భగత్ సింగ్ వీర మరణాన్ని అవమానించిన రైల్వే మంత్రి


mamataతృణమూల్ కాంగ్రెస్ పార్టీకి చెందిన దినేష్ త్రివేది గురువారం రైల్వే బడ్జెట్ ప్రవేశపెట్టిన సంగతి తెలిసిందే. ఛార్జీలు పెంచి రు. 36,200 కోట్లు అదనంగా ఈ సంవత్సరం ఆదాయం పెంచబోతున్నట్లు ఆయన ప్రకటించాడు. అంత పెద్ద మొత్తం లో ఛార్జీలు వడ్డించి కూడా తాను చాలా తక్కువ పెంచానని ప్రకటించాడు. పైగా సామాన్య మానవుడిని దృష్టిలో పెట్టుకుని ఛార్జీలు పెంచానని చెప్పడానికి కూడా సాహసించాడు. ఛార్జీలు పెంచి ఐ.సి.యు లో ఉన్న రైల్వేలను బైటికి తెచ్చానని గొప్పలు చెప్పుకున్నాడు. రైల్వేలను ఐ.సి.యు లోకి చేర్చిందెవరో కూడా ఆయన చెప్పి ఉంటే బాగుండేది. చెప్పినా, చెప్పకపోయినా, ఆయనకి ముందు మూడు సంవత్సరాలు రైల్వే మంత్రిత్వ శాఖ నడిపిన మమతా బెనర్జీ యే రైల్వేలను ఐ.సి.యు లో చేర్చిందని ప్రజలు అర్ధం చేసుకున్నారు.

రైల్వే బడ్జెట్ ప్రసంగం ముగిశాక అనూహ్యంగా మమతా నుండి కేంద్ర ప్రభుత్వానికి తాఖీదు అందింది. రైల్వే ఛార్జీల పెంపుదలను తమ పార్టీ వ్యతిరేకిస్తున్నదనీ, వెంటనే పెంచిన ఛార్జీలను వెనక్కి తీసుకోవాలనీ ఆ తాఖీదు సారాంశం. ప్రజలపై భారం వేసే చర్యలను తాము అంగీకరించేది లేదని ఓ గంభీరమైన విధాన ప్రకటన కూడా ఈ సందర్భంగా ఆమె చేసింది. మరి కొన్ని గంటల తర్వాత దినేష్ త్రివేదిని రైల్వే మంత్రిగా తప్పించి ముకుల్ రాయ్ ని నియమించాలని కూడా ఆమె సూచించినట్లు వార్తలు వచ్చాయి.

దినేష్ త్రివేది చేత రాజీనామా చేయించి మరొకరిని నియమించాలని మమతా కోరినట్లు వార్తలు వచ్చాక త్రివేది ‘అమర వీరుడి’ ఫోజు పెట్టడం మొదలు పెట్టాడు. అత్యంత హాస్యాస్పదంగా తన పదవీ వియోగాన్ని ‘భగత్సింగ్ త్యాగంతో’ పోల్చుకున్నాడు. తద్వారా భగత్సింగ్ వీరమరణాన్ని దారుణంగా అవమానించాడు. ఛార్జీలు పెంచి ప్రజలపై భారం మోపడాన్ని జాతీయోద్యమంతో పోల్చుకోవడం అతి పెద్ద సాహసం. దేశాన్ని, అంటే దేశ ప్రజలని దోచుకుతింటున్న బ్రిటిష్ సామ్రాజ్యానికి వ్యతిరేకంగా జరిగినది జాతీయోద్యమం. ప్రజలపై భారం మోపింది రైల్వే బడ్జెట్. రెండింటికీ సాపత్యం ఉందా అసలు? ఇంతకీ ఈయనకింకా పదవీ వియోగమే సంభవించలేదు. అది జరగకుండానే అడ్వాన్స్ గా తన ‘పదవీ త్యాగాన్ని’ గొప్ప చేసుకుంటున్న త్రివేదికి ప్రత్యేకంగా మ్యూజియం ఏర్పాటు చేయవలసిందే.

