ఫుకుషిమా కంటే ‘ఇరాన్ పై ఆంక్షలే’ మాకు పెను ప్రమాదం -జపాన్


Strait_of_Hormuz_map2011 లో సంభవించిన ఫుకుషిమా అణు ప్రమాదం కంటే ఇరాన్ పై పశ్చిమ దేశాలు విధించిన ఆంక్షల వల్లనే తమకు పెను ప్రమాదంగా పరిణమిస్తాయని జపాన్ భావిస్తోంది. అమెరికాలో జరిగిన ఒక సదస్సులో మాట్లాడుతూ ‘ఇంటర్నేషనల్ ఎనర్జీ ఏజన్సీ’ మాజీ డైరెక్టర్ నోబువో తనాకా ఈ మేరకు ఆందోళన వెలిబుచ్చాడు. ఇరాన్ పై విధించిన ఆంక్షల వల్ల తమ దేశానికి జరిగే గ్యాస్, ఆయిల్ సరఫరాలు ఆగిపోతాయనీ, దానివల్ల 2011 లో ఫుకుషిమా అణు ప్రమాదం వల్ల జపాన్ కి జరిగిన నష్టం కంటే 2012 లో ఎక్కువ ప్రమాదం తమ దేశానికి వాటిల్లుతుందని తెలిపాడు.

మార్చి 2011 లో జపాన్ ఈశాన్య ప్రాంతంలో 9.1 పాయింట్ల పెను భూకంపం సంభవించడంతో 20 మీటర్ల ఎత్తున అలలతో అతి పెద్ద సంభవించి ఫుకుషిమా అణు కర్మాగారం అతి పెద్ద ప్రమాదానికి గురయింది. ముప్ఫై యేళ్ళ క్రితం రష్యా లోని చెర్నోబిల్ అణు ప్రమాదం తర్వాత అంత పెద్ద అణు ప్రమాదంగా ఫుకుషిమా ప్రమాదాన్ని అంతర్జాతీయ నిపుణులు పేర్కోన్నారు. ఈ ప్రమాదం ఫలితంగా జపాన్ లో విద్యుత్ ఉత్పత్తి బాగా క్షీణించడంతో ఆర్ధిక వ్యవస్ధ బలహీన పడింది. ఫుకుషిమా అణు కర్మాగారం నుండి లీకయిన రేడియేషన్ సోకడంతో జపాన్ నుండి కూరగాయలు లాంటి అనేక దిగుమతులను ప్రపంచ దేశాలు నిషేధించాయి. అమెరికా, యూరప్, ఆసియా దేశాలు అనేకం జపాన్ దిగుమతులను చాలా కాలం పాటు నిషేధించడంతో అప్పటికే ‘ప్రతి ద్రవ్యోల్బణం’తో తీసుకుంటున్న జపాన్ ఆర్ధిక వ్యవస్ధ మరింతగా క్షీణించింది.

జపాన్ కి వచ్చే గ్యాస్ దిగుమతుల్లో 20 శాతం ఇరాన్ ద్వీప కల్పం ‘హోర్ముజ్’ పైగా రాలసిందే. అలాగే జపాన్ ఆయిల్ దిగుమతుల్లో 80 శాతం కూడా హోర్ముజ్ ద్వీప కల్పం మీదుగా రవాణా అవుతాయి. గత సంవత్సరం అమెరికా, యూరప్ ల నేతృత్వంలో ఐక్యరాజ్య సమితి విధించిన ఆంక్షలతో పాటు జనవరి 1 నుండి అమెరికా, యూరప్ లు అదనపు ఆంక్షలు ఇరాన్ పై విధించి వాటిని అమలు చేయాలని ప్రపంచ దేశాలపై వొత్తిడి తెస్తున్నాయి. ఈ ఆంక్షలు ఇలాగే కొనసాగినట్లయితే హోర్ముజ్ వద్ద సముద్ర మార్గాన్ని మూసివేస్తామని ఇరాన్ హెచ్చరించింది. దానితో అమెరికా, యూరప్ లు ఆంక్షల గురించి అతిగా మాట్లాడదాం తగ్గించేశాయి. యూరప్ లోని కొన్ని దేశాలు తాను విధించిన ఆంక్షలనుండి మినహాయిస్తున్నట్లుగా అమెరికా కొద్ది రోజుల క్రితం ప్రకటించింది. ఇరాన్ పై అహంభావ పూరితంగా, బెదిరిస్తూ వచ్చిన అమెరికా, యూరప్ లు ఇరాన్ హెచ్చరికతో పునరాలోచనలో పడ్డాయని అంతర్జాతీయ పరిశీలకులు విశ్లేషణలు సాగించారు.

