ఓట్ల కోసమే తప్ప తమకు ప్రజా సంక్షేమం పట్ల చిత్తశుద్ధి లేదని కాంగ్రెస్ ప్రభుత్వం రుజువు చేసుకుంది. ప్రజా సంక్షేమం చూసే పార్టీగా చెప్పుకోవడానికి కాంగ్రెస్ ప్రముఖంగా చూపించే పధకం ‘ఉపాధి హామీ పధకం’. ఈ పధకం వల్లనే కాంగ్రెస్ పార్టీ రెండవ సారి వరుసగా అధికారంలోకి వచ్చిందని కాంగ్రెస్ నాయకులు అనేకసార్లు చెప్పారు. దీనిని సోనియా గాంధీ ప్రసాదించిన వరంగా కూడా కాంగ్రెస్ పెద్దలు చెప్పుకోవడం కద్దు. అలాంటి పధకానికి 2012-13 ఆర్ధిక సంవత్సరానికి ప్రతిపాదించిన బడ్జెట్ లో నిధులు కత్తిరించి పారేశారు.
2012-13 ఆర్ధిక సంవత్సరంలో ‘మహాత్మాగాంధీ నేషనల్ రూరల్ ఎంప్లాయ్ మెంట్ గ్యారంటీ యాక్ట్’ పధకం కింద ఖర్చు పెట్టడానికి రు. 33,000 కోట్లు కేటాయిస్తున్నట్లు ఆర్ధిక మంత్రి ప్రకటించాడు. 2011-12 లో ఈ పధకానికి కేటాయించింది 40,000 కోట్లు. అంటే 17.5 శాతం మేరకు కోత పెట్టారన్నమాట.
‘ఉపాధి హామీ పధకం’ వల్ల పొలం పనులకు కూలీలు లేకుండా పోయారని చెబుతూ పొలం పనుల సీజన్ లో పధకం అమలు నిలిపివేయాలని వ్యవసాయ మంత్రి శరద్ పవార్ గత సంవత్సరం డిమాండ్ చేసాడు. మరోవైపు ఈ పధకం అమలు నీరసించిందని కూడా ప్రభుత్వ పెద్దలు అనేకసార్లు వ్యాఖ్యానించారు. మార్చి 15 న ప్రభుత్వం విడుదల చేసిన ‘ఆర్ధిక సర్వే – 2012’ కూడా ఇదే అభిప్రాయాన్ని వ్యక్తం చేసింది. ‘ఉపాధి పధకం’ వల్ల పొలం పనులకు కూలీలు సరిపోయినంతగా లభ్యం కాలేదని సర్వే అభిప్రాయపడింది. ఈ నేపధ్యంలో చూసినపుడు పధకానికి నిధుల కత్తిరింపు ఎందుకు జరిగిందో అర్ధం చేసుకోవచ్చు.
ప్రభుత్వ పధకం గనుక కనీస వేతనాలు చెల్లించడం అనివార్యం. పొలం పనులు ముమ్మరంగా జరిగే కాలంలో కూడా కూలీలు ఉపాధి హామీ పధకం ద్వారా వచ్చే పనులవైపే మొగ్గు చూపారంటే వ్యవసాయ కూలీ పనుల్లో కనీస వేతనాలు కూడా వారికి అందడం లేదని అర్ధం అవుతోంది. కనీస వేతనాలు అమలు కావడం లేదని వ్యవసాయ కూలీ సంఘాలు, రైతు కూలీ సంఘాలు అనేక దశాబ్దాలుగా మొత్తుకుంటూనే ఉన్నాయి. అయినప్పటికీ కనీస వేతనాల చట్టం అమలు చేయడానికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలేవీ చర్యలు చేపట్టలేదు. ఆ సంగతి ‘ఉపాధీ హామీ చట్టం’ ద్వారా సమకూరిన పనుల ద్వారా నిర్ద్వంద్వంగా రుజువయ్యింది.
