భారత అణు కర్మాగారాలపై ఐ.ఏ.ఇ.ఏ కి ఫిర్యాదు చేస్తాం -శ్రీలంక


kudankulam_nuclear-plantతమ దేశానికి అతి సమీపంలో ఉన్న భారత అణు కర్మాగారాల విషయంలో అంతర్జాతీయ అణు శక్తి సంస్ధకు ఫిర్యాదు చేస్తామని శ్రీలంక ప్రకటించింది. అణు కర్మాగారాలు నిర్మించుకోవడానికి భారత దేశానికి గల హక్కును గుర్తిస్తామనీ అయితే ఆ దేశ అణు కర్మాగారాల నుండి తమ దేశానికి ఎదురయ్యే రేడియేషన్ ప్రమాదం పట్ల మాకు ఆందోళనలున్నాయని శ్రీలంక ఇంధన శాఖ మంత్రి చంపికా రనవాకా అన్నాడు. పక్క దేశమే అణు కర్మాగారల పట్ల భయాందోళనలు వ్యక్తం చేస్తున్నపుడు అణు కర్మాగారాల పక్కనే నివసించే ప్రజలు ఆందోళనలు చెందడంలో ఆశ్చర్యమ్ లేదు.

కుదంకుళం అణు కర్మాగారానికి వ్యతిరేకంగా తమిళనాడు ప్రజలు అనేక నెలలుగా ఆందోళన నిర్వహిస్తున్నారు. ప్రజల ఆందోళనలకు సమాధానం చెప్పవలసిన ప్రభుత్వం వారిపై దుష్ప్రచారానికి పూనుకుంది. ఆందోళనకారులకు అమెరికా, స్కాండినేవియన్ దేశాల నుండి ఆర్ధిక సహాయం అందుతున్నదంటూ దేశ ప్రజలపైనే వ్యతిరేక ప్రచారానికి దిగింది. ఆందోళనకు నాయకత్వం వహిస్తున్న ఎన్.జి.ఓ సంస్ధలకు అమెరికా నిధులు వస్తున్నాయని ఆరోపించినప్పటికీ భారత ప్రభుత్వం ఇప్పటివరకూ అందుకు తగిన ఆధారాలేవీ చూపించలేకపోయింది. ఇప్పుడు శ్రీలంక ప్రభుత్వ ఆందోళనకు నేరుగా సమాధానం ఇవ్వడానికి బదులు కూర్చుని చర్చించుకుందాం అంటూ లేఖలు రాస్తోంది.

అణు కర్మాగారాల వద్ద చెర్నోబిల్, ఫుకుకుషిమా తరహా ప్రమాదం సంభవించినట్లయితే శ్రీలంక కు కూడా రేడియేషన్ ప్రభావం సోకుతుందని ఆ ప్రభుత్వం భయపడుతోంది. భారత్ భూభాగంతో ఇరవై కి.మీ దూరంలో మాత్రమే ఉన్న శ్రీలంక భారత అణు కర్మాగారాలు ప్రమాదంలో చిక్కుకుంటే రేడియేషన్ ప్రమాదం నుండి శ్రీలంక కూడా ఎదుర్కోవలసిందే. ఫుకుషిమా ప్రమాదం సంభవించిన తర్వాత అమెరికా, యూరప్ లవరకూ రేడియేషన్ విస్తరించింది. అణు ప్రమాదం తర్వాత సంభవించిన నష్టాన్ని జపాన్ ఇంతవరకూ పూడ్చుకోలేకపోయింది. ఫుకుషిమా కర్మాగారాన్ని శుభ్రపరచడం అసాధ్యం అని తేలిపోయింది. శుభ్రపరచడానికీ, ప్రమాద రహింతంగా చేయడానికీ కనీసం ముప్ఫై సంవత్సరాలు పడుతుందని జపాన్ ప్రకటించింది. ఈ నేపధ్యంలో శ్రీలంక ప్రభుత్వం గానీ, తమిళనాడు ప్రజలు గానీ ఆందోళన చెందడంలో ఆశ్చర్యం లేదు.

koodankulam1

“అణు విద్యుత్ కర్మాగారాలు నిర్మించుకోవడంళో భారత్ కి ఉన్న హక్కుని మేము గౌరవిస్తున్నాం. కానీ ప్రమాదం సంభవిస్తే శ్రీలంకపై కలగనున్న రేడియేషన్ ప్రభావంపైనే మా దిగులంతా. మేము ఇప్పటికే లేఖ రాశామ్” అని శ్రీలంక విద్యుత్, ఇంధన మంత్రి చంపికా రణవాకా అన్నాడు. చెర్నోబిల్, ఫుకుషిమా ప్రమాదాల నుండే మా ఆందోళనలు ఆధారపడ్డాయనీ, తమ భద్రతకు గ్యారంటీ దొరికేవైపుగా తాము కృషి చేస్తామనీ రణవాకా అన్నాడు. కనీసం మూడు అణు కర్మాగారాలు తమిళనాడు దక్షిణ తీరంలో ఉన్నాయని శ్రీలంక ఎనర్జీ శాఖ అధికారులు గుర్తు చేస్తున్నారు.

