2011 జనాభా లెక్కలు: 63% ఫోన్లున్నా, 53% టాయిలెట్లు లేవు


2011 census2011 జనాభా లెక్కల వివరాలు దశలవారీగా వెల్లడవుతున్నాయి. దేశంలో మొత్తం 24.67 కోట్ల కుటుంబాలు ఉండగా, ఇందులో 16.78 కోట్ల కుటుంబాలు గ్రామాల్లోనూ, 7.88 కోట్ల కుటుంబాలు పట్టణాల్లో నివసిస్తున్నారని ఈ లెక్కల్లో వెల్లయింది. ఆమ్టే 68.03 శాతం మంది గ్రామాల్లో నివశిస్తుంటే, 31.97 శాతం మంది పట్నాల్లో నివసిస్తున్నారన్నమాట. భారత దేశానికి ఇంకా పల్లెలే పట్టుగొమ్మలుగా ఉన్నాయని ఈ లెక్కలు సూచిస్తున్నాయి.

భారత దేశంలో అత్యధికులకి కనీస సౌకర్యాలు ఇంకా అందుబాటులో లేవని కూడా ఈ లెక్కలు సూచిస్తున్నాయి. ఒకే ఒక గదిలో నివశిస్తున్న కుటుంబాలు గ్రామాల్లో 39.4 శాతం ఉంటే, పట్నాల్లో 32.1 శాతం, మొత్తం మీద 37 శాతం ఉన్నారు. ఆంధ్ర ప్రదేశ్ లో గత పాతిక సంవత్సరాల్లో కోటి ఇళ్ళు నిర్మించామని ప్రభుత్వాలు లెక్కలు చూపుతున్నట్లుగా ఆంధ్ర జ్యోతి దిన పత్రిక  చెప్పడాన్ని బట్టి పేదలకు ఇళ్ల పేరుతో పెత్తందారులే పేదలకు అండాల్సిన సౌకర్యాలు ధనవంతులే నోక్కేస్తున్నారని అర్ధం అవుతోంది.

మంచి నీటి సౌకర్యాలు రక్షిత మంచి నీటి పధకం ద్వారా అందించే సౌకర్యాలు గ్రామాల్లో కేవలం 18 శాతం మందికే అందుబాటులో ఉండడం చాలా దారుణం. మారుమూల గ్రామాలకు మధ్యం అమ్మే బెల్టు షాపులు అందుబాటులో ఉంచుతున్న ప్రభుత్వాలు ఆ శ్రద్ధ నీటి సౌకర్యం కల్పించడంలో చూపడం లేదని అనేక సంవత్సరాలుగా పత్రికలు, విశ్లేషకులు, చివరికి రాజకీయ పార్టీలు కూడా చెబుతూనే వస్తున్నారు. ఆ పరిస్ధితి ఇంకా అలానే ఉందని గణాంకాలు నిర్ద్వంద్వంగా నిరూపిస్తున్నాయి.

ప్రజారోగ్యంలో టాయిలెట్లు ముఖ్య పాత్ర పోషిస్తున్నాయని విశ్లేషకులు చాలా కాలంగా చెబుతున్నారు. అందుకే టాయిలెట్లు కట్టుకోవడానికి ప్రభుత్వాలు నిధులు ఇస్తున్నట్లు ఎప్పుడూ చెప్పుకుంటాయి. తీరా చూస్తే గ్రామాల్లో 30.7 శాతం మందికే టాయిలెట్లు ఉంటే పట్నాల్లో 81.4 శాతం మందికి ఉన్నాయి. అంటే పట్నాల్లో కూడా దాదాపు 20 శాతం మందికి టాయిలెట్లు లేవన్నమాట. ఇక సెల్ ఫోన్ల విషయానికి వస్తే అదొక నిత్యావసర వస్తువుగా మార్చడంలో సెల్ ఫోన్ కంపెనీలు పెద్ద ఎత్తున విజయవంతం అయ్యాయి. పట్నాల్లో సెల్ ఫోన్ లేకుండా ఈ వ్యక్తినైనా చూడడం చాలా కష్టం. గ్రామాల్లో సెల్ ఫోన్ లేనివారు ఉన్నా, వారి సంఖ్య వేగంగా తగ్గిపోతోంది.

