ఇరాన్ ఆయిల్ కొనవద్దు, ఇండియాకి అమెరికా బెదిరింపు


Iran sanctionsతన మాట వినని దేశాలను బెదిరించి దారికి తెచ్చుకునే అమెరికా ఇండియాపై కూడా బెదిరింపులు మొదలు పెట్టింది. ఇరాన్ పై అమెరికా, యూరప్ లు ఆంక్షలు విధించినప్పటికీ ఇరాన్ ఆయిల్ కొనడం ఆపేది లేదని భారత దేశం చెప్పటంపై అమెరికా కన్నెర్ర చేస్తోంది. ఇరాన్ నుండి ఆయిల్ దిగుమతులను తగ్గించుకోని పక్షంలో అమెరికా బ్యాంకులను ఇండియాకి అందకుండా చేయడానికి తాము వెనకాడేది లేదని అమెరికా అధికారిని ఉటంకిస్తూ బ్లూమ్ బర్గ్ పత్రిక తెలిపింది. అమెరికా తాను విధించిన ఆంక్షలనుండి ఇండియాను మినహాయిస్తుందని నమ్మకం పెట్టుకోవద్దని ఆంక్షలపై అమెరికాకి సలహా ఇచ్చే అధికారి ‘మార్క్ దుబోవిట్జ్’ ఇండియాని హెచ్చరించి అమెరికా ఉద్దేశ్యాన్ని గట్టిగానే తెలిపాడు.

అమెరికా మిత్రులు జపాన్, దక్షిణ కొరియా దేశాలే ఇరాన్ తో ఆయిల్ వ్యాపారాన్ని తగ్గించుకోగాలేనిది భారత దేశం తన ఆయిల్ దిగుమతుల్ని ఎందుకు తగ్గించ్కోదని మార్క్ ఘాటుగా ప్రశ్నించాడని బ్లూమ్ బర్గ్ తెలిపింది. అయితే, అమెరికా ఆంక్షల విషయంలో భారత ప్రభుత్వం పైకి ఏమి చెబుతున్నప్పటికీ తన ప్రభుత్వరంగ కంపెనీలను ఇరాన్ నుండి ఆయిల్ దిగుమతులను తగ్గించుకోవలసిందిగా ఇప్పటికే ఆదేశించిందని భారత విశ్లేషకులు బ్లూమ్ బర్గ్ కి తెలిపారు. భారత అధికారులు కూడా తమ పేరు చెప్పకుండానే ఈ విషయాన్ని ధృవపరిచారని ఆ పత్రిక తెలిపింది.

ఇరాన్ ‘అణ్వాయుధాలను నిర్మించడానికి ప్రయత్నిస్తున్నదని ఆరోపిస్తూ’ అమెరికా, యూరప్ ల ఒత్తిడి మేరకు భద్రతా సమితి నాలుగు విడతలుగా ఇరాన్ పైన అంతర్జాతీయ వాణిజ్య ఆంక్షలు విధించింది. ఇవి కాక అమెరికా, యూరప్ లు తమవైన ప్రత్యేక ఆంక్షలు ఇరాన్ పై అమలు చేస్తున్నాయి. సమితి ఆంక్షలతో పాటు తాము విధించిన ఆంక్షలను కూడా అమలు చేయాల్సిందేనని అవి ప్రపంచ దేశాలను బెదిరిస్తున్నాయి. వారి బెదిరింపులకు, ముఖ్యంగా అమెరికా బెదిరింపులకు అనేక దేశాలు తలొగ్గి ఇరాన్ నుండి ఆయిల్ దిగుమతులను తగ్గించుకుంటున్నాయి. డిసెంబరు 31 న ఇరాన్ పై తాజాగా కొత్త ఆంక్షలు విధిస్తూ కొత్త చట్టంపై ఒబామా సంతకం చేశాడు. ఈ ఆంక్షలు అమలు చేసినట్లయితే ఇండియా తన ఆయిల్ అవసరాలను 15 శాతం తగ్గించుకోవలసి వస్తుంది. ఇప్పటికే ఇరాన్ పై ఆంక్షల వల్ల, దురాక్రమణ యుద్ధాల వల్లా, ప్రపంచ స్ధాయిలో ఆయిల్ ధరలు కొండేక్కాయి. అమెరికా ఆంక్షలు కూడా అమలు చేసినట్లయితే భారత దేశంలో ఆయిల్ ధరలు మరింతగా మండిపోవడం ఖాయం.

“ఇండియా, ఇరాన్ ల మధ్య వాణిజ్యం ఇప్పటికే చాలా ఎక్కువగా ఉంది. ముఖ్యంగా ఆయిల్ దిగుమతులు బాగా ఎక్కువగా ఉన్నాయి. ఇదే పద్ధతి కొనసాగితే ఇండియా, చేసే ఆయిల్ చెల్లింపులపై అమెరికా ట్రెజరీ ఆంక్షలు విధించడాన్ని ప్రధాన చర్యగా చేపడుతుంది” అని అమెరికా ట్రెజరీ అధికారి అవి జోరీశ్చ్ చెప్పాడని బ్లూమ్ బర్గ్ తెలిపింది.

