‘ప్రాస్టిట్యూషన్ రింగ్’ లో పెట్టుబడిదారీ సిద్ధాంత ప్రభోధకుడు స్ట్రాస్ కాన్


66009606ప్రపంచ దేశాలను పెట్టుబడిదారీ “స్వేచ్ఛా మార్కెట్ ఆర్ధిక వ్యవస్ధ” (Free Market Economy) వైపు నడిపించడానికి శ్రమించే ‘అంతర్జాతీయ ద్రవ్య నిధి సంస్ధ’ (ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్) మాజీ అధినేత, ఫ్రాన్సు సోషలిస్టు పార్టీ నాయకుడు ‘డొమినిక్ స్ట్రాస్ కాన్’, ప్రాస్టిట్యూషన్ రింగ్ నడుపుతున్నాడని ఆరోపిస్తూ ఫ్రాన్సు పోలీసులు కేసు నమోదు చేశారు. ప్రస్తుతానికి లక్ష యూరోల బెయిల్ పై ఉన్న స్ట్రాస్ కాన్, విచారణలో పాల్గొంటున్నవారితోనూ, మీడియాతోనూ మాట్లాడరాదన్న షరతులను ఎదుర్కొంటున్నాడు. ఫ్రాన్సు న్యాయ వ్యవస్ధ నిబంధనల ప్రకారం స్ట్రాస్ కాన్ ఇప్పుడు అరెస్టు కు తర్వాత దశలోనూ, నేరారోపణలకు (చార్జెస్) ముందరి దశలోనూ ఉన్నాడని సి.ఎన్.ఎన్ వార్తా సంస్ధ తెలిపింది.

ప్రాస్టిట్యూషన్ రింగ్ నడుపుతున్న ముఠాలో సభ్యుడుగా ఉన్నాడన్న ఆరోపణలను కాన్ ఎదుర్కొంటున్నాడు. “అగ్రేవేటెడ్ పింపింగ్” కు కాన్ పాల్పడ్డాడని ఫ్రాన్సు పోలీసులు నేరారోపణ చేశారు. ప్రాస్టిటూషన్ రింగ్ లో స్వయంగా, రెగ్యులర్ గా పాల్గొంటున్న పరిస్ధితిని ఫ్రాన్సు చట్టాలు ‘అగ్రేవేటెడ్’ గా నిర్వచిస్తాయనీ, వ్యభిచార కార్యకలాపాలని ఏర్పాటు చేస్తున్న పరిస్ధితిని ‘పింపింగ్’ గా నిర్వచిస్తాయనీ సి.ఎన్.ఎన్ తెలిపింది.

ఫ్రాన్సు చట్టాల ప్రకారం ‘వ్యభిచారం’ నేరం కాదు. కానీ వ్యభిచారం చేస్తున్నవారిపై ఆధారపడి డబ్బు సంపాదించడాన్ని నేరంగా పరిగణిస్తాయి. కొంచెం మొరటుగా చెప్పాలంటే, వ్యక్తులు స్వయంగా వ్యభిచారం చేస్తూ జీవనం గడపవచ్చు గానీ, స్త్రీలను తార్చి డబ్బు సంపాదిస్తే అది నేరం అవుతుంది.  ప్రాస్టిటూషన్ రింగ్ నడపడం అంటే అనేక మంది స్త్రీలను వ్యభిచారంలోకి దింపి వారికి చెల్లించబడిన డబ్బులో వాటా పొందడమే. ఇందులో స్త్రీలను బలవంతంగా వ్యభిచారంలోకి దింపే నేరం కూడా ఇమిడి ఉంటుంది. ఎవరైనా బలవంతం చేస్తే తప్ప స్త్రీలు వ్యభిచార ర్యాకెట్ లో ఉండజాలరని ఫ్రాన్సు చట్టాలు భావిస్తున్నట్లు అర్ధమవుతోంది.

ఫిబ్రవరి నెలలో పోలీసులు ప్రాస్టిట్యూషన్ రింగ్ నడుపుతున్న నేరంపై స్ట్రాస్ కాన్ ను అరెస్టు చేసి ఒక రోజంతా ప్రశ్నించారు. సోమవారం జడ్జిలు కాన్ ను ఎనిమిది గంటలపాటు ప్రశ్నించారు. కాన్ లాయర్లు ‘సంచలనం’ కోసం తన క్లయింటు పై ఆరోపణలు చేస్తున్నారని పేర్కొన్నప్పటికీ కాన్ పై తగిన సాక్ష్యాధారాలను పోలీసులు సంపాదించినట్లు తెలుస్తోంది. వ్యభిచారం చేస్తున్నవారికి కార్పొరేట్ నిధులను కాన్ తరలించినట్లు వచ్చిన ఆరోపణలను పోలీసులు విచారిస్తున్నారు. గత డిసెంబర్ లో ఒక హోటల్ మేనేజర్ నూ, మరో నలుగురు వ్యక్తులనూ ప్రాస్టిట్యూషన్ రింగ్ కేసులో పోలీసులు అరెస్టు చేశారు. వీరిలో ఒకరు ఒక మెడికల్ కంపెనీకి డైరెక్టర్ గానూ, మరొకరు ఒక యుటిలిటీ కంపెనీకి డైరెక్టర్ గానూ పని చేస్తున్నారు. తమ క్లయింటు ‘లిబర్టయిన్’ (అనైతిక విచ్చలవిడి) చర్యలకు పాల్పడినప్పటికీ చట్ట వ్యతిరేక మయిన చర్యలకు పాల్పడలేదని కాన్ లాయర్లు వాదిస్తున్నారు. అంటే పెట్టుబడిదారీ వ్యవస్ధలో, కనీసం ఫ్రాన్సులో, విచ్చలవిడి అనైతిక చర్యలు చట్ట వ్యతిరేకం కావలసిన అవసరం లేదన్నమాట.

