పరీక్ష హాలులో దళిత బాలికల బట్టలిప్పించిన ఇన్విజిలేటర్లు


Dalit girls stripped 03పరీక్షల్లో ఎవరైనా విద్యార్ధులు కాపీ కొడుతున్నట్లు అనుమానం వస్తే ఇన్విజిలేటర్లు ఏం చేయాలి? సాధారణంగా జేబుల్లో కాపీ స్లిప్పులు ఏమైనా ఉన్నాయేమో చూస్తారు. కాగితాల కింద దాచి పెట్టారేమో చెక్ చేస్తారు. ఇంకా దాచిపెట్టడానికి ఉన్న అవకాశాలని పరిశీలించి వెతుకుతారు. జామెట్రీ బాక్సుల్లో, రిస్ట్ వాచీ కిందా ఇలాంటి చోట్ల. అయితే దళిత బాలికలైతే ఇవేవీ అవసరం లేదు. పరీక్ష రాస్తున్న వారు 15 సంవత్సరాల బాలికలైనా, సంస్కార హీనమని తెలిసినా వారు దళిత బాలికలైతే అందరి ముందైనా సరే, బట్టలిప్పించి కాపీ స్లిప్పులు దాచి పెట్టారేమో చూడొచ్చు. వారు దళిత బాలికలు కనుక అవమానానికి గురైనా లెక్క చేయనవసరం లేదు. ఎందుకంటే వారి జీవితాలనే నిత్యం అవమానానికి గురిచేయగల అవకాశాలు అందుబాటులో ఉన్నపుడు పరీక్ష హాలులో జరిగే అవమానానికి వారేమీ బాధపడకపోవచ్చు.

మధ్య ప్రదేశ్ లో నర్సింగ్ పూర్ జిల్లా, బర్హెబారా గ్రామంలో పదవ తరగతి పరీక్షలకు కాపలా కాస్తున్న మహిళా ఇన్విజిలేటర్లు ఇలాగే భావించినట్లు కనిపిస్తోంది. పరీక్ష హాలులో కొద్ది మంది విద్యార్ధినులతో పాటు దాదాపు నలభై మంది బాలురు పరీక్ష రాస్తున్నారు. వారందరి ముందూ దళిత బాలికల బట్టలు విప్పించడానికి ఇన్విజీలేటర్లకు ఏ మాత్రం అభ్యంతరం లేకపోయింది. బోర్డు పరీక్షల్లో కాపీలు కొడుతున్నట్లు అనుమానం రావడంతో ఇద్దరు విద్యార్ధినులను బట్టలిప్పేయాలని వారు ఆదేశించారు. దానికి విద్యార్ధినులు నిరాకరించడంతో తామే బలవంతంగా బట్టలు విప్పి మరీ కాపీ స్లిప్పుల కోసం వెతికారు. ఇన్విజిలేటర్లు అంత వెతికినా స్లిప్పులేవీ దొరకలేదని ‘ది హిందూ’, ‘టైమ్స్ ఆఫ్ ఇండియా’ తెలిపాయి. 

ప్రభుత్వ ఉన్నత సెకండరీ పాఠశాలలో మార్చి 15 తేదీన ఈ దారుణం జరిగింది. లెక్కలు పరీక్ష రాస్తుండగా ఇన్విజిలేటర్లు ఈ అమానవీయ ఘోరానికి పాల్పడ్డారు. ప్రీతి శర్మ, రేష్మ సెమైయా అనే పేర్లుగల ఇన్విజిలేటర్లు స్లిప్పులు దాచి పెట్టారన్న అనుమానంతో కనీస సంస్కారం మర్చిపోయారు. సిగ్గుతో, అవమానంతో ఉన్న బాలికలు జరిగిన సంఘటనను వెంటనే చెప్పుకోలేకపోయారు. గత శుక్రవారం వారు తమ తల్లిదండ్రులకు చెప్పుకుని ఏడ్చాక గాని జరిగిన సంగతి వెల్లడి కాలేదు. బాలికల తలిదండ్రులు జిల్లా అధికారులకు ఫిర్యాదు చేయడంతో విషయం పత్రికలదాకా వచ్చింది.

