కొత్త రాతి యుగం నుండి ఉనికిలో ఉన్న ‘మాసాయ్’ ఆదిమ జాతి కీన్యా, టాంజానియాలలో నివసిస్తోంది. వీరి జనాభా కేవలం నాలుగు లక్షలే. సంచార జాతి అయిన మాసాయ్ అనేక ప్రాచీన ఆచారాలకు నెలవు. వీరిని సంచార జీవనం నుండి బైటికి రప్పించడానికి ప్రయత్నాలు చేసినా అవేవీ సఫలం కాలేదని చెబుతున్నారు. అయితే పర్యావరణ మార్పుల రీత్యా సంచార జీవనమే వీరికి శ్రీరామ రక్ష అని ప్రముఖ లండన్ వ్యవసాయ సంస్ధ ‘ఆక్స్ ఫాం’ నిర్ధారించింది. అటు ఎడారుల్లోనూ, ఇటు బంజరు భూముల్లోనూ వ్యవసాయం సాగు చేయగల వీరి సామర్ధ్యం అనేక ప్రశంసలు అందుకుంది.
అటువంటి మాసాయ్ తెగను ‘అభివృద్ధి’ చేయడానికి కీన్యా ప్రభుత్వం క్రికెట్ ని ఒక సాధనంగా ఎంచుకుంది. ‘ది లాస్ట్ మేన్స్ స్టాండ్’ టోర్నమెంటు పేరుతో దక్షిణాఫ్రికా లో జరుగుతున్న క్రికెట్ టోర్నమెంటులో ‘మాసాయ్ వారియర్స్’ టీం కూడా పాల్గొంటోంది. ముంబాసాలో బీచ్ లోనూ, క్రికెట్ గ్రౌండ్ లోనూ క్రికెట్ ప్రాక్టీసు చేస్తున్న వీరి ఫొటోలను ఎ.ఫి.పి వార్తా సంస్ధ అందించింది. ‘తెల్ల తోలు’ అందానికి ప్రతిరూపం అన్న నమ్మకాన్ని ఈ ఫొటోలు వమ్ము చేస్తున్నాయి. మాసాయ్ మనుషులు తమ సంప్రదాయ దుస్తుల ధారణను కాపాడుకుంటూనే క్రికెట్ ఆడడానికి ఉపక్రమించడం క్రికెట్ సొగసుని రెట్టింపు చేసింది. ‘లగాన్’ సినిమాలో అమీర్ ఖాన్ బృందం తమ పంచకట్టు వదలకుండా క్రికెట్ ఆడొచ్చని చూపారు కూడా.
తమకే ప్రత్యేకమయిన సంస్కృతీ సంప్రదాయాలు కాపాడుకుంటూనే, అంతర్జాతీయ క్రీడా పోటీల్లో పాల్గొనవచ్చని ఈ ఫొటోలు చెబుతున్నాయి. వీరిని ఇలాగే టోర్నమెంటులో ఆడనిస్తారో లేదో తెలియదు. క్రికెట్ ని మరింత సొగసుగా మార్చిన ‘మాసాయ్’ తెగ క్రికెటర్లకు మనస్ఫూర్తిగా అభినందలు తెలుపుదాం.
–