ఇరాన్ నుండి ఆయిల్ దిగుమతులు తగ్గించుకోకపోతే ఇరాన్ కి ఆయిల్ చెల్లింపులు చేసే భారత బ్యాంకులకి అంతర్జాతీయ బ్యాంకులు అందకుండా చేస్తామని అమెరికా ట్రెజరీ అధికారి తెలిపాడు. ఇండియా తన ఆయిల్ రిఫైనరీ కంపెనీలకు ఇరాన్ దిగుమతులు ఆపాలని బహిరంగంగా ఇంకా కోరలేదు. అమెరికా, యూరప్ ఆంక్షలు పక్కనబెట్టి ఇరాన్ దిగుమతులు కొనసాగిస్తామని గత నెల ఆయిల్ మంత్రి జైపాల్ రెడ్డి పత్రికలకు చెప్పాడు. వాస్తవం ఇది కాదని భారత పేట్రోలియం మంత్రిత్వ శాఖ అధికారులను ఉటంకిస్తూ బ్లూమ్ బర్గ్ తెలిపింది. ఇరాన్ ఆయిల్ దిగుమతులపై ఆధారపడం మానుకుని ప్రత్యామ్నాయ వనరులను వేతుక్కోవాలని రిఫైనరీ కంపెనీలకు ప్రభుత్వం చెప్పిందని, అమెరికా నుండి పెరుగుతున్న ఒత్తిడే దాని కారణమనీ భారత అధికారులు తెలిపారు. కనీసం ముగ్గురు భారత అధికారులు ఈ విషయం ధ్రువపరిచారని బ్లూమ్ బర్గ్ తెలిపింది.

ఇరాన్ ఆయిల్ కాంట్రాక్టులు ఏప్రిల్ నుండి మార్చి వరకు నడుస్తాయనీ, ఈ మార్చి ముగిశాక భారత దేశం, ఇరాన్ నుండి ఆయిల్ దిగుమతుల్ని గణనీయంగా తగ్గించుకుంటుందని తెలుస్తోంది. గత సంవత్సరం ఇండియా, ఇరాన్ నుండి సగటున రోజుకు 328,000 బారెళ్ళ ఆయిల్ దిగుమతి చేసుకుందని తెలుస్తోంది. చైనా, జపాన్ ల తర్వాత ఇరాన్ వద్ద ఆయిల్ ఎక్కువ కొనే దేశాల్లో ఇండియా మూడోది. ప్రపంచంలో ఆయిల్ ఉత్పత్తి దేశాల్లో ఇరాన్, సౌదీ అరేబియా తర్వాత రెండవది. ఇరాన్ నుండి దిగుమతులు తగ్గించుకుంటే, లోటు పూడ్చుకోవడానికి అమెరికా రికమండేషన్ తో ఇండియా సౌదీ అరేబియా, ఇరాక్ ల ముందు నిలబడవలసి ఉంటుంది. దానివల్ల ఇరాన్ నుండి తక్కువ ధరకు ఆయిల్ పొందే అవకాశాన్ని ఇండియా కోల్పోతుంది. అమెరికా ఆంక్షలు దాని మిత్ర (సేవక) దేశాలైన సౌదీ అరేబియా, ఇరాక్ లకు ఆ విధంగా లాభిస్తాయన్నమాట. సౌదీ అరేబియా, ఇరాక్ లలోని అమెరికా కంపెనీల లాభాల పెంపుదల కోసమే అమెరికా యుద్ధాలు, బెదిరింపులు అని గుర్తు చేసుకుంటే ఇరాన్ పై ఆంక్షలు ఇరాన్ అణు బాంబుల వల్ల కాదనీ, తన కంపెనీల ప్రయోజనాల కోసమేననీ తేలిగ్గానే అర్ధం చేసుకోవచ్చు.

అమెరికా కంపెనీల ప్రయోజనాల కోసం ఇరాన్ పైన ఆ దేశం విధించిన ఆంక్షలు ఇరాన్ కి ఎంత నష్టమో తెలియదు గానీ, భారత దేశంలో ఆయిల్ రేట్లు పెరగడానికీ, తద్వారా అన్నీ సరుకుల రేట్లు పెరిగి ద్రవ్యోల్బణం మరింత పెచ్చరిల్లడానికి మాత్రమే దారి తీస్తుంది. భారత ప్రజలు కూడా ఇరాన్ పై అమెరికా విధించిన ఆంక్షల వల్ల బాధలు పడక తప్పదు. ఒక్క ఇండియా ప్రజలే కాదు. అమెరికా బెదిరింపులకు లొంగి ఇరాన్ పై ఆంక్షలు అమలు చేసే ఈ దేశ ప్రజలైనా (జపాన్, దక్షిణ కొరియా, పాకిస్తాన్, యూరప్… మొ.వి.) అమెరికా ఆంక్షలవల్ల బాధలు పడుతున్నారు. ఇండియా తన ఆయిల్ అవసరాల కోసం సౌదీ అరేబియా, ఇరాక్ లకు చేలించే అధిక ధరల వల్ల ఆ దేశాల ప్రజలేమైనా బావుకుంటారా అంటే అదీ లేదు. ఇరాక్ పాలకుడిగా సద్దాం ను గద్దె దించి చంపేశాక అక్కడ అమెరికా కంపెనీలే ఆయిల్ తోడి అమ్ముకుంటున్నాయి. అంటే, ఇరాక్ కి మనం చెల్లించే అధిక ధరల వల్ల లాభాలు పొందేది అమెరికా కంపెనీలేనన్న మాట!