ఫ్రాన్సు పోలీసులు అనేక మంది వ్యభిచారం చేస్తున్న స్త్రీలను ప్రశ్నించారు. 2010, 2011 సంవత్సరాల్లో తాము కాన్ తో సెక్స్ లో పాల్గొన్నామని వారు పోలీసులకు చెప్పారు. ప్యారిస్ లోని ఒక లగ్జరీ హోటల్ లోనూ, ఐ.ఏం.ఎఫ్ కేంద్ర కార్యాలయం ఉన్న వాషింగ్టన్ లోని ఒక హోటల్ లోనూ కాన్ తో గడిపామని వారు చెప్పారు. ఐ.ఏం.ఎఫ్ అధ్యక్షుడుగా ఉన్నంతకాలం స్ట్రాస్ కాన్ వాషింగ్టన్ లోని హోటల్ లోనే జీవనం సాగించాడు. అదే హోటల్ లో తాము కాన్ తో గడిపినట్లు స్త్రీలు ఫ్రాన్సు పోలీసులకు చెప్పారు. అనేక హోటళ్లలో జరిగే సెక్స్ పార్టీలలో స్ట్రాస్ కాన్ పాల్గొన్నాడని ఆయన లాయర్లు కూడా అంగీకరిస్తున్నారు. అయితే అవన్నీ అనైతికమో, విచ్చలవిడితనమో కావచ్చు గానీ  చట్ట వ్యతిరేకం కావన్నది వారి వాదన.

స్ట్రాస్ కాన్ నేరాన్ని ఫ్రెంచి పత్రికలు ‘కారల్టన్ ఎఫైర్’ గా పిలుస్తున్నాయి. కారల్టన్ హోటల్ లో కొన్ని కార్యకలాపాలు జరిగినందున ఆ పేరు పెట్టాయి. న్యూయార్క్ హోటల్  లో ఛాంబర్ మెయిడ్ గా పని చేస్తున్న ఒక నల్ల జాతి యువతి స్ట్రాస్ కాన్ పై గత సంవత్సరం రేప్ నేరాన్ని ఆరోపించింది. నేరారోపణ చేసిన యువతి కొన్ని అబద్ధాలు చెప్పిందని చెబుతూ స్ట్రాస్ కాన్ పై రేప్ నేరాన్ని న్యూయార్క్ ప్రాసిక్యూటర్లు ఉపసంహరించుకోవడంతో కాన్ ఆ నేర విచారణ నుండి బయట పడ్డాడు. సెక్స్ జరిగినట్లు ఫోరెన్సిక్ సాక్ష్యాలు వెల్లడించినప్పటికీ, అంగీకారంతో జరిగిందన్న అనుమానంతో కాన్ పై నేరాన్ని ఉపసంహరించుకున్నారు. హోటల్ మెయిడ్ తో తాను సెక్స్ లో పాల్గొనడం ‘సరైన చర్య’ కాదంటూనే అది హింసాత్మకంగా జరగలేదని ఆ తర్వాత కాన్ చెప్పుకున్నాడు.

అయితే ఛాంబర్ మెయిడ్ మాత్రం కాన్ పై సివిల్ కేసు కొనసాగిస్తోంది. ఈ కేసు నుండి బైటపడడానికి కాన్ రాయబార చట్టాలను అడ్డుపెట్టుకోవాలని చూస్తున్నట్లు పత్రికలు వెల్లడించాయి. ఈ కేసు కూడా బుధవారం (మార్చి 28) విచారణకు రానున్నట్లు తెలుస్తోంది. ఈ ఘటన పర్యవసానంగా కాన్ కు ఐ.ఏం.ఎఫ్ అధ్యక్ష పదవి ఊడిపోయింది. అంతకుముందు ఐ.ఏం.ఎఫ్ బోర్డ్ డైరెక్టరలో సభ్యురాలయిన ఒక స్త్రీతో అక్రమ సంబంధం పెట్టుకున్నందుకు కాన్ బోర్డు చేత అభిశంసనకు గురయ్యాడు. న్యూయార్క్ హోటల్ ఉదంతం బైటపడ్డాక అక్రమ సంబంధం బైటపడ్డపుడే కాన్ ను తొలగించాల్సిందని ఐ.ఏం.ఎఫ్ బోర్డు లెంపలు వేసుకుంది.