వ్యవసాయ పనులకి కూలీలు దొరకనప్పుడు ప్రభుత్వం చెయ్యవలసిందేమిటి? ముఖ్యంగా వ్యవసాయ మంత్రి చెయ్యవలసిందేమిటి? కూలీలకు కనీస వేతనాల చట్టం సరిగా అమలయ్యేలా చర్యలు తీసుకోవాలి. కూలీ డబ్బులు సరిపోయినంత ఇవ్వకుండా కూలీలు దొరకడం లేదని చెప్పడం సరికాదని ప్రకటించి చట్టం అమలుకోసం అధికారులను పురమాయించాలి. రాష్ట్రాలకు తగిన సూచనలు, మార్గదర్శక సూత్రాలు జారీ చెయ్యాలి. ఉపాధి హామీ పధకం వల్ల కూలీలు దొరకడం లేదంటే అది ప్రధానంగా కూలీల సమస్యగా గుర్తించి ఉండాలి. కూలీల సమస్య ‘కనీస వేతనాల చట్టం’ అమలు సమస్యను పరిష్కరించి తద్వారా ఉపాధి పధకం పనుల కంటే పొలంపనుల్లో కాస్త ఎక్కువ కూలి ఇస్తే కూలీలు వారే దొరుకుతారన్న సందేశం ఇచ్చి ఉండాలి.
కూలీల కనీస వేతనం సమస్య పరిష్కరించే క్రమంలో రైతుల ‘గిట్టుబాటు ధరల’ సమస్య కూడా ఆటోమేటిగ్గా ముందుకు వస్తుంది. రైతులకు ప్రభుత్వాలు ప్రకటించిన గిట్టుబాటు ధరలు అందకుండా దళారీ వ్యవస్ధ అడ్డుకుంటోంది. పంట చేతికి వచ్చినపుడు దళారీలు ధరలు అమాంతం తగ్గించేస్తున్నారు. తక్కువ ధరలకు పంటల్ని కొని నిల్వ చేసి, ధరలు పెరిగినపుడు అమ్ముకుని సొమ్ము చేసుకుంటున్నారు. ఆ విధంగా కష్టించి పని చేసిన రైతు శ్రమకి దక్కాల్సిన ఫలితాన్ని దళారీ తన్నుకుపోతున్నారు. ఇక్కడే ప్రభుత్వాలు ముందుకు వచ్చి తమ పాత్రను నిర్వహించాలి. రైతులు పంటలు నిల్వ చేసుకోవడానికి గోడౌన్లు కట్టి తక్కువ రేట్లకు ఇవ్వాలి. లేదా గిట్టుబాటు ధర ఖచ్చితంగా అమలయ్యేలా చట్టపరమైన ఏర్పాట్లు చేయాలి. తక్కువ ధరలకి అమ్మేలా రైతులను మభ్య పెట్టి మోసం చేసేవారిని నేరస్ధులుగా ప్రకటిస్తూ చట్టాలు రూపొందించాలి. చట్టాలు చేసి ఊరుకోకుండా వాటిని అమలు చేసే బాధ్యత కూడా చేపట్టాలి.
