అజరబైజాన్ ఇజ్రాయెల్ రహస్య ఒప్పందం లీక్ చేసిన అమెరికా


Israeli fighter jetతన ప్రమేయం లేకుండా ఇజ్రాయెల్ అంతర్జాతీయ సంబంధాలు అభివృద్ధి కావడం ఇష్టం అమెరికాకి ఇష్టం లేకపోవడమే, అజరబైజాన్ తో ఇజ్రాయెల్ కుదుర్చుకున్న రహస్య ఒప్పందాన్ని లీక్ చేయడానికి కారణం అని రష్యా టైమ్స్ పత్రిక తెలిపింది. ఇరాన్ అణు కర్మాగారాలపై బాంబులు వేసి ధ్వంసం చేయడానికి ఉవ్విళ్లూరుతున్న ఇజ్రాయెల్ ఉత్సాహం తన పుట్టి పుంచుతుందని అమెరికాకి భయం. దురాక్రమణ యుద్ధాలు, ప్రభుత్వాల కూల్చివేతలు అమెరికాకి కొత్తేమీ కాదు. కాకపోతే కాస్త సమయం తీసుకుందామన్నదే అమెరికా అభిప్రాయం.

ఇజ్రాయెల్ చేసే బాంబుదాడులు పశ్చిమాసియాను యుద్ధ రంగంగా మార్చి వేస్తుంది. ఫలితంగా ఆయిల్ రవాణా మార్గాలు మూసుకుపోయి ఆయిల్ కరువు ఏర్పడుతుంది. దాంతో ఆయిల్ రేట్లు పెరిగి ద్రవ్యోల్బణం పెచ్చరిల్లి ఇప్పుడిప్పుడే కోలుకుంటున్న అమెరికా ఆర్ధిక వ్యవస్ధ మళ్ళీ మాంద్యంలోకి జారిపోతుంది. ఈ పరిణామాలు రానున్న అధ్యక్ష ఎన్నికల్లో ఒబామా విజయావకాశాల్ని దెబ్బతీస్తాయి. తాను మళ్ళీ అధ్యక్ష పదవి చేపట్టాక ఇరాన్ సంగతి చూద్దామన్న ఒబామా సలహాని ఇజ్రాయెల్ ప్రధాని బెంజిమన్ నేతన్యాహూ చెవికి ఎక్కించుకోవడం లేదు. ఫలితమే అజరాబైజాన్ తో రహస్య మిలట్రీ ఒప్పందం లీక్ అయిందని రష్యా టైమ్స్ వెల్లడించింది.

ఇరాన్ పై దాడి చేయడానికి ఇజ్రాయెల్ విమానాలు తన వైమానిక స్ధావరాలు ఉపయోగించుకోవచ్చని అజరాబైజాన్ అలిఖిత ఒప్పందం కుదుర్చుకుందని కొద్ది రోజుల క్రితం అమెరికా రాయబారులు, ఇయంటలిజెన్స్ అధికారులని ఉటంకిస్తూ ‘ఫారెన్ పాలసీ’ పత్రిక ప్రకటించింది. ఈ వార్తని అజరాబైజాన్ ఖండించింది. అయినా ఈ ఘండనని నమ్మడానికి పత్రికలు ఆసక్తి చూపలేదు. ఇరానియన్ సైంటిస్టులను హత్య చేసిన ఇజ్రాయెల్ గూఢచారులు అజరబైజాన్ లో అరెస్టు కావడమే దీనికి కారణం. ఈ విషయమై ఇరాన్ కూడా అజర్ బైజాన్ ని ప్రశ్నించింది.

ఇజ్రాయెల్ తో తమకు గల సంబంధాలు ‘ఐస్ బెర్గ్’ లాంటిదని అజర్ బైజాన్ అధ్యక్షుడు ఇల్హామ్ అలీయెవ్ అభివర్ణించినట్లు వికీ లీక్స్ వెల్లడించిన ‘అమెరికా డిప్లొమేటిక్ కేబుల్స్’ ద్వారా వెల్లడయిన సంగతిని ‘ఫారెన్ పాలసీ’ (ఎఫ్.పి) పత్రిక ఈ సందర్భంగా గుర్తు చేసింది. ఐస్ బెర్గ్ తొమ్మిది వంతులు సముద్రంలోపల ఉంటే, ఒక వంతు మాత్రమే పైకి కనిపిస్తుందని తెలిసిందే. ఇజ్రాయెల్ – అజర్ బైజాన్ సంబంధాలు కూడా అంతే రహస్యమైనవని ఆలీయెవ్ మాటలు స్పష్టం చేశాయి. అదీ కాక ఇరు దేశాల మధ్య వ్యాపార సంబంధాలు బలంగానే ఉన్నాయి. అజర్ బైజాన్ నుండి ఇజ్రాయెల్ ఆయిల్ కొనుగోలు చేస్తుంది. అజర్ బైజాన్ ఇజ్రాయెల్ నుండి మిలట్రీ పరికరాలు, ఆయుధాలు కొనుగోలు చేస్తుంది. ఇదేమీ రహస్యం కాదు. ఈ నేపధ్యంలో అజర్ బైజాన్, ఇజ్రాయెల్ రహస్య ఒప్పందం నిజమేనన్నది విశ్లేషకులు దాదాపుగా నమ్ముతున్నారు.