స్పెక్ట్రమ్ ని అత్యంత తక్కువ ధరలకి కంపెనీలకి ఇవ్వడం వల్లనే ప్రజలు తక్కువ ధరలకే సెల్ ఫోన్ లు వాడగలుగుతున్నారని జైలులో ఉన్న మాజీ టెలికాం మంత్రి ఏ.రాజా కోర్టులో చెప్పాడు. అంటే ప్రభుత్వాలు తలుచుకుంటే వివిధ సరుకులను ప్రజలకు అందుబాటులోకి తేగలరని అర్ధం చేసుకోవచ్చు. సెల్ ఫోన్లు అందుబాటులోకి తేగలిగినవారు టాయిలెట్లు, నీరు, ఇంధనం లాంటి నిత్యావసరాలను ఎందుకు అందుబాటులోకి తేలేకపోయారు? కంపెనీలయితే తక్కువ ధరలకు స్పెక్ట్రం ని కొనుక్కుని మంత్రులనూ, ఎం.పిలనూ, బ్యూరోక్రాట్ అధికారులనూ కూడా తగిన విధంగా సంతృప్తి పరచగలరు గనుక సెల్ ఫోన్లు అందుబాటులోకి వస్తాయి. అదే ప్రజలయితే ప్రభుత్వం నుండి ఎదురు చూసే వారే తప్ప పాలకులకూ, అధికారులకూ కావలసింది ఇవ్వలేకపోవడమే దానికి కారణమా? ఓటు వేసి తమను గెలిపించింది ప్రజలకు సేవ చేయడానికేనని రాజకీయ నాయకులకి అసలు గుర్తుందా?

46.9 శాతం మంది సొంత టాయిలెట్లు వాడుకుంటే, 3.2 శాతం మంది పబ్లిక్ టాయిలెట్లు వాడుతున్నారట. ఈ పబ్లిక్ టాయిలెట్లు ఎక్కడుంటాయి? ఇవెన్నడూ ఎవరికీ కనపడవెందుకని? రైల్వేస్టేషన్లూ, బస్టాండ్లూ లాంటి పబ్లిక్ స్ధాలాల్లో ఉండే టాయిలెట్లని కుటుంబాలకు అందుబాటులో ఉండే పబ్లిక్ టాయిలెట్ల కింద జమ కట్టారా ఏం ఖర్మ?

ఇతర వివరాలకు పోతే దేశంలో సగం కుటుంబాలు ఇంకా కట్టెల పొయ్యిలే వాడుతున్నారు. రిలయన్స్ లాంటి కంపెనీలు ప్రజల వనరులైన గ్యాస్, చమురుల్ని తవ్వుకుని ప్రవేటు కంపెనీలకు అమ్ముకుంటుంటే ప్రజలకి ఈ దుర్గతి కాక మహర్ధశ ఎందుకు పడుతుంది? రిలయన్స్ కంపెనీ కనీసం ప్రభుత్వ విద్యుత్ కంపెనీలకి కూడా గ్యాస్ అమ్మ కుండా ప్రవేట్ విద్యుత్ కంపెనీలకు అమ్ముకుంటోదని పత్రికలు ఘోషిస్తున్నా ప్రభుత్వాలు చర్యలు తీసుకున్న దాఖలాలు లేవు. బ్యాంకులు ఇంకా 41 శాతం మందికి దూరంగానే ఉన్నాయి. వీరు నిస్సందేహంగా పేద వర్గాలే. చేతుల్లో డబ్బే లేనప్పుడు బ్యాంకుల అవసరం వీరికెందుకు వస్తుంది? 59 శాతం కుటుంబాలకు బ్యాంకు ఖాతాలు ఉన్నట్లు కనిపిస్తున్నా వీరిలో కూడా పేద వర్గాలు ఉన్నారు. వీరు ప్రభుత్వాలు ఇచ్చే పెంషన్ల కోసమో, నగదు బదిలీ పధకం కోసమో, ఇన్స్సూరెన్సు కంపెనీలు వంద రూపాయాలకు కూడా చెక్కుల్ని మార్చుకోవడం కోసమో  బ్యాంకు ఖాతాలు అనివార్యంగా తెరుస్తుంటారు.

65 యేళ్ళ సో కాల్డ్ స్వంతత్ర భారతంలో కోటి కోట్ల రూపాయల సొమ్ము స్విస్ బ్యాంకుల్లో ములుగుతుంటే, జనానికి దక్కిన సౌకర్యాలు మాత్రం పాతాళం స్ధాయిలో ఉన్నాయి. 

