మమత హిపోక్రసీ: పాలు, విద్యుత్ రేట్లు పెంచి, రైలు చార్జీలపై నాటకం


Dinesh-trivedi-mamataఅధికారంలోకి వచ్చిన సంవత్సరం లోపే పశ్చిమ బెంగాల్ ముఖ్య మంత్రి మమత బెనర్జీ మూడు సార్లు విద్యుత్ ఛార్జీలు పెంచింది. ట్రామ్ వేస్ కార్పొరేషన్ కి ఇస్తున్న సబ్సిడీ రద్దు చేయడమే కాక త్వరలో ఛార్జీలు కూడా పెంచబోతోంది. ప్రతి వంట గదిలో అత్యవసరంగా ఉపయోగించే పాల ఛార్జీలు పెంచింది. ఇన్ని చేసిన మమత రైలు ఛార్జీలు పెంచాడంటూ తన పార్టీ నాయకుడిని కేంద్ర మంత్రి పదవి నుండే తొలగించింది. “రైల్వే ఏ.సి ఛార్జీలు పెంచినా ఫర్వాలేదు గానీ స్లీపర్ ఛార్జీలు పెంచడం అంగీకారించేది లేదు” అంటూ ఇంకా ఆమె తన నాటకాన్ని కొనసాగిస్తోంది. తనను పదవి నుండి తొలగించడం వెనక పని చేసింది రైలు ఛార్జీలు కాదనీ, రైల్వే బడ్జేట్ ప్రవేశ పెట్టడానికి చాలా ముందే తన తొలగింపుకు నిర్ణయం జరిగిపోయిందనీ మాజీ రైల్వే మంత్రి దినేష్ త్రివేదీ వెల్లడించడం దీనంతటికీ కొసమెరుపు.

మమతా బెనర్జీ విద్యుత్ ఛార్జీలు మూడు సార్లు పెంచడం వల్ల అవి ఏకంగా 29.5 శాతం పెరిగాయని ‘బిజినెస్ స్టాండర్డ్’ పత్రిక తెలిపింది. విద్యుత్ మంత్రిత్వ శాఖ అధికారి చెప్పిన వివరాల ప్రకారం తృణమూల్ కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక విద్యుత్ ఛార్జీలు మొదట యూనిట్ కి రు. 4.27 నుండి రు. 4.71 కి పెంచింది. ఈ పెరుగుదల వాస్తవానికి లెఫ్ట్ ఫ్రంట్ ప్రభుత్వం వెళ్తూ, వెళ్తూ చేసిన నిర్ణయం. 2012 లో ఈ పెంపుదలకి మమత బెనర్జీ ఆమోద ముద్ర వేసింది. సామాన్య మానవుడి ప్రయోజనాలే తనకు కావాలని మమత చెప్పే కబుర్లు నిజమే అయితే లెఫ్ట్ ఫ్రంట్ నిర్ణయాన్ని రద్దు చేసి ఉండవచ్చు. దానికి బదులు ఆమె చార్జీలు పెంచడానికే మొగ్గు చూపింది. అంతటితో ఆగలేదామే. రెండో సారి యూనిట్ విద్యుత్ చార్జీ రు. 4.71 నుండి రు. 5.07 కి పెంచింది. మళ్ళీ నెల తిరిగేలోపు మూడోసారి యూనిట్ ఖరీదు రు. 5.07 నుండి రు. 5.53 కి పెంచింది. అంటే దాదాపు ముప్ఫై శాతం మేరకు ఆమె విద్యుత్ చార్జీలను పెంచింది.

మమత బెనర్జీ పాల ధరల్ని కూడా పెంచింది. పాలు లేకుండా ఈ కుటుంబానికీ ఉదయం గడవదు. ఒక్క ఉదయమే కాదు. రోజంతా ఇళ్ళల్లో, ఆఫీసుల్లో, అనేకానేక పని స్ధలాల్లో పాలతో అవసరం ఉంది. పిల్లలకు పాలు బలవర్ధకమైన పోషకాహారమనీ, ప్రతి రోజూ ఇవ్వాలనీ ప్రభుత్వాలు ప్రచారం చేస్తాయి. అటువంటి పాలను కూడా మమత వదల్లేదు. లీటర్ పాలు రు. 30 రూపాయలు ఉండగా దాన్ని రు. 36 కి పెంచింది. మరో రు. 4 పెంచడానికి మమతా ప్రభుత్వం సిద్ధం అవుతున్నట్లు తెలుస్తోంది. “ఈ ఆర్ధిక సంవత్సరం ముగిసేనాటికి పాల ధర లీటర్ కి రు. 40 కి చేరుతుందని అంచనా వేస్తున్నాము” అని బెంగాల్ లో అతి పెద్ద పాల కంపెనీ ‘మెట్రో డైరీ’ ని నియంత్రించే ‘కేవెంటర్ ఆగ్రో’ ఛైర్మన్ ఏం.కె.జైన్ చెప్పాడు.

