దక్షిణ చైనా సముద్రంలో భారత ప్రభుత్వ ఆయిల్ కంపెనీ ఓ.ఎన్.జి.సి విదేశ్ సాగిస్తున్న ఆయిల్ వెతుకులాటపై చైనా వ్యక్తం చేసిన అభ్యంతరాలను భారత ప్రభుత్వం తిరస్కరించింది. దక్షిణ చైనా సముద్రం ప్రపంచానికి చెందిన ఆస్తి అని దానిపై ఏ దేశానికి హక్కులు లేవనీ భారత విదేశాంగ మంత్రి ఎస్.ఎం.కృష్ణం వ్యాఖ్యానించాడు. దేశాల జోక్యాన్నుండి దక్షిణ చైనా సముద్రంలో జోక్యం ఉండరాదని ఆయన ప్రకటించాడు.
“దక్షిణ చైనా సముద్రం ప్రపంచానికి చెందిన ఆస్తి అని భారత దేశం భావిస్తోంది. ఆ వాణిజ్య మార్గాలు దేశీయ జోక్యం నుండి విముక్తి కావలసిన అవసరం ఉంది” అని ఆయన శుక్రవారం విలేఖరులతో వ్యాఖ్యానించాడు. చైనా హెచ్చరికను ఎస్.ఎం.కృష్ణ తిరస్కరించాడు. “దీన్ని ఆసియాన్ (అసోసియేషన్ ఆఫ్ సౌత్ ఈస్ట్ ఏసియా నేషన్స్) కూటమి అంగీకరించింది. చైనా కూడా అందుకు అంగీకరించింది. కనుక దక్షిణ చైనా సముద్ర మార్గాలు స్వేచ్చా వాణిజ్య మార్గాలుగా ఉండాలన్న అవగాహనను ఇండియా నమ్ముతోంది” అని ఎస్.ఎం.కృష్ణ తెలిపాడు.
దక్షిణ చైనా సముద్రంలో విదేశాల కార్యకలాపాలను చైనా వ్యతిరేకిస్తున్నది. ఈ ప్రాంతంలో ఆయిల్ తవ్వకాలకు భారత ప్రభుత్వ చమురు సహజవాయువు సంస్ధ (ఓ.ఎన్.జి.సి విదేశ్) ప్రయత్నిస్తున్నది. వియత్నాం ప్రభుత్వ చమురు సంస్ధతో కుదిరిన వ్యాపార ఒప్పందం మేరకు ఓ.ఎన్.జి.సి విదేశ్ ఆయిల్ ఎక్స్ ప్లోరేషన్ కార్యక్రమాలు నిర్వహిస్తున్నది. ఈ ప్రాంతంలోని ఇతర దేశాలైన వియత్నాం, ఫిలిప్పైన్స్ లతో (ఇవి ఆసియాన్ సభ్య దేశాలు కూడా) ప్రాదేశిక వివాదాలు ఉన్నందున దక్షిణ చైనా సముద్రం జోలికి రావద్దని చైనా కోరుతున్నది.
మార్చి నెలలో భారత దేశంలో బ్రిక్స్ దేశాల సమావేశం జరిగింది. బ్రెజిల్, రష్యా, ఇండియా, చైనా, సౌత్ ఆఫ్రికా దేశాల కూటమిని బ్రిక్స్ గా పిలుస్తున్నారు. బ్రిక్స్ సమావేశానికి ముందు చైనా విదేశాంగ మంత్రిత్వ శాఖ అధికారి ఒ.ఎన్.జి.సి కార్యకలాపాలపై హెచ్చరిక లాంటి ప్రకటన చేశాడు. దక్షిణ చైనా సముద్ర ప్రాంతంలో శాంతి సుస్ధీరతలు నెలకొనడానికి వీలుగా భారత కంపెనీ తన కార్యకాలాపాలను మానుకోవాలని ఆయన కోరాడు.
భారత దేశం గత అక్టోబరులో వియత్నాంతో ఒప్పందం కుదుర్చుకుంది. ఇరు దేశాల ఆయిల్ కంపెనీలు దక్షిణ చైనా సముద్రంలో ఆయిల్ వెతుకులాట చేపట్టాలన్నది ఆ ఒప్పందం సారాంశం. కొత్త పెట్టుబడులు, చమురు వనరుల వెతుకులాట, చమురు సహజవాయువుల సరఫరా ఈ ఒప్పందంలో ఉన్నాయి. ఒప్పందం కుదిరినపుడే చైనా అభ్యంతరం వ్యక్తం చేసినప్పటికీ ఇండియా, వియత్నాంలు ఆ అభ్యంతరాలను పట్టించుకోలేదు. అయితే చైనా అధికారి హెచ్చరిక ఎలా ఉన్నప్పటికీ, దక్షిణ చైనా సముద్రంలో ఓ.ఎన్.జి.సి కార్యకలాపాల వల్ల చైనా భారత్ ల మధ్య సంబంధాలకు విఘాతం కలుగుతోందన్న అవగాహనను ఎస్.ఏం.కృష్ణ తిరస్కరించాడు.
అమెరికా, యూరప్, జపాన్ లకు ప్రత్యామ్న్యాయ ఆర్ధిక శక్తిగా ఎదిగిన చైనా పట్ల ఆ దేశాలు గుర్రుగా ఉన్నాయి. ఆ కారణం వల్ల చైనా, అమెరికాల మధ్య ప్రచ్చన్న యుద్ధం నడుస్తోంది. చైనా వ్యాపార విస్తరణకి ఆటంకం కలిగించడానికి అమెరికా పశ్చిమ దేశాలు సైనిక పద్ధతుల్లో ఆటంకాలు సృష్టించడానికి కృషి చేస్తున్నాయి. చైనా చుట్టూ ఉన్న దేశాలతో సైనిక ఒప్పందాలు చేసుకోవడం ద్వీపాల్లో సైనిక స్ధావరాలు నెలకొల్పడం ద్వారా చైనాకి చెక్ పెట్టడానికి పశ్చిమ దేశాలు ప్రయత్నిస్తున్నాయి. దానితో దూకుడుగా వ్యవహరించడానికి చైనా వెనకాడుతున్న పరిస్ధితి కనిపిస్తోంది. ఇతర దేశాలతో స్నేహ సంబంధాలకూ, పరస్పరం ఇచ్చి పుచ్చుకోవడం తమ విధానంగా, అంతర్గత వ్యవహారాల్లో జోక్యం చేసుకోవడం లాంటి విధానానికి వ్యతిరేకంగా చైనా తన విదేశీ విధానాన్ని చెబుతుంది. చురుకైన మిలట్రీ శక్తిగా వ్యవహరించేందుకు చైనా ఎన్నడూ ఆసక్తి చూపలేదు.