ఈయన మంత్రి పదవి చేపట్టడమే జాతీయోద్యమం లోకి దూకడంతో సమానం అన్నమాట. ఆరు నెలలు పదవీ భోగాలు అనుభవించిన త్రివేది 200 యేళ్ళు సాగిన జాతీయోద్యమంతో తన భోగ జీవితాన్ని పోల్చుకోవడానికి మనసెలా ఒప్పింది? జాతీయోద్యమం గురించిన కనీస అవగాహన లేకుండానే కేంద్ర మంత్రి పదవుల్లో చేరుతున్నారన్నమాట. “దేశం కోసం భగత్ సింగ్ ప్రాణాలు త్యాగం చేస్తే, నేను నా పదవిని త్యాగం చెయ్యడానికి సిద్ధం” అని ఈయన చేసిన ప్రకటన. వలస పాలన నుండి విముక్తి కోసం భగత్ సింగ్ అత్యంత చిన్న వయసులో ఉరికంబం ఎక్కాడు. పార్లమెంటులో బాంబు విసిరి పారిపోకుండా అక్కడే నిలబడి మరీ అరెస్టు అయ్యాడు. తన విడుదల కోసం తాత చేసిన ప్రయత్నాలను తీవ్రంగా వ్యతిరేకించి ఉరికంబం ఎక్కడాన్నే కర్తవ్యం గా స్వీకరించాడు. అలాంటి భగత్ సింగ్ వీర మరణం ఎక్కడ? జి.డి.పి, ద్రవ్య లోటు లెక్కల కోసం కోట్లాదిమంది ప్రజలపైనా వేల కోట్లు భారం వేసేందుకు సిద్ధపడిన అల్పుడు త్రివేది ఎక్కడ? భగత్ సింగ్ వీర మరణం ప్రజల విముక్తికి ఉద్దేశించింది అయితే, చార్జీల పెంపుదల ప్రజల నడ్డి విరిచేందుకు ఉద్దేశించింది. ప్రజలను వంచించడానికి మమత ఆడుతున్న నీచ రాజకీయాలలో త్రివేది పదవి ఊడితే అది త్యాగం ఎలా అవుతుంది? ప్రజలకు అనుకూలంగా, దోపిడీ శక్తులకు వ్యతిరేకంగా మంత్రిగా ఏదైనా చర్య తీసుకుని దానివల్ల మంత్రి పదవి ఊడితే ఏదో చిన్న త్యాగం అయుండేదేమో? కనీసం అది కూడా కాదాయే?!

దినేష్ త్రివేదీ రైల్వే బడ్జెట్ ప్రసంగం చేస్తున్నపుడు ఆయన పార్టీ సభ్యులు సభలోనే ఉన్నారు. ఇంకా చెప్పాలంటే ప్రసంగం జరుగుతున్నపుడు దానిని ఆమోదిస్తూ బల్లలు చరిచారు.  బ్రహ్మాండగా ఉందనీ చెప్పారు. బడ్జెట్ ప్రసంగం ఆసాంతం గ్యాలరీలో కూర్చుని తిలకించిన తృణమూల్ నాయకుడు సుదీప్ బందోపాద్యాయ కూడా చార్జీల పెంపును వ్యతిరేకిస్తున్న సందేశం ఇవ్వలేదు. మమత ప్రకటనతో వీరి ఆమోదం తల్లక్రిందులయింది. మమతా ప్రారంభించిన ‘ఆం ఆద్మీ’ నాటకానికి కాంగ్రెస్ పార్టీ కూడా రక్తి కట్టించింది. వెంటనే కోర్ కమిటీ సమావేశం ఏర్పాటు చేసింది. రైల్వే చార్జీల విషయం చర్చిస్తున్నట్లు చెప్పి ఏమీ తేల్చకుండానే సమావేశం ముగించారు. కనీసం తగ్గించే ఆలోచన చేస్తున్నట్లు సూచన కూడా ఆ సమావేశం ఇవ్వలేదు.

