అమెరికా, ఇ.యు వాణిజ్య బెదిరింపులను సాహసోపేతంగా తిప్పికొడుతున్న అర్జెంటీనా


Argentina rift with US, EUఅమెరికా, యూరోపియన్ యూనియన్ ల ఆధిపత్య వాణిజ్య విధానాలను తిప్పికొట్టడంలో అర్జెంటీనా సాహసోపేతంగా వ్యవహరిస్తోంది. తమ దేశ ప్రయోజనాలను బలి పెట్టే విధంగా విదేశీ ఒత్తిడులకు తల వంచేది లేదని అమెరికా, ఇ.యు లకు చేతల ద్వారా స్పష్టం చేస్తోంది. డబ్ల్యూ.టి.ఓ వద్ద అమెరికా, ఇ.యు లు చేస్తున్న తప్పుడు ఫిర్యాదులకు బెదిరేది లేదని తెగేసి చెబుతోంది.

అర్జెంటీనా వాణిజ్య విధానాల పట్ల ఆందోళన వ్యక్తం చేస్తూ అమెరికా, ఇ.యు లు డబ్ల్యూ.టి.ఓ లో ఆదివారం ఫిర్యాదు చేశాయి. స్వేచ్చా వాణిజ్యాన్ని అర్జెంటీనా ఆటంక పరుస్తోందని ఆ ఫిర్యాదులో అవి పేర్కొన్నాయి. ఈ ఆరోపణలను అర్జెంటీనా తిప్పి కొట్టింది. స్వేచ్చా వాణిజ్యం పై నీతులు చెప్పే అమెరికా, యూరప్ లే వాస్తవంలో దానికి ఆటంకంగా ఉన్నాయని లెక్కలతో సహా తేల్చి చెప్పింది.

డబ్ల్యూ.టి.ఓ వద్ద అర్జెంటీనాకి వ్యతిరేకంగా 17 ఫిర్యాదులు దాఖలు కాగా అమెరికాకి వాణిజ్య విధానాలకి వ్యతిరేకంగా 114 ఫిర్యాదులు, యూరప్ వాణిజ్య పద్ధతులపై 70 ఫిర్యాదులు దాఖలాయ్యాయని గుర్తు చేసింది. డబ్ల్యూ.టి.ఓ సభ్య దేశాలు ఎవరితో వాణిజ్యం చేయడానికి సమస్యగా భావిస్తున్నాయో దీని ద్వారా స్పష్టం అవుతోందని అర్జెంటీనా ప్రభుత్వం తెలిపింది.

అమెరికా, ఇ.యు లు మరో 11 దేశాలను కూడగట్టి అర్జెంటీనాపై డబ్ల్యూ.టి.ఓ లో ఫిర్యాదు చేశాయి. దేశ ప్రజల ప్రయోజనాలను, దేశీయ కంపెనీల ప్రయోజనాలను ‘డబ్ల్యూ.టి.ఓ నిబంధనల పరిధిలోనే’ కాపాడుకుంటూ రక్షిత చర్యలు తీసుకోవడమే అర్జెంటీనా చేసిన నేరం. తమ కంపెనీలు చేసే అన్నీ రకాల అవినీతి, ఆధిపత్య వాణిజ్య చర్యలను కిక్కురు మనకుండా భరించాలని అమెరికా, ఇ.యులు డిమాండ్ చేస్తుంటాయి.

పనికిమాలిన, కాలం చెల్లిన, లోపాలతో కూడిన అణు పరికరాలు సరఫరా చేసినందువల్ల అణు ప్రమాదాలు జరిగినప్పటికీ భారత ప్రభుత్వము, భారత ప్రజలకు నష్టపరిహారం చెల్లించే నిబంధన నుండి తమను మినహాయించాలని అమెరికా చేస్తున్న డిమాండ్లను ఈ సందర్భంగా గుర్తు చేసుకోవచ్చు. ‘అణు ప్రమాద నష్టపరిహార బిల్లు’ ద్వారా నిజానికి నామ మాత్రపు నష్టపరిహారాన్నే భారత చట్టంలో పొందుపరచబడినప్పటికీ అది కూడా చెల్లించేది లేదని అమెరికా అణు కంపెనీలు పట్టుబడుతున్నాయి. ఈ పంతంతోనే అమెరికా అణు కంపెనీలు ఇంతవరకూ భారత దేశంతో ఒక్క అణు రియాక్టర్ అమ్మకానికి కూడా ఒప్పందం చేసుకోలేదు. ప్రధాని పదవికి రాజీనామా చేస్తానంటూ బెదిరించి మరీ మన్మోహాన్ కుదుర్చుకున్న వినాశకర ‘అణు ఒప్పందం’ వల్ల ఇండియాకి ఇంతవరకూ వీసమెత్తు వ్యాపారం కూడా జరగలేదు. పైగా ‘అణు ఒప్పందం’ ద్వారా ఇండియాకి ఇచ్చామని చెప్పిన రాయితీ లేదా మినయాంపును కూడా రద్దు చేస్తూ ఇటీవల అమెరికా కాంగ్రెస్ మరొక చట్టాన్ని ఆమోదించింది. ఈ చట్టం ద్వారా అమెరికా ఇండియాని నిలువునా మోసం చేసిందని కూడా భారత అధికారులు తీవ్ర నిరసన వ్యక్తం చేశారు.

