ఫిబ్రవరి నెలలో 17 దేశాల యూరో జోన్ నిరుద్యోగం అత్యధికంగా 10.8 శాతానికి చేరుకుంది. 1999 లో ‘యూరో’ ఉమ్మడి కరెన్సీగా యూరో జోన్ ఏర్పాడ్డాక ఇదే అత్యధిక స్ధాయి నిరుద్యోగం. జనవరి నెలలో యూరో జోన్ 10.6 శాతం నిరుద్యోగం నమోదు చేసింది. యూరో జోన్ దేశాల్లోలో స్పెయిన్ అత్యధికంగా 23.6 శాతం నిరుద్యోగంతో అగ్రస్ధానంలో ఉంది. మూడేళ్ళ క్రితం సంభవించిన ‘ది గ్రేట్ రిసెషన్’ నుండి పూర్తిగా కోలుకోక ముందే యూరప్, మరోసారి మాంద్యంలోకి జారినట్లు విశ్లేషకులు దాదాపుగా నిర్ధారిస్తున్నారు. ఈ విధంగా వెంట వెంటనే రిసెషన్ కి గురవడాన్ని ‘డబుల్ డిప్’ గా ఆర్ధిక వేత్తలు పిలుస్తారు.
ఋణ సంక్షోభం సాకుగా చూపి ‘పొదుపు విధానాలు అమలు చేయడం’ వల్లనే నిరుద్యోగం పెరుగుతున్నదని యూరోపియన్ ప్రభుత్వాలు అంగీకరిస్తున్నప్పటికీ ఆ విధానాలను వెనక్కి తీసుకోవడం లేదు. పైగా తీవ్రతను మరింత పెంచుతున్నాయి. ఋణ సంక్షోభంతో సతమవుతున్న దేశాలపై ఇ.యు, ఐ.ఏం.ఎఫ్ లు ఆ మేరకు ఒత్తిడి పెంచుతున్నాయి.
ఓ వైపు నిరుద్యోగం పెరుగుతుండగా మరో వైపు పారిశ్రామిక ఉత్పత్తి పడిపోతున్నది. ఉదాహరణకి ఫ్రాన్సు పారిశ్రామిక ఉత్పత్తి సూచిక పి.ఏం.ఐ వరుసగా ఎనిమిది నెలల పాటు 50 పాయింట్లకు దిగువనే కొనసాగుతోంది. అంటే ఫ్రాన్సు జి.డి.పి కుచించుకుపోతున్నదని అర్ధం. వరుసగా రెండు క్వార్టర్ల పాటు జి.డి.పి పడిపోయినట్లయితే దానిని రెసెషన్ గా పిలుస్తారు. గత మూడేళ్లలో కనిష్ట స్ధాయికి ఫ్రాన్సు మాన్యుఫాక్చరింగ్ ఉత్పత్తి క్షీణించిందని బి.బి.సి తెలిపింది. యూరో జోన్ ఇప్పటికే రిసెషన్ లో ఉందని ఆర్ధిక విశ్లేషకులను ఉటంకిస్తూ బి.బి.సి తెలిపింది.
ఫిబ్రవరిలో ఇటలీ నిరుద్యోగం 9.3 శాతంగా నమోదయింది. 15 నుండి 24 సంవత్సరాల వయసుగల వారిలో నిరుద్యోగం 31.9 శాతంగా నమోదయింది. గత ఏడేళ్లలో ఇదే అత్యధిక స్ధాయి. ప్రపంచ ద్రవ్య సంక్షోభం లో సైతం ఇటలీ ఇంతటి నిరుద్యోగం నమోదు చేయలేదు. పొదుపు విధానాలను తీవ్ర స్ధాయిలో అమలు చేస్తున్న దేశాల్లో ఇటలీ కూడా ఒకటి. పోర్చుగల్ లో 15 శాతం నిరుద్యోగం నమోదు కాగా, ఫ్రాన్సులో 10 శాతం నిరుద్యోగం నమోదయింది.