ఇవి కాక ఫ్రాన్సు లో రేప్ నేరారోపణలు కూడా కాన్ ఎదుర్కొన్నాడు. ఒక మహిళా విలేఖరి 2003 లో ఇంటర్వ్యూ చేయడానికి వెళ్ళగా, కాన్ తనపై రేప్ కి ప్రయత్నించాడని ఆరోపించింది. నేరం జరిగి చాలా కాలం అయినందున దానిపై విచారించడానికి ఫ్రాన్సు న్యాయ వ్యవస్ధ అంగీకరించలేదు. సదరు మహిళా విలేఖరికి క్రైస్తవ మతాచారం ప్రకారం ‘బాప్తిజం’ ఇచ్చే సమయంలో కాన్ భార్య ఆమెకు తల్లి గా వ్యవహరించిందని ఆ తర్వాత పత్రికలు వెల్లడించాయి. అంటే కాన్ కి సదరు యువతి కూతురు వరసలో ఉన్నప్పటికీ బలవంతం చేయడానికి కాన్ సిద్ధపడ్డాడు.

స్ట్రాస్ కాన్ ఫ్రాన్సులో ప్రఖ్యాత రాజకీయవేత్త. సోషలిస్టు పార్టీ నాయకుల్లో ముఖ్యుడు. ఈ సంవత్సరం ఫ్రాన్సులో అధ్యక్ష ఎన్నికలు జరగనున్నాయి. ఈ ఎన్నికల్లో కాన్ అధ్యక్షుడిగా పోటీ చేస్తాడని అందరూ భావించారు. పోటీ చేస్తే తప్పని సరిగా గెలుస్తాడని ఫ్రాన్సులో అంతా భావించారు.

స్ట్రాస్ కాన్ ఐ.ఏం.ఎఫ్ కు మూడున్నరేళ్లు మేనేజింగ్ డైరెక్టర్ గా పని చేశాడు. ప్రపంచ ఆర్ధిక, ద్రవ్య సంక్షోభాలు, యూరప్ ఋణ సంక్షోభం, నెమ్మదించిన అమెరికా జీడీపీ వృద్ధి మొదలయిన ప్రపంచ స్ధాయి సంక్షోభాలు ఈయన హయాంలో తలెత్తాయి. సదరు సంక్షోభాలను పరిష్కరించే క్రమంలో సమర్ధవంతంగా వ్యవహరించాడని కాన్ మన్ననలు అందుకున్నాడు. ధనిక లేదా అభివృద్ధి చెందిన దేశాల ప్రభుత్వాలు ఐ.ఏం.ఎఫ్ ను ప్రపంచ ద్రవ్య వ్యవస్ధను నిర్వహించే సంస్ధగా పేర్కొంటాయి. ఫైనాన్స్ పెట్టుబడి ప్రపంచ ఆర్ధిక వ్యవస్ధను నిర్ణయాత్మకంగా శాసిస్తున్న దశలో రెండవ ప్రపంచ యుద్ధానంతరం ఐ.ఎం.ఎఫ్ కు అంకురార్పణ జరిగింది.

మూడవ ప్రపంచ దేశాలలో, పేద దేశాలలో ఐ.ఏం.ఎఫ్ కి ఉన్న పేరు పూర్తిగా భిన్నమైనది. ప్రపంచ వడ్డీ దోపిడీ సంస్ధగా పేరు సంపాదించింది. సమస్యలో ఉన్న పేద దేశాలకు అప్పులిచ్చే ఐ.ఎం.ఎఫ్ అప్పు ఇచ్చేముందు అనేక విషమ షరతులు విధిస్తుంది. ఆయా దేశాల్లో ప్రజల సంక్షేమం కోసం వినియోగించే ప్రభుత్వ రంగ సంస్ధలను పూర్తిగా నిర్వీర్యం చేసి వ్యాపారాలన్నింటినీ అమెరికా, యూరప్ దేశాల కు వశం చేసే విధానాలను అది ప్రభోదిస్తుంది. ప్రపంచం అంతటినీ స్వేచ్ఛా వాణిజ్య మార్కెట్ గా తయారు చేసి అమెరికా, యూరప్ దేశాల సామ్రాజ్య వాద కంపెనీలకు పాదాక్రాంతం చేయడమే దీని లక్ష్యం. వివిధ దేశాల ప్రజలు పశ్చిమ కంపెనీల ఉత్పత్తులను, కంపెనీలను మాత్రమే కొనుగోలు చేసే వినియోగదారులుగా మార్చాలన్నదే దీనికి నిర్దేశించబడిన లక్ష్యం. ఇది సాధించాలంటే మూడవ ప్రపంచ దేశాలలో ప్రభుత్వాలు తమ ప్రజలకు తక్కువ ధరలకు ఉత్పత్తులను, సేవలను అందించడాన్ని రద్దు చేయవలసిన అవసరం ఉంటుంది. అదెలా సాధ్యం అవుతుంది?