Strait-of-Hormuz

ఇరాన్ పై పశ్చిమ దేశాలు చేస్తున్న బెదిరింపులు హోర్ముజ్ సముద్ర మార్గం మూసివేతకు దారి తీసినట్లయితే జపాన్ ఆర్ధిక వ్యవస్ధ పై వినాశకరమైన ప్రభావం కలుగుతుందని తనాకా తన ప్రసంగంలో తెలిపాడు. ‘సెంటర్ ఫర్ స్ట్రేటజిక్ అండ్ ఇంటర్నేషనల్ స్టడీస్’ సంస్ధ వాషింగ్టన్ లో శుక్రవారం నిర్వహించిన సదస్సులో తనాకా పాల్గొని ప్రసంగించాడు. తనకా ప్రస్తుతం జపాన్ కి చెందిన ‘ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఎనర్జీ ఎకనామిక్స్’ సంస్ధలో పని చేస్తున్నాడు. జపాన్ లోని అణు కర్మాగారాలు పూర్తిగా పని చేయని నేపధ్యంలో ఇరాన్ పై ఆంక్షలు తమపై పెను ప్రభావం కలిగిస్తాయని తనాకా తెలిపాడు. రానున్న మే నెలలో జపాన్ లోని 54 అణు కర్మాగారాలు నిర్వహణ కోసం, తనిఖీ కోసం మూసివేయనున్నారని ఆయన తెలిపాడు. స్ధానిక ప్రీఫేక్చర్ ప్రభుత్వాలు అనుమతి ఇవ్వనిదే అణు కర్మాగారాల తనిఖీలు పూర్తి కాగల అవకాశం లేదనీ, ప్రీఫేక్చర్ ప్రభుత్వాలేవీ ఒక్క అణు కర్మాగారానికి కూడా అనుమతి ఇంకా ఇవ్వలేదనీ దానితో 54 అణు కర్మాగారాలలో 52 కర్మాగారాలు దీర్ఘ కాలం మూసివేతకు గురవుతాయనీ ఆయన తెలిపాడు. ఈ పరిస్ధితుల్లో హోర్ముజ్ సముద్ర మార్గం మూసివేత గానీ, సరఫరాల కోత గానీ తమపై తీవ్ర ప్రభావం  చూపుతాయని తనాకా తెలిపాడు.

ప్రపంచ దేశాల్లో జపాన్ ఆర్ధిక వ్యవస్ధ ప్రముఖమైనది. ఇటీవలి వరకూ అమెరికా, యూరోపియన్ యూనియన్, జపాన్ లే ప్రధాన ఆర్ధిక కేంద్రాలుగా కొనసాగాయి. (2008 ప్రపంచ ఆర్ధిక సంక్షోభం అనంతరం చైనా కూడా ప్రబల ఆర్ధిక శక్తిగా ముందుకొచ్చింది.) ఇప్పటికీ జపాన్ ముఖ్యమైన ఆర్ధిక శక్తిగా నే ఉంది. ప్రపంచ దేశాల ఆర్ధిక వ్యవస్ధలు ఒకదానికొకటి పెనవేసుకున్న నేపధ్యంలో జపాన్ లాంటి ప్రధాన ఆర్ధిక శక్తి గల దేశంలో సంభవించే సంక్షోభం అనివార్యంగా ప్రపంచంపై ప్రభావం చూపుతుంది. యూరప్ ఋణ సంక్షోభం, అమెరికా లో నెమ్మదించిన ఆర్ధిక వృద్ధి లు ఇప్పటికే ప్రపంచ ఆర్ధిక వ్యవస్ధను తీవ్రంగా భయపెడుతున్నాయి. జపాన్ లోని అధిక ఉత్పత్తి సంక్షోభానికి తోడు ఆయిల్ సంక్షోభం కూడా తోడయితే అది జపాన్ నూ, తద్వారా ఇతర దేశాలనూ మరొకసారి ప్రమాదంలోకి నెడుతుంది.