ఇలాంటి మోసాలను, బెదిరింపులను తిప్పి కొట్టడంలో లాటిన్ అమెరికా దేశాలు ఇటీవల కాలంలో శక్తివంతంగా వ్యవహరిస్తున్నాయి. బ్రెజిల్, బొలీవియా, వెనిజులా, అర్జెంటీనా తదితర దేశాలు అందులో అగ్రభాగాన నిలుస్తున్నాయి. అర్జెంటీనా స్వంతంత్ర విధానాలతో అమెరికా. ఇ.యు లు గంగవెర్రులెత్తుతున్నాయి. రక్షిత విధానాలు అమలు చేస్తున్నదని అర్జెంటీనాపై ఆరోపణలు చేస్తూ తామే రక్షిత విధానాలనూ, ఆధిపత్య విధానాలను అర్జెంటీనాపై అమలు చేస్తున్నాయి.

ఉదాహరణకి అర్జెంటీనా నుండి వచ్చే డ్యూటీ-ఫ్రీ దిగుమతులను బారక్ ఒబామా రద్దు చేసేశాడు.  అమెరికా కంపెనీలు చేసిన దొంగ నష్టపరిహార క్లెయిమ్ లను 300 మిలియన్ డాలర్లవరకూ చెల్లించలేదని దానికి సాకుగా చూపాడు. ఫిబ్రవరి 1 తేదీన అర్జెంటీనా అధ్యక్షుడు ఒక చట్టాన్ని చేశాడు. దాని ప్రకారం అర్జెంటీనాలోకి వచ్చే దిగుమతులన్నింటినీ అధ్యక్షుడు ముందు ఆమోదం చెప్పాల్సి ఉంటుంది. దిగుమతులు చేసుకునే కంపెనీలను అందుకు సమానమైన ఎగుమతులు చూపాలని నిబంధన విధించాడు. దేశ ఆర్ధిక వ్యవస్ధను తద్వారా దేశ ప్రయోజనాలను కాపాఆడుకోవాలని భావించే ఏ ప్రబుత్వాధిపతి అయినా ఈ చర్యలనే పాటిస్తాడనడంలో సందేహం లేదు.

అర్జెంటీనా అదే చెప్పింది. “మా సార్వభౌమ నిర్ణయాలయిన వాణిజ్య విధానాలను మేము అమలు చేసి తీరుతాము. డబ్ల్యూ.టి.వో నిబంధనలకు అనుగుణంగానే మా విధానాలు ఉన్నాయి. ఇందులో విదేశీ శక్తుల జోక్యాన్ని మేము సహించము” అని అర్జెంటీనా విదేశాంగ శాఖ నిర్ద్వంద్వంగా ప్రకటించింది. నిజానికి అమెరికా, యూరప్ లు అర్జెంటీనాపైన డబ్ల్యూ.టి.ఓ లో చేసిన ఫిర్యాదు మున్నేన్నడూ ఎరగనట్టిదని వాణిజ్య విశ్లేషకులు పేర్కొంటున్నారు. కంపెనీలకు నష్టం చెల్లించలేదంటూ ఒక దేశం నుండి దిగుమతులను ఆపివేయడం ఇంతకు ముందెప్పుడూ లేదని ఎకానమీ వాచ్ పత్రిక ఒబామా చర్యపై వ్యాఖ్యానించింది.

ఇది కాకుండా అర్జెంటీనా దేశానికి ప్రపంచ బ్యాంకు గానీ, మరే ఇతర అంతర్జాతీయ సంస్ధ గానీ అప్పులు ఇవ్వకుండా అడ్డుకుంటామని అమెరికా గత సంవత్సరం అహంకార పూరితంగా ప్రకటించింది. ఈ బెదిరింపులనేమీ అర్జెంటీనా లెక్క చేయలేదు. 2000 సంవత్సరంలో అర్జెంటీనాలో పెను ఆర్ధిక సంక్షోభం సంభవించింది. ద్రవ్యోల్బణం వేల శాతం నమోదు అయింది. దేశంలో తీవ్ర స్ధాయిలో అల్లర్లు చెలరేగాయి. ప్రపంచ బ్యాంకు, ఐ.ఏం.ఎఫ్ చెప్పిందల్లా అమలు చేయడం వల్లనే తమకా దుస్ధితి వచ్చిందని అర్జెంటీనా పాలకులు త్వరలోనే గ్రహించారు. తమపై రుద్దిన అప్పులన్నింటినీ చెల్లించేది లేదని ప్రకటించారు. అప్పటి నుండీ అర్జెంటీనాకు ప్రపంచ బ్యాంకు, ఐ.ఏం.ఎఫ్ లు అప్పులివ్వడం లేదు. అది అర్జెంటీనాకే లాభించింది. విషమ షరతులతో కూడిన అమెరికా, యూరప్ ల సహాయం, ప్రపంచ బ్యాంకు, ఐ.ఏం.ఎఫ్ ల భారీ వడ్డీల అప్పులు లేకుండానే అర్జెంటీనా స్వంతంత్ర విధానాలను అమలు చేసి గడ్డు పరిస్ధితి నుండి గట్టెక్కింది. చైనా అందజేసిన తేలిక పాటి అప్పులు అర్జెంటీనా ఆర్ధిక వ్యవస్ధ కోలుకోవడానికి బాగా సహకరించాయి.

ఇప్పుడు అర్జెంటీనా ‘ఏమర్జింగ్ ఆర్ధిక వ్యవస్ధల’ లో ఒకటిగా పేరు పొందింది. ప్రపంచ బ్యాంకు, ఐ.ఏం.ఎఫ్ ల అప్పులు లేకపోతే గతి లేదని చెప్పే భారత పాలకులకు అర్జెంటీనా ఆర్ధిక వృద్ధి గొప్ప గుణ పాఠం. అమెరికా కాసింత కన్నెర్ర చేస్తేనే వణికిపోయే భారత పాలకులు అర్జెంటీనా నుండి పాఠాలు నేర్చుకోవలసిన అవసరం బాగా కనిపిస్తోంది.

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

గూగుల్ చిత్రం

You are commenting using your Google account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

Connecting to %s