ట్రామ్ ఛార్జీలు పెంచడానికి బెంగాల్ రాష్ట్ర ప్రభుత్వం కసరత్తు చేస్తోందని బేజినెస్ స్టాండర్డ్’ తెలిపింది. అధికారంలోకి వచ్చాక మమతా ప్రబుత్వం ‘కలకత్తా ట్రామ్ కంపెనీ’ (సి.టి.సి) ఇస్తున్న సబ్సిడీ రు. 600 కోట్లను రద్దు చేసేసింది. ఫలితంగా సి.టి.సి కి తన ఉద్యోగాలకు వేతనాలు సరిగ్గా చెల్లించలేని పరిస్ధితి తలెత్తింది. ప్రభుత్వం రద్దు చేసిన సబ్సిడీ పూడ్చుకోడానికి సి.టి.సి చార్జీల పెంపును ప్రతిపాధించగా అది ఆమోదానికి సిద్ధంగా ఉంది. ఇప్పుడు ట్రామ్ ఛార్జీలు నాలుగు కి.మీ వరకూ కనీస ఛార్జీ ఫాస్ట్,  రు. 4 మరియు రు. 3.5 ఉండగా వీటిని రు. 6 వరకూ పెంచాలని సి.టి.సి రవాణా మంత్రికి ప్రతిపాదించింది. ఈ ప్రతిపాదనలు త్వరలో ఆమోదం పొందుతాయని అధికారుల ద్వారా తెలుస్తోంది. ట్రామ్ లను ఉపయోగించేది ‘ఆం ఆద్మీ’ లే గనక ట్రామ్ చార్జీల పెంపు భారం వారే భరించాలి. సబ్సిడీలు రద్దు చేసి సి.టి.సి ఛార్జీలు పెంచుకోక తప్పని పరిస్ధితిని మమత కల్పించింది.

రైల్వే ఛార్జీలు పెంచుతూ దినేష్ త్రివేది బడ్జెట్ ప్రకటించాక మమత బెనర్జీ వెంటనే స్పంధించింది. తనకు ఆం ఆద్మీ ప్రయోజనలే ముఖ్యం అని ప్రకటించింది. రైలు చార్జీల పెంపు తనకు సమ్మతం కాదని ప్రకటించింది. సామాన్య ప్రయాణీకుడిని కడగండ్ల పాలు చేస్తావా అని ఆగ్రహించింది. మొత్తం పెంపుదలని వెనక్కి తీసుకుంటే తప్ప శాంతించేది లేదని కేంద్ర ప్రభుత్వానికి హుకుం జారీ చేసింది. ఛార్జీలు పెంచినందుకు శిక్షగా త్రివేదిని మంత్రి పదవి నుండి తీసేయాలని మన్మోహన్ కి లేఖ రాసింది. రాజీనామా చేయకుండానే కొత్త మంత్రి పేరు కూడా ప్రకటించింది. మొదట పెంచిన ఛార్జీలు మొత్తం ఉపసంహరించాల్ని డిమాండ్ చేసినా ఇప్పుడేమో స్లీపర్ ఛార్జీలు వెనక్కి తీసుకుంటే చాలంటోంది. మరి కొద్ది రోజుల్లో అది కూడా ఉంటుందో లేదో చెప్పలేము.

చార్జీల పెంపుపై మమత చేసిన గొడవ నాటకం అయితే అది దినేష్ త్రివేదిని ఎందుకు బలి తీసుకుంది? దినేష్ త్రివేదీ ఆ ప్రశ్నకు సమాధానం ఇచ్చాడు. ‘టైమ్స్ నౌ’ టి.వి చానెల్ తో మాట్లాఆడుతూ ఆయన రైలు ఛార్జీలు పెంచడానికీ, తన పదవి ఊడడానికీ సంబంధం లేదని తేల్చేశాడు. తనను పదవినుండి తప్పించడం వెనక రాజకీయాలే కారణం తప్ప ఛార్జీలు కాదని చెప్పాడు. నిజానికి తనను పదవి నుండి తప్పించాలని చాలా రోజుల క్రితమే నిర్ణయించుకున్నారనీ తాను ఛార్జీలు పెంచినా, పెంచకపోయినా పదవి నుండి ఖాయంగా తప్పించేవారనీ చెప్పాడు. తాను రాజకీయాలు చేసి ప్రభుత్వాన్ని ఇబ్బంది పెట్టడం ఇష్టం లేక తానే పదవి నుండి తప్పుకున్నాననీ తెలిపాడు.

