‘పోస్కో’ పర్యావరణ అనుమతిని సస్పెండ్ చేసిన గ్రీన్ ట్రిబ్యునల్


Anti-Posco activistsఒరిస్సా గిరిజన గ్రామాలు, అడవులకు తీవ్ర నష్టాన్ని కలిగించే పోస్కో ఉక్కు ఫ్యాక్టరీ కి కేంద్ర పర్యావరణ మంత్రిత్వ శాఖ మంజూరు చేసిన అనుమతిని గ్రీన్ ట్రిబ్యూనల్ సస్పెండ్ చేసింది. పర్యావరణ మంత్రిత్వ శాఖ ఫ్యాక్టరీ పూర్తి సామర్ధ్యాన్ని దృష్టిలో పెట్టుకోకుండా అనుమతి ఇచ్చిందనీ, ఫ్యాక్టరీ పూర్తి సామర్ధ్యం మేరకు పని చేసినపుడు కలిగే నష్టాలను అది సమీక్షించలేదనీ చెబుతూ, మళ్ళీ తాజాగా సమీక్ష జరిగేవరకూ అనుమతిని సస్పెన్షన్ లో ఉంచుతున్నట్లు ప్రకటించింది. జస్టిస్ సి.వి.రాములు, జస్టిస్ దేవేంద్ర కుమార్ అగర్వాల్  లతో కూడిన గ్రీల్ ట్రిబ్యూనల్ ఈ తీర్పును ప్రకటించింది.

ఒరిస్సా రాష్ట్ర ప్రభుత్వానికీ దక్షిణ కొరియా కంపెనీ పోస్కో కూ మధ్య కుదిరిన ఏం.ఓ.యు ప్రకారం పోస్కో 12 ఏం.పి.టి.ఎ (million tonnes of steel per annum)ల స్టీల్ ఫ్యాక్టరీ నిర్మిస్తుంది. కానీ ఇ.ఐ.ఎ నివేదిక (Environment Impact Assesement report) మాత్రం మొదటి దశలో ఉత్పత్తి అయ్యే 4 ఎం.పి.టి.ఎ ల సామర్ధ్యాన్ని మాత్రమే పరిగణలోకి తీసుకుని పర్యావరణ ప్రభావ నిర్ధారిత నివేదిక (ఇ.ఐ.ఎ నివేదిక) ను తయారు చేసిందని ట్రిబ్యునల్ అభ్యంతరం తెలిపింది.

ఇటువంటి ప్రాజెక్టుల విషయంలో పూర్తి సామర్ధ్యాన్ని పరిగణలోకి తీసుకుంటూ పర్యావరణంపై కలిగే ప్రభావాన్ని నిర్ధారించే విధంగా ఇ.ఐ.ఎ నివేదిక తయారు చేయడానికి ‘పర్యావరణం, అడవుల మంత్రిత్వ శాఖ’ విధానపరమైన నిర్ణయం తీసుకోవాలని ట్రిబ్యునల్ మంత్రిత్వ శాఖను కోరింది. “ప్రారంభం నుండీ పూర్తి సామార్ద్యాన్ని పరిగణిస్తూ ఇ.ఐ.ఎ నివేదిక పర్యావరణంపైనా, ప్రజలపైనా కలిగే నష్టాన్ని అంచనా వేయాలి” అని ట్రిబ్యునల్ తీర్పులో పేర్కొంది.

కేవలం మొదటి దశ సామర్ధ్యాన్ని మాత్రమే పరిగణించినట్లయితే మిగిలిన సామర్ధ్యం వల్ల కలిగే నష్టాలను పూర్తిగా విస్మరించినట్లే. ప్రజలు, పర్యావరణమూ పూర్తి నష్టాన్ని అనుభవించవలసి ఉండగా అందులో కొద్ది భాగాన్ని మాత్రమే లెక్కలోకి తీసుకుంటూ పర్యావరణానికి, ప్రజలకు పెద్దగా నష్టం లేదని నిర్ధారించినట్లయితే అది ఫ్యాక్టరీకి మాత్రమే లాభిస్తుంది. చేయవలసిన నష్టాన్ని చేసేసి సహజ వనరులను స్వాయత్తం చేసుకుని ఉక్కు ఉత్పత్తి తో లాభాలు సంపాదించే కంపెనీ యజమానులు గానీ అధికారులు గానీ నష్టాలను అనుభవించేవారిలో ఉండరు.

భోపాల్ గ్యాస్ విష వాయువు లీక్ వల్ల పదివేల మందికి పైగా భారతీయులు చనిపోగా, మరిన్ని లక్షలమంది రోగాలతో, అవయవ లోపాలతో ఇప్పటికీ బాధపడుతుండగా, కంపెనీ యజమానిని మాత్రం ఎంచక్కా విమానం ఇచ్చి అమెరికా పంపిచేశారు. ఆ తర్వాత కంపెనీని యూనియన్ కార్బైడ్ యాజమాన్యం డౌ కంపెనీకి అమ్మేసి సొమ్ము చేసుకోగా భోపాల్ ప్రజలు మాత్రం తరాల తరబడి యాతనలను అనుభవిస్తున్నారు. ఇంత జరిగినప్పటికీ భారత పాలకులు భారతీయ వనరులను విదేశీ కంపెనీలకు అప్పజెప్పడమే కాక ప్రజల భూములను గుంజుకుని నిరాశ్రయులుగా, నిరాస్తిపరులుగా తయారు చేయడమే కాక వారి ప్రాణాలను సైతం హరించడానికే మొగ్గు చూపుతున్నారు.