ఎలా గంటే: ఆయా దేశాల ప్రజలకు అప్పటికే ఆయా దేశాల ప్రభుత్వాలు కొన్ని సౌకర్యాలు అభివృద్ధి చేసి ఉన్నాయి. ప్రభుత్వ రంగ కంపెనీలు, సంక్షేమ విధానాలు, సబ్సిడీలు మొదలయినవి ఆ సౌకర్యాల కిందికి వస్తాయి. ఈ సౌకర్యాలు కొనసాగినంతకాలం అక్కడి ప్రజలు అమెరికా, యూరప్ దేశాల ఉత్పత్తులు, సరుకులను కొనాలని భావించరు. పశ్చిమ దేశాల ఉత్పత్తులు సేవలు, మూడవ ప్రపంచ దేశాలలోకి రాకుండా అక్కడి ప్రభుత్వాలు పన్నుల చట్టాలు, నియంత్రణ చట్టాలు, భూగరిష్ట పరిమితి చట్టాలు మొదలయినవి చేసుకుని ఉన్నాయి. ఇవన్నీ ఉన్నంత కాలం ఆ దేశాల ప్రజలు పశ్చిమ దేశాల నుండి వచ్చే సరుకులను కొనాలని భావించే అవకాశమ్ లేదు. కనుక అప్పుల షరతుల పేరుతో ఈ అవకాశాలన్నింటినీ ఎత్తివేయించే పనిని ఐ.ఎం.ఎఫ్ కి అమెరికా, యూరప్ లు నిర్దేశించాయి. విదేశీ కంపెనీలతో పోటీ పడితే సరుకులు, సేవలు ఇంకా తక్కువ ధరలకు అందుబాటులో వస్తాయనీ, విదేశీ కంపెనీలు ఉద్యోగాలు ఇస్తాయనీ, వినూత్న శాస్త్ర సాంకేతిక పరిజ్ఞానం దేశాన్ని ముంచెత్తుతుందనీ అబద్ధాలు ప్రచారం చేస్తూ ఆయా దేశాల పాలకులు తమ పూర్వ పాలకులు చేసిన పన్నుల చట్టాలనూ, నియంత్రణ చట్టాలనూ, ఇతర సకల రక్షణ చట్టాలనూ రద్దు చేయడానికి పూనుకున్నాయి. మూడవ ప్రపంచ దేశాల పాలకులు దాదాపు అందరూ విదేశీ కంపెనీలకు అమ్ముడుబోవడంతో ఇదంతా సాధ్యమయింది.

ఈ దుర్మార్గమయిన కార్యక్రమానికి ఐ.ఎం.ఎఫ్ సంస్ధ దళారీ సంస్ధ గా, ఫెసిలిటేటింగ్ సంస్ధగా వ్యవహరించింది. అలాంటి సంస్ధకు స్ట్రాస్ కాన్ మేనేజింగ్ డైరెక్టర్ గా వ్యవహరించాడు. మూడవ ప్రపంచ దేశాలపై అమలు చేసిన షరతుల వలన అక్కడి ప్రభుత్వ రంగ కంపెనీలు అయిన కాడికి అమ్మేస్తున్నారు. దానీతో ప్రజలకు ఉద్యోగాలు దొరకడం లేదు. ఆ స్ధానంలో ప్రవేటు కంపెనీలు ఉద్యోగాలు ఇస్తాయని చెప్పినా అదేమీ జరగడం లేదు. అయినా ప్రజల సంక్షేమం దృష్ట్యా ప్రభుత్వ కంపెనీలు ఇచ్చే ఉద్యోగాలూ, లాభాల దృక్పధంతో ప్రవేటు కంపెనీలు ఇచ్చే ఉద్యోగాలూ ఒకటి కాజాలవు. ప్రభుత్వ రంగ కంపెనీలు లాభ నష్టాల జోలికి పోకుండా ప్రజలకు సేవ చేస్తాయి. ఒకవేళ వాటికి నష్టాలు వచ్చినా ప్రజల నుండి వసూలు చేసే పన్నులే ఆనష్టాలను పూడుస్తాయి. కనుక ప్రజలకు సేవ చేయడంలో, వారి సంక్షేమం చూడడంలో లాభ నష్టాల ప్రసక్తి తేవడమే సరి కాదు. కానీ కంపెనీలకు అమ్ముడు బోయిన పాలకులు లాభ నష్టాల ప్రసక్తి తెస్తూ, లాభాలు తెస్తున్నా కంపెనీలను కూడా ప్రవేటు కంపెనీలకు అమ్మేస్తూ ప్రజలకు తీవ్ర ద్రోహం చేస్తున్నారు.

