“అన్ని అవకాశాలనూ పరిశీలిస్తున్నాం” ఇది ప్రభుత్వాలకూ, రాజకీయ నాయకులకూ ఊత పదం. దీన్నే ఆంగ్లంలో “ఆల్ ఆప్షన్స్ ఆర్ ఆన్ టేబుల్” అని అంటుంటారు. అమెరికా అధ్యక్షుడు ఒబామా దగ్గర్నుండి, యూరప్ పాలకుల మీదుగా, ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహూ, ఇండియా ప్రధాని మన్మోహన్ ల వరకూ దీన్ని పదే పదే వాడుతుంటారు. దానర్ధం నిజంగా అన్ని అవకాశాలను పరిశీలిస్తున్నట్లు కాదని అనేక సార్లు రుజువయ్యింది. యూరప్ రుణ సంక్షోభం, ఇరాన్ అణు ప్రమాదం, సిరియా కిరాయి తిరుగుబాటు, తెలంగాణ సమస్య ఇలా అనేక సమస్యలకి పాలకులు వల్లించే ఊదపదం “ఆల్ ఆప్షన్ ఆర్ ఆన్ టేబుల్.”
‘నా వద్ద అణు బాంబూ లేదూ, దాన్ని తయారు చేసే ఉద్దేశ్యమూ లేదు’ అని ఇరాన్ సవాలక్ష సార్లు చెప్పి ఉంటుంది. ఐనా ఇరాన్ నుండి అణు ప్రమాదం ఎదుర్కోవడానికి ‘అన్ని అవకాశాలనూ పరిశీలిస్తున్నాం’ అని అమెరికా, యూరప్, ఇజ్రాయెల్ లు చెబుతుంటాయి. నిజానికి వారి దృష్టిలో ఉండేది ఒకే ఒక ఆప్షన్. అణుబాంబు పేరుతో ఇరాన్ పైన ఒత్తిడి తెచ్చి దాని వనరులపైన అమెరికా, యూరప్ కంపెనీలకు ఆధిపత్యం పొందడం. అందుకు ఒప్పుకోని ఇరాన్ పాలకుల్ని బ్లాక్ మెయిల్ చేసి, బెదిరించి, చివరికి బాంబులేసి సాధించడమే వారి వద్ద ఉన్న అప్షన్.
తెలంగాణ తీసుకున్నా, రైలు ఛార్జీలు పెంచడం తీసుకున్నా, రిటైల్ షాపుల్ని విదేశీ కంపెనీలకు అప్పజెప్పడం తీసుకున్నా ప్రధాని, ఇతర ప్రభుత్వ పెద్దలకు ఉండేది ఒకే ఆప్షన్. స్వదేశీ, విదేశీ ధనికులు కంపెనీలకి దేశ వనరులన్నీ దోచి పెట్టడమే వారి ఆప్షన్. ఆ ఆప్షన్ దిశగా వేసే ఎత్తులన్నీ ‘ఆల్ ఆప్షన్స్’ గా వారు చెబుతుంటారు.
గ్రీసు విషయం తీసుకుంటే దానికి అప్పులు తడిసిమోపెడయ్యాయి. ఫలితంగా రుణ సంక్షోభం తలెత్తింది. అంటే అప్పులిస్తే తీరుస్తుందో లేదోనని గ్రీసుకు అప్పులివ్వడం అంతా మానేశారు. మరి అప్పటికే ఇచ్చిన అప్పులెలా తీర్చాలి? అప్పులు తీర్చాలన్నా, అవసరాలు తీర్చుకోవాలన్నా ప్రభుత్వాలు కొత్త అప్పులపై ఆధారపడతాయి. (పన్నులు తదితర ఆదాయాలు అవసరమైన సమయానికి అవసరమైనంత వసూలు కావుగనక, అప్పులు తెస్తూ, తీరుస్తూ, వడ్డీలు చెల్లిస్తూ గడుపుతుంటాయి) కొత్త అప్పులివ్వడానికి ఎవరూ ముందుకు రాకపోతే దాన్ని రుణ సంక్షోభం అంటారు. ‘అప్పులు పుట్టడం లేదు’ అంటారు గదా, అదే ఇది.
అయితే గ్రీసుకి అప్పులు ఇచ్చినవారిలో యూరప్, అమెరికా తదితర దేశాల బడా కంపెనీలు, బ్యాంకులూ ఉన్నాయి. గ్రీసుకు అప్పులు పుట్టకపోతే తమ కంపెనీల, బ్యాంకుల వడ్డీ ఆదాయాలు, చెల్లింపులు పడిపోతాయి. రొటేషన్ ఆగిపోతుంది. ఫలితంగా మొత్తం ద్రవ్య వ్యవస్ధ స్తంభించిపోతుంది. ‘గ్లోబలైజేషన్’ పేరుతో ప్రపంచం అంతా అల్లుకుపోయిన బడా అంతర్జాతీయ, బహుళజాతి కంపెనీల వల్ల ఏర్పడిన దుష్పరిణామం అది. (కంపెనీలు, బ్యాంకుల మధ్య ఏర్పడిన సంక్షోభాన్ని ప్రభుత్వాలు ప్రజల నెత్తిన రుద్దుతాయి. అది ప్రజలందరి సంక్షోభంగా ప్రచారం చేసి ప్రజలు కష్టాలు తప్పవనీ, త్యాగాలు చేయాలనీ బోధలు చేసి కోతలు, కత్తిరింపులు, రద్దులు అమలు చేశ్తాయి. కాని అవేవీ సంక్షోభాలకు కారణమైన కంపెనీలకు మాత్రం అమలు చేయరు.)
అప్పులు పుట్టని గ్రీసుకి తామే అప్పులిచ్చి తమ కంపెనీలు, బ్యాంకులకు రావలసిన వడ్డీలు, ఇతర ఆదాయాలు నిరాఘాటంగా కొనసాగేలా చూడడమే యూరప్ దేశాలు గ్రీసుకు ఇచ్చే ఒకే ఒక ఆప్షన్. అదేదో గ్రీసుని ఆదుకోవడానికి తాము అనేక తంటాలు పడుతున్నట్లుగా తెగ ఫోజులు పెడతాయి. అదేవిధంగా పత్రికలు కూడా ప్రచారం చేసి ప్రజలని మోసం చేశ్తాయి. వీళ్ల అప్పు రాజకీయాలని జనం కూడా చాలామంది నమ్మేస్తారు. పొదుపు విధానాల (కోతలు, కత్తిరింపులు, రద్దులు) పేరుతో ప్రజలపై రుద్దు తున్న విధానాలు బడా కంపెనీల లాభాల్ని మరింత పెంచుతాయి. సులభ వడ్డీకి అప్పులిస్తున్నట్లు ‘బెయిలౌట్’ పేరుతో ప్యాకేజీలు ప్రకటించి వడ్డీ ఆదాయాలు ఆగిపోకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నాయి. ప్రజలకు ఇచ్చే బోనస్ లూ, వేతనాలూ, సౌకర్యాలూ, పెన్షన్లూ అన్నింటినీ వడ్డీల రూపంలో బడా కంపెనీలకు, బ్యాంకులకు దోచి పెడతున్నాయి.