తమ పార్టీకి చెందిన రైల్వే మంత్రి దినేష్ త్రివేది తనకు చెప్పకుండా రైలు ప్రయాణ ఛార్జీలు పెంచాడని ఆరోపిస్తూ, అతని సేత రాజీనామా కూడా చేయించిన మమతకి చార్జీల పెంపుదల సంగతి ముందే తలుసని ఎన్.డి.టి.వి వెల్లడించింది. రైల్వే బడ్జెట్ ప్రతిపాదిస్తున్న సమయంలోనే మమతతో రైల్వే ఛార్జీల పెంపు విషయాన్ని ప్రభుత్వ పెద్దలు చర్చించారని అభిజ్ఞ వర్గాలను ఉటంకిస్తూ ఎన్.డి.టి.వి తెలిపింది. ఒక్క మమతనే కాకుండా ప్రధాన ప్రతిపక్ష పార్టీలను కూడా ప్రభుత్వం సంప్రదించిందనీ, రైలు ఛార్జీలు పెంచి తొమ్మిది సంవత్సరాలు గడిచినందున ఈసారి పెంచడాన్ని అన్నీ పార్టీలు ఆమోదం తెలిపాయనీ ఎన్.డి.టి.వి తెలిపింది.
తృణమూల్ కాంగ్రెస్ అధినేత మమతా బెనర్జీ, ఆమెకు ప్రత్యేక సెక్రటరీగా పని చేస్తున్న గౌతమ్ సన్యాల్ లకు చార్జీల పెంపుదల విషయమై ముందే సమాచారం ఉందని ఎన్.డి.టి.వి తెలిపింది. ఛార్జీలు పెంచడానికి నిర్ణయం తీసుకోక ముందు ప్రభుత్వ పెద్దలు ప్రతిపక్ష పార్టీల అభిప్రాయాలూ తీసుకున్నారని ఎన్.డి.టి.వి ద్వారా తెలుస్తోంది. పార్టీలతో సంబంధం లేకుండా దాదాపు అన్నీ పార్టీలవారూ చార్జీల పెంపుదలకి మద్దతు నిచ్చారని తెలుస్తోంది. ఈసారి చార్జీల పెంపు అనివార్యమని వారు అభిప్రాయపడ్డారని ఎన్.డి.టి.వి తెలిపింది.
తాము ‘ఆం ఆద్మీ’ కి మద్దతుదారులమనీ, ఛార్జీలు పెంచితే సామాన్య ప్రయాణీకులపై భారం గనక చార్జీల పెంపును వెనక్కి తీసుకోవాలనీ మమతా డిమాండ్ చేస్తూ పత్రికలకు ఎక్కిన సంగతి తెలిసిందే. రైలు మంత్రిని తొలగించి, తాను ప్రతిపాడించిన ముకుల్ రాయ్ ని కొత్త మంత్రిగా నియమించాలని కూడా మమత డిమాండ్ చేస్తోంది. తాను రాజీనామా చేసేది లేదని ఒకసారి, బడ్జేట్ ఆమోదం పోందాకా రాజీనామా చేస్తానని ఒకసారీ, మమత రాతపూర్వకంగా ఆదేశిస్తే తప్ప రాజీనామా చేయనని మరొకసారీ త్రివేడీ కూడా మమతా నాటకాన్ని పండించాడు. ఎట్టకేలకు ఆయన ఆదివారం రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించాడు.
ఈ నాటకానికి మమత ఎందుకు తలపెట్టింది?
ది హిందూ, ఎన్.డి.టి.వి ప్రచురించిన వార్తలను బట్టి కొన్ని కారణాలు కనిపిస్తున్నాయి. త్వరలో జరగనున్న రాజ్య సభ ఎన్నికలు ఒక కారణం. పశ్చిమ బెంగాల్ లో తృణమూల్ కి ఉన్న బలం ద్వారా ముగ్గురిని రాజ్య సభకు ఖాయంగా పంపవచ్చు. నాలుగో వ్యక్తిని పంపడానికి మమతాకి 17 ఓట్లు తక్కువయ్యాయి. ఈ ఓట్లను కాంగ్రెస్ నుండి పొందడానికి వీలుగా రైల్వే బడ్జెట్ తో తన నాటకాన్ని ప్రారంభించిందని ‘ది హిందూ’ పరోక్షంగా సూచించింది. అయితే యు.పి ఎన్నికల్లో గెలిచిన సమాజ్ వాదీ పార్టీ కి కూడా ఇరవై రెండు మంది ఏం.పి లు ఉన్నారు. మమత కి ఉన్న 19 మంది మద్దతు లేకపోయినా ఎస్.పి ఏం.పిలతో నెగ్గుకురాగల అవకాశం కాంగ్రెస్ కి ఉందన్న సందేశం మమతకి వెళ్లడంతో ఆమె వెనకడుగు వేసినట్లు ప్రచారం జరుగుతోంది. రైల్వే ఛార్జీల ఉపసంహరణకు మొదట గడువు విధించిన మమత ఇప్పుడు దాని గురించి మాట్లాడడం లేదు. తన స్ధానంలో ఎస్.పి ని యు.పి.ఏ కూటమిలోకి తీసుకుంటే మమత భవిష్యత్తులో కేంద్రంతో పని సాధించుకోలే ని పరిస్ధితి ఏర్పడుతుంది. దానితో ఆమె వెనక్కి తగ్గిందని చెబుతున్నారు.
అయితే మమత పరువు నిలవడానికి కొద్ది మేరకు ఛార్జీలు తగ్గించే అవకాశం లేకపోలేదని విశ్లేషకులు చెబుతున్నారు. పెంచిన ఛార్జీలు పూర్తిగా తగ్గిస్తే తప్ప మమత చెప్పిన ‘ఆం ఆద్మీ’ లాజిక్ విశ్వసనీయత నిలవదు. ఇలాంటి విశ్వసనీయత పరీక్షలను మమత గతంలో ఎన్నో తప్పింది. ఈసారీ తప్పడానికీ ఆమెకి అభ్యంతరం ఏమీ ఉండకపోవచ్చు కూడా.