తాను బట్టలు విప్పడానికి నిరాకరించినపుడు ఇన్విజిలేటర్లు “విప్పెయ్, లేదా నీ సల్వార్ పైట కత్తిరించేస్తాను” అని గద్దించారని ఒక విద్యార్ధిని సబ్ డివిజనల్ మేజిస్ట్రేట్ కి చెప్పింది. అయినా విద్యార్ధినులు లొంగకపోవడంతో ఇన్విజిలేటర్లే బలవంతంగా బట్టలు విప్పారని టైమ్స్ ఆఫ్ ఇండియా పత్రిక తెలిపింది. సంఘటన జరుగుతుండగా హాలులోని మగ క్లాస్ మేట్లు పళ్ళికిలిస్తూ, జోకులు పేల్చారని ఆ పత్రిక తెలిపింది. “ఫిర్యాదు రిజిస్టర్ చేశాం. బ్లాక్ విద్యాధికారిని విచారించి ఒక రోజులో నివేదిక ఇవ్వాలని ఆదేశించాము. ఇది చాలా తీవ్రమైన విషయం. విచారణ పూర్తయ్యాక చర్యలు తీసుకుంటాం” అని నర్సింగ్ పూర్ జిల్లా కలెక్టర్ సంజయ్ సింగ్ తెలిపాడు. ఇటువంటి నేరానికి మొదట నిందితులను సస్పెండ్ చేయాల్సి ఉండగా ఇంకా అదేమీ జరగలేదు.

మహిళా ఇన్విజీలేటర్లిద్దరూ ఇన్స్ పెక్షన్ టీం సభ్యులుగా కనిపిస్తోంది. హాలులో ఉన్న యాభై మందిలో అనుమానంతో వెతకడానికి వారికి దళిత బాలికలే కనిపించారు. సమాజంలో సమానతా విలువలు పెంపొందించడానికీ, కుల వ్యతిరేక చైతన్యం బోధించడానికీ తరగతి గదులు శిక్షణా కేంద్రాలుగా పని చేయవలసి ఉండగా భారత దేశంలోని అనేక గ్రామాల్లో పరిస్ధితి అందుకు విరుద్ధంగా ఉంది. దళిత బాలికలన్న విషయం పక్కన పెట్టినా ఆడపిల్లలను సహజంగా చూడవలసిన పద్ధతిని కూడా మహిళా ఇన్విజిలేటర్లు పట్టించుకోకపోవడం దారుణమైన విషయం. ఆడపిల్లల కు సంబందించిన సహజ సిద్ధమైన సెన్సిబిలిటీస్ ని మహిళా టీచర్లు గౌరవిస్తారన్న అంచనాని కూడా ఈ మహిళా ఇన్విజిలేటర్లు అవమాన పరిచారు. దళితులపై ఉండే తేలిక దృష్టి మహిళలుగా వారికి ఉండవలసిన సున్నిత భావాలని అధిగమించినట్లు కనిపిస్తోంది.

ఆడ పిల్లలు నలుగురిలో ఉన్నపుడు పైట కొద్దిగా జారితోనో, పొరబాటున కింద పడితేనో కూడా అవమానంగా భావిస్తారు. తమ శరీర భాగాలు బహిరంగం కావడానికి ఆడపిల్లల సంగతి తర్వాత, మగపిల్లలైనా ఇష్టపడరు. నాగరిక సమాజంలో దుస్తుల ధారణ అన్నది సంస్కృతిలో ఒక భాగం. కటిక పేదల నుండి ధనికుల వరకూ తమకు ఉన్నంతలో బట్టలు ధరించడం నైతిక విలువగా కూడా  భావిస్తారు. ఇలాంటి కనీస విషయాలు కూడా మహిళా ఇన్విజలేటర్లకు తట్టలేదా? ఎందుకు తట్టదు? తట్టింది కనుకనే అలాంటి అవమానానికి వారు పాల్పడ్డారు. పరీక్షల్లో కాపీలకు పాల్పడడం అంటే, తాము బట్టలు విప్పించడం కంటే ఘోరమైన విషయంగా వారు భావించారు. బట్టలు విప్పితే తప్ప దళితులకు బుద్ధి రాదన్న ఆధిక్యతా భావన వారినాపని చేయించింది.

నిజానికి బుద్ధి రావలసింది నేరం రుజువు కాకుండానే శిక్ష అమలు చేసిన మహిళా ఇన్విజిలేటర్లకే. కాపీ జరగకుండా నివారించడానికే తప్ప శిక్షలు అమలు చేసే అధికారం తమకు లేదన్న స్పృహ లేని ఇన్విజీలేటర్లే పాఠం నేర్చుకోవాలి.

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

గూగుల్ చిత్రం

You are commenting using your Google account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

Connecting to %s