ఐ.ఎం.ఎఫ్ విధించిన షరతుల వల్ల మూడవ ప్రపంచ దేశాల్లో, పేద దేశాల్లో అనేక ఆర్ధిక, సామాజిక వైపరీత్యాలు చోటు చేసుకుంటున్నాయి. నిరుద్యోగం తీవ్రం అయింది. దేశ వనరులన్నీ విదేశీ ప్రవేటు కంపెనీలు స్వాధీనం చేసుకుని దోచుకు తింటున్నాయి. కాస్తో, కూస్తో ప్రజల స్వాధీనంలో ఉన్న భూములన్నీ ప్రభుత్వాలు బలవంతంగా గుంజుకుని విదేశీ కంపెనీలకు అప్పజెపుతున్నాయి. రైతులకు ఎరువుల సబ్సిడీలు, పురుగు మందుల సబ్సిడీలు తగ్గిస్తుంన్నందువలన వ్యవసాయం ఖరీదుగా మారిపోయింది. కనీసం గిట్టుబాటు ధరలు కూడా అందక ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. విద్యా రంగం ప్రవేటు రంగం చేతుల్లోకి వెళ్లడంతో విద్యా కూడా ఖరీదుగా మారిపోయింది. వీటన్నింటి వలన రైతులు, కూలీలు, కార్మికులు తదితర మెజారిటీ వర్గ ప్రజల ఆదాయాలు తీవ్రంగా పడిపోతున్నాయి. ఆదాయాలు పడిపోతున్నపుడు అనివార్యంగా ప్రజల జీవన ప్రమాణాలు పడిపోతాయి.

ఈ పరిణామాలు సామాజికంగా అనేక విపరిణామాలకు దారి తీస్తున్నాయి. కుటుంబ జీవనం అస్తవ్యస్తం అయిపోతుంది. పనులు వెతుక్కుంటూ పోవడంతో కుటుంబాలు విచ్ఛిన్నం అయిపోతున్నాయి. గ్రామాల నుండి పట్నాలకు వలస వస్తున్నవారందరికీ పనులు దొరకవు. కాలేజీ చదువు ముగించినవారందరికీ ఉద్యోగాలు దొరకవు. పెళ్లీడు వచ్చిన వారందరికీ పెళ్ళిళ్ళు కావు. ముఖ్యంగా ఆడపిల్లల పెళ్లిళ్లు వారి తల్లిదండ్రులకు మరింత భారంగా పరిణమిస్తున్నాయి. పెళ్లిళ్లు చేయలేని తల్లి దండ్రులు ఆడ పిల్లలను ఏదో రకంగా వదిలించుకోవడానికే ప్రయత్నిస్తూ, ఆ క్రమంలో నిస్సహాయ పరిస్ధితుల్లో, పుట్టిన ఆడపిల్లలను చంపుకోవడానికి, వదిలి పెట్టడానికీ, అమ్ముకోవడానికీ కూడా సిద్ధపడుతున్నారు. దారుణమైన ఆర్ధిక పరిస్ధితులు అనేక మందిని నేఱగాళ్లుగా మార్చి వేస్తున్నాయి. ఖరీదైన ఉన్నత చదువులు, ఖరీడయిన మంచి చదువులు చదవలేని వారు ఉన్నత ఉద్యోగాలకు ఎటూ పోలేరు. అలాంటి వారు ఎటూ ఉపయోగపడని చదువులతో తమ చదువులను ముగిస్తున్నారు. వారిక అనంతమైన నిరుద్యోగ సైన్యంలోకి చేరడం తప్ప మరొక దారి లేదు. ఉద్యోగాలు లేనివారు, భార్యలను పోషించలేని వారు అసమర్ధులుగా సమాజంలో ముద్రవేయబడుతున్నారు.

ఈ పరిస్ధితుల నుండే ఆడ పిల్లలు వ్యభిచార కొంపలకు చేరుతున్నారు. భర్తల చేత, తల్లిదండ్రుల చేత, అన్న దమ్ముల చేత నిరాదరణకు గురై సెక్స్ పరిశ్రమలో చేరిపోతున్నారు. ప్రేమికుల చేత మోసగించబడూతున్నారు.

ఈ చెడుగులన్నింటికీ దారి వేసినది పెట్టుబడిదారీ వ్యవస్ధ. అమెరికా, యూరప్ లలోని పెట్టుబడి దారీ కంపెనీలు తమ మార్కెట్లు పెంచుకోవడానికి ఒక పద్ధతి ప్రకారం కృషి చేసిన ఫలితమే ఈ పరిణామాలన్నీ ఏర్పడ్డాయి. కంపెనీల మార్కెటు పెంచడానికి అప్పుల పేరుతో ఐ.ఎం.ఎఫ్ విధించిన విషమ షరతులు మూడవ ప్రపంచ దేశాల్లో ఈ విపరీత పరిణామాలకు దారి తీసాయి.

