అజర్ బైజాన్ ఎయిర్ బేస్ నుండి ఇరాన్ పై దాడి చేయనున్న ఇజ్రాయెల్?


Israel PM Netanyahuవైమానిక బాంబుదాడులతో ఇరాన్ అణు కర్మాగారాలను నాశనం చేయడానికి ఉవ్విళ్లూరుతున్న ఇజ్రాయెల్ కు తమ ఎయిర్ బేస్ లు వినియోగించుకోవడానికి అజర్ బైజాన్ అంగీకరించినట్లు అమెరికాకి చెందిన ‘ఫారెన్ పాలసీ’ పత్రిక వెల్లడించింది. ఈ వార్తలను అజర్ బైజాన్ ప్రబుత్వం ఆగ్రహంగా తిరస్కరించింది. “ఇజ్రాయెల్ ఒక ఎయిర్ ఫీల్డ్ కొనుక్కుంది. ఆ ఎయిర్ ఫీల్డ్ పేరు అజర్ బైజాన్” అని ఒక అమెరికా అధికారి చెప్పినట్లుగా ఫారెన్ పాలసీ పత్రిక చెబుతోంది. అజ్ఞాత సీనియర్ రాయబారులనూ, ఆర్మీ గూఢచార అధికారులను ఉటంకిస్తూ ‘ఫారెన్ పాలసీ’ (ఎఫ్.పి) ఈ వార్తా ప్రచురించింది.

అజర్ బైజాన్ ఉప ప్రధాని ఆలీ హసనోవ్ ఈ వార్తను ఖండించాడు. “మేము ఇంతకుముందే చాలాసార్లు చెప్పాము. మళ్ళీ చెబుతున్నాము. అజర్ బైజాన్ గడ్డపై నుండి ఇరాన్ పై దాడికి మేము అనుమతించబోము” అని అలీ అజర్ బైజాన్ రాజధాని బాకు లో విలేఖరులతో మాట్లాడుతూ అన్నాడు. అటువంటి వార్తలు అజర్ బైజాన్ ఇరాన్ ల మధ్య సత్సంబంధాలను దెబ్బతీయడానికి ఉద్దేశించినవేనని అజర్ బైజాన్ అధ్యక్ష భవనం ప్రతినిధి అన్నట్లుగా ఏ.ఎఫ్.పి తెలిపింది.

ఇరాన్ పై వైమానిక దాడులు చేయాలంటే ఇజ్రాయెల్ యుద్ధ విమానాలు 3,540 కి.మీ ప్రయాణం చేసి రావలసి ఉంటుంది. ఈ మధ్యలో గాలిలోనే ఇంధనం నింపుకునే సౌకర్యం విమానాలకు అవసరమని తెలుస్తోంది. కానీ గాలిలో ఇంధనం నింపుకునే సౌకర్యం ఇజ్రాయెల్ విమానాలకు లేదని అందువల్ల ఇంధనం నింపుకోవడానికి వైమానిక స్ధావరం అవసరమని ఫారెన్ పాలసీ పత్రిక తెలిపింది. ఇంధనం నింపుకోవడానికి అజర్ బైజాన్ తన వైమానిక స్ధావరాలను వాడుకోవడానికి ఇజ్రాయెల్ కి అనుమతిస్తూ రహస్య ఒప్పందం చేసుకున్నట్లు ఆ పత్రిక తెలిపింది. అనేకసార్లు జరిగిన చర్చల పర్యవసానంగా ఒక అంగీకారం కుదిరిందని ఫారెన్ పాలసీ తెలిపింది.

“అలాంటి ఎయిర్ ఫీల్డ్ వాడుకోవడం ఇజ్రాయెల్ కి అవసరం. ఇజ్రాయెల్ కి చెందిన ఎఫ్-15 ఐ, ఎఫ్-16 ఐ ఫైటర్ బాంబర్లు గాలిలో ఇంధనం నింపుకునే అవసరం లేకుండానే ఇరాన్ పై బాంబు దాడులు జరిపి ఉత్తర దిశలో ప్రయాణించి అజర్ బైజాన్ లో దిగుతాయి” అని ఫారెన్ పాలసీ తెలిపింది. అజర్ బైజాన్ నుండి సర్చ్ అండ్ రెస్క్యూ ఆపరేషన్లు నిర్వహించడానికి కూడా ఇజ్రాయెల్ కి అనుమతి దోకరవచ్చని ఎఫ్.పి తెలిపింది. లిఖిత పూర్వక ఒప్పందం ఏదీ కుదిరి ఉండకపోవచ్చని కూడా అమెరికా గూఢచార అధికారులను ఉటంకిస్తూ ఎఫ్.పి తెలిపింది.

అజరి రక్షణ మంత్రిత్వ శాఖ ప్రతినిధి తైమూర్ అబ్దుల్లాయెవ్ “ఈ సమాచారం అనుచితం, ఆధార రహితం” అని తిరస్కరించాడు.

ఇరాన్ అణు బాంబులు నిర్మించడానైకి ప్రయత్నిస్తున్నదంటూ అమెరికా, యూరప్ లు అనేక సంవత్సరాలుగా ఆరోపిస్తున్నాయి. మరో ఐదు సంవత్సరాల వరకూ అణు బాంబులు నిర్మించడం ఇరాన్ కి సాధ్యపడదని అమెరికా గూఢచార సంస్ధ సి.ఐ.ఏ, ఇజ్రాయెల్ గూఢచార సంస్ధ మొస్సాద్ లు గత సంవత్సరమే తేల్చి చెప్పాయి. అయినప్పటికీ అణు శుద్ధి కర్మాగారాలు స్ధాపించగల సామర్ధ్యాన్ని ఇరాన్ కి కలగడం ఇజ్రాయెల్ కి బొత్తిగా ఇష్టం లేదు. ఇరాన్ గనుక అణు సామర్ధ్యం సంపాదించినట్లయితే పశ్చిమాసియాలో తన ఆయుధ ఆధిపత్యానికి ఆటంకం అని ఇజ్రాయెల్ భయపడుతోంది.