పోస్కో గ్యాక్టరీ వల్ల కలగనున్న నష్టాలనూ, ప్రమాదాలనూ మళ్ళీ తాజాగా నిర్ధారిస్తూ నివేదిక తయారు చేయాలని పర్యావరణ మంత్రిత్వ శాఖను ట్రిబ్యునల్ కోరింది. నష్టాలు, ప్రమాదాలు జరగకుండా తగిన చర్యలు అమలు చేయడానికి అవసరమైన షరతులను కూడా నివేదికలో జత చేయాలని కోరింది. షరతులు అమలు చేయడానికి కాలపరిమితిని విధించి వాటిని అమలును పర్యవేక్షించే వ్యవస్ధను రూపొందించాలని కోరింది. షరతుల అమలును పర్యవేక్షించడం కోసం ప్రత్యేక కమిటీ ఏర్పాటు చేయాలని కోరింది. పర్యావరణ అనుమతిని సమీక్షించే కమిటీకి ‘మీనా గుప్తా’ ను నియమించడాన్ని తప్పు పట్టింది. పర్యావరణ మంత్రిత్వ శాఖ కార్యదర్శిగా ఉండగా ఆమె పర్యావరణ అనుమతిని సమర్ధించిందనీ, అలాంటి వ్యక్తిని సమీక్షా కమిటీ కి చైర్మన్ గా నియమించడం వల్ల పోస్కో కు పక్షపాతంగానే వ్యవహరిస్తుందని ట్రిబ్యునల్ వ్యాఖ్యానించింది. అనుమతిని సమీక్షించడానికి అనుమతిని సమర్ధించినవారిని ఎలా నియమిస్తారని ప్రశ్నించింది. దీనివల్ల మొత్తం ప్రక్రియలో చట్టం దుర్బలంగా మిగిలిపోయిందని ట్రిబ్యునల్ వ్యాఖ్యానించింది.

కటక్ నగరానికి కేటాయించబడిన నీటి వనరులను పోస్కో ప్రాజెక్టు కు అప్పజెప్పటాన్ని కోర్టు తప్పు పట్టింది. తన ప్రాజెక్టు కు కావలసిన నీటిని పోస్కో కంపెనీయే తెచ్చుకోవాలి తప్ప ప్రజలకు కేటాయించిన తాగు నీటిని కేటాయించడానికి వీలు లేదని తెలిపింది. “దేశంలో తాగు నీరు దొరకడం లేదు. కటక్ నగర తాగునీటిని అప్పజెప్పడానికి బదులు ప్రాజెక్టును ప్రతిపాదించిన కంపెనీనే నీటివనరులు వెతుక్కోమని చెప్పడం మంచిది” అని కోర్టు పేర్కొంది.

పర్యావరణ కార్యకర్త ప్రఫుల్లా సమంత్రాయ్ దాఖలు చేసిన పిటిషన్ ను విచారిస్తూ ట్రిబ్యునల్ ఈ తీర్పు ప్రకటించింది. పర్యావరణ మంత్రిత్వ శాఖ 4 ఎం.టి.పి.ఎ ల సామర్ధ్యాన్ని మాత్రమే పర్యావరణ నష్టాన్ని లెక్కించి అనుమతి ఇచ్చేసింది. పూర్తి సామర్ధ్యమ్ వల్ల ప్రజలకు పర్యావరణానికి పెద్ద ఎత్తున నష్టం వాటిల్లుతుందని పిటిషనర్ కోర్టుకు తెలిపాడు. నష్టం అంచనా వేసిన 4 ఎం.టి.పి.ఎ ల సామర్ధ్యంతో పని చేస్తే పోస్కో కు లాభసాటి కాదని కనుక ఫ్యాక్టరీ ఖచ్చితంగా పూర్తి సామర్ధ్యంతో పని చేస్తుందనీ పిటిషనర్ కోర్టుకు తెలియజేశాడు. అటువంటి పరిస్ధితుల్లో ప్రారంభ సామర్ధ్యాన్ని మాత్రమే పరిగణిస్తూ అనుమతి ఇవ్వడం పోస్కోకు మేలు చేయడానికేనని తెలియజేశాడు. అనుమతిని సమీక్షించడానికి నియమించబడిన కమిటీ నిస్పాక్షికంగా సమీక్ష జరపడానికి బదులు అనుమతి ఇవ్వడాన్ని సమర్ధించుకోవడానికే  పని చేసిందని పిటిషనర్ కోర్టుకు తెలియజేశాడు.

పోస్కో కు పర్యావరణ అనుమతి ఇచ్చిన కేంద్ర పర్యావరణ మంత్రి జైరాం రమేశ్ తాను తీవ్ర ఒత్తిడుల మేరక్కు ప్రజావ్యతిరేక నిర్ణయం తీసుకోవలసి వచ్చిందని ప్రకటించడాన్ని ఈ సందర్భంగా ప్రస్తావించుకోవచ్చు.

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

గూగుల్ చిత్రం

You are commenting using your Google account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

Connecting to %s