బొలీవియాలో ఆయుధాలతో పట్టుబడిన అమెరికా ఎంబసీ కారు


Eva Moralesదక్షిణ అమెరికా దేశం బొలీవియాలో అమెరికా ఎంబసీ కి చెందిన కారు పేలుడు ఆయుధాలతో పట్టుబడిందని ఎ.ఎఫ్.పి వార్తా సంస్ధ వెల్లడించింది. ఈశాన్య బొలీవియాలోని ‘ట్రినిడాడ్’ పట్టణంలో మంగళ వారం జరిగిన ఈ ఘటనను ‘జాతీయ భద్రత’ కు సంబధించిన అంశంగా బొలీవియా హోమ్ మంత్రి కార్లోస్ రొమేరో వ్యాఖ్యానించాడు. మూడు షాట్ గన్ లు, ఒక రివాల్వర్, రెండు వేల బులెట్ కాట్రిడ్జ్ లతో సహా మరి కొన్ని పేలుడు పదార్ధాలు అమెరికా ఎంబసీ కారులో దొరికాయని ప్రెస్ టి.వి తెలిపింది. కారులో కంప్యూటర్ తో పాటు మరో మూడు కమ్యూనికేషన్ పరికారాలు కూడా దొరికాయి.

గూఢ చార వర్గాల నుండి అందిన సమాచారం మేరకు పోలీసులు అమెరికా ఎంబసీ కారును సోదా చేయగా ఆయుధాలు బైటపడ్డాయి. “ఈ చర్యలు మా దేశ బధ్రతను ప్రమాదంలో పడవేస్తాయి. మా దేశ సంస్ధల పట్ల గౌరవాన్ని కించపరిచేవిగా ఉన్నాయి. బొలీవియా చట్టాలను అగౌరవపరుస్తున్నాయి” అని కార్లోస్ ప్రకటించాడు.

బోలీవియా అధ్యక్షుడు ఇవా మొరేల్స్ దేశీయ జాతులనుండి మొదటిసారిగా ఎన్నికయిన వ్యక్తి. ఆయన అధికారంలోకి వచ్చినప్పటి నుండీ పదవీచ్యుతుడిని చేయడానికి అమెరికా తీవ్రంగా ప్రయత్నిస్తోంది. వెనిజులా అధ్యక్షుడు హ్యూగో చావెజ్ ను కుట్రతో పదవీచ్యుడిని చేయడానికి అమెరికా ప్రయత్నించినప్పటికీ ఘోరంగా విఫలమయింది. వెనిజులా ప్రజలు తీవ్ర స్ధాయిలో ఆందోళనలు జరిపి అమెరికాకి సహకరించిన ప్రతిపక్ష పార్టీలను గద్దె దించాయి. అదే తరహా కుట్రలను బొలీవియాలో కూడా అమలు చేయడానికి అమెరికా తీవ్రంగా శ్రమిస్తోంది.

US embasy in Boliviaఇదే తరహాలో అమెరికా తన కుట్రలను కొనసాగిస్తే అమెరికా ఎంబసీ ని మూసివేయవలసి ఉంటుందని కొద్ది రోజుల క్రితం బొలీవియా అధ్యక్షుడు ప్రకటించాడు. తమ దేశంలో మాదక ద్రవ్య నియంత్రణకు కృషి చేస్తానంటూ వచ్చిన ‘డ్రగ్ ఎన్ ఫోర్స్ మెంట్ అడ్మినిస్ట్రేషన్’ (డి.ఇ.ఎ) తన పని వదిలేసి ప్రభుత్వ వ్యతిరేక కుట్రలకు పాల్పడుతున్నదని చెబుతూ బొలీవియా నుండి మూడేళ్ళ క్రితం తరిమేశాడు. దేశంలో నిషేధించబడిన సాయుధ గ్రూపులతో కలిసి, డి.ఇ.ఎ రహస్యంగా మిలట్రీ డ్రిల్లు నిర్వహిస్తూ పట్టు బడింది. అది స్పాన్సర్ చేసిన ఒక సాయుధ కుట్రను ప్రజల సాయంతో మోరేల్స్ విఫలం చేయగలిగాడు. కోకోవా రైతుల ఉద్యమంలో పాల్గొని ప్రజల మద్దతుతో అధ్యక్ష పదవిని అధిష్టించిన మోరేల్స్, డి.ఇ.ఎ కుట్రలను బాగా ఎరిగిన వ్యక్తి. తాను నాయకత్వం వహించిన ఉద్యమంలో పాల్గొన్న రైతులను డి.ఇ.ఎ కాల్చి చంపిందనీ, రైతుల ఉద్యమాన్ని అణచివేయడానికి శ్రమించిందనీ ప్రపంచానికి వెల్లడించాడు.