3 thoughts on “2011 జనాభా లెక్కలు: 63% ఫోన్లున్నా, 53% టాయిలెట్లు లేవు

 1. జనాభా బాగా తక్కువగా ఉన్నరోజుల్లో, ముఖ్యంగా గ్రామాల్లో ఇంత అభద్రత లేనికాలంలో టాయిలెట్లు లేకపోయినా పెద్దగా బాధ లేకపోయింది. కానీ ఇప్పుడు ఇంత జనాభా పెరిగాక టాయిలెట్లు కట్టడం మంచిది. అయితే కేవలం అవి లేకపోవడాన్ని వెనకబాటుగా చూడనక్కఱలేదు. ఆధునిక విజ్ఞానపు వెలుగులో మనం కొంత మానసిక చీకటికి కూడా లోనవుతాం. పేదఱికంగా భావించబడే చాలా విషయాలు ఆయా ప్రాంతాల/ దేశాల/ రాష్ట్రాల సంస్కృతికి సంబంధించినవి. వారి స్థానికంగా లభ్యమయ్యే వనరులకీ, తరతరాల సాంప్ర్తదాయిక టెక్నాలజీలకీ, మీదుమిక్కిలి వారి అవసరాలకీ సంబంధించినవి. అలాగే అవి వారివారి గ్రూప్ ప్రిఫరెన్సులకి సంబంధించినవి. వాటిని సంస్కృతిగానే చూడాలి. పేదఱికంగా కాదు. కానీ మనకి తెలిసిన Human Development Indices, ఇంకా పేదఱికపు నిర్వచనాలూ గట్రా అన్నీ న్యూయార్కులాంటి పాశ్చాత్య పెట్టుబడిదారీ నగరాల్లో తెల్ల ఆర్థికశాస్త్రవేత్తలు ఏ.సి. గదుల్లో కూర్చుని రూపొందించినవి కావడం చేత – వాళ్ళకి ఈ విషయాల గురించిన అవగాహన శూన్యం. వాళ్ళకి తమ తెల్లదేశాల గోల తప్ప ఇంకేమీ తెలీదు. పైపెచ్చు ఇతరజాతులంటే చిన్నచూపు కూడా ! వాళ్ళ లెక్కలు వాళ్ళ మానసికలోకాన్ని ప్రతిబింబిస్తాయి. వాటిని మనం గ్రుడ్డిగా అనుసరించే పనిలేదు. లోకం ఈ లెక్కల కంటే వైవిధ్యభరితమైనది. నా మట్టుకు నాకు ఆరుబయట టాయిలెట్ కెళితే హాయిగా ఉంటుంది.అది నా పర్సనల్ ప్రిఫరెన్సు. దాన్నొక వెనకబాటుగా నేను భావించను. అలాగే అందునిమిత్తం ఎవఱైనా ఒక ప్రత్యేకమైన గదిని కట్టుకుంటామంటే అదీ వాళ్ళ పర్సనల్ ప్రిఫరెన్సు. కాదనడానికి లేదు.

  If you closely analyze these stats, they have a bright, heartening side as well. ఈ గణాంకాలు పూర్తిగా నిరాశాజనకం కావు. ఎందుకంటే ఇండియా మరీ పేదదేశమేమీ కాదనీ, ఇక్కడ చదువుకున్న, చదువుకోగలిగిన, మరియూ సొంతిళ్ళూ, వాహనాలూ కలిగిఉన్న మధ్యతరగతి జనాభా సుమారు 35 శాతం దాకా ఉందని తెలియజేస్తున్నాయి ఇవి. చాలా సంతోషించదగ్గ విషయమిది. రాబోయే రెండు దశాబ్దాలు కాస్త కష్టపడితే ఈ వర్గపు సంఖ్యని 50 శాతానికి, ఇంకా అంతకంటే ఎక్కువకి పెంచడానికి అవకాశముంది. I am upbeat. I am optimistic.

 2. సర్ఫిజెన్ గారూ మీ ఆశావాదానికి అభినందనలు. అది లేకుంటె అనేక అంశాల్లో మనుగడ కష్టమే.