ఇరాన్ పై ఆంక్షల వల్ల ప్రపంచ స్ధాయిలో ఆయిల్ రేట్లు పెరిగుతున్నాయని అమెరికా అధ్యక్షుడు బారక్ ఒబామా కూడా శుక్రవారం ఒక ఇంటర్వ్యూలో అంగీకరించాడు. అమెరికన్ ఆటోమోబైల్ అసోసియేషన్ (ఎ.ఎ.ఎ) కి ఇచ్చిన ఇంటర్వ్యూలో మాట్లాడుతూ ఆయన “గ్యాస్ ధరలు పెరగడానికి కీలకమైన కారణం వాస్తవానికి పశ్చిమాసియాలోనూ, ఇరాన్ విషయంలోనూ కొనసాగుతున్న అనిశ్చిత పరిస్ధితే. దీనివల్ల ప్రపంచ ఆయిల్ మార్కెట్లలో ఆయిల్ ధరలు బ్యారేల్ కు 20 నుండి 30 డాలర్ల వరకు ఆధికంగా ఉంటోంది” అని అన్నాడని ప్రెస్ టి.వి తెలిపింది. చైనా, ఇండియాలలో కార్లు ఎక్కువగా కొనడం వల్ల కూడా ఆయిల్ ధరలు ఎక్కువగా ఉన్నాయని ఒబామా అన్నట్లుగా ఎ.ఎఫ్.పి తెలిపింది. ప్రపంచంలో మరింతమంది జీవన స్ధాయిలు పెరుగుతుండగా కార్లు లాంటి సౌకర్యాలను కోరుకుంటున్నారనీ ఫలితంగా ఆయిల్ డిమాండ్ పెరిగి ధరలు పెరుగుతున్నాయనీ ఒబామా వాక్రుచ్చాడు.

చైనా, ఇండియాలపై ఒబామా ఏడుపు ఎలా ఉన్నప్పటికీ ఇరాన్ పై తాము విధించిన ఆంక్షలు ప్రపంచ దేశాల ప్రజలకు నష్ట కరంగా పరిణమించాయన్న స్పృహ ఆయనకు ఉన్నట్లు స్పష్టం అవుతోంది. శుక్రవారం క్రూడాయిల్ ధరలు ఒక్కసారిగా మూడు శాతం పెరిగి బ్యారల్ కు 108.25 డాలర్లకు చేరుకోవడానికి కారణం పశ్చిమాసియా లో సిరియా పై పశ్చిమ దేశాలు సాగిస్తున్న కిరాయి తిరుగుబాటు, ఇరాన్ పై విధించబడిన ఆంక్షల వల్ల మార్కెట్లలో ఏర్పడిన ఆందోళనలేనని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. ఆయిల్ ధరలు పెరగడం వల్ల దాదాపు అన్నీ సరుకుల ధరలు పెరిగిపోయి ద్రవ్యోల్బణాన్ని తీవ్రం చేస్తున్నాయి. ద్రవ్యోల్బణం వల్ల అమెరికా, యూరప్ లలో ఆర్ధిక వృద్ధి మరింత మందగిస్తోందని ఆర్ధిక విశ్లేషకులు ఏకగ్రీవంగా చెబుతున్నారు. కనుక ఇరాన్ ఆంక్షలు, సిరియా కిరాయి తిరుగుబాటు అంతిమంగా అమెరికా, యూరప్ ల మెడలకే చుట్టుకోనున్నాయి. ఆర్ధిక ప్రయోజనాల కోసం అమెరికా, యూరప్ లు వేస్తున్న రాజకీయ ఎత్తుగడలు తిరిగి ఆ దేశాల ఆర్ధిక ప్రయోజనాలకే ఎసరు తెస్తాయని ఇక్కడ అర్ధం చేసుకోవలసిన అంశం.

జపాన్ తో పాటు చైనా, భారత దేశం లు కూడా ఇందుకు మినహాయింపు కాదు.

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

గూగుల్ చిత్రం

You are commenting using your Google account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

Connecting to %s