ప్రజలను మోసం చేయడంలో రాజకీయ పార్టీలు, నాయకులు కొత్త కొత్త ఎత్తుగడలను కనిపెడుతున్నారు. చెయ్యదలుచుకున్నది చక్కా చేసి ఆ తర్వాత అది మా ఉద్దేశ్యం కాదంటూ నాలిక్కరుచుకున్నట్లు నటిస్తున్నారు. ప్రజలను వంచించడానికి ఒక్కొక్కరు ఒక్కొక్క పాత్రను పోషిస్తూ, నాటకాలను రక్తి కట్టిస్తున్నారు. అంతిమంగా తాము చెయ్యదలుచుకున్నది చేసేస్తున్నారు. ప్రజలపై భారం మోపేందుకు కొందరూ, దాన్ని వ్యతిరేకించేదుకు మరి కొందరూ, ఆందోళనలు చేసేందుకు ఇంకొందరూ, సమర్ధించేందుకు మరి కొందరూ… ఇలా ఒక్కొక్కరు ఒక్కో పాత్ర పోషిస్తూ ప్రజలను నిలువునా వంచిస్తున్నారు.

యు.పి.ఏ కూటమి నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం ఈ నాటకాల్లో ఆరి తేరింది. రాజకీయ పార్టీలు కూటమిగా ఏర్పడి ప్రభుత్వం ఏర్పాటు చేశాక అటువంటి ప్రభుత్వం తీసుకునే ప్రతి చర్యకూ ప్రతి సభ్య పార్టీ, ఆ పార్టీల ఎం.పి లూ, నాయకులూ బాధ్యత వహించవలసిందే. ఆ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ పార్టీకి రాజీనామా చేయడమో, పదవులకు రాజీనామా చేయడమో చేస్తే అది వేరే సంగతి.

త్రివేదీ రైల్వే ఛార్జీలు పెంచబోతున్నట్లు మమత కి తెలియనే తెలియదా? త్రివేదీ ఒక్కడే తన ఇంట్లోనో మరొక చోటో తాళాలు వేసుకుని రహస్యంగా బడ్జెట్ రాశాడా? తన ముందు రెండు సార్లు రైల్వే మంత్రి గా పని చేసిన తన పార్టీ సుప్రీం ని ఏమీ సంప్రదించకుండానే బడ్జెట్ రాసేశాడా? మమత ఆగ్రహం నటనే కాదు.  నయ వంచన కూడా. చార్జీలను తగ్గించాలని మమత చేసిన ప్రకటన మోస పూరితం. తాను ప్రజల పక్షం అన్న మోసపూరిత నినాదాన్ని భవిష్యత్తులో కూడా కొనసాగించుకోవడానికి వీలుగా లాంఛనంగా రికార్డు చేయదలుచుకున్న ఉత్తుత్తి నిరసన మాత్రమే అది. పెంచిన ఛార్జీలు పూర్తిగా ఉపసంహరించుకోవడానికి మమత ప్రకటన దారి తీస్తే తప్ప అది నటన కాకుండా పోదు.