  టాయిలెట్ గురించి మీరు చెప్పిన అంశాలతో నాకు విభేదం ఉంది. అది సంస్కృతికి సంబంధించినది కాదు. శుబ్రతకు సంభంధించినది. టాయిలెట్ సౌకర్యం తెల్లవాడు కనిపెట్టినా అది మానవ జీవితంలో ఒక అవసరాన్ని పరిశుభ్రంగా తీర్చుకోనేందుకు దోహదపడింది.అందువల్లనే అది ప్రపంచమంతటా అనుసరిస్తున్నరు. అయితే టాయిలెట్ కట్టుకోవడం అంటే డబ్బుతో కూడుకున్నది. టాయిలెట్ అన్నది ఇంటికి అదనంగా ఉండే సౌకర్యం. అసలు ఇల్లే లేనపుడు టాయిలెట్ సౌకర్యం ఉండే సమస్య ఉండదు.అందుకే టాయిలెట్ కీ పేదరికానికి సంబంధం ఉందని భావించడం. టాయిలెట్ సౌకర్యం సౌకర్యవంతమైన జీవనానికి ఒక గుర్తుగా ఐక్యరాజ్య సమితి గుర్తించింది. బహిరంగ స్ధలాలను ఉపయోగించడం క్రమంగా, ఎప్పటికైనా, మానుకోవలసిందే తప్ప సంస్కృతిగా కాపాడుకునేది కాదు.

  పేదరికానికీ,సంస్కృతికీ ముడిపెట్టడం ఏమిటో నాకు అర్ధం కాలేదు. తమ సంస్కృతిని కాపాడుకోవడానికి ఆయా జాతుల ప్రజలు ప్రయత్నిస్తారు. అది సహజం. పేదరికానికి సంబంధించిన అంశాలను సంస్కృతిగా భావించడం అంటే పేదరికాన్ని కాపడడానికి ప్రయత్నించాలని పరోక్షంగా చెబుతున్నారు. అది కరెక్టు కాదు కదా? పేదరికం వల్ల అనేక సామెతలు, అలవాట్లు పుడుతుంటాయి. ఉదాహరణకి అన్నానికి చీమలు పట్టినపుడు చీమలు తింటే బలం వస్తుందని పల్లేల్లో పేదల ఇళ్లలో చెబుతుంటారు. చీమలు పట్టిన అన్నంలో కొంతభాగాన్నైనా పారవేసే లగ్జరీ పేదలకు లేకపోవడం వల్ల అటువంటి సూత్రం పుట్టింది. అలా పుట్టిన సూత్రాన్ని సంస్కృతిగా కాపాడుకోగలమా? ఆ సూత్రంలో శాస్త్రబద్ధత ఉంటే ఖచ్చితంగా కాపాడుకోవలసిందే.

  మానవ వనరుల అభివృద్ధి సూచికలు మీరన్నట్లు కొన్ని దేశాలను ఉద్దేశించి రూపొందించినవే అయితే తప్పనిసరిగా తిరస్కరించాలి. ఏ దేశానికైనా ప్రతి ఒక్కరూ సమాన అవకాశాలతో అభివృద్ధి చెంది ఏ సమస్య లేకుండా జీవనం గడపడమే అంతిమ లక్ష్యంగా ఉండాలి. ప్రకృతి, మానవ వనరులను, ఉత్పత్తి సాధనాలనూ, బలవంతంగానో, వివిధ ఎత్తుగడల ద్వారానో తమ చేతుల్లో పెట్టుకున్న కొన్ని వర్గాలు మాత్రమే సంపదలను, సౌకర్యాలను స్వాయత్తం చేసుకుంటున్నందున మెజారిటీ ప్రజలు శుభ్రమైన జీవనానికి కూడా నోచుకోలేకుండా ఉన్నారు. ఇక్కడే ప్రభుత్వాలు లేదా రాజ్యాల పాత్ర వస్తుంది.