రైల్వే ఛార్జీలు పెంచనున్న విషయాన్ని మమతా బెనర్జీకి కేంద్ర ప్రభుత్వం ముందే చెప్పిందని ‘ఫస్ట్ పోస్ట్’ పత్రిక కొద్ది రోజుల క్రితం వెల్లడించింది. మమత బెనర్జీ తోనే కాక ప్రతి పక్ష పార్టీలన్నింటికీ రైలు చార్జీల పెంపు సంగతి తెలియజేసి వారి అనుమతి కూడా తీసుకున్నారనీ ఆ పత్రిక తెలిపింది. చార్జీల పెంపుదల అనివార్యమని పార్టీలన్నీ అంగీకరించి తీరా బడ్జెట్ ప్రవేశ పెట్టాక ఆవేశం ప్రదర్శించాయని తెలిపింది. మమత ప్రవర్తన గానీ, ప్రతి పక్షాల ప్రవర్తన గానీ నిజానికి పెద్దగా ఆశ్చర్యం కలిగించేవీ కావు. ఇప్పటి ప్రతి పక్షాలన్నీ ఎప్పుడో ఒకప్పుడు ప్రభుత్వాన్ని నడిపినవే. తాము ప్రభుత్వాల్లో ఉన్నపుడు ప్రజల పైన భారం వేయకుండా ఎన్నడూ లేరు. ప్రజలపై భారం పడకుండా ఉండడానికీ, ఇతర మార్గాల్లో ఆదాయం పెంచుకోవడానికీ లేదా నేరుగా ప్రజల ఆదాయాలనే పెంచడానికో చర్యలు తీసుకున్న దాఖలాలు లేవు. ప్రతి పక్షంలో ఉన్నపుడు ప్రజా పక్షం వహిస్తున్నామన్న అభిప్రాయం కలిగించడానికి ఈ ధనిక రాజకీయ పార్టీలకి అవకాఆశాలు వస్తాయి. ఆ అవకాశాలను వినియోగించడానికే వారి కబుర్లు తప్ప నిజం కాదు.

ఐదేళ్ల కొకసారి వచ్చే ఎన్నికలు పాలకవర్గ పార్టీల అసలు స్వభావాన్ని మరుగు పరుగుస్తున్నాయి. ప్రజలు అధికారంలో ఉనవారిని మార్చే పనిలో ఉండడం వల్ల అధికారంలో లేనివారు కొత్తగా అధికారం చేజిక్కించుకోగలుగుతున్నారు తప్ప ప్రజలు ఎన్నుకోవడం వల్ల ఏ పార్టీ ఎన్నికల్లో నెగ్గడం లేదు. నెగిటివ్ ప్రజల్ని వేధించుకుతిన్న పార్టీలపై ఏర్పడిన వ్యతిరేకత నెగిటివ్ ఓటుగా పని చేస్తోంది. దాని వల్ల మాత్రమే పార్టీలు మారుతున్నాయి. ఒకవేళ వరుసగా రెండు సార్లు అధికారం చేజిక్కుంచున్నా, ప్రతి పక్షాలు నెగిటివ్ ఓట్లను సొమ్ము చేసుకోలేని బలహీనంగా ఉండడమే దానికి కారణంగా ఉంటోంది.

3 thoughts on “మమత హిపోక్రసీ: పాలు, విద్యుత్ రేట్లు పెంచి, రైలు చార్జీలపై నాటకం

  1. ఎవ్వడూ మారడు తప్పు అని ఎవరైనా అంటే నువ్వు తప్పు చెయ్యలేదా అనే స్థాయికి దిగాజారాము.

  2. ప్రజలను బుద్దిపుర్వకంగా నమ్మించారు ప్రజాస్వామ్యం అంటె వర్గాలుకు అతీతంగా ప్రబుత్వం వుంటుందని .ఎంతచెపటికీ ఆ మురికికాలువలొనే మంచిని ఏరుకొవాలని చూస్తున్నారు. ప్రజలు ఇంతకన్నా చైతన్యవంతమైతే తప్ప .ఇవే ప్రబుత్వాలు వుంటాయి.

  3. “ఐదేళ్ల కొకసారి వచ్చే ఎన్నికలు పాలకవర్గ పార్టీల అసలు స్వభావాన్ని మరుగు పరుగుస్తున్నాయి. ప్రజలు అధికారంలో ఉనవారిని మార్చే పనిలో ఉండడం వల్ల అధికారంలో లేనివారు కొత్తగా అధికారం చేజిక్కించుకోగలుగుతున్నారు తప్ప ప్రజలు ఎన్నుకోవడం వల్ల ఏ పార్టీ ఎన్నికల్లో నెగ్గడం లేదు. నెగిటివ్ ప్రజల్ని వేధించుకుతిన్న పార్టీలపై ఏర్పడిన వ్యతిరేకత నెగిటివ్ ఓటుగా పని చేస్తోంది. దాని వల్ల మాత్రమే పార్టీలు మారుతున్నాయి. ఒకవేళ వరుసగా రెండు సార్లు అధికారం చేజిక్కుంచున్నా, ప్రతి పక్షాలు నెగిటివ్ ఓట్లను సొమ్ము చేసుకోలేని బలహీనంగా ఉండడమే దానికి కారణంగా ఉంటోంది”….edi 100% correct

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

గూగుల్ చిత్రం

You are commenting using your Google account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

Connecting to %s