10 thoughts on “భగత్ సింగ్ వీర మరణాన్ని అవమానించిన రైల్వే మంత్రి

  1. పురుషోత్తం గారూ, తృణమూల్ గతంలో బి.జె.పి మిత్ర పక్షమే కదా. బి.జె.పి, కాంగ్రెస్ ల మధ్య దోస్తీలను మారుస్తున్న పార్టీలకు, అలా మార్చడంలో నిర్ధిష్ట విధానాలేమీ లేవు. వాటిని దోస్తీలుగా స్వీకరిస్తున్న కాంగ్రెస్, బి.జె.పి ల మధ్య కూడా విధానపరమైన తేడాలేవీ లేవు. బి.జె.పి పాలనను చూసి ఏడేళ్ళవుతోంది గనక ఆ పార్టీ దారుణాలు మరుపులోకి జారిపోయాయేమో. వివిధ రాష్ట్రాలలో ఉన్న బి.జె.పి, దాని మిత్రుల ప్రభుత్వాలు తాము యు.పి.ఎ కంటే తీసిపోమని రుజువు చేసుకుంటున్నాయి. ప్రజల వైపు నుండి చూస్తే ఈ రెండూ ఒకటే. విధానాలలో మార్పేమీ లేదు. రెండూ ధనికులు పార్టీలే. ధనికుల కోసం, విదేశీ కంపెనీల కోసం, భూస్వాముల కోసం రెండూ కోట్ల మంది ప్రజల ప్రయోజనాలను విస్మరిస్తున్నవే. అధికారం కోసం కులం, మతం, డబ్బు అన్నింటినీ రెండూ ఉపయోగిస్తున్నాయి. ఈ రెండూ ఒకదాని కొకటి ప్రత్యామ్న్యాయం కాదు. ఈ రెండింటికీ ప్రత్యామ్నాయంగా అచ్చంగా ప్రజల కోసం పని చేసే పార్టీలేవీ ప్రస్తుత రాజకీయ పార్టీల్లో కనిపించడం లేదు. అందరూ అందరే.

  2. సోనీయా, మమతల రాజకీయ రైల్వే నాటకాన్ని మీరు చాలా చక్కగా వివరించారు. నిజంగా వాళ్ళలో వాళ్ళకి ఏమీ తెలియకుండానే ఇది జరిగిందని ప్రజలెవ్వరూ నమ్మరు. వీళ్ళు, నాటకాన్ని వేసేటప్పుడు మేకప్పు రూము కూడా స్టేజి మీద కనపడేట్లు చేసారు పాపం….వాళ్ళు ఏం వెర్రి వేషాలేసినా ప్రజలకి అర్ధం కాదని వారి నమ్మకం! ప్రజా ప్రేక్షకులంటే అంత లోకువ మరి….!!!

  3. రాజకీయ నాయకులను విమర్శించడం అందరూ చేస్తున్నదే. దీనిలో కొత్తేమీ లేదు. అన్నిటికన్న సులభమైనది ఇతరులను వేలెత్తిచూపడమే. అంటే నేనేమి రాజకీయనాయకులకు వత్తాసు పలకడంలేదు, వారందరూ కార్యదక్షులేనని నేనడంలేదు. రాజకీయాల్లో కుళ్ళును అద్దంలో చూపేవాళ్ళు లక్షల్లోనే ఉన్నారు. మరింతటి ప్రతిభా పాటవాలున్నవారెందుకు రాజకీయరంగంలోకి రావడంలేదు? కుళ్ళు రాజకీయాలు మనకెందుకులే అనేవాళ్ళు ఎందరో! వాటిలోనికి మననెందుకు రానిస్తారనే వారు ఇంకొందరు. ఇవన్నీ మనల్ని మనం చేసుకునే ఆత్మవంచనే. దీనినాసరా చేసుకునే నాయకులు పెట్రేగిపోతున్నారు. కుళ్ళు రాజకీయాలతో దేశాన్ని భ్రష్టుపట్టిస్తున్నారు. ప్రతిభా శాలులూ, విద్యా కోవిదులూ, భాద్యత నెరిగిన ప్రతిపౌరుడూ ఏకమై దీనికి నడుంకట్టినరోజు రాజకీయల్లో కంపుకూ, నాయకుల్లో అవినీతికి చరమగీతం పాడే రోజు, భరతమాతకు నీరాజనం పట్టే రోజు వస్తుంది. మనసుంటే మార్గాలెన్నో. ప్రయత్నసాధ్యములులేని ప్రాప్యములు ఉండవుకదా.