  ఆరోగ్యంగా జీవించడానికీ, శుభ్రంగా జీవించడానికీ అవినావాభావ సంబంధం లేదా. శుభ్రమైన బట్టలు కట్టుకోవడం, శుభ్రమైన తిండి తినడం, ఇంటి పరిసరాలు శుభ్రంగా ఉంచుకోవడం, ఇంట్లోకి పరిశుభ్రమైన గాలి వెలుతురు నీరు వచ్చేలా ఏర్పాట్లు చేసుకోవడం ఇవన్నీ ఆరోగ్యవంతమైన జీవనాన్ని ఏర్పాటు చేస్తాయి. కాని ఈ అన్ని అంశాలూ ఆర్ధికంగా బాగుంటేనే సమకూరుతాయి. పేదలు పట్నాల్లో గానీ, పల్లెల్లో గానీ శుభ్రమైన బట్టలు కట్టుగోగలరా? అన్నివైపులా వెలుతురూ, గాలీ వచ్చేట్లుగా, శుభ్రమైన నీటి సౌకర్యం ఉండేట్లుగా ఇళ్లు నిర్మించుకోగలరా? అసలు ఇళ్ళు కట్టుకోనే పరిస్ధితులే వారికి లేనప్పుడు పరిశుభ్రమైన, ఆరోగ్యకరమైన జీవనానికి అనుగుణమైన ఇళ్లు కట్టుకునే అవకాశం వారికి ఎక్కడనుండి వస్తుంది? సమస్త అవసరాలు డబ్బుతోనే ముడి పడి ఉన్నపుడు, డబ్బు లేకుండా ఏ ఎవసరమూ తీరనపుడూ, చివరికి శుభ్రమైన నీరు తాగాలన్నా పదిహేను రూపాయలు పెట్టి బాటిల్ కొనుక్కోవలసినపరిస్ధితులు ఉన్నపుడు పేదలు ఆరోగ్యవంతంగా, సౌకర్యవంతంగా జీవించగలరా? ఇవన్నీ ఆర్ధిక సంబంధమైన విషయాలు కనుక పేదలు వాటిని సమకూర్చుకోలేరు. అదీ కాక పేదరికం అన్నది సహజం కాదు. సమాజాలపైన పెత్తందారీ వర్గాలు రుద్దిన లక్షణమే పేదరికం. పెత్తందారి వర్గాల నుండి ప్రజలను కాపాడి, వారందరికీ సౌకర్యాలు అందజేయడానికి ప్రభుత్వాలు కృషి చేయాలి. ప్రభుత్వాలు ఉన్నది అందుకే. అవి ఆ పాత్రను వదిలేశాయన్నది వేరే సంగతి.

  ఇండియా నిజానికి పేద దేశం కాదు. చాలా ధనికవంతమైన దేశం. రవి అస్తమించని బ్రిటిష్ సామ్రాజ్యాన్ని రెండొందల ఏళ్లు పోషించిన దేశం ఇది. అది పేద దేశం ఎందుకవుతుంది? కాకుంటే భారత ప్రజలే పేదలు. భారత దేశ వనరులపైన విదేశీ కంపెనీలు, భారత దేశ భూస్వామ్య, పెట్టుబడిదారీ పాలకవర్గాలు పెత్తనం చేస్తున్నాయి. ప్రభుత్వాలు వారికి వత్తాసుగా ఉన్నాయి. అందువల్ల భారత ప్రజలు అధికులు పేదలుగా ఉన్నారు. ఇక్కడి సంపదలు, వనరులు అనుభవించే అవకాశం ప్రజలందరికీ సమానంగా ఉన్నట్లయితే పేదరికం ఉండే సమస్యే లేదు.

 3. పేదఱికానికీ, దోపిడీకి సంబంధం ఉందనేంత వఱకు మీతో ఏకీభవిస్తాను. కానీ పేదఱికాన్ని నిర్వచించడం చాలా కష్టం అని నా అభిప్రాయం. మనుషుల టెక్నాలజీ పెఱిగినకొద్దీ పాత టెక్నాలజీలో బ్రతకడమే పేదఱికంగా భావించబడుతున్నదని నా పరిశీలన. కొత్త టెక్నాలజీలని అడాప్టు చేసుకోనివాళ్ళనీ, ఆ స్తోమత లేనివాళ్ళని పేదవాళ్ళంటున్నారు.

  The Hindu పత్రిక పరిగణనలోకి తీసుకున్న కొలమానాలన్నీ అలాంటివేనని గమనించగోరుతున్నాను. ఆ జాబితాని మళ్ళీ ఒకసారి పరిశీలించండి. అందులో LPG గ్యాసూ, TVలూ, కార్లూ, ఇతరవాహనాలూ, కంప్యూటర్లూ మొదలైనవి లెక్కలోకి తీసుకోబడ్డాయి. సింగిల్ రూమ్ లో బ్రతికేవాళ్ళని కూడా పేదవాళ్ళన్నారు. కానీ ఎంత పరిమాణం గల గదిలో బ్రతికితే పేదఱికమవుతుందో పేర్కోలేదు. LPG గ్యాస్ విషయానికొస్తే పెద్దభూస్వామి అయిన మా నాన్నగారింట్లో 1970 దాకా కట్టెలపొయ్యివంటే ఉండేది. అంటే ఆయన పేదవాడా ? TVలు 1982 లో వచ్చాయి. అంతకుముందు మా యింట్లో రేడియో మాత్రమే ఉండేది. అంటే మేము 1982 దాకా కటిక పేదజీవితాన్ని గడిపినట్లా ? నేను హైదరాబాదొచ్చిన చాలా సంవత్సరాల వరకూ కూడా కిరాయికొంపల్లోనే ఉన్నాను, మా వూళ్ళో నాకు పూర్వీకుల ఇల్లు ఉన్నప్పటికీ ! జనాభాలెక్కల కోసం వచ్చే ఎన్యూమరేటర్లు నా దగ్గరికొస్తే నన్ను homeless అనే రాసుకునేవారు. అంటే నేను పేదవాణ్ణా ? కంప్యూటర్లు గత 25 ఏళ్ళుగా వచ్చాయి. వాటిని కొనగలవాళ్ళు కూడా కొనకుండా ఆఫీస్ పి.సి.లని వాడుకుంటున్నారు. అంటే వాళ్ళంతా పేదవాళ్ళా ?

