ఫిబ్రవరి 26 వ తేదీన ఫ్లోరిడా రాష్ట్రంలో తెల్ల జాతికి చెందిన పోలీసు ఒకరు నల్ల జాతికి చెందిన టీనేజర్ ను కాల్చి చంపిన విషయంలో అమెరికా అంతటా నిరసనలు చెలరేగుతున్నాయి. 17 యేళ్ళ వయసు కలిగిన ట్రేవాన్ మార్టిన్ నిరాయుధుడుగా ఉన్నప్పటికీ పోలీసు (జిమ్మర్ మేన్ – 28 సం.) అతనిని ‘ఆత్మ రక్షణ’ కోసం చంపినట్లుగా చెబుతున్నాడు. బ్లాక్ టీనేజన్ హత్యలో పోలీసులు ఇంతవరకూ ఎవరినీ అరెస్టు చేయకపోవడంతో దానికి కారణం జాతి పక్ష పాతమేనని నల్ల అమెరికన్లు ఆరోపిస్తున్నారు. పోలీసు అధికారులు సైతం జిమ్మర్ మేన్ వాదనలు నమ్మి నిరాయుధుడైన వ్యక్తిని చంపడాన్ని ‘ఆత్మ రక్షణ’ గా చెప్పడం పట్ల ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. దోషిని అరెస్టు చేసి శిక్షించాలని అనేక రాష్ట్రాలలో నల్ల జాతి ప్రజలతో పాటు ఇతర మానవ హక్కుల సంస్ధలు ఆందోళనలు నిర్వహిస్తున్నాయి.
ట్రేవాన్ మార్టిన్ ఫిబ్రవరి 26 న తన ఇంటి నుండి బైటికి వెళ్ళాడు. సమీపంలో ఉన్న గ్రోసరీ షాపుకి వెళ్ళి కొన్ని క్యాండీలు, డ్రింకులు కొనుక్కుని తన తండ్రి ఫియాన్సీ ఇంటికి తిరిగి వస్తున్నాడు. అదే సమయంలో అక్కడికి వచ్చిన జిమ్మర్ మేన్ ఎమర్జెన్సీ పోలీసు నంబరు 911 కి ఫోన్ చేసి ‘అనుమానాస్పద వ్యక్తిని’ తాను చూశానని అతనిపై కాల్పులు జరపడానికి అనుమతి ఇవ్వాలనీ కోరాడని పోలీసులు విడుదల చేసిన ఫోన్ సంభాషణల ద్వారా వెల్లడయింది. 911 విభాగానికి చెందిన పోలీసులు జిమ్మర్ మేన్ ను కాల్పులు జరపడానికి వ్యతిరేకంగా సలహా ఇచ్చినప్పటికీ అమానుషంగా కాల్చి చంపాడని ఫోన్ సంభాషణలు వెల్లడించాయి.
ఆత్మ రక్షణ కోసం కాల్చి చంపానన్న జిమ్మర్ మేన్ వాదనకు మద్దతుగా సంఘటన స్ధలంలో ఎటువంటి సాక్ష్యమూ పోలీసులకు లభ్యం కాలేదు. గ్రోసరీ షాపులో కొన్న డ్రింకులు, క్యాండీలు మాత్రమే అతని వద్ద దొరికాయి. చనిపోవడానికి ముందు అతని గర్ల్ ఫ్రెండు తో మార్టిన్ ఫోన్ లో మాట్లాడుతున్నాడని మార్టిన్ లాయర్ బెంజమిన్ క్రంప్ చెప్పాడు. హత్య విషయాన్ని వైట్ హౌస్ అధికారులు సీరియస్ గా తీసుకున్నారని పత్రికలు చెబుతున్నప్పటికీ ఇంతవరకూ కేసులో ఎటువంటి పురోగతి లేదు.
హత్య జరిగిన సమయంలో మార్టిన్ తలను కప్పి ఉంచే హుడి డ్రస్ వేసుకుని ఉండడంతో అమెరికన్లు దేశ వ్యాపితంగా మార్చి 21 తేదీన ‘మిలియన్ హుడీ మార్చ్’ నిర్వహించారు. ఫ్లోరిడా, న్యూయార్క్, లాస్ ఏంజిలిస్ తదితర నగరాల్లో మరిన్ని ప్రదర్శనలు జరిగాయి. జిమ్మర్ మ్యాన్ ను ప్రాసిక్యూట్ చేయాలని డిమాండ్ చేస్తూ ఆన్ లైన్ పిటిషన్ లో 1.3 మిలియన్ల మందికి పైగా అమెరికన్లు సంతకం చేశారని సి.ఎన్.ఎన్ తెలిపింది. మార్చి 23 న ఫిలడేల్ఫియా రాష్ట్రంలో వేలమందితో ప్రదర్శనలు జరిగాయి. మార్చి 22న ఫ్లోరిడా రాష్ట్రంలోని శాన్ ఫోర్డ్ (మార్టిన్ హత్యకు గురయిన నగరం) లో 20,000 మందికి పైగా ప్రదర్శనలు నిర్వహించారు. మార్చి 21 తేదీన న్యూయార్క్ రాష్ట్రంలో పదుల వేల మంది ప్రదర్శన నిర్వహించారని ప్రెస్ టి.వి తెలిపింది. కాలిఫోర్నియాలో ఆదివారం పెద్ద ప్రదర్శన నిర్వహించారు.
అమెరికా జస్టిస్ డిపార్ట్ మెంట్ మార్టిన్ హత్య విషయంపై మానవహక్కుల దర్యాప్తు జరపడానికి నిశ్చయించిందని తెలుస్తోంది. శాన్ ఫోర్డ్ పోలీసు విభాగం అధిపతి బిల్ లీ తన బాధ్యతలనుండి తాత్కాలికంగా తప్పుకుంటున్నట్లు ప్రకటించినప్పటికీ ప్రదర్శకులెవరూ శాంతించలేదు. లీ రాజీనామా వల్ల ఫలితం లేదని మార్టిన్ తల్లిదండులు పెదవి విరిచారు. నిందిటుడిని అరెస్టు చేయకుండా, దోషికి శిక్ష పడేలా చూడకుండా పోలీసులు సెలవులో వెళ్లడం వల్ల ఫలితం ఏమిటని వారు ప్రశ్నిస్తున్నారు. అమెరికా అధ్యక్షుడు ఒబామా మార్టిన్ హత్య ‘ట్రాజెడీ’ గా ప్రకటించి ఊరుకున్నాడు.
ఫ్లోరిడా రాష్ట్రానికి చెందిన ‘ఆత్మ రక్షణ చట్టం” పై అమెరికాలో చర్చలు జరుగుతున్నాయి. ఈ చట్టాన్ని ‘షూట్ ఫస్ట్’ చట్టంగా అమెరికన్లు అభివర్ణిస్తున్నారు. పోలీసులు కాల్పులు జరిపి ఎవరినైనా చంపాకనో, లేదా హింసాత్మక ఘటనకు పాల్పడితేనో అటువంటి వారిని క్రిమినల్ విచారణ నుండీ, పౌర బాధ్యతా చట్టాల నుండీ రక్షణ కల్పించడానికి ఈ చట్టం ఉద్దేశించిందని తెలుస్తోంది.