

7 thoughts on “యు.పి: ఒకే రోజు నాలుగు రేప్ లు, మూడేళ్ళ పాపతో సహా

 1. ఎన్.డి.టి.వి వాళ్లు డిల్లి చుట్టుపక్కల ఉండే యు.పి., యం.పి. లలో జరిగే ఇటువంటి సంఘటనలను ఆరుషి కేసులాగా ట్రాక్ చేస్తే బాగుంట్టుంది. దోషులను జైల్లో శిక్ష పడే వరకు వెంటపడాలి.

 2. విశేఖర్ గారూ,

  చెరబండరాజు మండే కలంతో రాసిన ‘వందేమాతరం’ కవిత గుర్తొస్తోంది.
  ఓ నా ప్రియమైన మాతృదేశమా
  తల్లివి తండ్రివి దైవానివి నీవేనమ్మా
  దుండగులతో పక్కమీద కులుకుతున్న శీలం నీది
  అంతర్జాతీయ విపణిలో అంగాంగం తాకట్టు పెట్టిన అందం నీది
  సంపన్నుల చేతుల్లో మైమరచి నిద్రిస్తున్న యవ్వనం నీది
  ఊసినా దుమ్మెత్తి పోసినా చలనం లేని మైకం నీది
  కోతకొచ్చిన చేనులో కలుగులు తవ్వుతున్న
  ఎలకల్నీ పందికొక్కుల్నీ భరిస్తూ నించున్న “భారతి” వమ్మా
  నోటికందని సస్యశ్యామల సీమవమ్మా
  వందేమాతరం వందేమాతరం

  ఒంటి మీద గుడ్డలతో జండాలు కుట్టించి
  వివస్త్రవై ఊరేగుతున్న ధైర్యం నీది
  అప్పుతెచ్చి వేసిన మిద్దెల్లో
  కాలు గాలిన పిల్లిలా తిరుగుతున్న దీనత్వం నీది
  ఎండిన స్తనాలమీదికి ఎగబడ్డ బిడ్డల్ని
  ఓదార్చలేని శోకం నీది
  ఆకలికి ఎండి మాడి ఎరువు సొమ్ములతో
  వీధిన బడ్డసింగారం నీది
  అమ్మా భారతీ నీ గమ్యం ఏమిటి తల్లీ
  వందేమాతరం వందేమాతరం.

  “మాతృదేశం పై విపరీతమైన ప్రేమ అనురాగం ఉన్న వ్యక్తే ఇటువంటి పోలికలు ధైర్యంగా చెప్పగలడు. భారతమాతకి “దైవత్వం” ఆపాదించి, ఆ దైవత్వం ఒక ప్రతీకగా వాడాడు చెరబండరాజు. ఆ దేవత అందం, యవ్వనం, ముఖ్యంగా శీలం గురించి జుగుప్స కలిగించే మాటలు వాడుతాడు.”

  ఈ కథనం ప్రధానాంశానికి ఈ కవిత సందర్భం సరిపోదేమో కాని, వేల సంవత్సరాల మనుగడ కలిగిన మన ఘనతర సంస్కృతి పోకూడని మార్గాలలోకి వెళ్లిపోతోందేమో అనిపిస్తోంది. పసిపిల్లలతో కుతి తీర్చుకోవడం.. తల్చుకోవడానికే పరమ జుగుప్సాకరంగా ఉన్న ఈ కథనం సారాంశాన్ని చూస్తుంటే ఒళ్లు జలదరిస్తోంది. వేల సంవత్సరాల నాటి రక్తపూజలూ, చంద్రగ్రహయాత్రలూ పక్కపక్కనే ఉనికిలో ఉంటున్న దేశం ఇలా తప్ప మరోలా ఉండదేమో…

  మీకు ఒక చిన్న అభ్యర్థన. రేప్ అనే ఆంగ్ల పదాన్ని చాలా తరచుగా వాడుతున్నట్లున్నారు.మీరు. దశాబ్దాలుగా స్త్రీవాదులలో ప్రపంచవ్యాప్తంగా దీనిపై చర్చ జరుగుతున్నట్లుంది. పితృస్వామ్య ఆధిపత్య సంస్కృతిలో బాగా వల్గరైజ్ చేయబడి పురుషుడి అహానికి ప్రతీకగా వాడుకలో ఉన్న రేప్ పదాన్ని ఉపయోగించవద్దని 90లలోనే తెలుగులో స్త్రీవాద సాహిత్యంలో తీవ్రంగా చర్చ జరిగింది. అత్యాచారం అనే పదాన్నే అప్పటినుంచి ఎక్కువగా ఉపయోగిస్తున్నట్లుంది. రెండు పదాలు ఒకే అర్థం ఇస్తున్నా సరే రేప్ అనే పదాన్ని వాడకుంటేనే బాగుంటుందని నా సలహా..

