ఆఫ్ఘన్ దురాక్రమణ యుద్ధంలో తాలిబాన్ మిలిటెంట్ల బాంబు దాడిలో బుధవారం మరో నలుగురు అమెరికా సైనికులు చనిపోయినట్లు ప్రెస్ టి.వి తెలిపింది. సాపేక్షికంగా తాలిబాన్ కి బలం లేదని భావించే ఉత్తర ఆఫ్ఘనిస్ధాన్ లోని ఫార్యబ్ రాష్ట్రంలో ఈ దాడి చోటు చేసుకుంది. నాటోకి చెందిన ఐ.ఎస్.ఏ.ఎఫ్ (ఇంటర్నేషనల్ సెక్యూరిటి ఆసిస్టెన్స్ ఫోర్స్) మాత్రం ఇద్దరు సైనికులు మరణించినట్లు ప్రకటించింది. అయితే ఫార్యబ్ బాంబు దాడుల్లో మరణించినవారు తమ లెక్కలో లేరని ఐ.ఎస్.ఏ.ఎఫ్ తెలిపింది. ఈ లెక్కన అరడజను మంది అమెరికా సైనికులు ప్రాణాలు కోల్పోయినట్లు భావించవలసి వస్తున్నది.
ఫార్యబ్ రాష్ట్ర రాజధాని మేమానా లో అధికారుల సమావేశంపై మిలిటెంట్లు బాంబు దాడి చేశారని బి.బి.సి తెలిపింది. ఫార్యబ్ లో ప్రధానంగా నార్వే సైనికులు ఉన్నారనీ కానీ ఫార్యబ్ లో మరణించినవారిలో నార్వే సైనికులు లేనట్లు నార్వే ప్రభుత్వం చెబుతోందని ఎ.ఎఫ్.పి తెలిపింది. బాంబు దాడిలో ఇరవై మంది ఆఫ్ఘన్లు కూడా మరణిచారని ఆ సంస్ధ తెలిపింది. అయితే అమెరికా/నాటో సైనికుల మరణాలను పశ్చిమ దేశాల పత్రికలు వెంటనే రిపోర్టు చేసే పనిని పెట్టుకోవు. ఇతర పత్రికల ద్వారా నాటో సైనికుల మరణాలను తెలుసుకోవలసిందే.
ఇదిలా ఉండగా ఫార్యబ్ బాంబు దాడితో సంబంధం లేకుండా ఒక్క మంగళవారం రోజే మూడు సంఘటనలలో ముగ్గురు నాటో సైనికులు చనిపోయారని ఐ.ఎస్.ఏ.ఎఫ్ తెలిపినట్లు బి.బి.సి తెలిపింది. ఆఫ్ఘనిస్ధాన్ లో అమెరికా సైనిక స్ధావరంలోని అమెరికా సైనికులు ఖురాన్ మత గ్రంధాన్ని తగల బెట్టాక అమెరికా సైనికుల మరణాలు బాగా పెరిగాయి. ఆఫ్ఘన్ ప్రభుత్వ పోలీసులు, సైనికులే అమెరికా సైనికులను చంపేస్తున్నారు. దానితో అమెరికా సైనికులకు నమ్మకమైన భద్రతా ప్రాంతం లేకుండా పోయింది. ఏ క్షణంలో ఏ ఆఫ్ఘన్ పోలీసో, సైనికుడో తుపాకి ఎక్కుపెడతాడో అని వారు భయపడుతున్నారు. ఈ దాడుల వలన అమెరికా సైనికుల నైతిక స్ధైర్యమ్ తీవ్రంగా దెబ్బతింటోదని ఐ.ఎస్.ఏ.ఎఫ్ ప్రతినిధి బ్రిగేడియర్ జనరల్ కార్స్టన్ జాకబ్ సన్ అన్నాడు.
ఆఫ్ఘన్, పశ్చిమ దేశాల సైనికులున్న చోటికి మోటార్ సైకిల్ పై వచ్చిన మిలిటెంటు బాంబు దాడి జరిపాడని కాబూల్ బి.బి.సి విలేఖరి తెలిపాడు. ఆల్ జజీరా పత్రిక మరిన్ని వివరాలు తెలిపింది. మోటార్ సైకిల్ పై వచ్చిన మిలిటెంటు ఆత్మాహుతి దాడి జరిపాడని ఆ పత్రిక తెలిపింది. దాడిలో నలుగురు అమెరికా సైనికులు, నలుగురు ఆఫ్ఘన్ సైనికులు, మరొక ఆరుగురు ఆఫ్ఘన్ పౌరులు చనిపోయారని తెలిపింది. మరొక నలుగురు అమెరికా సైనికులు తీవ్రంగా గాయపడ్డారని కూడా తెలిపింది.
2014 లోపల అమెరికా సైనికులందరినీ ఉపసంహరిస్తున్నట్లు ఒబామా గత సంవత్సరం ప్రకటించాడు. అయితే అది అమెరికా ప్రజలను సంతృప్తి పరచడానైకి చేసిన ప్రకటన మాత్రమేనని అనంతరం జరిగిన పరిణామాలు తెలిపాయి. 2014 తర్వాత కూడా గణనీయ సంఖ్యలో అమెరికా సైనికులు కొనసాగడానికి ప్రస్తుతం అమెరికా, ఆఫ్ఘన్ ప్రభుత్వాల మధ్య చర్చలు జరుగుతున్నాయి. మార్చి నెలలో అమెరికా సైనికులు ఇరవై మంది రెండు గ్రూపులుగా వచ్చి 17 మంది ఆఫ్ఘన్ పౌరులను ఊచకోత కోయడంతో ఈ చర్చలు అర్ధాంతరంగా వాయిదా పడ్డాయి. పౌరుల హత్యతో ఆఫ్ఘనిస్ధాన్ లో అమెరికా వ్యతిరేక సెంటిమెంట్లు మరింత పెచ్చరిల్లాయి.
ఖురాన్ తగలబెట్టినందుకు క్షమాపణలు చెప్పిన ఒబామా పౌరుల హత్యకు క్షమాపణ చెప్పడానికి మాత్రం నిరాకరించాడు. అర్ధ రాత్రి గ్రామాల పై దాడి చేసి పౌరులను విచక్షణారహితంగా చంపడం అమెరికా కి కొత్తేమీ కాదని గ్రామాల నుండి అమెరికా సైనికులు వెనక్కి వెళ్లిపోవాలని ఆఫ్ఘన్ అధ్యక్షుడు కర్జాయ్ డిమాండ్ చేసినా అమెరికా పట్టించుకోలేదు. హత్యలు చేశాడని అమెరికా చెప్పిన ఒకే ఒక సైనికుడిని ఆఫ్ఘనిస్ధన్ లోనే శిక్షించాలని కోరినా దానినీ అమెరికా ఆలకించలేదు.