కాశ్మీర్ మంచు పర్వతాలలో 130 మంది పాక్ సైనికులు మంచులో సమాధి అయ్యారు. మంచు తుఫానులో వేగంగా కిందికి జారుతున్న భారీ మంచు గడ్డ కింద చిక్కుకుపోయి చనిపోయారు. 130 మంది కంటే ఎక్కువ సంఖ్యలోనే సైనికులు చనిపోయి ఉండవచ్చని భావిస్తున్నారు. అతి పెద్ద హిమాలయ పర్వతాలపైన గల సియాచిన్ గ్లేసియర్ పైన భారత సరిహద్దుకి సమీపంలో ఉన్న పాకిస్ధానీ ఆర్మీ శిబిరంపైకి మంచు గడ్డ దూసుకు రావడంతో తప్పించుకునే అవకాశం లభించలేదని తెలుస్తోంది.
సియాచిన్ గ్లేసియర్ జరిగిన దుర్ఘటనలో సైనికులను కాపాడడానికి పాక్ ప్రభుత్వం ప్రయత్నాలు చేపట్టింది. ఈ గ్లేసియర్ పైన భారత దేశానికి చెందిన సైనికులు కూడా వేల మంది శిబిరం ఏర్పాటు చేసుకుని సరిహద్దులో కాపలా కాస్తున్నారు. ప్రపంచంలోనే అత్యంత ఎత్తయిన యుద్ధ భూమిగా సియాచిన్ పేరు పొందింది. 22,000 అడుగుల (6,700 మీటర్లు) ఎత్తున గల సియాచిన్ యుద్ధ భూమి పాక్, భారత్ ల మధ్య తీవ్ర వివాద ప్రాంతంగా ప్రసిద్ధి కెక్కింది. వ్యూహాత్మకంగా కీలక ప్రాంతం కావడంతో ఇక్కడ నిరంతరం ఉద్రిక్తతలు కొనసాగుతుంటాయి.
శనివారం తెల్లవారు ఝాము గం.5.45 ని. లకు గాయరీ లోని బెటాలియన్ హెడ్ క్వార్టర్ పైకి మంచు తుఫాను తాకిందని పాక్ ఆర్మీ అధికారిని ఉటంకిస్తూ ‘ది గార్డియన్’ పత్రిక తెలిపింది. పాక్ మిలట్రీ అధికారికంగా ఇంకా ప్రకటన చేయలేదు.
1984 నుండి సియాచిన్ కోసం భారత్, పాక్ ల మధ్య అడపా దడపా ఘర్షణలు జరుగుతూ ఉన్నాయి. యుద్ధం వలన కంటే వాతావరణం వల్లనే ఇరువైపులా ప్రాణ నష్టం అధికంగా జరిగిందని చెబుతుంటారు. పూర్తి స్ధాయి యుద్ధం సంభావిస్తే అధిక ఎత్తులో ఉన్న సియాచిన్ కీలకంగా మారుతుంది. దానితో కఠినమైన వాతావరణంలో తీవ్ర ప్రతికూల పరిస్ధితుల్లో సైతం ఇరు పక్షాలూ సైనిక శిబిరాలను కొనసాగిస్తున్నాయి.