నిరుద్యోగ సైన్యం ఎంత ఎక్కువగా ఉంటే కంపెనీలకు అంత తక్కువ రేట్లకు కార్మికులు అందుబాటులో ఉంటారు. జనాభా అత్యధిక సంఖ్యలో ఉన్న చైనా, ఇండియాలు ఈ పెట్టుబడిదారీ కంపెనీల లాభాలకు స్వర్గ ధామాలు. లాభాలు పెంచుకునే క్రమంలో తాము వివిధ దేశాలలో వ్యవస్ధలను నాశనం చేస్తున్నామనీ, సామాజిక జీవానాన్ని అస్తవ్యస్తం చేస్తున్నామనీ, ఆడ పిల్లల బ్రతుకులను సర్వ నాశనం చేస్తున్నామనీ, కుటుంబాలను విచ్ఛిన్నం చేస్తున్నామని బాగానే తెలుసు. అలా విచ్ఛిన్నం చేస్తేనే, వ్యవస్ధలను నాశనం చేస్తేనే తమ లాభాలు అనంతంగా పెరిగే పరిస్ధితులు ఏర్పడతాయని వారికి బాగానే తెలుసు. తమ లాభ దాహాన్నీ, దోపిడినీ, అనేకానేక దుర్మార్గాలనీ ప్రజలు ఎప్పటికైనా వ్యతిరేకించి తిరుగుబాటు చేయకుండా ఉండాలన్నా వ్యవస్ధలను నాశనం చేయాల్సిందేనని వారికి బాగానే తెలుసు.

ఐ.ఎం.ఎఫ్ మేనేజింగ్ డైరెక్టర్ అయినా, ప్రపంచ బ్యాంకు అధ్యక్షుడు అయినా, అమెరికా, జర్మనీ, చైనా, ఇండియా, బ్రిటన్ లాంటి అనేకానేక దేశాల పాలకులయినా ఈ విషయాలు తెలియకుండా ఏమీ లేరు.

కనుక భారత దేశంలో కుటుంబాలకు భారమై వ్యభిచార గృహాలకు అమ్ముడు బోయే యువతులూ, చైనాలో అత్యంత హీనమైన వేతనాలకు అమ్ముడుబోయే శ్రమ జీవులు, ఆంధ్ర ప్రదేశ్ లో గల్ఫ్ దేశాల ఉద్యోగాల కోసం ఉన్న ఆస్తులను అమ్ముకునే నిరుద్యోగులు, అమెరికాలో ఉద్యోగం కోసం వలస పోయి, జీవనాధారం కరువై, పెట్రోల్ బంకుల్లో ఉద్యోగాలకు కూడా సిద్ధపడే సాఫ్ట్ వేర్ నిపుణులు, మెరుగైన జీవనం కోసం ఇంగ్లాండ్, ఫ్రాన్స్, జర్మనీ, అమెరికా లాంటి దేశాలకు వలస వెళ్ళి వ్యభిచార గృహాలకు అమ్ముడు బోయే తూర్పు యూరప్, ఆఫ్రికా, ఆసియా దేశాల యువతులూ, ఉద్యోగాలు దొరక్క మాఫియా గ్రూపుల్లో కిరాయి హంతకులుగా చేరే నిరుద్యోగ సైన్యం, సిరియా, లిబియా లాంటి దేశాల్లో పశ్చిమ దేశాలు నడిపే కిరాయి తిరుగుబాట్లలో చేరే అరబ్ యువకులూ…. వీరంతా పెట్టుబడిదారీ కంపెనీల ధన దాహానికి పుట్టినవారే.

ఇన్ని నేరాలకూ, యుద్ధాలకూ, అనైతిక వ్యాపారాలకూ, మాఫియా కార్యకలాపాలకూ వ్యభిచార వ్యాపారాలకూ పాల్పడే పెట్టుబడిదారీ వ్యవస్ధలకు నైతిక విలువల పట్ల గౌరవం ఉంటుందా? పని గట్టుకుని ప్రపంచం అంతా నిరుద్యోగ సైన్యాన్ని సృష్టించడానికి పూనుకుంటున్నవారిని నిరుద్యోగుల వెతలు కదిలిస్తాయా? లాభాల కోసం కంపెనీలకు కంపెనీలనే ఎత్తేసుకుని చైనా, ఇండియాలకు తరలించే అమెరికా యూరప్ ల కంపెనీ అధిపతులకు తమ దేశాల నిరుద్యోగ సమస్యను తీర్చాలని భావిస్తాయా?  ఆకలితో, దరిద్రంతో, నిరుద్యోగంతో కోట్లాది ప్రజానీకం తీసుకుంటే తప్ప తమకు తక్కువ ధరలకు పని వారు దొరకని ఫిక్సై పోయిన పెట్టుబడిదారులను ఎన్ని కోట్ల మంది ఆకలి చావులు, రైతుల ఆత్మ హత్యలు, ఆకలికమ్ముడుబోయిన అపరంజి బొమ్మలు కదిలించగలవు?