వివిధ రకాల పేర్లతో అమెరికా గూఢచార బలగాలు మూడో ప్రపంచ దేశాలలో కుట్రలు సాగిస్తాయి. అందులో మాదక ద్రవ్యాల నియంత్రణ ఒకటి. అమెరికా సెనేట్, కాంగ్రెస్ సభ్యులే అనేకమంది దక్షిణ, సెంట్రల్ అమెరికా దేశాలలో అక్రమ మాదక ద్రవ్య వ్యాపారాలను నిర్వహిస్తుంటారు. మళ్ళీ ఆ వ్యాపారాలను నియంత్రించే పేరుతో ప్రభుత్వాలతో ఒప్పందాలు చేసుకుని గూఢచారులను అమెరికా చొప్పిస్తుంది. తాను స్వయంగా ప్రపంచ వ్యాపితంగా మానవ, పౌర హక్కులను ఉల్లంఘించే అమెరికా, మానవ హక్కుల ఉల్లంఘిస్తున్నారంటూ అంతర్జాతీయ వేదికలపై తీర్మానాలు ప్రవేశపెట్టినట్లే అక్రమ మాదక ద్రవ్యాల నియంత్రణకు కృషి చేస్తున్నట్లు నటిస్తుంది. ఆ పేరుతో తనకు వ్యతిరేకంగా ఉన్న ప్రభుత్వాలను కూలదోయడానికి కుట్రలు చేస్తుంది.

ఈ కుట్రలను తిప్పి కొట్టడంలో లాటిన అమెరికా దేశాలు గత పది, పదిహేనేళ్లుగా విజయవంతం అవుతున్నారు. నాలుగేళ్ల క్రితం కుట్రలా ఆరోపణలతో అమెరికా రాయబారి ఫిలిప్ గోల్డ్ బర్గ్ ను బొలీవియా బహిష్కరించింది. అమెరికా తరపున అంతర్జాతీయంగా సహాయం ప్రకటించే యు.ఎస్.ఎ.ఐ.డి కూడా కుట్రాలకు పాల్పడుతూ దొరికి పోయింది. స్ధానిక రాష్ట్ర ప్రభుత్వం ఒకటి తన రాష్ట్రంలో యు.ఎస్.ఎ.ఐ.డి అవసరం లేదని చెప్పి తన్ని తరిమేసింది. ఇన్ని చేస్తున్నప్పటికీ అమెరికాతో పూర్తిగా సంబంధాలు తెంచుకోవడానికి ఇవా మొరేల్స్ నిర్ణయించలేదు. ఎ దేశంతోనూ తాను సంబంధం తెంచుకునేది లేదనీ, ఎ దేశమైనా వెళ్ళిపోదలిస్తే అది వారి ఇష్టమనీ మొరేల్స్ ప్రకటించాడు.

అమెరికా నుండి వచ్చిన ఎన్.జి.ఓ (నాన్ గవర్నమెంటల్ ఆర్గనైజేషన్స్) సంస్దలు కూడా అమెరికా ప్రభుత్వ కుట్రలలో పాలు పంచుకుంటాయి. తన ప్రభుత్వానికి వ్యతిరేకంగా అమెరికన్ ఎన్.జి.ఓ లు గూఢచర్యం నిర్వహిస్తున్నాయని మొరేల్స్ అనేకసార్లు ఆరోపించాడు.

ఆయుధాలతో దొరికిన ఎంబసీ కారు విషయంలో అమెరికా ఎంబసీ చేసిన ప్రకటన హాస్యాస్పదంగా ఉంది. వివిధ దేశాలలో తన రాయబార కార్యాలయాల రక్షణ కోసం స్ధానిక పోలీసు అధికారులకు అమెరికా ఆయుధాలు సరఫరా చేస్తుందని, అందులో భాగమే బొలీవియాలో కూడా స్ధానిక పోలీసులకు ఆయుధాలు ఇస్తున్నదనీ ప్రకటించింది. కన్నంలో వేలుతో దొరికినన దొంగ  చెప్పే సాకులు కూడా ఇలాగే హాస్యాస్పదంగా ఉంటాయి. రాయబార కార్యాలయాలను రక్షించవలసిన బాధ్యత ఆ దేశాల ప్రభుత్వాల పైన ఉంటుంది. అందులో విఫలమయితే అది ప్రభుత్వాలదే బాధ్యత. ఆయా దేశాలకు శక్తివంతమైన ఆయుధాలు లేవని భావిస్తే, అక్కడి పోలీసులకు ఆయుధాలు ఇవ్వదలిస్తే, ప్రభుత్వం ద్వారానే అది జరగాలి తప్ప తాను సొంతంగా ఆయుధాలు ఇస్తామని చెప్పడం అమెరికా అహంభావానికి మరొక నిదర్శనం మాత్రమే. బోలీవియా సార్వభౌమత్వాన్ని తాను గౌరవించబోనని బహిరంగంగా చెప్పడమే. అందుకే దాని అధికారులు అనేకసార్లు బోలివియా ప్రభుత్వం చేత గెంటివేయబడ్డారు.

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

గూగుల్ చిత్రం

You are commenting using your Google account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

Connecting to %s