ఇవన్నీ చేసినపుడు రైతులకి కష్ట ఫలితం దక్కుతుంది. ఆత్మ హత్యలు ఆగుతాయి. కష్టం చేసే వారు ఇతరుల కష్టాన్ని ఎల్లవేళలా గుర్తిస్తారు. తమ పొలాల్లో కష్టం చేసే కూలీలకి కూడా వారి కష్ట ఫలితం ఇవ్వాలని ఆలోచిస్తారు. పచ్చగా ఉన్న రైతులు తమ వద్ద కూలీలని కూడా పచ్చగా ఉంచాలని ప్రయత్నిస్తారు. కూలీల డిమాండును బట్టి కాస్త ఎక్కువ కూలీ ఇవ్వడానికి కూడా వెనకాడరు. వాస్తవంలో రైతులకి గిట్టుబాటు ధరలు దక్కడం లేదు. ఫలితంగా కూలీ రేట్లు మోతగా వారికి కనిపిస్తున్నాయి. తమ అదుపులో లేని ఎరువులు, పురుగు మందులు రేట్లు అందనంత ఎత్తులో ఉన్నా, వాటిని వదిలేసి తమ చేతుల్లోంచి కూలి డబ్బులు తీసుకునే కూలీలు వారికి దోపిడిదారులుగా కనిపిస్తున్నారు. ఫలితంగా కూలీ ఛార్జీలు పెరిగిపోతున్నాయనీ, భారంగా మారాయనీ రైతులు భావిస్తున్న పరిస్ధితి ఏర్పడుతోంది. ఎరువులు, పురుగు మందులు తయారు చేసేవారు రైతుల ఎదుట ఉండరు. వాటి ధరలు ఎవరు నిర్ణయిస్తారో వారికి అవగాహన ఉండదు. అవగాహాన లేక ఎరువుల బస్తాలపైనా, పురుగు మందు డబ్బాలపైనా ఉండే రేట్లను సరైన రేట్లుగానే వారు భావిస్తారు. రేట్లు ముద్రించి ఉండడం వల్ల వాటికి తిరుగులేదనీ, న్యాయమైనరేట్లనీ నమ్ముతారు. కనుక ఎరువుల ధరలు, పురుగు మందుల ధరలు అందుబాటు ధరలకు పొందవచ్చన్న ధ్యాస లేక కూలీల రేట్లపైన నియంత్రణ ఉండాలని భావిస్తారు. కూలీలు తక్కువ తీసుకుంటే తమ చేతుల్లో ఎక్కువ డబ్బులు ఉంటాయన్న ఆలోచనే వారిలో ప్రధానంగా పని చేస్తుంది. ఆ ఆలోచన నుండి కూలీ రేట్లు ఎక్కువగా ఉన్నాయన్న తప్పుడు అవగాహన వారికి కలుగుతుంది.
నిజానికి కూలీలకు రెక్కల కష్టం తప్ప మరో ఆదాయ వనరు ఉండదు. ఉంటే వారు కూలీ పనులకు రారు. కష్టం చేస్తేనే వారి కడుపు నిండేది. ఆ కూలీ డబ్బుల్లోనే కొద్దో గోప్పో మిగుల్చుకుని బట్టలు కొనుక్కోవాలి. జబ్బు చేస్తే వైద్యం చేసుకోవాలి. పిల్లల్ని చదివించుకోవాలి. పిల్లల అవసరాలు తీర్చాలి. పండగలు జరపాలి. ఆడపిల్లల పెళ్ళిళ్ళు చేయాలి. వినోదం కోసం సినిమా, షికార్లకి వెళ్ళాలి. పొరుగువారితో, బంధువులతో సంబంధాలు నెరపాలి. వీటన్నింటికీ కూలీ డబ్బులే వారికి ఆధారం. ఈ కనీస అవసరాలను కూలీలు తీర్చుకోవడానికి సమాజంలో పూర్తి ఆమోదం ఉందా అని చూస్తే లేదన్నదే సమాధానం. సినిమాకి వెళ్తే వృధా ఖర్చుగా చూసి దుబారా చేస్తున్నారంటారు. మంచి బట్ట కడితే షోకులు ఎక్కువయ్యాయంటారు. పిల్లల్ని మంచి చదువు చదివించే యోగం వారికి ఎటూ ఉండదు. అసలు సమాజంలో చదువు అన్నది ఒక్కటే ఉండాలి. మంచి చదువు, చౌక చదువు, వానా కాలం చదువు, కాన్వెంటు చదువు, మునిసిపల్ స్కూల్ చదువు అని ఇన్ని ఉన్నాయంటేనే చదువుల పరిస్ధితి అర్ధం చేసుకోవచ్చు. ఇన్ని చదువుల్లో కూలీ పిల్లలకి దొరికేది అట్టడుగున ఉన్న చదువులే. ఈ చదువులకి కూడా డబ్బుల్లేక అనేక మంది కూలీలు సతమతమవుతుంటారు.