అటువంటి పెట్టుబడిదారీ వ్యవస్ధకు ప్రతినిధి, అప్పులిచ్చి అనేక సామాజిక, ఆర్ధిక సమస్యలను సృష్టించే పెట్టుబడిదారీ సిద్ధాంతవేత్తా, కంపెనీలకు ఇచ్చిన బెయిలౌట్లను వసూలు చేయడానికి యూరప్ ప్రజలపై దుర్మార్గ మైన పొదుపు ఆర్ధిక విధానాలను రుద్దిన పరిష్కర్తా అయిన డొమినిక్ స్ట్రాస్ కాన్ కి నైతికి విలువలు ఉంటాయా? నిరుద్యోగులను సృష్టిస్తూ, ప్రజల జీవన ప్రమాణాలను కూల దోస్తూ, ఆర్ధిక సమస్యలతో దిగజారుతున్న సమాజాలను సృష్టిస్తూ స్ట్రాస్ కాన్ ఐ.ఎం.ఎఫ్ అధ్యక్ష పదవిలో మూడున్నరేళ్ళు గడిపాడు.

అలాంటి వ్యక్తి ఆడ పిల్లలను వ్యభిచార కొంపలకు అమ్మేయడానికి ఎందుకు సంకోచిస్తాడు? పొట్ట కూటి కోసం వ్యభిచారం చేస్తున్న స్త్రీలతో సెక్స్ పార్టీలు జరుపుకుని ఆనందించడానికి ఎందుకు వెనకాడతాడు? ప్రపంచ స్ధాయి సంస్ధ కి అధిపతిగా ఉంటూ ఆ పదవిని అవకాశంగా తీసుకుని ఉన్నత స్ధాయిగా భావిస్తున్న స్ధితికి చేఱుకున్న స్త్రీలతో సైతం అక్రమ సంబంధం నెరపడానికి అతను సిగ్గుపడడు. అలాంటి వాడికి హోటల్ లో పని చేసుకునే స్త్రీ తన ను సంతోష పరచడానికి సిద్ధంగా ఉన్నట్లు గానే కనిపిస్తుంది. ఐ.ఎం.ఎఫ్ బోర్డు సభ్యురాలైనా, తన ఇంటర్వ్యూకి వేచి ఉన్న కూతురు వరస/వయసు ఉన్న యువతి ఐనా, పొట్ట కూటి కోసం వ్యభిచారానికి అమ్ముడు బోయిన ఆడదయినా, చివరికి సొంత భార్య అయినా ఒకలాగే కనిపిస్తుంది. అతని దృష్టిలో ఆడది అంటే మగాడి అవసరం తీర్చే సరుకు మాత్రమే.

మనిషి వినియోగించే ప్రతి వస్తువునూ లాభం సంపాదించి పెట్టే సరుకుగా మార్చింది పెట్టుబడిదారీ వ్యవస్ధ. ఆ పెట్టుబడిదారీ వ్యవస్ధ ప్రసాదించిన పదవీ వైభోగంతోనే స్ట్రాస్ కాన్ ఇన్ని అకృత్యాలకూ, అనైతిక విచ్చలవిడితనానికీ, ప్రపంచంలోని కోట్లాది కుటుంబాల విచ్ఛిన్నానికీ పాల్పడ్డాడు. చివరికి తన కుటుంబం విచ్ఛిన్నం అయినా, మరొక స్త్రీని కొనుక్కుంటాడు తప్ప అతనేమీ బాధపడడు.

నైతికత లేని పెట్టుబడిదారీ వ్యవస్ధే స్ట్రాస్ కాన్ గుణ గణాలకి జన్మ నిచ్చి, పెంచి పోషించింది. కోట్లాది మంది ఆకలిని కోరుకునే పెట్టుబడిదారీ వ్యవస్ధే ఆకలికి అమ్ముడు బోయే అపరంజి బొమ్మలతో ప్రాస్టిట్యూట్ రింగ్ ను నడిపించింది. ప్రపంచ దేశాలలో దారిద్రాన్ని నింపే పెట్టుబడిదారీ వ్యవస్ధే, స్ట్రాస్ కాన్ ను దరిద్రంతో దరి చేరిన స్త్రీలతో వ్యభిచారం చేయించి సొమ్ము చేసుకోగల ధైర్యాన్నిచ్చి వెన్ను తట్టి ప్రోత్సహించింది.

అందుకే పెట్టుబడిదారీ వ్యవస్ధ ప్రతినిధిగా, స్వేచ్చా వాణిజ్య వ్యవస్ధల సిద్ధాంత కర్తగా, ప్రపంచ దేశాలను స్వేచ్ఛా మార్కెట్లుగా కంపెనీలకు పాదాక్రాంతం చేసే ఫెసిలిటేటర్ గా పని చేసిన స్ట్రాస్ కాన్ కి నైతికి విలువల పట్టింపు ఉండదు. పదే పదే తన అనైతికి విచ్చలవిడితనం బైట పడుతున్నా మరొకసారి అదే పరిస్ధితిలో దొరకిపోవడానికి ఏ మాత్రం సిగ్గుపడడు. సిగ్గు పడకుండా ఉండడానికి కావలసిన దినుసులన్నింటినీ పెట్టుబడిదారీ వ్యవస్ధ అతనికి సమకూర్చి పెట్టింది.