  4. ఇంతకీ మీరు ఇక్కడ చెప్పదలుచుకున్నదేమిటి? నేను సులభంగా వేలెత్తి చూపుతున్నాననా? నన్ను రాజకీయరంగంలోకి రమ్మనా? లేక ఇంకేమన్నా సందేశం ఇస్తున్నారా?

  5. ఇది మిమ్మల్ని ఉద్దేశించి వ్రాయలేదు. చైతన్యవంతులైన పౌరులెందరో నేటి రాజకీయ వ్యవస్థకు దూరంగా వుండడం మూలాన దేశ రాజకీయ భవిష్యత్తే ప్రశ్నార్ధకంగా మారింది. ఇది దేశం మనుగడకే ప్రమాదంగా మారకముందే దీనిని మన భాద్యతగా భావించి రాజకీయ ప్రక్షాళనకు ముందుకు రావాలనే ఒక సదుద్దేశ్యంతో చెప్పిన విషయం.

  6. మీ ఉద్దేశ్యం మంచిదే. అయితే, కుళ్లు రాజకీయాలు మార్చాలన్న లక్ష్యంతో వచ్చినవారు కూడా కుళ్లి పోతున్న పరిస్ధితి నెలకొని లేదా? కుళ్లిపోలేని వారు కూడా ఏమీ చేయలేని పరిస్ధితి కనపడుతోంది. ఉదాహరణకి ఐ.ఎ.ఎస్ అధికారి జయ ప్రకాష్ నారాయణ. వ్యవస్ధ పొందికపై ఆయన అభిప్రాయాలు ఎలా ఉన్నా, రాజకియాల్లోకి వచ్చినా ఏమీ చేయలేకపోతున్నానని అనేక సార్లు వాపోయాడు. నక్సలైట్లే వీరికి సరి అని మన రాజకీయ నాయకులనుద్దేశించి కొన్నిసార్లు వ్యాఖ్యానించాడు కూడా. మీరన్నట్లు ప్రక్షాళన అవసరమే అయినా, ఇపుడున్న రాజకీయ వ్యవస్ధని ఉన్నదున్నట్లుగా కొనసాగిస్తూ ప్రక్షాళన చేయడం సాధ్యం కాదనిపిస్తోంది. వ్యవస్ధను గుప్పెట్లో పెట్టుకున్న వర్గాలనుండి వ్యవస్ధను తప్పించి ప్రజల చెప్పుచేతల్లోకి నిజంగా వచ్చినపుడే మీరన్న ప్రక్షాళన సాధ్యమేమో.

  7. మీ ప్రతిజవాబును ఆద్యంతము అర్ధము చేసికొన్నాను. మీ రన్నట్లుగా కుళ్ళు రాజకీయాలను మార్చాలనే లక్ష్యంతో వచ్చినవారు కూడ కుళ్ళిపోతున్న పరిస్థితి వుంది ఇంకా కుళ్ళిపోలేనివారు కూడా ఏమీ చేయలేనిపరిస్థితి వుంది అని మీరన్నారు. దీనికి తార్కాణాన్ని కూడా ఉల్లేఖించినారు. ఇది ఏ ఒక్కరితోనో సాధ్యపడదు అని నేనూ మీతో ఏకీభవిస్తాను. మీరన్నట్లుగా కొన్ని వర్గాల గుప్పెట్లోంచి రాజకీయవ్యవస్థను తప్పించి ప్రజల చేతిలోకి రావడానికి సైతం ఏకోన్ముఖ భావుకులు (like minded)ప్రతిభాశీలులూ , విద్యా కోవిదులూ, భాద్యత నెరిగిన ప్రతిపౌరుడూ సంఘటితమైతే దుస్సాధ్యము కూడా సుసాధ్యమే. మేధావుల రాజకీయ నిష్క్రియత దేశానికి సర్వదా నిష్ప్రయోజనమే.

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

Connecting to %s