ఇవన్నీ కాక పని పరిస్ధితులు కూలీలకు అనేక విధాలుగా ప్రతికూలంగా ఉంటాయి. అనేక చోట్ల పని పరిస్ధితులే కూలీలపై అధిక భారం పడేస్తాయి. వారి కి సంవత్సరం అంతా పని దొరకదు. (పురుషులకు 200 రోజులు, స్త్రీలకు 134 రోజులు పని దొరుకుతోందని ఒక అంచనా). వీరిలో అధికులు దళితులే. కనుక వారిపైన కులపరమైన అణచివేత కూడా సాగుతుంది. పనుల్లో వారికి శిక్షణ ఉండదు. సంఘటితంగా ఉండే అవకాశాలు లేవు. తమకూ హక్కులు ఉంటాయనీ, వాటిని కాపాడుకోవడానికి చట్టాలున్నాయనీ తెలియదు. అందువల్ల పని స్ధలాల్లో ఎదురయ్యే కష్ట నష్టాలను దాదాపు మౌనంగా భరిస్తుంటారు. వ్యవసాయ రంగంలో భూస్వామ్య విధానం కొనసాగుతుండడం వల్లా, పెట్టుబడిదారీ విధానం అభివృద్ధి చెందకపోవడం వల్లా వ్యవసాయ కూలీలను ఇదమిద్ధంగా ఫలానా లక్షణాలు గల ‘వేతన కూలీలు’ గా నిర్వచించగల పరిస్ధితి లేదు.
ఇటువంటి పరిస్ధితుల్లో కూలీలకి ఎంత కూలీ ఇస్తే ‘కూలీ రేట్లు’ ఎక్కువగా ఉన్నట్లు? ఎంత కూలీ ఇస్తే నిత్యావసరాలన్నీ జరిగి వారి వద్ద కూలి డబ్బులు మిగిలేను? ఎంత ఎక్కువ కూలీ ఇస్తే వారి పిల్లలు మంచి చదువు చదివేరు? కూలీలు ఎంత కూలీ దోపిడీ చేస్తే వైద్య ఖర్చులకి డబ్బులు మిగలకుండా పోయేను? రోజుకి ఎంత కూలీ ఇస్తే కుటుంబం అంతా సరదాగా ఎప్పుడైనా సినిమాకో, షికారుకో వెళ్ళేను? అందుకే “కూలి రేట్లు ఎక్కువయ్యాయి” అన్న ఆరోపణే అర్ధం లేనిది. అవగాహన రాహిత్యం వల్ల, తమ దుస్ధితికి కారణం ఎవరన్న దానిని అర్ధం చేసుకోవడంలో వైఫల్యం వల్ల రైతులు తక్షణం తమ ఎదురుగా కనిపించే కూలీలను తరచుగా ఆడిపోసుకుంటారు. ప్రభుత్వాలు తమ కర్తవ్యాన్ని సరిగా నిర్వర్తించి రైతులకి గిట్టుబాటు ధరలు అందేలా చూస్తే శరద్ పవార్ లాంటి ‘బందిపోటు నాయకుడు’ “ఉపాధి హామీ పధకం వల్ల కూలీలు దొరకడం లేదం”టూ చెత్త వాగే అవకాశం ఉండకపోను.