స్ట్రాస్ కాన్ ఫ్రెంచి సోషలిస్టు పార్టీ నాయకుడు గనక అతను సోషలిస్టు అనీ, పెట్టుబడిదారీ విధానంతో అతనికి సంబంధం లేదనీ కొంతమంది భావిస్తున్నారు. అది వారి అజ్ఞానం మాత్రమే. సోషలిస్టు సిద్ధాంతాలను ప్రబోధించేవారు ఐ.ఎం.ఎఫ్ అధిపతి ఎలా కాగలరు? అమెరికా, యూరప్ దేశాలు ప్రధానంగా సమకూర్చిన ఫైనాన్స్ నే ఐ.ఎం.ఎఫ్ వడ్డీలకి తిప్పుతుంది. పెట్టుబడిదారీ దేశాలు తమ ఫైనాన్స్ ని వడ్డీ కి తిప్పే సంస్ధకు సోషలిస్టు సిద్ధాంత కర్తను నియమించుకోవని వారు గ్రహించాలి. సోషలిస్టు లేదా కమ్యూనిస్టు సిద్ధాంత కర్తలు పెట్టుబడిదారీ వ్యవస్ధలకు పని ముట్లుగా ఉండరని వారు గుర్తించాలి. కమ్యూనిజం లేదా సోషలిజం ల నుండి ఎదురవుతున్న ప్రమాదాలను ఎదుర్కోవడానికి పెట్టుబడిదారీ వ్యవస్ధ దొంగ సోషలిస్టులను సృష్టించుకుంది. అలాంటి దొంగ సోషలిస్టుల్లో ఒకరే స్ట్రాస్ కాన్. నిజానికి స్ట్రాస్ కాన్ దొంగ సోషలిస్టు అన్న బిరుదుకి కూడా తగడు.  అతను నాయకత్వం వహించే ఫ్రెంచి సోషలిస్టు పార్టీ సోషలిజం సిద్ధాంతాలను పొరబాటున కూడా ఉచ్చరించదు. అటువంటి పార్టీ నాయకుడు కనీసం దొంగ సోషలిస్టు కూడా కాజాలడు.

One thought on “‘ప్రాస్టిట్యూషన్ రింగ్’ లో పెట్టుబడిదారీ సిద్ధాంత ప్రభోధకుడు స్ట్రాస్ కాన్

  1. వారం రోజులు పైగా వ్యక్తిగత కారణంతో నెట్ లోకి రావడం కుదరలేదు. మళ్లీ మీ నుంచి మరో అద్భుత వ్యాసం చూస్తున్నాను. వ్యక్తి నీతితో మొదలుపెట్టి వ్యవస్థ వరకు మనం ఉంటున్న ప్రపంచంలో ఒక ఘోర కృత్యాన్ని శక్తివంతమైన శైలిలో సూత్రీకరించారు. వ్యవస్థ పునాది నుంచి పుట్టుకొస్తున్న ఒక వికృత ధోరణిని శిఖర స్థాయిలో వివరించిన ఈ రకం కథనాలు మీ సైట్‌లో వెనుకకు పోయి కనుమరుగు కాకుండా హోమ్ పేజీలో చాలా కాలం పాటు ఉండేలా ఏర్పాటు చేయడం అవసరం.

    స్ట్రాస్ కాన్ ఫ్రెంచి సోషలిస్టు పార్టీ నాయకుడు కాబట్టి సోషలిస్టులందరూ ఇలాంటి దొంగలే అంటూ గతంలో వ్యాఖ్యానాలు వెలువడ్డాయి. మీరన్నట్లు పెట్టుబడిదారీ వ్యవస్ధ సృష్టించుకున్న దొంగ సోషలిస్టుల భండారం గురించి చాలామందికి తెలియడం లేదు. సోషల్ డెమాక్రాటిక్ పార్టీ పేరుతో యూరప్‌లో 20వ శతాబ్దం పొడవునా చెలరేగిన పక్కా రివిజనిస్టు ఆచరణే యూరప్ సోషలిజం, సోషలిస్టుల రూపం దాల్చిందనేది పరమసత్యం. వెంటనే కాకున్నా, సోషలిజం ముసుగులో సోషలిస్టు వక్రీకరణలు చరిత్రలో ఎలా మొదలయ్యాయనే అంశంపై సిద్ధాంత వ్యాసం అందిస్తే బాగుంటుంది.

    మొత్తంమీద మంచి విశ్లేషణ అందించినందుకు అభినందనలు.

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

గూగుల్ చిత్రం

You are commenting using your Google account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

Connecting to %s