‘ది హిందూ’ పత్రిక ప్రతి సంవత్సరం వివిధ ప్రాంతాల్లో స్కూల్ పిల్లలకు పెయింటింగ్ పోటీలు నిర్వహిస్తుంది. ఈ పోటీల్లో పాల్గొనే పిల్లలు వేసే పెయింటింగ్ లు చాలా సార్లు అబ్బురం కలిగిస్తాయి. తన చుట్టూ ఉన్న పరిసరాలపైన, ముఖ్యంగా ప్రకృతి పైన వీరికి ఉన్న ఊహాశక్తిని అభినందనించకుండా ఉండలేం. ప్రకృతితో పాటు సమాజం, సంస్కృతి, దేశ భక్తి లాంటి అంశాలపై కూడా వీరి అభిప్రాయాలను అక్కడక్కడా చూడగలం. ప్రధానంగా పాఠ్య పుస్తకాల ద్వారా తమకు అందే విజ్ఞానాన్నే వారు ప్రదర్శించించినప్పటికీ అప్పుడప్పుడూ సృజనాత్మకతను రంగరించి బొమ్మలు వేయడం కూడా కద్దు. ‘ది హిందూ’ అందించిన ఫొటోలు ఇవి.
–
గతంలో ప్రభుత్వ పాఠశాలల్లో పిల్లలను ప్రతి రంగంలోనూ ప్రోత్సాహం అందే విధంగా ఉపాధ్యాయులు జాగ్రత్తలు తీసుకునేవారు. ఆట స్ధలాలు, లేబొరెటరీ సౌకర్యాలు తప్పనిసరిగా ఉండేవి. వీటితో పాటు ఆర్ట్ మాస్టారు, క్రాఫ్ట్ మాస్టారు, సంగీతం మాస్టారు తప్పనిసరిగా ఉండేవారు. వీరు పిల్లల్లో దాగి ఉన్న సృజనాత్మక శక్తిని వెలికి తీయడానికి ప్రయత్నాలు తమ స్ధాయిలో చేసేవారు. విద్య ప్రవేటు రంగానికి అప్పజెప్పాక ప్రభుత్వ పాఠశాలల్లో ఈ సౌకర్యాలు, ప్రయత్నాలు కనుమరుగైపోయాయి. ఇప్పుడు క్లాసులు నడవడమే గగనంగా మారింది. ఆర్ధిక బలిమి ఉన్న ప్రవేటు పాఠశాలలు తప్ప ఇతర పాఠశాలలేవీ పిల్లల సర్వతోముఖాభివృద్ధికి ప్రయత్నిస్తున్న దాఖలాలు లేవు. పరీక్షల్లో మార్కులూ, ఇంగ్లీషు భాషా పరిజ్ఞానం ఇవే ఇప్పుడు విద్యార్దుల ప్రతిభను నిర్ధారించేందుకు కొలబద్దలు.
ఆ నాలుగవ బొమ్మ ఏంటో అర్ధం కాకుండా ఉంది.
ఆ బొమ్మకి ‘ఇండియన్ స్ప్రింగ్స్’ అని టైటిల్ ఉంది. ఆరవ తరగతి విద్యార్ధి గీసిన బొమ్మ అది.
చిన్నపిల్లల్లోని సృజనాత్మకతను వారి పసితనంలోనే గుర్తించి ఆయా విద్యార్థి ప్రతిభానుసారమే వారిని ఆ రంగంలో నిష్ణాతులను చేసే విధానాలను ఎన్నో దేశాలు ఆచరణలో అమలుచేస్తున్నాయి. ఈ పద్దతిలో విద్యార్థి తన చదువుతో పాటుగా తనకు ఇష్టమైన ఒక కళను (ఎన్నెన్నో కళలలోంచి) కూడ అమితానందంతో సశాస్త్రీయంగా నేర్చుకొని తన చిన్ననాటి సృజనాత్మకతకు మరిన్ని మెరుగులు దిద్ది తనకంటూ ఒక ప్రత్యేకతను పొందగలుతున్నాడు. ఈ విధానం మనదేశంలో కూడ కొన్ని పాఠశాలలకు మాత్రమే పరిమితమయ్యింది. అన్నింటిలో ఇది తప్పనిసరి చేసినప్పుడు పిల్లల సృజనాత్మకతకు ‘ సాన ‘ పట్టే అవకాశం వుంది.
సుదాలు గారు, చాలా చక్కగా చెప్పారు. మీరు చెప్పిన విధానం మన దేశంలో కొన్ని పాఠశాలలకే పరిమితమయిందన్నది నిజం. అది కూడా హైద్రాబాద్ లాంటి నగరాల్లో ఉన్న ధనికుల పాఠశాలలకే పరిమితం అయింది. మన క్రికెటర్లలో గానీ, ఇతర ఆటల్లో రాణించినవాళ్లలో గానీ పల్లెలనుండీ, పేద కుటుంబాలనుండీ వచ్చినవారెవరూ లేకపోవడం అందుకు ఒక నిదర్శనం. ప్రభుత్వాలు దృష్టి పెట్టినయితే నూటఇరవై కోట్లమందిలో ప్రపంచ స్ధాయి క్రీడాకారులు, కళాకారులు బోల్డంతమంది తయారవుతారు.