వాస్తవం ఏంటంటే ప్రభుత్వంలో ఉన్నవారంతా ‘శరద్ పవార్’ లే ఉండడం. అందుకే శరద్ పవార్ చెప్పడంతోనే ‘ఉపాధి హామీ పధకానికి’ నిధులు తగ్గిపోయాయి. 2001 జనాభా లెక్కల ప్రకారం గ్రామీణ కూలీలు 40.25 కోట్లు కాగా వీరిలో 58.4 శాతం (23.5 కోట్లు) మంది కేవలం వ్యవసాయ రంగంలోనే పని చేస్తున్నారు. వీరి సంఖ్య 2011 కల్లా 20 శాతం (దాదాపు 30 కోట్లకు) పెరిగిందని 2011 లెక్కలు చెపుతున్నాయి. ఇంకా చెప్పాలంటే వ్యవసాయ కూలీల సంఖ్య పెరుగుతోందే తప్ప తరగడం లేదు. ఉదాహరణకి 1993-94 లో గ్రామీణ జనాభాలో కొద్ది పాటి సొంత పొలం ఉన్న కుటుంబాలు 37.8 శాతం ఉంటే, వారి సంఖ్య 1999-200 లో 32.7 శాతం కి పడిపోయిందని 55 వ నేషనల్ శాంపిల్ సర్వే (2001) తెలిపింది. (గ్రామీణ కుటుంబాల్లో 62.6 శాతం మంది నెలకు రు.470 లతో బతికారని కూడా ఈ సర్వే తెలిపింది). వీరంతా కూలీలుగా మారిపోయారని వేరే చెప్పనవసరం లేదు. ఇలా పెరిగిన కూలీలతో సహా 30 కోట్ల మంది కూలీలు ఉన్నా ఉపాధి పధకం వల్ల వ్యవసాయ పనులకు కూలీలు దొరకడం లేదని కేంద్ర మంత్రి చెప్పడం మోసం తప్ప మరొకటి కాదు. మామూలుగా తమ షరతుల ప్రకారం కూలీలని దొరకబుచ్చుకునే భూస్వాములు ఉపాధి పధకం వల్ల వేతన దోపిడీ సాగించలేకపోతుండడమే శరద్ పవార్ ప్రకటనకి దారి తీసిందని అర్ధం చేసుకోవచ్చు.
కొత్త ఆర్ధిక సంవత్సరానికి ఉపాధి హామీ పధకం నిధులు తగ్గించడమే కాక 2011-12 సంవత్సరానికి కూడా సదరు నిధుల్లో కోతపెట్టారు. రు. 40,000 కోట్లు బడ్జెట్లో కేటాయించినపటికీ దానిని రు.31,000 కోట్లకు తగ్గిస్తున్నట్లు ప్రణబ్ ముఖర్జీ ప్రకటించాడు. కూలీల లెక్కల్లో చూస్తే 2010-11 లో 5.49 కోట్ల మంది కూలీలకు పని చూపగా, ఈ సంవత్సరం ఫిబ్రవరి వరకు 4.09 కోట్ల మందికి మాత్రమే పని చూపారని ‘ది హిందూ’ తెలిపింది. అంటే 1.4 కోట్ల మంది కూలీలు. మొత్తం గ్రామీణ కూలీల సంఖ్య 30 కోట్లు. ఇందులో అధమం సగం మంది కేవలం వ్యవసాయ కూలీపై ఆధారపడ్డవారే అనుకున్నా 15 కోట్లు తేలతారు. అందులో పని చూపింది 4.09 కోట్లకి. ఇంకా 11 కోట్ల కూలీలు మిగులు తేలారు. వీరంతా మన వ్యవసాయ మంత్రిగారికి కనపడలేదు. ఆయన దృష్టిలో వీరందరూ ఏ తరగతి కిందకు వస్తారో తెలియదు.
ఆకలి కడుపులతో నక నక లాడుతూ పని దొరకడమే మహాభాగ్యం అనుకుని అత్యంత చౌక రేట్లకి కూలీలు దొరికితేనే కూలీలు దొరికినట్లని శరద్ పవార్ భావిస్తుండ వచ్చు. ఆయన కోరిందే తడవుగా కేంద్ర ప్రభుత్వం ఆయన కోరికని ఆర్ధిక సర్వేలో పొందుపరచడమే గాక తదనుగుణంగా ఉపాధి హామీ నిధుల్లో కోత కూడా పెట్టింది. ఈ సంవత్సరం ఉదాహరణకి తీసుకుంటే కేటాయించిన 33,000 కోట్లలో వాస్తవంగా ఎంత ఖర్చు పెడతారన్నదీ ఊహించవలసిందే మరి. 2011-12 లో 40,000 కేటాయించి ఫిబ్రవరికి 31,000 కోట్లు ఖర్చు పెట్టారు. అంటే 77.5 శాతం. ఈ లెక్కన 2013 ఫిబ్రవరికల్లా ఉపాధి హామీ నిధులకు కేటాయించిన 33,000 కోట్లలో దాదాపు 26,000 కోట్లు ఖర్చు పెడతారన్నమాట. అది కూడా అనుమానమే. కోతలు మొదలు పెట్టాక దానికి సూత్రాలేముంటాయి?