  అత్యాచారాలను కూడా వర్గ దృష్టితోనే ప్రాధాన్యత ఇవ్వవలసి ఉంటుంది. పబ్ సంస్కృతిలో భాగంగా జరుగుతున్న అత్యాచారాలను, ఈ కథనంలో మీరు ప్రస్తావించిన రకం అత్యాచారాలను వేరు చూసి చూడాల్సి ఉంటుంది. అత్యాచారాల రిపోర్టింగులో కూడా మనం ఎన్డీటీవీలనుంచి వేరుపడాలి.

  నా వ్యాఖ్యలో అపార్థానికి తావు ఇచ్చే అంశాలు లేవనే అనుకుంటున్నాను.

 3. రాజశేఖర రాజు గారు, దయచేసి అపార్ధాలన్న అనుమాలేవీ పెట్టుకోవద్దు. మీ అభిప్రాయాలని నిర్మొహమాటంగా ఉన్నది ఉన్నట్లు రాస్తేనే నాకు సంతోషం. తీవ్రతను అసలే తగ్గించవద్దు.

  రేప్ పదం విషయంలో మీరన్నది కరెక్టే. ఆ పదం రాస్తున్నపుడు మరో పదం కోసం ఆలోచించాను కాని తట్టలేదు. అత్యాచారం అన్న పదాన్ని ఇతర సందర్భాలకు కూడా వాడుతున్నందున దాన్ని రాయలేమనిపించింది. ‘మానభంగం’ అని ఒకటి రెండు సార్లు వాడాను. అది పితృస్వామిక భావాజాలంను ఇంకా ఎక్కువ చెబుతున్నట్లనిపించింది. మరో పదం దొరక్క అదే వాడాను. జరిగిన ఘటన తీవ్రత తెలియజేయడానికి అదే సరైనదేమో అని కూడా అనిపించింది.

 4. తెలుగు పత్రికలు కొన్నేళ్ళ క్రితం ‘మాన భంగం’ అనే మాట వాడేవి. ఆ మాట బాధితురాలిపై జరిగిన ఘోరాన్ని చెప్ప టం లేదు. అవమానాన్ని కాకుండా శీలం గురించిన స్పృహనే అధికంగా సూచిస్తోంది. మీరన్నట్టు ఇది పితృస్వామిక భావజాలం నుంచి వచ్చిన మాట.

  ఇప్పుడు మన రాష్ట్రంలోని పత్రికలన్నీ ‘అత్యాచారం’ అనే మాటనే ఉపయోగిస్తున్నాయి. దానికి ‘ లైంగిక అత్యాచారం’ అనే అర్థం రూఢి అయిపోయింది కూడా. అందుకే రేప్ అనే మాటకు బదులు ‘అత్యాచారం’ అని వాడటమే సబబు. ఈ పదం కూడా ఘటన తీవ్రతనే సూచిస్తోంది కదా?

 5. విశేఖర్ గారూ, మిమ్మల్ని ఉద్దేశించి కాదు. భారతమాతకి “దైవత్వం” ఆపాదించి 40 ఏళ్ల క్రితం చెరబండరాజు రాసిన మహద్గీతాన్ని ప్రస్తావించాను కదా… మూడు ఆధునిక ప్రార్థనా గీతాల్లో ఒకటిగా పేరొందిన ఈ కొత్త వందేమాతరం కవితలో వాడిన వర్ణనలు ఎక్కడ కొందరు మనసులను గాయపరుస్తాయో అనే నేపథ్యంలోనే, ‘నా వ్యాఖ్యలో అపార్థానికి తావు ఇచ్చే అంశాలు లేవనే అనుకుంటున్నాను.’ అని రాశాను. మీరన్నట్లు ‘అభిప్రాయాలని నిర్మొహమాటంగా ఉన్నది ఉన్నట్లు రాయటం చర్చకు చాలా ఉపయోగం.

  వేణు గారూ,
  అత్యాచారం పద ప్రయోగంపై మీ వివరణ మరింత స్పష్టంగా ఉంది. పత్రికా భాషలో గతంలో వాడిన మానభంగం పదమే కాదు.. జనం వాడుకలో పాడు చేయడం, చెరిచేయడం వంటి పదాలు కూడా ఉంటున్నాయన్నది తెలిసిన విషయమే. ఇతర జంతువులు, వస్తువుల్లాగా ఆడది కూడా మగవాడి ఆస్తిగా పరిణమించిన పాడుకాలంలో పుట్టిన భావనలివి. రూపం మారినా సారంలో సమాజం వ్యక్తిగత ఆస్తి పునాదిమీదే నడుస్తోంది కాబట్టి ఇలాంటి పదాలు ఈనాటికీ జనం వాడుకలో కొనసాగుతున్నాయి.
  ధన్యవాదాలు.

 6. రాజు, వేణు గార్లకు, మీ సూచనను ఇకముందు పాటిస్తాను. ఆర్టికల్ లో మీరు అభ్యంతరం చెప్పిన పదం ఎడిట్ చేయాలని మొదట భావించాను. కాని అలా చేస్తే మీ సూచనలకు అర్ధం లేకుండా పోతుంది. అందుకని ఇప్పటికి అలాగే ఉంచి భవిష్యత్తులో జాగ్రత్త తీసుకుంటాను.

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

గూగుల్ చిత్రం

You are commenting using your Google account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

Connecting to %s