ఇజ్రాయెల్, అజర్ బైజాన్ ల మధ్య సంబంధాలు అభివృద్ధి కావడం అమెరికాకి నచ్చలేదు. అమెరికాని పక్కన బెట్టి ఇజ్రాయెల్ స్వయంగా మిలట్రీ ఒప్పందాలు చేసుకోవడం అమెరికాకి ఇష్టం లేకపోవడమే దానికి కారణం.

అయితే అజర్ బైజాన్ తో ఒప్పందం చేసుకోవాల్సిన అవసరం ఇజ్రాయెల్ కి ఎందుకు వచ్చింది? ఈ అంశంపైన ఏ.ఎఫ్.పి వార్తా సంస్ధ ఒక కధనం ప్రచురించింది. స్వీడన్ రక్షణ మంత్రిత్వ శాఖ నిర్వహణలోని ఒక అధ్యయన సంస్ధలో పని చేస్తున్న రిటైర్డ్ కల్నల్ ఈ అంశాన్ని విశ్లేషించినట్లు ఏ.ఎఫ్.పి తెలిపింది. దాని ప్రకారం ‘ఇజ్రాయెల్ యుద్ధ విమానాలకి దూరం సమస్య కాదు. ఆయుధాల బరువు కూడా సమస్య కాదు. ఆయుధాల సంఖ్యే అసలు సమస్య. ఆయుధాల సంఖ్య పెరిగే కొద్దీ వాటిని మోసే యుద్ధ విమానాలు ప్రయాణించగల దూరం తగ్గిపోతుంది. తక్కువ ఆయుధాలు మోసుకొస్తే దూరం పెరుగుతుంది. అంతే కాక యుద్ధ విమానం తక్కువ దూరం ప్రయాణిస్తే దాని ‘ఫైర్ పవర్’ పెరుతుంది. అంటే పెద్దగా లక్ష్యాన్ని గురి తప్పకుండా ఛేదించడానికి ఎక్కువ అవకాశం ఉంటుంది. ఇక్కడే అజర్ బైజాన్ అవసరం ముందుకొచ్చింది. ఇరాన్ లో లక్ష్యాన్ని చేధించాక ఇజ్రాయెల్ యుద్ధ విమానాలు అజర్ బైజాన్ లో దిగి ఇంధనం నింపుకువాలన్నది పధకం.

ఇరాన్ పై దాడికి అమెరికా నుండి పూర్తి మద్దతు రాలేదు. మార్చి నెలలో ఇజ్రాయెల్ లాబీ (ఏ.ఐ.పి.ఏ.సి) జరిపిన సమావేశంలో ప్రసంగిస్తూ ఒబామా ఇరాన్ దాడి విషయంలో కొన్ని సూచనలు చేశాడు. అణ్వాయుద్ధం తయారు చేసుకోకుండా చేయడానికి ఏ అవకాశాన్ని వదలబోనని చెబుతూనే కొన్ని షరతుల్ని ప్రస్తావించాడు. ఒబామా మాటల్లో చెప్పాలంటే:

There should not be a shred of doubt by now: when the chips are down, I have Israel’s back.

దీనర్ధం ఎన్నికయ్యేదాకా ఆగమనే అని విశ్లేషకులు భావిస్తున్నారు. ఇరాన్ దాడి విషయంలో ఇజ్రాయెల్ చేసిన చర్చల్లో కూడా అమెరికా రిజర్వేషన్లు ప్రకటిస్తూ వచ్చింది. బహిరంగంగా కూడా ఒబామా ‘ఇరాన్ పై దాడి’ అంగీకారం కాదని చాలా సార్లు ప్రకటించాడు. అజర్ బైజాన్ తో ఇజ్రాయెల్ రహస్య ఒప్పందం బైట పెట్టడం ఇజ్రాయెల్ దూకుడికి బ్రేకులు వేయడానికేనని విశ్లేషకులు నిర్ధారిస్తున్నారు. “ఇరాన్ ఏం చేసున్నదో ఇన్నాళ్ళూ మేము గమనించాము. కానీ ఇజ్రాయెల్ అజర్ బైజాన్ లో ఏం చేస్తున్నాదో ఇప్పుడు గమనిస్తున్నాం. అక్కడ అది చేసే వ్యవహారం పట్ల మేము సంతోషంగా ఏమీ లేము” అని అమెరికా అధికారులు చెప్పినట్లుగా ఎఫ్.పి తెలిపింది.

అమెరికా, ఇజ్రాయెల్ సంబంధాల విషయంలో ‘కుక్క తోకను ఊపుతున్నదా లేక తోకే కుక్కను ఊపుతున్నదా” అని విశ్లేషకులు అనుమానాలు వ్యక్తం చేస్తుంటారు. మొదటిసారి ‘ఫర్లేదు. కుక్కే తోకను ఊపుతోంది’ అని వారు భావిస్తుండవచ్చు.

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

గూగుల్ చిత్రం

You are commenting using your Google account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

Connecting to %s