  భారతదేశంలో ఎంత పేదఱికం ఉందో వర్ణించి జనాల్ని బెంబేలెత్తించడానికి తెల్ల ఆర్థికశాస్త్రవేత్తలు “భారతీయుల సగటు తలసరి ఆదాయం 2 లేదా 3 డాలర్లు” అని చెబుతూంటారు. డాలర్ కున్న అంతర్జాతీయ విలువనీ, రూపాయికున్న అంతర్జాతీయవిలువతో పోల్చి చూస్తే మనకేమీ అర్థం కాదు. ఎంత చెడ్డా రూపాయికి ఇండియాలో కొంత కొనుగోలుశక్తి (purchasing power) ఉందనే సత్యాన్ని గ్రహించేదాకా ! ఉంది కాబట్టే డాలర్లతో US లో చేయలేని పనుల్ని NRI లు వాటిని ఇండియాలో రూపాయలుగా మార్చి చేయగలుగుతున్నారు. ఒక పక్క ఇలా చేస్తూనే మరోపక్క రూపాయికి విలువ లేదని తప్పుడు కూతలు కూస్తారు. కరెన్సీలకి అంతర్జాతీయ విలువ మాత్రమే కాక అంతర్దేశీయవిలువ (inland value) కూడా ఒకటుంటుందనే సత్యాన్ని మరుగున పడేస్తున్నారు. US లో రెండుడాలర్లతో ఒక మనిషి యొక్క దైనందిన అవసరాలు తీరవు. కాబట్టి వాళ్ళలో పై విశ్లేషణల్లాంటివి భయాందోళనల్నీ, జాలినీ రేకెత్తిస్తాయి. కానీ ఇండియాలో 108 రూపాయలతో మనిషి ఒకరోజు survive కాగలడు. ఈ రెండుడాలర్లు తలసరి ఆదాయం మాత్రమే కనుకా, కుటుంబ ఆదాయం కాదు గనుకా, ప్రతి భారతీయ కుటుంబంలోనూ అయిదారుగురు సభ్యులుంటారు గనుకా భారతీయకుటుంబాల వాస్తవ ఆదాయం రోజుకు $ 10, నెలకు $ 300. అంటే రోజుకు రూ. 540, నెలకి రూ. 16,200. రూపాయికున్న స్థానిక, అంతర్దేశీయ కొనుగోలుశక్తిని మరియు ఇప్పటి ధరవరలని బట్టి చూసినప్పుడు ఈ మాత్రం ఆదాయంతో ఒక భారతీయ కుటుంబం బ్రతకజాలదా ? అని ప్రశ్నించాల్సి వస్తోంది. ఇంత ఆదాయం ఉన్న సగటు భారతీయుల్ని పేదవాళ్ళనవచ్చునా ?

  తప్పుడు విశ్లేషణల సహాయంతో ఇండియా ఒక పేదదేశమని ప్రచారం చేస్తున్నారు. అది మనవాళ్ళు కూడా గుడ్డిగా విశ్వసిస్తున్నారు.

  కాబట్టి ఈ దేశంలో పేదఱికం అనేది వాస్తవంగా చెప్పాలంటే ఆ జాబితాలో చిట్టచివరి 17 శాతం చిల్లరకి సంబంధించినది. మిగతావాళ్ళంతా బానే ఉన్నారు లక్షాధికారులు కాలేకపోయినా ! చూడదల్చుకుంటే ఈ దేశస్థుల సంపదంతా వాళ్ళ పెళ్ళిళ్ళ సమయంలో బయటపడుతుంది.

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

గూగుల్ చిత్రం

You are commenting using your Google account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

Connecting to %s