ఇజ్రాయెల్ వద్ద ఇప్పటికే 300 కి పైగా అణు బాంబులు ఉన్నాయని బీబీసి లాంటి సంస్ధలు అనేకసార్లు వెల్లడించాయి. ఇజ్రాయెల్ తన అణు స్ధావరాల ను తనిఖీ చేయడానికి అంతర్జాతీయ అణు ఇంధన సంస్ధను అనుమతించలేదు. అరబ్ దేశాల మధ్య పాలస్తీనాను ఆక్రమించుకుని జాత్యహంకార ప్రభుత్వాన్ని నడుపుతున్న ఇజ్రాయెల్ తన బధ్రతపై ఎప్పటికీ దిగులే. అరబ్ దేశాలకన్నా అనేక రేట్లు ఆయుధ సంపత్తి ఉన్నప్పటికీ ఇరాన్ ఎదుగుదల ఆ దేశానికి కంటగింపుగా ఉంటూ వచ్చింది. ఇజ్రాయెల్ పక్కనే ఉన్న సిరియా, లెబనాన్ లలో ఇరాన్ అనుకూల ప్రభుత్వాలు ఉన్నాయి. అమెరికా, యూరప్ ల మద్దతుతో ఇరాన్ లో తమకు అనుకూల ప్రభుత్వాన్ని నిలబెట్టినట్లయితే పశ్చిమాసియాలో తన ఆధిపత్యానికి తిరుగే ఉండదని ఇజ్రాయెల్ ఆశ. అందుకోసం అమెరికాలో శక్తివంతమైన ఇజ్రాయెల్ అనుకూల లాబీ ద్వారా ఇరాన్ కి వ్యతిరేకంగా యుద్ధ నిర్ణయాలు చేయిస్తూ వచ్చింది.

పశ్చిమాసియాలో ఇజ్రాయెల్ కోసం అమెరికా చేసిన మొదటి యుద్ధం ఇరాక్ యుద్ధం. ఆ తర్వాత అమెరికా, యూరప్ ల చేత లిబియాపై దాడి చేయించి గడ్డాఫీని చంపించడంలో కూడా ఇజ్రాయెల్ ఒత్తిడి పని చేసింది. గత అయియిదేళ్లుగా అమెరికా, యూరప్ ల ఆయిల్ కంపెనీలకు దేశంలో ప్రవేశం కల్పించి గడ్డాఫీ రాజీ పడినప్పటికీ ఇజ్రాయెల్ ఒత్తిడితో లిబియాను సర్వనాశనం చేశాయి. తదుపరి ఇరాన్, సిరియాలను టార్గెట్ గా ఇజ్రాయెల్ ఎంచుకుంది. ఆర్ధికంగా సంక్షోభం ఎదుర్కొంటున్న అమెరికా, యూరప్ లు నిజానికి ఇరాన్ పై దాడి చేయడానికి సిద్ధంగా లేవు. ఇరాన్ తన హోర్ముజ్ జల మార్గాన్ని మూసినట్లయితే అమెరికా, యూరప్ లకి ఆయిల్ సరఫరాలో తీవ్ర ఆటంకం ఎదురవుతుంది.  అందుకే ఇరాన్ పై వైమానిక దాడులు తగవని అమెరికా, యూరప్ లు ఇజ్రాయెల్ ను హెచ్చరిస్తున్నాయి. ఆంక్షల ద్వారా ఇరాన్ ని లొంగదీసుకుందామని నచ్చచెప్పడానికి ప్రయత్నిస్తున్నాయి. ఈ హితోక్తులు వినే పరిస్ధితిలో ఇజ్రాయెల్ లేదు. ఇరాన్ పై యుద్ధానికే అమెరికా ఇరాక్ లోని తన సేనలను ఉపసంహరించుకుని కువైట్ కి తరలించిందని కొంతమంది విశ్లేషకులు భావిస్తున్నారు.

ఈ లోపు ఇరాన్ మిత్ర దేశమైన సిరియాను లొంగదీసుకోవడానికి అక్కడ కిరాయి తిరుగుబాటుని పశ్చిమ దేశాలు, ఇజ్రాయెల్ ప్రోత్సహిస్తున్నాయి. సిరియా ప్రజల చేత ఛీ కొట్టించుని అమెరికా, యూరప్ లలో తలదాచుకుంటున్న సిరియా దేశాంతర వాసుల చేత తిరుగుబాటు  లేవనెత్తడానికి శతధా ప్రయత్నిస్తున్నాయి. లండన్ కేంద్రంగా పని చేస్తున్న వీరి ప్రయత్నాలను ఇప్పటివరకూ సిరియా శక్తివంతంగా తిప్పి కొట్టింది. యు.ఎన్ మాజీ అధిపతి కోఫీ అన్నన్, సిరియా అధ్యక్షుడి చేత ఒప్పించిన శాంతి ఒప్పందానికి తూట్లు పొడిచే పనిలో అమెరికా, యూరప్, ఇజ్రాయెల్ లు ఇప్పుడు నిమగ్నమై ఉన్నాయి.

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

గూగుల్ చిత్రం

You are commenting using your Google account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

Connecting to %s