పిచ్చుకలు మన చిన్ననాటి నేస్తాలు. పదిహేను, ఇరవై యేళ్ళ క్రితం వరకూ పిచ్చుకలు లేని చోటంటూ కనపడేది కాదు. ముఖ్యంగా భారత దేశ గ్రామాల్లో అవి దాదాపు పెంపుడు పక్షులుగా కనపడుతుండేవి. పొద్దున లేచింది మొదలు దైనందిన జీవితంలో మనుషులు చేరే ప్రతి చోటా పిచ్చుకలూ చేరి తమ కార్యకలాపాల్లో మునిగితేలుతుండేవి. ఇంటి చూరులో, కిటికీ తలుపులపైనా, స్కూలు గది గోడలపైనా, చెట్ల కొమ్మల చివర్లలో, బట్టలు ఆరేసుకునే దండేలపైనా, పొట్ట పోసుకున్న వరి చేలల్లో, బిళ్లంగోడు ఆడే తుమ్మ తోపుల్లో, ఎండాకాలపు సీతమ్మ చెట్లపైనా, గుళ్ళు గోపురాలపైనా ఎక్కడికెళ్ళినా పలకరిస్తుండేవి.
పరిశీలనా పరులకి పిచ్చుకల జీవనం ఆసక్తిగా ఉండేది. స్నేహం చేయడం, జంట కట్టడం, సందర్భానికి తగినట్లు ‘కిచ కిచ’ చప్పుళ్లు మార్చడం, ఆడ మగ పిచుకలు ఊసులాడుకోవడం, చిన్న చిన్న పురుగుల్ని ముక్కున పట్టి పిల్ల పిచ్చుకల నోట్లోకి నెట్టడం, నిపుణులైన ఆర్కిటెక్చర్ ఇంజనీర్లలా ఒక్కో పుల్లా, పీచూ తెచ్చి గూళ్లు అల్లడం… ఎన్నని? పరిసరాల్ని మర్చిపోయేలా చేసేవి. ఒక్కో మనిషీ పెరిగి పెద్దయ్యే క్రమంలో వివిధ సందర్భాల్లో పిచ్చుకలతో అనుభవం కొండ గుర్తులుగా ఉండేవి.
ఇప్పుడు పిచ్చుకలు దాదాపు కనుమరుగైనాయి. ప్రకృతినంతటినీ అదుపులోకి తెచ్చుకున్న మనిషి అవసరాలకు మించి ప్రకృతి వనరుల్ని ఖర్చు చేసేస్తున్నాడు. ఇతర పశు, పక్షు జాతులకి ప్రకృతిని దూరం చేస్తున్నాడు. భూ వాతావరణాన్ని తోటి జీవజాలానికి పనికి రాకుండా చేస్తున్నాడు. పరిమితికి మించి వనరుల్ని తవ్వి తీస్తూ వాతావరణ వ్యవస్ధని అస్తవ్యస్తం చేయడంతో గ్లోబల్ వార్మింగ్ పెరిగిపోయి పిచ్చుకలకి మరణ శాసనంగా మారింది. మారుమూల ప్రాంతాల్లోకి కూడా చొచ్చుకుపోయిన సెల్ టవర్లు పిచ్చుకలు అంతరించిపోవడానికి కారనమని పరిశోధనలు చెబుతున్నాయి. టవర్ల నుండి వచ్చే విద్యుదయస్కాంత తరంగాల ధాటికి సున్నిత ప్రాణులైన పిచ్చుకలు చనిపోతున్నాయని ఆ పరిశోధనలు చెబుతున్నాయి.
ప్రపంచం మొత్తం మీద పిచ్చుకల సంఖ్య ఎనభై శాతం పడిపోయిందని ఆర్నితాలిజిస్టులు సర్వే చేసి లెక్కతేల్చారు. పిచ్చుకల దైన్యానికి ఇక్కడ ‘మనిషి’ కారణంగా జనరలైజ్ చెయ్యడం కూడా సరికాదేమో. ఎందుకంటే మనుషుల్లో తొంభై శాతం మంది పశు పక్ష్యాదులకు స్నేహ శీలురే. భూములూ, కంపెనీలు అదుపులో పెట్టుకున్న కొద్ది మందే భూ వినాశనానికీ, వాతావరణ విధ్వంసానికీ కారణం అవుతున్నారు. వీరి లాభాపేక్ష మెజారిటీ ప్రజలతో పాటు ఇతర జీవ జాలానికి కూడా ప్రాణాంతకంగా మారింది.
ఈ నేపధ్యంలోనే 2012, మార్చి 20 తేదీని ‘ప్రపంచ పిచ్చుకల రోజు’ గా ప్రకటించారు. ఎన్ని ‘రోజులు’ ప్రకటించినా పర్యావరణాన్ని విధ్వంసం చేసే ఆర్ధిక దోపిడీ విధానాలు అంతం అయ్యేవరకూ ఈ పరిస్ధితి కొనసాగుతూనె ఉంటుంది. మనిషి సుఖ జీవనానికి పశు, పక్ష్యాదులు కూడా దోహదం చేస్తున్నాయన్న స్పృహ లాభాపేక్ష కు ఉండదు. ఏం చేసయినా, శ్రామికుల సుఖ సంతోషాల్నీ ప్రాణాల్నీ కబళించయినా, పశు పక్ష్యాదుల వాటాని లాక్కునయినా లాభ శాతం పెంచుకోవాలని చూసే పెట్టుబడిదారీ వ్యవస్ధకు తనకు తాను మరణ శాసనం లిఖించుకుంటోదన్న సృహ కూడా ఉండదు. మేల్కోవలసిందే శ్రామికులే.
–
ఫొటోలు: దీపా లక్ష్మి, ది హిందూ