రైల్వే మంత్రి దినేష్ త్రివేది తృణమూల్ నేత. ఆయన మమత మాటను జవదాటేవాడేమీ కాదు. భారత దేశంలో రాజకీయ పార్టీలు భూస్వామ్య వ్యవస్ధలకు ప్రతీకలుగా ఉన్నాయే తప్ప ప్రజాస్వామ్య బద్ధగా లేవు. పార్టీ కార్యకర్తల కంటే పార్టీ నాయకులే అక్కడ సుప్రీం. అలాంటి ప్రజాస్వామ్య రహిత పార్టీల్లో తృణమూల్ కూడా ఒకటి. అదీ కాక ఎన్.డి.ఎ ప్రభుత్వంలో మమత రైల్వే మంత్రిగా పని చేసింది. యు.పి.ఎ ప్రభుత్వంలో కూడా మూడేళ్ళు రైల్వే మంత్రిగా పని చేసింది. బెంగాల్ ముఖ్యమంత్రిగా వెళ్తూ తన పార్టీ అనుచరుడు దినేష్ త్రివేది ని రైల్వే మంత్రిగా నియమించింది. అలాంటి తన సుప్రీం నాయకురాలిగా చెప్పకుండానే త్రివేది ఛార్జీలు పెంచాడా? నిజంగా త్రివేది అంతపని చేస్తే బడ్జెట్ చదివి ఉండేవాడా?
మమతను తప్పించి ములాయం, మాయావతి పార్టీల మద్దతుతో యు.పి.ఎ ప్రభుత్వాన్ని కొనసాగించాలని కాంగ్రెస్ భావిస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. యు.పి లో ములాయం కొడుకు పదవీ స్వీకార ప్రమాణానికి కాంగ్రెస్ తన నాయకుల్ని కూడా పంపింది. నిన్నటివరకూ ఎన్నికల్లో ఒకరిపై ఒకరు దుమ్మెత్తి పోసుకున్న పార్టీలు ఈరోజు అధికారం పంచుకోవడం కోసం భుజాలపై చేతులేసుకుంటున్నాయి. భారత దేశంలో పాలక పక్షానికీ, ప్రతిపక్షానికి ఉండవలసిన స్పష్టమైన గీత ఎన్నడో చెరిగిపోయింది. ఇప్పుడున్న పార్టీలన్నీ పాలక పక్షమే. కాకుంటే పదవులు దొరకనప్పుడూ, అనుకున్న పదవి అందనప్పుడూ, వాటాలు తగ్గినపుడూ మాత్రమే వారి మధ్య విభేదాలు తలెత్తుతున్నాయి తప్ప విధానపరమైన తేడాలేవీ వారికి మార్గదర్శకాలుగా లేవు. అటువంటి రాజకీయ పార్టీలు అధికారం కోసం ఎంత శత్రువునైనా వాటేసుకుంటాయి. ఎంతటి మిత్రుడినైనా ‘ఛీ, పో’ అంటాయి.
త్రివేదిని తప్పించాలన్న మమత ఇప్పుడు అదేమీ అనడం లేదు. బడ్జెట్ ఆమోదం పొందేదాకా త్రివేదిని తప్పించేది లేదని మమతకు చెప్పినట్లు సమాచారం. ప్రభుత్వాన్ని పడగొట్టే ఉద్దేశ్యం తనకు లేదని కూడా మమత ప్రకటించింది. అంటే రైల్వే చార్జీల పెంపుదల కొనసాగుతున్నట్లే. మమత తనను రాజీనామా చేయమని కోరనేలేదని త్రివేది చెబుతున్నాడు. కోరితే వెంటనే రాజీనామా చేస్తానంటున్నాడు. త్రివేదికి చెప్పి రాజీనామా చేయమనే బదులు అతన్ని తప్పించమని కాంగ్రెస్ ని ఎందుకు కోరుతున్నట్లు? నాటకం కాకపోతే! ఒకవేళ త్రివేదిని తప్పించినా రైల్వే ఛార్జీలు తగ్గకపోతే మమత, కాంగ్రెస్ ల నాటకం ధృవపడినట్లే.
కార్టూన్: ఫస్ట్ పోస్ట్ నుండి సేకరించింది
Reblogged this on Gpvprasad's Blog.