(ఫస్ట్ పోస్టు నుండి)
సోనియా: “గత సంవత్సరం వచ్చిన మంచి అనుభవంతో ఇసారి మెరుగైన బడ్జెట్ ఇస్తారని ఆశిస్తున్నా”
గత సంవత్సరం బడ్జెట్ లో అనుకున్న లక్ష్యాలు చెరుకోలేదని భారత ప్రభుత్వంపైన అనేకమంది విమర్శలు చేస్తున్నారు. వారిలో స్వదేశీ, విదేశీ పత్రికలు, కార్పొరేట్ కంపెనీలు, పెట్టుబడిదారుల సంఘాలైన ఆసోచామ్, ఫిక్కీ, సి.ఐ.ఐ లూ వీరిలో ముఖ్యులు.
గత బడ్జెట్లో బడ్జెట్ లోటు జిడిపిలో 4.6 శాతం ఉంటుందని అంచనా వేసినా దాన్ని చేరుకోలేక 5.9 శాతానికి ప్రభుత్వం సవరించుకుంది. (కొత్త ఆర్ధిక సంవత్సరంలో 5.1 శాతం లక్ష్యం) సబ్సిడీలు తగ్గించాలని కంపెనీలు ముఖ్యంగా విదేశీ కంపెనీలు ఒత్తిడి తెస్తున్నాయి. ప్రజలకి ఇచ్చే ఆహార, గ్యాస్, ఎరుగుల సబ్సిడీలు తగ్గించాలన్నదే వారి డిమాండ్ తప్ప కంపెనీలకి, పెట్టుబడిదారులకి ఇచ్చే పన్ను రాయితీలు, సబ్సిడీలు మాత్రం కొనసాగించాలని వారు డిమాండ్ చేస్తారు.
గతేడు జిడిపి వృద్ధి రేటు 8.5 శాతం లక్ష్యం పెట్టుకుని ఇప్పుడు అంతలేదనీ 6.9 శాతం మాత్రమే ఉంటుందని ఈ బడ్జెట్ లో చెప్పారు. పెట్టుబడుల ఉపసంహరణ (ప్రభుత్వ రంగ కంపెనీల అయినకాడికి అమ్మడం) ద్వారా 40,000 కోట్లు సంపాదించాలని లక్ష్యం పెట్టుకుని రు.15,000 కోట్లు మాత్రమే తేల్చారు.
పన్నుల వసూళ్ళు కూడా అనుకున్నంత లేవు. అయినప్పటికీ గతేడు కంటె ఇసారి మొత్తం బడ్జెట్ అంచనా 10.2 లక్షల కోట్ల నుండి 14.9 లక్షల కోట్లకు పెంచారు. ఇక ద్రవ్యోల్బణం ఏడు శాతం దగ్గరికి వచ్చినా ఆర్.బి.ఐ లక్ష్యం ఐదు శాతం కంటే చాలా ఎక్కువ.