సౌదీ అరేబియా కూడా అంతే. అక్కడి మత ఛాందస ప్రభుత్వం అనేక దశాబ్దాల నుండి అమెరికాకి మిత్రా దేశంగా ఉంది. అమెరికాతో మిత్రత్వం అంటే సమాన స్ధాయి ఉండదు. అమెరికా ప్రయోజనాలకి లొంగి ఉంటేనే అమెరికాకి మిత్ర దేశంగా అర్హత వస్తుంది. ఇరాన్ పై యుద్ధ ప్రయత్నాలు చేయడం వెనక సౌదీ అరేబియా పాలకుల ప్రయోజనాలు కూడా ఉంటాయి. యుద్ధ ప్రయత్నాల వల్ల అనివార్యంగా ఆయిల్ రేట్లు పెరుగుతాయి. తద్వారా సౌదీ అరేబియా లో ఆయిల్ కంపెనీలకి అధిక లాభాలు చేజిక్కి ఆ దేశ పాలకుల కమీషన్లు కూడా పెరుగుతాయి. తమ దళారీ కమిషన్ పెంచుకోవడం కోసం సౌదీ పాలకులు, తమ పొరుగు దేశం ఇరాన్ పై యుద్ధ ప్రయత్నాలను ఎగదోయడానికి కూడా వెనకాడరు. వారి సార్వ భౌమత్వం అలా తగలడింది మరి. మన పాలకుల్లాగే వారూనూ. నష్టపోయేది సౌదీ, ఇండియా ల ప్రజలు మాత్రమే.

ఇరాన్ ముస్లిం దేశం కనుక, ఆ దేశంపై ఆంక్షలు విధించినందుకు సంతోషపడే హిందూ అల్ప సంతుష్టులు ఈ వాస్తవాలను తెలుసుకోవాలి. ఇరాన్ పై ఆంక్షలు భారత దేశ ప్రజల ఆర్ధిక స్ధితిగతులను నేరుగా ఎలా ప్రభావితం చేస్తున్నదీ వారు అర్ధం చేసుకోవాలి. అమెరికా యుద్ధాలు చేసే ది ముస్లిం టెర్రరిజం పై కాదనీ, తాను యుద్ధం ప్రకటించిన ఆల్-ఖైదా టెర్రరిస్టులతో కలిసి లిబియాలో ప్రభుత్వం ఏర్పాటు చేసిందనీ వారు తెలుసుకోవాలి. అమెరికా యుద్ధాలన్నీ తన కంపెనీల లాభాలు పెంచడం కోసమేననీ వారు తెలుసుకోవాలి. లేనట్లయితే అమెరికా యుద్ధాల వల్ల భారత ప్రజలకు జరుగుతున్న నష్టాలు వారెన్నడూ అర్ధం చేసుకోలేరు. అంతేకాక అమెరికా భారత దేశ సార్వభౌమత్వాన్ని హరించివేయడానికి కూడా వెనకాడదని కూడా వారు తెలుసుకోవాలి. ఆ రోజు వచ్చేవరకూ ఎదురు చూడకుండా అమెరికా దురాక్రమణ వ్యతిరేక ఉద్యమాలలో వారూ భాగస్వాములు కావలసినా అవసరం ఉండని వారు గ్రహించాలి.

ఇక అమెరికాలో నివసిస్తూ అమెరికా విధానాలను గుడ్డిగా సమర్ధిస్తూ ఉన్నవారు భారత దేశంలో నివసించడం లేదు గనక అమెరికా ఆంక్షల వల్ల నష్టపడకపోవచ్చు. తమకు నష్టం లేదు గనక అమెరికాని వ్యతిరేకించవలసిన అవసరం లేదని వారు భావిస్తే, వారి దేశభక్తి ని అనుమానించక తప్పదు. పరాయి దేశంలో ఉన్నా, అమెరికా పౌర సత్వం పొందినా తాము దేశ భక్తులమే అని చెప్పదలిస్తే మాత్రం భారత దేశంపై అమెరికా సాగిస్తున్న బెదిరింపులనూ, దాని పోలీసు పెత్తనం వల్ల భారత ప్రజలు అనుభవిస్తున్న వెతలను గమనించి అమెరికా విదేశాంగ విధానాలను ఎండగట్టడంలో ముందు పీఠిన నిలవాలి.

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

గూగుల్ చిత్రం

You are commenting using your Google account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

Connecting to %s