ఇరు దేశాల మధ్య పరస్పర ఒప్పందం కుదుర్చుకోవడం మంచిదని ఐ.ఏ.ఇ.ఏ సూచించిందని శ్రీలంక మంత్రి వెల్లడించాడు. “విదేశీ మంత్రిత్వ శాఖ ద్వారా భారత దేశానికి ఒక ప్రతిపాదన పంపాము. భారత దేశం ఒక నోట్ ని మాకు తిరిగి పంపింది” అని రణవాకా తెలిపాడు. విశాల ప్రాతిపదికన చర్చలు జరుపుదామని భారత దేశం ప్రతిపాదించినట్లు ఆయన తెలిపాడు. అయితే శ్రీలంక మాత్రం ప్రమాదం వల్ల సంభవించే వినాశనాన్ని నివారించే విషయంలో మాత్రమే చర్చించుకుని ఒప్పందం కుదుర్చుకోవాలని భావిస్తున్నట్లు తెలిపాడు.

శ్రీలంక వాయవ్య ప్రాంతంలోని మన్నార్ పట్నానికి కుదంకుళం అణు కర్మాగారం 250 కి.మీ దూరంలో ఉండి. అణు ప్రమాదం జరిగితే తగిన భద్రతా చర్యలు తీసుకునే సౌకర్యాలు శ్రీలంక దగ్గర లేవని తెలుస్తోంది. అటువంటి సౌకర్యాలు పొందడానికి భారత్ నుండి సహాయం కావాలని శ్రీలంక ఆశిస్తున్నట్లు కనిపిస్తోంది. శ్రీలంకని విశాల ప్రాతిపదికన చర్చలకు ఆహ్వానించిన భారత ప్రభుత్వం కుదంకుళం ప్రజలపై నిర్భంధాన్ని ప్రయోగిస్తోంది. వారి భయాలను పోగొట్టడానికి బదులు శుష్క వాగ్దానాలు కురిపిస్తోంది. తమిళనాడు గ్రామ ప్రజలను అమెరికా నుండి నిధులు పొంది ఆందోళన చేస్తున్నవారిగా చిత్రీస్తోంది. కుదంకుళం ఆందోళనకారులను అరెస్టులు చేసి వేధిస్తోంది.

8 thoughts on “భారత అణు కర్మాగారాలపై ఐ.ఏ.ఇ.ఏ కి ఫిర్యాదు చేస్తాం -శ్రీలంక

 1. “ఫుకుషిమా ప్రమాదం సంభవించిన తర్వాత అమెరికా, యూరప్ లవరకూ రేడియేషన్ విస్తరించింది….”
  అమెరికా పశ్చిమతీరాన్ని అణుధార్మికత తాకవచ్చనేది కేవలం అప్పట్లో చేసిన హెచ్చరిక మాత్రమే. అయితే అమెరికా (కెనడా కూడా కలిపి) పశ్చిమతీరాన్ని తాకినట్లు ఎలాంటి ఋజువులూ లేవు. ఇక అణుధార్మికత యూరోప్ వఱకూ వ్యాపించిందనటం కేవలం అపరిపక్వ మఱియు నిరూపణకు నిలబడని వ్రాత. ఇది చెప్పటానికి నా అర్హత ఏమిటని కష్టపడొద్దు. నేనో ఎకాలజిస్టును, వృత్తిరీత్యా. అణుధార్మికత యూరోప్ వరకూ విస్తరించిందనటానికి ఆధారాలేవైనా ఉంటే ఇవ్వండి నా వ్యాఖ్యలను వెనక్కి తీసుకుంటాను.

 2. నేను ఖండించింది మీరు వ్రాసిన ఒక వ్యాక్యం మాత్రమే! దాన్ని మీరు ఎడిట్ చేసినట్టున్నారు కనుక ఈ విషయంపై వాదనలకు ఇక్కడితో స్వస్తి!

 3. అచంగ గారూ, నేనేమీ ఎడిట్ చేయలేదు.

  మీరు ఖండించిన వాక్యం ఇది: “ఫుకుషిమా ప్రమాదం సంభవించిన తర్వాత అమెరికా, యూరప్ లవరకూ రేడియేషన్ విస్తరించింది”

  ఈ వాక్యం ఇంకా ఆర్టికల్ లో ఉంది కదా. ఎడిట్ చేశానని ఎందుకంటున్నారు? నేను వాదనకు కూడా దిగబోవడం లేదు. మరింత సమాచారం ఇవ్వడానికి మాత్రమే ప్రయత్నిస్తాను. ఓ.కె.

 4. నిజానికక్కడ ‘చేస్తే’ అని రావాలి, గూగుల్ IME ‘చేసినట్టున్నారు’ అని తీసుకుంది. సరే ఎలానూ సమాచారం ఇస్తానంటున్నారు కదా… చూద్దాం.

 5. అచంగ గారూ, ఆశ్చర్యంగా ఉందే. గూగుల్ ఐ ఎం ఇ లో ‘ఎడిట్ చేస్తే’ అని టైప్ చేస్తే ‘ఎడిట్ చేసినట్టున్నారు’ అని తీసుకుందా? అంత తేడా ఉంటుందా? నేనెప్పుడూ అది వాడలేదు లెండి.

 6. సరే… ఫుకుషిమా ప్రమాదం తర్వాత యూరోపు వరకూ అణుధార్మికత విస్తరించిందని మీరంటున్నారు కదా. తగు ఆధారాలు ఇస్తే మన చర్చ కొనసాగిద్దాం!

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

గూగుల్ చిత్రం

You are commenting using your Google account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

Connecting to %s